Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

22. అవతార పరిసమాప్తి

శంకరులకు వ్యాసులవారిచ్చిన అయుర్దాయం కూడా ముగిసిపోయింది. వారి అవతారోద్దేశ్యము నెరవేరినది. విదేహ ముక్తికై నిర్ణయించుకొన్నారు. బ్రహ్మచారిగా తమను ఆశ్రయించి తమ వద్ద సన్యాసము పుచ్చుకొని సర్వజ్ఞాత్ముని తన తరువాత కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధీశునిగా నియుక్తుని చేశారు. సర్వజ్ఞాత్ములు చిన్న వయస్సులో ఉండటం చేత వారిని సురేశ్వరుల రక్షణలో ఉంచారు. వ్యాసాచరీయ శంకరవిజయం ఈ విషయాన్నిలా వివరిస్తుంది.

ప్రాగష్టమాద్విదితవేద్య మృదూఢబాల్యం,

సర్వజ్ఞ సంజ్ఞమఠహంసితమాత్మనైవ

శ్రీకామకోటి బిరుదే న్యదఘాత్‌

స్వపీఠే గుప్తం స్వశిష్యతిలకేన సురేశ్వరేణ

కేరళీయ శంకరవిజయం కంచిలోని తమ శిష్యపరంపర యోగేశ్వరున్ని (స్పటిక లింగము) నిత్యము పూజించాలని విధించినట్లుగా చెబుతోంది.

జగద్గురువులైన ఆది శంకర భగవత్పాదులు తన స్వస్థితిని పొందటానికి నిశ్చయించుకొని మోక్షపురి అయిన కాంచీపురంలో కూర్చుని, స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరంలోనికి, సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరంలోనికి లయింపచేసి అంగుష్ట మాత్ర పురుషుడై పిదప పూర్ణుడు, అఖండ మండలాకారుడు, సర్వవ్యాపక రూప చైతన్యమైన ఆనందాన్ని పొందారు. ఇప్పటికీ చిత్స్వరూపులుగా అంతటా నిండి ఉన్నారు. ఆదిశంకరుల సిద్ది గురించి ఆనందగిరీయంలో వర్ణించబడింది. బ్రహ్మాండ పురాణాంతర్గత మార్కండేయ సంహిత- శ్రీ విద్యారాజపీఠమును అర్చింప సురేశ్వరుని నియమించి కంచిలో శంకరులు బ్రహ్మానందమగ్నులైనారు అని చెబుతుంది.

డా||హుల్ట్స్‌ సంపాదకత్వములో వెలువడిన తుంగభద్రానదీతీర భారతీయ సంప్రదాయ సన్యాసుల పట్టికలో ఆదిశంకరుల గూర్చిన శ్లోకం శంకరులు స్వేచ్చగా కాంచీపురము వచ్చి, కామాక్షిని ప్రతిష్టించి పరమపదం పొందారని చెబుతోంది.

అగత్త స్వేచ్ఛయా కాంచీ పర్యటన్‌ పృధ్వీతలే

తత్త్ర సంస్థాప్య కామాక్ష్యా జగామ పరమం పదమ్‌

అదే విషయం కుండలీ పీఠపు గురు పరంపరలో ఉటంకించబడింది.

స్వేచ్చయా పర్యటన్‌ భూమౌ య¸° కాంచీపురం గురుం

తత్ర సంస్థాప్య కామాక్షీం దేవీం పరం అగాత్‌ పదమ్‌

కామాక్షీ దేవాలయపు రెండవ ప్రాకారంలో ఉన్న శంకరుల సన్నిధి శంకరుల అధిష్టానంగా ఈనాటికి కూడా పూజింపబడుతోంది. శంకరుల శిలామూర్తులన్నిటిలోనూ బహుశః అతి పురాతనమైనది చోళరాజుల కాలంలోనిది. విష్ణుకంచి కిలోమీటరు దూరంలో ఉన్న శివస్థానంలో దర్శనమిస్తుంది. కాంచీక్షేత్రంలోనూ, చుట్టుప్రక్కలనున్న అనేక గ్రామాలలోని ప్రధానాలయాలలోనూ కనిపించే శంకర ప్రతిమలు శంకరులకు కాంచీపురంతో ఉన్న సంబంధాన్ని ఋజువు చేస్తున్నాయి. పతంజలి చరిత్ర ఒక్క శ్లోకంలో శంకర చరిత్రను సంగ్రహంగా ఇలా వివరిస్తోంది.

గోవింద దేశిక ముపాస్యచిరాయ భక్త్యా

తస్మిన్‌ స్థితే నిజమహిమ్ని విదేహముక్త్యా

అద్వైత భాష్యముపకల్ప్య దిశో విజిత్య

కాంచీపురే స్థితి మవాప స శంకరార్యః

శివరహస్యము, మార్కండేయ సంహిత మొదలుగాగల రాజచూడామణి దీక్షితుని శంకరాభ్యుదయము వరకు అనేక గ్రంథములు శంకరుల సిద్ది స్థలము కాంచీపురంగా ఘోషిస్తున్నాయి. అంతే కాదు. తరతరములుగా మార్పులేవీ లేకుండా చదువబడుతున్న కాంచి కామకోటి పీఠ శ్రీముఖ బిరుదావళిలో 'శ్రీశంకర భగవత్పాదాచార్యాణాం అధిష్టానే సింహాసనాభిషిక్త' అన్న బిరుదు శంకరుల సిద్ధి కాంచీ క్షేత్రములో జరిగిందన్న విషయం స్పష్టమవుతోంది.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page