Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

పండ్రెడవయధ్యాయము -

గండశైలోకావలోకనము

జగత్తుయొక్క తత్త్వమును విని భార్గవరాముఁడు ఇంకను సందేహములు కలవాఁడై ఇట్లు ప్రశ్నించెను. ''భగవానుఁడా! జగత్తునుగూర్చి నీవుచెప్పినది నిజమే. అయినను ఇది ఎల్లప్పుడును సత్యముగా ఎందులకు గోచరించుచున్నది? నేనే కాదు. బుద్ధిమంతులైన యితరులు కూడ దీనిని సత్యమునుగా ఎందులకు నిశ్చయించుచున్నారు? ఇది అసత్యమని నీవలన ఇంతగా విన్నప్పటికిని ఇంకను నాకు ఈజగత్తు సత్యమువలె ఎందులకు తోఁచుచున్నది? ఈభ్రమ నశించునట్లుగా నాకు దయతో బోధింపుము.''

దత్తాత్రేయుఁడు ఇట్లు చెప్పెను. ''భార్గవా! ఈజగత్తు సత్యమను భ్రాంతి సనాతనము. దీనికి మూలము ఆవిద్య, అది అనాది. ఉన్నదానికి ఉన్నట్లు గ్రహింపక విరుద్ధముగా గ్రహించుటయే అవిద్య. దానివలన ఉన్న చిదాత్మను గ్రహింపక లేని జగత్తుని ఉన్నట్లుగా దృఢముగా భావించుచుండుటయే ఈభ్రాంతికి మూలము. ఆత్మను తెలిసికొనక మానవులు శరీరమే ఆత్మ అని తలంచుచున్నారు గదా! రక్తమాంసములు ముద్దయైన శరీర మెక్కడ? అత్యంతనిర్మలమైన చిదాత్మ ఎక్కడ; ఆత్మ చిద్రూపము నిర్మలము అని తెలిసినప్పటికిని కేవలమైన భావనయొక్క దృఢత్వముచేతనే ఇంకను ఆత్మ శరీరముగానే కన్పించుచున్నది. ఇట్లే భావనవల్లనే జగత్తు కూడ సత్యముగా తోఁచుచున్నది. దీనిని నివారించుటకు ఒక్కటే ఉపాయము కలదు. ఇప్పుడ చేయుచున్న భావనకు విరుద్దముగా , 'ఈజగత్తు సత్యము కాదు; ఆత్మయే సత్యము' అని దృఢముగా భావించుచున్నచో ఈభ్రాంతి నశించును. ఈజగత్తునుగూర్చి ఎవఁడు ఎట్లు భావించుచున్నాఁడో వానికి అట్లే గోచరించును. ఇది యెగులకు వారి ధ్యానధారణముల ననుసరించియే కదా గోచరించుచున్నది. ఈవిషయమున అద్భుతమైన కథను చెప్పెదను వినుము.

వంగదేశమున సుందర మనుపేరుగల పురము గలదు. అది పరమపావనము. అందు సుషేణుఁడు అను ధీమంతుఁడైన రాజు ఉండెను. ఆతనికి మహాసేనుఁడను ప్రియుఁడైన తమ్ముఁ డుండెను. ఆయన ధర్మబద్ధముగా పాలించుచు అశ్వమేధములతో మహేశ్వరుని అర్చించెను. అప్పుడు మహాబలపరాక్రమశాలులైన రాజుకుమారులు పెద్దసైన్యముతో యజ్ఞాశ్వమువెంట పోయిరి. వారు అశ్వమును అడ్డగించినవారిని జయించుచు ఐరావతీనదీతీరమునకు చేరిరి. అచ్చట వారు తపోనిధియైన తంగణుఁడు అను రాజర్షిని చూచిరి. వారు గర్వముతో ఆయనను దర్శింపక ముందుకు పోఁజొచ్చిరి. వారు అట్లు తనతండ్రిని అవమానించుటను చూచి తంగణునిపుత్రుఁడు వారిని బెదిరించుచు అశ్వమును పట్టుకొనెను. ఆరాజకుమారు లందఱును వానిని చుట్టుముట్టిరి. అప్పుడ డతఁడు వారందఱు చూచుచుండఁగా ఎదుట నున్న గండశైలములోనికి గుఱ్ఱముతో కూడ ప్రవేశించెను. వారు ఆగండశైలమును ఆయుధములతో పగులఁగొట్టిరి. అది పగిలినంతనే దానిలో నుండి ఆఋషి కుమారుఁడు మహాసేనతో వెలువడి వారి నందఱును క్షణములో జయించెను. పిదప అతఁడు సుషేణునిసైన్యమును సంహరించి రాజకుమారులను బంధించి మరల గండశైలమునఁ ప్రవేశించెను.

