Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

ముక్తిసాధన మార్గాలు

ప్రపంచములో మంచివారు చెడ్డవారు అని, జనులు రెండువిధాలుగా ఉంటారు. మంచి సంస్కారము కలవారు మంచిపనులు చేస్తారు, ఎవరైనను చెడుపనిచేస్తే, మంచి సంస్కారము ఉన్న వారు యీపనిచేస్తారా? అని లోకులు అంటారు. దొంగతనము వగైరా పనులు చేయుట చెడు సంస్కారముల వలన ఏర్పడును. అట్లే తవ దానధర్మాలు చేయుట, సత్యము పలుకుట, మంచి సంస్కారము వలన ఏర్పడును. మంచిసంస్కారము కలవానిని సంస్కృతుడు అంటారు. భాషలలో సంస్కృతభాష ఒకటి. సంస్కృత శబ్దమునకు అర్థము చక్కగా అలంకార యుక్తముగా తయారు చేయబడినది, అని అర్థము. అట్టి భాష సంస్కృతమే. అది భాషలలో కెల్ల గొప్పది. ఇతరభాషలలో నిఘంటువులు శ్లోకరూపముగా ఉండవు. సంస్కృతములో నిఘంటువు శ్లోకరూపముగా ఉండును. శ్లోకరూపములో నుండుటవలన కంఠస్థము చేసికొనుట సులభము, చిన్న అమరకోశము అను పుస్తకము కంఠస్థము చేసికొనిన సంస్కృతభాష అంతయు వశము కాగలదు. అట్టివాడు ఏ అరణ్యములో వున్నను యీపదమునకు అర్థము తెలియదు అని అనుకొన వలసిన పనియుండదు. ఇట్టి సౌలభ్యము ఏ భాషకు లేదు.

సంస్కృత భాషలోనే ఆస్తిక దర్శనములు, నాస్తిక దర్శనములు కూడా, సంపూర్ణముగా ప్రతిపాదింపబడియున్నవి. అట్లే నాట్యశాస్త్రము వగైరాలన్నీ ఆధ్యాత్మిక; అది భౌతిక శాస్త్రములు ఆ భాషలో కలవు. ఇతర భాషలో ఆ శాస్త్రములు, అనువదింపబడి యున్నను, దానివలన ఆ శాస్త్రముల యొక్క స్వరూపము సంపూర్ణముగా తెలియబడదు.

మహాభారతములో ఒక కథ ఉన్నది. ఒక బ్రాహ్మణ పిల్లవాడు తపస్సువల్ల సమస్తఫలములను పొందవచ్చునని విని, ఒక అరణ్యములో కూర్చొని గొప్ప తపస్సుచేసెను. ఒకనాడు చెట్టుపైన ఉన్న ఒక కొంగ రెట్టవేయగా అతనిమీద పడినది. అంత యతడు ఇదేమి? యని కోపముతో పైకి చూడగా ఆ కొంగ దగ్థమై క్రిందపడిపోయినది. అతడు దానిని చూచి తనకు తపస్సిద్ధి కలిగినదని గర్వపడినాడు. మధ్యాహ్న కాలమునకు భిక్షకై ఒక గృహము ముందుకు వెళ్ళి భిక్షపెట్టమని అన్నాడు. ఆ ఇల్లాలు పతి శుశ్రూషాతత్పరయై ఆలస్యముగా భిక్ష పెట్టుటకై వెలుపలకు వచ్చింది. ఈ ఆలస్యమును సహించక అతడు ఆమె వంక కోపముతో చూడనారంభించినాడు. ఆమె నాయనా? కొంగ అనుకున్నావా? అట్లు చూచుచున్నావు, అని అన్నది. అతడు అరణ్యంలో ఏకాంతంగా జరిగిన ఆ వృత్తాంతాన్ని గుర్తించి మాట్లాడిన ఆమె ప్రజ్ఞకు ఆశ్చర్యపడి గర్వము తొలగి, అమ్మా! నాకు హితోపదేశము చేయమని కోరినాడు. ఆ ఇల్లాలు నాకు భర్త శుశ్రూషా కార్యక్రమము చాలాకలదు. నీతో మాట్లాడుటకు నాకు అవకాశములేదు. నీవు ఈ గ్రామములో నున్న వ్యాధుని యొద్దకు వెళ్ళుము. అతడు నీకు హితము నుపదేశింపగలడు, అని చెప్పెను. ఆ బ్రాహ్మణుడు వ్యాధుని వద్దకు వెళ్ళగా ఆతడు మాంసము అమ్మువాడని తెలిసినది. ఆయినను హితకాంక్షయగు నతడు నమ్రభావముతో హితోపదేశము చేయుమని వ్యాధుని కోరెను. అతడు ఆ పతివ్రత పంపగా వచ్చితివా ఏమి? యని పలికి తరువాత నీ కుపదేశింతును అని పలికి త్వరగా లోనికి వెళ్ళెను. బ్రాహ్మణుడు ఈ వృత్తాంతము యీతనికి ఎట్లు తెలిసెను? ఇట్టి సిద్ధి వీరికి ఎట్లు కలిగెను. అని ఆశ్చర్యపోవుచు నిలబడి యుండెను. కొంతసేపటికి వ్యాధుడు వచ్చి చెప్పెను.

ఓ బ్రాహ్మణుడా ! నీవు ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఆమెకు స్త్రీలకు విహితమైన పతి శుశ్రూష వలనను, నాకు మాతా పితృ శుశ్రూషవలనను, యిట్టి సిద్ధులు కలిగినవి. నీవు నీతల్లి దండ్రులను విడనాడుట యుక్తముకాదు, పుత్రులకు అది ముఖ్యధర్మము. నీవును అట్లు చేయుము. అని ఉపదేశించెను. అంత బ్రాహ్మణుడు తిరిగి యింటికి వెళ్ళి మాతా పితరుల శుశ్రూష చేసి ఉత్తమ సిద్ధిని పొందెను.

ఇట్లే ''కవిస్సాధుః కవిస్సధుః కవిస్సాధుః ''అని విష్ణుపురాణములో చెప్పబడియున్నది. అందులో మొదటి వాక్యము దైవభక్తి, ముక్తి హేతువనియు, రెండవవాక్యము మాతా, పితృసేవయే ముక్తిసాధన మనియు, మూడవ వాక్యము వేదబ్రాహ్మణ శుశౄషయే ముక్తి సాధన మనియు బోధించుచున్నది -

భగవద్గీతలో ''తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తేకార్య కార్య వ్యవస్థితౌ,'' అని యున్నది. అనగా మనకు తోచినట్లు చేయుటగాక శాస్త్రములో ఎట్లు చెప్పబడియున్నదో అట్లు చేయవలయును. అదియే ధర్మమగును. ఆ ధర్మము మానవులకు మంచి సంస్కారమును గలుగజేయును. భగవత్సాక్షాత్కారమును గూడ కలుగ జేయగలదు: కాన మానవులెల్లరు సంస్కృత భాషా ధ్యయనమున. వేదశాస్త్రాధ్యయనమును చేసి తదుక్తధర్మముల నాచరించి తరించవలయును-

8-21


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page