Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

15. మండన మిశ్రునిపై విజయం

ఈ విజయము శంకరవిజయములన్నిటిచేత విశేషముగా వర్ణించబడినది. మండన మిశ్రులు పూర్వమీమాంసలో తలమానికమైన పండితులయి ఉండటంతో, తరువాత కాలంలో సురేశ్వరులుగా అద్వైత సిద్దాంతములో ప్రసిద్దములైన గ్రంథములు, వార్తికము వ్రాయడమూ, వారి అర్దాంగి అయిన సరసవాణిని శంకరులు ప్రార్థించి (ఆమె సరస్వతీ అవతారమవడాన) తాము స్థాపించిన మఠములలో ఒక మఠమునకు అధిష్టాన దేవతగా ఉంచడమూ కారణం కావచ్చు. శంకరులు స్థాపించిన దరిదాపు అన్ని పీఠముల వారు సురేశ్వరులు శంకరుల తరువాత తమ పీఠమును అధిష్టించారని చెప్పుకోవడం విశేషం.

మండన మిశ్రుని పేరు గురించి, ఊరు గురించి, వివిధ చరిత్రలలో వివిధంగా చెప్పబడినా వారిది మహిష్మతీపురమని చెప్పుకుందాం. కుమారిలభట్టు సూచనపై మండల మిశ్రుని కలవడానికి కొంతమంది శిష్యులతో మహిష్మతి చేరిన శంకరులు నర్మదానది స్నానం చేసి, నీటికై వచ్చిన పురస్త్రీలను మండన మిశ్రుని గృహమెక్కడ ఉన్నదని వాకబు చేశారు. మండనమిశ్రుడు మహాధనికుడు, కర్మిష్టి, పండితుడు. 'స్వామీ ధనికులుండే బజారులో ఉన్న ఏ పెద్ద ఇంటి వసారాలోని చిలుకలు స్వతః ప్రమాణము పరతః ప్రమాణముల గురించి చర్చించుకొంటూ ఉంటాయో ఆ ఇల్లే మండన మిశ్రునిదన్నా'రట వారు. ఈ ప్రమాణ వాదములు న్యాయశాస్త్రమునకు సంబంధించినవి. వీటిని ఆ రోజులలో మండనమిశ్రుని వాకిలిలోనున్న చిలుకలే కాదు, సామాన్య పురస్త్రీలు కూడా ఎరుగుదురట.

మండన మిశ్రుని ఇంట్లో ఆ రోజు శ్రాద్ద దినము. వారు తలుపులు వేసుకొని శ్రాద్ధ కార్యాలలో నిమగ్నులై యున్నారు. విష్ణుస్థానంలో సాలగ్రామశిల నుంచి పూజించి విశ్వేదేవ పితృదేవ స్థానాలలో బ్రాహ్మణులను నిమంత్రించి పూజించబోతున్నారు. శంకర విజయాలు ఆ బ్రాహ్మణులు సాక్షాత్తూ వ్యాస, జైమినీ మహర్షులేనని చెబుతాయి. తప్పు లేదు. ఈ రోజుకూ మనం శ్రాద్ధాదులలో నిమంత్రించిన వారిని వసిష్ట వామదేవాది మహర్షుల వంటివారని భావించి మర్యాద.

శంకరులు యోగమార్గంలో మండన మిశ్రుడు శ్రాద్ధం చేసే ప్రదేశంలో ప్రత్యక్షమయ్యారు. కర్మతత్పరులైన మండన మిశ్రులకు సన్యాసులంటే కర్మభ్రష్టులని భావం ఉంది. అందునా శ్రాద్ద సమయంలో కర్మభ్రష్టుడ్ని చూడవలసి వచ్చిందన్న ఆక్రోశం కలిగింది. ఇంగిత మెరిగిన మహాపండితుడైన మండన మిశ్రులు తమ హోదాకు తగని అశ్లీలపు మాటలు మాట్లాడినట్లు కొన్ని శంకర విజయాలలో ముఖ్యంగా నవ కాళిదాస బిరుదాంకితులైన మాధవీయ శంకరవిజయంలో వ్రాయబడింది. మాహాసాధు స్వభావులైన శంకరుల ప్రతిస్పందన కూడా అలాగె చిత్రికరించబడింది. నిమంత్రించబడిన బ్రాహ్మణులు మండన మిశ్రుని వారించి శ్రాద్దకాలంలో కోపం తెచ్చుకోవడం తగదని, 'అభ్యాగతః స్వయం విష్ణుః' అని ఉన్నదనీ, శంకరులకు అతిధి మర్యాదలు చేయవలసిందని శాసించారు. తమాయించుకొన్న మండన మిశ్రుడు శంకరులకు అతిధి మర్యాదలు చేసి భిక్ష స్వీకరించవలసినదిగా కోరాడు. శంకరులు తాము భిక్షకై రాలేదనీ, వాదభిక్ష కోరుతున్నామనీ చెప్పారు. శ్రాద్ద క్రియ సుసంపూర్ణం అయిన తరువాత వాదము చేయడానికి నిశ్చయం అయింది.

ఇక్కడ వివాదము వేదముల యొక్క పరమ ప్రయోజనము కర్మకాండా లేక జ్ఞానకాండా అనేది. ఇరువురు మహాత్ములు వేద ప్రామాణ్యంపై ప్రగాఢ విశ్వాసం కలవారే! వీరిద్దరి మధ్య సంవాదం జరుగుతుంటే గెలుపు ఓటములు నిర్ణయించగలిగేదెవ్వరు? శంకర విజయాల్లో మండన మిశ్రుడు బ్రహ్మదేవుడనీ, సరసవాణి సరస్వతి అవతారమని చెప్పబడింది. కొన్ని చరిత్రలు ఆమెను కుమారిలభట్టు సోదరిగా పేర్కొన్నారు. ఆమె మహాపండితురాలు. విదుషీమణి. ఆమెను మధ్యవర్తిగా ఇరువురూ ఒప్పుకొన్నారు. నిష్పాక్షికతకు మారుపేరయిన సరసవాణి ఇరువురకూ రెండు పూమాలలు ధరింపచేసి ఎవరి పూమాల వాడిపోతే వారు ఓడిపోయినట్లని నియమం చేసి వాదం ఆరంభింప చేసింది. వారిరువురిలో ఎవరు ఓడిపోతే వారు వారి ఆశ్రమాన్ని వదిలి గెలిచిన వారి ఆశ్రమాన్ని పొంది వారి శిష్యత్వాన్ని స్వీకరించాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు సన్యాసం స్వీకరించడం శాస్త్రసమ్మతమే. కానీ శంకరులు గృహస్థాశ్రమం స్వీకరించడం ఎలా? వారే తమ శారీరక భాష్యంలో పతితులైన సన్యాసులకు ప్రాయశ్చిత్తమే లేదని స్పష్టీకరించారు. సన్యాసులు గృహస్థాశ్రమం స్వీకరించడం అంటే పతితులవడం అని అర్థం. అలాంటి షరతుకు ఒప్పుకొన్నారంటే శంకరులకు తమ సిద్దాంతం మీద అంతటి విశ్వాసమని అర్థం అవుతోంది.

వాదన ఏడు రోజులు జరిగిందని కొన్ని చరిత్రలు చెబితే, 36 రోజులు జరిగిందని మరి కొన్ని చరిత్రలు చెబుతున్నాయి. జైమిని ధర్మసూత్రముల మీదనున్న శాబర భాష్యంలోనూ, భట్టవార్తికంలోనూ మహాపండితులు మండన మిశ్రులు. దానిలోని ఒక సూత్రమును తన అద్వైత సిద్దాంతాన్ని బలపరచడానికి అనువుగా వ్యాఖ్యానం చేసిన శంకరుల వాదన మండనులను సంభ్రమాశ్చర్యములకులోను చేసింది. త్రికరణ శుద్ధిగా వేదము యొక్క పరమ ప్రయోజనము అద్వైతమేనని అంగీకరించి శంకరులను ఆశ్రయించారు.

ఇక్కడ ఒక శంకర విజయం సరసవాణి శంకరులకు మండన మిశ్రునిలో సగభాగం అయిన తనను జయిస్తే గానీ మండన మిశ్రుని జయించినట్లు కాదని నిలువరించి వాదనలో దింపినట్లు చెబుతుంది. వేరొక శంకర విజయం, తన అవతారోద్దేశ్యం నెరవేరిందని బ్రహ్మలోకానికి పోబోతున్న సరస్వతీ (సరసవాణి) దేవిని వనదుర్గా మంత్రంతో నిలువరించి ఆమెను జయించాలనే జిగీషతో శంకరులే వాదన ఆరంభించారని చెబుతుంది. అన్ని శాస్త్రములలోనూ చర్చ జరిగిందిట. ఆమె కామశాస్త్రంలో ప్రశ్నలు వేసి శంకరులను బిత్తరపోయేట్లు చేసిందట. నెలరోజులు గడువు అడిగి, మృతుడైన అమరుక మహారాజ శరీరంలో పరకాయ ప్రవేశం చేసి శృంగార రహస్యాలను తెలుసుకొని వచ్చిన శంకరుల మోము చూచేసరికి ఈతడు ఆ శాస్త్రంలో ప్రవీణుడయ్యాడని గుర్తించి, సర్వజ్ఞునిగా గుర్తించిందట సరసవాణి!! అక్కడితో ఈ కథ ముగియలేదు. కాశ్మీరులో సర్వజ్ఞ పీఠము అధిరోహించడానికి శంకరులు ఉద్యుక్తులైన సందర్భములో, సన్యాస ధర్మములకు వ్యతిరేకముగా ప్రవర్తించావు కాబట్టి 'సర్వజ్ఞ పీఠానికి అనర్హుడవు' అని ఆకాశవాణి అభ్యంతరం పెడితే 'నేనీ శరీరంతో తప్పేమి చేయలేదని' సమర్థించుకొని సర్వజ్ఞ పీఠమెక్కారట శంకరులు.

ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. శంకరులు మండన మిశ్రుని కలవడంలో ముఖ్య ఉద్దేశ్యం వైదికమతమైన మీమాంస శాస్త్రము కర్మే ప్రధానమని చెబుతూ వేదాంతం యొక్క అత్యంతికమైన ప్రయోజనాన్ని గుర్తించడం లేదు కాబట్టి, అట్లాంటి మీమాంసా శాస్త్రములో తలమానికమైన మండన మిశ్రుని తన వాదంతో సన్మార్గానుయాయిని చేసి తద్వారా వైదిక ధర్మములు సుప్రతిష్టితం చేయడం మండన మిశ్రులు, శంకరులు తమ సిద్దాంతములో ఉత్కృష్టతను సంపాదించినవారు. ఇద్దరూ సరసవాణి శైముషీ వైభవాన్ని గుర్తించి న్యాయమూర్తిగా వరించారు. మండన మిశ్రుడు ఓడిపోయినట్లు ఆమే నిర్ణయించారు. అంతా అయిపోయిన తరువాత న్యాయమూర్తి వాదనకు దిగడమేమిటి? శంకరులు వచ్చింది సర్వజ్ఞత్వ నిర్ణయానికి కాదు కదా! తాను సర్వజ్ఞుడనని ఆయన అక్కడ చెప్పుకొన్నారా? మరి ఈ కామశాస్త్రం గొడవ ఏమిటి? శంకరులు సర్వజ్ఞత్వాన్ని బ్రహ్మశబ్దానికి పర్యాయవాచిగా వాడారు. ఏ ఎఱుక గలిగితే ప్రపంచంలో వేరే ఏ ఎఱుకలయొక్క అవసరం లేదో అట్టి ఎఱుక కలిగిన వాడు సర్వవిషయములు ఎఱిగిన వాడవుతాడు. అతడే సర్వజ్ఞుడు. అలా కాకుంటే సరసవాణి సూచించిన అర్ధంలో సర్వజ్ఞత్వం ఎవరికైనా సాధ్యమా?' 'బ్రహ్మవిద్బ్రహైవ భవతి' అన్న ఉపనిషత్తత్వాన్ని అనుసరించి జ్ఞాని సర్వజ్ఞుడవుతాడు.

ఈ కథ చాలాకాలంగా శంకర విజయాల ద్వారా ప్రచారం చేయబడుతోంది. అయితే అనేకమంది ఋషితుల్యులైన మహానుభావులు ఏ కారణం చేతనో తూష్ణీంభావం వహించారు. అలాంటి విషయంలో 'జరిగి ఉండదు' అని వ్యాఖ్యానం చేసే అధికారం నాకు లేదు కానీ, దీనిని సమర్ధిస్తూ వచ్చిన అనేక వ్యాఖ్యానాలలో ఏదీ నాకు సంతృప్తిని కలిగించలేదని మాత్రం మనవి చేస్తున్నాను. అంతేకాదు. కొన్ని శంకర విజయాలు మహామనీషులైన మండన మిశ్రునికీ, జీవన్ముక్తుడైన శంకరులకు నడిచినట్లు చెబుతున్న పేలవమైన సంభాషణ బాధావహంగా ఉన్నది.

సరి! ప్రస్తుతానికొస్తే మండన మిశ్రుడు శాస్త్రవిధిన సంపదనంతా త్యాగం చేసి, సర్వసంగ పరిత్యాగియై శంకరులను శరణు జొచ్చారు. శంకరులు వారికి సన్యాసం అనుగ్రహించారు. శంకరులు సరస్వతీదేవిని ప్రార్ధించి తాము స్థాపించబోయే పీఠములలో ఒకదానికి అధిష్టానదేవతగా ఉండటానికి ఒప్పించారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page