Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

23. ఆచార్యపాదుల అంతేవాసులు

భగవత్పాదులవారి చేత చేపట్ట బడిన శిష్యులు వేలాదిగా ఉన్నప్పటికీ, వారిలో నలుగురు అంతేవాసుల ప్రస్థానం శంకరవిజయాల్లో విశేషంగా ఉన్నది. వారు నల్గురు శాంకరాద్వైత సిద్దాంతముపై విశేషమైన పరిశ్రమ చేసినవారు. శంకరులకు అంతరంగికమైన శిష్యులు. వీరిలో వయస్సుచేత, పూర్వమీమాంసా శాస్త్రములో వారి విశేషమైన ప్రజ్ఞ చేత మండన మిశ్రులు వృద్ధులుగా పరిగణించబడతారు. వీరికే సురేశ్వరులనే దీక్షానామము.

శంకరులను అంతేవాసులుగా వీరు నైష్కర్మసిద్ది. తైత్తేరియోపనిషత్‌ భాష్యవార్తికము, బృహదారణ్యకోపనిషత్‌ భాష్యవార్తికము వంటి ఉద్గ్రంధములు వ్రాశారు. అనేక పీఠములు సురేశ్వరాచార్యుల వారిని ఆదిశంకరులవారి తరువాత తమ పీఠాధిపతులుగా చెప్పుకోవడం వల్ల వీరు శంకరుల తరువాత పీఠముల నిర్వాహణలో ముఖ్యపాత్ర వహించారని తోస్తుంది. వీరి చరిత్ర ఇంతకు ముందే చెప్పుకొన్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ విశేషంగా ప్రస్తావించబడలేదు.

ఆచార్యులవారు ప్రధమంగా సన్యాస దీక్ష ఇచ్చినది పద్మపాదులకే అని చెప్పుకోవాలి. వారు గోవింద భగవత్పాదుల వారి వద్ద శలవు తీసుకొని కాశీక్షేత్రము చేరిన తొలిరోజులలోనే, చోళ##దేశానికి చెందిన విష్ణుశర్మ అనే బ్రహ్మచారి వారిని ఆశ్రయించాడు. అతఃపూర్వమే వేద శాస్త్రాభాష్యము పూర్తిచేసి అహోబిలంలో ఉన్న నృసింహోపాసన చేసి, ఆ స్వామి కటాక్షాన జనించిన వైరాగ్యంతో శంకరులను సన్యాసంకై ప్రార్ధించాడు. శంకరులాయనకు సన్యాసదీక్ష అనుగ్రహించి సనందనుడనే దీక్షానామమిచ్చారు. వారికి అమితమైన గురుభక్తి. ఆయనకు శంకరులపై ఉన్న భక్తితో వారిని ఒక్క క్షణమైనా వదిలి ఉండేవారు కాదు. కాశీక్షేత్రంలో శంకరుల వద్ద వేలాది శిష్యులు భాష్యపాఠం శాంతి చేసుకొంటున్నారని చెప్పుకున్నాం కదా! వారంతా శంకరులకు ఆయనపై ప్రత్యేకాభిమానం అని ఈర్ష్యపడేవారు (ఏ ఆశ్రమంలో నయినా నలుగురు మనుష్యులు చేరితే ఈ ఈర్ష్యాసూయలు, రాజకీయాలు తప్ప వల్లే ఉంది). భగవత్పాదుల వారికి ఈ విషయం అవగతం అయింది. వారికి సనందుని గురుభక్తి చూపాలనుకున్నారు. ఒక రోజున గంగాతీరాన భాష్యపాఠం ఆరంభించే సమయానికీ సనందులు ప్రక్కన లేరు. నదికి ఆవలి ఒడ్డున గురువుగారి బట్టలు ఆరవేస్తూ కనిపించాడు. శంకరులు 'సనందా! భాష్యపాఠం ఆరంభమవుతోంది, రమ్మ'ని ఆజ్ఞ చేశారు. అంతే! ఈ సనందులు దారిలో గంగ ఉన్నదని గమనించనే లేదు. వేగంగా గురువుగారున్న చోటికి రానారంభించాడు. సురవాహిని గంగానది సునందుని పాదములు పడిన చోటల్లా పద్మములు మొలిపించి ఆయనను నీటిలో మునగకుండా కాపాడింది. శిష్యులందరికీ సనందుల గురుభక్తి అర్ధమయింది. అప్పటినుండి ఆయన పద్మపాదులని పిలువబడ్డారు.

శంకరులను పరీక్షించవచ్చిన బాదరాయణులను గుర్తించిన సుతీక్షణమైన బుద్ధి విశేషం వీరిదని మనం ముందే చెప్పుకున్నాం కదా. శంకరులను అంటిపెట్టుకొని ఉండి వారిని కాపాడుకొని ప్రపంచానికి మహోపకారం చేసిన కీర్తి వీరిది. శంకరులకు ఒకసారి శాక్తేయులు ప్రయోగం చేసి భగరంధ్రవ్యాధి కలగజేశారు. దానిని పద్మపాదులే తిరుగగొట్టారని శంకరవిజయం తెలియజేస్తుంది. కాపాలికుని నుండి శంకరులను రక్షించింది పద్మపాదులే కదా! వీరు శంకరుల సూత్రభాష్యానికి పంచపాదిక అనే టీక వ్రాశారు. భగవత్పాదులవారు ఆ గ్రంథమును పద్మపాదులవారు వినిపించగా విని బహుథా శ్లాఘించారు. వీరు రామేశ్వరయాత్రలో మీమాంస శాస్త్రంలో మహాపండితుడైన పూర్వాశ్రమపు మేనమామ గారింటిలో విడిది చేయగా ఈర్ష్యాళువు అయిన ఆయన వీరికి వంచనతో మరుపుమందు పెట్టడమే కాక, ఈ గ్రంథాన్ని తగలబెట్టించారట. విషయం తెలిసిన శంకరులు తాము పూర్తిగా వినియున్న పంచపాదికను తిరిగి చెప్పారట. అయితే ఇప్పుడీ గ్రంథము మొదటినాలుగు సూత్రములకు మాత్రమే దొరుకుతోంది. శంకరుల తల్లిగారు పంపిన ద్రవ్యముతో బదరిలో బదరీనారాయణునికి గుడి కట్టించి పూజా సంప్రదాయములు నెలగొల్పినది వీరే! ఈ రోజుకూ బదరిలో ప్రధానార్చకుడు నంబూద్రి బ్రాహ్మణులే.

శంకరుల జైత్రయాత్రలో ఒకచోట ప్రభాకర పండితుడనే ఒక పూర్వమీమాంస శాస్త్ర పండితుడు తన పుత్రునితో వారిని దర్శించాడు. ఆ పిల్లవాడు ఎప్పుడూ పరధ్యానంతో ఉంటాడు. ఉలకడు. పలకడు. అయితే మహాతేజసంపన్నుడు. భగవత్పాదులకు తన శక్తి కొలదీ ఫలపుష్పాదులు సమర్పించి, కుమారునిచే మొక్కించి, కుమారుని జడత్వమును గురించి వివరించాడు. శంకరులకు అతడొక

కస్త్వంశిశో! కస్యకుతో2సిగన్తా కింనామతేత్వం కుత అగతో2సి

ఏతన్మయోక్తం వదచార్భకత్వం మత్ప్రీతయే ప్రీతి వివర్ధనో2సి

ఓ శిశువా! నీ వెవడవు. నీ వెవరికి సంబంధించిన వాడివి. నీవెచ్చటికి పోతావు, నీ పేరేది. నీ వెచ్చటనుండి వచ్చావు. నాసంతోషార్ధము ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవయ్యా అన్నారు. దానికి ఆ బాలుడు అంటున్నాడు.

నాహం మనుష్యో నచ దేవయక్షా నబ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రాః

న బ్రహ్మచారీ నగృహేవనస్థీ భిక్షుర్నచాహం నిజబోధ రూపః

నేను మనుష్యడను గాను. దేవతను కాదు. యక్షుడను కాదు. బ్రాహ్మణాది చాతుర్వర్ణములకు, ఆశ్రమములకు అతీతుడనైన కేవల సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడను. ఇంకా పన్నెండు శ్లోకములలో పరమాత్మ స్వరూపము నిరూపించాడు. బ్రహ్మతత్త్వమునుకరతలామలకముగా వివరించిన కుమారుని చూచి ఆశ్చర్యపడిన శంకరుడు వారి తల్లి తండ్రులను ఒప్పించి హస్తామలకుడనే నామంతో సన్యాస దీక్ష నిచ్చారు. హస్తామలకుడు చేసిన ఈ పన్నెండు శ్లోకములకు శంకరులే స్వయంగా భాష్యం వ్రాశారు. దానికి హస్తామలకీయం అని పేరు. శిష్యుని గ్రంధమునకు గురువు భాష్యం వ్రాయడం అరుదైన విషయం. కొన్ని శంకర చరిత్రలలో శంకరులు ఆ బాలుని పూర్వ వృత్తాంతము చెప్పారని చెప్పబడింది. ఆ బాలుని తల్లి బాలుని ఒక సిద్ధునికి ఒప్పగించి యమునా నదికి స్నానమునకు పోయినదట. ఆ సిద్ధుడు అతడి బ్రహ్మ భావనలో అతడున్నాడు. పిల్లవాడు ఆడుకొంటూ యమునలో పడి చనిపోయాడు. ఈ ప్రమాదం చూసిన సిద్ధుడు తల్లి దుఃఖాన్ని పరిహరించడానికి ఆ శరీరంలో ప్రవేశించాడు. తదాదిగా ఆ శిశువు నిరంతర బ్రహ్మానుభవ మగ్నుడై యున్నారు.

శంకరులకు గిరి అనబడే బ్రహ్మచారి శుశ్రూష చేస్తూ ఉండేవారు. అతడికి గురుభక్తి తప్పితే పద్మపాదాదులంతటి ధీవిశేషము లేదు. శంకరులొక రోజు భాష్యం చెప్పబోతూ గిరి కోసం వేచి ఉన్నారు. పద్మపాదాదులు వ్యంగ్యంగా నవ్వుకొని భాష్యం గోడకు చెప్పినా గిరికి చెప్పినా ఒకటేననుకొన్నారు. శంకరులు అది గ్రహించి వస్తూనే తోటకవృత్తంలో ఎంతో మధురమైన అర్దవంతములైన ఎనిమిది శ్లోకములతో గురువుగారిని సంస్తుతించారు. ఆ కవిత్వపు పటుత్వమును లోతును చూసి పద్మపాదాదులు మహాశ్చర్యభరితులయ్యారు. ఆ శ్లోకములు తోటకాష్టకంగా మహాప్రసిద్ధములు. శంకరులు గిరికి సన్యాసమిచ్చి తోటకావృత్తాలలో తనను సంస్తుతించి నందున తోటకాచార్యులనే నామంతో పిలువసాగారు.

పై నలుగురు శిష్యులతో పాటు ప్రధానంగా చెప్పుకోదగిన వారిద్దరున్నారు. సర్వజ్ఞాత్మలు శంకరులచే సన్యాసదీక్ష అనుగ్రహింపబడినవారు. వీరికి సర్వజ్ఞత్మముని అన్న పేరున్నది. సర్వజ్ఞాత్ములు ఎనిమిది సంవత్సరములకే సన్యసించారనీ, వీరిని సురేశ్వరుల సంరక్షణలో శంకరులు కాంచీ పీఠాధిపతులను చేశారనీ వ్యాసాచరీయం చెబుతోంది. సర్వజ్ఞులు సంక్షేప శారీరకమన్న ఉద్గ్రంధాన్ని విరచించారు. పృధ్వీధములనెడి మరొక ప్రధాన శిష్యులు దక్షిణాదిన నెలకొల్పబడిన మరొక పీఠపు ఆచార్యులుగా శంకరులచే నియమింపబడినారని అనేక గ్రంధములలో ప్రస్తావించబడింది.

శంకరులు శిష్యవత్సలత చెప్పనలవి కానిది. తమను కోరిన ప్రతి ఒక్కరికీ బ్రహ్మోపదేశాన్ని వారివారి స్థితిని అనుసరించి చేశారు. వారి పర్యటనలో ఒక కుష్టువ్యాధిగ్రస్తుడాయనకు ఎదురుబడ్డాడట. అతడు సూర్యరశ్మిని చూడడానికి సమర్ధుడు కాడు. ఒళ్లంతా తెల్లబడి రక్తం కారుతూ సిగ్గుతో చితికి పోతూ శంకరుల ముందు సాష్టాంగబడ్డారు. స్వామీ! ఈ జనన మరణ ప్రవాహం నుండి నన్ను రక్షించమని ప్రార్ధించాడు. కరుణామయులైన శంకరులు అతనికి వేదాంత విద్య బడయటానికి కావలసిన అర్హతలున్నాయని నిశ్చయించుకొని ఒకే శ్లోకంలో బ్రహ్మతత్త్వాన్ని వివరించి చెప్పారు. ప్రశ్నోత్తర రూపంలో ఈ బోధ జరుగుతుంది.

కింజ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌప్రదీపాదికం

స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాభ్యాహిమే

చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం దీర్ధియోదర్శనే

కిం తత్రాహమతో భవన్‌ పరమతం జ్యోతిస్తదస్మిప్రభో

గు - వస్తు ప్రకాశక మగు జ్యోతి ఏది?

శి - పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు, దీపములు

గు - అయితే ఈ సూర్యచంద్రులను దీపములను గుర్తించే జ్యోతి ఏది?

శి - నేత్రములు

గు - కళ్లుమూసుకొన్నప్పుడు ఏది జ్యోతి అవుతోంది.

శి - బుద్ది.

గు - ఆ బుద్ధిని చూచునదేది? శి - నేను, అంటే ఆత్మే

స్వామీ! నేనూ మీరు కూడా పరంజ్యోతి స్వరూపమగు ఆత్మయే.

అన్ని వర్గాల వారిని శిష్యులుగా స్వీకరించి పరమమైన కరుణతో వారికి తగిన మార్గమును చూపి, ముక్తి త్రోవ చూపే పరమ శిష్యవత్సలత కలిగిన వారు జగద్గురు శంకర భగవత్పాదులు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page