Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

త్రిపురా మాహాత్మ్యము

దత్తాత్రేయుఁడు పరశురామునకు త్రిపురాదేవియొక్క మహాత్మ్యమును ఇట్లు వర్ణించి చెప్పెను. "త్రిపురాదేవియొక్క ఆజ్ఞ ననుసరించి బ్రహ్మ పృధివియందు క్షణములో మనుష్య యక్షగంధర్వాది జాతులతో సర్వమును సృష్టించెను. పిమ్మట ఆమహాదేవియొక్క ఆజ్ఞవలన విష్ణువు సృష్టిని పాలించుచుండగా కల్పాంతమునందు ఈశ్వరుఁడు లయ మొనర్చుచుండెను. పనిచేయుచుండఁగా వారికి శ్రమ కలుగఁజొచ్చెను. వారిస్థితిని గమనించి ఆదేవి ద్వాదశ భుజములతో దశ శీర్షములతో ఆమువ్వురి రూపములుగలయాకృతితో వారికి సాక్షాత్కరించెను. వారు ఆమెను స్తుతించి తమశ్రమనుగూర్చి చెప్పుకొనిరి. అప్పుడామె తనయందున్న బ్రహ్మయొక్క అంశము నుండి సరస్వతిని, విష్ణువుయొక్క అంశమునుండి లక్ష్మీని, ఈశ్వరుని యంశమునుండి గౌరిని సృష్టించి వారి కొసంగెను. వారు తమశక్తి మూర్తులైన యాసత్యలను తీసికొనిపోయి శుభముహూర్తమునందు పెండ్లాడిరి. ఇట్లు వారు త్రిపురాదేవియొక్క తేజస్సునందలికళలను పొందుటవలన శ్రమలేక తమ కృత్యములయందు ఉత్సాహముతో వర్తింపఁజొచ్చిరి. ఇది త్రిరూపాఖ్యానము.

భార్గవా! ఇంక లక్ష్మీ మహాత్మ్యమును వినుము. మొదట మనుష్యులు స్వార్థరహితులై స్వర్గము మొదలగువానిని కోరక యజ్ఞయాగాదులను చేయకుండిరి. మనుష్యులు తమ్ము సేవించుట లేదని దేవతలకు చింతకలిగెను. అప్పుడు ఇంద్రాదులు బృహస్పతితో సమాలోచనము గావించి బ్రహ్మదేవుని చూడఁబోయిరి. సత్యలోకము నందు వెలుపల శతయోజనవిస్తీర్ణమైన మహాసభయందు కొలువుఁ దీర్చియున్న పరమేష్ఠిని సందర్శించిరి.

సత్యలోకమునకు లోపల ఇట్టి మహాసభ##యే మఱియొకటికలదు. దానియందు పరమేష్ఠి మఱియొక రూపమున కొలువుఁదీర్చియుండును. దానియందు కామక్రోధాదిరహితులైనవారికి తప్ప ఇతరులకు ప్రవేశము ఉండదు. అందువలన దేవేంద్రాదులు కూడ అచ్చటికి పోలేరు.

అందువలన ఇంద్రాదులు వెలికొలువునందే బ్రహ్మదేవునిసందర్శించి తమచింతను ఆయనకు ఎఱింగించిరి. అది విని ఆయన మీరు లక్ష్మిని ప్రార్థింపుఁడు" అని చెప్పిపంపెను. అప్పుడువారు ఆమెనుగూర్చి తపస్సు చేయఁగా ఆదేవి ప్రత్యక్షమై కాముఁడను కుమారుని సంకల్ప మాత్రముననే సృష్టించి యిచ్చి, "వీఁడు మీకార్యమును తీర్చగలఁడు" అని పలికి అంతర్ధానము నొందెను.

ఇంద్రాదులు తన్ను ప్రార్థించుచుండఁగా కాముఁడు అతి గర్వితుఁడై, ''మీ కింక చితంవలదు.నేను ఈ మనష్యులను మీకు సేవకులను గావింతును'' అని ప్రతిజ్ఞ చేసి భూలోకమునకు వచ్చి, ''మనుష్యులారా! మీ రందఱు దేవతలను పూజింపుఁడు'' అని ప్రబోధింపఁజొచ్చెను. ''అయ్యా! స్వర్గమునందు దేవత లెట్లున్నారో ఈ లోకమున మేమును అట్లే యున్నాము. మేము వారిని ఏల పూజింపవలె?'' అని వారు కాముని తిరస్కరించిరి. కాముఁడుగ్రుఁడై వారిని సంహరింపఁబూనెను. అప్పుడు వీరవ్రతుఁడనువాఁడు భూమిని పాలించుచుండెను. ఆయన బ్రహ్మావర్తమునం దుండెను. రాష్ట్ర పాలకులకును కామునకు సంకులసమరము జరుగఁజొచ్చెను. చారులు పోయి ఈవృత్తాంతమును రాజునకు చెప్పిరి. ఆయన వర్ధనుడను మంత్రితో ఆలోచించి కాముని జయించుటకై ఎనిమిది దినములు శంకరుని గూర్చి ఘోరముగ తపస్సుచేసెను. శంకరుఁడు ప్రత్యక్షమై ''నీకు విజయము లభించు'' నని వర మొసంగెను.

ఈలోపల కాముఁడు రాష్ట్రపాలకులను జయించుచు బ్రహ్మవర్తమునకు చేరెను. అప్పుడు ఇంద్రాదులు దేవసైన్యములతో కామునకు సాయముగా వచ్చిరి. సుధృతి రణధీరుఁడు మొదలుగా వీరవ్రతునియొక్క సేనాపతులు ఘోరయుద్ధ మొనర్చి ఇంద్రాదులను బంధించిరి. అప్పుడు కాముఁడు విజృంభించి రాజసైన్యములను ధ్వంస మొందింపఁజొచ్చెను. అప్పుడ రణధీరుఁడు కాముని మార్కొని గదాప్రహారమున మూర్ఛ నొందించెను. కాముఁడు మూర్ఛనుండి తేరుకొనునప్పటికీ వీరవ్రతుఁడు యుద్ధరంగమున ప్రవేశించెను. కామునకు వీరవ్రతునకు మూఁడహోరాత్రములు ఘోరయుద్ధము జరిగెను. నాల్గవదినమున వీరవ్రతుఁడు శంకరుని స్మరించి ఆయన ప్రసాదించిన శూలాత్మకమైన యస్త్రమును ప్రయోగించెను. కాముఁడు విగతప్రాణుఁడై పడిపోయెను. లక్ష్మీదేవియొక్క దూతలు వచ్చి ఆతని శరీరమును ఆమె యొద్దకుఁ గొనిపోయిరి.

వీరవ్రతుఁడు విజయోత్సవములను జరుపుచుండఁగా, అతని గురువు విద్యాపతి దేవతలను బంధించుట యుక్తము కాదని చెప్పెను. వెంటనే సుధృతి అను మంత్రి దేవతలను బంధముక్తులను గావించి తీసికొనివచ్చెను. వీరవ్రతుఁడు వారి నందఱను పూజించి క్షమింపుఁడని ప్రార్థించెను.

లక్ష్మీదేవి త్రిపురాదేవి ప్రసాదమున అమృతమును పొంది కాముని బ్రతికించెను. ఓటమినిగూర్చి కాముఁడు వ్యధనొందుచుండఁగా లక్ష్మీదేవి ''నీవు కేవలము మనుష్యుని శక్తిచేత ఓడింపఁబడలేదు. శంకరుని శక్తియే యిందులకు హేతువు'' అని యోదార్చెను. దానితో అతడుశాంతింపక, ''అట్లయినచో శంకరుఁడు కూడ నాకు శత్రువే. వానిని జయించునుపాయమును చెప్పుము'' అని పట్టుఁబట్టెను. అప్పుడచ్చటికి వచ్చిన గౌరి వాని మొండితన మునకు కోపించి ''నీవు శంకరునిచే దగ్ధుఁడ వగుదువు'' అని శపించెను. లక్ష్మి అందులకు కోపించి ''నీవును ఇట్లే భర్తృనిందను విని తపించి దగ్ధురాల వగుదువు'' అని గౌరిని శపించెను. ''అట్లయినచో నీవు పతివియోగమును సవతులవలన క్లేశమును పొందము'' అని గౌరి మరల లక్ష్మిని శపించెను. అంతటవారి కిరువురకు ఘోరసంగ్రామము జరిగెను. లక్ష్మీయొక్క శరముచేత గౌరి మూర్ఛిల్లెను. బ్రహ్మవచ్చి లక్ష్మిని ప్రార్థించి శాంతింపఁజేసెను గౌరియు మూర్ఛ నుండి తేఱుకొని శాంతించెను. ఆశాపఫలముగానే గౌరిదేవి దక్షుని పుత్రికగా జన్మించి అతఁడు గావించిన యజ్ఞమున భర్తృనిందను సహింపలేక యోగాగ్నిచే దగ్ధురాలయ్యెను.

వీరవ్రతుఁడు పాలించుచున్నంతకాలము దేవతలు ఆతనితో సఖ్యమును పాటించుచుండిరి. అతని యనంతరము మరల ఇంద్రాదులు బ్రహ్మయొద్దకు పోయి తమ కోరికలను విన్నవించిరి. అప్పుడాయన వర్షముయొక్క ఆధిపత్యమును ఇంద్రునకొసంగి ''మానవులు ఎచ్చట యజ్ఞములు చేయుదురో అచ్చట వర్షమున కురిపింపుము. వర్షముకొఱకు మానవులు నిన్ను యజ్ఞములయందు పూజింతురు'' అని పలికెను. అప్పటినుండి మానవులు యజ్ఞములు చేసి దేవతలను పూజింపఁదొడఁగిరి.

కాముఁడు తల్లియొక్క ఉపదేశము ననుసరించి త్రిపురాదేవి నుపాసించి అమోఘములైన ధనుర్భాణములను పొంది శంకరుని జయించుటకై తగిన సమయము కొఱకు వేచియుండెను. దక్షయజ్ఞమున భస్మమైన గౌరి హిమవంతునకు పుత్రికయై శంకరుని పెండ్లాడెను. శంకరుఁడు గాఢమైన తపస్సమాధియందు నిమగ్నుఁడైయుండెను. ఆసమయమున తారకుఁడు శూరపద్ముడు అను రాక్షసులు గొప్ప తపస్సుచేసి దానియొక్క ప్రభావముచేత ఇంద్రపదమును ఆక్రమించిరి. ఇంద్రుఁడు బ్రహ్మను శరణుఁజొచ్చెను. ఆయన శంకరుని కుమారునివలన ఆరాక్షసులు హతులగుదురని చెప్పెను. అప్పుడు శంకరుని తపస్సునుండి మరలించుటకై యింద్రుఁడు కాముని అభ్యర్థించెను. కాముఁడు పూర్వవైరమును స్మరించి శంకరుని సమీపించి ఆయనపై పుష్పభాణమును ప్రయోగించెను. దానివలన కలిగిన చిత్త క్షోభమువలన ఈశ్వరుని కంటినుండి అగ్ని వెలువడి కాముని దహించెను పిమ్మట దేవతల ప్రార్థనమున ఈశ్వరుఁడు పుత్రుని పొందుటకు అంగీకరించెను. అప్పుడు సనత్కుమారుఁడు ఆయనకు పుత్రుఁడై కుమారస్వామిగా అవతరించెను.''

''ఆమహర్షి ఏల ఇట్లు జన్మించెను?'' అని పరశురాముఁడు ప్రశ్నింపఁగా దత్తాత్రేయుఁడు ఇట్లు చెప్పెను. ''ఋషభపర్వతము నందు తపస్సుచేయుచున్న సనత్కుమారుఁడు అచ్చటికి వ్చచిన బ్రహ్మదేవునితో ఇట్లనెను.''తండ్రీ! నాకు ఒక స్వప్నము వచ్చినది. అందు నేను దానవులను సంహరించినట్లుగా చూచితిని. దీని కేమి కారణము?'' బ్రహ్మ ఇట్లుచెప్పెను. ''వత్సా! నీవు పూర్వజన్మమున బ్రాహ్మణుఁడవు. అప్పడు దేవదానవుల యుద్ధమును గూర్చి వినుచు స్వయముగా నీవే దానవులను సంహరింపవలయు నని భావించుచు అగ్నిని ఆరాధించుచు దేహమును త్యజించితివి. ఆయుపాసనయొక్క పుణ్యమువలన ఇప్పుడు నాకు పుత్రుఁడ వైతివి. ఆభావనయొక్క బలమున ఇప్పుడు నీకు స్వప్నము వ్చచినది. నీవు స్వేచ్ఛగా మఱియొక జన్మమును పొంది ఆభావనయొక్క సిద్ధి నొందఁగలవు.'' ఇట్లు చెప్పి ఆయన వెడలిపోయెను. తరువాత ఒకప్పుడు పార్వతీపరమేశ్వరులు సనత్కుమారుని యొద్దకు వచ్చిరి. ఆమహర్షి సమాధియందు ఆనందమగ్నుఁడై యుండి వారిని గమనింపలేదు. పరమేశ్వరుఁడు ఆమునిని ఆక్షేపించెను. ఆయాన సమాధిని వీడి ఆక్షేపములను వినియు శాంతముతో ఇట్లనెను. ''మీరు నాయందు ఇష్టమ వచ్చినట్లుగా శాపములను కురిపించినను మంచిదే, వరములను కురిపించినను మంచిదే.'' ఆయనయొక్క స్థైర్యమునకు మెచ్చి ఈశ్వరుఁడు వరమును కోరుకొమ్మనెను. ''మీరే నావలన వరమును కోరుకొనుఁడు'' అని మహర్షి యనెను.'' అట్లయినచో నీవు నాకు పుత్రుఁడవుగా జన్మింపుము'' అని ఈశ్వరుఁడు కోరెను. ''అయ్యా! నీవు మాత్రమే కోరితివి. పార్వతి కోరలేదు. కావున నీకు మాత్రమే పుత్రుఁడు నయ్యెదను'' అని మహర్షి అనెను. అప్పుడు పార్వతి ''అయ్యా! నాకును పుత్రుఁడవు కమ్ము'' అని ప్రార్థించెను. అమ్మా! గర్భమునుండి జన్మించుట నాకు ఇష్టము లేదు. పూర్వము వృతాస్రురునకు వెఱచి ఆయన అదృశ్యుఁడైనప్పుడు నీవు భర్తృవియోగ దుఃఖమున గంగాతీరమునందు శరీరమును త్యజించితివి. ఆదేహావయవములనుండి అక్కడ రెల్లుపొదలు (శరవణము) ప్రబలెను. కావున నేను అచ్చట జన్మించి నీదేహమునుండి పుట్టినట్లుగానే నీకు కుమారుఁడ నయ్యెదను" అని ఆమహర్షి ఆమె నోదార్చెను. అట్లే ఆయన తరువాత ఈశ్వరుని వీర్యమువలన శరవణమునందు కుమారస్వామిగా జన్మించి తారకాసురుఁడు మొదలగు రాక్షసులను సంహరించెను.

భార్గవా! ఇంక భరాతీదేవియొక్క మహత్త్వమును వినుము. ఒకప్పుఁడు బ్రహ్మసభయందు మహర్షులు భారతిని స్తుతించు చుండిరి. బ్రహ్మ దానిని మెచ్చక ఆమెను పరిహసించెను. ఆమెయు ఆయనను ఆక్షేపించెను. ఆయన కోపించి, "నీవు నాకు భార్యగా నుండఁదగవు" అని శపించెను. ఆమెయును క్రుద్ధురాలై "అట్లయినచో నీకు గొల్ల పిల్లయే భార్యయగును" అని శపించెను. దేవతలు వారిని శాంతింపఁజేసిరి. తరువాత కొంతకాలమునకు బ్రహ్మయజ్ఞము చేయఁబూనుకొని భారతిని ఆహ్వానించెను. ఆమె అలుక వహించెను. బ్రహ్మ విసిగి విష్ణువును చూచి "ఈక్షణమే కన్యను వెదకి తెమ్ము. పత్నినిగా స్వీకరించి యజ్ఞము చేయుదును" అని పలికెను. ఆయన వెంటనే ఒక గోపకన్యను తీసికొని వచ్చెను. ఆమెను పత్నినిగాకైకొని బ్రహ్మ యజ్ఞమును ముగించెను.

తనకన్న అధికసౌందర్యవతిగా నున్న గొల్లపిల్లను చూచి భారతి సిగ్గుపడి కోపముతో ప్రజ్జ్వలించెను. ఆమె కోపము అగ్నియై లోకమున ప్రసరింపఁజొచ్చెను. ఆమెను శాంతింపఁజేయుటకు ఇంద్రాదులు ఆమెయొద్దకు పోయి ఆమెచే బంధింపఁబడిరి. లక్ష్మీ పార్వతులు ఆమెను శాంతింపఁజేయలేక త్రిపురాదేవిని ప్రార్థించిరి. త్రిపురాదేవి సాక్షాత్కరించి భారతిని ఓదార్చుచు గోపకన్యవృత్తాంతము నిట్లు చెప్పెను.

"పూర్వము హర్యక్షుఁడను బ్రాహ్మణుఁడు ఒక గొల్లపిల్లను కామించి బలాత్కరించెను. ఆమె రోదన మొనర్చెను. నారదుఁడు అచ్చటికి వ్చచి ఆబ్రహ్మణుని చూచి కోపించి, "నీవు గొల్లవాఁడవే యగుదువు" అని శపించెను. హర్యక్షుఁడు నారదుని ప్రార్థింపఁగా ఆయన భారతీదేవిని ప్రార్థింపు మని చెప్పి వెడలిపోయెను హర్యక్షుఁడు నిన్ను ప్రార్థింపగా నీవు సాక్షాత్కరించి, "నీవు గొల్ల వాఁడవుగా జన్మించినను నీకు నేను పుత్రికగా జన్మింతును. పిమ్మట నీకు పరమపదము కలుగును" అని వరమొసంగితివి. నీయంశము ననే వేదమాతయైన గాయత్రి ఈగొల్లపిల్లగా ఆవిర్భవించినది."

ఇట్లు చెప్పి త్రిపురాదేవి గాయత్రియందు ప్రవేశించెను. అప్పడు గాయత్రి చతుర్భుజములతో మూడు కన్నులతో త్రిపరాస్వరూపమును పొందెను, దేవతలు స్తుతించుచుండఁగా హర్యక్షుఁడచ్చటికి వచ్చెను. అప్పడు గాయత్రి ఆతనితో నిట్లనెను. "నీవు కాలాంతరమున ద్వాపరయుగమున నందగోపుఁడవుగా జన్మింతువు. అప్పుడు నేను విష్ణువుదేవుని యంశమున జన్మించు శ్రీకృష్ణునకు చెల్లెలుగా నీకు పుత్రికగా జన్మించి గోపికలచే పూజింపఁబడి వింధ్యవాసినీ దేవినిగా ప్రసిద్ధురాలనై జనులను ఉద్ధరింతును" అని బ్రహ్మదేవునితోఁగూడి వెడలిపోయెను.

కావున గాయత్రీదేవియే ద్వాపరాంతమును నందుని భార్యయగు యశోదకు పుత్రికగా జన్మించెను. వసుదేవుఁడు దేవకికి జన్మించిన శ్రీకృష్ణుని యశోదయొద్ద నుంచి ఆమెకు జన్మించిన పుత్రికను మధురకు తీసికొనివచ్చును. కంసుఁడాబాలికను చంపఁబోఁగా వానిశక్తిని హరించుచు ఆమె పైకిఎగసి వింధ్యవాసినీరూపమును ప్రకటించి వానిని శపించి అంతర్ధాన మొందును. గోపకన్యలు శ్రీకృష్ణుని పతినిగా గోరి కాత్యాయనుఁడను మునిని సేవింతురు. ఆయన అంబికను ప్రార్థించును. ఆమె సాక్షాత్కరించి, "నీపేరట నేను కాత్యాయనీదేవి నిగా వెలయుచున్నాను. కావున గోపకన్యలు కాత్యాయనీవ్రతమున గావించినచో వారికోరిక నెరవేరును" అని చెప్పెను వారు అట్లే కాత్యాయనీవ్రతమును గావించి శ్రీకృష్ణ సమాగమమును పొందుదురు. శ్రీకృష్ణుఁడు ద్వారకయందున్నప్పుడు రాక్షసులు నందుని గోపకన్యలను బంధింప యత్నించుచుండఁగా యశోద మొదలగువారు కాత్యాయనుని యాదేశమున కాత్యాయనిని ప్రార్థింపఁగా ఆమె ఆవిర్భవించి రాక్షసులను సంహరించి వారిని రక్షించును.

ఇంక చండికావృత్తాంతమువినుము. పూర్వము శుంభనిశుంభులను రాక్షసప్రభువులు తపస్సుచేసి ఏపురుషులవలనను ఓటమి లేకుండునట్లు వరమును పొంది దేవతలను జయించి స్వర్గము నాక్రమించిరి. ఇంద్రాదులు బ్రహ్మను శరణుఁజొచ్చిరి. బ్రహ్మ దేవతలతో గంగాతీరమున త్రిపురాదేవిని ప్రార్థించెను. అప్పుడు పార్వతి అచ్చటికి వచ్చి దేవతల ప్రార్థనమును విని "నేను రాక్షసులను సంహరింతు" నని పలుకుచు క్రోధముచేత నల్లఁబడిన కాళి యయ్యెను. అప్పుడామెశరీరమునుండి త్రిలోకమోహినియైన చండిక ఆవిర్భవించెను. దేవతలు జయనినాదము గావించిరి. ఆప్రాంతమునకు వేటకై వచ్చి యున్న శుంభనిశుంభులమంత్రులు చండుఁడు ముండుఁడు ఆశబ్దమును విని అచ్చటికి వచ్చిరి. వారిని చూడఁగనే దేవతలు పారిపోయిరి. చండముండులు చండికా సౌందర్యముచేత మోహితులై ఆమెను కోరఁజొచ్చిరి. కాళి వారి నిరువురను పట్టుకొని ఒకరితలతో మఱియొకరితలపై మోది పడఁగొట్టెను. వారు మూర్ఛిల్లి లేచి పారిపోయి శుంభనిశుంభులకు చండికనుగూర్చి చెప్పిరి. శుంభుఁడు ఆమెను కోరుచు దూతను పంపెను. ''నేను రాక్షస సంహారమునకు పూని యున్నాను. మీ రాజు నన్ను జయించినచో నేను వానికి భార్య నగుదును'' అని చండిక చెప్పిపంపెను. అంతట రాక్షసులు దండెత్తి వచ్చిరి. అప్పుడు విష్ణువు చండికకు సింహరూపమున వాహన మయ్యెను. ఆమె సింహావాహనయై శుంభనిశుంభలను నిర్మూలింపఁగా కాళి చండముండులను సంహరించెను. సింహము రాక్షససైన్యమును భక్షించెను.

పిమ్మట కాలంధాజులను రాక్షసులు తపస్సుచేసి, పురుషులచేతఁ గాని స్త్రీ స్వభావముగల స్త్రీలచేతఁగాని ఓటమి లేకుండునట్లుగా వరమును సంపాదించి స్వర్గమును ఆక్రమించిరి. దేవతలు త్రిపురాదేవిని ప్రార్థించుచుంéడఁగా అప్పుడే రాక్షసులు వారిపైకి వచ్చిరి. తక్షణమే త్రిపురాదేవి సాక్షాత్కరించి హుంకరించెను. ఆశబ్దమునకు రాక్షసులు మూర్ఛిల్లిరి. దేవతలు ఆమెను స్తుతించిరి. అప్పుడామెనుండి క్రోధరూపిణియై కాళికాదేవి వెలువడెను. ఆమె స్త్రీకి స్వభావమైన లజ్జనువీడి దిగంబరయై వ్రేలడుచున్న నాలుకతో చతుర్భుజములతో రాక్షసులను భక్షించుచు మద్యమునుత్రావుచు వారిశీర్షములతో ముండమాలను, ఖండితములైన వారిహస్తములతో మొలత్రాడును ఏర్పఱచు కొని రాక్షససంహారమును గావించెను. బ్రహ్మాదిదేవతలు ప్రార్థింపఁగా ఆమె ప్రసన్నురాలై ''నావిగ్రహమును పూజించువారికి సర్వకార్యసిద్ధి'' అగును అని పలికి అంతర్దానము నొందెను.

రామా! ఇంక దుర్గాదేవి చరిత్రమును వినుము. దుర్గనుండితి రక్షించునది కావున ఆమెకు దుర్గయనునామము ప్రసిద్ధ మయ్యెను. ఒకప్పుడు మహిషుఁడు అను రాక్షసుఁడు తపశ్శక్తిచే దేవతలను జయించి త్రిలోకాధిపతి యయ్యెను. ఇంద్రాదులు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు త్రిపురాదేవిని ప్రార్థించుచు ఒకచోట సమావేశ##మైరి. అది తెలిసికొని రాక్షసులు వారిపైకి వ్చచిరి. అప్పుడు ఆలోకపాలకులు తమ తేజస్సులయొక్క అంశములను ఒకచోట సమకూర్చిరి. ఆతేజస్సులయొక్క సముదాయమునుండి త్రిపురాదేవి దుర్గారూపమున వెలువడి సకలాయుధములను గైకొని సింహముపై బయలుదేరి పుత్రపౌత్రులతో కూడా మహిషాసురుని సంహరించెను.

త్రిపురాదేవియొక్క మూర్తులతో లలితారూపము శ్రేష్ఠము. ఆమె చరిత్రమును చెప్పు మని అగస్త్యుఁడు విష్ణుదేవుని ప్రార్థింపఁగా ఆయన అందులకు హయగ్రీవుని నియోగించెను. హయగ్రీవుఁడిట్లు చెప్పెను. పూర్వ మొకప్పుడు లక్ష్మీదేవియొక్క దూతయగు మాణిక్య శేఖరుఁడు మందాకినియందు కొట్టుకొనిపోవుచున్న యొక కిన్నరస్త్రీని చూచి దయతో ఒడ్డునకు తెచ్చి రక్షించెను. కాని ఆమెసౌందర్యమునకు శరీరస్పర్శకు అతఁడు కామప్రకోపము నొంది ఆమెతో భోగింపఁగోరెను. ''ఆపదనుండి రక్షించినవాఁడు తండ్రి యగును. నీవు నన్ను కోరరాదు'' అని ఆమె వారించుచున్నను వాఁడామెను బలాత్కరింపఁజొచ్చెను. ఆమె ''రక్షింపుఁడు! రక్షిఁపుఁడు!'' అని యరువఁజొచ్చెను. లక్ష్మి అచ్చటికి వచ్చి వానిని చూచి ''రాక్షసుఁడవు కమ్ము'' అని శపించెను. వాఁéడు ప్రార్థింపఁగా ఆదేవి ''రాక్షసుఁడ వైనను నీకు సకలలోకాధిపత్యము సర్వభోగసిద్ధి కలుగును. తుదకు త్రిపురా దేవివలన మరణమును శాపముక్తిని పొందుదువు'' అని చెప్పెను.

శివుఁడు కాముని నేత్రాగ్నిచే దహించిన తరువాత గణశ్వరుఁడు క్రీడకొఱకు ఆభస్మము నంతను ముద్దగాఁజేసి బొమ్మను తయారు చేసెను. పార్వతి ప్రార్థింపఁగా శివుఁడు ఆబొమ్మకు ప్రాణమును ప్రసాదించెను. మాణిక్యశేఖరుఁడు ఆబొమ్మనుండి శిశువుగా ఆవిర్భవించెను. శివుని కోపముచేత ఏర్పడిన భస్మమగుటచే దానినుండి శరీరమును పొందిన మాణిక్యశేఖరుఁడు తపస్సుచేత రాక్షసుఁడయ్యెను. వాఁడు దేవతలయైశ్వర్యమును చూచి అసూయనొంది గంగాతీరమున శివునిగూర్చి తపస్సుచేసి తనకు సర్వవిజయిత్వమును సృష్టించుసామర్థ్యము అమరత్వము కలుగవలయునని శివుని ప్రార్థించెను. ఆయన నిరాకరించెను. వాఁడు మరల తపస్సు చేసెను. ఆయన మరల నిరాకరించెను. వాఁడు ఇంకను భయంకరముగా తపస్సుచేసెను. శివుఁడు సాక్షాత్కరించి, ''మాతృగర్భము నుండి జన్మించువారివలనఁగాని ప్రసిద్ధములైన యస్త్రశస్త్రములవలనఁగాని నీకు మరణము లేదు.'' అని వర మిచ్చి వెడలిపోయెను.

వాఁడు పాతాలమునకు అధిపతి అయి అచ్చటి రాక్షసులు ప్రోత్సహింపఁగా స్వర్గమును జియింపఁబూనెను. బ్రహ్మదేవుఁడు వచ్చి, ''భూలోకమును గైకొని స్వర్గమును దేవతలకు ఉండనిమ్ము. వారితో సఖ్యమును పాటింపుము'' అని నచ్చెఁజెప్పెను. ''అట్లయినచో దేవతలు శచీదేవిని నందనవనమును నాకు కప్పముగా ఈయవలె'' అని వాఁడనెను. బ్రహ్మ కోపించి, ''నీవు భండుఁడవు'' అని ఛీత్కారమొనర్చి అంతర్ధానము నొందెను. పిమ్మట వాఁడు మూఁడు లోకములకు అధిపతియై దేవతలను బరువులు మోయుకూలీలనుగా నియోగించెను. ఉగ్రకర్ముఁడు మొదలగువారిని దిక్పాలకులనుగా నియమించెను. అప్పుడు తారకుఁడను రాక్షసుఁడు మిగుల సంతోషించి తన తమ్ములను నలువురను వానికి సోదరులనుగా నొసంగెను. భండా సురఁడు కూడ ప్రీతుఁడై విశుక్రుఁడను సోదరుని భూలోకాధిపతిగ, విషంగుఁడనువానిని పాతాళాధిపతినిగా చేసెను. భండునకు భయపడి శచీదేవి గౌరినాశ్రయించెను. వాఁడు ఆమె కొఱకు కైలాసమునకు పోయి శచి నిమ్మని యడిగెను. గణశ్వరుఁడు వాని సైన్యమునంత మొందింపఁగా గౌరి హుంకారముచేత వానిని బంధించి సంహరింపఁబూనఁగా బ్రహ్మావాని వరమునుగూర్చి చెప్పి వారించెను. అప్పుడామె, ''నీవు మరల ఇక్కడికి వచ్చినచో నశింతువు'' అని శపించి వానిని వదలెను.

పిమ్మట దేవత లందఱు హిమాలయము నొద్దకు చేరి మహాయాగ మొనర్చిరి. అగ్నికుండమునందు త్రిపుర ఆవిర్భవించి వారి కభయమొసంగెను. ఆమెయే లలిత. ఇది ఎఱింగి శుక్రుఁడు దేవతలతో సఖ్య మొనర్చు మని భండునకు బోధించెను. కాని వాఁడు గురువు నాక్షేపించి దేవతలపై దాడి చేసెను. అప్పుడు త్రిపుర జ్వాలా మాలిని అనుశక్తిని పంపెను. ఆశక్తి దేవతలకు చుట్టును ప్రాకారముగా అగ్నిజ్వాలారూపమున నిలిచెను. ఆజ్వాలలను చూచి దేవతలు ఆయగ్నిలోపడి భస్మమైనారని తలంచుచు భండాసురుఁడు మరలి పోయెను. తరువాత నారదుఁడొకసారి తనయొద్దకు రాఁగా భండుఁడు ఆజ్వాలావళినిగూర్చి ప్రశ్నించెను. నారదుఁడు లలితాదేవియొక్క ఉత్పత్తిని చెప్పి దేవతలు జ్వాలామాలినిచే సురక్షితులై యున్నారని చెప్పెను.

పిమ్మట లలితాదేవి కామేశ్వరుని భర్తనుగా పొంది మంత్రిణి దండిని మొదలుగా శక్తులను సృజించి పరివారమును ఏర్పఱచుకొని యుద్ధసన్నద్ధురాలై బయలుదేరెను. భండాసురుఁడు కూడ మహాసైన్యముతో బయలుదేరివచ్చెను. ఆదైత్యసైన్యమును చూచి ఎనిమి దేండ్ల వయస్సుగల బాలాంబ అనుమహాశక్తి విజృంభించి దైత్యసేనాపతులను జయించి విశుక్రుని విషంగుని మూర్ఛితులను గావించెను. వారు మూర్ఛనుండి తేరుకొని ఘోరయుద్ధమును గావింపఁజొచ్చిరి. కామేశ్వరిఅనుశక్తి విమాయఅనునస్త్రముచేత విషంగాసురునిబంధించి లలితయొద్దకు తెచ్చెను. ఆమె వానిని విడిపించెను. వాఁడు బంధముక్తుఁడై దుఃఖించుచు విశుక్రునియొద్దకు పోయెను. విశుక్రుఁడు వానిని ఓదార్చి దేవతలను జయించుటకు భార్గవుఁడొసంగిన యంత్రమును ప్రయోగింప నిశ్చయించెను. భండుఁడు కూడా అందులకు ఆమోదించెను. విశుక్రుఁడు సుచియై శిలాపట్టమునందు ఆసురీ మూర్తినిచిత్రించి మాంసాదులతో పూజించి తాను నగ్నుఁడై తన చుట్టును యువతులు దిగంబరలై పరివేష్టించి యుండఁగా మంత్రాదులతోదానిని శక్తిమంత మొనర్చి విషంగున కొసంగెను. విషంగుఁడు ఆయంత్రమును గైకొని శక్తిసైన్యముయొద్దకు పోయి చుట్టును ఉన్న జ్వాలలను చూచి ఆకాశమునకు ఎగసి లోనికి విసరెను. ఆయంత్రముయొక్క ప్రభావమువలన శక్తులకు అలసత్వము నిద్ర మొదలగునవి ఆవహించెను. అందువలన వారు యుద్ధమును చేయ నిరాకరింపఁజొచ్చిరి. దండిని మంత్రిణి లలితయొద్దకు పోయి పరిస్థితిని విన్నవించిరి. ఆమె హేతువును గమనించి కామేశ్వరునిముఖము నవలోకించి నవ్వుచు త్రినేత్రుఁడైన గణశుని సృష్టించి రాక్షసులు ప్రయోగించిన విఘ్నయంత్రమును ధ్వంస మొనర్ప ఆజ్ఞాపించెను. గజాననుఁడు పోయి యంత్రమునుం దంతములతో ధ్వంసమొనరించెను. అప్పుడు శక్తి సైన్యమునందు యథాపూర్వముగా ఉత్సాహము ప్రబలెను. ఆఘోరయుద్ధమునందు విఘ్నేశ్వరుఁడు గజాసురుని సంహరించెను. బాలంబ భండపుత్రులను ఖండించెను. మంత్రిణి విశుక్రుని మర్దించెను. దండిని విషంగుని విధ్వంస మొందించెను. పుత్రులు సోదరులు మరణించుటను చూచి భండాసురుఁడు దుఃఖము నొందియు క్రోధముతో విజృంభించి మిగిలియున్న సైన్యమునుకూర్చుకొని లలితాదేవితో యుద్ధమునకు సన్నద్ధుఁడయ్యెను. భండాసురుఁడు మధుకైట భాదులైన విష్ణుశత్రువులను, అంధకాదులైన శివశత్రువులను సృష్టింపఁజొచ్చెను. అది గమనించి ఆమె విష్ణువుయొక్క దశావతారమూర్తులను శంకరునిమూర్తులను సృష్టించి ఆరాక్షసులను అంతమొందింపఁజేసెను. దైత్యభటులు ఎందఱు మరణించుచున్నను భండాసురుఁడు మరల మరల అసంఖ్యాకముగ సైన్యమును సృష్టింపఁజొచ్చెను. అప్పుడా దేవి పాశుపతాస్త్రమున ఆసైన్యము నంతను సంహరించి, కామేశాస్త్రమును ప్రయోగించి భండాసురుని సపరివారముగా భస్మ మొనరించెను.

అప్పుడు బ్రహ్మాదిదేవతలు ఆమహాదేవికి ప్రణమిల్లి స్తుతించిరి. మేరు పర్వతముయొక్క శిఖరమునందు విశ్వకర్మ శ్రీపురమును నిర్మించి యుండెను. అచ్చటికి రావలసినదని దేవతలు ఆమెను ప్రార్థించిరి. అందఱును జయజయధ్వానములు సలుపుచుండఁగా ఆమె బయలుదేరి మేరుపర్వతశిఖరమునకు చేరి అచ్చట శ్రీచక్రాకారముతో నిర్మింపఁబడియున్న దివ్యమైన నగరమును చూచి సంతోషించి అందు ప్రవేశించెను. బ్రహ్మదేవుఁడు వసిష్ఠాదిమహర్షులతోకూడి దేవిని రత్నసింహాసనమున కూర్చుండఁజేసి బృహస్పతి తెచ్చిన యభిషేక సామగ్రితో సకలలోకములకు సమ్రాజ్ఞినిగా అభిషేకించెను. ఆమె లోకపాలనమును నిర్వహించుచు అచ్చట విరాజిల్లుచుండెను. ఆశ్రీపురము త్రిపురోపాసకునకు తప్ప ఇతరులకు గోచరము కాదు. కావున నీవు నీభార్యయైన లోపాముద్రవలన దీక్షను పొంది త్రిపురాదేవిని ఉపాసింపుము.''

హయగ్రీవుని యాదేశము ననుసరించి అగస్త్యమహర్షి త్రిపురను ఉపాసించి శ్రీపురమున స్థానమును సంపాదించుకొనెను. భార్గవా! ద్విజులకు ఉపనయనమువలె త్రిపురోపాసనమునకు దీక్షాగ్రహణము ఆవశ్యకము. దీక్షావంతులైనవారు విద్వాంసులు కాకున్నను సద్గతిని పొందుదురు. వేదమునకు మఖ్యమైనయర్థము త్రిపురయే. కావున త్రిపురను సాక్షాత్కరింపఁ జేయుసాధనమే వేదము. పరమేశ్వరుఁడు లోకుల నుద్ధరించుటకై వేదములనుండి పురాణములను ఆగమములను ప్రవర్తింపఁజేసెను. మహర్షులు ఆగమములను మధించి తంత్రశాస్త్రమును వెలయించిరి. వేదములలో ఆగమములలో సిద్ధమైయున్న మంత్రయంత్రపూజావిధానాత్మకమైన భాగమే తంత్రశాస్త్రముగ ప్రసిద్ధమైయున్నది. ఆశాస్త్రముచేత ఉపాసింపఁదగినది త్రిపురయే. ఆమెయే హ్రీమ్‌.

బాల ప్రియ

దేవతల వృత్తాంతములను పరిశీలించినచో మానవులవలె దేవతలుకూడ జీవులే అని స్పష్టమగుచున్నది. మానవులకువలెనే వారికిని కామక్రోధములు ఈర్ష్యాద్వేషములు కలవు. కావుననే ఇంద్రాదులకు సత్యలోకమున లోపలి కొలువునందు ప్రవేశించుటకు అర్హత లేకపోయినది. అంతేకాదు వీరవ్రతుని చరిత్రనుబట్టి మానవులు కూడ కాముని నిగ్రహించినచో దేవతలనుకూడ మించిపోఁగల రని వ్యక్త మగుచున్నది. ఇంద్రుని జయించి త్రిలోకాధిపత్యమును సంపాదించినను కామక్రోధములను జయింపనంతవఱకు పరమసుఖము కలుగదని రాక్షసుల వృత్తాంతములవలన గ్రహింపదగియున్నది.

పార్వతీపరమేశ్వరులు తన్ను చూడవచ్చినను సనత్కుమారుఁడు గమనింపక వారిచ్చు వరములను శాపములను లెక్కపెట్టలేదన్నచో తత్త్వజ్ఞుఁ డెట్లుండునో సనత్కుమారుని స్థితివలన గ్రహింపవలసియున్నది. అట్టి తత్త్వజ్ఞుని విషయమున కూడ కర్మానుష్ఠానము, భావనాబలము ప్రారబ్ధములై ఫలము నీయక మానలేదు. ఆయన కావించిన యగ్నియొక్క ఆరాధనమునకు ఫలముగా బ్రహ్మపుత్రత్వము సంభవించినది. రాక్షసులను జయింపవలయునని భావించినందులకు ఫలముగా తారకాసుర సంహారము కొఱకు ఆయన కుమారస్వామిగా అవతరింపవలసివచ్చెను. అయినను ఆయన ఈజన్మలను ఈశరీరములను రాక్షస సంహారము మొదలైన కృత్యములను అన్నింటిని, అద్దములోని ప్రతిబింబములు వలె, స్వప్నములోని సన్ని వేశములవలె, తనయందే తోఁచుచున్న చిత్రములనుగా చూచుచు ఆనందించుచున్నాఁడు. అందువలననే ఆయన శాపములను వరములను కూడ లెక్క పెట్టలేదు.

త్రిపురాదేవి తనలోనుండియే త్రిమూర్తులను వారిభార్యలను ఇతరశక్తులను సృష్టించెను. ఆమెనియోగముననే బ్రహ్మ దేవతలు మానవులు రాక్షసులు మొదలుగా సకలజీవులను లోకములను సృష్టించెను. ఈసృష్టి, ఇందులో రాజులు, దేవతలు రాక్షసులు పాలించుట యుద్ధములు చేసి నశించిట, కొందఱు ముక్తిని పొందుట, మొదలుగా సర్వము ఆమెయందే, అద్దములో ప్రతిబింబించు చిత్రములపరంపరవలె తోఁచుచున్నదనుట సృష్టము. ఆమెయే తన వినోదము కొఱకు కేశీవిలాసముగా మహానాటకమునువలె ఇది యంతయు గోచరింపఁజేయుచున్నది. ఆమెనే తన స్వరూపముగా గుర్తించువారికి కూడ ఇది యంతయు ఆమెకువలెనే వినోదమాత్రముగా తోఁచు ననుట స్పష్టము.

పరశురాముఁడు దత్తాత్రేయునివలన మమాత్మ్యమును విన్న తరువాత, ఆత్మజ్ఞానమును, చర్యావిశేషములను వినెను. సుమేధుఁడను శిష్యుఁడు భార్గవునివలన దీని నంతను విని మాహాత్మ్యఖండము జ్ఞానఖండము, చర్యాఖండమును అని మూఁడు భాగములుగా గ్రంథమును రచించెను. బ్రహ్మదేవుని యాదేశమున నారదమహర్షి సుమేధునియొద్దకు వచ్చి ఆగ్రంథమును వినిపింపు మనెను. సుమేధునకు హారితాయనుఁడను పేరు కలదు. హారితాయనుఁడు నారదునకు గ్రంథమును వినిపించెను.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters