Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

ఇరువదియొకటవయధ్యాయము -

రాక్షసోపాఖ్యానము

భార్గవరాముఁడు దత్తాత్రేయుని మరల ఇట్లు ప్రశ్నించెను. ''భగవానుఁడా! సాక్షాత్తుగా మోక్షఫలము నొసంగునట్టి విజ్ఞానరూపమైన సాధనమును సారభూతముగ సునిశ్చితముగా చెప్పుము. దేహముతో కూడియున్నప్పుడు దేహమును వదిలినప్పుడు జ్ఞానులస్థితి ఎట్లుండును? వ్యవహరించునపు వారిమనస్సు అనాసక్తముగ నెట్లుండును? ఏ లక్షణముచేత జ్ఞానులను త్వరగా గుర్తించుటకు వీలగును? ఇది యంతయు నాకు స్పష్టముగా దయతో చెప్పుము.''

దత్తాత్రేయుఁ డిట్లనెను, ''దేవతానుగ్రహమే జ్ఞానమునకు ముఖ్యసాధనము. ఎవఁడు వాజ్మనఃకాయములచేత ఎల్లప్పుడు స్వాత్మదేవతను ఆరాధించుచుండునో వానికి జ్ఞానము సులభ మగును. ఇది జ్ఞానసాధనములలో సర్వోత్తమముగా చెప్పఁబడియున్నది. ఇతర సాధనములతో అపేక్ష లేకుండ ఇదియే ఫలమును సాధించుటకు సమర్థమై యున్నది. దీనిని వదలినచో ఇతరసాధనము లేవియు చక్కఁగా ఫలము నొసంగలేవు. అందులకు కారణమును వినుము. సర్వమును ప్రకాశింపఁజేయుచున్న చిదాత్మకు దానియొక్క స్వాతంత్ర్యమహిమ వలననే ఆవిద్యావరణము కల్పితమై యున్నది. శ్రవణాదిరూపమైన విచారణము వలన అవిద్యను తొలఁగించినచో చిదాత్మయొక్క స్వరూపము సాక్షాత్కారించును. విచారణ చేయుచున్నను స్త్రీలు ధనము మొదలగు వానిపై ఆసక్తి కలిగియుండు బహిర్ముఖులకు అది సాక్షాత్కరించుట మిగుల దుర్ఘటము. భక్తులైనవారు సంసారవిషయములకు విముఖులై దేవతను ఆరాధించుచు అంతర్ముఖులై యుందురు. కావున అట్టివారికి అది సులభముగా సాక్షాత్కరించును. త్రికరణశుద్ధిగా స్వాత్మదేవతను ఆరాధించువాఁడు వై రాగ్యము మొదలగు నితసాధన ములను కొలఁదిగా కలిగియున్నను. ఆత్మతత్త్వమును పరోక్షముగనో అపరోక్షముగనో తెలిసికొని ఇతరులకును బోధించుచుండును. అట్లు దానిని మాటిమాటికి అతఁడు బోధించుచు నున్నప్పుడు క్రమముగా వానిమనస్సు ఆత్మస్వరూపమును పొందఁజొచ్చును. అట్లు వాని మనస్సు తఱచుగా స్వరూపమును పొందుచు దానియందే దృఢముగా నిలిచిపోవును. అట్లు చిదాత్మకమైన యాతనిమనస్సు వ్యవహారదశలలో హర్షమును ఉద్వేగమును పొందక స్థిరముగా నుండును. అట్టి ఉత్త మజ్ఞాని జీవన్ముక్తుఁడగును. వానిమనస్సు వ్యవహారమునందు ఏదృశ్యముతో సంబంధించియున్నను చిదాత్మస్వరూపమును వదలి యుండదు; అది ప్రతిదృశ్యమును చిదాత్మరూపముగనే గ్రహించును. కావున భక్తియోగపూర్వకముగ ఆత్మతత్త్వమునుగూర్చి విచాఠణ చేయుట అనుసాధనముతో సమానమైనది మఱియేదియును లేదు.

