Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

ఆఱవయధ్యాయము-శ్రద్దాప్రశంస

ప్రియురాలి మాటలను విని హేమచూడుఁడు విస్మితుఁడై నవ్వుచు ఇట్లనెను. "నీవు చెప్పిన దంతయు గగనకుసుమమువలె నిరాధారముగా తోఁచుచున్నది. నీవు అప్సరసకు జన్మించి వనములో మహర్షిచేత పెంచఁబడినావు కదా! నీవుఇప్పుడిప్పుడే ¸°వన దశలో అడుగిడుచున్నావు. నీకు తారుణ్యము ఇంకను పూర్తిగా రాలేదు. ఇట్టినీవు వేలయేండ్లుగా నున్నట్లు చెప్పుచున్నావు. దయ్యము పట్టినదానిమాటలవలె అసందర్భముగానున్న నీవచనములవలన యథార్థముగ నేమి తెలిసికొందును? చెప్పుము. నీచెలికత్తె ఆమె కొడుకు ఎక్కడ నున్నారు? ఆపురము లెక్కడ నున్నవి? అది పోనిమ్ము. నాకు మాయమ్మ ఏసఖిని ఈయలేదే! మాతండ్రిగారికి మాయమ్మ తప్ప ఇంక ఎవరును భార్యలు లేరే! నీవుచెప్పినదంతయు విదూషకుని ప్రసంగమువలె నున్నది. గొడ్రాలికొడుకు రథముయొక్క నీడనెక్కి మనుష్యుల కొమ్ములతో ఆకాశములోని యరణ్యమునందు పుట్టబోవురాజును చంపి ఎండమావులనీళ్ళలో స్నానముచేసి కలలోని కామినులతో క్రీడించుచున్నాఁడని చెప్పుట ఎట్టిదో నీ ప్రసంగము అట్లున్నది."

అప్పుడు హేమలేఖ ఇట్లనెను. "నాథా! నీకు నేను చెప్పినది అర్థములేనిది ఎట్లగును? మావంటివారిమాట నిరాధారము కానేరదు. అసత్యము తపస్సును నాశమొనరించును. సత్యశీలురయందు అసత్య మెట్లుండును? విషయమును తెలిసికొనఁగోరుచున్నవానికి అసత్యమును చెప్పువాఁడు ఏలోకమందును సుఖపడఁజాలఁడు. మఱి ప్రియుఁడవైన నీకు నేను అసత్యమును ఏల చెప్పుదును? నేను చెప్పునది యసత్యమే యనుకొనుము. దానిని నీవు మంచి బుద్ధితో విమర్శింపవచ్చును గదా. లోకమునందు వ్యవహారకుశలుఁడు ప్రతివిషయమును ఏదో యొకయంశమునందు పరీక్షించి ఆవిషయము సరిగా నున్నదో లేదో తెలిసికొనుచున్నాఁడు. నీకు ఈవిషయమున నిదర్శనము చూపెదను. చూడుము. నేను నీకు పూర్వము చెప్పినదంతయు సుఖసాధనమే యైనది కదా! ఇప్పుడు చెప్పునది మాత్రము సుఖసాధనమెందులకు కాదు? వెనుకటి నావాక్కుల నిదర్శనమువలననే ఇదియును సత్యమే యని గ్రహింపుము. నేను చెప్పుచున్నదానిని నిర్మలమైన బుద్ధితో గ్రహింపుము. ఆప్తులయొక్క వచనమునందు నమ్మకము లేకపోవుటయే సాధువులకు శత్రువు. ప్రేమగల తల్లి బిడ్డను పెద్దభయములనుండి ఎట్లు రక్షించునో అట్లే శ్రద్ధయును సాధకుని సర్వవిధముల రక్షించును. ఆప్తవాక్యములయందు శ్రద్ధలేనిమూఢుని సంపద యశస్సు సుఖము త్యజించుచున్నవి. శ్రద్ధలేనివాఁడు సర్వవిధముల హీనుఁడగును. జగత్తులకు శ్రద్ధ దాదివంటిది. ఎల్లరకు శ్రద్ధయే జీవనము. తల్లియందు శ్రద్ధ లేకున్నచో బాలుఁడు ఎట్లు బ్రతుకునో చెప్పుము? భార్యయందు శ్రద్ధ లేకున్నచో యువకుఁడు ఎట్లుసుఖము పొందగలఁడు? బిడ్డలయందు నమ్మకము లేని వృద్దుఁడు చక్కఁగ నెట్లుండఁగలఁడు? పంట వచ్చు ననునమ్మకము లేకున్నచో కృషీవలుఁడు భూమి నెట్లు సాగుచేయఁగలఁడు? శ్రద్ధయే లేకున్నచో ఎచ్చట నైనను ఎవ్వని కైనను ధనము సంపాదించుటకుఁగాని ధానమొనర్చుటుకుఁగాని పూనిక ఎట్లు కలుగును? శ్రద్ధలోపించినచో లోకములయొక్క స్థితియే తలక్రిందు లగును.

కేవలము నమ్మకమువలననే లోకవ్యవహారము జరుగుచుండుటలేదు. దున్నినప్పుడు భూమి పండుట దున్ననప్పుడు పండకుండుట అనుభవముచేత గ్రహించి కృషీవలుఁడు సాగుచేయుచున్నాఁడు ఒకరిమాటలను అతఁడేల నమ్మవలె? అని నీ వందువేని వినుము. ఒకఁడు ఒకసంవత్సరము భూమి దున్నినాఁడు; పంట వచ్చినది. అట్లే మరల పంట వచ్చునను నమ్మకమువలననే కదా వాఁడు రెండవసంవత్సరము దున్నుచున్నాఁడు కావున అనుభవముతో పాటు నమ్మకము కూడ ఆవశ్యకమే. శ్రద్ధ లేకున్నచో లోకమే నశించును. కాఁబట్టి దృఢమైన శ్రద్ధతో శ్రేష్ఠమైన సుఖమును పొందుము. చిన్న వారిమాటలను ఏల నమ్మవలె; అని తలంపకుము. చిన్నవారి మాటలను నమ్మనక్కఱలేదు అనునది కూడ ఒక నమ్మకమే గదా! నమ్మకము లేకున్నచో ఏపని నైనను ఎట్లు చేయఁగలవు?"

అప్పుడు హేమచూడుఁడిట్లనెను. "శ్రేయస్సును కోరువాఁడు సత్పురుషులయందే శ్రద్ధను కలిగియుండవలెఁగాని అన్యులయందు ఉండరాదు. గాలమునకు తగిలించినయెఱను చూచి ఆహారమేయని నమ్ముచున్న చేపలు ఎట్లునశించుచున్నవో అట్లే మానవులును విచారించకుండ నమ్మినచో వినాశము నొందుదురు. కావుననే చక్కఁగా విచారించి మంచివాఁడే అని నిశ్చయించుకొన్న వానినే నమ్మవలె; లేకున్న నమ్మరాదు. కావున ఏపని చేయుట కైనను విచారణ ముఖ్యముకాని నమ్మకము కాదు. కాఁబట్టి 'నమ్మకము లేకున్నచో ఏపని నైనను ఎట్లుచేయగలవు?; అను నీప్రశ్న ఎట్లు కుదురును.?"

హేమలేఖ ఇట్లనెను. "ఎట్లు కుదురునో చెప్పెదను వినుము. ఒకఁడు సత్పురుషుఁడో కాదో ఎట్లు నిశ్చయింతువు? శాస్త్రము ననుసరించి సత్పురుషుల లక్షణములనుబట్టి నిశ్చయింపవచ్చు నందువేని అప్పుడు శాస్త్రము నైనను నీవు నమ్మక తప్పదు. కావున విశ్వాసము వలననే లోకమంతయుప్రవర్తించుచున్నది. అంతులేని తర్కము చేతఁగాని, అసలు తర్కమే లేకుండుటవలనఁగాని ఎవ్వఁడును ఎచ్చటను శ్రేయస్సును పొందఁజాలఁడు. తర్కమే లేనివానికి ఒకప్పటికి శ్రేయస్సు కలుగునేమో కాని, అంతులేని తర్కముచేత మాత్రము ఎవ్వఁడును శ్రేయస్సును పొందఁజాలఁడు.

పూర్వము సహ్యగిరియందు గోదావరీతీరమున బుద్ధిశాలియైన కౌశికుఁడను విప్రుఁడుండెను. ఆయనకు వందలకొలఁదిగ శిష్యులుండిరి. వా రొకసారి గురువు లేనప్పుడు తమబుద్ధి ననుసరించి లోకస్థితిని నిర్ణయించుకొనఁదలంచుచు ఒకరితో నొకరు చర్చించు కొనుచుండిరి. అప్పుడు శుంగుఁడను శుష్కతార్కికుఁడు వారికడకు వచ్చి వారి నందఱను ఆక్షేపించి ఇట్లు బోధించెను. "మీ రందఱు నామాట వినుఁడు. సత్యమన్నది ఎక్కడను సిద్ధింపదు. ప్రమాణము చేత గ్రహింపఁబడునది కదా సత్య మని చెప్పఁబడును. ప్రమాణము దోషయుక్త మైనచో సత్యము నిరూపితము కాదు. కాఁబట్టి మొదట ప్రమాణము సరియైన దగునా కాదా అని నిశ్చయింపవలె. అందులకు మఱియొక ప్రమాణము ఆవశ్యకము. దానియొక్క ప్రామాణ్యమును నిశ్చయించుటకు వేఱొక ప్రమాణము కావలె. ఇట్లు దీనికి అంతము లేదు. అందువలన సరియైన ప్రమాణము సిద్ధింపదు. ప్రమాణము లేక సత్యము సిద్ధింపదు. కావున ప్రమాణము, దానివలన కలుగు జ్ఞానము, ఆజ్ఞానము పొందు వ్యక్తి -వీనిలో ఏదియు సిద్ధింపదు. కావున ఈవ్యవహార మంతయు శూన్యముపై ఆధారపడి యున్నది. అందువలన శూన్యమ తప్ప ఈలోకమున సత్యమేదియు లేదు." ఈమాటలను నమ్మి వారిలో కొందఱు జడులై పోయిరి. తక్కినవారు గురువు దగ్గఱకు పోయి విచారించి సరియైన సమాధానములను పొంది కృతార్థులైరి. కాఁబట్లి శుష్కమైన తర్కమును అవలంబింపరాదు. ఎల్లప్పుడును శాస్త్రానుకూలమైన తర్కమునే ఆశ్రయించి శ్రేయస్సును పొందవలయును."

హేమలేఖ ఇట్లు మిగుల ధైర్యముతో పలుకఁగా హేమాచూడుఁడు చాల ఆశ్చర్యపడి ఇట్లనెను. " ఓహో! నీకు ఇంత పాండిత్యమున్నదిని నా కింత వఱకును తెలియ లేదు. నీవు ధన్యురాలవు. నీవలన నేనును ధన్యుఁడ నైతిని. శ్రద్ధవలన సకలశ్రేయస్సులు కలుగు నని చెప్పుచున్నావు. దేనియందు శ్రద్ధ ఉంచవలె? దేనియందు ఉంచరాదు? పరస్పరవిరుద్ధములుగ శాస్త్రములు అనంతముగా నున్నవి. ఆచార్యులమతములు వ్యాఖ్యాతలయభిప్రాయములు భిన్న భిన్నములుగా నున్నవి. మనసొంతబుద్ధి కేవలతర్కముతో దేనిని శ్చయింపలేదు. గదా! ఇంక గ్రహింపఁదగిన దేది? గ్రహింపరాని దేది? ఎననికి ఏది ఇష్ట మగునో దానిని వాఁడు 'ఇదియే నిశ్చిత' మని చెప్పును; అట్లే తనకు ఇష్టము కానిది హాని కలిగించు నని చెప్పును. ఈపరిస్థితిలో ఎవఁడైనను ఏమి నిశ్చయింపఁగలఁడు? శూన్యమును నిశ్చయించి చెప్పిన శుంగుఁడు సత్యమును నిరాకరించుట సహజమే కదా! అతఁడును తర్కాశాస్త్రము ననుసరించియే చెప్పుచుండఁగా అతనివాదమును ఏల విశ్వసింపరాదు? దీనిని చక్కఁగా వివరింపుము."

జ్ఞానఖండమున హేమచూడోపాఖ్యానమునందు శ్రద్ధాప్రశంసనమన్నది అఱవయధ్యాయము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters