Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

6. ఆవిర్భావము

శంకరచరిత్రను వ్రాసిన దరిదాపు అన్ని గ్రంథములు శంకరుల జననము నందన నామ సంవత్సర వైశాఖ శుక్లపంచమీ ఆర్ద్రానక్షత్రం నాడు కేరళలోని కాలడి గ్రామంలో జరిగిందని చెబుతున్నాయి. వారి చరిత్ర ప్రస్తావించిన గ్రంథములలో పురాతనములైన శివరహస్యము, బ్రహ్మాండపురాణాంతర్గత మార్గండేయ సంహిత కూడా ఈ విషయాన్ని వివరిస్తున్నాయి.

కాలడి గ్రామంలో చూర్ణానది ఒడ్డున విద్యాధిరాజు అని పేరున్న సంపన్న వేదశాస్త్రపారంగతులొకరుండేవారు. వారి ఏకైక సంతానమైన శివగురువు తండ్రికి తగ్గ తనయుడు. అతడికి ఆర్యాంబ అనే పేరుగల మంచి సంప్రదాయమునకు చెందిన బాలికతో వివాహము జరిగింది. శివగురువుకు చాలా కాలం సంతానం కలుగలేదు. సమస్త ఐశ్వర్యములు, విద్యా కలిగి ఉన్నా సంతానం లేని కొఱత వారిని అమితంగా బాధించింది.

కాలడి సమీపంలో త్రిచూరులో వృషాంచలేశ్వరస్వామి దేవాలయమున్నది. అక్కడి స్వామికి నేతితో అభిషేకం జరుగుతుంది. వేలాది సంవత్సరములుగా ఉన్న ఆ దేవాలయంలో ఈనాటికి అత్యంత పురాతనమైన నెయ్యి కావాలసిన ఆయుర్వేద వైద్యులు అక్కడికి వెళుతుంటారు. ఆ స్వామికి వడకనాధస్వామి అన్న నామాంతరం కూడా ఉంది. ఆ దేవాలయమునకు చేరిన ఆర్యాంబ, శివగురువులు సంతానార్ధమై నియమములతో తపస్సు నారంభించారు. తీవ్రతపశ్చర్యానంతరము స్వామి శివగురువుకు కలలో దర్శనమిచ్చారు. ఆయన శివగురువుకు దీర్ఘాయుస్సువులు, మందమతులు అయిన నూర్గురు కొడుకులు కావాలా? అల్పాయుష్కుడు, సర్వజ్ఞుడు అయిన పుత్రుడు కావాలా కోరుకోమన్నారు. స్వప్నం చెదిరిపోయింది.

మేల్కాంచిన శివగురువు ఆర్యాంబతో సంప్రదించారు. ఎటూ తేల్చుకోలేక స్వామి రెంటిలో ఏదిమంచిదయితే అది ప్రసాదించమని ప్రార్థించారు. ప్రసన్నత పొందిన స్వామి శివగురువుకు తానే అతనికి పుత్రునిగా జన్మిస్తానని ఆనతి ఇచ్చారు. ఆర్యాంబ శివగురు దంపతులు అమందానందంలో మిగతా పూజలు ముగించుకొని కాలడి గ్రామం చేరారు. శంకరులు వైశాఖ శుక్ల పంచమినాడు జన్మించారు. కేరళలో పుట్టిన తిథిని అనుసరించి నామకరణం చేసే ఆచారమున్నది. శంకర అన్న పదము కటపయాది సంఖ్యవిధానంలో 5, 1, 2 అంకెలను సూచిస్తాయి. అంటే పంచమి శుక్లపక్షము వైశాఖమాసము అన్న అర్దమును స్పురింపచేస్తాయి. వసంత కాలంలో పుట్టిన తిథి, దానిబట్టి నిర్ణయించబడిన పేరు వారి అవతారోద్దేశ్యాన్ని తెలియజేస్తున్నాయి. శంకర అనే పదానికి శాంతి ప్రసాదించే వారు, మంగళాన్ని చేకూర్చేవారు అని అర్ధముంది.

శివగురు ఆర్యాంబా దంపతులు లేక లేక కలిగిన కుమారిని అల్లారుముద్దుగా పెంచుకోసాగారని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు కదా! శైశవస్థితిలోనే శంకరుల అసమానమైన ప్రతిభ బయల్వడ సాగింది. మూడేండ్లకే వారు అతి మనోహరమైన శైలిలో దేవీ భుజంగస్తోత్రం వ్రాశారట. శివగురువులకు శంకరుల ప్రతిభను స్వయంగా చూసే అదృష్టం పట్టలేదు. వారి నాల్గవ ఏటనే శివగురువు పరమపదించారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page