ఇంక జ్ఞానులయొక్క లక్షణమును తెలిసికొనుట సులభము కాదు. వారిమనస్సు శుద్ధచిన్మాత్రమై యుండును. అది వారియొక్క దృష్టి వాక్కు మొదలగు బహిరంగవిషయములందు గోచరింపదు. వ్యాకరణాదిశాస్త్రములయందు పండితులైనవారివిషయమున కూడ క్రొత్తవారికి వారిని చూచునపుడు వారియొక్క దేహము వస్త్రము భూషణములు మొదలగు వానివలన లోపలనున్న పాండిత్యము గోచరింపదు కదా! ఒకఁడు మంచిపండును తిని ఆరసమును ఆస్వాదించినచో ''ఈరసము ఇట్టిది'' అను జ్ఞానము వానికి కలుగును. వానికి ఆ రసమునుగూర్చి ఏజ్ఞానము కలిగెనో అది ఇతరులకు తెలియదు. అట్లే ఆత్మతత్త్వానుభవమున కూడ జ్ఞానియొక్క అనుభూతి ఇతరులకు గోచరము కాదు. అయినను చీమలు మొదలగునవి నేలయందు గోడలలో సూక్ష్మముగా గోచరించుచుండు తమమార్గములను ఎట్లు గుర్తించుచున్నవో, అట్లే విద్వాంసులు కూడ మహాపురుషులతో వ్యవహరించునప్పుడు వారియందుండు ప్రసన్నత భాషణవైఖరి మొదలగువానిని బట్టి ''వీరు జ్ఞానులు'' అని గుర్తింపఁగలుగుదురు. ఇంక శాంతి దాంతి మొదలగు లక్షణములనుబట్టి జ్ఞానులను గుర్తించుటకు వీలు గాదు. ఎందువల్ల ననఁగా ఆలక్షణములు సాధకులయందు వంచకులయంద కూడ కన్పించుచుండును. నిర్మలమైన యంతఃకరణము లేనివారు జ్ఞానమునకు సాధనములుగా దమము శమము మొదలగువానిని అవలంబించుచున్నను అవి వారికి సహజములు కావు. వానిని నిరంతరము అభ్యసించిన తరువాత చాలకాలమునకు అవి అప్రయత్నముగా వారికి అలవడును. అప్పుడే అవి వారికి సహజములై లక్షణము లగును. కావున తాత్కాలికముగా ఆభ్యాసింపఁబడుచున్న శమదమాదులనుబట్టి ''వీరు జ్ఞానులు'' అని చెప్పుటకు వీలు లేదు. కాని లాభనష్టములు మానావమానములు జయాపజయములు కలుగుచున్నప్పుడు ఎవని యందు కొంచెము కూడ మార్పు కలుగదో అట్టివానిని ఉత్తమజ్ఞానినిగ నెఱుంగుము. ఉత్తమజ్ఞాని ఆత్మసాక్షాత్కారముయొక్క అనుభూతి యందలి రహస్యములను వెంటనే చెప్పఁగలిగియుండును. జ్ఞాన ప్రసంగములయందు ఉత్సాహము, స్వయముగ ఏకార్యమును ఆరంభింపకుండుట, సంతోషము, కామక్రోధాదిభావములులేకుండ పవిత్రమైన చిత్తమును కలిగియుండుట, పెద్దయాపదలు వచ్చిపడుచున్నప్పుడు కూడ ఉద్వేగమును పొందకుండుట - ఇవి ఉత్తమజ్ఞానియొక్క లక్షణములు. సాధకుఁడు తన జ్ఞానముయొక్క పరిపాకమును పరీక్షించుకొనుటకు ఇవి సుస్థిరములైన లక్షణము లనుటలో సంశయము లేదు. సాధకుఁడు తన్నుగూర్చి తాను ఎప్పుడును పరీక్షించుకొనుచుండవలయును. ఆవిధముగ అతఁడు ఇతరులను పరీక్షించుటయందు కూడ నిపుణుఁడగును. తన్ను తాను ఎల్లప్పుడు పరీక్షించుకొనుచుండువాఁడు సిద్ధి నెట్లు పొందకుండును? సాధకుఁడు అన్యులయొక్క గుణదోషములను పరీక్షించుట మానుకోవలెను. అప్పుడే అతఁడు తన గుణదోషములను చక్కఁగా విచారించుకొనఁగలుగును. అప్పుడు దోషములను వదలి గుణములను పెంపొందించుకొనుట సంభవించును. దానివలన సాధనసంపత్తి సమకూడి అతఁడు జ్ఞానసిద్ధిని పొందును.