హతుశేషులై నభటులు నగరమునకు పోయి జరిగిన వృత్తాంతమును సుషేణునకు నివేదించిరి. ఆయన ఆశ్చర్యము నొంది తమ్మునిచూచి యిట్లనెను. ''వత్సా! తంగణమునియున్నచోటికి వెంటనే పొమ్ము. తపస్వులశక్తి మనయూహలకు అందదు. వారిని దేవతలు కూడ జయింపఁజాలరు. కావున ఆమునిని ప్రార్థించి కుమారులను అశ్వమును సత్వరముగా తీసికొనిరమ్ము. యజ్ఞమునకు యోగ్యమైన యీవసంతబుతువు దాటిపోకుండ వెంటనే తిరిగిరమ్ము. తాపసులవిషయమున ఎప్పుడును అభిమానమును పూనరాదు. వారు కోపించినచో ఈలోకములను క్షణములో భస్మము కావింపఁగలరు. కావున ఎట్లయినను ఆయనను ప్రసన్నుని గావంచుకొని మనకార్యమును సాధింపుము.'' వెంటనే మహిసేనుఁడు బయలుదేరి తంగణమునియున్న చోటికి వచ్చెను. ఆయన నిర్వికల్ప సమాధియందు నిశ్చలుఁడై యుండెను. మహాసేనుఁడు సాష్టాంగముగ ప్రణమిల్లి లేచి చేతుల జోడించి ఆమునీశ్వరుని అనేకవిధముల స్తుతింపఁజొచ్చెను. అట్లు మూఁడుదినములు గడచెను. ఆస్తుతులకు సంతోషించి తంగణునిపుత్రుఁడు అచ్చటికి వచ్చి మహాసేనునితో ఇట్లనెను. 'రాజా! నీస్తవమువలన నేను సంతోషించితిని, నీకోరిక ఏమె చెప్పుము. వెంటనే తీర్చెదను. నేను ఈతంగణమహాముని కుమారుఁడను. ఇప్పుడు మాతండ్రిగారు మాటాడరు. ఆయన పండ్రెండేండ్లదీక్షతో సమాధి నొందియున్నారు. ఇప్పటికి అయిదేండ్లు మాత్రమే గడచినవి. కావున నీవాంఛిత మేమో చెప్పుము. నేను తపసునందు మాతండ్రిగారితో సమానుఁడను. నన్ను బాలునిగా తలంపకుము. యోగులకు తపస్వులకు లోకమున అసాధ్య మేదియునులేదు.'' ఆమాటలు విని మహాసేనుఁడు అతనికి ప్రణమిల్లి కృతాంజలియై ఇట్లే పలికెను. ''మునికుమారా! నీవు నిజముగా నాకోరికను నెరవేర్చెద వేని మీతండ్రిగారిని సమాధినుండి మేల్కొలుపుము. నేను ఆయనతో మాటాడఁగోరుచున్నాను. ఇదియే నాకు అత్యంత ఇష్టము. నీవు నా యందు దయఁజూపుదువేని ఈకార్యమును త్వరగా సాధింపుము.'' అప్పుడు ఆమునిపుత్రఁడు ఇట్లనెను. ''రాజా! నీకోరిక అసాధ్యము అయినను నీకోరికను తీర్చెద నని ప్రతిజ్ఞజేసి నేను మాఱుమాట ఎట్లు చెప్పఁగలను? దయచేసి ముహూర్తమాత్రము వేచియుండుము. యోగముయొక్క సామర్థ్యమెట్టిదో చూడుము. మాతండ్రిగారు పరమ పావనమైన శాంతిస్థితియం దున్నారు. బాహ్యయత్నములతో వారిని ఎవరు మేల్కొల్పఁగలరు? నేను సూక్ష్మమైన యోగము యొక్క ఉపాయముచేత ఆయనను మేల్కొల్పుదును,''

