Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

పదమూఁడవయధ్యాయము -

మహాసేనుని నిర్వేదము

మునిపుత్రుఁడు గండశైలములోనుండి బయలుదేరునపుడు మహాసేనుని మూర్ఛితునిగావించి ఆతని లింగశరీరమును మాత్రము గైకొని వెలుపలికివచ్చిన తరువాత దానిని అతనియొక్క పూర్వస్థూలదేహమునందు ప్రవేశ##పెట్టెను. ఆదేహమునందు చక్కఁగా కుదురు కొనునట్లుగా చేసి అతనిని మునిపుత్రుఁడు మేల్కొలిపెను. పైకిలేచిన మహాసేనుఁడు బాహ్యలోకమున భూమిని జనులను వృక్షములను నదులను మొదలగు సర్వమును క్రొత్త వానినిగా చూచుచు అత్యంతము విస్మితుఁడై మునిపుత్రునితో నిట్లెనెను. ''మహాశయా! ఇది ఏ లోకము? చాలక్రొత్తగా నున్నది. ఈయద్భుత మేమో చెప్పుము?'' మునికుమారుఁడిట్లు చెప్పెను. ''అయ్యా! ఇది యింతకు పూర్వము మనమున్నలోకమే. అదియే దీర్ఘకాలవశమున చాలమార్పు నొందినది. గండశైలలోకమందు మనము ఒక్కదినము గడిపితిమి. అంతలోపల ఇక్కడ నూటఇరువదికోట్లసంవత్సరములు గడచిపోయినవి. కావున ఈ లోకముయొక్క రూపము పూర్తిగా మాఱిపోయినది, చూడుము. ఎల్లయెడల వ్యవహారము భాష వెనుకటికన్న చాల భిన్నముగానున్నవి. కాలవశమున ఇట్టి మార్పు కలుగుచుండను. ఈజగత్తుయొక్క స్థితి ఇట్లు మాఱుచుండుట అనేక పర్యాయములు చూచితిని. సమాధియందు భగవంతుఁడైన మాతండ్రిగారు కదలకుండ ఎట్లున్నారో చూడుము. నీవు ఇచ్చటనే మాతండ్రిగారిని స్తోత్రము చేసియుంటివి. మనము ప్రేవేశించిన గండశైల మిదియే. మీయన్నగారి వంశమున వేలకొలఁదితరముల గడచినవి. వంగదేశమున సుందర మనుపేరు గల మీనగరమున్నచోట ఇప్పుడు క్రూరమృగములతో నిండినయడవి వ్యాపించియున్నది. యన్నగారివంశమున వీరబాహువు అనువాఁడు ఇప్పుఁడు క్షిప్రానదీతీరమున విశాలనగరమునందు మాళవదేశపాలకుఁడై యున్నాఁడు. నీవంశమున సుశర్మ అనువాఁడు ద్రావిడదేశమునందు తామ్రపర్ణీనదీతీరమున వర్ధనమును నగరమునందు ప్రభువైయున్నాఁడు. ఈలోకస్థితి ఎప్పుడును ఇట్లే మాఱుచుండును. అల్పకాలమునకే ఇది నూతనమైన జగత్తుగా రూపొందినది. దీర్ఘకాలవశమున కొండలు నదులు మడుగులు కూడ రూపాంతరములను పొందు చుండును. జగత్తుయొక్క గతి యింతే. కొండలుపల్లములు అగును. పల్లములు కొండ లగును. ఎడారులు జలమయము లగును. పర్వతములు ఇసుకప్రదేశము లగును. ఱాతినేల మెత్తనిపొల మగును. ఒకప్పుడు మనుష్యులధికముగా నుండుఁగా ఇంకొకప్పుడు పశుపక్ష్యాదు, లధికముగా నుండును. కాలవశమున జగత్తులో ఎన్నియో పరిణామములు సంభవించుచుండును. ఇప్పుడు ఈవిధముగ కన్పించుచున్న యీలోకము మనము వెనుక నివసించినదే.''

ఈమాటలు విని మహాసేనుఁడు మిగుల దుఃఖముతో మూర్ఛనొందెను. మునిపుత్రుఁడు సేదదీర్పఁగా కొంత సేపటికి తెలివినొంది మహాసేనుఁడు అన్నను అన్నకొడుకులను తనబార్యను పుత్రులను స్మరించి విలపింపఁజొచ్చెను. మునికుమారుఁడు అతనిని చూచి యిట్లనెను. ''రాజా! నీకు తెలివి యున్నట్లే లేదే! ఎవరినిగూర్చి యైనను విలపించి ఏమి లాభము? బుద్ధిమంతులు నిష్పలముగా ఏపనియును చేయరు. మనము చేయుపనికి ఫల మున్నదా లేదా అని ఆలోచింపకుండ పనిచేయవాఁడు మూర్ఖుఁడు. నీవు ఎవరినిగూర్చి ఎందులకు విలపించుచున్నావో చెప్పుము.'' మహాసేనుఁడు విలపించుచు ఇట్లనెను. ''నాకు సంబంధించినది యంతయు నశించియుండఁగా ఏల దుఃఖింతు వని కారణ మడిగెద వేమి? నేను ఎందులకు దుఃఖించుచున్నానో నీకు తెలియుట లేదా? తండ్రియో సోదరుఁడో ఎవఁడో ఒకఁడు పోయిననేచాలు, లోకమున ఎంతో దుఃఖమును పొందుదురు. మఱి నాకు సర్వబంధునాశ##మే సంభవించినది. ఇంక దుఃఖింపక ఎట్లుందును? నీ వేల యిట్లు అడిగెదవు? మునికుమారుఁడు నవ్వుచు మరల నిట్లనెను. ''అయ్యా! చెప్పుము. చచ్చినవారికై శోకించుట సనాతనమైన కులధర్మమా? ఇట్లుశోకింపకున్నచో పెద్దదోషము కలుగునా? లేక నీవు దుఃఖించినచో చనిపోయినవారు తిరిగివత్తురా? రాజా! ధైర్యముతో విమర్శింపుము. శోకించుటవలన ఎవనికైన ఏమైన ఫలము కలుగుచున్నదా! బంధువులు నశించినప్పుడు దుఃఖింప నక్కఱలేదా అని అందువేని వినుము. నీతాతలు ముత్తాతలు ఎందఱో చనిపోయినారు కదా! వారి నందఱనుగూర్చి దుఃఖింపవలసియే యున్నచో ఎల్లప్పుడు దుఃఖింపవసియే యుండును. వారినిగూర్చి నీవు దుఃఖించుట లేదే! వారికన్నను అన్నలుమొదలగువారు సన్నిహితులందువేని. అసలు బంధువు లఁనగా ఎవరు? బంధుత్వమెట్టిది? విచారింపుము, ఒకశరీరమువలన కలిగినవారుపరస్పరము బంధువు లగు చున్నా రందువేని, నీతల్లితండ్రులయొక్క నీయొక్క శరీరములనుండి నీవు నీసోదరులు నీబిడ్డలేకకాక స్వేదము మొదలగువానివలన క్రిములు ఆసంఖ్యాకములుగా పుట్టినవి కదా! అవిఏల నీకు బంధువులు కాలేదు. వానికొఱకు ఏల నీవు శకించుట లేదు?

అది యుండనిమ్ము. అసలు నీ వెవరు? నీవు ఎవరికొఱకు దుఃఖించుచున్నావో ఆబంధువు లెవరు? విమర్శింపుము. నీవు దేహమా లేక దేహఖిన్నుఁడవా? ''నేను ఈదేహమే'' అని యందువేని ఈ దేహము పెక్కుఅవయవముల కూర్పుగానున్నది. మఱి దేహమంతయు నశించినచో నాశము కలిగిన దందువా. లేక ఒకభాగము నశించినను నాశ##మే యగునా? దేహమునందు గోళ్ళు వెంట్రుకలు మొదలుగా ఏవో కొన్ని భాగములు ప్రతిక్షణమునశించుచున్నవి. అయినను దేహము నశించుట లేదు. ''అయ్యా! అట్లు కాదు ఇప్పుడు మాబంధువుల దేహములు పూర్తిగా నశించినవి. అందువలన వారు నశించి రని దుఃఖించుచున్నాను'' అని నీ వందువేని, అట్లు చెప్పుటయు కుదురదు. నీకు కన్పింపకున్నను నీయన్న మొదలగువారియొక్క దేహములలో అంశములైన అగ్ని జలము మొదలగునవి పంచభూతములలో చేరియుండనేయున్నవి. అదియును గాక నీవు దేహము కాదు. ఎందు వల్ల ననఁగా ''ఇది నాదేహము'' అని ఇతరులకు చూపుచు చెప్పుచున్నావు కదా! ''ఇది నావస్త్రము'' అని చెప్పునప్పుడు వస్త్రము నీవు ఎట్లు అగుట లేదో అట్లే ''ఇది నాదేహము'' అని చెప్పుచున్నావు కావున ఈదేహము నీవుకాదు. నీవు దేహము కానప్పుడు ఇంకొక దేహముతో నీకేమి సంబంధము? మీయన్నంధరించిన వస్త్రములతో నీకు ఎట్లుసంబంధము లేదో ఆయన ధరించిన శరీరముతో కూడ నీకు సంబంధము లేదు. వస్త్రమునకు శరీరమునకు పెద్ద తేడా ఏమున్నది. వస్త్రము అల్పకాలములో జీర్ణమై నశించుచుండఁగా శరీరము మఱి కొంతకాలములకు జీర్ణమై నశించుచున్నది. ''నాశరీరము నాయింద్రి యములు నాప్రాణము నామనస్సు'' అని చెప్పుచున్నావు కదా! ఇవి యేవియు నీవు కావనుట స్పష్టము. ఇంక నీస్వరూపము ఏమో చెప్పుము.

అప్పుడు మహాసేనుఁడు మూహుర్త కాలము ఆలోచించి ముని కుమారుఁడు అడిగినప్రశ్నకు సమాధానము దొరకక మిగుల దీనుఁడై ఇట్లనెను. ''భగవానుఁడా! ఏన్నివిధముల ఆలోచించినను నే నేవఁడనో నాకు తెలియుట లేదు. ఆకలిదప్పికలవలన బాధపడుచున్నట్లే దుఃఖము పొర్లిపొర్లి వచ్చుచుండఁగా విలపించుచున్నాను. ఆకలిదప్పికలకు కారణ మెట్లు కన్పించుట లేదో ఈ దుఃఖమునకు కారణము తెలియుట లేదు. దుఃఖింపకుండ ఉండలేకపోవుటచే దుఃఖించుచున్నాను. నేను దీనుఁడనై నిన్ను శరణు పొందుచున్నాను. ఇది ఏమో చెప్పుము. ఎల్లరును ఎవఁడేని ఒకబంధువు చనిపోయినంతనే దుఃఖించుచున్నారు; కాని యితరులు పోయినచో దుఃఖింపరు. తమ స్వరూపమును గూర్చియు ఎవరును తెలిసికొనుట లేదు. ఇట్లేల జరుగుచున్నది? శిష్యుఁడనైన నాకు ఇది స్పష్టముగా బోధపడునట్లు చెప్పుము.''

అప్పుడు ఆమునికుమారుఁడిట్లనెను. ''రాజా! వినుము. మాయారూపిణియైన మహాదేవిచేత జను లందఱును మోహితులై తమస్వరూపమును తెలిసికొనక వ్యర్థముగా నిరంతరము శోకించుచున్నారు. ఎంతవఱకు తమస్వరూపము తెలిసికొనరో అంతవఱకే ఈదుఃఖము ఉండును. స్వరూపమును తెలిసికొన్నచో ఎవఁడును ఎక్కడను దుఃఖింపఁడు. నిద్రచేత మోహితుఁడై నవాఁడు దానిచేత కలలో ప్రదర్శింపఁబడుచున్న దొంగలు మొదలగువారిని చూచి భయపడి దుఃఖించుచున్నాఁడు. జాగ్రదవస్థలో కూడ ఇంద్రజాలకునిమంత్రముచేత బయలుదేరిన మాయచేత మోహితుఁడైనవాఁడు దానిచేత కల్పింపఁబడుచున్న పాములు మొదలగువానిని జూచి భయపడి వణఁకి పోవుచున్నాఁడు. అట్లే ఆమహాదేవియొక్క మహామాయచేత మోహితుఁడైనవాఁడు తనస్వరూపము నెఱుంగక శోకించుచున్నాఁడు. స్వప్నములోనుండి మేల్కొన్నవాఁడు, ఇంకను స్వప్నములోనే యుండి కేకలుపెట్టుచున్నవారికి చూచి నవ్వుకొనుచున్నాఁడు. ఇంద్రజాలము నెఱింగినవాఁడు కూడ తాను కలఁత నొందక, కలఁతనొందుచున్న యితరులను చూచి పరిహాసించుచున్నాఁడు. అట్లే ఆదేవియొక్క మాయనుండి ముక్తులైనవారు ఎప్పుడను ఏసందర్భమునను దుఃఖము నొందక, దుఃఖించుచున్న యితరులను చూచి పరిహసించుచుందురు, కావున నీవు కూడ చక్కఁగా విమర్శించి తత్త్వమును తెలిసికొని మాయను దాటి దానివలన కలుగుచున్న శోకమున వీడుము.''

మహాసేనుఁడది విని అతనితో నిట్లనెను. ''అయ్యా! నీవు చెప్పిన దృష్టాంతము సరిగా లేదు. స్వప్నమునందుఁగాని ఇంద్రజాలమునందుఁగాని వస్తువులుండవు అవి లేకపోయినను ఉన్నట్లే అప్పుడు భాసించుచుండును. మఱి యీజాగ్రత్ప్రపంచమున సకల పదార్థముల ద్రవ్యముతో రూపొంది మనకు ఉయోగపడుచు ఫలము లను కలిగించుచున్నవి. కావున యదార్థమైన యీప్రపంచము కలతోఎట్లు సమానమగును?''

మునికుమారుఁడు మరల నిట్లు చెప్పెను. ''దృష్టాంతము సరిగా లేదనుచున్నావు. ఇది నీకు మఱియొక భ్రాంతి. స్వప్నములో కన్పించుచున్న వృక్షము, స్వప్నము జరుగుచున్నసమయమున, బాట సారులకు నీడ యిచ్చుట లేదా? పండ్ల నిచ్చుటలేదా? అది అప్పటికి యథార్థముగనే కన్పించుచున్నది. ''మేల్కొన్నంతనే ఆస్వప్నప్రపంచ మంతయు అసత్య మగుచున్నది కదా'' అని యందువేని ఈజగ్రత్ప్రపంచము కూడ నిద్రలో లేకుండపోవుచున్నది. ''నిద్రలో లేకుండ పోయినను నిన్న కన్పించినప్రపంచమే ఈదినము కూడ అట్లే కన్పించుచున్నది. కావున ఇది స్వప్నమువలె అసత్యము కాదు'' అని యందువేని ఆమాట నిలువదు నిన్నటివారు కొందఱు ఇప్పటికి మరణించియుందురు. క్రొత్తగా ఈనాడు కొందఱు పుట్టుచున్నారు. అదియునుగాక ప్రతిపదార్థమునందు ప్రతిక్షణము మార్పు సంభవించు చుండుఁగా నిన్నఁటిప్రపంచమే నేఁడును ఉన్న దనుట ఎట్లుసంగతమగును? కొండలకు అచలము లనిపేరు. అవి యదార్థముగా మార్పును పొందకుండ నున్నవా? అనుక్షణము అవి అడవియేనుఁగులచేత వరాహములచేత సెలయేళ్ళచేత తరిగిపోవుచు మార్పు నొందుచునేయున్నవి. స్థిరములని మనము అనుకొనుచున్న పర్వతములు సముద్రములు మొదలగునవి యన్నియు అనుక్షణము మార్పునొందుచునే యున్నవి. ''నిన్నటి ప్రపంచమే నూటికి నూఱుపాళ్ళు నేఁడు లేకపోయినను నిన్నఁటిదానికి నేఁటిదానికి సామ్య మున్నది గదా'' అనియందువేని అట్టిసామ్యము నిన్నఁటి స్వప్నప్రపంచమునకు మొన్నఁటి దానికి కూడ ఉన్నది. కావున స్వప్న మెట్టిదో జాగ్రత్పపంచము కూడ అట్టిదే. ''స్వప్నమునుండి మేల్కొన్నవానికి ఆస్వప్నప్రపంచము జాగ్రద్దశలో కన్పించుట లేదు. కాని జగ్రత్ప్రపంచము అట్లు మాయము కాకుండ ఎప్పుడును కల్పించుచునే యున్నది. కావున జగ్రత్త స్వప్నము సమానము కాదు'' అని యందువేని ఆమాటయు నిలువదు. నిద్రలో ఈజాగ్రత్ప్రపంచము ఎవనికిని కన్పించుట లేదు. నిద్రలో జాగ్రత్ప్రపంచము కూడ మాయమగుచుటనే యున్నది. కావున ఇది స్వప్నముతో సమానము. ''అయ్యా! అట్లుకాదు. స్వప్నము నుండి మేల్కొన్న ప్రతివాఁడును స్వప్నము యథార్థముగ జరుగలేదు అని రూఢిగ తెలిసికొనుచున్నాఁడు. కాని యీజాగ్రత్ప్రపంచము అసత్యమని ఎవ్వఁడును ఎప్పుడును అనుకొనుట లేదు. కావున ఈ రెండును సమాన మనుట సరి కాదు'' అని యందువేని అదియును ఆలోచించినచో నిలువదు. నీవంటిభ్రాంతులకు ఈజగత్తు అసత్యముగా తోఁచదు. స్వప్నమును చూచునున్నంతసేపు అది అసత్యమని తోఁచదు. కాని అంతకన్నను కొంచెము స్థిరముగానున్న యీజగత్తును చూచుచున్నప్పుడు స్వప్నము అసత్యముగానే తోఁచుచున్నది. అట్లే ఈజగత్తునకు అతీతమైన దీనికి ఆధారమై ఎప్పుడును ఎట్టిమార్పును పొందక ఏకరూపమున భాసించుచున్న యాత్మతత్త్వమును ఎవఁడు చూచుచున్నాఁడో వాని కీజగత్తు అసత్యముగానే తోఁచును.

కావున స్వప్నమువలె జాగ్రత్తుకూడ అసత్యమే. స్వప్నము స్వల్పకాలము భాసించుచుండఁగా జాగ్రత్ప్రపంచము మఱికొంతకాలము దీర్ఘముగా భాసించుచున్నది. అంతే భేదము. పదార్థములు కూడ జాగ్రత్తులో ఎట్లుయథార్థములుగా తోఁచుచు సుఖదుఃఖములను కలిగించుచున్నవో అట్లే స్వప్నములోకూడ యథార్థములుగానే తోఁచుచు సుఖదుఃఖములను కలిగించుచున్నవి. పండును ఇచ్చినచో సంతోషము, కొట్టినచో దుఃఖము జాగ్రత్తులో ఎట్లు కలుగుచున్నవో స్వప్నములో కూడ అట్లే కలుగుచున్నవి. అంతే కాదు. జాగ్రద్దశలో స్వప్నమును ఎట్లు స్మరించుచున్నామో అట్లే స్వప్నములో కూడ జాగ్రత్ప్రంచమును స్మరించుచునే యున్నాము. ఈప్రపంచములోని వ్యక్తులును సన్నివేశములే కదా స్వప్నమునందును కన్పించుచుండును. కావున స్వప్నమునకు జాగ్రత్తునకు వాస్తవముగా భేదము లేదు. స్వప్నము లోని బంధువులనుగూర్చి ఎట్లు దుఃఖింపనక్కఱలేదో అట్లే జాగ్రత్ప్రపంచములోన బంధువులనుగూర్చి కూడ దుఃఖింప నక్కఱలేదు.

ఇంత అనుకొన్నను ఈజగత్తు ఇంకను సత్యముగా కన్పించు చుండుట నిజమే. ఇది సత్యము అని దృఢముగాభావించుచుండుట మాత్రమే ఇందులకు కారణము. జగత్తు అసత్యము అని దృఢముగా భావించుచున్నచో ఇది అసత్యమన్నభావమే అచంచలముగా నిలుచును. నీభావన స్థిరముగా లేదు. ఇది యసత్యము కాదేమో అనుసందేహము నీకు ఇంకను కలదు. అపనమ్మకము లేకున్నచో భావన స్థిరమైమనము దేనిని గూర్చి ఎట్లు భావించుచున్నామో అది యావస్తువుగా అట్లే గోచరించును. ఇందులకు నిదర్శనము ఈగండశైలములో నేను నీకు చూపినలోకమే. ఈ గండశైలమును చుట్టును దిరిగి చూచి వత్తుము రమ్ము.?

పిదప మునికుమారుఁడు మహాసేనుని చేయిపట్టుకొని శైలము చుట్టును త్రిప్పి తీసికొనివచ్చి యిట్లు చెప్పెను. ''రాజా! చూచితిని కదా! ఈశైలము అర్ధక్రోశమాత్రమే (ఒకమైలు) యున్నది. కాని దీనియొక్క లోపలిభాగమున విశాలమైనలోకమును స్పష్టముగా చూచియున్నావు. మఱి ఇది జాగ్రద్ధశయా స్వప్నమా సత్యమా మిథ్యయా? శైలలోకమునందు ఒకదినముగానైన కాలము ఇక్కడ నూటఇరువది కోట్లసంవత్సరములైనది. వీనిలో ఏది సత్యమో ఏది యసత్యమో విమర్శింపుము. రెండు స్వప్నములను చూచినతరువాత ఒక స్వప్నమునుబట్టి రెండవస్వప్నముయొక్క సత్యత్వమునుగాని అసత్యత్వమును గాని ఎట్లు నిశ్చయించుటకు వీలు లేదో అట్లే ఈ రెండింటియందును శైలలోకమునుబట్టి ఈజగత్తుయొక్క సత్యత్వమునుగాని అసత్యత్వమును గాని, ఈ జగత్తునుబట్టి ఆలోకముయొక్క సత్యత్వముగాని అసత్యత్వమునుగాని నిశ్చయించుటకు వీలు లేదు. కావున ఈజగత్తు నకు భావనమాత్రమే సారమని యెఱుంగుము. నాసంకల్పమాత్రము ననే ఆశైలలోకము భాసించినది. నేను దానినిగూర్చి భావించుట మానుకొన్నచో అది క్షణమాత్రములో విలయము నొందును. బ్రహ్మ దేవుని సంకల్ప మాత్రమైన యీజగత్తు అట్టిదే. ఆయన దీనినిగూర్చి భావించుట మానుకొన్నచో క్షణములోలయము నొందును. కావున ఈజగత్తును స్వప్నసమానముగా గ్రహించి శోకమున వీడుము. స్వప్నప్రపంచములు ఎన్నిజరిగినను వానికి ఆధారమైన నీజ్ఞానస్వరూప మునందు మార్పు కలుగుట లేదు. అట్లే అద్దమునందు ప్రతింబింబమువలె ఈ జగత్ప్రపంచదృశ్యములు వచ్చుచు పోవుచు నున్నను వానికి అద్దమువలె నున్న చేతన్యరూపమైన నీయాత్మ ఎప్పుడును పరిశుద్ధముగనే యున్నది. అట్టి స్వరూపమునువ శీఘ్రముగా తెలిసికొని పరమానందమును పొందుము.''

ఇది జ్ఞానఖండమునందు మహాసేనుని నిర్వేదము మన్నది త్రయో దశాధ్యాయము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters