Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

శివలింగా విర్భావం

'శివం' అనే పదానికి మంగళం కళ్యాణం భద్రం శ్రేయస్సు ఇటువంటి అర్థాలు ఉన్నాయి. సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుడే పరమ మంగళ స్వరూపి. అందుచేతనే పరమేశ్వరునకు 'శివః'అనిపేరు. ఆ పరమేశ్వరుడు అన్ని చోట్లను పరిపూర్ణంగా ఉండేవాడు. అన్ని చోట్లా అన్నీ ఎఱిగినవాడు. అతడు పరిపూర్ణంగా ఉన్నప్పుడు అతనికి ఒకరూపం లేదు. సాధారణంగా ప్రాణులకు అందులోనూ మానవులకు దృగ్గోచరం కావడానికి ఆ పరమేశ్వరుడే సాంబమూర్తి రూపంగా అంబికతో కూడుకొన్న పరమేశ్వరుడుగా ఆవిర్భవించేడు.

ఆరూపం కేవల జ్ఞానస్వరూపమైప పరిపూర్ణమైన పరమాత్ముడు, స్వరూపం అంబికా సహితమైన పరమేశ్వరుడు. ఈ అరూపమైన పరిపూర్ణ స్వరూపానికిన్ని దృగ్గోచరమైన తల్లి దండ్రుల సముదాయమైన అర్థనారీశ్వరుడైన యీపరమేశ్వరునకున్ను, మధ్యలో ఒకరూపం ఉంది. దానికి అరూప రూప మని పేరు అదే శివలింగం. జ్యోతిర్మయలింగం. కంటికి అగుపడాలంటే జ్యోతిస్సే ఉండాలి. పెద్ద జ్యోతిస్సు మొట్ట మొదట నేత్రాన్ని ఆకరిస్తుంది. అందుచేత కేవలం జ్యోతిర్మయి మహాలింగంగా మొట్టమొదట ఆవిర్భవించేడు పరమేశ్వరుడు. ఆ లింగస్వరూపంలో నుండి సాక్షాత్తూ సాంబపరమేశ్వరుడు సరూపంగా ఆవిర్భవించాడు. ఈమూడింటిలో మధ్యలో ఉండే స్థానానికి శివలింగ మని పేరు. అది ఆవిర్భవించిన సమయం అర్థరాత్రం. అర్థరాత్రంలో ఆవిర్భవించినపుడే జ్యోతిస్సుకు ఎక్కువ ప్రకాశం ఉంటుంది. రాత్రివేళ మహాప్రకాశ##మైన జ్యోతిసై#్స దేవతలకు, సిద్ధులకు, మహరులకు దర్శనం యిచ్చేడు. అందుచేతను 'అరూపమైన శివుడు జ్యోతీరూపంగా లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కావడం చేతను, శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. అది అర్ధరాత్రి పండ్రెండు గంటలకు అపుడు సర్వక్షేత్రముల యందు అందరూ నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగదర్శనం చేస్తారు.

మనదేశంలో ప్రతిసంవత్సరం రాత్రిలో కలిగిన ముఖ్యపుణ్యకాలాలు రెండు, ఒకటి జన్మాష్టమి, (శ్రీ కృష్ణాష్టమి) తరువాతిది శివరాత్రి. జన్మాష్టమి శ్రావణమాసం కృష్ణపక్షంలో అష్టమి, శివరాత్రి మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి, రెండూ అర్ధరాత్రంలోనే, సంవత్సరంలో చెరిసగంలో ఈ రెండు పుణ్యకాలాలూ ఏర్పడ్డాయి. జన్మాష్టమి నుండి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుందని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. 180 రోజులు అంటే సరిగా 360 డిగ్రీలలో సగం.

అచట దేవకీగర్భంలో కృష్ణపరమాత్మ ఆవిర్భవించిన క్షణంలోనే యోగమాయ దుర్గాదేవి గోకులంలో ఆవిర్భవించింది. దుర్గయొక్క అభిన్నస్వరూపమే కృష్ణుడని తంత్రశాస్త్రంలో చెప్పబడింది. వారిద్దరూ జన్మాష్టమినాడు ఆవిర్భవించారు. అయితే గర్భంలోనుండి ఆవిర్భవించేరు. ఇది శివరాత్రినాడు గర్భం లేకుండా మహాకాశంలోనే ఒక జ్యోతిర్మయలింగంగా ఆవిర్భవించింది.

మనం రోజూ ఈశ్వరునకు అభిషేకం చేసే సమయంలో ముందుగా ఒక శ్లోకం చదువుతాం. అందులో పరమేశ్వరుని పరిమాణం నిర్వచింపబడ్డది. లింగరూపికాక పరిపూర్ణ పరబ్రహ్మానికి పరిమాణం లేదు. ఈ లింగరూపి యైన పరమేశ్వరుని పరిమాణం- 'ఆపాతాళ నభస్థలాంత భువనం' పాతాళలోకం మొదలు ఆకాశంవరకూ ఉండే సమస్తమైన భువనమూ అయి ఉన్నది. ఈ పరిమాణాన్ని అనగా పాతాళం మొదలు ఆకాశం వరకూ ఉన్న సమస్త భువనాన్ని ఒక లింగాకారంగా ధ్యానం చేయాలి ''ఆపాతాళ సభస్థలాంత భువన బ్రహ్మాండం అవిస్పురత్‌'' బ్రహ్మాండమే- లింగంకూడా. ఒక అండం రూపంగానే, ఒక కోడిగుడ్డు మోస్తరుగానే లింగం ఉంటుంది - బ్రహ్మ-అండమని దానికి అర్ధం. ఆబ్రహ్మాండరూపంగా ఉంటుంది మహాలింగం, దానికి సరిహద్దు- ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్‌ జ్యోతి స్పాటికలింగం, అది కేవలం శుద్ధస్ఫటిక లింగం, అయితే జ్యోతిర్మయమైనది. దాని ''మౌళి'' అంటే శిరస్సు, నభస్థలంలో అక్కడ శిరస్థలంలో చంద్రమండలం, మోస్తరుగా అమృతం ఘనీభావమైంది. చంద్రమండలానికి దృష్టాంతం ప్రకాశం, శైతల్యం - రెండూ కావాలి. మనకు సూర్యుడు ప్రకాశం ఇస్తాడు. అయితే, తాపమూ ఇస్తాడు. అందుచేత ప్రకాశమిస్తూ శీతలంగా అమృతకిరణంగా ఉండవలసి ఉంది. అటువంటి పరమేశ్వరునియొక్క శిరస్సులో కేవలం అమృతధార శిరస్సునుంచి పరిపూర్ణంగా పరమేశ్వరుని మహాలింగాన్ని అభిషేకం చేస్తుంది, ఆ విధంగా మనం ధ్యానం చేసినపుడు బ్రహ్మాండంలో వుండే సర్వభువనాలకు కూడ. శీతలత్వం కలిగి చల్లబడుతుంది. సర్వప్రాణులు చల్లబడుతాయి. ఇప్పుడు ఎవరైనా మనం లౌకికంగా కూడా ఒకవిందు చేసినట్లయితే '' వారిపేర పానమో, ఆహారమో చేస్తామని'' వారు భావన చేసుకుంటారు. అలాగే అభిషేకం కూడా, సర్వ ప్రపంచంలో వుండే బ్రహ్మాండమంతా చల్లబదేటటువంటిది. ప్రపంచం పరమేశ్వరస్వరూపమే నని భావించినపుడు సర్వ ప్రజలకే కాక, సర్వ ప్రాణులకూ శాంతమొస్తుంది. శైత్యమొస్తుంది. దుఃఖనివృత్తి అవుతుంది. అందుచేత శివలింగధ్యానం అభిషేకం చేసినపుడు అవి ఆపరమేశ్వరుడికే! ''అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియశ్శివ'' అంటాం. అనేక విష్ణ్వాలయాల్లో ఆమూలవిరాట్టుకు అభిషేకాలు సంవత్సరంలో ఏదో కొన్ని దినాలే చేస్తున్నాం. పరమేశ్వరునికి రోజు రోజూ ఎప్పుడూ కూడా అనవరతంగా ఒక ''ధారాపాత్ర'' ను పెట్టి ఆహోరాత్రం పరమేశ్వరునికి అభిషేకాలు చేస్తున్నాం. ఆ అభిషేకం చేసినపుడు ఈ బ్రహ్మండంమే శివలింగం. అన్నీ శివలింగస్వరూపాలే. దాని ఆకాశంలో చంద్రమండలం వున్నది. ఆ చంద్రమండలమే అమృతఘనీ భావం అక్కణ్ణుంచి అమృతం స్రవించి ఈపరమేశ్వర లింగం కడదాక పూర్తిగా తడిసినప్పుడు ప్రపంచమంతా కూడా చల్లబడుతుందనే భావనతో అభిషేకం చేయమని చెప్పబడింది.

8-2ొ

ఆపాతాళ నభస్థలాంత భువన

బ్రహ్మాండ మావిస్పురత్‌ |

జ్యోతి స్పాటిక లింగ మౌళి

విలసత్‌ పూర్ణేందు వాతామృతైః ||

''అస్తోకాప్లుత మేకం'' ఒక్కడు తప్ప రెండోవాడు లేడన్నమాట- అన్నీ అతడొె ''ఈశ మనిశం రుద్రాను వాకాన్‌ జపన్‌'' -రుద్రానువాకం, సమకచమకం అంటున్నారే, ఆనమకంలో అన్నీ వస్తువులు పరమేశ్వర స్వరూపమని చెప్పడం మించి వేరేమీ లేదు. ప్రపంచంలో ఏవైనా సరే, మంచీ చెడ్డ అన్నీ పరమేశ్వర స్వరూపమే, అని నమకంలో చెప్పబడుతుంది.

''రుద్రానువాకాన్‌ జపన్‌ ధ్యాయేత్‌, ఈప్సిత సిద్ధయే, అదృత పదం విప్రో7భిషించే -చ్ఛివం'' సాక్షాత్‌ శివునికి అభిషేకం చేయవలసిందనే భావం. శివరాత్రినాడు మొట్టమొదట అరూపమైన ప్రపంచం, ప్రపంచసృష్టి అయిన తర్వాత, అంటే ప్రాణి సృష్టి అయినతర్వాత వాళ్లకు అనుగ్రహానికి, వాళ్ళహృదయం చల్లబడటానికి అరూపమయిన పరమేశ్వరుడు రూపరూపంగా, లింగరూపంగా -లింగం అంటే దానికి ముక్కూకళ్లూ ఏవీ లేవు. అయితే అరూపం గూడా కాదు, ఏదో ఒకరూపం ఉంది- ఆవిర్భవించాడు. కళ్ళూముక్కులు వచ్చేసమయంలో అది పార్వతీ పరమేశ్వరులు, ఉమాసహాయుడైన పరమేశ్వరుడు. తల్లీ, తండ్రీగానూ, బిడ్డలకు రెండు రూపాలగానూ ఉండి అనుగ్రహం చేయవలసిఉంది. అందుకోసరం ఆ పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మమే రెండురూపాలు గ్రహించి మనకు అనుగ్రహం చేస్తున్నాడు. ఆ మధ్య ''అవస్థ''కే శివలింగమని పేరు, ఆ శివలింగం రాత్రిలో ప్రకాశం - జ్యోతిస్సు ఎక్కువ ఇస్తుంది. శివరాత్రి నాడు మొట్టమొదటగా ఆ పరమేశ్వరుడు జ్యోతిర్మయుడుగా ఆవిర్భవించాడు. అంచేత ప్రపంచంలో ఎవరైనాసరే, మన పూర్వులు ఈ భావమును ఎరిగినవారు, ఆ అలవాటునే ఈనాటికీ తీసుకు వస్తున్నారు. ఈ శివరాత్రినాడు ఈ శ్రీశైలంలో దేశమంతాకూడా భగవంతుని దర్శనం దొరుకుతుందా అని ఎంతో ఆతురతతో లక్షల కొలది ప్రజలు రావటం ఇవ్వాళ చూచాను. పరమానందంగా వుంది. ఈ శ్రీశైలంలో ఈ సంవత్సరం నేను వచ్చి దర్శనం చేసే భాగ్యంనాకు దొరికింది.

ఆదిశంకరుల వారు హిమాచలం మొదలు సేతువు వరకు ద్వాదశ 12 లింగాలు. జ్యోతిర్‌లింగ స్తోత్రమని, ఏయే చోట్ల జ్యోతిరూపములో పరమేశ్వరు డావిర్భవించాడో వాటిని గురించి 12 శ్లోకాలు వ్రాశారు. మూడు శ్లోకాల్లో ఒకదానికి ఒక్కొక్క క్షేత్రాన్ని చెప్పి, ఆ విధంగా మూడు శ్లోకాల్లోనే 12 జ్యోతిర్లింగాలను సృజించారు. తర్వాత యీ 12 జ్యోతిర్లింగాలకున్నూ ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా వ్రాశారు. ఆ పన్నెండులో కాశీ, రామేశ్వరం- రెండూ జ్యోతిర్లింగాలలో ఉన్నాయి. మొట్టమొదట చెప్పింది సోమనాథ్‌ సౌరాష్ట్ర దేశంలో వుండేది. తర్వాత యింకాకొన్ని ఉజ్జయినీ మొదలయిన క్షేత్రాలు చెప్పినారు. కాశీ, రామేశ్వరం - ఈ రెండుకూడా అందులోనే, ఈ కాశీ, రామేశ్వరాలకు సరిగా మధ్యంలో వుందీ శ్రీశైలం, ఇక్కణ్ణుంచి 600, 700 మైళ్లు రామేశ్వరం ఉంది. కాశీ కూడా బాగా దూరంగానే ఉంది. పర్వతాలన్నీ శైలములే. అయితే, ఒక్కొక్క పర్వతానికీ పేర్లు వేరుగా ఉన్నాయి. వింధ్యపర్వతం, హిమవత్పర్వతం, మలయ పర్వతం, దర్దుర పర్వతం - అని అనేక పర్వతాలకు పేర్లున్నాయి, అయితే, దీనికి ''శైలం'' అనే పేరు. అరవంలో గూడా శివభక్తులు చాలామంది తేవారములని ఆయా క్షేత్రాలకు వెళ్లి స్తోత్రాలు చేస్తుండేవారు. అవన్నీ గూడ కొన్ని యిప్పుడు లోపించినా చాలామటుకు ఉన్నాయి. ఆ శివభక్తుల్లో అప్పర్‌స్వామి సంబంధర్‌ స్వామి, మాణిక్యవాచగర్‌ స్వామి, సుందరమూర్తిస్వామి -అని. ఆ అరవై ముగ్గురి లోనూ వీరు ముఖ్యులు, వీళ్ళు స్తుతించిన క్షేత్రాలకు తేవారక్షేత్రములని, తేవారములు గలిగిన క్షేత్రము లనిపేరు. అందులో ఈ శ్రీశైల క్షేత్రాన్ని వారు '' తిరుప్పరుప్పదం'' అని అన్నారు, పర్వతం అనేది- అరవంలో ''వరుస్పదం'' అని అవుతుంది. అరవ వ్యాకరణం ప్రకారం, ఇక్కడ శ్రీశైలం అనేదాన్ని ''తిరుప్పరుప్పదం'' అని వారు తమ తేవారాల్లో స్తుతించారు. ఇది కూడా ఇక్కడ గోడలమీద శాసనాల్లో వ్రాసి ఉన్నట్లు చెప్పారు, ఈ తిరుప్పరుప్పదం.

శ్రీశైలం క్షేత్రాన్ని గురించి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఆదిశంకరులవారు స్తుతించిన ఒక శ్లోకం-

శ్రీ శైలశృంగే వివిధ ప్రసంగే

శేషాద్రి శృంగే చ సదా వసంతం |

తమర్జునం మల్లిక పూర్వమేనం ||

అనివుంది. మల్లికార్జునం అనే పేరు గూడా ఆ స్తోత్రంలో వాడారు ఆదిశంకరులు. ఒక విశేషం ఏమిటంటే, 'శ్రీశైల శృంగే' అంటే శ్రీశైలం శృంగంలో - ''శ్రీశైలశిఖరందృష్ట్వా పునర్జన్మ నవిద్యతే'' అనే శ్లోకపాదం అందరకు తెలిసిందే అనుకోండి - మల్లిక పూర్వంగా మల్లికార్జున నామ ధేయముతో పరమేశ్వరుడు లింగరూపంగా వసిస్తున్నాడు. ''శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే''! శ్రీశైల పర్వతంలో ఎన్ని రకములయిన ఓషధులు, వృక్షములున్నాయో చెప్పడానికి తరమేగాదు. వివిధ ప్రసంగే- ఏదికావలసినా శ్రీశైలంలో దొరుకుతుందని అభిప్రాయం. ''శ్రీశైల శృంగేవివిధ ప్రసంగే శేషాద్రి శృంగేచ- సదావసంతం'' ఈ శ్రీశైలంలో ఉండే మల్లి కార్జునుడే శేషాద్రి శృంగానగూడా ఉన్నాడని భావం. శేషాద్రిని ఇప్పుడు వేంకటాచలమని అంటున్నాము. ఇతనే అక్కడా వున్నాడు, ఇంతకుముందే తేవారం చేసిన నాయనారులు అని చెప్పబడిన విధంగానే విష్ణుక్షేత్రాలను స్తుతించినవారు పన్నెండుమంది ఆల్వారులని ద్రావిడ దేశంలోనూ, తెలుగు దేశంలోనూ గూడా ప్రసిద్ధులు. వీరి ప్రబంధాలు అనుస్మరణం చేయబడుతూ ఉన్నాయి, అటువంటి తేయాళ్వారనే పరమ విష్ణుభక్తులు ప్రతిక్షేత్రం వెళ్ళి ఆనారాయణుని పరమాత్ముణ్ణి పాడుతూ వెళ్ళిన అతను, శేషాద్రిలో వేంకటాచలపతిని 'ఈ రిరువుం ఒన్రాయిశైంది'అని పాడినారు. ''తాళ్‌ షడయం నీన్‌ ముడియం'' అని ప్రారంభించి రెండు రూపములుగూడా కలిపి ఒక రూపంగానే ''తిరువేంగడమలయిల్‌''- వేంకటాచలములో ''ఈరిరువుం ఒన్రాయ్‌శైంది,'' రెండు రూపములు ఒకరూపంగా ఆవిర్భవించినట్లు స్తుతిచేశారు. దాన్ననుసరించే ఆచార్యుల వారుగూడా, ''శేషాద్రిశృంగేచ సదావసంతం'' అని ఆద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో అన్నారు. ఈ రెండింటికి సమన్వయం కుదురుతుంది. ఆచార్యులవారు ఒకే పరమేశ్వరుడు రెండు క్షేత్రాలలో ఉన్నారని చెప్పారు కాగా ఆ ఆళ్వారు వెంకటాచలంలో ఉండేది రెండు రూపాల సమన్వయం అన్నారు.

జటారూపం, సర్పం, చక్రం - ఇవన్నీ కలిసి శివవిష్ణువుల ఉభయ రూపం అక్కడ ఉన్నట్టు తేయాళ్వారు పాడినారు. ఆచార్యులవారో మల్లికార్జునులే యిక్కడా వున్నారు. శేషాద్రిలో ఉన్నారన్నారు. అందుచేత శేషాద్రికి కూడా శ్రీశైలమని పేరు 'తిరుప్పరుపదం' అని దీనిని అన్నట్టు అరవంలో ''తిరుమలై'' అని దానికి పేరు. తిరుమలై అంటే శ్రీశైలం అని అర్థం. ''తిరుమలైనంబి'' అని వైష్ణవ సాంప్రదాయంలో ఒక పెద్ద ఆచార్యులున్నారు. వారిని సంస్కృతంలో చెప్పవలసినప్పుడు, ''శ్రీశైలపూర్ణు'' లని పేరు చెబుతారు. అంచేతదానికి గూడా శ్రీశైలం అని పేరు. ఇది శ్రీశైలం ఇక్కడుండే మల్లికార్జునుడే అక్కడున్నాడని ఆచార్యులవారు చెప్పారు. అటువారు (వైష్ణవులు) గూడ ''తిరుమలైమేల్‌ ఈరిరువురుం ఒన్రామ్‌శైంది'' అని చెప్పారు. అలా ఈ మల్లికార్జునులు ఈ శ్రీశైలంలో కూడా ఉన్నారు. పోతే, మరొక శ్రీశైలంకూడా వుంది, ఈ ప్రాంతంలో ఈ మధ్య శ్రీశైలానికి దక్షిణాన శేషాద్రి శ్రీశైలం ఉంటే పూర్వభాగంలో మరో శ్రీశైలం ఉంది. దానిని నాగార్జున కొండ అంటారు. అచటి శాసనాల్లో, పూర్వ గ్రంథాల్లో గూడా శ్రీశైలం అనే ఉంది. అక్కడ గూడా శివాలయాలు విశేషంగా ఉన్నాయి. అక్కడ రాజ్యంచేసిన రాజులందరు అనేక శివాలయాలు కట్టించి, మాన్యాలిచ్చి శిలాశాసనాలు వేయించారు. అవి ఇప్పుడు దొరుకుతున్నాయి. అయితే అక్కడ రాజుల భార్యలు, పండితులూ, సమాధి నిష్టులూ అయిన బౌద్ధులమీది భక్తిచేత వాళ్ళకుగూడ విహారాలు కట్టించారు. అంచేత అది బౌద్ధస్థానమనే లోకంలో ఒక ప్రథకలిగింది. అయితే అక్కడ ఉన్నది ఎక్కువగా శివాలయాలే, దానినిగూడ బౌద్ధగ్రంథాల్లో, శిలా శాసనాల్లో శ్రీశైలం అని అంటారు. కనుక ఇది ఒక్కటి మాత్రమే శ్రీశైలంగాదు. కనుక మధ్యలోఉన్న ఈ మల్లికార్జున శ్రీశైలం దక్షిణాన వేంకటాచలం శ్రీశైలంగా, తూర్పున నాగార్జున కొండ శ్రీశైలంగా రెండుశాఖలుగా ఈ ఆంధ్ర ప్రదేశంలో వ్యాపించింది. ఆంధ్రప్రదేశంలో ఇవి ఉండటంచేత ఆంధ్రులు ఎక్కువగా వీటిపట్ల భక్తి ప్రవృత్తులు కలిగి ఉండటం సహజం.

తెలుగు త్రిలింగ శబ్దంనుంచి వచ్చిందని అంటారు. త్రిలింగములని మూడులింగములు ఆంధ్రలో మూడుదిక్కుల ఉన్నాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్రాక్షారామం ద్రాక్షారామం గోదావరీ తీరాన ఉంది. ఆంధ్రులకు వీటిని గురించి తెలిసినప్పటికీ ఆంధ్రమే తెలియని షోలాపూర్‌, బీజాపూర్‌, ధార్వార్‌, హుబ్లి లాంటి చోట్ల ఉండే శివభక్తులందరు కాలినడకనే వందలాది మైళ్ళు నడచివచ్చి శ్రమకు లక్ష్యపెట్టక, శ్రీశైలేశ్వరుణ్ణి దర్శించు కుంటున్నారు. అలా దూరాన ఉండే కర్ణాటక దేశాన్నుంచిగూడా గ్రామాలకు గ్రామాలుగా జనం వచ్చి దర్శనంచేసుకొని వెళ్తున్నారు. ఆంధ్రులెందరువస్తున్నారో అంతమందీ వారుగూడ పశ్చిమాన్నుంచి వస్తున్నారు. అటువంటి శ్రీశైలంలో ''శ్రీశైలశృంగే వివిధ ప్రసంగే శేషాద్రిశృంగేచ సదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేనం'' మల్లికాలత, అర్జున వృక్షం- యివి రెండూ కలిసి ఏకరూపంగా అర్థనారీశ్వర రూపంగా ఉన్నాయి, ఒకలత దానికి అవలంబనంగా వృక్షం, లతకు అవలంబం వృక్షం కావాలి. వృక్షానికి లత చుట్టుకోకపోతే అలంకారంలేదు. అందుచేత మల్లిక, అర్జునం- ఒక లత, వృక్షం- రెండూ కలసినట్టు ''తమర్జునం మల్లిక పూర్వమేనం''- అని చెప్పబడ్డది.

ఆచార్యులవారు ఆదిశంకరులు శివానందలహరి అనే పేర 100 శ్లోకాల్లో పరమేశ్వరుని స్తుతించారు. సాధారణంగా వారు చెప్పిన స్తోత్రములలో ఒకానొక క్షేత్రానికి ప్రాధాన్యము ఇస్తూ చెప్పడం తక్కువ. కాగా ఈ శివానందలహరి స్తోత్రంలో మాత్రం రెండుచోట్ల మల్లికార్జున మహాలింగాన్ని శ్రీశైల శబ్దాన్ని వాడారు. ఒక శ్లోకంలో చివర ''మల్లికార్జున మహాలింగం శివా లింగితం''- అన్నారు. మరొక శ్లోకంలో ''సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుః అన్నారు. భ్రమరాధిపుడు- అంటే తుమ్మెద శ్రేష్ఠుడు అని అర్థం, భ్రమరాంబికాధిపుడు పరమేశ్వరుడు, శ్రీశైలవాసీ విభుః భ్రమరాంబికా సహితుడని గూడ కీర్తించారు, శ్లేషలో, మదీయే మనో రాజీవే అంటే నా హృదయమనే పుండరీకములో అని భావం పుండరీకంలో తుమ్మెద ఎప్పుడూ రసగ్రాహిగా ఉంటుంది. కనుక నాహృదయమనే పుండరీకంలో భ్రమరాంబికాధిపుడైన సాక్షాత్‌ శ్రీశైల మల్లికార్జునుడు ఎప్పుడూ వసిస్తూ ఉండాలి. అందుకు తగినట్టుగా నాహృదయం శుభ్రంగా ఉండి, సుగంధం కలిగి ఉండి, మాధుర్యం కలిగి ఉండి, మకరంద సహితంగా ఉండాలి. అక్కడ భక్తి అమృతం ఉండాలి, ఆ అమృతాన్నే తుమ్మెదరూపంగా ఉండి అతను గ్రహించాలి-అని ఆచార్యులవారు ''సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విరహతాం శ్రీశైలవాసీ విభుః అన్నారు. ఈ విధంగా శ్రీశైలం, మల్లికార్జునం అనే పదాలను శివానందలహరిలో వాడారు.

8-3ొ

ఇవిగాక ఆదిశంకరులు ''యోగతారావళి'' అనే చిన్న గ్రంథం వ్రాశారు. తారావళి అంటే నక్షత్రపంక్తి. తారలు 27. యోగతారావళీ శ్లోక సంఖ్యగూడ 27. వాటిలో ప్రారంభంనుంచి క్రమంగా యోగమార్గానికి సోపానాలుగా ఒక్కొక్క శ్లోకంలో వివరించుకుంటూ వెళ్ళుతారు. 26 మెట్లువరకు చెప్పి 27వ శ్లోకములో మనోలయమైన సమాధిని నిరూపించి పూర్తిచేశారు. ఆ తారావళిని ఆ.27.వ శ్లోకంలో గూడ శంకరులు ఈ శ్రీశైలాన్నే ప్రస్తావించారు. అది కేవలం ఆధ్యాత్మనిష్ఠయోగం, అయినా అందులో శ్రీశైలం శబ్దప్రయోగం చేశారు. ఆ శ్లోకం ఇది -

''సిద్ధిం తథావిధ మనోవిలయాం సమాధౌ

శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే !''

మనస్సు అనే వస్తువు మనలో ఉండుటచేత మనకు మనశ్శాంతి లేదు! ''నా కేమీ ఇతరలోటు లేదు కాని మనశ్శాంతి మాత్రం లేకుండా ఉందని'' సాధారణంగా ప్రతివారు అంటూవుంటారు. కనుక శాంతిలేకపోవడానికి కారణం మనస్సు అనే వస్తువు ఉండటం. అందుచేత ఈ వ్యాకులతను శమింపచేయడానికి ఆ మనస్సునే నిలపాలి. అది మనోలయం, దానికే యోగం, అదేసాధనభూతం అవుతుంది. మనస్సు మనం చెప్పినట్టు విని, నిలకడగ వుండదు, అనిష్ట కారకాలైన వస్తువులన్ని సంపాదిస్తుందది. కనుక దాన్ని మనవశంలో ఉంచుకోవాలి. వశంలో ఉండే పక్షంలో మనస్సు అవసరమే లేదు, అది లయమై పోవాలి. ఆ మనస్సుకు అతీతమైన ఒక ప్రకాశం జ్యోతిర్మయమైన పరిపూర్ణప్రకాశం ప్రతిహృదయం లోనూ ఉంది. అన్నిచోట్లా ఉంది. మనస్సు అనేది ఒక చిన్నబల్బు. అది పోయినట్లయితే కేవలం పరిపూర్ణ ప్రకాశ##మే వుంటుంది. ఒక పెద్ద మెరుపు మెరిసినప్పుడు ప్రపంచమంతా ఒకే విద్యుచ్ఛక్తి వ్యాపించి ఉంటుంది. దాన్ని చిన్న బల్బులో బంధిస్తే చిన్నదైపోతుంది. అటువంటి చిన్న బల్బులాంటి మనస్సే లయమైపోతే ఆంతరంగా ఉండే మహాజ్యోతి స్వయంగా ప్రకాశిస్తుంది. అందుచేత అటువంటి మనోవిలయం కావాలి. ''తథా విధ మనోవిలాయం'' అటువంటి మనోవిలయం సమాధి సిద్ధించినపుడు కలుగుతుంది. అది తనకు ఎక్కడ కలుగవలెనన్నారు శంకరులు? అక్కడగూడ వారు శ్రీశైలంమీదనే పక్షపాతం ప్రదర్శించారు. ఇక్కడ వారికి మళ్ళీ శివానందలహరిలోని భ##క్తే జ్ఞాపకం వచ్చినట్టుంది. ఆస్థానం, లక్ష్మీ రెండూ జ్ఞాపకం రావడంతో ''శ్రీశైలశృంగే కుహరేషు'' అన్నారు. శ్రీశైల శృంగాల్లో అనేకాలైన గుహలున్నాయి, సందులున్నాయి, వానిలో ''కదా ్శ ఉప'' నేనెప్పుడు అనుభవిస్తానో కదా అన్నారు, వారు పరిపూర్ణమైన సమాధినిష్టులైన కూడా మనబోటివారికి మార్గదర్శికులుగానే ఆ విధంగా ప్రార్థించారు. ''అటువంటి మనోవిలయం'' అంటే ఎటువంటిది? దానికి లక్షణమేమిటి? అందరుకు తెలిసేటట్టుగా స్థూలలక్షణం చెప్పాలి. అని వారంటారు.

''గాత్రం యదా మమలతాః పరివేష్టయన్తి'' ఆసమాధిలో కూర్చొని మనోలయం అయినప్పుడు శరీరం చలనరహితంగా ఏదో ఒక పుట్టలాగ ఉండిపోయి, చుట్టుపట్ల ఉండే తీగలన్నీ దాన్ని పెనవేసుకుపోవాలి. ఇలా జరగడానికి శరీరం దీర్ఘకాలం చలనంలేకుండా స్థాణువుగా ఉండటం అవసరం. కనుక ''మమగాత్రం'' -అంటే నాశరీరం అనుకున్న దీనిని ''లతాఃపరివేష్టయంతి,'' తీగలన్నీ ఎప్పుడు చుట్టుకుంటాయో తీగలంటే ఇక్కడ స్థావరసృష్టి- అని తాత్పర్యం, జంగమసృష్టి పక్షులు ''కర్ణేయదా విరచయంతి ఖగా శ్చ నీడాస్‌,'' నా చెవులలో చిన్న పక్షులు తమకు గూళ్ళు నిర్భయంగా కట్టుకునేస్థితి, అచేతనస్థితి నాకు రావాలి. వాటికి గూడుకట్టుకునేందుకు కావలసిన నమ్మకం కలిగేటట్టుగా ఒకమనోవిలయం సమాధి నాకు రావాలి. 'ఖ' అంటే ఆకాశం 'గ' - అంటే సంచరించేది ''ఖగం'' అంటే పక్షి. పక్షుల నీడములు - అంటే గూళ్లు కట్టేటటువంటి సమాధి నాకు రావాలి. తీగలన్నీ నన్ను ఆవరించేటటువంటి మనోలయావస్థ రావాలి. అటువంటి సమాధి ఈ శ్రీశైలంలోని ఏదో ఒకగుహలో నాకు లభ్యం కావాలని ఆచార్యులవారు యోగతారావళిలోని చివరశ్లోకంలో చెప్పారు. అంటే తీగలకు అవలంబంగా పక్షులకు ఆశ్రయం. వాసస్థానంగా నాశరీరం ఉపయోగపడాలి అని ఆంతర్యం. నేను ఊగుతూ, నడుస్తూ ఉంటే ఎవ్వరికీ ఉపయోగపడను. అలాగాక నేనే సమాధిలో ఉంటే నాకు మనశ్శాంతి లేకపోవడం అంటూ వుండదు. మనోవిలయమైతే మనః కృతమైన దోషాలేవీ ఉండవు. పైపెచ్చు యితర ప్రాణులకు గూడ జంగమస్థావర జీవాలకుగూడ ఉపయోగంగ ఉండవచ్చు. ఎవ్వరికీ ఉపయోగంలేక భూమికి భారంగా నడుచుకునేటట్లయితే, పశుపక్ష్యాదులకూ, చెట్టు చేమలకూ అన్నింటికీ కంటకుడుగా మానవుడు తయారౌతాడు. అటువంటి స్థితిలో మానవుడు తనకుగూడా తాను కంటకప్రాయు డౌతాడు. ''ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపు రాత్మనః'' అన్నట్టు తనకు తానే శత్రువు కాకుండా ఇతర ఏ ప్రాణులకూ శత్రువు కాకుండా సమాధిలో వుండి, స్థావరజంగమముల కన్నింటికి ఈ శరీరం ఉపయోగపడేటట్టు ఈ శ్రీశైలంలోని గుహల్లో ఉండాలని ప్రార్థించారు ఆచార్యులవారు. ఈ శ్రీశైలం అందరలోను మధ్యగా హృదయస్థానంలో వుంది. ఈవైపు శేషాద్రీ, ఆ ప్రక్క నాగార్జునకొండ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో వైన కాశీరామేశ్వరాలకు సరిగా మధ్యలో ఏర్పడి, భక్తిప్రధాన స్తోత్రమైన శివానందలహరిలోను, యోగజ్ఞానపూరితమైన యోగతారావళీ త్యాది గ్రంథాల్లోను ఆదిశంకరులచే స్తుతించబడి విశిష్టతను గడించుకుంది. అందుచేత ఎల్లవారూ ''శ్రీశైలశిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే'' అనే సూక్తిని మనస్సులో ఉంచుకొని ఎన్నోవందల మైళ్ళనించి నడచివచ్చి అయినాసరే జన్మకొక పర్యాయమైనా శ్రీ శైలేశ్వరుణ్ణి సేవించుకొని, శ్రీ భ్రమరాంబికాతల్లి కాళ్ళమీద పడి తమ జన్మలు తరింప చేసుకుంటారని, కృతార్థులౌతారని నమ్ముతున్నాను.

హరనమః పార్వతీపతయే హరహరమహాదేవ !


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page