ఇట్లు పలికి ఆమునికుమారుఁడు కూర్చుండి ప్రాణమునందు అపానమును ఏకమొనర్చి అహంకారాత్మకమైన యంతఃకరణముతో శరీరమునుండి వెలికివచ్చి తండ్రియొక్క శరీరమున ప్రవేశించి ఆత్మయందు లీనమైనయున్న యాయనయొక్క మనస్సును ఆకర్షించి మేల్కొలిపి వెంటనేతిరిగివచ్చి తనశరీరమున ప్రేవేశించెను. ఇంతలో తంగణమహాముని బాహ్యస్మృతి నొంది ఎదుట స్తోత్రము చేయుచు ప్రణమిల్లియున్న మహాసేనుని చూచెను. 'ఇదియేమి' అని ఆయన యోగదృష్టితో జరిగినదానిని తెలిసికొని ప్రసన్నచిత్తుఁడై కుమారునితో నిట్లనెను. ''వత్సా! నీవు మరల ఇట్లు చేయకుము. క్రోధము తపస్యునకు శత్రువు. రాజులు చక్కఁగా ప్రజలను రక్షించినప్పుడే తపస్సు కూడ వర్థిల్లును. యజ్ఞమునకు విఘ్నము చేయుట దైత్యుల లక్షణము. మునులకు ఇది తగదు. నీవు మంచిమనస్సుతో అశ్వమును రాజు కుమారులను ఇతనికి అర్పింపుము. త్వరపడుము. లేకున్నచో యజ్ఞమునకు యోగ్యమైనకాలము అతిక్రమించును.'' వెంటనే ఆమునికుమారుఁడు క్షణములో గండశైలములోనికి పోయి గుఱ్ఱమును రాజపుత్రులను తీసికొనివచ్చి ప్రీతితో మహాసేనునకు అప్పగించెను.

మహాసేనుఁడు ఆశ్చర్యపడి రాజపుత్రులను అశ్వముతో నగరమునకు పంపి తంగణునకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించెను. ''భగవానుఁడా! అశ్వముతో కూడ మాయన్నకుమారులు గండశైలములోపల ఎట్లుండిరి? దయతో చెప్పుము.'' తంగణుఁడు ఇట్లు చెప్పెను. ''రాజా! నేను కూడ పూర్వము రాజుగా నుండి భూమియంతయును చిరకాలము పాలించితిని. పిదప మహాదేవుని యనుగ్రహముచేత చితిరూపమైన త్రిపురామహేశ్వరిని తెలిసికొని రసహీనమైన యీ లోకవ్యవహారమును విమర్శించి విరక్తుఁడనై రాజ్యమును కుమారులకు అప్పగించి భార్యతో కూడ ఈవనమునకు వచ్చితిని. ఇచ్చట నేను తపస్సు చేయుచుండఁగా పదికోట్ల సంవత్సరములు గడచెను. నన్ను సేవించుచు నాభార్య కూడ పరమసిద్ధిని పొందెను. విధివశమున ఒకనాఁడు ఆమె సమాధియందే కామముచేత పీడితురాలయ్యెను. ఆమె సమాధిని వీడి గాఢసమాధియందున్న నన్నుజూచి కామవేగమును భరింపఁజాలక నాతో రమించునట్లే భావించెను. గాఢమైన భావనచేత ఆమె నాతో సంభోగమునుపొంది గర్భమును ధరించి ఈకుమారుని కనెను వీనిని నాయొడియందుంచి నన్ను సమాధినుండి మేల్కొలిపి దేహమును పంచభూతములయందు లీనముగావించి పరమాత్మత్వమును పొందెను. పిదప నేను ఒడియందున్న వీనిని జూచి ఆమె పరమగతిని పొందిన దని గ్రహించి వీనిని పెంచితిని. వీఁడు ఒకసారి నేను పూర్వము రాజ్యపాలనము చేసియుంటినని విని తానుకూడ రాజ్యమును పాలింపవలయును నని ప్రార్థించెను. తరువాత వీఁడు నావలన ఉపదేశమును పొంది ఉత్తమమైన యోగసమృద్ధిని సాధించి భావనాయుగమువలన ఈమహాశైలమునందు ఒకలోకమును నిర్మించి అందు సముద్రపర్యంతమైన పృథివిని ప్రతిదినము పాలించుచున్నాఁడు. ఆలోకమునందే మీగుఱ్ఱము రాజపుత్రులు బంధింపఁబడి తరువాత వదిలిపెట్టఁబడినారు.''

ఇది విని మహాసేనుఁడు ఆశ్చర్యము నొంది ఆలోకమును చూడఁగోరెను. ఆతనికి ఆలోకమును చూపు మని కుమారునకు అదేశించి తంగణుఁడు మరల సమాధియందు ప్రవేశించెను. మునికుమారుఁడు అతనిని గైకొని గండశైలమునొద్దకు పోయి తాను అందు ప్రవేశించి మహాసేనును రమ్మని పిలిచెను. మహాసేనుండు అందు ప్రవేశింపలేకపోయెను. అప్పుడు మునికుమారుఁడు వెలుపలికి వచ్చి యిట్లనెను. ''యోగులుకానివారు ఇందు ప్రవేశించుట అసాధ్యము. యోగశక్తి లేకున్నచో ఈగండశైలము పెద్ద ప్రతిబంధక మగును. గడ్డిచేత కప్పఁబడియున్న యీబిలమునందు నీస్థూలశరీరమును వదలి మనోమాత్రశరీరుఁడవై నాతో కూడ ఇందు ప్రవేశింపుము.'' మహాసేనుఁడు, ''దేహమునుండి ఎట్లు వెడలఁగలను? బలవంతముగా శరీరమును ఎట్లయినను వీడినచో తప్పక నశింతును'' అని పలికెను. మునిపుత్రుఁడు మహాసేనును జూచి నవ్వి ''అయ్యో! నీకసలు యోగమేతెలియదే. సరే! కానిమ్ము. కనులు మూసికొనుము'' అని చెప్పి అతఁడు కనులుమూసికొన్నంతనే వానియందు ప్రవేశించి అరనిముసములో వానిలింగశరీరమును వెలుపలికి తెచ్చి వానిస్థూలశరీరమును బిలమునందుంచెను. పిదప వానిలింగశరీరముతోఅతఁడు శైలము నందు ప్రవేశించెను. స్థూలశరీరమునుండి వెలుపలికి వచ్చుటనే మహా సేనుఁడు లింగశరీరమునందు నిద్ర నొందెను. మునిపుత్రుడు సంకల్పమాత్రమును ఒకస్థూలదేహమును సృష్టించి దానియందు మహాసేనుని గశరీరమును ప్రవేశ##పెట్టి మేల్కొలిపెను. మహాసేనుఁడు మేల్కొని పైకి క్రిందికి చూచెను. ఎటు చూచినను అతనికి ఆకాశ##మే అనంతముగ భయంకరముగా కన్పిపఁజొచ్చెను. తాను ఆకాశమధ్యమున ఉన్నట్లు గ్రహించి మహాసేనుఁడు భయపడి, ''అయ్యా! నన్ను వదలకుము. నీవు వదలినచో నేను ఎక్కడనే పడిపోయి నశింతును'' అని పలికెను. మునికుమారుఁడు నవ్వి, ''భయపడకుము. నిన్ను వదలిపెట్టను. శైలములోవి యీలోకము నంతను ధైర్యముతో అన్ననివైపుల తిరిగి చూడుము'' అని చెప్పెను.

అప్పుడు మహాసేనుండు ధైర్యము నవలభించి చూడఁజొచ్చెను. ఆతనికి క్రిందుఁగా దూరమునందు చీఁకటిచే ఆవరింపఁబడి నక్షత్రములతో కూడినయాకాశము కన్పించెను. అతఁడు అక్కడికి చేరి దానికి క్రిందుగానున్న విశాలమైన చంద్రమండలమును చూచెను. దానియొద్దకు పోయినంతనే మహాసేనుఁడు చలిచేత గడ్డ కట్టుకొనిపోవుచుడఁగా మునిపుత్రుఁడాతనికి వేఁడి కలిగించి రక్షించెను. అక్కడనుండి అతఁడు సూర్యమండలమును చేరి తాపము నొందఁజొచ్చెను. ఋషిపుత్రుఁడు యోగబలముచేత వానికి చల్లఁదనము కలిగించెను. ఇట్లు మహాసేనుఁడు ఆలోకమునంతను తన భూలోకమునకు ప్రతిబంబమువలె నున్నట్లు గ్రహించెను. పిదప బంగారుకొండయొక్క శిఖరమున మునికుమారునితో కూడ కూర్చుండి ఆతఁడు చూపుచున్న దంతయు చూచెను. మునికుమారుఁడొసంగిన దివ్యదృష్టితో మహాసేనుఁడు గుండ్రముగానున్న లోకాలోకపర్వతమును దానివెలుపల చీఁకటినిదానిలోపల బంగారుభూమిని సముద్రములను సప్తద్వీపములను నదులను పుర్వతములను సర్వభువనములను ఇంద్రుఁడు మొదలైన దేవోత్తములన దైత్యులను మనుష్యులను రాక్షసులను యక్షులను కింపురుషులను మొదలుగా అనేకులనుచూచెను. మునికుమారుడే సత్యలోకమున బ్రహ్మగా వైకుఁఠమున విష్ణువుగా కైలాసమున శివుఁడుగా ఉండి సర్వలోకములయొక్క సృష్టి మొదలైనవ్యవహారమును నిర్వహించుచు భూలోకమునందు మఱియొక రూపముతో సార్వభౌముఁడుగా పరిపాలించుచుండుటను మహాసేనుఁడు చూచెను. మునికుమారునియొక్క అద్భుతమైన యోగశక్తి సమృద్ధిని చూచి అతఁడు మిగుల విస్మతుఁడయ్యెను. అప్పుడు మునికుమారుఁడు ''రాజా! నీవు ఈలోకమును చూచుచుండఁగా నూటఇరువదికోట్ల సంవత్సరములు గడచిపోయినవి. ఆకాలము ఇక్కడ ఒక్కదినమైనది. మాతండ్రిగారున్నచోటికి వెలుపలికి పోవుదము రమ్ము'' అనిపలికెను. పిమ్మట అతఁడు మహాసేనుని గైకొని మహాకాశములోనికి ఎగిరిపూర్వము లోపలికి చొచ్చిన ప్రకారముననే గండశైలమునుండి వెలుపలికి వచ్చెను.

ఇది జ్ఞానఖండమునందు గండశైలలోకమును చూచుట అన్నది ద్వాదశాధ్యాయము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters