Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

ఇరువదియవయధ్యాయము -విద్యాగీత

దత్తాత్రేయుఁడు పరశురామునితో మరల ఇట్లు చెప్పెను. "ఈవిషయమున ఒకవృత్తాంతమును చెప్పెదను వినుము. పూర్వము సత్యలోకమున బ్రహ్మదేవుని సభయందు ఒకసారి వసిష్ఠవిశ్వామిత్రగౌతమాదిమహర్షులు రాజర్షి శ్రేష్ఠులును చేరి జ్ఞానసిద్ధినిగూర్చి సూక్ష్మాతిసూక్ష్మములైన నిరూపణములతో చర్చించుకొని తుదకు ఆపరమేష్ఠి నిట్లు ప్రశ్నించిరి. "భగవానుఁడా! మే మందఱమును లోకవ్యవహారమును పరతత్త్వమును కూడ తెలసికొని జ్ఞానులమై యున్నాము. స్వభావముల యందలి భేదములచేత మాలో కొందఱు సమాధియందే ఎక్కువగా కాలము గడుపుచుండుఁగా, మఱికొందఱు వాదప్రతివాదములందు ఆసక్తులై యున్నారు. కొందఱు భక్తి నిమగ్నులై యుండఁగా కొందఱు కర్మపరాయణులై యున్నారు. ఇంకను కొందఱు బహిర్ముఖులైన జనులవలె వ్యవహారపరులై యున్నారు. వీరిలో శ్రేష్ఠు లెవరో చెప్పుము. ఒక్కొక్క పక్షమును మాకు తోఁచినయుక్తులతో ప్రమాణములతో అవలంబించి అదియే శ్రేష్ఠ మని నిరూపించుచున్నాము. ఒకరు నిరూపించిన దానిని ఇతరులు అంగీకరించుట లేదు కావున నీవే నిర్ణయింపవలె" అప్పుడు ఆపరమేష్టి వారి కెవరికిని మనస్సు, విశ్వాసముతో కుదుటఁబడకుండుటను గమనించియిట్లనెను. "మునీంద్రులారా! మీ కున్నట్లే నాకును ఒకయభిప్రాయ మున్నది. మన మందఱమును ఈ విషయమును సర్వజ్ఞుఁడైన పరమేశ్వరునివలనఁదెలసికొందము."

పిమ్మట బ్రహ్మదేవుఁడు విష్ణువుతో మహర్షులతో పరమేశ్వరుని యొద్దకు పోయి మహర్షులవివాదవిషయమును వివరించెను. పరమేశ్వరుఁడు ఇట్లనుకొనెను. "వీరియందు శ్రద్ధ విశ్వాసము కన్పించుటలేదు. ప్రతివ్యక్తియు తన యభిప్రాయమే సిద్ధాంత మని దృఢముగ అనుకొనుచున్నాఁడు. ఇప్పుడు నేను ఏది చెప్పినను వీరు అది నాయభిప్రాయమునుగా మాత్రమే తలంతురు గాని యథార్థమైన తత్త్వమునుగా గుర్తింపరు. కావున ఇప్పుడు నేనేమి చెప్పినను వ్యర్థమే యగును." ఇట్లు తలంచి ఆయన "అయ్యా! నాకును ఇది స్పష్టముగా తెలియదు. మన మందఱమును విద్యారూపిణియైన త్రిపురాపరమేశ్వరిని ధ్యానించి ఆమెవలన ఈవిషయమును తెలిసికొందుము" అని పలికెను.

అంతట వారందఱును ఆమహాదేవిని ధ్యానించిరి. అప్పుడామహేశ్వరి ఆకాశమునందు శబ్దమయమైన రూపముతో ఆవిర్భవించి, "ఋషులారా! త్వరగా చెప్పుఁడు. ఏల మీరు నన్ను ధ్యానించితిరి? నా భక్తులకు ఎప్పుడును కోరిక తీరకపోవుట యన్నది. లేదు." అని మేఘగర్జనస్వరముతో పలికెను. అప్పుడు వారందఱును ఆమెకు ప్రణమిల్లి స్తుతించి ఇట్లనిరి. "శ్రీవిద్యారూపిణివైన యోత్రిపురేశ్వరీ! నీకు నమస్కారము, అమ్మా! నీవుసృష్టిస్థితిలయకారిణివి. సర్వజ్ఞురాలవు. సర్వరూపిణివి. ఎల్లరకును నీవే హర్షమును గలిగించుచున్నావు. దేవీ! నీకు మరల మరల నమస్కరించుచున్నాము. నీయొక్క పరరూపము, అపరరూపము, ఈశ్వరత్వము, జ్ఞానము, దానిఫలము, అందులకు ముఖ్యసాధనము, సాధకుఁడు, సిద్ధి, సిద్ధియొక్క పరాకాష్ఠ, జ్ఞానసిద్దులలో ఉత్తముఁడు-అను నీవిషయములను దయతో చెప్పుము. నీకు మరల నమస్కరించుచున్నాము."

పరరూపము :

విద్యారూపిణియైన యామహాదేవి దయతో నిట్లుస్పష్టముగా చెప్పెను. "ఋషులారా! అందఱును శ్రద్ధతో వినుఁడు. శాస్త్రమను మహాసముద్రమునుండి అమృతమువంటి సారమును మీకు అందించుచున్నాను. దేనియందు ఈజగత్తు సృష్టిస్థితిలయములను పొందుచున్నదో, ఏది అజ్ఞులకు జగద్రూపమున గోచరించుచున్నదో అదియే నా పరరూపము. అదియే యోగులకు అంతరంగమున గంభీరమైన చైతన్య మహాసముద్రవలె నిర్వికల్పముగా నిశ్చలముగా భాసించుచున్నది. కొందఱు నాయీపరరూపమును అద్వితీయమైన తమస్వరూపమునుగా తెలిసికొనుచుండియు స్వభావవశమున మహాభక్తులై బలవంతముగా భేదమును కల్పించుకొని ఆరాధించుచున్నారు. అంతఃకరణము ఇంద్రియములు దేహము మొదలగువానికి అన్నింటికిని ప్రాణసూత్రములె నుండి ఇదియే వానిని నడుపుచున్నది ఇది భాసింపకున్నచో లోకమున ఏదియు భాసింపదు. శాస్త్రములు నాయీపరరూపమును ఇట్లు నిరూపించుచున్నవి.

అపరరూపము:

ఇంక నాయపరరూపమును వినుఁడు అనేక బ్రహ్మాండములకు వెలుపల ఊర్ధ్వముగానున్న యమృతసముద్రమునందు మణిద్వీపములో కడిమిచెట్లవనమునందు మనోహరమైన చింతామణిమందిరమున ఒకయద్భుతమైన మంచము కలదు. దానికి బ్రహ్మ విష్ణువు రుద్రుఁడు ఈశ్వరుఁడు నాలుగు కాళ్ళుగా నుండగా సదాశివుఁడు పాన్పుకొఱకు ఏర్పరచినపలకగా నుండును. కావున దానిని పంచబ్రహ్మమయమైన మంచ మందురు. దానియందు కామేశ్వరుఁడు కామేశ్వరి అను ననాది మిధునముగా ప్రకాశించురూపము నాయొక్క అపరరూపము. జాగ్రత్తు స్వప్నము సుషుప్తి అనుమూఁడుపురములందు సకలజీవులలో ఇది ప్రకాశించుచుండును. గావున దీనిని త్రిపురసుందరరూపమనియు చెప్పుదురు. మఱియును సదాశివుఁడు ఈశానుఁడు బ్రహ్మవిష్ణువు త్రిలోచనుఁడు గణపతి కుమారస్వామి దిక్పాలకులు శక్తులు గణదేవతలు సురులు అసురులు యక్షులు కింపురుషులు నాగులు మొదలుగా పూజ్యులైనవారందఱును నాయొక్క అపరరూపములుగానే కీర్తింపఁబడుచున్నారు. ఇట్లు ఈరూపములలో అన్నియెడలను నేనే యున్నను మాయచేత మూఢులైన జనులు నన్ను తెలిసికొనలేకున్నారు. ఈరూపములద్వారమున నేనే పూజింపఁబడుచు భక్తుల కోరికలను తీర్చుచున్నాను. నేను తప్ప పూజింపఁదగినది కాని ఫలమిచ్చునట్టి దేవత గాని ఇంకెవరును లేరు. ఎవఁడు ఏవిధముగా నున్న భావించునో వాఁడు ఆవిధముగా నావలన ఫలమును పొందును.

ఐశ్వర్యము:

నాయైశ్వర్యమునకు మితి లేదు. కేవలము చైతన్యరూపిణిగా ఏకరూపమున నున్న నేను ఇతరద్రవ్యముతో అక్కఱ లేకయే జగత్తు యొక్క రూపమున భాసించుచున్నాను. అట్లు భాసించుచున్నను నా యందు రెండవవస్తువు లేదు. ఒక్కవస్తువు తనయేకత్వమునకు భంగము లేకుండ పెక్కురూపములతో భాసించుచుండుట నిజముగా దుర్ఘటము. ఆట్లు దుర్ఘటమైనదానిని సుసంఘటితముగా భాసింపఁజేయుచుండుటయే ముఖ్యమైన నాయీశ్వరత్వము. సూక్ష్మదృష్టితో నాయైశ్వర్యమును చూడుఁడు. నేను సర్వమునకు ఆధారముగా నుండి అన్నింటియందును వ్యాపించియుండియును దేనితోను సంబంధమును పొందక కేవలముగా నున్నాను. నామాయచేతనే నాస్వరూపమును ఆవరించి సంసారము కలదాననై శిష్యత్వమును పొంది గురువు నాశ్రయించి ఆత్మతత్త్వమును తెలసికొని ముక్తురాల నగుచున్నాను. ఇట్లు అనేక పర్యాయములు ముక్తురాలనగుచున్నాను. నటుడు ఎన్నిసార్లు ఎన్నివేషములు ధరించినను అన్నియు అసత్యములే అయినట్లు సంసారమంతయు అసత్యమే యగుటచే నాస్వరూపమునందు ఎట్టిమార్పుకలుగదు. అందువలన నేను ఎల్లప్పుడును, అనఁగా సంసారము కలదానినిగా కన్పించుచున్నప్పుడు కూడ, ముక్తురాలనే. మఱియును అనంతవిచిత్ర మహితమైన యీజగత్తును. కుండ చేయుటకు మట్టివలె, ఏద్రవ్యము లేకయే సృష్టించుచున్నాను. నాయైశ్వర్యపరంపరలు ఇట్టివి అనేకములు కలవు. వానిని లెక్కించుటకు వేయి ముఖములుగ గల యాదిశేషునకు కూడ శక్యము కాదు.

జ్ఞానము :

ద్వైతము అద్వైతము పరము అపరము మొదలగు భేదముల చేత నాజ్ఞానము బహువిధములుగా నున్నది. వానివలన కలుగు ఫలము కూడ బహువిధములుగా నున్నది.

ద్వైతజ్ఞానము :

ద్వైతమునందు థ్యానించువాఁడు తనస్వరూపముకన్న భిన్నముగా ఒకానొకదేవతారూపమునో మంత్రమునో అవలంబించుచుండును. దేవతామూర్తులలో మంత్రములలో ఎన్నో భేదములు కలవు. అందువలన ద్వైతజ్ఞానము బహువిధములుగా నున్నది. ఆధ్యానము స్వప్న రాజ్యముతో సమానము అయినను అది చిత్తశుద్ధిని కలిగించుచు సఫలమే యగుచున్నది. ఈధ్యానములలో నాయొక్క అపరరూపములలో ముఖ్యమైనదిగా వెనుక చెప్పియున్న త్రిపురసుందరరూపమును అవలంబించి చేయుధ్యానమే ముఖ్యమైనది. ఇదియే చిత్తశుద్ధి మొదలుగా జ్ఞానసిద్ధికి సాధనములను సమకూర్చును. కాని అద్వైతవిజ్ఞానమే శ్రేష్టమైనది. విద్యారూపిణినైన నన్ను చిరకాలము ఆరాధింపకుండ ఎవఁడైనను అద్వైతజ్ఞానమును ఎట్లు పొందఁగలడు?

అద్వైతజ్ఞానము :

దృశ్యమైన రెండవపదార్థ మేదియు లేక కేవలముగా స్వయముగా ప్రకాశించు పరమచైతన్యమే అద్వైతజ్ఞానము. అది అపరోక్షముగా అనుభవమునకు వచ్చినప్పుడు (Direct experience) ద్వైతజ్ఞానమును తిరస్కరించును. అద్దమును తెలికొన్నతరువాత దానియందు ప్రతిబింబములుగా గోచరించుచున్న సర్పములు వ్యాఘ్రములు ఎట్లు భయము కంపము మొదలగువానిని కలిగింపఁజాలవో అట్లే అద్వైతజ్ఞానము కలిగినతరువాత అజ్ఞానమునందు ప్రతిబింబించుచున్న దృశ్యప్రపంచములోని సర్పములు వ్యాఘ్రములు కూడ ఆసత్యములై భయము కంపము మొదలగువానిని కలిగంపఁజాలవు. చిత్తము శుద్ధమైనచిదాత్మతో ఏకమై నిర్వికల్పసమాధిని పొందినతరువాత, సమాధి నుండి లేచినవాఁడు. ''సమాధియందు ఏశుద్ధచిదాత్మగ నున్నానో ఇప్పుడును ఆశుద్ధచిదాత్మగనే యున్నాను'' అని గుర్తించును. అట్లు గుర్తించుటయే ప్రత్యభిజ్ఞానము.

పరజ్ఞానము :

సమాధియందువలెనే తక్కిన సమయములందును స్వరూపమును గుర్తించుచుండుట పరజ్ఞానము. అది కలిగినతరువాత వ్యవహారమున గోచరించు ఏపదార్థమునందు సత్యత్వబుద్ధి కలుగదు. అద్దమునకు భిన్నముగా ప్రతిబింబములకు ఎట్లు అస్థిత్వము (Existence) లేదో ఆత్మయందు ప్రతిబింబించుచున్న సకలపదార్థములకు ఆత్మకు భిన్నముగా అస్తిత్వములేదు. ఈవిజ్ఞానము కలిగినచో, గాలిచేత మేఘములవలె, సంశయము లన్నియు ఎగిరిపోవును. ఈపరాజ్ఞానము కలిగిన తరువాత కామము క్రోధము మొదలుగా సంస్కారములు కొన్ని మిగిలియున్నను అవి కోరలు తీసినపాములవలె పడియుండును. ఇది పరజ్ఞానము.

అపరజ్ఞానము :

ఇంక శ్రవణముచేతఁగాని తర్కముచేతఁగాని దేహము ఇంద్రియములు మొదలగువానికి అతీతమైన కేవలచిదాత్మయొక్క స్వరూపమును బుద్ధిచేత నిశ్చితముగా గ్రహించుట అపరజ్ఞాసము, ఇదియే పరోక్షజ్ఞానము. ఇది దేహము ప్రాణము మొదలగువానియందుండు ''నేను'' అనునభిమానమును నశింపఁజేయును.

పరజ్ఞానఫలము :

ఇంక పరజ్ఞానముయొక్క ఫలమును వినుఁడు. పరజ్ఞానము కలిగినంతనే సకలదుఃఖములు నశించును. ఎచ్చటను దేనివలనను భయము కలుగకుండుటయే మోక్షఫలము. ''ఇది తేలు, ఇది పాము, ఇధి పెద్దపులి'' అని రెండవవస్తువు తోఁచినప్పుడే లోకమున భయము కలుగుచున్నది. గాఢనిద్రలో రెండవవస్తువే భాసించదు. కావున భయము కలుగుట లేదు. అట్లే ఆత్మకన్న అన్యముగా ఏదియునులేదు అని రూఢిగ తెలిసివానికి వ్యవహారదశయందును. సూర్యోదయమున చీఁకటివలె, తనకన్న భిన్నముగా రెండవవస్తువే తోఁచదు. ద్వైతభావమును వీడినవానికి ఎచ్చటను ఎప్పుడును దేనివలనను భయము లేదు. కావున ఆత్మజ్ఞానముకన్న భిన్నములైన ఫలము లన్నియు భయకారణములే యగును. లోకములో పుత్రుఁడు భార్య గృహము ధనము మొదలుగా ఫలము లన్నియు కొంతకాలమునకు అంతమొందక తప్పదు. అవి యంతమొందు నేమో అనుభయము ఎప్పుడును ఉండనే యుండును. పుత్రభార్యాదులతోడి సంయోగము లన్నియు ఎప్పటి కైనను వియోగముతో ముగియక తప్పదు. కావున నశ్వరములైనవానివలన అభయ మెట్లు కలుగును? అభయరూపమైన మోక్షఫలమే యథార్థముగ ఫలము. స్వరూపమునందుండుటయే మోక్షము. తెలిసికొనుఁవాడు తెలిసికొనుట తెలిసికొనఁబడుచున్నవిషయము దాని వలన కలుగుఫలము అను ఈనాలుగు ఎప్పుడు ఒక్కటిగా తోఁచునో అప్పుడు అభయమైన మోక్షము కలుగును. ఇతరవస్తు భావముల నన్నింటిని తొలఁగించుకొన్నతరువాత, నిద్రలో తమస్సు ఆవరించినట్లు కాక, శుద్ధమైన యాత్మస్ఫురణము ఏది కలదో అదియే జ్ఞానము. తెలిసికొనుచున్న వానిస్వరూపము కూడ ఇదియే. అయినను మొదట వాఁడు తన స్వచ్ఛమైన స్వరూపమును గుర్తింపజాలఁడు. వానిచేత స్వరూపమును గుర్తింపఁజేయుటయే గురువు శాస్త్రము చేయుచున్నపని. వానిచేత తెలిసికొనఁబడుచున్న విషయము కూడ ఇదియే ఇట్లు జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అను మూడింటియొక్క భేదము తొలఁగిపోవుటయే ఫలము. ఈభేదములు నిజముగా లేవు; వ్యవహారముకొఱకు కల్పింపఁబడినవే. కావున క్రొత్తగా లభించినఫలము కూడ ఏదియు లేదు. ఎంత వఱకు జ్ఞాత జ్ఞానము జ్ఞాయము ఫలము అనుభేదములు భాసించుచుండునో అంత వఱకు కొండవలె సంసారము నిలిచియుండును. ఎప్పు డీభేదము లన్నియు నశించి వీనికి ఆశ్రయముగానున్న యాత్మ భాసించునో అప్పుడు సంసారము, గాలిచేత మేఘమువలె, విచ్ఛిన్నమై నశించును.

సాధనము :

