Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

24. కామకోటి పీఠము

ఆదిశంకరుల కాలం నుండి ఈ రోజు వరకూ కంచి కామకోటి పీఠాచార్యులు అవిచ్ఛిన్నంగా యోగలింగాన్ని, శ్రీమేరువునూ అర్చిస్తూనే ఉన్నారు. వీరి ఉనికి కారణంగానే కాంచీపురంలో తరువాత కట్టిన అన్ని దేవాలయాలలోనూ శంకరుల విగ్రహాలు అనేక భంగిమలలో వారికి కంచితో ఉన్న సంబంధాన్ని వేనోళ్ళ చాటుతూ దర్శనమిస్తుంటాయి. శంకరులకు సంబంధించిన ఏ క్షేత్రంలోనూ ఇన్ని విగ్రహాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇది అప్పటి రాజులపై, ప్రజలపై కంచి పీఠాధిపతుల ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఒక్క కాంచీపురంలోనే కాదు కంచి పీఠానికి సంబంధం ఉన్న అంబి, తిరువత్తియూరు, జంబుకేశ్వరము మొదలైన అన్ని గ్రామాలలోనూ శంకరుల విగ్రహాలు పూజనందుకొంటున్నాయి. శంకరులకు కంచిపీఠానికి గల పురాతన సంబంధాన్ని ఋజువుపరచడానికి శివరహస్యము, మార్కండేయ సంహిత, అనేక శంకర విజయాలు, సర్వజ్ఞ శివేంద్రుల పుణ్యశ్లోకమంజరి, సదాశివ బ్రహ్మేంద్రుల గురు రత్నమాలిక ఇలా అనేక గ్రంధాలున్నాయి. 1935 సం|| ప్రాంతాలలో కాశీపండితులు పెద్ద సభ చేసి, తర్జనభర్జనలు జరిపి, పురాతనగ్రంధాలు, సాక్ష్యాలూ పరిశీలించి చేసిన వ్యవస్థ శంకర పీఠతత్త్వదర్శనము అనే పుస్తకంలో క్రోడీకరించబడి ఉన్నది.

మెకంజీ కలెక్షన్స్‌ అనే పుస్తకంలో శ్రీ బాబూరావు రిపోర్టులో, 10.04.1817లో అప్పటి కంచి శంకరాచార్యులవారిని కుంభకోణంలో కలిసినట్లూ వారి వద్ద 125 తామ్రశాసనాలు చూసినట్లూ, అందులో రెండు శాసనాలకు తాము నకలు వ్రాసుకొన్నట్లు ఉటంకించారు. కాంచీపురంలో వెలువడిన అనేక శంకరుల విగ్రహాలు, క్రీ|శ|| 1111 లో విజయగండ గోపాలదేవుని తామ్రశాసనము (బహుశః శంకరుల పరంపరలో వచ్చిన పీఠాధిపతులను శంకరాచార్యులని పిలిచే మొట్టమొదటి శాసనము). క్రీ|శ|| 1500 లో వీరనృసింహదేవరాయల దానశాసనము, క్రీ|శ|| 1522లోని కృష్ణదేవరాయల శాసనము, క్రీ|శ|| 1708 లో చొక్కనాథయ్యవారి శాసనము, క్రీ|శ|| 1710లోని ఢిల్లీ పాదుషా ఫర్మాన్‌, కంచి, తిరువత్తియూరు, జంబుకేశ్వరం, అంబి, చెన్నపట్నం, తంజావూరు, కుంభకోణంలోని శిలాశాసనములు, ఈ రకంగా పారంపర్యమునూ, అవిచ్ఛిన్నత్వాన్ని చాటుతున్నాయి. క్రీ|శ|| 1111లోని గండగోపాలదేవుని శాసనము అప్పటి కంచి శంకరాచార్యులవారికి అంబికాపురపు సమర్పిస్తున్నట్లు తెలియజేస్తుంది. క్రీ|శ|| 1514లో అంబికాపురపు అంబికా పటీశ్వరస్వామి దేవాలయములో అప్పటి కంచిస్వామివారయిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు కృష్ణదేవరాయల వారి ఆరోగ్యమునకై ప్రత్యేక పూజలు జరిపించవలసినదిగా ఒక శాసనం వేయించారు. అందులో అంబి గ్రామాన్ని 'మన మఠగ్రామమైన అంబి'గా వివరించారు. ఈ రోజునకూ అంబిలో శ్రీమఠానికి సేద్యపు భూమి ఉంది. కృష్ణదేవరాయల వారి చేత క్రీ|శ|| 1522 లో సమర్పించబడిన ఉదయంబాక్కంలోనూ, 1708 లో చొక్కానాథయ్యవారి చేత సమర్పింపబడిన ఏడు గ్రామాల్లోనూ ఈ రోజుకూ శ్రీమఠానికి భూములున్నాయి. పుణ్యశ్లోకమంజరిలో కంచి పీఠాధిపతులు 15వ శతాబ్దంలో నేపాలు వెళ్ళారని వ్రాశారు. ఆంగ్లేయ చరిత్రకారుడు బుహలర్‌ క్రీ|శ|| 1503లో ఒక శిలాశాసనమును అనుసరించి సోమశేఖరేంద్రులనే యతి దక్షిణదేశం నుంచి నేపాలుయాత్ర చేసినట్లు ఉన్నదని వ్రాసినదానికి ఇది సరిగ్గా సరిపోయింది. ఈ విషయం ప్రముఖ చరిత్రకారులు శ్రీ.యస్‌.నీలకంఠశాస్త్రి ప్రస్తావించారు.

శంకర పీఠదర్శనం (కాశీ విద్యావిలాస ప్రెస్‌ ప్రచురణ)లో ఓరియంటల్‌ సంస్కృత మహావిద్యాలయాధ్యక్షులయిన శ్రీపండిత మాధవ శాస్త్రి భండారిగారి వాక్యాలతో ఈ అధ్యాయం ఉపసంహరిస్తాను.

'సతిచైవం శ్రీకాంచీ కామకోటి పీఠం అనాది సిద్ధం భగవత్పాదాధి రూఢం, సురేశ్వరాచార్యాదీనామపి పరమాదర పాత్రం శిష్య పరంపరయా పరిరక్షణీయత్యేన భగవత్పాదాభిప్రేతం ప్రధాన తమ పీఠమితి నిగద వ్యాఖ్యాతమితి'

కనుక కంచి కామకోటి పీఠము అనాది సిద్ధమైనది. ఆదిశంకరులు అదిష్టించినది. సురేశ్వరులకిది పరమాదర పాత్రమైనది. శిష్య పరంపరతో పరిరక్షింప బడవలెననునదే భగవత్పాదుల అభిప్రాయము. ఇది ప్రధానతమ పీఠము. ఇదే సారాంశము.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page