భార్గవా! ఈలక్షణము లన్నియు సాధకుఁడు తన్ను తాను పరీక్షించుకొనుటకు తప్పక ఉపయోగించును. కాని ఇతరులను పరీక్షించుటలో ఇవి అట్లు తప్పక ఉపయోగపడు నని చెప్పఁజాలము. మిగుల పరిశుద్ధమైన చిత్తముకలవారు మేధావులైనవారు, జనకాదులవలె, శ్రవణాదిసాధనములతో అల్పకాలముననే జ్ఞానసిద్ధిని పొందుదురు. అట్టివారికి కామాదివాసనలు నశింపు. అందువలన వారు పూర్వవాసనలను అనుసరించి సామాన్యులవలెనే వర్తించుచుందురు, అట్టివారిని సాధకుఁడు ఎట్లు పరీక్షించి గుర్తింపగలఁడు? కాని అభ్యాసముయొక్క అతిశయమువలన రత్నపరీక్షకులు రత్నమును చూచినంతనే అది రత్నమగునో కాదో ఎట్లు గుర్తింపఁగలరో అట్లే జ్ఞానులు కూడ ఇతరులను చూడఁగానే వారు జ్ఞాను లగునో కాదో ఏస్థితియం దున్నారో వెంటనే గుర్తింపఁగలరు.

మందజ్ఞానులకు దేహాభిమానము లోకవ్యపహారము సామాన్యులకువలెనే యుండును. వారికి సమాధి సహజమై యుండుదు. వారు విచారపరాయణులై యున్నంతవఱకు పూర్ణచిదాత్ములై యుందురు. విచారమును విరమించినంతనే మరల వారు దేహాభిమానముతో సుఖ దుఃఖముల ననుభవించుచు పశువులతో సమానముగ ఉందురు. మధ్యలో అప్పుడప్పుడు వారు విచారపరులై సమాధిని పొందుచు సంసారతాపమును వీడి ఆనందము నొందుచుందురు. స్వరూపానుసంధానములేని సమయములలో వారియందు సంభవించుపశుదశ, కాలిపోయిన త్రాడువలె, వారికి బంధనము కలిగింపదు. వస్త్రముయొక్క రెండు అంచులను రంగులో ముంచినచో మధ్యభాగమును ముంచకపోయినను దానికి కూడ ఆరంగు తప్పక వ్యాపించును. అట్లే వారివ్యవహారము కూడ చిద్రూపానుసంధానమధ్యమున పడి చిద్రూపముతో ఐక్యమును పొందును. అందువలన ఆవ్యవహారము వారికి బంధనము కలిగింపదు.

మధ్యజ్ఞానులకు దేహసంయోగమే ఉండదు. దేహమే ఆత్మ అనుభావమే దేహసంయోగము. అది మధ్యజ్ఞానులకు ఉండదు. అభ్యాసముయొక్క అతిశయమువలన వారికి మనస్సు ఎప్పుడును స్వరూపమునందే లీనమై యుండును. వారికి దేహపోషణము కూడ నిద్రయందువలెనే జరుగుచుండును. నిద్రించుచున్నపిల్లవానిని పిలిచి మాటాడించుచు అన్నము పెట్టినచో వాఁడు ఆనిద్రలోనే ఏదో మాటాడుచు అన్నము తిని వెంటనే నిద్రించును. వానికి మధ్యలో జరిగిన దేదియు గుర్తుండదు. మద్యపానమత్తుఁడైన వానికి కూడ మత్తులో నున్నప్పుడు చెప్పినమాటలు చేసినపనులు గుర్తుండవు. ఇట్లే మహాయోగియు లోకమున ఎప్పుడో ఏదో కొంచెము చేయుచున్నను అది యేదియు ఆయనకు గుర్తుండదు. ప్రారబ్ధముచేత వాసనలవలన వానికి దేహయాత్ర జరుగుచుండును.

ఉత్తమజ్ఞానికి కూడ దేహసంయోగము ఉండదు. బండిని తోలుచున్నవాఁడు ఆ బండియే తాను అని ఎట్లు తలంపఁడో అట్లే ఉత్తమ జ్ఞానియు శరీరమును నడపు చున్నను అదియే తాను అని తలంపఁడు. తనకు దేహ మున్నట్లు గాని, దానితో వ్యవహారము జరుపుచున్నట్లు గాని అతఁడు తలంపక ఎల్లప్పు చిన్మాత్రుఁడై యుండును. అంతరంగమున అత్యంతస్వచ్చత కలిగి అతఁడు బహిరంగముగ ఎన్నో వ్యవహారములను చేయుచుండును. స్త్రీ వేషమును ధరించి నటించు పురుషునివలె, చిన్నపిల్లవానితో ఆటలాడు పెద్దవానివలె, మహాయోగియు జగత్తులోని వ్యవహారమును వినోదమాత్రముగ నటించుచుండును. నాటకములోని సుఖసన్ని వేశములు దుఃఖసన్ని వేశములు అన్నియు ప్రేక్షకులకు ఆనందమునే ఎట్లు కలిగించుచుండునో అట్లే మహాయోగికి లోకవ్యవహార మంతయు వినోదమాత్రముగనే యుండును.

మధ్యమజ్ఞాని చిత్తనిరోధముయొక్క నిరంతరాభ్యాసమువలన అచలస్థితిని పొందును. ఉత్తమజ్ఞాని నిరంతరముగ విచారించుచుండు అధ్యసమువలన అచలస్థితిని పొందును. బుద్ధియొక్క పరిపాకము నందలి భేదమువలననే యిరువురకును భేద మేర్పడుచున్నది. బుద్ధి యందు అపరాధము మొదలగుదోషములు అల్పముగా నున్నచో చిత్తనిరోధము కొద్దిగానే యున్నను విచారణచేతనే ఉత్తమజ్ఞానులు స్వరూపమున నిశ్చలత్వమును పొందుదురు. అట్లు గాక బుద్ధియందు అపరాధము మొదలగు దోషములు అధికముగా నున్నచో చిత్తనిరోధము యొక్క అభ్యాసము అధికముగా చేసి మధ్యమజ్ఞాని నిశ్చలస్థితిని పొందును. ఈవిషయమున ఇద్దఱు జ్ఞానులకు జరిగిన సంవాదమును చెప్పెదను వినుము.

పూర్వము విపాశానదీతీరమున అమృతనగరమునందు రత్నాంగదుఁడను రాజు ఉండెను. అతనికి రుక్మాంగదుఁడు హేమాంగదుఁడు అను కుమారు లుండిరి. రుక్మాంగదుఁడు శాస్త్రపారంగతుఁడయ్యెను. హేమాంగదుఁడు ఉత్త మజ్ఞానియయ్యెను. వా రొకనాఁడు సైన్యములతో వసంతఋతువునందు వేటకై అడవిలోనికి పోయిరి. అచ్చట అనేకమృగములను వేటాడి అలసిపోయి ఒకమడుగునొద్దకు చేరిరి. ఆ మడుగున అవతలియొడ్డున ఒకమఱ్ఱిచెట్టుమీఁద బ్రహ్మరాక్షసుఁడుండెను. అతఁడు సకలశాస్త్రములయొక్క సారములను ఎఱింగినవాఁడు. అందువలన అతఁడు విద్వాంసులతో వాదములు చేయుచు వారిని ఓడించి భక్షించుచుండెను. ఇట్లు చాలకాలముగా జరుగుచుండెను. రుక్మాంగదుఁడు చారులవలన ఈవృత్తాంతమును వినియుండెను. అందువలన అతఁడు కుతూహలము కలవాఁడై తమ్మునితో కూడ ఆ చెట్టుదగ్గరకు పోయి ఆబ్రహ్మరాక్షసునితో వాదము నారంభించెను. బ్రహ్మరాక్షసుఁడు రుక్మాంగదుని ఓడించి పట్టుకొనెను. అప్పుడు హేమాంగదుఁడు ఆరాక్షసునితో ఇట్లనెను. ''ఇతనిని నీవు భక్షించుటతగదు. నన్నుజయింపక నీవు మాయన్నను జయించినట్లు కాదు. కావున నన్ను జయించి మమ్మిరవురను భక్షింపుము,''

బ్రహ్మరాక్షసుఁడు ఇట్లనెను. ''నాకు చిరకాలమునకు ఆహారము లభించినది. ఆకలి నన్ను మిగుల బాధించుచున్నది. వీనిని ముందు పారణగా భక్షించి పిదప నీతో వాదించి జయించి నిన్ను కూడ భక్షించిసంతృప్తి నొందెదను. ఒకప్పుడిచ్చటికి వసిష్ఠునియొక్క శిష్యుఁడు దేవరాతుఁడు రాఁగా వానిని భక్షించితిని. వసిష్ఠుఁడు కోపించి, ''ఇంక నీవు మనుష్యుని భక్షించినచో నీముఖము దగ్ధ మగును'' అని శపించెను. నేను మిగుల ప్రార్థింపఁగా ఆయన కరుణించి, ''వాదమునందు జయిపఁబడినవారిని భక్షింపుము'' అని వరము నిచ్చెను. అప్పటి నుండియు ఇట్లు ఓడినవారిని భక్షించుచున్నాను. చాలకాలమునకు ఇప్పటికి శ్రేష్ఠమైనయాహారము లభించినది. కావున వీనిని భుజించిపిదప నీతో వాదింతును.''

ఇట్లు చెప్పి బ్రహ్మరాక్షనుఁడు రుక్మాంగదుని భక్షింపఁబూను కొనఁగా హేమాంగదుఁడు ''నీకుకావలసినది ఏపదార్థమైన అడుగుము. అది తెచ్చియిచ్చి మాయన్నను విడిపించుకొందును'' అని మిగుల ప్రార్థించెను. బ్రహ్మరాక్షసుఁడు, ''వీనికి ప్రత్యామ్నాయముగ నాకు కావలసినవస్తు వేదియును లేదు. సరియైన సమయమున లభించి ప్రాణములవలె ప్రియమైనయాహారమును ఎవఁడైన వదలుకొనునా? అయినను ఒకయొప్పందము చేయుచున్నాను. నామనస్సునందు కొన్ని ప్రశలు కలవు. వానికి నీవు సమాధానములు చెప్పినచో మీయన్నను వదలిపెట్టుదును'' అని పలికెను. ''అట్లయినచో అడుగుము.'' అని హేమాంగదుఁడు పలికెను.

అంతట బ్రహ్మరాక్షసుఁడు గూఢములైన ప్రశ్నలను అడుగుచుండఁగా హేమాంగదుఁడు ఇట్లు సమాధానములను చెప్పెను.

ప్రశ్న:- ఆకాశముకన్న విశాలమైనది, పరమాణువుకన్న సూక్ష్మమైనది ఏది? అది ఏరూపముతో ఎచ్చట నుండును?

సమా:- చైతన్యము ఆకాశముకన్న విశాలము, పరమాణువుకన్న సూక్ష్మము. అది స్ఫురణమే రూపముగా ఆత్మయం దున్నది.

ప్రశ్న:- అది యొక్కటియే విశాలముగా ఉండి మిగుల సూక్ష్మము ఎట్లగును? స్ఫురణ మనఁగా ఏమి? ఆత్మ అనఁగా ఏది?

సమా:- చైతన్యము సకలమునకు కారణ మగుచటే విశాలముగ నున్నది. అది యింద్రియములచేత మనస్సుచేత గ్రహించుటకు శక్యముకాని దగుటచే సూక్ష్మమై యున్నది. స్ఫురణము ఆత్మ అనునవి రెండును చైతన్యమే.

ప్రశ్న:- అది ఏస్థానమునందు పొందఁదగియున్నది? దానిని పొందుటకు సాధన మేమి? దానిని పొందుటవలన ఏమి గలుగును?

సమా:- దానిని పొందఁదగినస్థానము బుద్ధి. ఏకాగ్రతవలన అది లభించును. అది లభించినచో పునర్జన్మ యుండదు.

ప్రశ్న:- నీవు చెప్పుచున్న బుద్ధి ఏది? దానియొక్క ఏకాగ్రత అనఁగా ఎట్లుండును? జన్మ అనఁగా ఏమి?

సమా:- జడత్వముచే ఆవరింపఁబడిన చైతన్యమే బుద్ధి. దృశ్యములయందు ప్రసరింపక స్వరూపమునందే బుద్ధి నిలిచియుండుట ఏకాగ్రత. దేహమే నేను అనుతలంపు కలుగుటయే జన్మము.

ప్రశ్న:- దేనివలన చైతన్యము లభించుట లేదు? దేని వలన అది లభించును? జన్మము ఎట్లు కలుగుచున్నది?

సమా:- అవి వేకమువలన చైతన్యము లభించుట లేదు. ఆత్మ చేతనే అది లభించుచున్నది. కర్తృత్వాభిమానమువలన జన్మ కలుగుచున్నది.

ప్రశ్న:- నీవు చెప్పిన అవివేకము ఎట్టిది? ఆత్మ అనఁగా నేమి? కర్తృత్వాభిమానము అనఁగా నేమి?

సమా:- దేహమునకు ఆత్మకు భేదము తెలియకుండుటయే అవి వేకము. ఆత్మ అనఁగా నేమో నీస్వరూపమునే ప్రశ్నించుచు తెలిసికొనుము. ''నేను కర్తను'' అను జ్ఞానముయొక్క వాసనయే కర్తృత్వాభిమానము.

ప్రశ్న:- అవి వేకము దేనిచేత నశించును? అది దేనివలన లభించును? అదియును దేనివలన కలుగును?

సమా:- విచారముచేత అవివేకము నశించును. వైరాగ్యము వలన విచారము లభించును. వైరాగ్యము కలుగుటకు దోషదృష్టి కారణము.

ప్రశ్న:- విచార మనఁగా నేమి? దేనిని వైరాగ్య మందురు? దోషదృష్టి ఏది?

సమా!- దృక్కును దృశ్యమును పరీక్షించుచుండుట విచారము. దృశ్యమునందు రాగము లేకుండుట వైరాగ్యము. దృశ్యమునందు ''ఇది దుఃఖమును కలిగించును'' అనుభావమును కలిగియుండుట దోషదృష్టి.

ప్రశ్న:- ఇది యంతయు దేనివలన కలుగును? అది దేనివలన పొందఁబడును? దానికి మూలకారణము ఏమి?

సమా:- దేవతానుగ్రహముచేత ఇది యంతయు కలుగును. అది భక్తి చేత లభించును. భక్తికి మూలకారణము సత్సంగము.

ప్రశ్న:- దేవత ఎవరు? భక్తి అనఁగా నేమి? ఎట్టివారు సత్పురుషులు.

సమా:- జగదీశ్వరి దేవత. ఆమెయందే చిత్త మాసక్తమైయుండుటభక్తి. శాంతులు దయాశాలులును అయినవారు సత్పురుషులు.

ప్రశ్న:- లోకమున భీతికలవాఁడెవడు? ఎల్లప్పుడు దుఃఖమును పొందువాఁడెవఁడు? ఎవఁడు ఎప్పుడును దైన్యము నొందుచుండును?

సమా:- మహాధనము కలవాఁడు భీతుఁడు. పెద్దకుటుంబము కలవాఁడు దుఃఖమునుపొందును. ఆశాగ్రస్తుఁడు ఎల్లప్పుడు దీనుఁడు.

ప్రశ్న:- భయములేనివాఁడెవఁడు? దుఃఖములేనివాఁéడెవఁడు? దైన్యములేనివాఁ డెవఁడు?

సమా:- సంగరహితునకు భయ ముండదు. మనస్సునుజయించినవానికి దుఃఖము కలుగదు. తెలిసికొనవలసినదానిని ఎవఁడు తెలిసికొనియుండునో వానికి దైన్యము ఉండదు.

ప్రశ్న:- గుర్తించుటకు వీలుకానివాఁడెవఁడు? దేహము కలవాఁడయ్యును ఎవఁడు విదేహుఁడు? నిష్క్రియుఁడైనవానికి ఎట్టి క్రియ ఉండును?

సమా:- జీవన్ముక్తుఁడు గుర్తించుటకు వీలుకానివాఁడు. అతఁడే దేహము కలవాఁడుగా కన్పించుచున్నను విదేహుఁడే అగును. ఊరకుండుటయే వాని పని.

ప్రశ్న:- ఏది ఉన్నది? ఏది లేదు? లోకమున అత్యంతము అసంభవమైన దేది?

ఈప్రశ్నలకు సమాధానము చెప్పి మీయన్నను త్వరగా విడిపించుకొనుము.

సమా:- దృక్కు ఉన్నది. దృశ్యము లేదు. వ్యవహారము అసంభవము.

నీప్రశ్నలకు సమాధానము చెప్పితిని. మాయన్నను వెంటనే విడిచిపెట్టుము.

బ్రహ్మారక్షసుఁడు రుక్మాంగదుని విడిచిన వెంటనే బ్రాహ్మణుఁడయ్యెను. తపోమూర్తియై తేజస్సుతో ప్రకాశించుచున్నయతనిని చూచి సందేహముతో రాజకుమారు లిరువురు ''ఎవరు నీవు'' అని ప్రశ్నించిరి. ఆ బ్రాహ్మణుఁడు తనవృత్తాంతము నిట్లు చెప్పెను. ''నేను మగధదేశ మునందు వసుమంతుఁడను పేరుగల బ్రాహ్మణుఁడను. నేను సకల శాస్త్రవిశారదుఁడనై వందలకొలఁది విద్వాంసులను సభలలో జయించుచు గర్వించి యుంటిని. ఒకనాఁడు మగధరాజుయొక్క సభయందు వాదమును కోరుచు అష్టకుఁడు అనుమునిని ఎదుర్కొంటిని. ఆయన పరము అపరము తెలిసినవాఁడు, శాంతుఁడు. శుష్కతర్కమునందు నిపుణుఁడనైన నేను ఆయనను ఆత్మవిద్యావిచారమునందు ఆక్షేపించితిని. ఆయన శాస్త్రసమ్మతముగా సమాధానము చెప్పెను. అయినను నేను తర్కయుక్తులతో ఆయన చెప్పినదానిని ఖండించుచు ఆక్షేపింపఁజొచ్చితిని. నేను బహువిధములు ఆక్షేపించినను ఆయన శాంతుఁడై మాటాడక ఊరకుండెను. ఆ మహాత్ముని శిష్యుఁడు కాశ్యపుఁడు క్రుద్ధుఁడై ''ఓరి! ద్విజాధమా! మా యాచార్యుని అక్రమముగా ఆక్షేపింతువా? ఇందులకు ఫలముగా చిరకాలము బ్రహ్మరాక్షసుఁడవై యుండుము'' అని శపించెను. వెంటనే నేను భయముతో వణఁకుచు అష్టకునకు ప్రణమిల్లి శరణు వేడితిని. విరోధినైన నాయందు కూడ ఆయన దయకలవాఁడై, ''ఇప్పుడు కొన్ని ప్రశ్నలను నీవు నన్నడిగితివి. వానికి నేను సమాధానములను చెప్పితిని. అయినను నీవు కేవవలమైన తర్కముచేత ఆ సమాధానములను ఖండించి ప్రశ్నలను నిలిపితివి. ఈప్రశ్నలనే నీవు అడుగుచుండుము. వీనికి ఒకానొక విద్వాంసుఁడు సరియైన సమాధానములను చెప్పును. అప్పుడు నీకు శాపవిముక్తి అగును'' అని చెప్పెను. ఇప్పటికి నీవలన నాకు శాపము నుండి విముక్తి కలిగినది. కావున నిన్ను మహాత్మునిగా తలంచుచున్నాను.

హేమాంగదుఁడు ఆశ్చర్యము నొందుచు, వసుమంతుఁడు ఇంకను అడిగిన ప్రశ్నలకు సమాధానములు చెప్పి ఆయనకు ప్రణమిల్లి ఆశీశ్సులను పొంది సోదరునితో సైన్యములతో నగరమునకు తిరిగి వచ్చెను. భార్గవా! నీవు అడిగినదాని కంతకును సమాధానము చెప్పితిని.''

ఇది జ్ఞానఖండమున రాక్షసోపాఖ్యాన మన్నది ఇరువదియొకటవయధ్యాయము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters