Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

4. జగన్మిథ్యావాదం

ఈ ప్రపంచం నిజం కాదు. ఇది అబద్ధం అని కొందరు అంటారు. ఈ లోకంలో ఎన్నో జీవరాశులున్నవి. మనం ఎన్నో కార్యాలు చేస్తున్నాం. దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాము. మరి ఈ కనిపించే ప్రపంచం నిజం కాదు. ఇది మాయ అని ఎలా చెప్పడం? అని మరి కొందరు ఆక్షేపిస్తారు.

శ్రీ శంకరభగవత్పాదులవారు ఈ లోకం నిజం కాదు అన్నారంటే, ఈ లోకం అసత్యమన్నారని మనం తప్పుగా అర్థం చేసుకోరాదు. ఆచార్యులవారు సత్యం, అసత్యం, మిథ్య అన్న మూడు విభజనలు చేశారు. సత్యమంటే వారి ఉద్దేశ్యంలో ఆత్మ ఒక్కటే. దానినే మనం 'బ్రహ్మ' అని వ్యవహరిస్తున్నాము. ఒకే వస్తువు (సత్యము) జీవునకు ఆధారముగా ఉంటే 'ఆత్మ' అనీ, సమస్త జీవరాశులకూ, సమస్తమైన ప్రపంచమునకూ ఆధారమైనప్పుడు 'బ్రహ్మ'మనీ అంటున్నాము. ఆ వస్తువుకు ఏ కాలములోనూ మార్పు ఉండదు. అదే సత్యము.

కానీ లోకంలో ఎన్నో మార్పులు చూస్తున్నాము. మనలోనూ అనేక మార్పులు కలుగుతూనే ఉన్నాయి. మన మనస్సులోని ఆలోచనలు కూడా క్షణక్షణమూ పరిణామం చెందుతూనే ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఆచార్యులవారు దీనికి సత్యమనే నిర్వచనాన్ని ఈయజాలరు.

'అసత్య'మనే పదంలో వ్యతిరేకార్ధద్యోతకమైన 'అ' కారమున్నది. ఈ లోకం 'అసత్యం' అంటే - ఈ లోకం 'సమూలంగా లేదు' అన్న అర్థం చెప్పవలసి వస్తుంది. కానీ ఆచార్యులవారు అలా చెప్పలేదు. ఈ జగత్తు 'మిథ్య' అని చెప్పారు. మిథ్య అంటే అసత్యం కాదు. మిథ్యలో శాశ్వత సత్యం కూడా లేదు. మిథ్య సత్యమునకు, అసత్యమునకు మధ్యలోని స్థితి.

భగవత్పాదులవారు సత్యమును పారమార్ధిక సత్యము, వ్యావహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యము అని మూడు విధాలుగా విభజించారు. ఈ మూడింటిలోనికి చేరనిది అసత్యమన్నారు. ఈ మూడింటిలో పారమార్థిక సత్యము ఒక్కటే శాశ్వతమైన సత్యము. అది బ్రహ్మస్వరూపము.

లోకరీతిలో మనము దేనిని నిజము అవి భావిస్తున్నామో అది వ్యావహారిక సత్యము. తగరపు రేకుతో చేసిన చిన్న డబ్బా మూత క్రిందపడి ఉందనుకోండి. దానిని మనము రూపాయి నాణమనుకొంటాము. అది అప్పటికి వ్యావహారిక సత్యము. కొంతసేపు అది అలా కనబడుతోంది. నిజం తెలిసే సరికి రూపాయి నాణము మాయమవుతుంది. స్వప్నము కూడా అంతే! అసత్యమంటే త్రికాలములలోనూ లేనిది. కుందేటి కొమ్ము (శశవిషాణము), గొడ్రాలి బిడ్డ (వంధ్యా పుత్రుడు) అలాంటివి. దీనినే యోగశాస్త్రము 'వికల్పము' అని చెబుతుంది.

'శబ్ద జ్ఞానానుపాతీ వస్తు శూన్యో వికల్పః'

వస్తురహితమై శబ్దజ్ఞానము కలిగిన తరువాత కలుగు చిత్తవృత్తి వికల్పము. వంధ్యాపుత్రుడనేది శబ్దమాత్రము. అట్టి వ్యక్తిని మనము చూడలేము. ఈ అసత్యమును అత్యంత అసత్యమనీ, తుచ్ఛమనీ చెబుతారు. ఒక తాడును మసక చీకటిలో పామని భ్రమిస్తున్నాము. అది తాత్కాలికంగా పాముగా కనబడుతుంది. కొంచెం పరిశీలించి చూచామంటే దాని స్వరూపము అవగతమవుతుంది. దీనినే ప్రాతిభాసిక సత్యము అంటారు.

వ్యావహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యము మనకు నిజమైన ఎఱుక కలుగగానే కల్ల అగునవి. వేదాంతము ఇట్టి కల్లను మిథ్యయని పేర్కొంటుంది. వ్యావహారిక సత్యమని మనము చెప్పే ఈ లోకము, మనకు జ్ఞానదృష్టి కలుగగానే ప్రాతిభాసిక సత్యంగా మారిపోతుందని ఆచార్యులవారంటున్నారు. భాసము అనగా వెలుగు. ప్రాతిభాసము అనగా ప్రతిఫలించే వెలుగు. ఈ లోకము కూడా బ్రహ్మచైతన్యములో ప్రతిఫలించే ఒక వెలుగు మాత్రమే. ఇది పూర్తిగా కల్ల కాదు. పూర్తిగా కల్పనా కాదు. త్రాటిని చూసి పాముగా భ్రమసినప్పుడు మన దేహం భయంతో కంపిస్తుంది. వస్తుజ్ఞానమేర్పడగానే మనకు కలిగిన భ్రమనివృత్తి అవుతున్నది.

ఇలా ఒక వస్తువును చూచి మరొక వస్తువనుకోవడమే మాయ. తాడుని చూచి పామని ఎలా భ్రమిస్తున్నామో అలాగే మాయాశక్తి వలన బ్రహ్మము మనకు ప్రపంచముగా కనబడుతున్నది. ఈ లోకమే పరమసత్యమని భావిస్తున్నాము. మనకు జ్ఞాననిష్ఠ కలిగినప్పుడు, దేనిని చూచి మనము నిజమనుకొన్నామో ఆ భ్రమ తొలగి వ్యావహారిక సత్యమైన లోకము అద్వైత సమాధిస్థితిలో ప్రాతిభాసిక సత్యముగా మారిపోతున్నది. ఈ వ్యావహారిక ప్రాతిభాసిక సత్యములకు వేరుగా సత్యతరమని వేరొకటున్నది. అది సార్వకాలిక సత్యమైన బ్రహ్మము. త్రికాలాబాధ్యము. వ్యావహారిక, ప్రాతిభాసిక సత్యములలో సత్యాంశము కొంత, అసత్యాంశము కొంత ఉన్నది. అందుచే అవి మిథ్య. అవి ఒకానొక కాలములో ఉన్నట్లు కనిపించి వేరొక కాలములో మాయమగునవి.

మనము ఎటువంటి వారము? మన దేహము కొంతకాలము ముందు లేదు. మరి కొంతకాలము గడిచిన పిమ్మట ఉండబోదు. అందుచే ఇది సత్యము కాదు. కొంతకాలము ఉండటం చేత అసత్యము కూడా కాదు. పూర్ణసత్యమైతే ఈ దేహము నాశరహితంగా ఉండాలి. ఇది ఆలుచిప్పలోని వెండివంటిది. ఆలుచిప్పలోని వెండి సత్యమా?

త్రాటిని చూచి పామనుకొన్నప్పుడు అది పాము అని భ్రాంతి కలుగుటకు ఆధారము తాడు అయి ఉంది. ఇలాగే మిథ్యా జగత్తుకు ఆధారముగానున్నది. బ్రహ్మము. లోకభ్రాంతి పోయినచో పామనే భ్రాంతి పోయినప్పుడు తాడు మిగిలినట్లు లోకమునకు ఆధారమైన బ్రహ్మము మిగులుతుంది. దానిని శూన్యమని చెప్పకూడదు.

సత్యవస్తువైన బ్రహ్మమును మిథ్యాప్రపంచమువలె కనిపింపచేయునదే మాయ. ఆచార్యులవారు మాయ అనిర్వచనీయమని చెప్పారు. దానిని సత్తు అనికానీ అసత్తు అని కానీ చెప్పలేము. ఉన్నదని కానీ, ఏదని కానీ చెప్పలేము. ఒకప్పుడు ఉండి జ్ఞానము కలుగగనే మాయమయి పోతుంది. ఇది సదసద్విలక్షణము.

పరమాత్మ కంటే భిన్నమయినది వేరొకటి ఉండదు కాబట్టి మాయ పరమాత్మ కంటే భిన్నమయినదని చెప్పడానికి వీలు లేదు. జ్ఞానోపలబ్ధి కాగానే మాయ మాయమైపోతుంది కాబట్టి ఇది పరమాత్మ అని చెప్పడానికీ వీలు లేదు. బౌద్దులు చెప్పే శూన్యమూ కాదు. పారమార్థిక సత్యమూ కాదు. అందుచే అది అనిర్వచనీయము.

మనిషికి రజ్జు జ్ఞానము కలగగానే సర్పభ్రాంతి విడిపోతున్నది. రజ్జువు (తాడు) అధిష్టానము. సర్పము ఆరోప్యము, అధిష్టానము మనకు సాక్షాత్కారమైనపుడు ఆరోప్యము తొలగిపోతుంది. దేని యందు మనము సూర్యచంద్రాదులు, పంచ భూతములు, ప్రపంచము మొదలైన వానిని ఆరోపించుకున్నమో అట్టి అధిష్టానమైన బ్రహ్మవస్తువు, సత్య వస్తువు దర్శనమైనప్పుడు ఈ మిథ్యా ప్రపంచమంతా మరిగిపోతుంది. అట్టి స్థితిలో ప్రపంచమూ మనమూ అంతా మిథ్యే.

ఆచార్యులవారు చెప్పినదిదే. వ్యావహారదశలో లోకము నిజమే. జ్ఞానదశలో లోకము మిథ్యయనివారన్నారు. ఈ విషయాన్ని మనం గ్రహిస్తే, ఈ లోకాన్ని మిథ్య అని చెప్పారని ఆచార్యులవారిని విమర్శించే వారి వాదము నిరర్థకమని తెలుసుకోగలము. అపుడే మనకు బ్రహ్మసత్యం, జగన్మిథ్య అన్న ఆచార్యులవారి వచనము సరియైన విధంగా అవగాహన కాగలదు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page