Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

2. వేదాల సిద్ధాంతమే శంకరుల సిద్ధాంతం

వేదాంతము అంటే వేదముల తుది అని అర్థం. అనగా వేదాంతము వేదముల పరమ తాత్పర్యము, తీర్మానము, ఉద్దేశ్యము, లక్ష్యము అని చెప్పుకోవాలి. వేదములు మూడు విధములుగా విభజించబడినవి. మొట్టమొదటి సంహిత, దాని తరువాత బ్రాహ్మణము, అటుపై అరణ్యకములు. అరణ్యకముల చివరలో ఉపనిషత్తులు వస్తున్నాయి. ఈ ఉపనిషత్తులనే వేదాంతమని వ్యవహరిస్తున్నారు. మూడు విభాగాలలో కర్మ, ఉపాసన, విచారణ మొదలైనవి చర్చించబడినాయి. వీనికి అన్నిటికీ పరమలక్ష్యమైన మోక్షమును గురించి వివరించునవే ఉపనిషత్తులు.

ఈ ఉపనిషత్తులు నూటికి పైగా ఉన్నా, వానిలో ప్రధానమైన పది ఉపనిషత్తులకు శంకరులవారు భాష్యములు వ్రాశారు. 'ఈశ##కేన కఠ ప్రశ్న ముండక మాండూక్య తిత్తిరి, ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ'. భగత్పాదులవారు కూడా అదే వరుసలో భాష్యం వ్రాశారు. ఈ ఉపనిషత్తుల పరమతాత్పర్యము అద్వైత సిద్దాంతమని ఆచార్యులు ఉద్ఘాటించారు.

శంకర భగవత్పాదుల వారి పిదప వచ్చిన రామానుజులవారు విశిష్టాద్వైతమును, వారి పిదప వచ్చిన మధ్వాచార్యుల వారు ద్వైతమును ప్రతిపాదించారు. వీరి ప్రతిపాదనలు కూడా ఈ దశోపనిషత్తుల మీదనే ఆధారపడి ఉన్నాయి. వీరే కాక వేద ప్రామాణ్యమును అంగీకరిస్తూ, అద్వైతమును ప్రతిఘటిస్తూ ఇతర మతములను ప్రతిపాదించిన ఇతరులు కూడ ఈ దశోపనిషత్తులనే ప్రామాణ్యముగా స్వీకరించారు. వీరందరూ శంకరులు ప్రతిపాదించిన జగన్మిధ్యాత్మము దశోపనిషత్తులలో స్పష్టముగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.

ఉపనిషత్తులను పారాయణ చేయడానికి ప్రారంభంలో మనం శాంతి మంత్రములు పఠిస్తాము. దశోపనిషత్తులలో మొదటిదైన ఈశావాస్యమునకు కట్టకడపటిదైన బృహదారణ్యకమునకు పఠించే శాంత్రిమంత్రమొక్కటే. ఆ మంత్రము 'పూర్ణమదః పూర్ణమిదం' అని మొదలవుతుంది. ఈ శాంతి మంత్రము బ్రహ్మమును అదః అనీ, లోకమును ఇదం అనీ చెబుతోంది. అదః అంటే అది. ఇదం అంటే ఇది. దూరంగా ఉండేదాన్నీ 'అది' అనీ దగ్గరగా ఉండేదాన్ని 'ఇది' అనీ అంటాము కదా! బ్రహ్మపదార్ధము మనకు ఎక్కడో దూరంగా ఉన్నట్లు తోస్తుంది. ఈ లోకం మనకు ఎంతో దగ్గరగా ఉన్నట్లు తోస్తుంది. ఇది ఇప్పటి మన పరిస్థితి.

లోకంలో ఎన్నో జీవులున్నవి. జగత్తు అనేది ఒకటి ఉన్నది. ఈ జీవజగత్తులను సృష్టించి పరిపాలించే ఈశ్వరుడున్నాడు. జగజ్జీవేశ్వరులనే పరిభాష ఉన్నది. లోకంలో జీవులన్నీ సుఖదుఃఖముల మధ్య పెనుగులాడుతున్నారు. శాశ్వత సుఖం కావాలంటే జీవుడు చేయవలసిన కార్యమేమి? ఈ విషయంలో ఉపనిషత్తులు చేసే బోధ ఎటువంటిది?

జీవజగత్తులకు కారణము పరమ వస్తువైన బ్రహ్మము. అకారణమైన బ్రహ్మవస్తువు జీవజగత్తు కంటే వేరయినది కాదు. బ్రహ్మము కానిది వేరొకటి ఉండజాలదు కాబట్టి ఈ జగత్తు నిజమనుకొంటున్న జీవాత్మ, దానిని ఒక ప్రక్కన పెట్టి తానెవరు అని విచారణ చేసినట్లయితే, దేహము నేను కాను, ఇంద్రియములు నేను కాను, బుద్ధి నేను కాను, ప్రాణము నేను కాను అని ఒక్కొక్క ఆవరణను దాటి నేను బ్రహ్మను అనే నిశ్చయజ్ఞానానికి వస్తుంది. పరమాత్మ జీవాత్మ అన్న విభజన కూడా ఒక రకమైన మాయయే. వాస్తవముగ ఉన్నది ఒక్క పరమాత్మ మాత్రమే. 'సత్యమొక్కటే అది అద్వితీయము' అన్న జ్ఞానమొక్కటే జీవులకు శాశ్వతానందము నీయగలదు. మనకు కనబడే విస్తారమైన వస్తు ప్రపంచమంతయూ ఒక్కటేనన్న జ్ఞానదృష్టి కలిగినంతనే శాంతి, ఆనందము సిద్ధిస్తాయి. ఉపనిషత్తులు ఉపదేశించే సత్యమిదే!

ఉపనిషత్తుల పరమ తాత్పర్యము అద్వైతము అని చెబితే మరి ద్వైతవిశిష్టాద్వైతములకు చెందిన ఆచార్యులు కూడా అదే ఉపనిషత్తులను తమ సిద్దాంతములకు ప్రాతిపదికగా చెప్పుకొన్నారు కదా! ఆ రకమైన అర్థాన్ని చెపుతూ ఉపనిషత్తులకు భాష్యాలు కూడా వ్రాశారు కదా! మరి ఉపనిషత్తుల నిశ్చతార్ధము అద్వైతమే అని చెప్పడం ఎలా పొసుగుతుంది అనే సందేహం కలుగవచ్చును. అద్వైతము ప్రాధమిక దశలో ద్వైత, విశిష్టాద్వైతములను అంగీకరిస్తుందనే విషయం గ్రహించినట్లయితే ఈ సందేహమునకు ఆస్కారము ఉండదు. ఉపనిషత్తులు ఎన్నో విషయాలను చర్చిస్తున్నాయి. ఒకచోట పరమాత్మవేరు, జీవాత్మ వేరు, ప్రపంచము వేరు - అనీ, మరోచోట - నేను అనే ప్రాణశక్తి జీవాత్మ అనీ, వేరొకచోట - ఆ ప్రాణమునకు ప్రాణముగనున్నది పరమాత్మ అనీ, అది పరిపూర్ణమనీ, సర్వాంతర్యామియనీ, ఇంకొకచోట - ఈ రెండూ ఒక్కటేననీ, పలువిధములుగా చెప్పబడి ఉన్నది. అద్వైతము పరమాత్మయే సర్వాత్ముడుగా ఉన్నాడని చెబుతుంది. విశిష్టాద్వైతము పరమాత్మ అంతర్యామిగా దేహములో ప్రాణమువలె ఉన్నాడని తీర్మానం చేస్తుంది. వీటిని అన్నిటినీ సమన్వయము చేసే వాక్యములను ఘటిక వాక్యములంటారు. ఈ ఘటికవాక్యముల వలన ఉపనిషత్తులు పరస్పర విరుద్దములయిన విషయములు చెప్పలేదని నిరూపితమవుతోంది.

ఉపనిషత్తులు అయమాత్మాబ్రహ్మ-సర్వం ఖల్విదంబ్రహ్మ-అహం బ్రహ్మాస్మి- తత్త్వమసి మొదలైన మహావాక్యముల ద్వారా జీవబ్రహ్మైక్యమును సుస్పష్టముగా ఘోషించినప్పటికీ, ఇతరులు, వారి సిద్దాంతమునకు అనుగుణముగా పదచ్ఛేదము చేసి, విపరీతార్థములను కల్పించుతున్నారు. అద్వైతికి ద్వైత విశిష్టాద్వైతస్ఫోరకమైన వాక్యములతో విరోధము లేదు. అతనికి సాధనావస్థలో ద్వైతవిశిష్టాద్వైతములు వాస్తవమే. పరమార్ధములో మాత్రము అద్వైతమే కడపటి మెట్టు అని చెబుతున్నాడు. నిజానికి జీవాత్మపరమాత్మలని రెండు విభిన్నమయిన ఆత్మలు లేవు. ఉన్నదొక ఆత్మ మాత్రమే.

మాండూక్యము ప్రణవము గురించి చెప్పినప్పుడు సర్వమూ ఓంకారమేననీ, జాగ్రత్స్వప్న సుషుప్త్యావస్థలను దాటి ప్రపంచము ఉపశమించిన పిదప ఉన్న స్థితి శివమనీ, శాంతమనీ, అద్వైతమనీ, ఆత్మ అనీ తెలుసుకోవలసినది అదేననీ, ఆత్మసాక్షాత్కారమే అద్వైతమనీ ఉద్ఘాటిస్తున్నది. మోక్షమంటే అభయస్థితి. అచ్చట భయమంటే మనము మోక్షమునకై ప్రయత్నము చేయవలసిన అనే ద్వైతమున్నది. రెండు లేని స్థితి వారు చెప్పడం లేదు. ఉపనిషత్తులలో 'ద్వితీయాద్వైభయం భవతి' అని చెప్పుచున్నవి. భగవంతుడు మనకు అన్యమన్న భావమున్నప్పుడు ఈ భావములు తప్పవు. అందుచేత భగవంతుడే మనమై - రెండు లేని స్థితిలో - అద్వైతస్థితిని అందుకొంటే కానీ నిజమైన మోక్షము లేదు. బృహదారణ్యకోపనిషత్తులో - ఎవరైతే తనకంటే అన్యమైన దేవతలను ఉపాసించునో, తాను వేరు, భగవంతుడు వేరు అని భావించునో అతడు తెలియనివాడు. అతడు ఆ దేవతలకు పశువుతో సమానుడు - అని చెప్పబడింది. అద్వైతములో భగవంతుడు, భక్తుడు, దేవత, ఉపాసకుడు అన్న బేధము లేదు.

జీవేశ్వరులకే భేదములేదనీ, ఉన్నది ఒక్కటే, అది పరమాత్మ అనీ ఉపనిషత్తులు చెబుతుంటే ఆ ఉపనిషత్తులనే ప్రమాణంగా చూపి శైవవైష్ణవ భేదము కూడా చూపుతున్నారు. దశోపనిషత్తులలో శివవిష్ణు పద ప్రయోగములు రెండుచోట్ల కనబడుతున్నాయి. శివశబ్దము మండూక్యములో ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం చతుర్ధం మన్యంతే - అన్న వాక్యములోనూ, కఠోపనిషత్తులో - సో2ధ్యానపారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం - అన్న వాక్యంలో విష్ణు శబ్దము కన్పిస్తున్నాయి. ఈ పదములు దేవతామూర్తులని అద్వైతేతరులు అభిప్రాయబడుతున్నారు. నిజానికి ఈ పదములు అనుభూతిసూచకములే కానీ, దేవతామూర్తులు కాదు. ఈ పదాలను ఉటంకించి శివుడధికుడనీ కొంతమందీ, విష్ణువే అధికుడని సిద్దాంతం చేయ ప్రయత్నిస్తున్నారు. శివమనగా శాంతమైన తురీయ స్థితి. వైష్ణవపదమునకు సర్వవ్యాపక, పరమ పదస్థితి అని అర్ధము. అంటే పరమోత్కృష్టమయిన స్థితి. రెండు పదములూ సత్యవస్తు బోధరకములు. అద్వైతస్థితిని వివరించే పదములు. దేవతామూర్తులు కాదు. ఉపనిషత్తులను కూలంకుషంగా పరిశీలిస్తే, శంకరులు చెప్పిన 'బ్రహ్మసత్యం, జగన్మిధ్య, జీవో బ్రహ్మైవనాపరః' అనునదే ఉపనిషణ్మతమని రూఢి అవుతుంది. వేదముల పరమ తాత్పర్యమదే!

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page