ఇట్టి మోక్షమును పొందుటకు దానియందు గాఢమైనవాంఛయే సాధనము. దానియందు తత్పరత్వము లేనిచో ఇతరసాధనములు వేయియున్నను ప్రయోజనము లేదు. అది పూర్ణముగ నున్నచో వేఱొక సాధన మక్కఱ లేదు. ''ఎట్లయినను దీనిని సాధించును''అని ఎవఁడు తత్త్వరుఁడై యుండునో వాఁడు అన్నివిధములముక్తుఁడే అట్టిఁవాడు కొన్నిదినములలోఁగాని మాసములలోఁగాని సంవత్సరములలోఁగాని జన్మాంతరమునఁగాని తప్పక ముక్తుఁడగును. బుద్ధియొక్క నిర్మలత్వములోని భేదములనుబట్టి ముక్తి ఇప్పుడుగాని మఱికొంతకాలమునకుఁగాని సంభవించుచున్నది. సకలపురుషార్థములను నశింపఁజేయునట్టి దోషములు బుద్ధియందు అనేకము లుండును. వానిచేతనే జనులు ఎల్లప్పుడు ఘోరమైన సంసారమునందు తాపము నొందుచున్నారు. అనాశ్వాసము కామవాసన జడత్వము అని ఈదోషములు మూఁడువిధములుగా నున్నవి. సంశయము విపర్యయము అని అనాశ్వాసము రెండు విధములుగ నున్నది. మోక్షము ఉన్నదా లేదా అని సందేహించుట సంశయము. మోక్షము లేనేలేదని తలంచుట విపర్యయము. ఈరెండును తత్పరత్వమునకు ముఖ్యప్రతిబంధకములు. ''మోక్షము ఉన్నది'' అన్న దృఢనిశ్చయముచేతనే ఈరెండు క్రమముగా నశించును. వేదవిరుద్ధమైన తర్కము అనాశ్వాసమునకు మూలము. అట్టికుత్సితమైన తర్కమును వదలి సరియైన తర్కము నవలంబించినచో మోక్షమున్నదను నిశ్చయ మేర్పడును. పిదప శ్రద్ధ కలుగును. దానిచేత అనాశ్వాసము నశించును. కామాదివాసనలు శ్రవణమునకు ప్రతిబంధకములు. లోకములో ప్రతివ్యక్తియు తానుకొరుచున్నదానినే ధ్యానించుచుండును. అట్టివాఁడు ముందున్న వస్తువును కూడ చూడఁడు; చెవిదగ్గఱ చెప్పుచున్నమాట నైనను వినఁడు. అట్టివాఁడు దేనినైన విన్నను అది విననిదానితో సమానముగానే యుండును. కాఁబట్టి కామాదివాసనలను వైరాగ్యసంపదచేత జయింపవలయును. ఈవాసనలు వేయి విధములుగా నున్నవి. కాని వీని కన్నింటికిని మూలము కామమే. అది నశించినచో అన్నియు నశించును. ఏదియు మిగులదు. ''ఇది నాకు కావలయును'' అను ఆశ##యే కామము. సులభములైన కోరికలయందు అది స్థూలముగా దుర్లభములైనవానియందు సూక్ష్మముగా నుండును. దృఢమైనవైరాగ్యముతో దానిని నశింపఁజేయవలయును. కోరఁబడుచున్న విషయములయందు ప్రతిక్షణము దోషమును పరశీలించుచు వాని యందు వైముఖ్యమును పొందినచో ఆవైముఖ్యము వాసనలను నశింపఁజేయును. ఇంక మూఁడవదియైన జడత్వము చాలపెద్దదోషము. జడత్వము కలవాఁడు ఎంత శ్రద్ధతో విన్నను విషయము వానిబుద్ధి కెక్కదు. ఆత్మదేవతారూపిణినైన నాయొక్క సేవచేత తప్ప వేఱొక విధముగా జడత్వము నశింపదు. భక్తియందలి తారతమ్యమునుబట్టి జడత్వము కొంచెముగా నుండుట. అధికముగా నుండుట అనుభేదమును బట్టి నేను నాభక్తునియొక్క జడత్వమును వెంటనే గాని జన్మాంతరము నందుఁగాని నశింపఁజేయుదును. ఎవఁడు నన్ను ఎల్లప్పుడు నిష్కామముగా భక్తితో ధ్యానించుచుండునో వానికి సత్సంగము మొదలగు సాధనము లన్నియు సమకూడును. వాఁడు విఘ్నముల నన్నింటిని తొలఁగఁద్రోసికొని త్వరగా కృతార్థుఁడగును. సర్వబుద్ధిప్రసారమునకు కారణమైన నన్ను పూజింపక ఎవఁడు మూఢుఁడై ఇతరసాధనములను అవలంబించునో వాఁడు అడుగడుగున విఘ్నముల నొందుచు ఫలము నెప్పటికో పొందవచ్చును; పొందకపోవచ్చును. కావున ఋషులారా! తత్పరత్వమే ముఖ్యాసాధనము.

సాధకుఁడు!

ఈకారణముచేత సాధకులలో తత్పరత్వముకలవాఁడే శ్రేష్ఠుఁడు. అట్టివారిలో నాయందు భక్తికలవాఁడు ఎల్లరచేతను పూజింపఁబడును.

సిద్ధి :

దేహము ప్రాణము మొదలగునవి ఆత్మకాదు అనునిశ్చయమే సిద్ధి. శరీరాదులయందు ఎల్లరకును ''ఇది నేను'' అను భావన రూఢముగ నున్నది. ఆ భావనను నిర్మూలించుటయే సిద్ధి. మఱి నిద్రలో ఈ భావన లేదు కదా! అది సిద్ధి యుగునా! కాదు. తమస్సుయొక్క అతిశయముచేత నిద్రయందు మనస్సు మూఢమై ఏభావనను పొందుట లేదు. అందువలన అది సిద్ధికాదు జాగ్రద్దశయందే మనస్సునందు ''దేహమే నేను'' అనుభావనను నిర్మూలించుట సిద్ధి. దేహాదులకు భిన్నముగా ఎవనికిని కేవలమైన యాత్మస్వరూపమునందు నిశ్చితమైన భావన కలుగుట లేదు. దీనివలననే పెద్ద యనర్థముల పరంపర సంభవించుచున్నది. కావున దేహము ప్రాణము ఇంద్రియములు మొదలగువాని నన్నింటిని భాసింపఁజేయుచున్న కేవల చిదాత్మయే నేను అనునిశ్చయము సకల సంశయములను నశింపఁజేయును. దీనినే విద్వాంసులు సిద్ధి అని చెప్పుచున్నారు. దీనికి మించినసిద్ధి మఱి యేదియును లేదు. ఆకాశగమనము అణిమ మహిమ గరిమ మొదలగునవి యన్నియు ఆత్మజ్ఞానసిద్ధిలో పదునాఱవభాగమునకు కూడ సరిపోలవు. అవి యన్నియు దేశకాలముల ననుసరించి అల్పములైన ఫలముల నొసంగును. ఆత్మజ్ఞానసిద్ధి దేశకాలములచేత పరిమితము కాదు. ఆత్మవిద్యాసాధనములందు అకాశగమనాదిసిద్ధు లన్నియు సంభవించును. కాని ఆత్మజ్ఞానసిద్ధియందు అవి విఘ్నములను కలిగించును. అందువల మోక్షమునందు తీవ్రమైన యిచ్ఛకలవారు ఇంద్రజాలముతో సమానములైన యాసిద్ధులు ప్రాప్తించినను వానివంక చూడరు. సాక్షాత్తుగా సృష్టికర్తయొక్క పదవియే లభించినను వారు తృణప్రాయముగా తిరస్కరింతురు. కాలక్షేపమాత్రములై జ్ఞానసిద్ధికలుగుటలో ఆలస్యమునకు కారణములైన యీ క్షుద్రసిద్ధులతో వారి కేమి పని? కావున ఆత్మజ్ఞానసిద్ధికన్న మఱియొక సిద్ధి లేదు. దేనిచేత శోకము పూర్తిగా నశించి బ్రహ్మానందము కలుగునో అదియే సిద్ధి గాని తక్కినది ఏదియు కాదు.

సిద్ధియొక్క పరాకాష్ఠ :

అభ్యాసమునందలి భేదములవలన బుద్ధియొక్క నిర్మలత్వము నందలి తారతమ్యమువలన, పరిపాకవిశేషమువలన ఆత్మజ్ఞానసిద్ధి ఉత్తమము మధ్యమము అధమము అని మూఁడువిధములుగా నున్నది. గొప్ప యభ్యాసమువలన ఒకానొకఁడు ఎన్నొ పనుల చేయుచున్నను వేదమును స్వరము తప్పకుండ చెప్పఁగలుగను. వాని వేదపాఠము ఉత్తమము. మఱియొకఁడు ఏదేని ఒకపనిని చేయుచున్నను దానియందు శ్రద్ధ నుంచక వేదమును మాత్రము చక్కఁగా చెప్పుచుండును. ఆవేదపాఠము మధ్యమము. వర్ణస్వరమాత్రాకాలములను ప్రయత్నపూర్వకముగా స్మరించుచు చేయువేదపాఠము అధమము. ఇట్లే ఆత్మజ్ఞాన సిద్ధియు మూఁడువిధములుగా నున్నది. కొందఱు రాజ్యపరిపాలనాది వ్యవహారములందుండి సమాధికొఱకు ఎట్టి ప్రయత్నము చేయుటకు వీలు లేకున్నను వారిమనస్సు స్వరూపస్థితియందే యుండును. అది ఉత్తమసిద్ధి. కొందఱు వ్యవహారములు చేయుచున్నను మధ్యలో సమాధిని పొందుచుందురు. ఇది మధ్యమసిద్ధి. కొందఱు వ్యవహారమును వదలి సమాధిస్తితియందే నిలిచియుందురు. ఇది అధమసిద్ధి. వీనిలో ఉత్తమమైనదే జ్ఞానసిద్ధికి పరాకాష్ఠ. స్వప్నము మొదలగునవస్థల యందు కూడ ఎవనియొక్క మనస్సు విచారముచేయుచున్న సమయము నందువలె శుద్ధచిన్మాత్రముగ నుండునో వానిజ్ఞానసిద్ధి పరమోత్తమము. వానికి సహజముగా ఏవ్యవహారమునందును వాసనలయొక్క ప్రకోపము కలుగదు; అందువలన సంకల్పమును కలుగదు. వానికి సహజముగ ఏసంకల్పముతో పనిలేకున్నను లోకసంగ్రహదృష్టితో శాస్త్రము ననుసరించి ప్రవర్తించును. ఇది జ్ఞానసిద్ధికి పరాకాష్ఠ. అప్రయత్నముగా ఎప్పుడు మనస్సు చిదాత్మకమైన స్వరూపమునందు తెంపులేకుండ నిలిచియుండునో అప్పుడు జ్ఞానసిద్ధి పరాకాష్ఠను పొందును. ఎవఁడు వ్యవహారపరుఁడై వివిధపదార్థములను చూచుచుండియు ఆత్మకన్న భిన్నముగా దేనిని చూడఁడో, కార్యములు నిర్వహించుచున్నను నిద్రించుచున్నవానివలె ఎవఁడు వానిని పట్టించుకొనఁడో, అట్టివాని జ్ఞానసిద్ధి పూర్ణము.

జ్ఞానసిద్ధులలో ఉత్తముఁడు :

ఇట్టిజ్ఞానసిద్ధిని పొందినవాఁడు సిద్ధులలో ఉత్తముఁడు. ఇతఁడు వ్యవహారమునందు నిమగ్నుఁడై యున్నను సమాధిస్థితిని ఎప్పుడును వందలఁడు. ఈతఁడు తనయొక్క అనుభవమునుబట్టి అనేకవిధములుగా నుండు జ్ఞానులయొక్క స్థితిభేదములను గ్రహించుచుండును. వీనికి కోరిక కాని సంశయము కాని కొంచము కూడ ఉండవు. వ్యవహారములందితఁడు నిర్భయుఁడై సుఖమును దుఃఖమును స్వప్నములో వలె, తనయందే కలుగుచున్నట్లు చూచుచుండును. బంధము అసత్య మగుటచే ఎల్లరును ఎప్పుడును ముక్తులే. కావున ఉత్తమజ్ఞాని ''వీఁడు బద్ధుఁéడు, వీఁడు ముక్తుఁడు'' అని భేదముతో చూడఁడు, ఎవనికిని మోక్షము కావలయునని తలంపఁడు. ఆ ఉత్తమజ్ఞానిని నేనే. మా కిరువురకును భేదము లేదు.

ఋషులారా! మీ రడిగిన వన్నియు క్రమముగా స్పష్టముగా చెప్పితిని. వీనిని తెలిసికొన్నవాఁడు ఎప్పుడును భ్రాంతిని పొందఁడు.''

ఇట్లు ఆ పరావిద్యారూపిణియైన త్రిపురాదేవి పలికి విరమించెను. ఋషులు సందేహమును వీడి బ్రహ్మవిష్ణుమ హేశ్వరులకు నమస్కరించి వెడలిపోయిరి. భార్గవా! నీకు విద్యాగీతను చెప్పితిను. ఇది పాపనాశని. దీనిని చక్కఁగా విని ఇందలి యర్థమును విచారించినచో ఇది ఆత్మసామ్రాజ్యము నొసంగును. శ్రీపరావిద్యచేతనే సాక్షాత్తుగా ఇది నిరూపింపఁబడియుండుటచే ఇది ఉత్తమమైన గీత. దీనిని ప్రతిదినము పఠించువారియొడల ప్రీతినొంది ఆపరాదేవియే స్వయముగా వారికి జ్ఞానము నొసంగును. సంసారసాగరమునందు మునుఁగుచున్నవారిని ఆమెయే నౌకయై తరింపఁజేయును.

ఇది జ్ఞానఖండమున విద్యాగీత యన్నది ఇరువదియవయద్యాయము.

బాలప్రియ

విద్యాగీతయందు గ్రంథముయొక్క తాత్పర్యము సంగ్రహముగా నిరూపింపఁబడినది. విద్యాగ్రహణమునందు శ్రద్ధ ముఖ్య మని, అది చెప్పుచున్నవానియొక్క గొప్పతనముపై ఆధారపడియుండు నని ఈకథయందు వ్యక్తమగుచున్నది. విషయము సమానమే యైనను దానినే సామాన్యుఁడైనయొకయాచార్యుఁడు చెప్పుచున్నప్పుడు కలుగు శ్రద్ధకన్న పరమేశ్వరుఁడే చెప్పుచున్నాఁడన్నప్పుడు కలుగుశ్రద్ధ అత్యధీకముగా నుండును. అందువలన దత్తాత్రేయుఁడు. ఎన్నోకథలవలన తత్త్వమునందు నిరూపించి, ఇంచుమించుగా ఉపదేశమును ముగించుచు, దేవలోకమునందు మహర్షులకు త్రిమూర్తులకును సాక్షాత్తుగా చిద్రూపిణియైన త్రిపురసుందరియే బోధించిన తత్త్వసారమును పరశురామునకు అందించెను.

