Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

పదునైదవయధ్యాయము - జ్ఞానఖండసారము

పరశురాముఁéడు శైలలోకాఖ్యానము విన్నతరువాత తనయాశ్రమమునకు పోయి గురువు చెప్పినట్లుగా విన్నదాని నంతను విమర్శించి మరల గురువునొద్దకు వచ్చి ప్రణమిల్లి తాను గ్రహించినదానిని ఆయనకు నివేదించుచు దానిపైఁ గలిగినసంశయములను ఇట్లు ప్రశ్నించెను. ''భగవానుఁడా! నీవు పెక్కుకథలతో చెప్పినవిషయమును నేను అనేక విధముల ఆలోచించితిని. నాకు ఇంతవఱకు తెలిసినది, తెలిసికొనుట లేక జ్ఞానము అన్నది ఒక్కటే సత్యము. తెలిసికొనబడుచున్న దంతయు కల్పితము. అద్దములో కన్పించునగరమువలె తెలియఁబడుచున్న దంతయు అసత్యము. జ్ఞానమే రూపముగాగల యాపరమేశ్వరి స్వాతంత్ర్యముయొక్క మహిమచేత, కుండకు మట్టి కావలసినట్లు, ఏ పదార్థముతో అక్కఱలేకయే తనయందే అవ్యక్తము మొదలగు భేధములతో జగత్తును భాసింపఁజేయుచున్నది. ఆత్మకు వెలుపల ఏదో ఉన్నట్లు తోఁచుటయే అవ్యక్తము. మీరు చెప్పినదానిని సూక్ష్మముగా విచారింపఁగా నాకు ఇంతవఱకు తోఁచినది.

తెలిసికొనుట సంవేదనము, లేక సంవిత్తి%ి. తెలియఁబడునది వేద్యము. వేద్యముతో ఎప్పుడును ఏవిధముగను సంబంధములేక శుద్ధముగా నుండుటయే సంవిత్త యొక్క యదార్థస్వరూపమని చెప్పుచున్నారు. కాని వేద్యము సంవేదనమునందు ఎప్పుడును ఉండనే ఉన్నది. అట్టియెడల వేద్యములేని పరిశుద్ధమైన సంవేదనమును పొందుటకు ఎట్లు వీలగును? దానిని అట్లు పొందకున్నచో పురుషార్థమే లేదు. మోక్షమే పురుషార్ధము. ఆమోక్షముయొక్క స్వరూపమేమి? జ్ఞానము కలిగినంతనే మోక్షము కలుగు నన్నచో, ఆమోక్షస్థితియందు వ్యవహారము ఎట్లు కుదురును? మఱి వ్యవహారపరాయణులైన జ్ఞానులు కన్పించుచున్నారు. వారికి వేద్యరహితమై కేవలమైన సంవేదనము (Absolute awareness) ఎట్లునిలుచును? శుద్ధమైన సంవేదనమునందు నిలిచినవానికి వ్యవహారము ఎట్లు జరుగును? జ్ఞానము ఏకరూప మైనప్పుడు దానివలన కలుగు మోక్షము కూడ ఏకరూపముగానే యుండవలె. మఱి లోకమునందు జ్ఞానుల యొక్క స్థితిలో భేదము ఎట్లు కన్పించుచున్నది? కొందఱు జ్ఞానులు శాస్త్రము చెప్పినట్లు ఆయాకాలములందు చేయవలసిన కర్మలను చేయుచున్నారు. కొందఱు భిన్న భిన్నపద్ధతులలో దేవతలను ఆరాధించుచున్నారు. కొందఱు ఇంద్రియములను నియమించి సమాధియందే నిలిచిపోవుచున్నారు. మఱి కొందఱు దేహేంద్రియములను శుష్కింపఁజేయుచు తపస్సు చేయుచున్నారు. కొందఱు ప్రవచనములచేత శిష్యులకు బోధించుచున్నారు. కొందఱు దండనీతిని అవలంబించి రాజ్యమును పాలించుచున్నారు. కొందఱు సభలలో ప్రతివాదులతో వాదించుచున్నారు. మఱికొందఱు ఎల్లప్పుడు శాస్త్రములను రచించుచుందురు. కొందఱు సదా ప్రపంచ జ్ఞానము లేనివారివలె నుందురు, కొందఱు లోకులు ఏవగించుకొను నట్టి వర్తనమునందు ఉందురు. వీరందఱు లోకమున జ్ఞానులుగానే ప్రసిద్ధులై యున్నారు. మోక్షము అందఱకును సమానమైనప్పుడు వీరిస్థితియందు భేదములెట్లు కలుగుచున్నవి? వీరి విజ్ఞానము సమానము కాదా? వీరి జ్ఞానములలో తారతమ్యమువ (Degrees of difference) ఉన్నదా? ఇది యంతయు నీవు తప్ప ఎవఁడును చెప్పఁజాలఁడు. నిన్నే శరణుపొందిన శిష్యునియందు నీ మనస్సు సహజముగనే దయార్ద్రమై యుండును. కావున నాసంశయములు నశించునట్లు బోధింపుము.''

ఈప్రశ్న లన్నియు సమంజసములే అని సంతోషించుచు దత్తా త్రేయుఁడు ఇట్లు చెప్పెను. ''రామా! నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుఁడవు. ఆచిదాత్మను తెలిసికొనుటకు నీవు సమర్థుఁడవు. నీకు సద్విమర్శనము కలిగినది. అందువలన తత్త్వమును తెలిసికొనఁగలవు. భగవంతునియొక్క అనుగ్రహమువలననే సద్విమర్సనము కలుగును. ఆయనయొక్క అనుగ్రహము లేక ఎవఁడును శ్రేయస్సునకు సాధనమైన సద్విమర్శనమును పొందఁజాలఁడు. మనయందు ప్రతిదినము సద్విమర్శనమును పెంపొందించుచుండుటయే మనచే ఆరాధింపఁబడిన యీశ్వరుఁడు ప్రసన్నుఁడై మనకు చేయఁగలిగిన మహోపకారము. ఆయన చేయఁగలిగినది అంతవఱకే.

దేనిని నీవు తెలిసికొంటివో అది సత్యమే. కాని చిదాత్మను గూర్చి నీకు చక్కఁగా తెలియలేదు. కావుననే అద్దమునందు నగరమువలె చిదాత్మ తనయందు జగత్తును భాసింపఁజేయుచున్నది'' అని తాటస్థ్యముతో చెప్పుచున్నావు. ''ఆచిదాత్మయే నేను'' అని నీకు తోంచలేదు. చిదాత్మను తనకన్న వేరొక వస్తువుగా ఎవఁడు తటస్థుఁడుగా తెలిసికొనుచున్నాఁడో వానికి అది తెలియదు. ''ఆచిదాత్మయే నేను'' అని తెలిసికొన్నవానికి తాటస్థ్యము ఉండదు. ఆత్మ ఎక్కడనో ఉన్నట్లు తటస్థముగా తెలిసికొనుట స్వప్నములో తెలిసికొనునటువంటిదేయగును. స్వప్నములో దొరకిన నిధివలె తటస్థునియొక్క ఆత్మజ్ఞానము ముఖ్యమైన ఫలము నొసంగదు. ఈవిషయమున వెనుక జరిగిన యొకవృత్తాంతమును చెప్పెదను వినుము.

పూర్వము విదేహరాజ్యమునందు ఒకధార్మికుఁడైన రాజు ఉండెను. ప్రజ్ఞాశాలియైన యాజనకుఁడు ఇహపరములను రెండింటిని తెలిసికొని ఉత్తమములైన యజ్ఞములచేత ఆత్మదేవతను ఆరాధించెను. విద్యావంతులు తపస్సులు కళాకోవిదుల యజ్ఞములుచేసినవారు మొదలుగా బ్రాహ్మణులు అచ్చటికి వచ్చిరి. ఆసమయముననే వరుణుఁడు యజ్ఞమును చేయఁబూనుకొనెను. ఆయన ఆహ్వానింపఁగా బ్రాహ్మణాదులు చాలమంది వరుణలోకమునకు పోలేదు. విద్వాంసు లందఱును జనకునిచే పూజింపఁబడుచు సంతుష్టులై అచ్చటనే యుండిరి. అప్పుడు బుద్ధికుశలుడైన వరుణునిపుత్రుఁడు కపటమార్గమున విద్వాంసులను వరుణలోకమునకు తీసికొనిపోవలయు నని నిశ్చయించుకొని బ్రాహ్మణవేషమున జనకునియజ్ఞశాలకు వచ్చి రాజును ఆశీర్వదించి సభలో నెల్లరు వినుచుండగా అచ్చటనున్న సదస్యులను తిరస్కరించుచు నిట్లనెను. ''రాజా! కాకులతో, గ్రద్దలతో నిండియున్న సరస్సు వలె నీయీయజ్ఞశాల శోభించుట లేదు. శరత్కాలమందు వికసించిన కమలములుగల సరస్సు హంసలముదాయములచేత శోభించునట్లుగా సభ విద్వాంసులసముదాయములచేతనే శోభించును. మఱి యీసభలో విద్యావిశారదుఁడైనవాఁడు ఒకడును నాకు కన్పించుటలేదు. అయ్యా! నీకు శుభ మగును గాక! నేను పోవుచున్నాను. మూర్ఖులతో నిండి యున్న యీసభలోనే నెట్లుండఁగలను?'' ఇట్లు అతఁడు పలికినంతనే సదస్సు లందఱు క్రుద్ధులై యిట్లనిరి. ''ఏమిరా! బ్రాహ్మణాధమా! ఎల్లరను ఎందులకు ఆక్షేపించుచున్నావు? మమ్ము అందఱను జయించుటకు నీకున్న విద్య ఏమి? ఏమిరా నీదుర్భుద్ధి! మమ్ము అందఱును జయించి పోఁగలవా? ఏల ఇట్లు నిన్ను నీవు పొగడుకొనుచున్నావు? భూలోకములోనున్న విద్వాంసు లందఱును ఇంచుమించుగా ఇక్కడ చేరియున్నారు. నీవు భూలోకమునే జయింపఁగోరుచున్నావా! ఏ విద్యతో నీవు మమ్ము జయింపఁగోరుచున్నావో అది ఏదోచెప్పుము.'' అప్పుడు వరుణునికుమారుఁడు ఇట్లనెను, ''మీరు ఒక ప్రతిజ్ఞకు అంగీకరించినచో మిమ్ము అందఱను క్షణములో జయింతును. నేను ఓడిపోయినచో నన్ను మీరు సముద్రములో ముంచుడు, మీరు ఓడినచో మిమ్ము సముద్రములో ముంచివేయుదును. దీనికి అంగీకరించి మీరు నాతో వాదము చేయుఁడు.'' అంతట వా రందఱను అందులకు అంగీకరించి వానితో వాదము చేయఁజొచ్చిరి, అతడు తర్కకౌశలముతో వారి నందఱను జయించి వందలకొలఁదిగా వేలకొలఁదిగా తీసికొనిపోయి సముద్రములో ముంచఁజొచ్చెను, వరుణునిదూతలు వారి నందఱను వరుణుని యజ్ఞశాలకు తీసికొనిపోవుచుండిరి. అచ్చట వారి నందఱును వరుణుఁడు పూజించి సంతుష్టులను గావించుచుండెను.

ఇట్లు కహోలుఁడు అను ముని కూడ సముద్రములో ముంచఁబడెను. అది ఎఱింగి ఆతనికుమారుఁడు అష్టావక్రుఁడు జనకుని యజ్ఞశాలకు వచ్చి వరుణునికుమారుని వాదమునజయించి వానిని సముద్రములో ముంచవలసిన దని ఆదేశించెను. అప్పుడు వరుణపుత్రుఁడు నిజరూపమును చూపి వరుణలోకమునకు పంపఁబడిన ద్విజుల నందఱను రప్పించెను. అట్లు రప్పింపఁబడిన ద్విజశ్రేష్టులను చూచి అష్టావక్రుఁడు గర్వించి తిరస్కరించెను. వారందఱును దుఃఖము నొంది ఆసమయమునకు అచ్చటికి వచ్చిన యొకతాపసిని శరణుఁజొచ్చిరి. ఆమె కాషాయంబరములు జడలు ధరించి ¸°వనముతో సౌందర్యముతో విలసిల్లుచుండెను. ఆమె వారిని ఓదార్చి సభలోనికి పోయి జనకునిచో పూజితురాలై అష్టావక్రుని చూచి ఇట్లనెను. ''వత్సా! కహోలపుత్రా! నీవు చాల బుద్ధిమంతుఁడవు. వరుణదేవునిపుత్రుని వాదమున జయించి ఈవిద్వాంసుల నందఱను విడిపించితివి. నేను నిన్ను కొంచెము అడిగెదను. వంచనము లేకుండ చెప్పుము. దేనిని దెలిసికొన్నచో సర్వము అమృత మగునో, సకల సందేహములు నశించునో, ఇంక తెలియఁబడనిదికాని కోరఁదగినదికాని ఏదియు నుండదో అట్టిది నీకు తెలిసినచో వెంటనే చెప్పుము.'' అష్టావక్రుఁడు ఇట్లనెను. ''అది నాకు తెలియును. తాపసీ! మరల చెప్పుచున్నాను వినుము, నాకు ఈలోకములో తెలియనిది లేదు. ఇది ఎంత? నేను సకలశాస్త్రములను అనేకపర్యాయములు తిరుగవేసితిని. ఇదిగో నీ వడిగినది. అది సకల జగత్తునకు కారణము. దానికి ఆదిమధ్యాంతరములు లేవు. అది దేశకాలముచేత పరిమితము (limited) కాదు, అది శుద్ధము అఖండము చిదాత్మకము. అద్దమునందు నగరమువలె ఈజగత్తు అంతయు దేనియందు విరాజిల్లుచున్నదో అదియే పరమపదము. దానిని తెలిసికొన్నవాఁడే నిశ్చలము అమృతము అయిన స్థితిని పొందును. అద్దమునుగూర్చి తెలిసికొన్నతరువాత దానియందు అనంతముగా ఎన్ని బింబములు కన్పించుచున్నను అవి అన్నియు అసత్యములు. అద్దమే సత్యము అను విషయమున ఎట్లు సందేహము కలుగదో అట్లే పరతత్త్వము నెఱింగినవానికి జగత్తు అసత్యము అను విషయమున సందేహము కలుగదు. అట్లే వానికి అసత్యమైన జగత్తులో తెలియనిది కోరఁదగినది ఏదియు నుండదు. ఇట్టియాత్మ యొక్కటియే చేతనము తక్కిన జగత్తు అంతయు అచేతనమగుటచే, దానిని తెలిసికొనువాఁడు ఇంకొకఁడు చేతనుఁడు లేకపోవుటచేత అది తెలిసికొనఁబడదు (Unknowable). ఇట్లు శాస్త్రదృష్టితో నీవడిగినతత్త్వము నిరూపింపఁబడుచున్నది.''

తాపసి ఇట్లనెను ''మునికుమార! శాస్త్రములో ఉన్నట్లుగా నీవు చక్కఁగా చెప్పినావు. ఇది సర్వసమ్మతమే. కాని దానిని తెలిసికొన్న వాఁడే నిశ్చలము అమృతము అయిన స్థితిని పొందును'' అని మొదట చెప్పితివి. తరువాత, ''దానిని తెలిసికొనువాఁడు ఇంకొకఁడు చేతనుఁడు లేకపోవుటచేత అది తెలిసికొనఁబడదు'' అని చెప్పితివి. ఇది మొదటచెప్పినదానికి విరుద్ధము. అది తెలిసి కొనుటకు సాధ్యమే కానిదగుచో నీకు ఎట్లు తెలిసినది? నీకు తెలియనిచో, ''అది నాకు తెలియదు; కావున లేదు'' అని నిరూపింపుము. ''అది ఉన్నది; నాకు తెలియును'' అని నీవందువేని, ''అది తెలియఁబడదు'' అని చెప్పవలదు. అసలు ఇది యంతయు నీవు శాస్త్రదృష్టితోనే అనుకొనుచున్నావు. దానిని నీవు స్వయముగా అపరోక్షముగా (Directly) తెలిసికొనలేదు. జగత్తు ప్రతి బింబముగా నున్నదని నీవు ప్రత్యక్షముగా చూచుచు దానికి అద్దముగా నున్న యాత్మను చూచుట లేదని ఎట్లు చెప్పుచున్నావు? ప్రతిబింబమును చూచినఁవాడు అద్దమును చూడకుండునా? ఈ విధముగా సభలో, అందును జనకునియెదుట, మాటాడుచు ఓడిపోయి పరిభవింపఁబడితినని ఏల గ్రహింపకున్నావు''

ఆమె ఇట్లు అడుగఁగా అతఁడు సిగ్గుపడి తలవంచుకొని కొంచెముసేపు ఆలోచించి ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానము తోఁచక ఇట్లనెను, ''అమ్మా! నీవడిగినప్రశ్నకు నాకు సమాధానము తెలియదు. నేను నీకు శిష్యుఁడ నగుచున్నాను. అవేద్యమైన యాత్మను తెలిసి అమృతత్వమును పొందుట'' అన్నది ఎట్లు నిరూపింపఁబడినదో చెప్పుము. నేను అసత్యమును చెప్పను. అది తపస్సును హరించును.''

అష్టావక్రునియొక్క సత్యవచనమునకు ఆమె ప్రసన్నురాలై ఎల్లరు వినుచుండఁగా వానితో నిట్లనెను. ''కుమారా! దీనిని తెలిసి కొనకపోవుటవలననే అనేకులు భ్రాంతి నొందుచున్నారు. ఇది శుష్కతర్కములచేత తెలియునది కాదు. శాస్త్రములయందు ఎల్ల యెడల ఇది చాల రహస్యముగా నుంచఁబడినది. ఇంతమంది సభాసదులలో ఒకఁడును దీని నెఱుంగఁడు. ఇచ్చట ఈరాజు నేను తప్ప ఇంకెవరును దీని నెఱుంగరు. వివాదములలో ఎచ్చటను ప్రశ్నోత్తరములలో ఇది కన్పింపదు. తర్కమును మాత్రమే ఆశ్రయించినవిద్వాంసులు దీనిని తెలిసికొనఁజాలరు. ఎంత సూక్ష్మబుద్ధితో తర్కించినను సద్గురు సేవ దేవతానుగ్రహము లేకుండ ఇది తెలియదు. తనవిషయముగా కాక వెలుపలనున్న యేదో వస్తువును పరిశీలించుచున్నట్లుగా తటస్థమైనబుద్ధితో దీనినికూర్చి ఎంతగా విన్నను ఇది బోధపడదు. తనవిషయముగా మనస్సునకు పట్టనంతవఱకు ఎవనికైనను దీనిని వేయివిధములుగా బోధించినను ఆబోధ వ్యర్థమే యగును. ఏకారణము వలననో ఒకఁడు తనకంఠమునందే యున్న ముత్యాలహారమును విస్మరించి అంతటను వెదకి అది దొంగలచే హరిపఁబడె నని తలంచుచుండె ననుకొనుము. అప్పు డెవఁడైనను ఇంకొకఁడు వచ్చి, ''హారము నీకంఠమునందే ఉన్న దయ్యా!'' అని చెప్పినప్పుడు వాఁడుతన్ను తాను చూచుకొని కంఠమునందున్న హారమును చేతితో పైకి తీసికొని చూచువఱకు వాని కది లభించినట్లు కాదు. అంతవఱకు వాఁడు ఎంతసూక్ష్మబుద్దితో ఆలోచించినను దానిని పొందలేఁడు. అట్లే ఆత్మతనస్వరూపమే అని ఎన్ని పర్యాయములు విన్నను ప్రశాంతచిత్తుఁడై, ''నాస్వరూపము ఇట్టి దగునా కాదా'' అని విచారించుటకు పూనుకొను వఱకు అది తెలియదు. తన స్వరూపము తనయందు కాక ఎచ్చట ఏవిధముగా తెలియును?

దీపము తనచుట్టునున్న పదార్థములను ప్రకాశింపఁజేయును. కాని ఒకదీపము మఱియొక దీపమును ప్రకాశింపఁజేయుట లేదు. సూర్యుఁడుదయించినప్పుడు సకలపదార్థములు ప్రకాశించును, సూర్యుని వెలుఁగు దీపములపై కూడ ప్రసరింపవచ్చును. తక్కిన పదార్థముల వలె అవి సూర్యుని కాంతివలన ప్రకాశమును పొందవు. అంత మాత్రముచేత ''ఆదీపములు లేవు; అవి ప్రకాశించుట లేదు'' అని చెప్పుట తగునా? సూర్యుని కాంతిలో కూడ దీపములయందు వానికి సహజము స్వతంత్రమును అయిన వెలుఁగు ఎట్లు ఉన్నదో అట్లేచైత న్యముయొక్క ప్రకాశము కూడ ప్రతి పదార్థమునందును ఉండనేయున్నది. అది ఎక్కడ లేదో చెప్పుము. దీపముల వెలుఁగు పరిమితము. కొన్ని యెడల ఒక్కొక్కప్పుడు అది ప్రకాశింపకపోవచ్చును. కాని అపరిమితము సర్వవ్యాపకము స్వయంప్రకాశమును అయిన చైతన్యము ప్రకాశింపకుండుట అన్నది లేదు. ''ఆత్మ తెలిసికొనుటకు వీలు లేనిది. అది ప్రకాశించుచున్నది'' అన్నమాట ఎట్లు కుదురును అని నీవు సంశయించుచున్నావు. సూర్యుని వెలుఁగులో చిన్నదీపములను మనము గమనింపము. అంతమాత్రమున వానిలో వెలుఁగులేదని చెప్పవచ్చునా? అట్లే మనము గమనించినను గమనింపకున్నను సకల పదార్థములయందును ఆత్మయొక్క చైతన్యము ఉన్నది. ఈవిషయమును నీవు అంతర్ముఖమైన దృష్టితో చక్కఁగా విచారింపుము. సర్వమునకు ఆశ్రయమై సర్వమును ప్రకాశింపఁజేయుచున్న ఈచిచ్ఛక్తి ఎప్పుడు ఎక్కడ ప్రకాశించుట లేదు? అది ప్రకాశింపనప్పుడు ఏది ప్రకాశించునో చెప్పుము, నిద్రయందు ప్రళయమునందు పదార్థమేదియు ప్రకాశింపకున్నను చైతన్యము ప్రకాశించుచునే యుండును. నిద్రనుండి లేచినవాఁడు, ''సుఖముగా నిద్రించితిని. నా కేదియు తెలియలేదు'' అని చెప్పును. సుఖము ఏదియు లేకుండుట అను రెండింటిని నిద్రలో ఆత్మరూపమైన చైతన్యమే చూచుచున్నది కావున నిద్రలో ఆత్మచైతన్యము ప్రకాశించుచునే యున్నది, ''అయ్యా! నిద్రలో ఏదియు ప్రకాశింపకుండుటయే తోఁచుచున్నది. అది చైతన్యము కాదు'' అని నీవనవచ్చును. కాని ఏది ప్రకాశింపదో అది ఎట్లు తోఁచును. ప్రకాశింపలేదు అని తోఁచుట చైతన్యమువలననే సంభవించుచున్నది. అట్టి చైతన్యము ఎప్పుడైనను ఎక్కడైనను ఎట్లు భాసింపకుండును? బెయినచో అది నిరంతరము ఎట్లు భాసించుచున్నదో నీవే సూక్ష్మముగా విమర్శింపుము. కంటికి కన్పించునట్టి చెట్టునో జంతువునో బుద్దిమంతు లందఱు విమర్శింపఁగలరు. అట్లు గోచరము కాని యీయాత్మచైతన్యమును నిపుణులైన విద్వాంసులుకూడ గుర్తింప లేకున్నారు. వారు అనంతములైన విషయములపై దృష్టికలవారై సంసారపరాయణు లగుచున్నారు. ఎవనిదృష్టి యైనను ఎంతవఱకు విషయములయందు ప్రవృత్తిని విడిచి పెట్టదో అంతవఱకును అది ఏవిధముగా నైనను అంతర్ముఖము కానేరదు. ఎంతవఱకు అంతర్ముఖమైన దృష్టి కలుగదో అంతవఱకును ఆత్మ గోచరింపదు. సంకల్పము పూర్తిగా పోయినప్పుడే మనస్సునను అంతర్దృష్టి కలుగును. సంకల్పములతో నున్న మనస్సునకు అంతర్ధృష్టి అసంభవము. కావున మనస్సునుండి సంకల్పమును పూర్తిగా తొలఁగించి స్వరూపమును పొందుము. కుండలో బియ్య మున్నప్పుడు వానిని తొలఁగించినచో వెంటనే ఆకాశము దానిని నింపివేయును. కుండలో ఆకాశమును నింపుటకు ప్రయత్న మక్కఱ లేదు. అట్లే మనస్సులోనున్న సంకల్పములను తొలఁగించిన చాలును. ఆత్మస్వరూపమును నింపుటకై ప్రయత్నము అక్కఱలేదు. ఆత్మదానియందు సహజముగనే నిండి యుండును. కావున సంకల్పములను తొలఁగించి క్షణకాలము స్వరూపమును ఆశ్రయించి ఆలోచన లేకుండ నుండుము. తరువాత ఆస్వరూపస్థితిని స్మరించి ఆదశయందు కలుగుచుండిన స్ఫురణము స్వతసిద్ధముగానున్నదా లేక మఱిదేనిచేతనైనను కలుగుచున్నదా అని విమర్శింపుము. అట్లు విమర్శించుటవలన ''తెలిసికొనుటకు సాధ్యము కానిదిగానున్న యాత్మచైతన్యము ఇట్లు కదా తెలియఁబడుచున్నది'' అని ఆప్రకారమంతయు నీవు తెలిసికొనఁగలవు. ఈకారణముచేత ఆత్మతత్త్వము అవేద్యము (Unknowable) సువేద్యము (Easily knowable) అనియు అనియు చెప్పఁబడుచున్నది. కావున ఈ విధముగా అవే ద్యమైన దానిని కూడ తెలిసికొని అమృతస్థితిని పొందవచ్చును. నీ వడిగిన దంతయు చెప్పితిని మునిపుత్ర! నీకు నమస్కారము. నేను పోయివత్తును. ఒక్కసారి మాత్రమే వినుటచేత ఇది నీకు చక్కఁగా తెలియక పోవచ్చును. నీసందేహములను ఈరాజు నడుగుము. ఈయన బుద్ధిమంతులతో శ్రేష్ఠుఁడు. నీసందేహముల నన్నింటిని తీర్పఁగలఁడు.

పిమ్మట రాజు ఆమెను పూజించెను. సభాసదులు ఆమెకు ప్రణమిల్లిరి. గానిచేత చెదరి మాయమైపోవు సన్నని మేఘమువలె ఆమె క్షణములో అంతర్ధానమును పొందెను. కావున భార్గవా! తత్త్వమును తెలికొనుటకు పద్ధతి యిట్టిది.''

జ్ఞానఖండమునందు అష్టావక్రునికథ యన్నది పంచదశాధ్యాయము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters