Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

శ్రీరామనవమి

బాలలూ! రాబోయేది శ్రీరామనవి. కొద్దిరోజుల క్రితమే ఉగాది వెళ్లపోయింది. ఇలాంటి పండుగలను, ఉత్సవాలు విందులు మున్నగు వానితో గడవడంకన్న ఏదైనా ఒక్క మంచిపని ప్రారంభించడానికి ఉపయోగించి, నియమంగా ఆపని చేస్తూవుంటే ఎంతైనా బాగుంటుంది.

ఉదాహరణకు శ్రీరామనవమినాడు శ్రీరామ నామం వ్రాయడం, ప్రారంభించి, రాముని చిత్రాన్ని ముందుంచికొని అతనిగుణాలను తలచుకొంటూ రామనామాన్ని ఉచ్చరించండి, 'శ్రీరామ' అని అలా వ్రాసుకొంటూ పోవడం వల్ల మనస్సు బుద్ధి మున్నగునవన్ని మంచిగుణాల మీద, భావాల మీద, కేంద్రీకృత మవుతాయి. ఈ ప్రకారం ప్రతిరోజూ చేస్తే చక్కటి అనుశాసనం అలవడుతుంది.

మనమంతా ఉత్తమమైన మానవులుగా రూపొందడానికి బాల్యంనుండి తగిన అభ్యాసం, ఎంతైనా అవసరం, చిన్ననాటినుండి వినమ్రత, దైవభక్తి, సత్కార్యములు చేయవలెననే చింతన క్రమశిక్షణ మనస్సు ఒక విషయమందు లగ్నం చేయడంవంటివి. అలవాటు కావలసివుంది.

ఈనియమములను బాలలు భక్తి శ్రద్ధలతో అభ్యాసము చేయుటయే గాక తల్లిదండ్రులు తమ పిల్లలు. వీనిని పాటించులాగున శ్రద్ధవహించ వలసింది. బాలురు తన టైంటేబులు కార్డుపై తమకు ఇష్టమువచ్చిన దేవతల చిత్రం అతికించి ఆ దేవతలకు సంబంధించిన పద్యాన్నో శ్లోకాన్నో వ్రాసుకొని ప్రతినిత్యము ధ్యానం చేయాలి. బాలురు విద్యార్థులుగా తమ టైంటేబులు కార్డుమీద.

''సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

పద్మ పత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణినీ

నిత్యం పద్మాలయా దేవి సా మాం

పాతు సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా.

అనే శ్లోకాన్ని వ్రాసుకోవచ్చు, ఇలాంటి కార్డులను కొందరు విద్యార్థులో లేక కొన్ని తరగతుల విద్యార్థులో కలసి ముద్రించ వచ్చుకూడా. వీలుంటే మిగిలిన తోటివిద్యార్థులకు పంచి పెట్టవచ్చునుకూడా. ఇలాంటి మంచిపనికి తల్లి దండ్రులు తప్పక సహకరిస్తారు. తప్పక ఒకరూపాయి చొప్పున ఇవ్వకుండా ఉండరు.

పాఠశాలలో మోరల్‌ ఇన్‌స్ట్రక్షన్‌ పీరియడులందు ధర్మబోధకములగు కథలను ప్రారంభింప వలసిందిగా బాలలు ఉపాధ్యాయులను కోరవచ్చును. అంతటితో చాలదు. ప్రతి బాలబాలికలు. ఇలాంటి చక్కటి శ్లోకాలను, పద్యాలను ఏబదికి తక్కువలేకుండా కంఠస్థం చేయాలని నాకోరిక. వచ్చేవి వేసవి శెలవలుగదా ! ఈ కాలాన్ని ఇలా చక్కగా వినియోగించుకోవచ్చుగూడ, ఇలాంటి శ్లోకాలకు అర్థం తెలుసుకొని మంచి ఉచ్ఛారణతో వాటిని పఠించగల బాల బాలికలకు మా మఠం మంచిపుస్తకాలను బహుమానంగా ఇస్తుంది. మంచి బాలసంఘాలు, ఏర్పరచుకోవాలి. పురాణ కథాశ్రవణాది కాలక్షేపాలను, ఏకాదశినాడు లేదా శనివారంనాడు సామూహిక భజనలు; ప్రార్థనలు ఇత్యాదులు కూడా నిర్వహించు కొనవచ్చును.

8-5ొ


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page