గొప్పతపస్సులు చేసినవారే బ్రహ్మసభకు పోఁగలుగుదురు. అట్లు చేరినమహర్షు లందఱును ఆయన సమక్షముననే జ్ఞానులలో ఉత్తమ లెవరు అనువిషయమున వాదప్రతివాదములు చేసిరి. ఒకరి నిర్ణయమును మరియొకరు అంగీకరింపకుండిరి. అందువలన వా రందఱును బ్రహ్మదేవుని సమీపించి తమసిద్ధాంతములలో ఏది సమంజసమో నిర్ణయింపు మని కోరిరి. అంతే కాని, ''మా కీవిషయము తెలియదు, మీరు మాయందు దయయుంచి ఈవిషయమును బొధింపుఁడు'' అని వారు అడుగలేదు. వారు తమకు తోఁచినయుక్తులతో సిద్ధాంతములను ఏర్పఱచుకొని అవియే సత్యము లని దృఢముగా అనుకొనుచుండిరి. ''మే మందఱమును లోకవ్యవహారమును పరతత్త్వమును కూడ తెలిసికొని జ్ఞానులమై యున్నాము'' అని వారు స్పష్టముగా బ్రహ్మదేవునితో చెప్పిరి. అనఁగా వారికి తెలిసికోవలయు ననుకోరిక లేదు. బ్రహ్మదేవుఁడు తమకు అనుకూలముగా చెప్పవలయు నని, అట్లు చెప్పినచో తాము తక్కినవారిని జయించి అందఱకన్న అధికులుగా ప్రకాశింపవలయును, అనునాకాంక్షయే వారియందు ప్రబలముగా నున్నది. వారి దృష్టిలో ఆయనకూడ ఒకతపస్వియే; తమకన్నను అధికముగా తపస్సు చేసి అలోకమునకు ఆధిపత్యమును పొందియున్నాఁడు. అందువలన ఆయన తమయభిప్రాయములకు ఏమాత్రము భిన్నముగా చెప్పినను అంగీకరించుటకు వారు సిద్ధముగాలేరు. ఈశ్వరునివిషయమున విష్ణువు విషయమున కూడ వారియభిప్రాయ మిట్లే యున్నది. ఇది గమనించి ఈశ్వరుఁడు విద్యారూపిణియైన త్రిపురాదేవినే ప్రార్థింత మని చెప్పెను. ఆమె సర్వలోకేశ్వరి సర్వాత్మిక. కావున ఆమె చెప్పినదానిని వారు నిస్సందేహముగా శిరసావహింతు రని ఆయన వారిని అట్లు ప్రోత్సహించెను.

అందఱును అందులను అంగీకరించి ఆమెను విద్యారూపిణినిగా ధ్యానించిరి. వారియందఱయొక్క సంకల్పము ఏకముఖమై సర్వవ్యాప కమైయున్న ఆత్మయను మహాసముద్రమునందు ఒకతరంగమును పుట్టించెను. సృష్టి జరుగునప్పుడు ఆత్మనుండి మొదట పుట్టినది ఆకాశము. ఆకాశముయొక్క గుణము శబ్దము. వేదములు శాస్త్రములు మొదలుగా సకలవిజ్ఞానము ఆశబ్దమునందే యుండును. కావుననే ఆత్మ సర్వజ్ఞ మని, దానినుండి పుట్టిన యాకాశముయొక్క గుణమైన శబ్దము నుండి వెలువడినవేదములు సర్వజ్ఞకల్పము లనియు చెప్పఁబడుచున్నవి. సర్వజ్ఞకల్పము లనఁగా సర్వజ్ఞముతో కొంచెము తక్కువగా సమానము లని యర్థము. సకలమైన యీవిజ్ఞానమే విద్య. ఆమహర్షుల యొక్క ప్రార్థనారూపమైన సంకల్పము ననుసరించి ఆత్మ ఆకాశ శరీరముతోవిద్యారూపిణియై వారికి గోచరించెను. ఆమెయొక్కశబ్దము విని పించినదే కాని వారికి ఆమె కన్పింప లేదు. ఆమె అందులకు ఆవశ్యకమైనరూపమును గైకొన లేదు. ఆకాశమువలన వాయువు పుట్టును. వాయువునకు శబ్దము స్పర్శ అను రెండగుణము లుండును. ఆకాశవాయువులతో ఏర్పడిన శరీరములు కూడ కంటికి కన్పింపవు. వాయువునుండి అగ్ని పుట్టును. అగ్నికి శబ్దము స్పర్శ రూపము అను మూఁడు గుణములు కలవు. కావున ఆకాశము వాయవు అగ్ని అను మూఁడు భూతముల సమ్మేళనము ఉన్నప్పుడే శరీరము కంటికి కన్పించును. త్రిపురాదేవి ఆకాశమునుండి మాత్రమే శరీరమును పొందుటచే శబ్దరూపముననే ఆమె వారి శ్రోత్రేందియములకు గోచరించెను.

అప్పటివఱకును వారు ''జ్ఞానులలో శ్రేష్ఠఁడెవరు?'' అను విషయమునుగూర్చియే చర్చించుచుండిరి. కాని దేవి ప్రసన్నురాలై ఆవిర్భవించినంతనే ఒక్కొక్కరు ఒక్కొక్కవిషయమునుగూర్చి ఆమెను అడిగిరి. ఆమె వారు అడిగిన విషయముల నన్నింటిని క్రమముగా వివరించినది. వానిలో కొన్ని చాల ప్రాథమికములైన (Elementary) విషయములు కూడ ఉన్నవి. బ్రహ్మలోకమునకు పోఁగలిగిన మహార్షులకు ఈవిషయములు తెలియవా?

తపశ్శక్తులకు జ్ఞానమునకు సంబంధము లేదు. అంతే కాదు. ఆత్మజ్ఞానము మనుష్యలోకములో పొందుట సులభ మైనట్లు మఱి యే లోకమునందును సులభము కాదు. ''ఆత్మ మనుష్యలోకమున, నిర్మలమైన బుద్ధియందు అద్దములో ముఖముయొక్క ప్రతిబింబమువలె స్పష్టముగా గోచరించును; పితృలోకమునందు స్వప్నమునందువలె గోచరించును; నీటిలో ప్రతిబింబమువలె గంధర్వలోకమున గోచరించును; బ్రహ్మలోకమునందు వెలుఁగునకు నీడకు గల భేదమువలె గోచరించును.'' అని కఠోపనిషత్తునందు (6-5) వివరింపఁబడియున్నది. పై లోకములలో ఒక్క బ్రహ్మలోకమునందు మాత్రమే హిరణ్యగర్భుని సమక్షమున ఆత్మనుగూర్చి విచార మొనర్చి జ్ఞానమును పొంది ముక్తులగుటకు అవకాశ మున్నది. సత్యలోకమునకు పోఁగల్గుట సులభము కాదు. ఇంద్రియములను జయించి శాంతులై అరణ్యములందు భిక్షావృత్తి నవలంబించి సగుణబ్రహోపాసనారూపమున ఎంతో కాలము తపస్సు చేసినవారు మాత్రమే బ్రహ్మలోకమునకు పోఁగల్గుదు రని ముండకోపనిషత్తునందు (2వ ఖండము. శ్లో. 11) చెప్పఁబడియున్నది. అంత కష్టపడి బ్రహ్మలోకమునకు పోయినను అక్కడ కూడ ఆత్మవిచారమును గావించి వారు జ్ఞానమును పొందవలె. పిదప బ్రహ్మ దేవుని పరిపాలనకాలము ముగిసినప్పుడ, ఆయనతోపాటు వారును ముక్తిని పొందుదురు.

జీవులలో పెక్కుతరగతులు కలవు. శ్రవణమనననిదిధ్యాసనములతో నిర్గుణబ్రహ్మము నుపాసించి జ్ఞానముచేత ఆత్మసాక్షాత్కారమును పొందిన జీవన్ముక్తులు మొదటి తరగతి జ్ఞానము కలుగుటకు పూర్వము వీరిలో కొందఱు పెద్దయజ్ఞములు గొప్పతపస్సులు చేసి యుందురు. ఆపుణ్యముయొక్క అతిశయముచేత వారు విశ్వపరిపాలనలో (Administraion of the Universe) అధికార పదవులయందు ఉందురు. విష్ణువు బ్రహ్మ ఈశ్వరుఁడు లక్ష్మి సరస్వతి పార్వతి ప్రజాపతులు మనువులు సప్తర్షిమండలములోని మహర్షులు వేదవ్యాసుఁడు మొదలగునవి యన్నియు ఇట్టిపదవులే. వీరు ముక్తు లగుటచే ప్రారబ్ధముయొక్క అంతమునందు శరీరము పడిపోవునపుడు, కుండ పగిలి పోయినపుడు కుండలోని యాకాశము చుట్టును సర్వవ్యాపకమైన యాకాశములో కలిసిపోవునట్లు, వీరియాత్మ కూడ పరమాత్మలో లీనమగును. వీరు ఏలోకమునకు పోరు. ఎక్కడివారు అక్కడనే పరమాత్మయందు లీన మగుదురు. వీరు ఉత్తమజ్ఞానులు; అధికారపదవుల యందు ఉండి వ్యవహరించుచున్నప్పుడు కూడ ముక్తులే. కాని పదవులను పొందువా రందఱును జ్ఞానులై యుండవలె నను నియమము లేదు. కొందఱు కేవలము యజ్ఞములచేతనో తపస్సులచేతనో పదవులను పొందుదురు. వీరికి పదవీకాలము ముగిసినంతనే, నహుషునకు సర్పజన్మము వచ్చినట్లు, జన్మాంతరము తప్పదు. అగ్ని వాయువు ఇంద్రుడు మొదలగు పదవులలో ఇట్టివా రనేకులు ఉందురు.

సగుణబ్రహ్మోపాసకులు రెండవతరగతి పంచాగ్నివిద్యను శ్రద్ధను సత్యమును సగుణబ్రహ్మమును ఉపాసించినవారు మరణించినప్పుడు అర్చిరాదిమార్గమున బ్రహ్మలోకమునకు చేరుదురు. అక్కడ వీరు బ్రహ్మదేవునియొద్ద ఆత్మవిచారమును గావించి, ఆయనయొక్క పదవీకాలము ముగిసినప్పుడు, ఆయనతోపాటు వీరు కూడ ముక్తిని పొందుదురు. కావున వీరు బ్రహ్మలోకమునుండి తిరిగిరారు.

సాకారమూర్తులను ఉపాసించినవారు యజ్ఞములను చేసినవారు మూఁడవతరగతి. వీరు ధూమాదిమార్గమున గంధర్వలోకము పితృలోకము ఇంద్రలోకము మొదలైన స్థానములకు పోయి అక్కడ తమ పుణ్యఫలము ననుసరించి భోగములను అనుభవించి పుణ్యము క్షీణించినప్పుడు అక్కడనుండి మర్త్యలోకమునకు తిరిగివచ్చి పూర్వకర్మ శేషము ననుసరించి జన్మలను పొందుచుందురు.

ఆర్చిరాదిమార్గము శుక్లగతి యని, ధూమాదిమార్గము కృష్ణగతియని భగవద్గీతయందు నిరూపింపఁబడినది.

సామాన్యములైన పుణ్యములను పాపములను చేయుచుండు వారు ఏలోకములకు పోక ఇచ్చటనే పుణ్యాతిశయమునుబట్టి మహారాజులుగా మంత్రులుగా సంపన్నులుగా, పాపము ఎక్కవగా నున్నచో పశుపక్ష్యాదిజన్మలను పొందుచుందురు. వీరు నాల్గవతరగతి.

మహాపాపములను చేసినవారు అయిదవతరగతి. వీరు నరకమునకు పోయి యాతనలు అనుభవించి పూర్వకర్మశేషము ననుసరించి మనుష్యాదిజన్మలను పొందుచుందురు.

ఈదృష్టితో చూచినప్పుడు పైకథలో బ్రహ్మసభయందు రెండు తరగతులవా రున్నారని గ్రహింపవలసియున్నది. విష్ణువు ఈశ్వరుఁడు వశిష్ఠవిశ్వామిత్రాదిమహర్షులు మొదటి తరగతివారు. వీరు ఉత్తమ జానులు జీవన్ముక్తులు. దేవి చెప్పిన విషయము లన్నియు వీరికి తెలిసివే; క్రొత్తవి కావు. వీరు బ్రహ్మసభకు ఆగంతుకులుగా వచ్చిన వారు; అనఁగా సభలో పాల్గొనుటకై తాత్కాలికముగా వచ్చినవారు. వీరు బ్రహ్మలోక నివాసులు (Citizens of Brahmapura) కారు. ఆ సభలో కలిగిన వివాదము వీరు ఆరంభించినది కాదు. వారికి జ్ఞానవిషయమున ఎప్పుడును సందేహమే యుండదు. అట్లున్నచో వారు జ్ఞానులు కారు; జీవన్ముక్తులును కాఁజాలరు. ఇంక వివాదము సగుణ బ్రహ్మోపాసకులై బ్రహ్మలోకమునకు వచ్చిన రెండవతరగతివారిలోనే బయలుదేరిన దని గ్రహింపవలసియున్నది. వీరు ఆగంతుకులు (Visitors) కారు. సభ ముగిసినంతనే విష్ణువు ఈశ్వరుఁడు వశిష్ఠాది బ్రహ్మర్షులు తమ స్థానములకు తిరిగిపోవుదురు. వీరు అట్లు తిరిగి పోరు. వీరు భూలోకమున ఉపాసనలు చేసి మరణించినపిమ్మట అర్చిరాదిమార్గమున బ్రహ్మలోకమున నివసించుటకై వచ్చినవారు. కావున వీరు బ్రహ్మలోకమున నిత్యనివాసులు (Permanent citizens). వీరు భూలోకమున ఉన్నప్పుడు శ్రవణమనననిదిధ్యాసనములతో ఆత్మవిచారమును చేసి జ్ఞానమును పొందినవారు కారు. వీరు బ్రహ్మలోకమున ఆత్మవిచారమును గావించి జ్ఞానులై బ్రహ్మదేవునితో కూడ ముక్తిని పొందవలసినవారు. కావున వీరు బ్రహ్మలోకమున నిత్యము ఆత్మ విచారమునే చేయుచుండవలె. వీరిచేత ఆత్మవిచారము చేయించి వీరిని ముక్తులను గావింపవలసిన కర్తవ్యము బ్రహ్మదేవునకు ఉన్నది. ఆయనయొక్క పదవీబాధ్యతలలో ఇది యొకటి. బ్రహ్మలోకమునకు ఉపాసకులై వచ్చినవారు అక్కడ ముక్తి పొందవలసినదే కాని మరల తిరిగివచ్చుట (పునరావృత్తి) యన్నది లేదు, ఇది విశ్వవిధానమున (Universal Administration) ఒక నియమము.

వీరు బ్రహ్మలోకమునకు మొదట వచ్చినప్పుడు అచ్చటియద్బుతమైన సన్నివేశమునకు ముగ్ధులై బ్రహ్మదేవునియందు భయభక్తులతో శ్రవణమననాదులను ఆరంభించినను కాలము గడచుఁకొలఁది ఆయనతో అతిపరిచయమువలన శ్రద్ధ సన్నగిల్లుట సహజము. మఱియును ఒకమహాసభ యేర్పాటై ఆగంతుకులు అనేకులు వచ్చియున్నప్పుడు వారియెదుట ''నాకు విషయము తెలియలేదు. అనుగ్రహించి వివరింపుఁడు''అని బ్రహ్మదేవుని సైతము ప్రార్థించుటకు వారు సంకోచపడుట సహజము. వారికి కూడ ''మేము మహాతపస్వులము'' అను అభిమానము ఉండనే యుండును. అది జ్ఞానముచేతఁగాని నశింపదు. జ్ఞానము కావలయు ననుశ్రద్ధ కలుగవలయు నన్నచో అభిమానము తగ్గవలె. ఇది యెట్లు జరుగవలె ననునది చిక్కుసమస్య. బ్రహ్మర్షులైన వసిష్ఠాదులును ఇందు జోక్యము కలిగించుకొనకుండుట గమనింపఁదగియున్నది. ఈవాదమును పరిష్కరింపుఁడని కొందఱు ఋషులు వారిని అడిగియుండవచ్చును. వారు దానిని పరిష్కరింపఁబూనుకొనక ''పరమేష్ఠి యుండఁగా ఒకరు దీనిని పరిష్కరింపవలసిన దేమున్నది? వారినే అడుగుదము'' అని చెప్పియుందురు. బ్రహ్మదేవుఁడు లోకాధిపతి, ఆసభకు అథ్యక్షుడు. ఆయుపాసకులకు అందఱకు ఆయన గురువు. వారికి బోధింపవలసినయధికారము ఆయనది. పెద్దల సమక్షమున వివాదము వచ్చినప్పుడు చిన్నవారు తమ కావిషయము తెలిసినను వారియనుమతి లేకుండ చెప్పుట మర్యాద కాదు. అందువలన వారు మిన్నకుండిరి. విద్యారూపిణియైన దేవి కన్పింపకుండ ఆకాశమునందు మేఘగంబీరననిస్స్వనముతో అద్భుతముగాఆవిర్భవించినపుడు ఆయుపాసకు లందఱు అభిమానమును వదలి ఒక్కొక్కరు తమకు తెలియనివిషయముల నన్నింటిని ప్రశ్నించిరి. ఆమె ''ఋషులారా!'' అని యీసాధకుల నుద్దేశించియే ప్రసంగించుట గమనింపఁదగియున్నది. ఆమె త్రిమూర్తులను వశిష్ఠాదిబ్రహ్మర్షులకు ఉద్దేశింప లేదు. వారి కీవిషయము లన్నియు తెలిసినవే.

ఆమె ఉపదేశముయొక్క ఆరంభమున ''శాస్త్రము అనుమహా సముద్రమునుండి అమృతమువంటి సారమును మీకు అందించుచున్నాను'' అని చెప్పియుండుట గమనింపఁదగియున్నది. ఆ పరమేశ్వరి కూడ ''నేను చెప్పుచున్నాను. కావున మీరు వినుఁడు'' అని చెప్పకుండ శాస్త్రమే ప్రమాణ మని మొట్టమొదటియుపదేశము కావించినది. ఆమె బోధించి కొన్ని నిముసములలో అదృశ్యురాలు అగును. ఆమె యొక్క యుపదేశమునకు ఆమెయే ప్రమాణ మగుచో, ఆమె అదృశ్యమైన తరువాత సందేహములు కలిగినచో గతి యేమి? ఆమె మాటి మాటికి ఆవిర్భవింపదు. అందువలన తరువాత సందేహములు కలిగినచో శాస్త్రమే ప్రమాణముగా పరమేష్ఠియొద్ద విచారము గావింపుఁడని ఆమె ముందే వారికి స్పష్టముగా సూచించినది. దీనివలన బ్రహ్మలోకమునకు పోయినను ఉపనిషత్తులలోని వాక్యములయొక్క అర్థమును విచారింపవలయు ననుట స్పష్టము. ఎంతో కష్టపడి తపస్సులు చేసి ఆలోకమునకు పోయి ఆత్మవిచార మొనర్చి అక్డ ముక్తు లగుటకన్నను ఈలోకమునందు ఇప్పుడే ఆవేదాంతవిజ్ఞానముతో ఆత్మవిచార మొనర్చి, హేమచూడుఁడు జనకుఁడు అష్టావక్రుఁడు మొదలగు వారివలె, వెంటనే తరించి బ్రహ్మానందనిమగ్ను లగుట ఎంతో మేలు అనుట ఈకథకు సారాంశము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters