Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

ద్వితీయాధ్యాయము-విచారమాహాత్మ్యము

భార్గవరాముఁడు గురువునకు ప్రణమిల్లి అంజలించి ఇట్లు పలికెను. ''భగవానుఁడా! పూర్వము క్రోధముతో రాజవంశములను ఇరువదియొక్కమారులు సంహరించి రక్తముతో నిండినమడుగులో పితరులకు తర్పణము గావించితిని. నాభక్తివిశేషమువలన పితృదేవతలు సంతుష్టులై నాక్రోధమును ఉపశమింపఁజేసిరి. మాతండ్రిగారి యాజ్ఞవలన శాంతుఁడ నైతిని. ఇప్పుడు విష్ణుదేవుఁడు శ్రీరాముఁడుగా అయోధ్యయందు అవతరించియున్నాఁడు. ఆయనయందు కూడ నేను క్రోధముచేత అంధుఁడనై బలగర్వముతో ఆయనను ఎదుర్కొంటిని. ఆయన నాబలగర్వమును తొలఁగించి పరాజితుని చేసి బ్రాహ్మణుఁడ నని దయతలఁచి ప్రాణములతో విడిచిపెట్టెను. అచ్చట నుండి తిరిగి వచ్చుచు నిర్వేదముతో నే నెంతయో దుఃఖించితిని. అప్పుడు మార్గమునందు నివుఱు గప్పిన నిప్పువలె నున్న సంవర్తుని ఆకస్మికముగా చూచితిని. ఆయన అవధూతేంద్రుఁడని స్ఫురించెను. సంతప్తుఁడైనవానికి చల్లనిగాలి సోకినట్లు ఆయనయొక్క సమాగమమున నాహృదయము చల్లఁబడి ఎంతోమాయి నొందితిని. అప్పుడాయనను, ''అయ్యా! తమస్థితి ఎట్టిది?'' అని ప్రశ్నించితిని. ఆయన తత్త్వముయొక్క సారనమును ముద్దగా చేసి అమృతమును వలె నాకు అందించెను. దరిద్రుడు మహారాజ్ఞిని ఎట్లు తఱచి తఱచి ప్రశ్నింపఁజాలఁడో అట్లే నేనును ఆయనను వివరముగ అడుగఁజాలనైతిని. అయినను అది నాకు నెట్లు సులభముగ తెలియునో అట్లు చెప్పుఁడని ఆయనను ప్రార్థించితిని. అప్పు డాయన తమయొద్దకు పొమ్మని చెప్పెను. పిమ్మట గ్రుడ్డివాఁడు జనులను చేరుకొన్నట్లు నేను మిగుల సుఖప్రదములైన తమపాదములయొద్దకు చేరితిని.

తమవలన త్రిపురాదేవియొక్క మాహాత్మ్యమును సమగ్రమముగా విని ఆమెను భక్తితో ఉపాసించితిని. ఆమె తమయొక్క రూపమున నాచిత్తమునందు నిత్యము భాసించుచున్నది. దీనివలన ఫలమేమి? సంవర్తుఁడు చెప్పిన దేమో కొంచెము కూడ తెలియలేదు. భగవానుఁడా దయయుంచి ఆయన ఏమి చెప్పెనో అది నాకు బోధింపుఁడు. అది తెలియకున్నచో నాకు కృతకృత్యతకలుగదు. దానిని తెలిసికొనకుండ నేను చేయుచున్నదంతయు బాలక్రీడవలె తోఁచుచున్నది. పూర్వము నేను గొప్పదక్షిణలతో విశేషమైన యన్నప్రదానముతో పెక్కు యజ్ఞములను చేసితిని. వానిఫల మంతయు అల్పమే యని సంవర్తుఁడనెను. ఏది అల్పఫలమో అది అన్నివిధముల దుఃఖమే యగు నని తలంచుచున్నాను. సుఖము లేకుండుట దుఃఖము కాదని అల్పమైన సుఖమే దుఃఖ మని చెప్పుదురు. ఎందువల్ల ననఁగా సుఖము పోవునప్పుడు కలుగు దుఃఖము అసలు సుఖమే లేనప్పటి దుఃఖముకన్న మిగుల బాధాకరముగ నుండును. ఇంతమాత్రమే కాదు. అధికమైనసుఖమును సంపాదించినను అది కూడ ఎప్పుడైనను పోవచ్చు ననుభయము ఉండనేయున్నది. ఇంక ఏకర్మలు చేసినను ఏయుపాసనలు చేసినను మృత్యువు రాదు అనుమాట లేదు. త్రిపురాదేవి యుపాసనము కూడ మానసికమైన క్రియయే యగుటచేత అదియును బాలక్రీడవలెనే యున్నది. ఇది ఇట్లు కాకున్నను శాస్త్రభేదముచేత ఇంకొక విధముగా చేయవచ్చును. ఈయుపాసనమును ఈదేవిని గాక మఱియొక దేవతను ఆలంబనముగా గైకొని యైనను చేయవచ్చును. ఏదేవతను ఎట్లు ఉపాసించినను ఈయుపాసనాఫలము కూడ యజ్ఞముల ఫలములవలె ఆసత్యమే యగును. అసత్యము సత్యముతో సమయాన మెట్లగును? కర్మ గాని, ఉపాసన గాని కర్తవ్యమన్నచో అది నిత్యము చేయవలసియే యుండును. ఇంక దానికి అవధి ఎక్కడ? భగవంతుఁడైన యాసంవర్తుఁడు కర్తవ్యలేశము అను విషాగ్నిజ్వాలకు దూరుఁడై సకలవిధముల చల్లగా నున్నట్లు కన్పించినాఁడు. దావాగ్ని వనమును దహించుచుండఁగా దానికి ఎడముగా నున్నమంచి నీటి కొలనులో క్రీడించుచున్న గజమువలె ఆయన అభయమైన మార్గమును ఆశ్రయించి ఈలోకవ్యవవహారమును చూచి నవ్వుచున్నవానివలె నాకు కన్పించినాఁడు. ఆయన ఎట్టి కర్తవ్యము లేక సంతోషము అనునమృతమును ఆస్వాదించుచు ఆనందించుచున్నాఁడు. ఆయనకు అట్టి స్థితి ఎట్లు కలిగినది? అప్పుడాయన నాకు చెప్పినది ఏమి? ఇదియంతయు నాకు తమరు దయతో చెప్పి నన్ను కర్తవ్యము అను కాలసర్పమునుండి విముక్తుని గావింపవలయును.''

ఇట్లు ప్రార్థించి భార్గవుఁడు గురువుయొక్క చరణములయందు సాష్టాంగముగ ప్రణమిల్లెను. అప్పుడు భార్గవుఁడు ముక్తిమార్గమున ప్రవేశించుటకు అర్హుఁడై యున్నాఁడని గ్రహించి దత్తాత్రేయుఁడు దయతో ఇట్లనెను. ''వత్స! లెమ్ము. ధన్యుఁడ వైతివి సముద్రములో మునుగుచున్నవానికి నౌకవలె నీకు ఈయాలోచన కలిగినది. సకల కర్మానుష్ఠానములవలనను కలుగవలసిన ఫల మిదియే. సకల ప్రాణులహృదయములందును ఆకాశరూపమున నున్న యాత్రిపురాదేవి 'నీవు తప్ప నాకు వేఱు శరణము లేదు' అని తన్ను ఆశ్రయించుభక్తుని మృత్యువులపరంపరనుండి తప్పించి పరమపావనమైన పదమునకు చేర్చును. కర్తవ్యము అను భేతాళుని చూచి భయపడుచున్నంతవఱకు సుఖ ముండదు. కర్తవ్యము అను విషముచేత మూర్ఛితమై యున్నయీ జగత్తును చూడుము. ఇది తనకు ఏది హితమో దానిని గుర్తింపఁజాలకున్నది. అనాదికాలమునుండి ఇది భయంకరమైన కర్తవ్యమను విషసముద్రమునందు ఉడికిపోవుచు గతిని గానలేకున్నది.

కొందఱు బాటసారులు ఒకప్పుడు వింధ్యపర్వతమును చేరిరి. వారు ఆకలియొక్క తీవ్రతచేత కనులు తిరుగుచుండఁగా విషముష్టిపండ్లను చూచి తుమ్మికిపండ్లు అనుకొని భక్షించిరి. ఆపండ్లవలన కలిగిన విషజ్వాలచేత శరీరములయందు తాపము బయలుదేరగా వారు ఆతాపశాంతికై నిమ్మపండ్లనుకొని ఉమ్మెత్త పండ్లను తినిరి. దానిచేత వారు ఉన్మత్తులై ఒకరితో నొకరు కలహించుచు కొట్టుకొనుచు ముండ్ల పొదలలో పడి శరీరముల నిండ గాయము లగుచుండఁగా అర్థరాత్రికి ఒకనగరద్వారమును చేరిరి; ద్వారపాలకులు అడ్డగింపఁగా వారితో కలహంచిరి. ఆద్వారపాలకులు బెత్తములతో కొట్టనారంభింపఁగా వీరిలో కొందఱు అగడ్తలో కూపములలో పడి మరణించిరి. మఱి కొందఱు బందీలుగా పట్టువడిరి. లోకములో జనులు కూడ ఏదో మేలును కోరుచు కర్తవ్యవిషముచే మూర్ఛితులై నశించుచున్నారు.

భార్గవా! నీవు ధన్యుఁడవు; అభ్యుదయము నొందితివి. శ్రేయస్సు అనుమహాసౌధమును ఆరోహించుటకు మొదటిమెట్టు విచారణమే. సరియైన విచారణము లేకుండ ఎవనికైనను క్షేమము ఎట్లు కలుగును! ఆవిచారమే పెద్ద మృత్యువు. దానిచేతనే జను లందఱు హతులగుచున్నారు. విమర్శించి పనిచేయువాఁడు ఎల్లయెడల అభీష్టమును పొంది జయించుచున్నాఁడు. అవిచారముచే రాక్షసులు హతులైరి. దేవతలు విచారపరాయణులై సుఖము నొందిరి. వారు విచారమువలననే విష్ణువును ఆశ్రయించి శత్రువులను జయించుచున్నారు. సుఖ మనువృక్షమునకు చాల శక్తివంతమైన విత్తనము విచారము. విచారము గలవాఁడే అందఱకన్న అధికుఁ డగుచున్నాఁడు. దానిచేతనే బ్రహ్మవిష్ణుమహేశ్వరులు పూజింపఁబడుచున్నారు. దానిని కోల్పోయినప్పుడు వారు కూడ ఆపదలపాలైనారు. ఎవరు క్షణమైనను విచారమును వదలియుండరో వారే మహాత్ములు. వారికి నిరంతరము నమస్కరించుచున్నాను.

జనులు విమర్శింపకుండ కర్తవ్యములపాలై మూఢులగుచున్నారు. కొందఱు విచారించి అపారములైన సంకటములనుండి విముక్తి నొందుచున్నారు. ఈయవిచారము ఎప్పటినుండియో లోకములను ఆవరించియున్నది. ఎండలు మండుచుండఁగా ఎడారిలో చల్లని నీరు ఎట్లుదొరకదో అట్లే అవిచార మున్నంతవఱకు విమర్శపుట్టదు. విచారము కలుగుటకు దేవియారాధనమే పరమసాధనము. భక్తితో పరదేవతను ఆరాధించినచో ఆమె ప్రసన్నురాలై, ఆకాశము నందు సూర్యునివలె, చిత్తమునందు విచారరూపమున ప్రకాశించును. కావున కపటము లేకుండ గురువును సేవించి ఆయన భోధించిన క్రమమున సర్వాంతర్యామిని ఆత్మరూపయునైన త్రిపురామహేశ్వరిని ఆరాధింపవలయును. నిర్మలమైన భక్తి శ్రద్ధ ఆరాధనమునకు మూలములు. ఆమెమహాత్మ్యమును వినుటవలన భక్తి శ్రద్ధలు కలుగును. కావుననే నీకు మొదట మాహాత్మ్యమును వినిపించితిని. దానిని వినుటవలన ఇప్పుడు నీకు ఈశుభము కలిగినది. విచారము శ్రేయస్సునకు మూలము. కావున ఇంక నీకు భయము లేదు. సన్నిపాతజ్వరము వచ్చినవాఁడు ఔషధమును సేవించునప్పుడు ధాతువులయొక్క పరిశుద్ధత కలుగువఱకు భయముండును. అట్లే అవిచారమున్నంతవఱకు జీవులకు మహాభయము తప్పదు. విమర్శనము పుట్టనంతవఱకు కలుగుజన్మ లన్నియు నిష్ఫలములు. విమర్శనము కలజన్మమే సఫలము. బావిలోని కప్పవలె ఈబ్రహ్మాండ మనుకూపమునందు జీవులు శుభ##మేదో అశుభ మేదియో విమర్శించి గ్రమింపలేక పుట్టి పుట్టి నశించుచున్నారు. దుఃఖమును కలిగించు వానియుందు సుఖబుద్ధిని, సుఖమును కలిగించువానియందు దుఃఖమను తలంపును పొందుచు అవిచారముయొక్క ప్రభావమువలన సంసారాగ్ని యందు ఉడికిపోవుచున్నారు. ఆడగాడిద వెనుకకాళ్ళతో ఎన్ని పర్యాయములు తన్నుచున్నను మగగాడిద దానివెంటనే ఎట్లు పోవుచుండునో అట్లే జనులు పూడ సంసారమువలన ఎన్ని దుఃఖములు పొందుచున్నను దానిని వదలలేకున్నారు. నీవు విచారాత్మకమైన బుద్ధిని పొందితివి; కావున దుఃఖమును తరింపఁగలవు.

ఇదిజ్ఞానఖండమున విచారమాహాత్మ్యమన్నది ద్వితీయాధ్యాయము.

బాలప్రియ

ఉపాసన మానసికమైనక్రియ. అది కర్తవ్యముగా తోఁచుచున్నంతవఱకు సుఖము కలుగదు. ఆయుపాసనవలన విచారము కలుగవలె. తత్త్వమును విచారించినప్పుడు ఆత్మజ్ఞానము కలుగును. అప్పుడు కర్తవ్యబుద్ధిపోయి సుఖము కలుగును.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters