Maa Swami    Chapters   

1. మా స్వామి

నమః శంకరాచార్యతుభ్యంపురస్తా

న్నమః పృష్టతః పార్శ్యతశ్చాథ ఊర్ధ్వం

నమః సర్వతస్సర్వరూపాయతసై#్మ

విశుద్ధాత్మనేబ్రహ్మణ తే నమస్తే.

మీరు మా స్వామిని ఎప్పుడైనా చూచారా? తెలుగు దేశంలోనివారు ఆయనను కామకోటి స్వామి అని అంటారు. అరవలు పెరియవాళ్‌, పరమాచార్యాళ్‌ అని అంటారు. కంచినుంచి ఒకప్పుడు కామకోటిమఠాన్ని కుంభకోణానికి తీసుకవెళ్ళారు. అందుచేత యాభై ఏళ్ళముందు స్వామిని కుంభకోణస్వామి అనికూడ పిలిచేవారు.

అన్యక్షేత్రేకృతం పాపం పుణ్యక్షేత్రేవినశ్యతి

పుణ్యక్షేత్రేకృతం పాపం వారాణస్యాం వినశ్యతి

వారాణాస్యాం కృతం పాపం కుంభకోణవినశ్యతి

కుంభకోణకృతం పాపం కుంభకోణవినశ్యతి.

అని ఒక శ్లోకం వున్నది. కుంభకోణంలో అమృతకుంభేశ్వరుడున్నాడు. ఆయన పాపాలను పోగొట్టి, అమృతతత్వం ప్రసాదించే ప్రభువు. నానుసామ్యంకల మాస్వామీ, అఘహరుడై, మనకు చిత్తశుద్ధికలుగజేసి, ఇహపర సుఖ దాయకుడైన గురుమూర్తిగా కంచిలో తమ ఆధ్మాత్మిక సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆయన పరివ్రాజకనామం చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యులు. శంకరుడు అంటే సుఖాన్ని కలుగచేసేవాడు. వారు మనకు ఇచ్చే సుఖమేది? ఆత్మబోధనే. ఆత్మోపలబ్ధియే.

పరాకృతనమద్బంధం పరబ్రహ్మనరాకృతి

సౌందర్యసారసర్వస్యం వందే నందాత్మజం మహః

స్వాములవారు 'పరబ్రహ్మ నరాకృతి'లో వున్న పరివ్రాజక వర్యులు. సర్వమత సహనం వారికి సహజగుణం. నిందాస్తుతులకు వారు అతీతులు. ఆయన రోజులన్నీ ఉపవాసములలోను, మౌన విధిలోనూ గడిపేవారు. విధి విరామం లేకుండా జనం వస్తూనే వుంటారు. ప్రస్తుతం వారి ఉపాధి మరీ జరాగ్రస్తమైంది. ఆ శల్యప్రాయమైన శరీరంలో ఎంతశక్తి లోపించినా భక్తులకు దర్శనమిచ్చే కర్తవ్యాన్ని మాత్రం ఏమాత్రం వారు తగ్గించుకోవటం లేదు.

వాజ్ఞియమనమును మౌనం అంటారు. ఇట్టి మౌనం బాలురకేకానీ జ్ఞానులకు కాదు అని శంకర భగవత్పాదులవారంటారు. మా స్వామి ఈనాటికి మౌన వ్రతదీక్ష మానుకోలేదు. ఇవన్నీ మనకు మార్గదర్శికంగా వుండేదానికే కదా?

'యద్యదాచరతిశ్రేష్ఠః తత్తదేవేతరే జనాః'

దరిమిలా ఈరోజు మూలానక్షత్రం. గురువారం దశమి భాద్రపదమాసం. అక్కడ కంచిలో స్వామి మౌనంగా ఉంటారు.

నాస్తి శోణాద్రితః క్షేత్రం నాస్తి పంచాక్షరాన్మనుః

నాస్తి మహేశ్వరార్ధర్మో నాస్తి దేవోమహేశ్వరాత్‌

నాస్తి జ్ఞానం శివజ్ఞానా న్నాస్తి శ్రీరుద్రతఃశ్రుతి

నాస్తి శైవాగ్రణీర్విష్ణో నాస్తి రక్షా విభూతితః

నాస్తి భ##క్తేః సదాచరో నాస్తి రక్షకరా గురుః

నాస్తి రుద్రాక్షతో భూషా న్నాస్తి శాస్త్రం శివాగమాత్‌

నాస్తి బిల్వదళాత్‌పత్రం నాస్తి పుష్పం సువర్ణకాత్‌

నాస్తి వైరాగ్యతః సౌఖ్యం నాస్తి ముక్తేఃపరంపదం

నారుణాద్రే స్సమోమేరు ర్నకైలాసో నమందిరః

తేనివాసగిరి వ్యాప్తాః సోయంతు గిరిశః స్వయం (స్కాందం)

అరుణాచలాన్ని మించిన క్షేత్రం, పంచాక్షరినిమించిన మంత్రం, మహేశ్వర ధర్మాన్నిమించిన ధర్మం, ఈశ్వరుణ్ణి మించిన దేవుడు, శివజ్ఞానమునకు మించిన జ్ఞానం, రుద్రమును మించిన వేదభాగము, విష్ణువును మించిన శైవుడు, విభూతిని మించిన రక్ష, సదాచారాన్ని మించిన శాస్త్రము, బిల్వదళమును మించిన ఆకులు, సువర్ణం (బంగారం) మించిన పుష్పం, వైరాగ్యమును మించిన సౌఖ్యం, ముక్తికి మించిన పరమపదం, అరుణాచలమును మించిన మేరువు, కైలాసాన్ని మించిన ధామము, (అక్కడ ఈశ్వరుడు నివసిస్తూన్నాడుకదా-) వేరే ఏదీ లేదు.

మాస్వామి భస్మత్రిపుండ్రములు, రుద్రాక్ష మాల, ధరించి బిల్వ సువర్ణ పుష్పములతో చంద్రమౌళీశ్వరుణ్ణి పూజిస్తూ, మహేశ్వర ధర్మాన్ని పాటిస్తూ, శివజ్ఞానంతో వెలిగిపోతూ, భక్తి అనే సదాచారాన్ని అనుశేపిస్తూ, పరమ విరాగియై, మహావిష్ణువువలె సుఖియై, మనకు గురువై, రక్షకుడై, కైలాసంలాంటి కంచిలో నివసిస్తూ మేరుతుల్యంగా ఉన్నాడు. పైగా మనకు అందుబాటులో ఉన్నాడు. దర్శనార్ధం మనం వెళ్ళాలి. ఆ వెళ్ళటం మన పుణ్యంపండితే కానీ సంభవించదు. మీరు ఇదివరకు కంచికి వెళ్ళకుంటే వెళ్ళండి.

'కోసిత్వం భిక్షుకోభూత్వా ఆగతోత్ర మహామతే?'

అని ఆయనను పరామర్శించండి. ఆశీస్సులను అందుకోండి.

ఐతే మీరు నన్ను అడగవచ్చు. నీవెపుడు స్వాములవారి పరిధిలో పడ్డావు. తేనెలోని ఈగవలె అని? అదొక కథ. దానిని చెప్పసాగితే అది నాకథ ఔతుంది కాని 'మాస్వామి' కథ కాదు కదా? 'నేను' లేకపోతే స్వామియూ లేడు. 'అహమస్మి' అన్నపుడే 'బ్రహ్మాహమస్మి' అన్న భావన. అహంభావం లేకపోతే బ్రహ్మభావనా లేదు. కాబట్టి నాకథ కొంచెం చెప్పితేకాని స్వామికి చరితార్ధత లేదు!

నేను స్వామిని ప్రప్రధమం అంటే బుద్ధితెలిసి చూడటం అగస్టు 1958లో మద్రాసులో. నా ప్రాక్కర్మప్రవిలీనమైనట్లు అనిపించింది. మైలాపూరు సంస్కృత కళాశాలలో వారిని దర్శించాను. రాత్రి 7/8 గంటలు ఉంటుంది, సమయం. బయట పుష్పవర్షంవలె తొలకరి చినుకులు. ఒకటే జనసందడి. వారు కొంచెం ఎత్తైన వేదికమీద కూరుచుని వున్నారు.

వారిని చూడగానే అల్లసానివారు వ్రాసిన ఒక పద్యం నా మనస్సులో మెదిలింది.

''వదనప్రభూత లావణ్యాంబుసంభూతకమలంబులనవీని కన్నులమరు

నిక్కివీనులతోడనెక్కి సెక్కములాడుకరణినున్నవి వీనిఘన భుజములు

సంకల్ప సంభావాస్ధాన పీఠికవలె వెడదయైకన్పట్టు వీని యురము''.

నేను అపుడు బొంబాయికి ఉద్యోగం పెరుగుదలతో పోతున్నాను. నేను చెప్పుకున్నాను-

''నేను 'కాష్ట్‌ అకౌంటెంట్‌' అనీ, పెద్ద ఉద్యోగంపై పోతున్నాననీ''

స్వాములవారు అన్నారు ''నీవు రైల్వేలో లెక్కలు వ్రాస్తావా?'' అని.

ఏదో అకౌంటన్సీలో పెద్దచదువు చదివి, ప్రమోషన్‌పై పోతున్న నన్ను- లెక్కలువ్రాసే చిత్రగుప్తుడిగా జమకట్టిన స్వాములవారి Sense of humour-ని ఏమనాలి! నా దురభిమానం దెబ్బతినింది!

స్వాములవారి దర్శనం ఒక్కమారు చేస్తే చాలు. మరి వారిని ఎవరూ వదలరు. మనమెరిగిన ప్రపంచంకంటె విలక్షణమైన మరో ప్రపంచం ఉందనీ, దానిని వారు మనకు చూపుతారనీ అనిపిస్తుంది.

కింస్వరూపమిత్యాత్మదర్శనే

అవ్యయా z భవా zz పూర్ణబిత్సుఖం-

&#(రమణుల ఉపదేశసారము)

''తన రూపమేదియని విచారించి తన స్వరూపమిట్టిదని తెలుసుకొనినపుడు తానే తుదిలేని, కానరాని, అఖండ పూర్ఱమైన చిత్‌ సుఖస్వరూపమని తెలియును. అనగా అనంతాద్యఖండ చిత్‌ సుఖమే తాను అని అనుభవమగును''.

ఈ సుఖ దర్శనమూ, సుఖ స్వర్శకలిగే సరికి- అందరూ స్వాములవారి వెంట నాయకునివెంట కదలిన నాయికవలె అనుసరిస్తారు. నా గతీ అదే ఐనాది. ఏదో అకర్షణ బలంగా అయస్కాతంవలె లాగుతుంది. ప్రకృతి రాగసంపన్నమవుతుంది. భావమేమో ప్రేమ భరితమౌతుంది. చిత్తము సాత్వికాసిక్త మౌతుంది. సూర్యుడు అస్తమిస్తుంటే సంధ్యరాగవతి యైనట్లు, నటరాజనర్తన దర్శనోత్సుకఐనట్లు మనమూ వెర్రెత్తిపోతాం.

''సంధ్యావతి, ఈ సంభ్రమమేమిటా? నవకుసుంభరాగవసనమేమిటో? ఆకుంచిత తిర్యక్ప్రసార లజ్జాకటాక్ష మధురపాతమేమిటో?'' అని ఒకకవి వ్రాసినట్లు, ముగ్ధులమై పోతాం.

ఆ గుడిగంటలూ, మఠంలోని భేరికాహళధ్వనులూ, మఠంలో వయ్యారంగా నడిచే కామకోటి సుందరి అదంతా ఒక అనిర్వచనీయమైన అనుభూతి.

ఈ శంకరాచార్యులు మనకేమిస్తారు? అని అడిగాను. ఆదిశంకరులూ, శివుణ్ణి అదే ప్రశ్న వేస్తారు.

మమదాస్యసి కిం కిమస్తి శంభో?

నాకివ్వడానికి నీవద్ద ఏముంది? నీ భోజనం గరళం. నీ ఆభరణాలు ఫణులు. నీ వాహనమో ఒక ముసలి ఎద్దు. ధరించినది కృత్తింవసానము. పేరేమో ఏకైశ్వర్యుడు? ఆ శివుడు ఏమిస్తాడు? ఈ పరివ్రాజకుడు, ఈ సన్యాసి, ఈ భిక్షువు- మనకేమి ఇవ్వగలడో.

'తన పాదాంబుజ భక్తి మేవ దేహి' -

''నీ పాద పద్మములమీది భక్తి మాత్రం ఇవ్వు''. అది చాలు.

1959 జనవరిలో నేను శబరిమలె వెళ్ళాలని వ్రతధారినయ్యాను. స్వాములవారిని యాత్రకు పోయేముందు దర్శించాను. మద్రాసుకు దాదాపు 20మైళ్ళదూరంలో ఉన్నారు. సాయంసమయము, ఆరు, ఆరున్నర గంటలు. ఒక పర్ణశాలలో కూర్చుని ఉన్నారు. అదృష్టవశాత్తు జనసందడి లేదు. వట్టి చేతులతో ఎందుకని ఎండుద్రాక్ష తీసుకొని వెళ్ళాను. ఆప్యాయంగా తీసుకొని, ఒక్క ద్రాక్ష నోటిలో వేసుకొని గుప్పెడు నా చేతిలోపోశారు. అపుడు ఉన్నట్టుండి, ఆ మసకచీకటిలో-మెరుపు మెరిస్తే ఒక్కక్షణం అంధకారబంధురమైన ప్రపంచం, ఎట్లా ఉద్దీప్తమౌతుందో అట్లా ఆ కుటీరం వెలుగుతో నిండినట్లు ఒక అనుభవం ఐంది. ''శబరిమల వెళుతున్నావా? క్షేమంగా పోయిరానాయనా!'' అని ఆశీర్వదించారు.

దేహం మృణ్మయవ జ్జడాత్మక మహం బుద్ధిర్నతస్యాస్త్యః

నాహం తత్తదపేత సుస్తిసమయే సిద్ధాత్మ సద్భావతః

కోహం భావయుతః కుతో వరధియా దృష్ట్యాత్మనిష్ఠాతః

లోహం స్పూర్తితయా z రుణచలశివః పూర్ణోవిభాతి స్వయం.

దేహము మట్టిచేత చేసిన కుండవలె జడం. నేను అనే బుద్ధి దానికి లేదు. అందుచేత నేను దేహం కాదు. ఆ దేహం మరగిపోయిన నిద్రలోనూ మనం ఉన్నాము. ఆ నిద్రలోనూ, జాగ్రదావస్థలోనూ ఉన్నదేమి? ఈ 'నేను' ఎవరు? ఈ 'నేను' ఎక్కడనుంచి వచ్చింది? అనే విచారణతో, ఆత్మనిష్ఠతో పరిశీలిస్తే, ''వాడే నేను'' - అహం, ''అహం అనే వాడే అరుణాచల శివుడు'' అని ప్రత్యక్ష గోచరమౌతుంది. శివోహం అనే భావన సుస్థిరమవుతుంది.

తైత్తిరీయం, ''తపనా బ్రహ్మవిజిజ్ఞాసస్వ-తవోబ్రహ్మేతి''.

బ్రహ్మమును తపస్సుచేత తెలుసుకో - తపమే బ్రహ్మ అని చెప్పబడుతున్నది. క్రియాయోగంలో తపస్సు ప్రధమం. 'తపస్స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః' గీత మనఃప్రసాదము, సౌమ్యత్వం, మౌనము, ఆత్మనిగ్రహము, భావసంశుద్ధి- మానసికమైన తపస్సుని చెబుతుంది. 'తపఆలోచనే' - ఈ తపస్సులో భాసించేదే వేదం. 'వేదయతీతి వేదః' ఏది మనకు తెలియ చెప్పుతుందో అదే వేదం. ఈ వేదాన్ని చేసినవాడు, ఈ వేదాన్ని ఎరిగినవాడు భగవంతుడు. 'వేదాంతకృత్‌, వేదవిదేవచాహం'. ఈ వేదవేద్యుడు, వేద విదుడు, వేదకృత్‌- ఏమి చేస్తాడు?

నాశయామ్యాత్మభావస్ధో జ్ఞానదీపేన భాస్వతా-

'అజ్ఞానమనే తమస్సును నేను రవి ప్రఖ్యుడనై, హృదయస్థుడనై, నాశనం చేస్తాను'. అని భగవద్వాక్యము. గు అంటే గుణము. రు అంటే రూపము. మనం గుణరూపాలలో పరిమితులమైపోయి అంధకారంలో వున్నాము. ఆ అంధకారం పోవాలంటే ఒక గురుమూర్తిని ఆశ్రయించాలి. ఆ గురువు 'శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం'. శ్రోత్రియుడూ బ్రహ్మనిష్ఠుడుగా వుండాలి. అతనిని దర్శించగానే మనకు 'ఆకాశం బ్రహ్మ' అని అనిపించాలి. ఈ ప్రపంచం మరచిపోయే స్థితి మనకు తానుగ కలుగవలె. అటువంటి గురువు మనకు లభించి అతనిని మనకు చూడగానే నిష్ఠా, ప్రతిష్ఠా కలిగినదని మన హృదయం చెప్పాలి.

కృత సాహసకులకూ, కృత పుణ్యలకూ ఏదో ఒక్కమారు చెపితేచాలు. అకృతో పాసకులకు దృఢజ్ఞానం రావాలంటే, నిరంతర దీర్ఘకాలం యోగం అవసరం.

''తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానానిక్రియాయోగః''

తపస్సు హితమిత మేధ్యాశనం. పరమపవిత్రమైన ప్రణవాది మంత్రజపము స్వాధ్యాయము. ప్రణిధానాన్ని సదాశివబ్రహ్మేంద్రులు తవ యోగసుధాకరంలో పరమ సుందరంగా నిర్వచిస్తారు. ''ఈశ్వరేలీలయా స్వీకృతాతి మనోహరాంగే పరమగురౌకాయ వాజ్ఞనోభి ర్నిర్వర్తితో భక్తివిశేషః ప్రణిధానమ్‌''. ఈశ్వరుడే మనోహరమైన రూపంతో అవతరించినట్టి గురువుయెడ, వాక్కాయ మానసములతో భక్తి నెరపడం ప్రణిధానం. ఆ భక్తిని ఎట్లా నెరపాలి?

''సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితోదృఢభూమిః''

దృఢమైన నిష్ఠకు నిరంతరము, దీర్ఘకాలమూ అభ్యాసంకావాలి. ఆ అభ్యాసం- సత్కారంతో - అనగా ఆదరణతో జరగాలి. అనాదరంతో జరిగే యోగంలో లయవిక్షేప కషాయాదులు ప్రవేశిస్తుంది.

ఎవరో అన్నారట. ''ఉన్నది నాలుగు వేదాలు. నాలుగు రోజులు వేదం చదివాను. ఐదోరోజు నాకు అన్నివేదాలు రావలెకదా? రాలేదేమి?''

మూడు విధులతో- అనగా దీర్ఘకాలము, నిరంతరము, సత్కారముతో చేసిన యోగమే సిద్ధిస్తుంది. అది ఒక జన్మలో జరగవచ్చును లేక ఎన్నో జన్మలైనా ఎత్తవలసి వచ్చును. ''అనేక జన్మ సంసిద్ధో స్తుతో యాంతి పరాంగతి'' ఆయోగ సిద్ధి లభించిన వారికి- ఎంతటి దుఃఖమైనా సహించకల్గిన మనోదార్ఢ్యం అలవరుతుంది. వారే యోగులు, జ్ఞానులు.

వారికి చింత అనునది లేదు. వారు గంగాంభస్థద్విపులు. అనగా గంగలో నిశ్చింతగా మునకలువేసే ఏనుగులు! పరమహంస పద చిత్తానాం, చింతానాస్తి కిల. ఘనస్వాములు పరమహంస పరివ్రాజకులు. వారి స్మరణ, దుఃఖసంయోగ వియోగం కలిగించే యోగాన్నిస్తుంది.

వేమన పద్యములు ఒకటి రెండైనా తెలియని తెలుగువాడు ఉండడు. ఆయనను వేమనయోగి అనికూడ అంటారు. 'శివలోకప్రమధులకును, శివునకు గురువునకు శరణుసేయర వేమా!' అని తన్ను ఆయన ఉద్బోధించుకుంటాడు.

పలుకుమన్న నేమి పలుకకయున్నావ?

పలుకమయ్య నాతో ప్రబలముగను

పలుకుమయ్య నీదు పలుకు నేనెఱిగెద-

విశ్వదాభిరామ వినురవేమ.

మాస్వామిని పలకమంటే ఆయన పలుకుతారా? ఆయన కాష్ఠమౌనంలో ఉంటారు. మరి నోరు తెరిచారంటే ప్రగల్భలు. ఆ మాటలకు నిలకడ ఉండదు. కథలు, ఉపకథలు, పిట్టకథలు, హాస్యములూ, రాచకీయాలు, చరిత్ర, భూగోళం, శిల్పశాస్త్రం, సాహిత్యం- ఒక్కటేమిటి అన్నీ కుమ్మరిస్తారు. ఆ వాచాలత్వం చూడడానికీ, వినడానికీ ఇచ్చి పెట్టుకోవాలి. రెండవది మన సంస్కారాలుకూడ దానికి తోడ్పడాలి. అపుడే వారు చెప్పేదాంట్లో మనకు రుచి పుట్టుతుంది.

నిన్ను జూచెనేని తన్నుదామఱుచును,

తన్ను జూచెనేని నిన్ను మఱచు

నే విధమున జనుడు నెపుగు నిన్నును రన్ను-

విశ్వదాభిరామ వినురవేమ.

ఆయనను మనం చూచినామంటే మనలను మనం మరుస్తాం. మనలను- మనం జ్ఞాపకం పెట్టుకుంటే, ఆయనను మనం మరచిపోతాం. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఇది అసిధారావ్రతం. సదాశివబ్రహ్మం కూడ- దంతిని దారు వికారే, దారు తిరోభవతి- తత్త్రైవ పరమాత్మా. కొయ్య ఏనుగును చూచినపుడు- చెక్కను చూస్తే ఏనుగులేదు. ఏనుగును చూచినపుడు చెక్కలేదు. అని అంటారు.

మురియు వాడెవండు మురియని దెవ్వండు

పాటుచేసి చూడ బట్టబయలు

సొరిది జల ఘటమున సూర్యుని చందంబు

విశ్వదాభిరామ వినురవేమ.

'సొరిది జలఘటమున సూర్యుని చందంబు'. ''ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై తోచు పోలిక'' - ''నానా ఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాస్వరం''- ఒక కుండకు తొమ్మిది చిల్లులు ఉందనుకొందాం. దానిలో ఒక దీపం వుంచితే ఆ ఛిద్రములద్వారా వెలుగు బయటకు వస్తుంది.

''నవద్వారే పురేదేహీ నైవకుర్వన్‌ నకారయన్‌''. ఈ నవద్వారపురంలో ఉన్న జీవుడు కర్తాకాడు. కారయితాకాడు. ఈ దేహంలో ఆ జీవుని నియమిస్తూ ఒక అంతర్యామి ఉన్నాడు. అతడే ఉపద్రష్ట, అనుమంత, భర్త, భోక్త, మహేశ్వరుడు. ఈ విషయాన్ని వేమన ముచ్చటగా ముద్దు ముద్దు మాటలతో ఇలా అంటాడు.

గాజుకుప్పలోన గడగుచు దీపంబ

దెట్టులుండు జ్ఞాన మట్టులుండు

తెలిసినట్టివారి దేహంబులందును-

విశ్వదాభిరామ వినురవేమ

ఇందులో బీగం చెవ్విలాంటి పదం- ''తెలిసినట్టివారు'', వారే జ్ఞానులు. జ్ఞానికే ప్రపంచం ఉన్నది. అజ్ఞానికే ప్రపంచం ఉన్నది. కాని వారి దృక్పధం వేరుగా వుంటుంది. జ్ఞాని దృష్టి వ్యావహారికం కాదు. పరమార్ధం. అతని దృష్టి వాసుదేస్సర్వం- అన్నది ఆచార్యులు అందుకే.

'దృష్టిం జ్ఞానమయీం కృత్యా పశ్యేత్‌ బ్రహ్మమయంజగత్‌' అని అన్నారు.

జ్ఞానానికి జగత్తుయందు విస్మృతేకాని బ్రహ్మమునందు కాదు. జాగ్రత్స్వప్న సుషుప్తులలో సంవిత్తు విజృంభిస్తున్నదో, ఆ చైతన్యమే. నేను- నేను దృశ్య వస్తువునుకాను. ఆ చైతన్యం చీమలో బ్రహ్మలో, శివ కేశవులలోనూ వున్నది. అని దృఢ ప్రజ్ఞ ఎవనికి కలదో అతడు మనీషి. అతనిని ఈ జగత్తు బాధించదు.

లోకంలోని సుఖదుఃఖములను, వెలుగునీడలను అతడు సమంగా చూస్తూ తామరాకుమీది నీటి బిందువువలె, ఉదాసీనుడై వుంటాడు. అతడు కర్మ చేస్తున్నా చేయనివానివలె ఉంటాడు. అటువంటి పరమవిరాగులు చాలా అరుదు.

వేమన అంటాడు.

కల్ల గురుడు గట్టునల్ల కర్మంబుల

మధ్యగురుడు గట్టు మంత్రచయము

ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు

విశ్వదాభిరామ వినురవేమ.

స్వాములవారు ఆహారం తీసుకొనేరోజులకంటే తీసుకొనని రోజులే ఎక్కువ. శాస్త్రం నిర్దేశించిన రోజులలో ఆయన ఉపవాసం.112డిగ్రీల ఎండ అయినా కాలినడకనే. గాలిలేని గదిలో కూరుచున్నా ఆయనకు చెమట పోయదు. ఆయనకు పిపాస అనేదిలేదు. 12-14 గంటలైనా వారు దాహానికి జలం పుచ్చుకోరు. ఆయన జితేంద్రియుడు. పదునాలుగవ ఏటనుండియే ఆయన ఉప్పు, కారం, పులుపు వర్ణించారు. ఏక భుక్తంగా వుండేవారు. తర్వాత అదీ వదలి, పాలుమాత్రం- పచ్చిపాలు తీసుకొనేవారు. కొన్నిరోజులపాటు ఆయన వేపాకు, బిల్వదళాలు మాత్రం తిని ఉండేవారు. తర్వాత కొన్నిరోజులు మూడు కబళముల ఆహారం. అటుపిమ్మట కృష్ణ పరమాత్మకు కుచేలుడు అర్పించిన పృథకములు (అటుకులు) అదీ చాలా తక్కువ ముష్టి పరిమాణం- ఒక పిడికెడు- తీసుకొనేవారు. దానినీ ఒక్కొక్కరోజు లంఘించేవారు. యతిధర్మాన్ని రేఖా మాత్రంకూడ వారు వదలరు.

నేను ఒకమారు వారు చెప్పగా విన్నాను. ''బ్రహ్మచారికి తాంబూలమూ, సన్యాసికి రొక్కమూ ఇచ్చేంత పాపం వేరేలేదు. ప్రయాణానికి సన్యాసికి డబ్బు అక్కరలేదా అని అంటే- అతడు నడచిపోనీ- బండ్లూ బస్సులూ ఎందుకు?

తొంభై ఏళ్ళకు పైనదాటినా, వారు రోజుకు 10/15 కిలోమీటర్లు సులభంగా నడవగలరు. ఈశక్తి వారికి ఎక్కడనుండి వస్తుంది? తపో మూలకంగా.

ఆయన శిష్యులకు స్వప్నంలో దృశ్యాలు కనబడతాయి అని అంటారు. స్వప్నంలో యిచ్చిన ఆదేశాలు అప్పటికి అర్థవంతంగా లేకపోయినా తర్వాత అర్థవంతములుగా వుంటావని వారి శిష్యుల అనుభవము.

'అహింసాపరమోధర్మః'- అనేది ఆయన Cordinal Virtue. ఈమధ్య ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర దేశాలలో నూర్లకొలది మైళ్ళు ఆయన పర్యటించారు. వారు ఏ వాహనాన్ని ఎక్కరు. చాతుర్మాస్యలో ఒక్కచోటనే వుంటారు. అపుడు కూరకాయలు కానీ ఫలములుకానీ స్వీకరించరు.

శిష్టాచారము, శౌచము వారు పాటిస్తారు. ఇతరులూ పాటించవలెనని బోధిస్తారు. శాస్త్రాలు నిర్దేశించిన అంతశ్శౌచ బహశ్శౌచ విధులను తప్పక పాటించవలెనని వారు అంటారు. వారు ఏ విషయంలోనూ ఇతరులను నిర్బంధించరు. తాము చెప్పేది చెప్పుతారు. వింటే సరి. లేకపోతేనూ సరియే.

యేశాస్త్రవిధి ముత్సృజ్యవర్తంతేకామకారతః

నససిద్ధి మవాప్నోతి నసుఖం నపరాంగతిమ్‌

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం కార్యా కార్యవ్యవస్థితౌ-

జ్ఞాత్వాశాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి||

కామ కారణంగా ఎవడు శాస్త్రవిధులను అనుసరించడో, అతనికి సిద్ధికాని, సుఖంకాని, పరమగతి కాని లేదు. కార్యాకార్యములలో శాస్త్రమే నీకు ప్రమాణం. శాస్త్ర విధానాన్ని చక్కగా తెలిసికొని కార్యములు చేయుట మంచిది.

ఈశ్వరునివలె స్వాములవారు గొప్ప గుణగ్రాహి.

విద్వాంసుడు ఈశ్వరునివలె గుణదోషాలను గ్రహించవలెను. గరళాన్ని కంఠములోను, చంద్రుణ్ణి శిరస్సులోనూ శివుడు ధరిస్తాడు కదా!

అనుబంధంలోని హెచ్‌.వి.ఆర్‌. అయ్యంగారు వ్రాసిన వ్యాసం చదవండి.

ఎవరిలోనైనా కించిత్తు మంచిగుణమున్నా సరే దానిని ఆసక్తితో ఆదరణతో వారు గుర్తిస్తారు. బీదవారు, దుఃఖితులు, మంద భాగ్యులంటే స్వాములవారికి అనుకృప. దేశంలో క్షామంవచ్చినా, అతివృష్టిచేత వరదలువచ్చినా స్వాములవారు బాధితుల యోగక్షేమ విషయంలోతను చేతనైనంతచేస్తారు.

దేశవిభజన సమయంలో హిందూ ముస్లిముల కలహాలలో స్త్రీలు మానమును కోల్పోయినపుడు వారు ఉదారమైన సలహాలనిచ్చి ఆస్త్రీలను మరల తమ కుటుంబములతో చేరేటట్టు చేసారు.

వారికి సర్వమతములూ సమ్మతమే. వారు బోధించేది, 'స్వధర్మేనిధనంశ్రేయః పరధర్మో భయావహః'. భారత దేశమునకు క్యాథలిక్కుల గురువగు పోప్‌ వచ్చినపుడు అందరూ వారికి ఉచిత సత్కారములు చేయవలెనని ఉపదేశించారు. ఆయన భక్తులలో చాలామంది ముస్లిములూ, క్రైస్తవులూ ఉన్నారు.

యోగులు త్రైకాలిక జ్ఞానులు. కొందరు వీనిని ప్రకటిస్తారు. కొందరి సిద్ధులు ప్రచ్ఛన్నంగానే ఉంటాయి. ఒకపుడు స్వాములవారు కొంతమంది భక్తులను సంవత్సరానికి ఒకమూట బియ్యం మఠానికి పంపేటట్లు ఏర్పాటు చేసారు. మఠమునకు, కంచిలో కుంభకోణంలో, తిరువానైక్కావల్‌లో, రామేశ్వరంలో కార్యాలయాలున్నవి. దేశంలో మారుమూలల ఉన్న భక్తులు తమకు దాపున ఉన్న కార్యాలయమునకు ఆమూట బియ్యం పంపేవారు. హఠాత్తుగా స్వాములవారు అన్ని మూటలూ రామేశ్వరానికి పంపమని ఉత్తరువు చేసారు. కంచిలో ఉన్న భక్తుడుకూడ కంచిలో మూటను చేరవేయక రామేశ్వరానికి వ్యయప్రయాసలతో పంపవలసి వచ్చినది. ఈ ఉత్తరువు భక్తులకు అర్ధంకాలేదు. స్వాములవారు చెప్పారుకదా అని మూటలు క్రమంగా రామేశ్వరంవెళ్ళి చేరేవి. రామేశ్వరంలో ఈ మూటలు విస్తారంగా చేరిపోయినవి.

కొన్ని ఏండ్లక్రితం తుఫానులో ధనుష్కోటి సముద్రంలో కలసిపోవడమూ, రామేశ్వరంలో జలప్రమాదం ఏర్పడటమూ పాఠకులకు గుర్తుకొచ్చి వుంటుంది. ఆ సమయంలో ఈ బియ్యపు మూటలు అక్కడి జనాలకు ఎంతో ఉపకరించినవి.

మరొక సంఘటన.

స్వాముల వారికి అత్యంత సన్నిహితంగా ఉన్న శిష్యునికొకనికి పుత్రవియోగం కలిగింది. ఆ శిష్యుడు స్వాములవారిపై భక్తిచేత కుమారునికి చంద్రశేఖర్‌ అని నామకరణం కూడ చేశాడు. ఆ అబ్బాయి అవసాన సమయంలో ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న స్వాములవారు తన పరిచారకులతో ఏదో పరియాచకము లాడుతూ- 'ఒరేయ్‌- నాకు యమదర్శనమయింది.' అని అన్నారు. పరిచారకుడన్నాడు. మీకేమి యమదర్శనమవటం? మీరు సన్యాసులు. మీరు ఉన్నచోటికి నూరుమైళ్ళలోకూడ యముడు కాలు పెట్టలేడు.

''నేనొక కుహనా సన్యాసిని(దొంగ సన్యాసి) యముడు నాదగ్గరకురావటానికి కష్టపడపనిలేదు''- అని స్వాములవారు మళ్ళా అన్నారు. పరిచారకుడు- 'కాదు మీరేమీ దొంగ సన్యాసికాదు. మీ దాపుకు యముడు రానూ రాడు' అని బదులిచ్చాడు. స్వాములవారు బదులు చెప్పలేదు.

తర్వాత మఠానికి వార్త అందినది. స్వాములవారు ఏ సమయంలో పరియాచకాలాడుతున్నారో, సరిగ్గా అసమయంలోనే శిష్యుని కొడుకు చంద్రశేఖర్‌కు యమదర్శనమయినదని!

స్వాములవారిని నలభై ఏళ్ళుగా దర్శిస్తూ భక్తి నెరపుతూ ఉన్న ఒక దంపతుల కథ.

ఒకపుడు, స్వాములవారు మకాంచేస్తున్న చోటికి 80మైళ్ళ దూరంలో ఈ దంపతులు ఉన్నారు. సంవత్సరము 1947. స్వాములవారి పరిచారకుడు ఈ దంపతుల ఇంటికి వచ్చి కారణంచెప్పకుండా స్వాములవారు మిమ్ములను వెంటనే రమ్మన్నారు అని అన్నాడు. శ్రీవారి ఉత్తరువు ప్రకారం దంపతులు వెంటనే వెళ్ళారు మఠానికి. మఠంలో విచారిస్తే, స్వాములకు అతి సన్నిహితంగా వుండే పరిచారకులు కూడ వారిని పిలిచిన కారణం చెప్పలేకపోయారు.

స్వాములవారి దర్శనార్ధం వారు వెళ్ళగా, ఒక గడ్డివాము దగ్గర కూచొని ఆవు, పెయ్యను ప్రసవిస్తూ ఉంటే శ్రీవారు చూస్తున్నారు.ఆ ప్రసవిస్తున్న కామధేనువుకు ఈ దంపతులను స్వాములవారు ప్రదక్షిణం చేయమన్నారు. వారు ఆవిధంగా పరిక్రమణ చేయగానే మీరు మీఇండ్లకు ఇక వెళ్ళవచ్చునని స్వామి ఆజ్ఞాపించి తమ దివ్యపూజకు వెళ్ళిపోయారు.

నాలుగేళ్ళ పిదప మరల ఆ దంపతులు సంక్రాంతికి వచ్చే కనుమనాడు (పశువుల పండుగ) స్వామిని దర్శించడానికి వచ్చారు. ఆరోజు సుమంగళుల భిక్షావందనం. 3 గంటలకు సాయంత్రం పూజముగిసి, తీర్థప్రసాదాలు స్వాములవారు ఇస్తున్నారు. సుమారు ఐదువందల ముత్తైదువలు తీర్థం తీసుకొంటున్నారు.

ఈ దంపతులలో భార్య వెళ్ళి తీర్థానికి చేయి చాచినపుడు స్వాములవారు ఉద్ధరిణను క్రిందవేసి దిగ్భ్రమ చెందినవాని వలె ఆమెవైపు చూచి, ఆమె భర్తను పిలువనంపి, 'నీవు వెంటనే మఠంలో ఉన్న గోవుకు పూజచేసిరా' అని అన్నారు. అతనికి స్వాములవారు హఠాత్తుగా ఇచ్చిన ఆజ్ఞ వెంటనే అర్ధంకాలేదు. కాని గోపూజ స్వాములవారు చెప్పినట్లు చేసి భోజనానంతరం వారు వారి గ్రామానికి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరముల తర్వాత జాతకప్రకారము అతనికి గోశాపమున్నదనీ, దానిప్రభావం దైవానుగ్రహంచేత తొలగి పోయినదనీ జ్యోతిష్కులు చెప్పారు.

1966 సంవత్సరము విజయదశమినాడు యునైటెడ్‌నేషన్స్‌ జనరల్‌ అస్సెంబ్లీ కాన్ఫరెన్స్‌హాలులో పాడుటకు ఒక కీర్తన స్వాములవారు వ్రాసారు. యం.యస్‌. సుబ్బలక్ష్మి అచట పాడింది ఆ కీర్తన.

మైత్రీం భజతాఖిలహృజ్జేత్రీం

ఆత్మవదేవ పరానపి పశ్య-

యుద్ధంత్యజత, స్ఫర్ధాంత్యజత

త్యజత పరేష్వక్రమమాక్రమణం

జననీ పృథివీ కామ దుఘాస్తే

జనకో దేవః సకల దయాలుః

దామత్య దత్త దయధ్వం జనతాః

శ్రేయో భూయాత్‌ సకలజనానాం.

''అందరి హృదయాలను ఆకర్షించే మైత్రీభావం పెంపుచేసుకోండి. ఇతరులను మీవలెనే చూచుకోండి. యుద్ధాన్ని మానండి. విద్వేషం వదలి పెట్టండి. అక్రమ ఆక్రమణం వద్దు. మనతల్లి పృథివి కామధేనువు. మనతండ్రి ఈశ్వరుడు సర్వుల ఎడ దయకలిగినవాడు. దామత్య- నిగ్రహించుకోండి. దత్త- ధారళంగా దానధర్మాలు చేయండి. దయధ్వం- అందరియందు దయకలిగి ప్రవర్తించండి. అందరికీ, శ్రేయస్సు కలుగుకాక!'' అని దీని భావం.

దామ్యత, దత్త, దయధ్వం- ఈ ఉపదేశం స్వాములవారు ప్రపంచానికి బృహదారణ్యంనుంచి సంగ్రహించి అందించారు.

ప్రజాపతికి మూడు రకముల సంతతి; దేవతలు, మనుష్యులు, అసురులు. వారు బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించారు. ఒకరోజు తండ్రివద్దకు వెళ్ళారు.

దేవతలు- ''మాకు మీరు బోధించవలసినది'' అని అడుగగా ప్రజాపతి వారికి ఏకాక్షరాన్ని ఉపదేశించాడు. 'ద' అని చెప్పి నేను చేసిన ఉపదేశం మీకు అవగతమైనదా అని అడిగారు. ''ఆ మాకు అర్ధమయినది. ద- అంటే దామ్యత- స్వాభావికంగా సంయమను భోగలాలసుపైన వమ్ములను నిగ్రహించుకోండి-'' అని మీరు ఉపదేశించారు. అని దేవతలు బదులు చెప్పారు. వారి పిదప మనుష్యులు వెళ్ళి- ప్రజాపతిని మాకూ ఉపదేశం చేయండి అని అడిగారు. వారికీ-ద అనిచెప్పి నే చెప్పినది అర్ధమైనదా అని అడిగారు. ''ఆ అర్ధమైనది. ద అంటే దత్త- ప్రాయికంగా మాకు లోభగుణంవుంది మీకు ఉన్నది దాచిపెట్టకోక మీశక్తికి తగినట్లు దానంచేయండి. శ్రేయోభిలాషులైన మీరు ఇంతకంటే వేరేమి మాకు చెబుతారు?'' అని అన్నారు.

వారు పిదప ప్రజాపతి పుత్రులు- అసురులు వారి వద్దకువెళ్ళి మాకు ఉపదేశం చేయండి అని అన్నారు. వారికీ ప్రజాపతి- 'ద' అని మీకేమి అర్ధమైంది అని అడిగారు. ''ద అంటే దయధ్వం, స్వాభావికంగా మాలో క్రౌర్యత, హింసాగుణమూ ఉన్నది. మీరు అందరి ఎడ దయతో ప్రవర్తించండి అని ఉపదేశం చేశారు'' - అని అసురులు అన్నారు.

ఇప్పటికీ తన సంతతికి ఇచ్చిన ఉపదేశం- 'ద, ద, ద,' త్రిరావృతంగా మేఘనాదములలో మనకు ప్రజాపతి ఉపదేశిస్తూనే ఉన్నాడు.

మనలో, దైవత్వం, మనుష్యత్వం, దానవత్వం- మూడూ ముప్పిరిగొని వున్నాయి. అందుచేత ప్రజాపతి ఉపదేశాన్ని మనం పాటించకపోతే మనకు నిష్కృతిలేదు.

'దామ్యత దదత దయధ్వం'

త్రివిధం నరక స్యేదం ద్వారం నాశనమాత్మనః

కామః క్రోధస్తథా లోభ స్తస్మాదే తత్త్రయంత్యజేత్‌

(గీత- 16-21)

ఆత్మనాశనానికి దారితీసే నరకానికి మూడు ద్వారాలున్నవి. అవి కామక్రోధ లోభములు. మన లోభత్వాన్ని, క్రౌర్యాన్ని, భోగలాలసతను తగ్గించుకొని, ఆత్మ లాభమును పొందవలెనంటే- ప్రజాపతి చెప్పిన మూడు సూక్తులను మనం పాటించాలని స్వామివారి ఆదేశం.

1977లో జనతా గవర్నమెంటు వచ్చినపుడు మనదేశానికి అమెరికాకు మధ్య అభిప్రాయ బేధాలతో, సామరస్యం లోపించి యుండినది. సుప్రసిద్ధ న్యాయవేత్త పాల్కీవాలాను అమెరికా దేశానికి భారతదేశపు రాయబారిగా ఎన్నుకొన్నారు. ఆయన అమెరికా వెడుతూ, స్వాములవారి దర్శనం, కంచి సమీపంలోవున్న తేనాంబాక్కంలో చేశారు. స్వాములవారు మౌనం. ప్రపంచశాంతి అమెరికా భారతదేశములమధ్య సామరస్యం ప్రముఖ విషయములైనందున- పాల్కీవాలాతో మాట్లాడకపోయినా, ఇరుదేశముల మధ్య మైత్రిని వృద్ధిచేసే దానికి ఆయన పాటుపడవలెనని, తన రెండు చేతులను పైకెత్తి కుడి ఎడమ చేతివ్రేళ్ళు ఒకదానినొకటి పెనవేసుకొన్నట్లు ముద్రారూపంలో చూపి ఆశీర్వదించారు.

మీరందరూ మూకకవి వ్రాసిన మూక పంచశతిని గూర్చి వినేవుంటారు. స్వాములవారి ఉపన్యాసాలలోనూ వారు చర్విత చర్వణంగా ఒక శ్లోకాన్ని ఉదహరిస్తుంటారు.

శివశివ పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షాతాః పురుషాః

విపినంభవన మమిత్రం మిత్రం లోష్ఠంత యువతి బింబోష్ఠమ్‌

శ్రీ కామాక్షి కటాక్షం ఎవనిపై బడుతుందో అతడు ఇల్లూ, అడవీ, శత్రువూ, మిత్రుడూ, మట్టి పెళ్ళా, మదవతి మధురాధరం- సమంగా భావిస్తాడట. 'సమత్వం యోగముచ్వతే' ''నిర్దోషంహి సమంబ్రహ్మ'' - అతడు సమత్వ సామ్రాజ్యాధిష్ఠుడై, యోగీశ్వరుడౌతాడట. ఇదంతా ఆ కామాక్షి కళ్ళ చలువ!

శివుడు తన చిచ్చఱకంటితో కాముణ్ణి దహించాడు. అతనిని కామపరిసంధి అని అంటారు. ఆయన కామం ఏమాత్రం లేనివాడు. కాని కామాక్షి, ఈ కామపరి పంథిని కామించింది. అందుచేత ఆమె కామపరిపంథి కామిని ఐనది. ఆమెకు 'శివకామి' అనికూడ పేరు. ఎంతో ముచ్చటైన పేరు. భర్తకు విరోధియైన కాముడు ఈమెకు భక్తుడు. అతనిపై ఆమెకు చాలా దయ. కాముడు విషమశరుడు. విషమనయనుడైన శివుడు, విషమశరద్రోహి. కామాక్షి ఆవిషమశరుణ్ణి పునరుజ్జీవింపచేసినది. దీనిని చూస్తున్న శివుడు ఏమి చేయగలడు? అతడు శివకామి కామి! శివశ్శక్త్యాయుక్తో. ఆ శివకామితో కూడియుంటేనే ఆయనకు స్పందన, చైతన్యం, బుద్ధిప్రసారం- అన్నీ!! ఆ కామాక్షిపైన మూకకవి అత్యంత సుందరములైన శ్లోకాలు మూక పంచశతిలో వ్రాసాడు'.

మచ్చుకు ఒక శ్లోకం-

అభిదాకృతి ర్భిదాకృతి రచిదాకృతి రపి చిదాకృతి ర్మాతః

అనహం తా త్యమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీవిశ్వమ్‌!

దీనినే- ఇంగ్లీషులో- Contradichous gelore- అని అంటారు. ఆమెలో ఒకటే విరుద్ధ గుణాభాసం. విశ్వమాత అయినా స్త్రీకదా! స్త్రీల సహజగుణములైన చపలస్థైర్యతలు, ధైర్యమూ, పిరికితనమూ, కరుణా, కాఠిన్యం ఒక్కటేమి- అన్ని గుణములగంప కామాక్షి.

ఒకపుడు ఆమె ఆభేదస్వరూపిణి. ''ఏకం అద్వితీయంబ్రహ్మ''. మరొకపుడు భేదరూపిణి. ఒకపుడు చిత్తు. మరొకపుడు జడం. ఒకపుడు ఆమె అహంతాకృతి. మరొకపుడు అపహంతాకృతి. ''క్షణక్షణముల్‌ జవరాండ్ర చిత్తముల్‌'' అని ఒక కవి అన్నాడు. ఈమె లోకాన్నీ, లోకనాధుడైన శివుణ్ణీ తికమకలు పెట్టుతుంది. ఈ నాటకాన్ని అంతా మూకకవి బహు సుందరంగా కావ్యస్థం చేశాడు.

సాహిత్య దర్పణం వ్రాసిన విశ్వనాథకవిరాజు- వాక్యం రసాత్మకం కావ్యమ్‌ అని కావ్య నిర్వచన చేసాడు. పండిత జగన్నాధరాయలు- 'రమణీయార్థ ప్రతిపాదకశబ్దః కావ్యమ్‌' అని అన్నారు.

వాల్మీకి కవి రామాయణంలో వ్రాస్తాడు.

అకర్ధమమిదం తీర్ధంభరద్వాజ నిశామయ

రమణీయం ప్ర సన్నాంబు సన్మనుష్యమనోయధా.

'భరద్వాజా! చూచావా? ఈ తీర్థంలో బురద అన్నమాట లేదు. ఆ తీర్థం ఎంత రమణీయంగా వుంది? ప్రసన్నంగా, ఆహ్లాదకరంగా, మంచిమనిషి మనస్సువలె ఈ సలిలములు ఎంత శివకరములుగా వున్నాయి?'

వ్యాసమహర్షి ఒక అరణ్యం వర్ణిస్తూ :

'వనం ప్రతిభయం శూన్యం వసిల్లికాగణనాదితం'-

అని అంటారు. ఆ వనం భయంకరంగా వుంది. జిల్లలు కూస్తున్నవి. ఆవనం శూన్యం. దైవోపహతుని హృదయమూ ఇట్లాగే వుంటుంది.

ఇవన్నీ రమణీయార్థ ప్రతి పాదక శబ్దపూర్ణములైన కావ్యాలు.

శ్రీనాథుడు అనే ఒక తెలుగుకవికి చాల ప్రశస్తి ఉన్నది. ఆయన సీసపద్యాలకు సామ్రాట్టు. శివభక్తుడు. మంచి దర్పం గలవాడు. భోగి. సాంఖ్య, శైవ, వైష్ణవాగమ, పాతంజల, న్యాయవైశేషికములను ఆపోసన పట్టినవాడు.

'కాశీఖండం అయః పిండం నైషధం విద్వదౌషధం'.

అని ఒకనానుడి. ఆ రెంటినీ ఆంధ్రీకరించిన దిట్ట. చిత్ర రచనాశిల్పము, శాస్త్రజ్ఞత, లోకజ్ఞత వీటన్నిటినీ తన కావ్యాలలో నింపి మూలతుల్యంగా వ్రాసే కౌశల్యం శ్రీనాథునిది.

హర్షుడు నలుని వర్ణిస్తూ, నైషధంలో-

సువర్ణదండైక సితాత పత్రతోద్దండ తేజః కీర్తిమండలః-

అన్నదానికి- శ్రీనాథుని తెలుగు-

'తపనీయదండైక ధవళాతపత్రతోద్దండతేజః కీర్తిమండలుండు'

శ్రీనాథుడు షష్ఠ్యంతాలు వ్రాసినా అంతే-సంస్కృత పదభూయిష్ఠంగా సుందరంగా వుంటుంది.

క నిర్ఘృణ నిర్ఘాతస్ఫుట, నిరోషకఠోరధాటినిస్సాణ మహా

దీర్ఘతరధణధణాంకృతి, దూర్ఘట్టననిర్దళిత చతుర్దిక్కుగ కున్‌.

వాల్మీకి- అకర్దమమిదంతీర్ధం- అని లలితములైన పదాలతో కవనం చెప్పితే-శ్రీనాధుని శైలి ఇది. అతడూ ఒక తటాకాన్ని ఇట్లా వర్ణిస్తాడు.

శేషపుచ్ఛచ్ఛాయ చెలువారు బిసములు తన్మగ్నసురదంతి దంతములుగ

నిండారవిరసినపుండరీకశ్రేణి యామినీరమణరేఖాళి కాగ

ప్రతిబింబితోపాంత బహుళ పాదపములు గర్బస్థ శైల సంఘములుగకాగ

ఏక దేశంబున ఇందీవరంబులు కాలకూట మయూఖ ఖండములుగ

బాలశైవాలవల్లరీ జాలకంబు బాడబానల భవధూమపంక్తి కాగ

వారి రాశియుబోలె గంభీరమైన ఘన తటాకముకాంచె నజ్జనవిభుండు.

మళ్ళీ మూకకవి వద్దకు వద్దాం. మూకకవియెక్క శబ్దమాధుర్యం, పదముల పొందిక, భావ గాంభీర్యం, వర్ణనల జిగిబిగి- అప్రయత్నంగా వెలువడే శ్లోక తరంగాలు- శృంగారరస బంధురములైన కల్పనలు- పాఠకులను పరవశింపచేస్తుంది. మూక పంచశతిని చదివినవాడు- అపవర్గసౌధాన్ని అవలీలగా నెక్కుతాడని ఆయనే-

కామాక్ష్యా మృదులస్మితాంశులహరీజ్యోత్స్నావయస్యాన్వితా మారోహత్యపవర్గసౌధ వలభీ మానంద వీచీమయీమ్‌ అని ఉద్ఘోషిస్తున్నాడు.

స్వాములవారివద్ద అనంతానందస్వామి అని ఒక సన్యాసి ఉండేవారు. ఆయనను అందరూ ఆంజనేయస్వామి అని పిలిచేవారు. ఆయన సార్ధకనామధేయుడు. స్వాములవారికి ఆయన ఆంతరింగిక కార్యదర్శి. మిక్కిలి స్నేహశీలి- ఆప్యాయంగా- 'విశాఖా' అని పిలిచేవారు. ఎపుడూ మఠంలోనే వుండేవారు.

ఒకరోజు ఆయనను కామాక్షమ్మ గుడిలో సంధించడం తటస్థించింది. ''ఏమి స్వామీ మీరు ఇక్కడున్నారు?'' అని అడిగాను-

ఆయన 'పెద్దలు నీవు కామాక్షి గుడికి పోయి అక్కడ మూక పంచశతి పారాయణ చేయి' అని మఠంనుంచి నన్ను పంపేశారు. అని అన్నారు. స్వాములవారు తర్వాత కొంతకాలానికి ఆంజనేయస్వామిని కాశికిపోయి వుండమన్నారట. ఈ వృత్తాంతం ఎందుకు వ్రాసానంటే- స్వాములవారికి మూకపంచశతి పారాయణం భాష్యపారాయణతో సమానమైనది అన్న భావం లేకుంటే ఆంజనేయస్వామిని ఎందుకు పారాయణ చేయమని చెప్పుతారు.

శ్రీనాధుడు కాశీఖండం తెలిగించాడని చెప్పారుకదా. అందులో వ్యాసనాష్కాసం అని ఒక కథ ఉన్నది.

వ్యాసులు పెద్దకాలము అపవర్గపదవీకల్యాణ లాభార్ధము కాశిలో వసించారట. విశ్వేశ్వరుడు, వేదవిభాగం చేసిన ఈ మునికి ఏమాత్రం మనస్థైర్యమున్నదో పరీక్షింప దలచినాడు.

సీ|| #9; కాలోచితములైన కరణీయములుదీర్చి

నరుణోదయుగాక యటకమున్న

గంగలో జక్ర పుష్కరిణీ హ్రదంబున

నఘమర్షణ స్నాన మాచరించి

యరుణాంశు మండలం బర్దోదయమునొందు

సమయంబు వీక్షించి సంధ్యవార్చి

నిలుచుండి జపించి నియతిలో గాయత్రి

సంఖ్య యష్టోత్తరశతము గాగ-

తే|| నగ్నికార్యము దీర్చి కామారిగొల్చి

ముక్తిమంటపికామధ్యమునబఠించె

శివపురాణంబు మధ్యాహ్న సీమరాక-

నపర నారాయణుడు బాదరాయణుండు.

పైలసుమంతజైమిని వైశం పాయనాది శిష్యులతో భైక్షవృత్తికి ప్రాతఃకర్మచేసి ఆయన బయలుదేరుతాడు. పిచ్చి బ్రాహ్మణుడు. అన్నపూర్ణా విశ్వేశ్వరుల కుట్ర ఆయనకేమి తెలుసు!

ఒక వనజనేత్ర వండుతున్నామనింది. ఇంకొక సురతి మళ్ళా రండి అన్నది. మరొక గృహిణి ఈరోజు మా ఇంట్లో దేవకార్యం అన్నది. నాలుగవ ఇంటికిపోతే ఆ ఇల్లాలు ద్వార కవాటము తెరవనుకూడ లేదు!

వ్యాసులవారికి రెండోరోజూ ఈ మర్యాదయే జరిగినది. ఆయనకు కోపం వచ్చింది. రాదా మరి?

ఈ కాశీ బ్రాహ్మణులు ధనమదంచేత, వేదవిద్యా గర్వంచేత, మోక్షలక్ష్మీ మనలను వరిస్తుందన్న పొగరుచేత కదా, కరుణ కొంచెమైనను లేక నన్ను ఇట్లు భంగపరచారు?

&#వీళ్ళు మూడు తరములు, ధనములేక, మూడుతరములు మోక్షలక్ష్మీ విహీనులై, మూడుతరములు విద్యలేని దౌర్భాగ్యులై ఉందురుగాక అని శపింపబోయినాడు. ఇంతలో ఒక ముత్తైవుదువ నిజంగా ఆమె కాశికానగరహాటకపీఠ శిఖాధిరూఢ- వ్యాసులవారిని పిలిచింది.

''ఏమయ్యా! భిక్షాన్నముదొరకలేదని అంగలార్చే బ్రాహ్మణుడా! నీ శాంత స్వభావమేమయింది? ఉన్న ఊరు, కన్నతల్లి ఒకటికదా! అందులో ఈ కాశి శివుని అర్ధాంగలక్ష్మి కద! అట్టి కాశిపై నీకుకోపం తగునా?

నాభర్త వైశ్వదేవాది విధులన్నీచేసి అతిథికోసం కాచుకొనియున్నాడు. అతిథి పంక్తికి రాకపోతే ఆయన ఆరగింపడు. ఆకలికి ఓర్వలేడు. నీవు త్వరగా అభ్రగంగలో ఉపస్పర్శచేసి వెంటనేరా-'' అని అనింది.

వ్యాసులవారు శిష్యసమేతంగా భాగీరధికి వెళ్ళి ఉపస్పర్శ ఆచరించిరాగా మృష్టాన్నం ఆమె వారికి ఆరగింపు చేసింది.

వ్యాసమహర్షికి భోజనము చేసిన పిదప ఆ గృహస్థులు కాశీ విశాలాక్షీ విశ్వేశ్వరులన్న బోధ కలిగింది. వ్యాసమహర్షి అపరాధమునకు తగినశిక్ష చేయదలచారు.

'పద్దెనిమిది పురాణాలు చెప్పి, వేదములను ఏర్పరచి, భారతమును వ్రాసిన ఋషివి- నీవు ఒక్కరోజు పొట్టకు లేకపోతే పుణ్యగుణరాశియైన కాశిని తిట్టబొయినావే? నిర్మల బోధకు క్రోధమాఫలము? తీర్ధవాసికి క్రోధం తగునా? నీవు కాశిలో ఉండటానికి అనర్హుడవు. ఇక్కడనుండి వెళ్ళిపో'- అని రూక్షంగా విరూపాక్షుడు అన్నాడు.

వ్యాసమహర్షి చాల వినయముతో తన అపరాధమునకు క్షమార్పణ వేడుకొనిన పిదప కాశికి ఐదు క్రోశములకు ఆవల ఉన్నచోట ఉండుమని విశ్వేశ్వరుడు వ్యాసులను అనుగ్రహించాడు.

వ్యాసపూజ ప్రతి సంవత్సరమూ మాస్వామి చేస్తారు. మనం ఎన్ని జన్మలుఎత్తితే వ్యాసమహర్షుల ఋణం తీర్చుకోగలం? 'వ్యాసాయ విష్ణురూపాయ' 'అచతుర్వదనో బ్రహ్మాద్విబాహురపరోహరిః'. ఆయన నాలుగు ముఖాలులేని ఏకముఖబ్రహ్మ; నాలుగు చేతులేని రెండుచేతుల విష్ణువు. 'అఫాలలోచనశ్శంభుః' అన్నీ దగ్ధంచేయగల మూడోకన్నులేని అపరశివుడు- భగవాన్‌ బాదరాయణుడు. మనం సాధారణంగా 'నీకేమైన కొమ్ములు మొలిచినవా? అని అనటం వినేవుంటాము. ఈ సూక్తి ఆయన భారతంలోనిదే. 'నతేశృంగమవర్ధత' భగవద్గీత, విష్ణుసహస్రనామం, శివసహస్రనామం, సనత్సుజాతీయం, అనుగీత భీష్మధర్మ ప్రబోధము, అన్నీ భారతమూలకంగా ఆయన ప్రసాదించిన భిక్షనేకదా!

&#ఐతే వ్యాసమహర్షులు చకారకుక్షి. దీనికొక కథ.ఒకపుడు కాళిదాసు కాశికి వెళ్ళాడు. అక్కడ ఒక దేవాలయంలో వ్యాసమహర్షి విగ్రహం చూచాడు. మూకకవికి కవిత్వం కామాక్షీదేవి ప్రసాదమైతే, కాళిదాసుకు కవనం కాళికాదేవి ప్రబోధంవల్ల కలిగింది. శ్రీమత్కవిరాజ రాజమకుటరత్న రాజనీదాజిత రాజీవచరణారుణ రాజీవస్య రాజరాజేశ్వరీ కరుణా కటాక్ష లబ్ధ నిఖిలానవర్య విద్యస్య- అని తన కృతులు తుదిని ఆయన వ్రాసుకొంటాడు.

వ్యాసులను చూడగానే, ఆయన హేళనగా- ''ఓహో చకారకుక్షియా?'' అని వ్యాసులవారి బొడ్డులో తన చిటికినవ్రేలు పెట్టి గిలిగింత చేశాడట. ఆవేలు బొడ్డులోనే ఇరుక్కున్నది. ఎంతలాగినా రావటంలేదు. గింజుకొంటున్నాడు. తన పరిహాసానికి తగిన ప్రాయశ్చిత్తమే అని అనుకొన్నాడు. అనేక విధములుగా కాళిదాసు వ్యాసులవారిని ప్రార్ధించాడు.

కాళిదాసు వ్యాసులను 'చకారకుక్షి' అని ఎందుకు అన్నాడు? వ్యాసుల కవనంలో 'చ' కారము కొల్లలు కొల్లలుగా వుంటాయి, అందుచేత.

ధర్మక్షేత్ర కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః

మామకా పాండవశ్చైవ- ఇక్కడ ఒక చకారం

ధర్మేచార్ధే చ కామేచ మోక్షేచ భరతర్షభ-

యదిహాస్తి తదన్యత్ర- యన్నేహస్తి నతత్‌క్వచిత్‌ -

ఒక్క శ్లోకంలో నాలుగు చకారములు.

ఈయన కుక్షిలో- చకారములు తప్ప వేరేమీలేదని కాళిదాసు వ్యాసులను హేళన చేశాడు; ఇపుడు ఇక్కట్టులో ఇరుక్కొన్నాడు.

వ్యాసులవారు; 'ఏమయ్యా. నీవు నన్ను చకారకుక్షి అన్నావే. చకారంలేకుండా నీవు భారతం చెప్పు. చూద్దాం' అని తీవ్రంగా అన్నారు.

'మీ అనుగ్రహం ఉండవలెనేకానీ, చకార నిరాసన నాకు ఒక కష్టంకాదు. ఏమి చెప్పమంటారు భారతంలో' అని కాశిదాసు అడిగాడు.

'పాండవులు, ద్రౌపదికి బావలు, భర్తలు, మరుదులు అగుదురు అన్న విషయాన్ని చకారం లేకుండా ఎట్లు చెప్తావో, చెప్పు' అని వ్యాసులడిగారు.

''ద్రౌపద్యాః పాండుతనయాః పతిదేవరభావుకాః

నదేవరోధర్మరాజ స్సహదేవోన భావుకః''

ద్రౌపదికి పాండుతనయులు, భర్తలు, మరుదులు, బావలు అగుదురు. వారిలో ధర్మరాజు మరిది కాడు. సహదేవుడు బావకాదు. అని చకారావసరం లేకుండా కాళిదాసు చెప్పేసరికి- చకారకుక్షి చాలా సంతోషించి, కాళిదాసు ప్రగల్భనకు ఆనందించి దీవించి అంతర్ధానమయ్యాడు.

చకారాన్ని పాద పూరణకు వాడుతారు. ఇంతేకాక, ఇంకా అని అర్ధాలలో దీనిని వాడుతారు. చకారకుక్షి అంటే- నిరంతర జ్ఞానం కలవాడు అని అర్ధంకూడ చెప్పుకోవచ్చు. వేదములూ చకారకుక్షులే.

శంచమే ప్రియాశ్చయ్యేనుకామశ్చమేసౌమనశ్చమే

భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే................

మాస్వాములూ చకారకుక్షులే. వ్యాసమహర్షుల వలె ఆయన తనకుక్షిలో ఎన్ని విషయాలు దాచిపెట్టారో ఆశ్చర్యంవేస్తుంది.

ఒకప్పుడు ఆయనను నేను 'పుటార్జునం' అంటారే- దానికి అర్ధమేమి? అని అడిగాను.మాస్వామి ఒక క్షణంసేపు తికమకలు పడినారు. పక్కనవున్న పరిచారకునితో- 'ఏరా! అందరూ నన్ను సర్వజ్ఞుడు అని అంటున్నారు. ఈయన ఏమో అడుగుతున్నాడు. నాకు బదులు చెప్పడానికి తోచకుండా వుంది' అని అన్నారు.

ఒకప్పుడు వారు నన్నొక ప్రశ్నవేశారు.

'Alliteration అంటే ఏమి?' అని

దానికి ఏమిబదులు చెప్పాలో తోచక నేను తెల్లమొహం వేశాను. 'Alliteration' అంటే అర్ధం ఔతుంది కానీ నాకు చెప్పటం తెలియటంలేదు- అని అన్నాను.

స్వాములవారు వెంటనే-

''The ragged rascals ran round and round the rugged rock'- ఇది ఏమి అని అడిగారు.

'Alliteration' అని బదులు చెప్పాను.

ఒక శాస్త్రి కాళహస్తికిపోయి ప్లాస్త్రీ వేసుకున్నాడు.- అని చెప్పితే ఏమవుతుంది? అని అడిగారు.

'Alliteration ' అని బదులు చెప్పాను.

'ఇదంతా ఒక Literature Class వలె నేనొక ఇంగ్లీషు లెక్చరర్‌ వలె ఉన్నానుకదా?' అని చకారకుక్షులు నవ్వారు!

''మునిం స్నిగ్ధాంబుదాభాసం వేదవ్యాసమకల్మషమ్‌

వేదావాసం సరస్వత్యావాసం వ్యాసం నమామ్యహం''

మాస్వామిని చూచినపుడంతా వ్యాసులవారే జ్ఞాపకం వస్తారు. ఇద్దరూ చకారకుక్షులే.

స్వాములవారిని దర్శించడానికి వచ్చేవారి గతి ఏమౌతుంది అని మీరు నన్ను ప్రశ్నిస్తే, వారి గతి -

'గతప్రత్యాగతం' ఔతుంది అని బదులు ఇవ్వాల్సి వస్తుంది.

గతం అంటే వెళ్ళటం. ప్రత్యాగతం అంటే రావటం. వెళ్ళింది తిరిగివస్తుంది. తిరిగివచ్చింది మళ్ళా వెళుతుంది. వెళ్ళింది మళ్ళా తిరిగి వస్తుంది. ఇదీ- గత ప్రత్యాగతం అంటే. స్వాములవారిని చూచేవారి గతీ ఇదే!

మాఘకవి 'గతప్రత్యాగతానికి' ఉదాహరణంగా ఒక శ్లోకం వ్రాసాడు.

తంశ్రియా ఘనయా నస్తరుచా సార తయాతయా-

యాతయా తరసాచారుస్తనయానఘయాశ్రితం

ఈ శ్లోకం తంశ్రియా అని ప్రారంభమౌతుంది. యాశ్రితం అని ముగుస్తుంది. ఈ శ్లోకాన్ని వెనకనుంచి చదివితే- తంశ్రియా ఘనయా- అని మొదటిపాదమే వస్తుంది. ఇది గత ప్రత్యాగతం.

అతిలోక సౌందర్యవతీ, అనఘ- పాపమనేమాటలేనిదీ ఘనస్తయా అగు శ్రీదేవిచేత ఆతురతతో ఆలింగింపబడిన మహావిష్ణువుని గూర్చినదీ శ్లోకం.

మాఘకవి శిశుపాలవధ అనే కావ్యం వ్రాసినాడు. స్వాములవారు తమ ఉపన్యాసములలో ఒకపుడు చెప్పిన

'అజస్రమాస్ఫాలిత వల్లకీగుణా, క్షతోజ్జ్వలాంగుష్ఠనఖాంశుభిన్నయా

పురః ప్రవాళైరివ పూరితార్ధయా విభాన్త మచ్ఛస్ఫటికాక్షమాలయా'-

అన్న శ్లోకం ఈ మాఘకావ్యములోనిదే.

స్వాములవారిని తలచుకొంటే మాఅమ్మా, మా అమ్మను తలచుకొంటే స్వాములవారు అవినాభావంగా కనిపిస్తారు. మా అమ్మ పేరు అన్నపూర్ణ. ఆమె తండ్రి అనగా మా తాత పేరు సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణయ్యకు ఐదుగురు పుత్రికలు పుట్టారు. ఈ పంచకన్యా సంభవంతో ఆయన హడలిపోయాడు. ఆయన కార్వేటినగర సంస్థానంలో తహసీల్దార్‌ ఉద్యోగం చేసేవాడు. చెట్టుక్రింద ఉన్నా, ఒక అధ్యాయం గీత- విష్ణుసహస్రనామ పారాయణం జీవితాంతమూ చేశాడట. ఆపుణ్యఫలమే నాకు మాస్వామిని తెచ్చిపెట్టింది అని అనుకొంటూవుంటాను.

తనకు తిలోదకాలు ఇవ్వడానికి, పుత్రలాభంకోసం ఆయన కాశీయాత్ర చేసినాడు. అన్నపూర్ణా విశ్వేశ్వరులు తన్ను ఏమైనా కరుణిస్తారేమో అని. కాశీయాత్ర పూర్తి చేసుకొని వచ్చాడు.

మరుసటిసంవత్సరం-అరవకుమార్తె అన్నపూర్ణ-మాఅమ్మ పుట్టింది!

వ్యాస భగవానులనే కఠినంగా తరిమివేసిన ఆ కాశీదంపతులకు మా తాతగారిపై కలిగిన కరుణ ఈ మాత్రమే!

మా అమ్మ చదువు, రుక్ష్మిణీకల్యాణంతో పూర్తి ఐంది. వ్రాతరాదు. చదవటం మాత్రంవచ్చు. ఒకరోజు నేను, సామానుల జాబితాను తయారుచేయమని వత్తిడిచేశాను. ఆమె నిరాకరిస్తూనే అంగీకరించింది. ఒక కాగితం తీసుకొని-

ఉద్దిపప్పు- శనగపప్పు- అని వ్రాసింది.

'నీ వ్రాత ఇంతటితో చాలు' అని కాగితం లాగేసుకున్నాను!

అరవైఏళ్ళు దాటిన తర్వాత ఆమె రామనామం వ్రాయసాగింది. లిఖితజపం. 'శ్రీరామ' అని 36 లక్షలు వ్రాసింది. తెలుసుకోదగిన, తెలుసుకోవలసిన అక్షరజ్ఞానం మాత్రం ఎట్లా సంపాదించింది.

తెల్లవారగానే ఆమె పాటలు పాడేది.

ఇవతలా కావేరి, అవతలా కొల్లడము-

నడుమలో శ్రీరంగనాథపురమూ-

కాశీయాత్ర చేయించిపెట్టు అన్నది. మేము ప్రయాగ వెళ్ళాము. ఆ పడవలో పోతున్నపుడు ఆమె ఆనందం వెల్లివిరిసింది. గానసరస్వతి అని అనుకొంది కాబోలు, ఉదాత్తస్వరితస్వరాలతో-

ఎంతో చక్కటిదమ్మా తిరివేణియమ్మా-

ఏ పక్కా చూచినా సింగారమమ్మా-

ఏ పక్కా చూచినా మహాపూజలమ్మా-

ఏ పక్కా చూచినా బంగారమమ్మా-

ఆణిముత్తెపుచాయా గంగాభవానీ-

ఆ గంగాయమునాసరస్వతులు ఆమె భావోద్రేకంతో ఏకమైపోయారు.

హనుమాన్‌ఘాటులో ఉన్న కామకోటిమఠంలో దిగాము.స్వయంపాకం.ప్రతిదినము అన్నపూర్ణా విశ్వేశ్వరుల దర్శనం. మూడు రాత్రిళ్ళు ఉండినాం. మా తాతగారు స్వయంగా కాశీకి వెళ్ళి తెచ్చుకున్న అన్నపూర్ణను- విశ్వేశ్వరునికి పరిచయంచేసి తిరిగివచ్చాను.

ఆమె మూడేళ్ళక్రితం జ్యేష్టమాస బహుళ ఏకాదశినాడు మరణించింది. ద్వాదశినాడు దహనం (కొన్నిరోజులు భూమిలో ప్రకాశించి) కాశినుంచి వచ్చి కాశికి వెళ్ళిపోయింది.

ఆమెకు భజగోవిందం అంటే ప్రాణం. నేను దాపునకు వెళ్ళినపుడంతా వ్యంగ్యంగా కాబోలు- ''భజగోవిందం మూఢమతే'' అని చిరునవ్వుతో అనేది!

'ఆహా! బృహదారణ్యంలో ఆయాజ్ఞవల్యుడు- ఏమి లెక్చరు కొడుతున్నాడు' అనేది.

ఔను. యాజ్ఞవల్క్యులు అతి ప్రగల్భులు. వారు గురువైన వైశంపాయనులనే ధిక్కరించినవారు. 'నాకు బ్రహ్మజ్ఞానం వుందో లేదో- ఈ దశదశ పాదాబుద్ధములైన గోసహస్రం మాత్రం కావాలని మాత్రం తెలుసు'- అని జనకసభలో చెప్పిన ధీమతి.

రెండవది. కఠోపనిషత్తులో యమనచికేత సంవాదం ఆమెకు ఎంతో నచ్చిన విషయం.

నామస్మరణా దన్యోపాయం మహిపశ్యామో భవతరణ

రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే.

వేదోద్ధార విచారమతే సోమకదావన సంహరణ-

మీనాకార శరీర నమో భక్తంతే పరిపాలయమాం- రామహరే.

ఆమె తరచుపాడే గీతాలు ఇప్పటికీ చెవులలో అనాహత ధ్వనులవలె వినిపిస్తున్నాయి. కానీ ఆమె భౌతిక స్వరం మూగవోయింది. ఆమె హృదయంలో కర్పూరంపెట్టి వెలిగించినపుడు- ఆమె భప్మాంతమైనపుడు- ''తతఃకిం?'' అన్న భగవత్పాదుల వారి ప్రశ్న వెంటాడింది.

జీవితం ఇంతేనా?

'భస్మాంతం శరీరం క్రతోస్మర కృతస్మర'

చావు మనుష్యులను కదిలించివేస్తుంది.ఇది సహజం. ఏదో స్వాములవారి వంటి అలౌకికము, వేదాంత విజ్ఞాన సునిశ్చతార్థులకు- తల్లి చావు వార్త విన్నా గుండ్రాయివలె ఉండేగుణం సహజంగానే- తల్లి చావుతో కంట తడిపెట్టనివాడు ఉండడు.

ఒకపుడు మా అమ్మను పిలుచుకొని స్వాములవారి దర్శనార్ధం వెళ్ళాను. మేము దంపతులము స్వాములవారికి నమస్కరించబోగా, వారు మమ్ములను వారించారు. 'ముందు నీతల్లికి నమస్కారం చేసి తర్వాత నాకు వందనంచేయి' అన్నారు!

తైత్తిరీయం 'మాతృదేవోభవ' అని అంటుంది. దేవతలో మాతృభావం, మాతలో దైవభావం ఎంత సుందరమైన భావన!

పరదేవతను మాతృభావంలో ధ్యానం చేసినపుడు- నిష్ఠ ఎంత సులభంగా కుదురుతుంది!

స్వాములవారు 'ధ్యానమేవ ఉపాసనం' అని అన్నారు. ఉపాసన ధ్యానమే.

ధ్యానం ఒక జలకణం లాంటిది. ఆ కణంలో కాలువలు, నదులూ, జలపాతాలూ, జలధులూ అన్నీ ఉన్నాయి. ఆ కణం భూమినీ మనిషినీ పోషిస్తుంది. అదిలేకపోతే భూమి మరుభూమైపోతుంది. హృదయం అనార్ద్రం ఔతుంది. అనార్ద్రమైన హృదయంలో ప్రేమకు చోటేది?

ధ్యానమంటే ప్రేమప్రసారం. ధ్యానం అటే నిస్తరంగ సముద్రం.నివాతదీపం! గంభీరమైన కాసారం, స్తబ్దమైనవనం, గగన చుంబి ఐన హిమవన్నగం ధ్యానమే కైలాసం.

మనం ప్రేమలో మునిగితేకానీ గవేషితార్ధం సంప్రాప్తంకాదు. జీవితాన్ని కాదన్న ప్రేమా, ప్రేమనుకాదన్న లోకం ఉండదు. అల్పత్వంలో సుఖం లేదు- 'నాల్పేసుఖమస్తి' మరి సుఖం అంటే ఏమి? యావైభూమాతత్సుఖం. అనంతంలోనే అంతులేని సుఖం. అదే ధ్యానం. అదే తపస్సు. తద్ధి తపః తద్ధి తపః.

ధ్యానం అంటే ఏకాంతం. దహనస్థితి. సముద్రంలో నది కలిసినట్లు, అగ్నిలో కణం అణిగినట్లూ, మృత్యువులో జీవుడు మరగినట్లూ నిశీధిలో కాదంబిని మెరసినట్లు- అనేకంనుంచి ఏకంలో ఐక్యమై- శాతం శివం అనే భూమికలో లీనం కావటమే ధ్యానం.

మనిషికి కొంచెం దుఃఖస్పర్శ కలిగితేకానీ అతని తల ఆకాశంవైపుచూడదు.ఉదాహరణ- వాల్మీకి- గౌతమబుద్ధుడు- శోకం శ్లోకత్వమాగతః- ఒక నిషాదుడు క్రౌంచమిధునంలో ఒక పక్షిని చంపిన కారణంగా కల్గిన దుఃఖావేశంలో ఉద్భవమైన కరుణారసంలో వాల్మీకి రామాయణాన్ని గానంచేసాడు.

గౌతమబుద్ధుడు లోకంలోని దుఃఖాలను చూడలేక, నిర్వేదంచెంది తపస్సు చేసుకోడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు.

''ఈ సంసారచక్రంలో చిక్కుకొని పరితపిస్తున్న నీకర్మకు కారణమెవరు? ఈ చక్రం భ్రమిస్తూ వుంటే నీవు భ్రమిస్తున్నావు. దీనిని నీవు ఆపగలవా? ఇటు తిరిగేదానిని అటు తిప్పగలవా? ఏ బీజంనాటితే ఆ పంటనే కదా పండుతుంది? సుఖం దుఃఖంగా పరిణమిస్తుంది. ¸°వనం వార్థక్యంలో ముగుస్తున్నది. జీవనవాహిక మృత్యుసముద్రంలో కలిసిపోతూవుంది. మరణం వెనుక జననం, జననం వెనుక మరణం. ఇదీ జీవనచక్రం. తృష్ణ- దానిని ఎవడైతే లఘుస్తున్నాడో వానికే శాంతీ, నిర్వాణం''. ఆయనకు ఈవిధంగా బుద్ధగయలో బోధ కలిగినది.

సోయమాత్మా చతుష్పాత్‌- ఆ ఆత్మ చతుష్పాత్తు. వీనికి నాలుగు పాదాలు, నాలుగు స్థితులు.

జాగరితస్థానములో - మేల్కొన్నపుడు-ఇతడు బహిఃప్రజ్ఞుడు. స్థూలభుక్‌. వైశ్వానరుడు.

&#స్వప్నస్థానములో- కలలుకనేటపుడు - ఇతడు అంతఃప్రజ్ఞుడు. ప్రవివిక్తభుక్‌- సూక్ష్మవిషయభోగి- తైజసుడు.

సుషుప్తిస్థానంలో- నిద్రలో-మనస్సు చైతన్యం ఏకమయినపుడు-ఇతడు ప్రజ్ఞానఘనుడు. ఆనందభుక్‌. ప్రాజ్ఞుడు- సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు. అంతర్యామి. యోని. అన్నీ వీనిలో ప్రభవించి అంతమౌతుంది.

తురీయస్థితిలో-అతడు అంతఃప్రజ్ఞుడు కాని బహిఃప్రజ్ఞుడు కానీకాడు. ఉభయతః ప్రజ్ఞుడు కానీకాడు. ఆస్థితి అదృష్టం. అవ్యవహారం. అగ్రాహ్యం. అలక్షణం. అచింత్యం. అవ్యపదేశం. ప్రపంచోపశమం- శివం- అద్వైతం. అదే ఆత్మ. మనం తెలుసుకోవలసినది అదే.

అయమాత్మా బ్రహ్మ.

ఆత్మబోధను మించిన అభ్యుదయం లేదు. ఈ అభ్యుదయం మనకు మాతృదేవత తెచ్చిపెట్టాలి. ఆ మాతృదేవతయే గురుదేవులు.

'దేశిక రూపేణ దర్శి తాభ్యుదయాం-

వామకుచనిహితవీణాం-

వరదాం సంగీత మాతృకాం వందే'

నమస్తసై#్మ సదేకసై#్మ

కసై#్మ చిన్మహసేనమః

యదేతత్‌ విశ్వరూపేణ

రాజతే గురురాజతే

(వివేక చూడామణి)

సత్‌ చిత్‌ ఆనందమే పరబ్రహ్మము. అది ఏకము. అద్వితీయము. శాంతము. అదియే చైతన్యజ్యోతి. ఆ చైతన్యమే దృశ్యరూప ప్రపంచముగానూ ఉన్నది. ఈ దృశ్యరూప ప్రపంచమునకు ఒక నమస్కారము. పరబ్రహ్మ, పరంజ్యోతి, పరమేశ్వరుడైన ఓ గురువా? నీకొక నమస్కారము.

''అనుక్షణం దారీ తెన్నూ తెలియక ఒక దీర్ఘస్వప్నంలో మునిగియున్న నన్ను ప్రబోధ భాస్కరుడవి నీవు మేల్కొలిపినావు. నీవేమన్నావు?''

బ్రహ్మప్రత్యయ సంతతిర్జగదతో బ్రహ్మైవ సత్సర్వతః

పశ్యాధ్యాత్మదృశా ప్రశాంతమనసా సర్వాస్వవస్థాస్వపి-

రూపాదన్య దవేక్షితుం కిమభిత శ్చక్షష్మతాం విద్యతే

తద్వద్బ్రహ్మవిదస్సతః కిమపర బుద్ధేర్విహా రాస్పదమ్‌

(వివేక చూడామణి)

అస్తి భాతి ప్రియమనేవి- బ్రహ్మరూపం. రూపం, నామం అనేవి జగత్తు. బ్రహ్మవస్తువు సచ్చిదానందరూపం; జగత్తు- నామరూపాత్మకం. బ్రహ్మత్రికాలా బాధ్యమైన వస్తువు. నామరూపాలు వ్యవహారకాలంలో మాత్రం వుండేవి. బ్రహ్మసత్యం. జగత్తు మిధ్య. జగత్తు ఒకపుడు ఉంటుంది; ఒకపుడు ఉండదు. ఒకపుడు భాసిస్తుంది. మరొకపుడు భాసించకుండా పోతుంది. ఒకపుడు ప్రియం కలిగిస్తుంది. అనృతం, జడం, దుఃఖం ఎక్కడ ఉంది అంటే జగత్తులోనే. ఈజగద్భ్రాంతి తొలిగితే మనమే బ్రహ్మమౌతాము.

బ్రహ్మ నామరూప రహితుడు. మనం నామరూప సహితులమైన జీవులము; ఆయన ఒకడు. మనం పలువురము. ఈ అనేకంనుంచి ఏకానికి ఎట్లు గంతువెయ్యటం?

కసై#్మ దేవాయ హవిషావిధేయ?

ఒక భక్తుడు శృంగేరీ ఆచార్యులు, చంద్రశేఖర భారతీస్వాములవారల వద్దకు వెళ్ళి- స్వామీ! మంత్రజపంలో చెప్పిన మూర్తి ధ్యానం నాచేత కావటంలేదు. నేనేం చేసేది? అని అడిగాడట. అందులకు శృంగేరిస్వాములవారు, అన్నారట- ''గురువులో అన్ని దేవతలూ అణిగి వున్నారు కదా! గురుధ్యానం చేసుకో. గురువురూపం స్పష్టంగా హృదయంలో ప్రతిభాసిస్తే చాలు. గురురూపం సర్వదేవాత్మకం''.

'విశ్వంవిష్ణుః' ఈ విశ్వం బ్రహ్మప్రత్యయములనుంచీ పుట్టింది. ఈ జగత్తును పరబ్రహ్మగా చూడవలెనంటే- ఆధ్యాత్మ దృష్టి మనకు అలవడవలెను. అదే జ్ఞానమయీ దృష్టి. దానికి ప్రశాంతభూమిక అవసరం. ఈ చూడటం సర్వావస్థలలోనూ జరగాలి. 'ఆధ్యాత్మదృశా పశ్య- ప్రశాంతమనసా- సర్వాస్వవస్థాస్వపి'.

''బ్రహ్మ భూతః ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి''.

''తత్‌ ప్రసాదాత్‌ పరాంశాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్‌''.

సంకల్ప వికల్పాత్మకమైన బుద్ధి ప్రశమించినంతనే- బ్రహ్మపదార్ధంలో లీనమైపోయే 'తూష్ణీమవస్థ' ఏర్పడుతుంది. ఈ తూష్ణీస్థితియే మహామౌనం. మహామౌనం అంటే అద్వయ బ్రహ్మానందమే.

మాస్వామి మహావ్రతుడు, మహామౌని.

ఒకపుడు నేను వారివద్దకు వెళ్ళాను. వారు మౌనంలేదు అని పరిచారకులు చెప్పారు. నేను వెళ్ళి నమస్కరించాను. వారి ముఖంలో నన్ను గుర్తించినట్లు ఏవిధమైన చిహ్నమూ కనపడలేదు. 'నేను 6 నెలలక్రిందట వచ్చి తమదర్శనం చేసుకొన్నాను' అన్నాను. 'ఔను చేసుకొన్నావు' అని బదులు చెప్పారు. ఆ ముఖంలో చిరునవ్వు లేదా. ఆ కనులలో నన్ను గుర్తించిన చిహ్నం లేదు. కాష్ఠంవలె వున్నారు, కానీ మాట్లాడుతున్నారు.

మరొకపుడు మద్రాసునుంచి దర్శనార్ధం కంచికి వెళ్ళాను. సాయంత్రం 4.30 గంటలకు మఠం చేరుకొన్నాను. మాకు కడపటి బస్‌, తిరిగి రావడానికి 6.15 కేమో ఉంది.

5.30 గంటలకు స్వాములవారు బయటకు దర్శనమివ్వడానికి వచ్చారు. నేను దర్శనం చేసుకొని 'నేను శెలవు తీసుకొంటాను' అన్నాను. ఆయన బదులు చెప్పలేదు. ఇంకో 5 నిముషాలకు యం.యస్‌. సుబ్బలక్ష్మి ప్రసిద్ధ దాక్షిణాత్య గాయకి, సదాశివన్‌ వచ్చి స్వాములవారికి నమస్కరించి, తులసీ. బిల్వమాలలు అర్పించి, 5 నిముషాలు వుండి వెళ్ళినారు. ఇంతలో కొందరు స్వాములను దర్శనం చేసుకొంటున్నారు. నాకు బస్సుకు టైమ్‌ ఔతున్నది. 5.45 ఐంది. నేను మళ్ళీ వెళ్ళి స్వాములవారిని చూచి, 'నేను శెలవు తీసుకొంటాను' అన్నాను. ఆయన నాప్రక్క తిరిగికూడ చూడలేదు.

జనసంచారం జాస్తి ఐంది. గడియారంముల్లు వేగంగా తిరిగితున్నది. 6 గంటలయింది. స్వాములవారు లేచారు ఆసనం నుంచి. ఇప్పటికయినా ఈయన అనుగ్రహించి శెలవిస్తే నేను 6.15 బస్సు అందుకోగలనని ఆశ వుంది.స్వాములు తమ గదివైపు వెళుతున్నారు.ఎలాగో 'గోష్పదీకృతవారాశిం' అన్నట్లు ఒక గంతువేసి స్వాములవారి చెవిలో- 'నేను శెలవు తీసుకోనా?' అన్నాను. ఇది మూడోమారు, వీడ్కోలుకోసం నేను గింజుకోవటం!

ఆయన నా వైపు నిదానంగాచూచి, ''నీవు ఈరాత్రి ఇక్కడే ఉండు.'' అని అన్నారు.

స్వాములవారు నాకు ఇదివఱకే ఒక ఉపదేశమిచ్చారు. 'నీవు జీవితంలో దేనినీ తీవ్రంగా తీసుకోకు. అట్లా ఈశ్వరప్రవాహంలో తేలిపో!' అని.

నెమ్మదిగా ఈశ్వరప్రవాహంలో తేలడానికి ప్రారంభించాను. అద్వైతులకు దేశకాలవర్తమానాదులు లేవు. వాళ్ళకొక టైంటేబిల్‌ అన్నమాట లేదు!

ఇక్కడ ఒకకథ జ్ఞాపకమొస్తున్నది. స్వామి వివేకానంద ఒకపుడు కాలిఫోర్నియాలో 3గంటలకు కృష్ణనిపై ప్రసంగం చేయవలసి వచ్చింది. ఈ సభ ఆలైన్‌ అనే ఆయన ఏర్పాటు చేశాడు. 3.30 గంటలైనా స్వామి పత్తాలేడు. వీధికొనవఱకు 5మార్లు ఆల్లెన్‌ వెళ్ళివచ్చాడు. 6వ మారు పోయేసరికి వివేకానందులు సింహ గమనంతో మెల్లగా వస్తున్నారు. ''స్వామీ! ఎంత ఆలస్యంగా వచ్చారు. మీకోసం సభికులు అరగంటగా కాచుకొని వున్నారు. త్వరపడండి!'' అన్నాడు.

''నాకు ఆలస్యం అన్నమాట లేదు ఆల్లెన్‌! నాకు ప్రపంచంలో కావలసినంత వ్యవధీ, కాలమూ ఉన్నది''.

''మీరు ఆవిధంగా అనుకోవచ్చుకానీ సభికులు అట్లా అనుకోవటంలేదు. కొంచెం త్వరపడండి'' అని ప్రార్ధించాడు.

వివేకానందులు వారి ధోరణిలోనే నిదానంగా నడుస్తున్నారు. త్రోవలో బూట్సు తుడిచేవాడు కనపడ్డాడు. తీరికగా కూర్చుని.

వివేకానందులు తమ బూట్స్‌ను వానిదగ్గరఇచ్చి అవి ముఖం ప్రతిఫలించేటట్లు పాలిష్‌ చేయించుకొన్నారు.

ఆల్లెన్‌ కాలుకాలిన పిల్లివలె తిరుగుతున్నాడు- వివేకానందులు 'అనంతంలో' వుండవచ్చును; ఆల్లన్‌ సభికులకు ఎట్లా సర్దిచెప్పేది ఏనే ఆందోళనతో ఉన్నాడు.

ఉత్తిష్ఠత జాగృత

ప్రాప్యవరాన్ని బోధత-

లే. మేల్కో. పొందవలసినదీ, చేరవలసిన గమ్యం గూర్చి తెలుసుకో- ఇదీవారి బోధ. లౌకిక నిబంధనలకు వారు ఎట్లా తలవంచుతారు?

అరగంట సేపు ఆలస్యమైనా అనర్గళంగా ఉపన్యసించి శ్రోతలను ఉత్తేజితులను చేశారు. సింహంలాంటి వ్యక్తిత్వం వివేకానందులది.

ఇది ఎందుకు చెప్పానంటే- ఈ మహాత్ములంతా కాలాతీతులని.

నేను మఠంలో ఈశ్వర ప్రవాహంలో తేలుతూ కూర్చుని వున్నాను, నిమ్మళంగా.

మఠంవాళ్ళు బయటి గేటు మూసారు. 6.15కు యం.యస్‌. సుబ్బలక్ష్మీ- ఆమెతోబాటు వయలిన్‌ వాయించేవాడు, సదాశివన్‌ మంఠపంలో వచ్చి కూరుచున్నారు. తర్వాత పదినిముషాలకు స్వాములవారు వచ్చారు. ఒక స్థంబమునకు ఆనుకొని కూచున్నారు. నేను వారికి దూరంగా ఉన్న స్థంబం అనుకొని కూచున్నాను. సుబ్బలక్ష్మి పరవశించి పాడింది.

లేచి నిలుచుకొని నమస్కరిస్తూ, తోటకాష్టకం పాడి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం ఆ గాయకి చేసినది.

ఈ సంగీత సభకు హాజరయిన వారు పదిమందికిపైన ఉండరు. పాడుతున్నంతసేపూ స్వాములవారు, పండు ఒలుస్తూనో, అటు ఇటు చూస్తూనో, కళ్ళు మూసుకొనో వున్నారు. ఆ సంగీతాన్ని రసించిన ఛాయ వారి మొగములో ఏకోశాన కనపడలేదు.

ఒక చిన్న దబ్బపండును తన గడ్డంక్రిందా, గొంతు మధ్యాపెట్టి నొక్కుతూ ఉన్నారు. ఈ విధంగా ఒక 5 నిముషాలు చేసినతర్వాత, ఇటూ అటూ చూచి, ఒక చిన్న పిల్లవాడు 4 ఏళ్ళ కుఱ్ఱవాడువుంటే వానిని పిలిచి వానిచేతిలో వేశారు.

మరొకపండు చేతిలోకి తీసుకొన్నారు. దానిని నిదానంగా ఒలిచారు. మొదటి పండుతో ఆడుకొన్నట్టే రెండో దానితోనూ ఆడుకొన్నారు. ఈ క్రీడ జరుగుతున్నపుడు నేను- 'ఈ పండు ఏ అదృష్టం చేసుకున్నవారికి చెందుతుందో' అని మనసులో అనుకున్నాను.

వెంటనే నావైపుచూచి, నన్ను పిలిచి ఆ పండును నాచేత వేసినారు!

నాకు ఒక వంక సంతోషం; మరొకవంక- మనం ఎందుకు ఈ విధంగా అనుకొన్నాము. అన్న కించ కలిగింది. మహాత్ములముందు మెలగటం అసిధారావ్రతమే మరి!

ఒక ముత్తైదువకు కల వచ్చింది. అందులో ఆమెకు కృష్ణదర్శనమయినది. భక్తురాలు కనుక చాల సంతోషపడినది. స్వాములవారిని దర్శించడానికి వెళ్ళినపుడు- ఆమె స్వాములవారికి తన స్వప్నదృశ్య వృత్తాంతం చెప్పేముందే- ''ఆ చెప్పు. చెప్పు. కృష్ణుడెట్లున్నాడు? కువలయదళనీలం'' అని అన్నారు. ఈమె స్వప్నం స్వామికెట్లా తెలిసింది?

స్థూలదేహము భోగైక సాధనము. దమేద్రియయుతము. ఇది మూర్ఛితమై పడియుండగా స్వప్నావస్థ ఏర్పడుతున్నది. అందున్నది స్వప్న దేహము. అది సూక్ష్మ భుక్‌. తస్కరమృగాదులను చూచి ఆదేహము భయపడుతున్నది. స్వప్నదశలో ఆత్మ వాసనామయములైన అభిమతవిషయముల పెక్కింటిని దర్శించును. జాగ్రదావస్థలోని విషయ ప్రభావముచే స్వప్నములు ఏర్పడుచున్నవి.

స్వకీయమైన స్వప్నవృత్తాంతం నేనొకటి వ్రాయవలసి ఉన్నది. స్వాములవారు ఇలయాత్తం గుడిలో ఉన్నారు. ఇలయాత్తం గుడిలో స్వాములవారి పరమేష్ఠి గురువు విరతినొందినచోటు. 1961-1962 ప్రాంతంలో నేను వారి దర్శనార్ధం వెళ్ళాను. స్వాములవారు ఎక్కడాకనబడలేదు. వారి మకాం వెనుక, ఒక మామిడితోపు- చూతవనమున్నది. అక్కడచూస్తే స్వాములవారు కాలుపై కాలువేసుకొని ఒక మామిడిగున్న క్రింద చెట్టును ఆనుకొని పడుకొని ఉన్నారు. వారి ప్రక్క ఇద్దరు పసిబాలురు విద్యార్థులు సంస్కృత శబ్దములు వల్లె వేస్తున్నారు. స్వాములవారు వారు చెప్పేదివింటూ వారిని వలసినచోట- సవరిస్తున్నారు అదే బ్రహ్మసూత్ర భాష్య పాఠంవలె.

పూజానంతరం ప్రసాదాలు తీసుకొని బయలుదేరాం. మధ్యాహ్నం రెండు మూడు గంటలయింది. బస్సులో మేము దంపతులం ప్రయాణం చేస్తున్నాం. మాకు ఒకే సమయంలో కొంచెం తూగం వచ్చినది. మాకిద్దరికి ¸°గపద్యంగా రెండు నిముషాలసేపు స్వప్నంవచ్చి ఒకేసమయంలో మేల్కొన్నాం. స్వాములవారు మాకిరువురికీ కలలో కనపడి ఆశీర్వదించారు.

స్వాములవారు 1963లో రామేశ్వరంలో వున్నారు. ఆరోజు ఆయన జయంతివారి పూర్వాశ్రమం సోదరుడు, తమిళ 'జగద్గురు దివ్యచరిత్ర' గ్రంధకర్త శ్రీ సాంబశివమూర్తిశాస్త్రి మఠంలో మ్యానేజరుగా వున్నారు. చూపులకు స్వాములవారిలాగే ఆయన ఉంటారు. ఆయనకు అపుడు కాళ్ళనొప్పులు. నొప్పులకు వేడినీళ్ళతో వైద్యం చేసుకొంటున్నారు.

''నాకు ఈమారు స్వాములవారి వద్దనుండే సమిష్ఠిప్రసాదం తీసివ్వండి. ఇంటికివెళ్ళితే చాలమందికి పంచిపెట్టాలి'' అన్నాను. ఆయన సరే నేను స్వాములతో చెప్పి తీసిస్తాను అని అన్నారు.

తీరా స్వాములవారి దర్శనానికి వెళ్ళినపుడు ఆయన కనపడలేదు; ఏదో కార్యవ్యగ్రులై వుంటారు.

స్వాములవారు మమ్ములను చూడగానే, 3 చెక్కతట్టలలో ఉన్న విభూతి కుంకుమ ద్రాక్ష- సమిష్ఠి ప్రసాదం తమంతట తమ హస్తములతో తాకి మా ముందుకు త్రోసారు. మేము ఆశ్చర్యచకితులమయ్యాం. పిమ్మట సాంబమూర్తిశాస్త్రిగారికి ఈ విషయం చెప్పగా ముక్కుపై వ్రేలు వేసుకున్నారు!

స్వాములవారు అన్ని విషయములలో నిర్లిప్తులు.

'తుల్యనిందా స్తతిర్మేనీ సంతుష్ఠో ఏనకేనచిత్‌' - అన్న గీతా వాక్యానికి అచ్చం ప్రతీక. ఎద్దుపై వానకురిస్తే అది ఎలావుంటుందో అలా వుంటారు.

ఎవరో ఒక పాత్రికేయుడు స్వాములవారిని దర్శించి- మిమ్ములను ఇంటర్వూచేసి కొన్ని ప్రశ్నలు వేయాలని వున్నాను. మీరు అంగీకరించవలసినదని అన్నాడట. ఆయన అన్నారట- ''నీకు వీలయినపుడు నీవురా నాకు వీలుంటే, మూడ్‌ వుంటే నీవు అడిగినదానికి బదులు చెప్తాను. నేను అట్లా చెప్పితే నీవు అదే భాగ్యమని అనుకో. అట్లా అవకాశం లేక నేను నీకు ఏమీ చెప్పలేకపోయానా అదీ పరమభాగ్యమని భావించు!''

ఆంధ్రదేశంలో శ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి అనే పండితులు, తపస్సంపన్నులూ ఉన్నారు. వారికి లోకంలో జరిగే అనాచారాన్ని చూచి చాలవిషాదం వేసింది. 'ఇటువంటి లోకంలో వుండేదానికంటే ఏకృష్ణలోనైనా పడి చావటంమేలు' అన్న అభిప్రాయం తోచేదట. ఈ అభిప్రాయం ఆయన మస్తిష్కంలో మెదిలేటపుడెల్లా స్వాములవారు ఆయనకు దృష్టి గోచరులయ్యేవారట. ఇట్లా నాలుగైదు సార్లు జరిగింది. ఆయన తన ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకొన్నారు.

ఒకమారు ఆయన స్వాములవారి దర్శనార్ధం వెళ్ళారు. ఆయన్ను చూడగానే స్వాములవారు, 'మీ సమస్య ఎంతవరకూ వచ్చింది' అని అడిగారట.

''ఏ సమస్య?''

''మీరు చేసుకోదలచిన ఆత్మహత్య సమస్య''

రాఘవనారాయణ శాస్త్రులు, ''ఆ సమస్య తానంతట తీరిపోయింది మీ అనుగ్రహంచేత'' - అని అన్నారట!

స్వాములవారు ఆయనకు ఒక శాలువకప్పి- 'మీకు ఏ అనాచారమూ అంటనట్లు ఈ శాలువ కప్పుతున్నాను' అని చిరునవ్వుతో అన్నారట!

యదాచర్మవదాకాశం వేష్ట యిష్యంతిమానవాః

తదాదేవం అవిజ్ఞాయ దుఃఖస్యాంతం భవిష్యతి

ఎప్పుడయితే మానవుడు ఆకాశాన్ని చుట్టవలె చుట్టగలడో అప్పుడే దైవజ్ఞానం కలుగుకుండా దుఃఖం ఉపశమిస్తుంది. దుఃఖోపరితికీ, సుఖానుభూతికీ మార్గం దేవుణ్ణి తెలుసుకోవటమే. ఆ దేవుణ్ణి దేశికుడే నిర్దేశిస్తాడు.

కావ్యేషు నాటకం రమ్యం తత్రరమ్యాశకుంతలా-

కావ్యాలలో సుందరమైనది నాటకం. అట్టి నాటకములలో రమ్యమైనది శకుంతల కాళిదాసు దుష్యంతునినోట- ఈ శ్లోకం పలికిస్తాడు శాకుంతలంలో;

రమ్యాణి వీక్ష్యమధురాంశ్చనిశమ్యశబ్దాన్‌

పర్యుత్సకీ భవతి యత్సు ఖితోపిజంతుః

తచ్చేతసాస్మరతి నూన మబోధ పూర్వమ్‌

భావస్థిరాణి జననాంతర సౌహృదాని.

రమ్యమైన దృశ్యాన్ని చూచినా, మధురమైన శబ్దమునువిన్నా, సుఖమైన జనుడు తనకు తెలియని ఉద్వేగం చెందుతాడు. ఎందుచేత? బహుశా అతడు జననాంతర అనుబంధాలను స్మరిస్తూ వుండవచ్చు.

లోకంలో ఋణానుబంధమనేది ఒకటి వుంది. ఆ బంధం అనుబంధాలను ఏర్పరుచుంది. దానిని మనం త్రోసివేయలేము. ఉప్పూ, నిప్పూ, ఊరూ, గాలీ, నీరూ, నింగీ- మానవులు అన్నీ మనకు ఈ ఋణానుబంధంతోనే సంప్రాప్తమౌతుంది. ఇది తెలుసుకొంటేనే మనం స్వతంత్రులౌతాం- గహనా కర్మణో గతిః.

దాదాపు ముపై#్ప ఏళ్ళ ముందు నేను స్వాములవారి దర్శనంకోసం లాల్‌ గుడికి వెళ్ళాను. లాల్‌ గుడికి మూడుమైళ్ళ దూరంలో స్వాములవారు మకాం. ఉదయం 4గంటలకు బండినుంచీ దిగి నేను చీకట్లో, జనసందడిలేని బాటలో నడుస్తున్నా. ఇరువైపుల దీర్ఘంగా పెరిగిన టెంకాయ చెట్లు. వరిపొలాలనుంచి గాలి చల్లగా వీస్తోంది. అనతిదూరంలో కావేరి ప్రవహిస్తూ వుంది.

ఈ వాహినికీ, మన జీవనానికీ ఏం భేదం? మనకూ నిలకడలేదు. దానికీ నిలకడలేదు. అనుక్షణం మారుతూ వుంటుంది, ఏదో తెలియని గమ్యానికి అని పరుగు లెత్తుతూ వుంటుంది.

'అతిష్ఠంతీ అనికేతనానాం'

ఈ కావేరికి ఒకచోటు లేదు. ఒక నిలకడలేదు. పరమార్థంలో నాకూ నిలకడ లేదు. ఊరూ లేదు. పేరు లేదు. నేనెవరిని? నేను చూడబోయే సన్యాసీ అనికేతనుడు. ఒకచోట నిలవదు. ఆయన జీవన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు. ఏదో జనాంతర సంసిక్తమై సౌహృదంతో దర్శన పిపాసతో ఆ అమృత ఝరిలో గుక్కెడు నీరు త్రాగుదామని నేను వెళుతున్నాను. చీకట్లో జలజల కావేరి పరుగిడుతోంది; సముద్ర గామినియై, తన ధర్మాన్ని తానుపాటిస్తూ. ఇది ఏనాటి సంబంధం? ఏ కర్మ మమ్ములను, గంగాయమునా సరస్వతులవలె, ఏ కారణంగా, ఏ నిమిత్తము సరిగ్గా ఈ సమయంలో పరస్పర మేళనంకోసం లాక్కొని వస్తున్నది?

గహనాకర్మణో గతిః

ఈ సందర్భంలోనే నేను తమిళంలో ఉన్న వారి అనుగ్రహభాషణల అనువాదం చేయాలని కోరటం, వారు అనుమతించటం, అనువాదాలు ఆంధ్రప్రభలో ధారావాహికగా రావటం, ఆంధ్రదేశంలో వారి బోధవ్యాప్తి కావటం- ఈ అనువాదాలు జగద్గురు బోధలు అన్నపేరిట పది భాగములుగా సాధన గ్రంధమండలి ద్వారా ప్రటింపబడటం ఇవన్నీ తరువాత జరిగిన విషయాలు.

నేను బులుసు సూర్యప్రకాశశాస్త్రి గారికి వ్రాసాను. ఆయన సాధనగ్రంధమండలి వ్యవస్థాపకులు. ఈ అనువాదాలు పత్రికలో వచ్చినవి కానీ పుస్తరూపంగా వచ్చేటప్పుడు వీనికి కొంత సంస్కరణావశ్యకం ఉండవచ్చుననీ, అజ్ఞానవశాత్తు నేనేమయినా తప్పు వ్రాసివుంటే, ఎవరయినా పండితులచేత వానిని దిద్ది పుస్తక ప్రచురణ చేయవలసినదనీ నేను వారికి నా అభిప్రాయం తెలిపాను. ఈ కావ్యానికి వారు వేలూరు శివరామశాస్త్రిగారిని ఎన్నుకున్నారు.

కీర్తిశేషులైన బ్రహ్మశ్రీ వేలూరు శివరామశాస్త్రిగారు, శతావధాని. పండిత ప్రకాండుడు. విద్యా తపస్వి. సర్వతోముఖ ప్రతిభాశాలి. వారు కథలు, కథానికలు, నవలలు, నాటకములు, ఆత్మకథలు సృష్టించిన వాగనుశాసనుడు. వారి మేధ సారస్వత వైజ్ఞానిక, వేదాంత వీధులలో పరుగులెత్తగలదు. ఆయనకు ఎన్నో భాషలు తెలుసును. గాంధీగారి ఆత్మకథకై గుజరాతీ చదివిరి. శరచ్చంద్రుని నవలల అనువాదమునకు బెంగాలీలో, విక్టర్‌ క్యూగో Les Miseralols అనువాదార్ధం ఫ్రెంచియందు- అభినివేశమును సంపాదించిరి. వారియందు వ్యుత్పత్తి, ప్రతిభ సమపాళ్ళలో ప్రతిభాసించేది. గొప్ప సాధకుడు. ఉదారుడు, వద్యానుడు. అసూయ ఏమాత్రము లేనివాడు.

ఒక శతావధానంలో, విద్యున్మాలావృత్తంలో వేలూరివారిని- కాశీవర్ణన చేయమన్నారు.

వందేకాశీ మీ శార్ధాంగీం శంభో ర్దేహేసంసక్తాంతాం

జ్ఞానం విద్యాంబుద్ధిం నీతిం- శ్రేయో భూయోభూయోదాతుం-

అని అవధానం శాస్త్రిగారు ప్రారంభించారు.

శాస్త్రిగారికి ఒక సమస్య ఇచ్చారు పూర్తి చేయడానికి.

'అమా యాం సావనశ్య ద్వియతి పరిపూర్ణేందుమ బలా'-

ఒక స్త్రీ అమావాస్యనాడు వియద్వీధిలో పూర్ణచంద్రబింబంలా చూచినదట.

వేలూరివారి సమస్యాపూరణ ఈవిధంగా సాగింది.

సదాకాం తాయా లంకృతమతి విలాసావిరహిణీ

తయోగ్రాసావస్థాం వరహిమరుచేః ప్రేక్ష్యమనసి

ముదం యావత్ప్రాప త్సపది విశదం తావదచిరా

దమాయాం సాపశ్య ద్వియతి పరిపూర్ణేందు మబలా.

ఒక విరహిణి అందంగా అలంకరించుకొని ప్రియునికై నిరీక్షిస్తున్నది. అది చంద్రుడులేని అమావాస్య నిశి. ఆ చీకటిలో వచ్చిన తన ప్రియుని ముఖ చంద్రుణ్ణి హిమరుచిలో చూచి అంతులేని ఆనందం పొందినది.

వేలూరివారి నరసింహస్వామి వర్ణన ఇది;

'ప్రౌ ఢార్క ద్యుతి కోటిపాటల నటారింఛోళికా భాసురో

నిర్ఘాతద్యుతి భిర్నఖైః ప్రకటితా పారోల్లన ద్విక్రమః

దైత్యవ్రాత విభో హిరణ్యాకశిపో ర్వక్షస్థలీ భంజకో

లక్ష్మీజానిరురా రధీ రవతునః శ్రీ నారసింహః ప్రభుః'

మందాక్రాత వృత్తంలో వేలూరివారు చేసిన చంద్రోదయం-

మందాక్రంతో నవకరపుటైః శైలశృంగాణి పశ్చాత్‌

స్పృష్ట్వా వృక్షాన్‌ మృదు కిసలయైః శోభమానాన్‌ మహీయాన్‌

భూమిం స్పృష్ట్వా తదను చ గవాక్షాంతవై రంతరిత్వా

స్త్రీణాం పుంసాం ప్రణయకలహం మోచయామాస చంద్రః

శాస్త్రిగారిది పేదమనస్సు. వారున్న గ్రామములో ఒక రైతు, కుమార్తె పెళ్ళి తలపెట్టి షాహుకారు వద్ద మూడువందల రూపాయలు అప్పు అడిగాడు. ఇస్తానని చెప్పిన షాహుకారు సమయానికి ఎగవేసినాడు. రైతుకు ఏమి చేయడానికీ తోచలేదు. ఈ విషయం శాస్త్రిగారికి తెలిసింది. రైతును పిలిచి జరిగిన విషయం తెలుసుకున్నాడు. తన భార్యను పిలిచి- ''నీ కాసులదండ అతనికి ఈ- అమ్మి పిల్ల పెళ్ళి చేయనీ'' - అని అన్నారు. వేలూరివారి భార్య అట్లాగే ఇచ్చింది. రైతు నేను పెళ్ళికాగానే ఇల్లు అమ్మి అప్పు తీరుస్తానన్నాడు. శాస్త్రిగారు ''నేను ఈ పెళ్ళి చేశానని అనుకో- నీవు డబ్బు తిప్పి ఇవ్వడానికి బాధపడవద్దు'' అని అన్నారట! వారి వదాన్యత అలాంటిది.

శాస్త్రిగారు అపుడపుడూ కొండపైకి నడకకోసం వెళ్ళేవారు. ఆ ప్రాంతంలో ఒక చిరుతపులి ఉండేదట. అది అపుడపుడూ శాస్త్రిగారికి తన దర్శనమిచ్చేది. అది దాని దారీ, ఈయన తన త్రోవా చూచుకొనేవారు. ఒకరోజు ఆయన ఒక స్నేహితునితో పోతుంటే- ఆ చిరుత ఉన్నట్టుండి వీరి మధ్యకు వచ్చింది. ఆ స్నేహితుడు- ఏమి చెప్పేదీ తెలియక- టైగర్‌-టైగర్‌- అని హీనస్వరంతో అన్నాడట. శాస్త్రిగారు-

''ఒరేయ్‌ దానికి ఇంగ్లీషురాదు. తెలుగులో మాట్లాడు'' అని అన్నాడట!

వేలూరివారు వాజ్మయమూ, అరవిందుల సారస్వతం చక్కగా చదివినవారు. వారి నిష్ఠ శంరాద్వైతంలోనే మరి.

వీరు చరమదశలో, జగద్గురు బోధల పరిష్కార భారం తమ తలపై వేసుకున్నారు. అందువారు చేసిన కృషికి నేనెన్నటికినీ మరువలేను. నేను మలచిన అనురూపశిలలకు వారు శిల్పవిన్యాసం చేశారు. స్వాములవారు Quote చేసిన శ్లోకాలకు విస్తారంగా టిప్పణి వ్రాస్తారు. స్వాములవారి ఒక్కొక్క ఉపన్యాసమునకు ఒక పెద్ద భాష్యమే వ్రాయవచ్చునని వేలూరివారు నాకొక లేఖలో వ్రాసారు.

స్వాములవారిని వారు కలుసుకున్నట్లు నాకు అనిపించటంలేదు. నేను స్వాములవారి దర్శనార్ధం వెడుతున్నానని వ్రాసినప్పడల్లా, వారు తమ వందనములు స్వాములవారికి నన్ను అందజేయమనేవారు. ఎప్పుడూ దవ్వు రవ్వులతో ఒరిగి నిలిచే స్వభావంకల నాకు స్వాములవారితో వేలూరివారి విషయం చెప్పటానికి అవకాశం లభించలేదు. పుస్తకముఖంగా స్వాములవారికి వేలూరివారి కృషి సుపరిచితమే.

వేలూరివారితో నాకు పరిచయం ప్రప్రథమం 1963లో కలిగింది. సాధన గ్రంథమండలి వ్యవస్థాపకులు బులుసు సూర్యప్రకాశశాస్త్రి నేను తెనిగించిన జగద్గురు బోధల పరిష్కారభారాన్ని శివరామశాస్త్రి నెత్తిమీద పెట్టారు. ఈ విషయం తెలిసిందో లేదో నేను వేలూరి వారి కొక ఉత్తరం వ్రాశాను. ''అయ్యా! మాలదాసరి కథను వ్రాసిన మహానుభావులు మీరేనా?'' అని.

మాలదాసరికథ విష్ణుచిత్తీయంలో వస్తుంది. శాస్త్రిగారు దానిని వచనంలో ఎప్పుడో భారతిలో ప్రకటించినట్లు గుర్తు. పరిచయానికి ఏదో వాజ్యం కావాలి. కానీ శాస్త్రిగారు పిడుగులాంటి జాబు మరు టపాలో వస్తుందని మాత్రం నేను ఎదురుచూడలేదు.

''తమ చీటీ చూచితిని. మాలదాసరి కథ పునఃకథనము చేసినది నేనే. కాని ఆ కథ ఊహించియో జరిగిన దెఱిగియో రచించిన ప్రథమ కవి హృదయమెంత భక్తి కవితా భరితమో? ఆ మహత్త్వమా మహాత్మునిది.''

ఈ జాబుతో మా స్నేహానికి నాందీవాక్యమైనది. ఆ తర్వాత నేను వ్రాయటమూ, వారు బదులు వ్రాయటమూ జరిగినది.

శాస్త్రిగారు ఏదో-'అస్త్యుత్తర స్యాందిశిదేవతాత్మా, హిమాలయోనామనగాధిరాజః' అన్నట్టు హిమవచ్ఛృంగంలా వుండేవారు. వారిది Rarefied intellectual heights నేను ధూళిలో, తొక్కపలుకులు పలుకుతూ ఆడుకొంటున్న శిశుప్రాయుణ్ణి. కాని శాస్త్రిగారు దిగివచ్చేవారు నా లెవల్‌కు. వారి సమత్వం అలాంటిది. నా వ్యాసాలు చదువుతూవుంటే శాస్త్రిగారికి సందేహాలు వచ్చేవి! దీనితో నా పాండిత్యం అర్ధం కాగలదు. నన్ను అప్పుడప్పుడూ ఉడికిస్తూ శాస్త్రులవారు ఎకసెక్కలాడేవారు. ఒక ఉత్తరంలో..............

''శర్మగారూ! మీరు రివైజ్‌చేసి పంపిన వ్యాసాన్ని చూచాను. నాబోటి సంకాదీక్షితునకు యథాతధా మధురోక్తులుగానే వున్నవి. ఓల్డ్‌ వైన్‌ ఇన్‌ న్యూ బాటిల్స్‌. జీవుడు కామంవల్ల దేహంతాల్చి కష్టాలనుభవిస్తున్నాడు లేక ప్రాణమ్మీదికి తెచ్చుకొంటున్నాడు అని ఔతుంది యోగవాసిస్ఠంలో-

అన్యేనరచితో దేహో యక్షే ణాన్యేన చాశ్రితః

దుఃఖమన్యస్య భోక్తా న్యశ్చిత్రేయం విషచక్రికా-

క|| ఒకడు మెయి చేకూర్చె, మ

ఱొక్క పిశాచంబు దాన నునికి గొనియె,

వేఱొక్క నిది పంత, వంతం బొక్కెడు

నింకొకడు వెఱ్ఱి మొఱి చక్రమహో.

(ఇట్లా) ఉపన్యాసాలలో కొన్ని సైకిక్‌ గాప్స్‌ తప్పవు. ఈ ఉపన్యాసములో స్వాములవారు కాముని కాల్చటమూ, కాలుని కాలదన్నటమూ ఉద్దేశించి, దానికి సరిపడేటట్లు భావసౌధం కట్టమొదలెట్టారు. శ్రీవారి ఉపన్యాసాలు పెక్కింట డినౌన్‌మెంట్‌ ముందే యోచించి, నిలువలో వుంచి, రూడిమెంట్‌ వేసి క్లయిమాక్స్‌ చక్రం త్రిప్పటం కద్దు. వారుచేసిన మాతాపితృ ప్రసారం ఎంతో అబ్బురంగా వుంది. ప్రపథమంగా అచ్చుకు మీరు దానిని అందించడం చాల గ్రాండ్‌గా వుంది.''

శాస్త్రిగారిది మధురస్వభావం. వారిది రసప్రకృతి. వేలు చూపితే హస్తం దిగమింగే ఘటికుడు. నేను ఏమి వ్రాసానో గుర్తులేదు. బహుశా, ''మీరు తెలంగాణ్యులైతే కావచ్చు. మాముఱికి నాటి వారిని మాత్రం చిన్నచూపు చూడకండి'' అని ఉంటుంది. ఠపీమని వెంటనే వారి జవాబు:

''ముఱికినాటివారిని నేను తిట్టానని అనుకుంటారేమో? నేనూ తిట్టలేదు. కేతన్నా తిట్టలేదు. ఆ పేరిలోని ముఱికిని తిట్టగలవారెవరో ఆ ముఱికిని ఉపయోగించుకొన్నారు. కాదు 'ముఱికినాటి వారు మొఱకులు' అని మీరు వ్రాశారా లేదా అని నామీద డామేజ్‌ తెస్తారేమో, అందులోనే వుంది కదా- 'నూఱు పణములు దండువచ్చు' అని, ఏదో ఒక హండ్రెడ్‌ కోయిన్స్‌ ఫైనుకు. ఈ సర్కారులో వాక్స్వాతంత్ర్యం వుంది. అందుకనే కమ్యూనిష్టులు శాసనాలుకూడా పెట్టగలరు. 'అరవవారు పెనపరులు' అని ఆ కాలంలోనే విజ్ఞానేశ్వరుడు (మనువు) అనగూడదు. పెనపరి అంటే పోట్లాడేబుద్ధి కలవాడు లేక భేదం కలిగించే బుద్ధి కలవాడు. శ్రీ రాజగోపాలాచార్యుల వారిని అడగాలి.ఇల్లా అనదగిన వాక్స్వాతంత్యం ఈ డెమోక్రసీలో వుందా లేదా అని. ఉన్నదని అంటే - 'షడ్గుణసైలగాణ్యకః' మా షాడ్గుణ్యాన్ని మీరు కొండాడవచ్చును. మహా మహోపాధ్యాయ - చింతామణి దేశ్‌ముఖులు కంపైల్‌ చేసిన ధర్మశాస్త్రం వాల్యూం ఒకటిలో మా తెలగాణ్యుల గూర్చి చాలవున్నది. అయితే మీరున్నూ తెలంగానా వారేమో?

ములకనాడు అనేమాట వ్యావహారికం అని అనుకొంటాను. హంస వింశతిలో-

క|| వెలినాడు వేగినాడను

పులగులనాడ్పాక నాడు పొత్తపినాడున్‌

కల ముఱికి నాడురేనా

డలయక కనుగొంటి నచటి యబలల గంటిన్‌

అని ఉన్నది. వల్లభరాయని పేర శ్రీనాధుడు రచించెనని నే నమ్మిన క్రీదాభిరామంలో ''ములికి నాటిది కాబోలు! చెలికిరాట........'' అని (ములికి-చెలికి) వున్నది. ఈ ములికినాటి లోంచే తెలంగానాలో 'ముల్కీ ముల్కీ' అంటూ ముల్కీ ఉద్యమం లేచి ఆంధ్రులలో ద్వైతం వెలయించింది. హైదరాబాదులో పెనపరితనం బయలుదేరి ఆ నడుమ కొంచెం మండి మళ్ళా ఎప్పుడో మండటానికి నిగురుగప్పి వున్నది. కలకత్తాలో వెనుకటి హిందూ-ముస్లిం ఉద్యమంవలె తీరాచూస్తే ఆ ముస్లిములూ ఒకపుడు హిందువులే. వైష్ణవులూ ఒకపుడు స్మార్తులే. అత్తా ఒకింటి కోడలే. అబ్రహం ఒకపుడు బ్రహ్మమే. పేరులేని ఒక కవి ఒకపుడు ఈలా వ్రాశాడట.

''న కాశీ మక్కావా శివశివ నహిందుర్నయవనః''

''కాశియును లేదు మఱియు మక్కాయులేదు

హరి (ర) హరీ (రా) హిందువునుగాడు తురకకాడు.''

''న సంధ్యాం సంధత్తే నియమిత నమాజుం న కురుతే

నవమౌంజీ బంధం కలయతి నవా సున్నత విధిం

నరోజాం జానీతే వ్రతమసి హరేర్నైవ కురుతే''

''సంజు లేదు సమాజులో శ్రద్ధలేదు

సరవినే కాని లేదు రంజాను లేదు.''

'మురికి' కాదు 'ములికి' కాదు; మరి ములకనాడే, ఆనాడు. ఎందుచేతనంటే ములకచెట్లు బాగా మొలిచి కాసేదానాడు. కాబట్టి దానికి ములకనాడని పేరు వచ్చింది. అని derive చేసి చూచినవారు లేకపోబట్టి కేతన్నగారి కాలంనుంచీ ఉండిన ముఱికి ములకగా మార్పరానిదైంది.''

ఈ విధంగా 'ముఱికి' నాటి వారిపై ఒక శాస్త్రమే శాస్త్రులవారు వ్రాశారు!

వారి ఉత్తరాలు ఈలా అనాయాసంగా కబుర్లు చెప్పుకుంటూ, జోక్సు విసురుతూ సాహిత్యసింహావలోకనం చేయించేవి. శాస్త్రిగారికి వైదుష్య మెంతనో, దర్పమూ దానిని మించినది కాని హ్యమిలిటి మాత్రం వారి ఐడియల్‌ ఒకచోట.

''నన్ను పలువురు నిందింతురు. పలువురు స్తుతింతురు. ఈ రెండవ వారిలో సాక్షాత్తు ఎరుగని వారు ఎక్కువగా కొండాడుదురు. 29-5-63 నాటి సచిత్ర వారపత్రిక ఆంధ్రప్రభ నాకు బొమ్మకట్టి నిందించినంతగా అభినందించినది. పాపము దూరపుకొండలు నునుపు. నా అజ్ఞానము వారరయరు. నా మంచితనమే వారి కెరుక. ఆహా! మనుష్యుడు సహజముగా ఎంత మంచివాడు!! కాని,

నాకు నాకే సిగ్గయ్యీని నన్ను జూచి కొంటేను

చేకొని నీవే మన్నించ జెయ్యొగ్గే గాని- (అన్నమాచార్యులు)

అని చెప్పిన కవి నాకు స్పోక్స్‌మన్‌ అధివక్త. ఇంతేకాక ధూమపాయిత్వములో గిరీశంగారి గురుత్వము నంగీకరింపలేదు. మరి చంద్రశేఖర శతకములోని వారి శిష్యత్వమే స్వీకరించితిని.

ఉ|| సీదగిడీల బావల పసిద్ధి సరే పొగనిప్పు కంట సో

మాదుగు లింటికోయి బతిమాలితి మూడు నెగళ్ళు మండుతై

లేదని తిట్టె బాపపు గలిగ్గము ఇంత పరాక? దాంట్లో యీ

రాదట! యంద్రసహ్యులు దుర్మాతులు మూర్ఖులు చంద్రశేఖరా!

[సోమాదుగులు=సౌమయాజులు; మూడునెగళ్ళు=గార్హపత్య! అహవనీయ దక్షణాగ్నులు=త్రేతాగ్నులు; కలిగ్గము= కలియుగము.

శాస్త్రిగారికి సాహిత్యంపై ఎంత ఆపేక్షనో తోటి కవులపై కూడా అంత మర్యాద, అభిమానమూ, ప్రేమ, కాటూరివారు కామకోటి శంకరాచార్యులపై షష్ఠ్యంతాలు వ్రాశారు. దానిలో ఒకపద్యంలో యతిపోయింది. శాస్త్రిగారు;

''మా కాటూరి పద్యం చివరి పాదంలో యతి పోయింది. యతుల దగ్గరనే యతిపోతే ఎట్లా? కీర్తిశేషుడై నాకు దారిచూపిన అతనిని నెనిట్లా అనవచ్చునా? ఐతే శబ్ద విషయంలో శంకరుడైనా, కింకరుడైనా ఒకటే కదా!'' అని చమత్కరించారు. పాండ్యదేశంలో ఒకపుడు క్షామం వస్తే శివుడు తన ఆలయ పూజారికి ఒక పద్యం వ్రాసి యిస్తాడు రాజసభలో చదవమని.అతడు దానిని తీసికొనిపోయి చదివితే నత్కీరుడు ఆక్షేపిస్తాడు. పూజారి పండితుడుకాడు కనుక మళ్ళా ఆలయానికి వచ్చి శంకరునితో మొరపెట్టుకుంటాడు. అంతటితో శంకరుడే రాజసభకు వచ్చి, నత్కీరునికి తన అభిజ్ఞను చూపటానికి మూడవకన్ను కనపడేటట్టు చేస్తాడు. నత్కీరుడు తలచుట్టూ కన్నులున్నా పద్యమేమో తప్పే అని వారిస్తాడు. శాస్త్రిగారి విసురు నత్కీరుని పోకడను గుర్తుకు తెస్తుంది.

శాస్త్రిగారికి రానురాను ఆరోగ్యం బాగా చితికిపోయింది. కానీ వారేమో నిర్విచారంగా క్షేత్రజ్ఞుడిలా కూర్చుని ఆ దేహం వేసే వెర్రి ఎత్తులను చూస్తూ పరియాచకాలు ఆడుతూనే వున్నారు. కొన్నిరోజులు తాను ఉత్తరాలు వ్రాయలేననీ, నన్ను మాత్రం నిర్విరామంగా వ్రాయమనీ ఆదేశించారు. రోగంతో బాటు బాగా జరాకృశులయ్యారు. ఎప్పుడూ యోగంపై వుండే వారి మనస్సు మరింత ఆధ్యాత్మిక మయం ఐపోయింది. ఈ క్రింది ఉత్తరం వారి చిత్తస్థాయీ, నాకు చేసిన బోధా తెలుపుతుంది.

''ఆశీః మీ చీటీ చూచాను. ఉత్తరం వ్రాయాలనే ఉత్సాహం కూడా చప్పబడిపోయింది. లోపలి వెలుగులో ప్రసారశక్తి తరుగుతూ వస్తూందని, దానికి బదులు సంకోచశక్తి వృద్ధి అవుతూ వుందని ఊహించనక్కరలేదు. అనుభవమే అవుతూవుంది. ¸°వనం నుండి వార్ధకం వరకూ నియతంగా మనోనియమాధికం అభ్యసించకపోతే వచ్చే ఆపదే యిది. మా నాయనగారు వేదమంతా చెప్పుకొన్న కర్మిష్ఠి. తగుపాటి శాస్త్రవాసన వుండేది. వారు నన్ను చూచి అనేవారు-'కావలసింది వేరేవుంది, కావలసింది వేరేవుంది' అని. వారు చెడ్డ ఉపాసకులుకూడా. నేను జ్ఞానపక్షపాతినే కాక భక్తినీ, జపాన్నీ ఈసడించేవాడను. వారు చాల నొచ్చుకొనేవారు. నన్ను ఒప్పింపలేక పెద్ద పెద్ద పండితులు వచ్చినపుడు వారని నామీదికి తోలేవారు. వారు అనేవారు- మాకే ఆయన చెపుతారు. ఆయనకు మేము చెప్పేదేమిటి? అని. ఇలా చాలాకాలం గడిచింది. నేను తోట కొని సాధనలో పడ్డాను. ఒకనాడు హఠాత్తుగా వార్తవచ్చింది. పదిగంటలప్పుడు 'నాయనగారు సంధ్యావనం చేసి పీటమీద కూర్చుండి కొంచెము సెపటికి ఒరిగిపోయా'రని. అదృష్టమంటే అది. ఇపుడు నాకు మనసు చెదిరిపోతుంది. లక్ష్యంలో అనగా నేనులో నిలువదు. అనేక జన్మల పంకంలో తిరుగుతుంది. దారి ఎదురుగా కనపడ్డా తోవ తప్పుతుంది.

చదువులు చదివినా మూర్ఖులు అవుతారు. పనిచేసినవాడే పురుషుడు. ఫలానా మందు ఈ రోగం కుదురుస్తుంది అని తెలిసి మందు పేరు చెప్పినంత మాత్రాన రోగం కుదరదు. ఉపనిషత్తుకూడా ఇలా చెబుతుంది-

ప్రాణాహ్యేషయంసర్వభూతైర్విభాతివిజానన్‌

విద్వాన్‌ భవతే నాతి వాదీ ఆత్మక్రీడాత్మరతిః

క్రియావాన్‌ ఏషబ్రహ్మ విదాంవరిష్టః||

ఆత్మక్రీడ అనగా ధ్యాతృ ధ్యేయ ధ్యాన త్రిపుటిలో- సవికల్ప సమాధి అను క్రియను ఆచరించుట (క్రియావాన్‌) అనేదిన్నీ ''ఆత్మరతిః'' అనగా త్రిపుటిలేని నిర్వికల్పసమాధి అనిన్నీ అందు అనందానుభవము (క్రియావాన్‌) అనేదిన్నీ అని పెద్దలు చెప్పారు. జ్ఞానికి శ్రౌతస్మార్త కర్మలు లేవు. అతడు ఆత్మక్రీడుడు ఆత్మరతుడు. కావున క్రియావాన్‌ అనగా ధ్యానాదులు అని విన్నాను. ఎందుకు నా ఈ గొడవ వ్రాశానంటే మీకుకూడా నలభై రాబోతున్నవి. నేను నలభైకి 10, 12 తక్కువగా వుండగానే సాధన ఆరంభించిన్నీ తదేకపరత్వం లేకపోవడాన సిద్ధుడను కాలేకపోయాను. ఆఖరుకు మరణవేళలో మనస్సు దుర్బలమయి పోదగిన దుఃఖస్థితిలో ఉన్నాను. బాబూ! మీరు జీవికకు చెసే వృత్తి పోను మిగతా కాలమంతా తత్త్వజిజ్ఞాసకు వినియోగం చేయండి అని ప్రార్ధిస్తున్నాను. చేస్తూనే వున్నారు. ఐనా నా పాటును బట్టి చెప్పేమాట.''

భర్తృహరి ఇలా అంటాడు:

ముసలిదనం పెద్దపులిలా ఎదురుగా కూర్చుని బెదిరిస్తున్నది. శతృవుల వలె రోగాలు ప్రహరిస్తున్నవి. చిల్లికుండలో స్రవించినట్లు ప్రాణం నీళ్ళు కారిపోతూ వున్నది. ఐనా లోకం హితం ఏమిటో తెలిసికోకుండా అహితమే ఆచరిస్తున్నది. ఎంత చిత్రం!

ఒకరోజు విన్నాను శాస్త్రిగారు గతించారని. వారి ఆప్యాయత, వారి సౌహార్ద్రం, వారి ధీగరిమ, వారి వాత్సల్యం అంతా జ్ఞప్తికి వచ్చింది. శాస్త్రిగారు ఎక్కడకు వెళ్ళారు? ఏ లోకాలకు నూతన వస్త్రాలను ధరించడానికి వెళ్ళారు? మనస్సు మూగపోయింది. కంఠం చెవిలో---

''రూపం రూపం ప్రతిరూపం బభూవ-'' అని ఊదింది.

నిజానికి మరణం అంటే ఏమి?మరణించిన పిదప మనం ఉంటామా?ఏ లోకాలకు వెళ్ళుతాం? ఎంత కాలానికి తిరిగివస్తాం?

అనుపశ్య యథాపూర్వే ప్రతిపశ్య తధాపరే

సస్యమివ మర్త్య వచ్యతే సస్యమివా zz జాయతేపునః

మన పూర్వులు ఎట్లా ప్రవర్తించారు? ఇతరులు ఎట్లు వ్యవహరిస్తున్నారు? ఒక వరిపొలం ఉదాహరణ. అచిరకాలంలో అది పండుతుంది. దానిని కోసివేస్తాం. మళ్ళా బీజం నాటుతాం. మళ్ళా కోసివేస్తాం. భగవంతుడనే ఒక వ్యవసాయకుడు ఈవిధంగా బీజాలను నాటి పొలాన్ని పండించి, అవిరామంగా కృషిచేస్తూ ఆనందిస్తున్నాడు. ఈ ధాన్యానికీ మనకూ ఏమి భేదం?

మన పూరులలో సత్యసంధతకోసం ఎంతో కష్టపడ్డారు. హరిశ్చంద్రుడు, ధర్మరాజు మొదలైనవారు. ఒక అబద్ధంచెప్పితే సుఖపడేవారు. కానీ అట్టి సుఖంవారు ఆశించలేదు. సత్యం తెచ్చిపెట్టే కష్టాన్నె వారు కోరుకున్నారుకానీ అబద్ధమిచ్చే సుఖాన్ని వారు కోరుకోలేదు.

'ప్రమాదో వై మృత్యరహంబ్రవీమి'. సనత్సు జాతీయంలో సనత్కుమారులు- ప్రమాదం- అజ్ఞానమే మృత్యువు అని దృతరాష్ట్రునకు బోధించారు!

దేహినోస్మిన్‌ యధాదేహీ కౌమారం ¸°వనంజరా

తథా దేహాంతరప్రాప్తి ర్ధీర స్తత్రనముహ్యతి

దేహానికి కౌమారము, ¸°వనము, ముసలితనం ఎట్లో, మరొక్క దేహం పొందటంమూ అట్లే. ధీరుడు చావునుగూర్చి చింతించడు.

నరసింహ భారతీస్వాములు సిద్ధి పొందగానే శివాభినవనరసింహభారతులు చాల విచార పడినారట. ఆయనకు నరసింహ భారతులు స్వప్నంలో కలపడి- 'వెర్రినాయనా! నేనెక్కడకు వెళ్ళాను. నేను నీతోనే ఉన్నానుకదా!' అని అన్నారట.

మనకందరికీ తెలుసు. ఏ రోజో ఒకరోజు మనం కళ్ళుమూసుకొంటామని. షిర్డీ సాయిబాబా మాటల్లో చెప్పితే- ''అల్లా వెలిగించిన దీపం అల్లానే ఆర్పేస్తాడు.'' కానీ మనం గంభీరంగా ఈ విషయాన్నిగూర్చి ఆలోచింపము. అందరికీ మరణభయం వుంది. మృత్యుంజయహోమములు చేస్తాం. మృత్యువును జయిస్తామా?

చావు అనేది లేదు అని తెలుసుకొనటమే 'మృత్యుంజయము'. పాంచభౌతిక దేహం భస్మమవుతుంది కానీ మన విభూతి ఏమాత్రమూ చెడదే?

ఐతే ఈ భీతి ఎక్కడనుంచీ వస్తుంది? జీవునికి ఈ దేహంపై ఎంత అభినివేశం!

'నీకు చావు దాపురించింది' అని అంటే భోజరాజు రామాయణ చంపువును చెప్పాడట! మనలో ఎంతమంది అట్లా చేయగలరు?

చావు దేహానికి సంబంధించినది. ఈ దేహమే నేను అని అనుకోవటంవల్ల ఈ శోకం ఏర్పడుతుంది. చావుపుట్టుకలు అనే ద్వంద్వంలో చిక్కుకొన్నందువలన మనకు ఈభీతీ, అశాంతీ.... ఈ ద్వందంనుంచీ బయటపడటానికి- అద్వైతమే మందు!

అందుకే గీతాచార్యుడు 'ధీరస్తత్రనముహ్యతి' అని అంటున్నాడు.

ఆపదల పరంపరలో చిక్కుకొన్నా ధీరుడు చలించడు. ధీరుణ్ణి విధి ఏవిధంగానైనా కదిలించలేదు. భర్తృహరి అంటాడు;

ఓ మూఢదైవమా! మహాత్ములకు ఆపదకలిగించి వారి ధైర్యశైథిల్యంకోసం నీవు పాటుపడుతున్నావు. ఈ శుష్కప్రయాస విరమించుకో. అది అసాధ్యం. కల్పాంతములోనైనా కుల పర్వతములు కుంగిపోవటమూ, సప్తసముద్రములూ ఎండి పోవటమూ అనేదున్నాదా? వానిమేరలు అవి తప్పవు.

అయిజడవిధే! కల్పాపాయేప్య పేతనిజక్రమా

కులశిఖరిణం క్షద్రా వైతే నవా జలరాశయః ?

శుష్కించి నీరసంగా వుండే మాస్వామి దేహంలో సముద్రంవలె గంభీరంగా, నిశ్చలంగా, ఎంతధైర్యం అణిగివుంది?

యముడు నచికేతుణ్ణి ఎంత ప్రలోభ పరచినా, అతడు లొంగిపోలేదు.

'అతిదీర్ఘే జీవితేకోరమేత?' జీవితం ఎంత పొడిగించినా ఎప్పుడో ఒకరోజు ఈ మాయావిభ్రమ జనకమైన దేహం అంతరించవలసినదే.

కోయమాత్మేతి వయముపాస్మహే- కతరస్స ఆత్మా?

ఎవరినిమనం ఆత్మ అని ఉపాసిస్తున్నాం. ఏది ఆత్మ?

యేనవా రూపంపశ్యతి యేనవా శబ్దం శృణోతి, యేనవా

గంధాన్‌ జిఘ్రతి, యేనవా వాచం వ్యాకరోతి, యేనస్వాదు

చాస్వాదచ విజానాతి-

యదేతద్ధృదయం మనశ్చేతత్‌ సంజ్ఞానమాజ్ఞానం

విజ్ఞానం ప్రజ్ఞానం మేధాదృష్టి ర్ధృతి ర్మతిర్మనీషా

జూతిస్మృతి సంకల్పం క్రతురసుః కామోవశ- ఇతి సర్వా

ణ్యవై తానిప్రజ్ఞా నస్యనామధేయాని భవన్తి.

సర్వం తత్ప్రజ్ఞానేత్రం- ప్రజ్ఞానే ప్రతిష్ఠితం

ప్రజ్ఞాత్రోలోకః ప్రజ్ఞా ప్రతిష్ఠా

ప్రజ్ఞానం బ్రహ్మ- (ఐతరేయ ఉపనిషత్తు)

మనం దేనితో చూస్తామో, వింటామో, వాసనలను గ్రహిస్తామో, పలుకుతామో, రసిస్తామో ఇవన్నీ హృదయం, మనస్సు- అవే జ్ఞానము, అజ్ఞానము, ప్రజ్ఞానము, మేధదృష్టి, ధృతి, మతి, స్మృతి, సంకల్పాదులు. ఇవన్నీ ప్రజ్ఞానమునకు నామధేయములే. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ బ్రహ్మ చైతన్యమే బ్రహ్మ, ఇంద్రుడు, ప్రజాపతి, తక్కిన దేవతానీకమూ; పంచభూతములూ, బీజమూ, జరాయుజ, అండజములూ, ఉద్భిజములూ, చరాచరములూ. సర్వమూ అదే.

ఈ బ్రహ్మమును తెలుసుకొన్నవాడు- అమృతస్సమభవతి.- అమృతత్వమును అందుకొంటాడు- వానికి ఒక్కనికే మరణభయంలేదు. ఇతరులందరూ మృత్యుదంష్ట్రాగ్రస్తులే.

ఈ దేహం బ్రహ్మపురి. ఈ బ్రహ్మపురిలో హృదయ పద్మం ఉన్నది- దానినే హృత్పుండరీకం అని అంటారు. అదే సత్యలోకం. దేహాన్నీ, దేహశక్తులను పాలిస్తూ నియామకంచేస్తూ అందులో ప్రాణబ్రహ్మమున్నాడు. ఈ పుండరీకానికి ఐదు ద్వారాలు. ప్రాక్‌, పశ్చిమ, ఉదీచీ, దక్షిణోర్ధ్వములు- వీనిని చూస్తూ పంచబ్రహ్మపురుషుడున్నాడు.

ఏదో ఒక్కవిషయం మనం పట్టుకోవాలి. ఆ 'ఏకబ్రహ్మ'ను మనం వదలరాదు. త్రికాలావస్థలలోను దానితో మనం ఐక్యం కావటానికి ప్రయత్నించాలి. ఆధారణ తైలధారవత్‌ ఉండాలి. వేరే విషయం. మధ్యలో కావాలి. అదే ఉపాసన, అధ్యయనం, విద్య, దర్శనం, విజ్ఞానం- దానిని ఏ పేరుతో పిలిచినా సరే.

సర్వం ఖల్విదం బ్రహ్మ. తజ్జలానికి శాంత ఉపాసీత.అంతా బ్రహ్మమే.వానిలోనుంచి సర్వమూ పుట్టి, పెరిగి అస్తంగతమౌతున్నాయి. ఈ పుట్టేదానినీ పోయేదానినీ చూడకుండా,శాంతంగా కూచో. అదే ఉపాసన.

మనోబ్రహ్మేతి ఉపాసీత- మనస్సే బ్రహ్మ. దానిని ఉపాసించు. ఈ ఉదయిస్తున్న ఆదిత్యుడు బ్రహ్మ- ఆ ఆదిత్యుణ్ణి ఉపాసనచేసి బ్రహ్మనిష్ఠుడవుకమ్ము.

సర్వమూ బ్రహ్మమైనపుడు ఏ భావంతో బ్రహ్మను భావిస్తామో ఆ భావమే బ్రహ్మమైపోతుంది.

ధ్యానమూ బ్రహ్మమే. భూమీ, ఆకాశము, కొండలూ, అన్నీ ధ్యానం చేస్తాయి. దేవతలూ, మనుష్యులూ ధ్యానిస్తారు. ఏ కించిత్‌ మహత్వమున్నా అది ధ్యానలబ్ధమే.

విజ్ఞానం ధ్యానంకన్న గొప్ప. విజ్ఞానంచేత చతుర్వేదములు, ఇతిహాస పురాణవ్యాకరణములు మనం అధ్యయనం చేస్తాం. అర్ధం చేసుకొంటాం. ఇంకా ఎన్నో విద్యలున్నవి. ఇవన్నీ విజ్ఞానంచేతనే లభిస్తవి.

విజ్ఞానంకంటే బలం గొప్ప.ఈ శక్తి చేతనేకదా భూమిస్థిరంగా వుండటం,సముద్రాలు పొంగటం,గాలివీచటం, మేఘాలు గర్జించటం? క్రిమికీటకాలు, పక్షులు, మృగాలు, మనుష్యులు- అందరూ, అన్నీ ఈ శక్తిపైన ఆధారపడే కదా జీవిస్తున్నది?

ఇట్లా చూస్తూపోతే బ్రహ్మపదార్ధములు బ్రహ్మ సూచకములు ఎన్నోవున్నాయి. అన్నం, తేజస్సు, ఆకాశం, స్మృతి, ఆశ అన్నీ బ్రహ్మమే. ఇవన్నీ ఏకంగానీ, సమిష్ఠిగానూ బ్రహ్మమే- అదే భూమి.

యోవైభూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి అని ఛాందోగ్యము ఈ భూమావిద్యనే చెప్పుతున్నది.

మాస్వామిని చూస్తూ నడుస్తున్న బ్రుహ్మపదార్ధం అని అనిపిస్తుంది. ఈమధ్య ఒకమారు నవరాత్రులపుడు వెళ్ళాను. మద్రాసులో ఉన్న గాయకులందరూ స్వాములవారి చుట్టూ మూగారు. సాయంత్రం 4.30 గంటలకు ఆయన వేదికపై కూర్చున్నారు. కనీసం మూడువందల గాయకులు, వైణికులు, నోటిపాటవారు, వయలిన్‌ వాయించేవారు ఏకకంఠంతో- జగదానందకారకా అని పాడారు. ఆయన నిశ్చలగా కూర్చున్నారు. 'యస్యానందో నిరంతరః' ఆయనకు పాట ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. యఃసచిత్తో నిశ్చితః- ఆయనకు చిత్తంవున్నా నిశ్చితుడు. 'నమేకర్మాణిలింపంతి నమ్మేకర్మ ఫలేస్పృహా' అంటూ వారు కూర్చుని వున్నారు.

ఈ సంగీత కచ్చేరికి వచ్చేమందు దక్షిణ దేశంలోని వేదపాఠశాలలనుంచి వేదాధ్యయనంచేసే బ్రహ్మచారులు దాదాపు 100 మంది వచ్చారు. వానిలో ఒక్కొక్కడూ ప్రవరచెప్పి నమస్కరిస్తే ఒక్కొక్కనికీ తమ స్వహస్తాలతో, ఫల వస్త్రములను వారు బహూకరించారు. వారిదేహం జరాఝర్జిరితమైవుంది. ఆ ముసలి గుఱ్ఱాన్ని వారు ఇంకా తోలుతూనే ఉన్నారు. వారి కార్యక్రమంలో ఏ మాత్రమూ మార్పులేదు.

నిరాలంబో పనిషత్తు అంటుంది;

''సర్వశరీ రస్థ చైతన్యబ్రహ్మప్రాపకో గురురుపాస్యః''-

ఎవరైతే నీకు నీ చైతన్యాన్ని అవగతం చేస్తాడో,సర్వభూత చైతన్యరూపక విష్ణుదర్శనం చేయిస్తాడో అట్టి గురువుయొక్క పాదాశ్రయం నీవుచేయాలి- 'సర్వ దుఃఖ వినిర్ముక్తైక చైతన్యాత్మకోహం' అన్న ఆత్మానుభవం కలుగచేసే గురువును ఉపాసించు.

చరణం పవిత్రం వితతం పురాణమ్‌

యేన పూతస్తరతి దుష్కృతాని

తేన పవిత్రేణ శుద్ధేన పూతా-

అతి పాప్మాన మరాతింతరేమ-

మన చైతన్యంలో ఈ ఆనంద ప్రతిష్ఠ జరిగేదెట్లా? దీనికి రెండు ముఖ్యమైన మార్గాలున్నాయి. ఒకటి భక్తి మార్గము. రెండవది జ్ఞానమార్గము.

'పూజ్యేషు అనురాగో భక్తి' శాండిల్యుడు, 'స్వస్యరూపానుసంధానం భక్తి రిత్యభి దీయతే' యని శంకరులు, 'సాత్వస్మిన్‌ పరమప్రేమపూరా' యని నారదులు భక్తిని నిర్వచించినారు. త్యాగరాజులు 'తెలియలేదురామా భక్తిమార్గము' అని కీర్తించాడు. భక్తి అంటే జీవేశ్వరుల సంయోగమే. 'నేను లేదు, ఉన్నది నీవే' అనే భావమే భక్తి. ఈ భావం, ప్రపత్తిద్వారా ఏర్పడుతుంది. తన్ను తాను మరచిపోయి, ఈశ్వరభావంలో ఉండుటయే భక్తి.

''పురుషః సపరః పార్థ భక్త్యాలభ్యస్త్యనన్యయా

యస్యాంతః స్థాని భూతాని యేన సర్వమిదంతతం'' (గీత-8.22)

పురి (అనగా దేహము) లో ఉన్నవాడు పురుషుడు.

అతడు పూర్ణుడు. అనన్యభక్తిచేత అతనిని పొందవచ్చును.

తేషాంజ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే- (గీత 7.17)

జ్ఞానిది ఏకభక్తి. అంటే అతనికి భగవంతుడు తప్ప ఇతరమేదీ లేదు. ఎన్నోజన్మల పిదప జ్ఞాని వాసుదేవస్సర్వమని, ప్రత్యగాత్మ అయిన వాసుదేవుని తెలుసుకొనుచున్నాడు. అట్టి మహాత్ములు అరుదు.

జ్ఞాని ఎట్లు వాసుదేవుని తెలుసుకొంటున్నాడో భక్తుడూ, సమస్త భూతములును ఎవనియందు వెలయుచున్నవో, ఎవనిచే ఈ జగత్తు అంతయూ పరి వ్యాప్తమై యున్నదో- ఆ పరమేశ్వరుని అనన్యమగు భక్తిచేత పొందుతున్నాడు.

ఈ ఏకభక్తినే అనన్యయోగమనీ అంటారు. సర్వకర్మలూ ఆ భగవంతునికి అర్పణం కావాలి.

యత్కరోషి యదశ్నాసి యజ్జుహ్నోసి దదాసి యత్‌-

యత్త పస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్‌ (గీత 9.27)

'నీవు ఏకార్యంచేసినా, దేనిని భుజించినా, దేనిని అగ్నియందు వేల్చినా, దేనిని దానంచేసినా, నిని తపముచేసినా, దానిని నాకర్పితముగ చేయుము. శాస్త్ర సిద్ధములైన కర్మలు, వ్యావహారికకర్మలు- తపోదానహోమములు- సర్వము నా కర్పింపుము'- అని భగవద్వాక్యము.

ఇట్లు సర్వకర్మార్పణ చేసేసరికి- ఇష్టానిష్టమిశ్రితమైన కర్మబంధము మనలను వదలిపెట్టుతుంది.

దక్షిణదేశంలో శైవ నయన్మారులు, వైష్ణవ ఆళ్వారులు,మనదేశంలో విద్యావతి,చండీదాసు, జపుత్రములో మీరబాయి, మహారాష్ట్రలో తుకారామ్‌, రామదాసు, వీళ్ళందరూ అనన్యభక్తి నెరపినవారే. జ్ఞానములేని భక్తీ, భక్తిలేని జ్ఞానమూ వృధా. భక్తిచేస్తేనే మనలను అనుగ్రహం వరిస్తుంది.

''అనుసృత్య అనుసృత్య గృహ్ణాతి- అనుగ్రహం''. మనలను వదలక అనుసరించి, అనుసరించి,వెంటాడి, వెంటాడి పట్టుకునేదే భగవదనుగ్రహం.

శంకరులు అంటారు;

అతోవిముక్తై ప్రయతేత విద్వాన్‌ - సన్యస్త బాహ్యార్ధసుఖసృహఃసన్‌

సంతంమహాన్తం సముపేత్య దేశికం- తేనోప దిష్టార్ధ సమాహితాత్మా.

సంసారము జన్మ జరామరణ పరంపరచేత కూడినది. విముక్తికొరకు పాటుపడే విద్వాంసుడు బాహ్యవిషయ సుఖములకు అనిత్యములనిగ్రహించి వానియందు ఆశను వదులుకోవలెను. ఉత్తముడు, రుడు అయిన గురువు నాశ్రయించి, అతడు ఉపదేశించిన తత్త్వార్ధములలోనూ, సాధనమునందునూ నిరంతర యుక్తుడు కావలెను.

హోవర్డ్‌హ్యూస్‌ అనే అమెరికన్‌ ధనికుడు కోట్లకొలది ధనం సంపాదించాడు. కడపట చనిపోయాడు. అతనిని ఖననం చేయడానికి సిద్ధంగా వున్నారు. అపుడు క్రైస్తవ మతాధికారి రెవరెండ్‌ గిబ్సన్‌- ''ఈ లోకం వచ్చిపుడు మనం మనతో ఏమీ తేవటంలేదు. పోయేటపుడు ఎంత సంపాదించినా అన్నీ వదిలిపోతాం'' అని బైబిల్‌ పాఠం చెప్పారు.

బుద్ధమతంలో నాలుగు మౌలిక సత్యాలను బోధిస్తారు; ప్రేమ, దయ, సంతోషం, శాంతం-

జైనమతము 'అహింసాపరమోధర్మః' అనే పునాదిపై స్థాపింపబడినది. జైనులూ అహింసా, సత్య, మాస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహములు పాటించవలెను.

మహావీరుడు, గౌతముడు అనే శిష్యునికి ఇలా బోధిస్తాడు; (ఈ గౌతముడు, గౌతమబుద్ధుడు కాదు)

''గౌతమ! జీర్ణంపర్ణం చెట్లనుండి ఎట్లా రాలిపోతుందో, మనిషి ప్రాణమూ అట్లాగే దేహాన్ని వదలిపోతుంది. తృణాంకురంపై వున్న జలకణం ఎట్లు క్షణకాలం వుంటుందో, మన ఆయుస్సూ అట్లే. ఈ ప్రపంచంలోని జీవి చక్రంవలె గిరగిర తిరుగుతున్నాడు; మంచి చెడ్డలే కర్మచక్రం. దేహం జీర్ణించి, వెంట్రుకలు తెల్లబడిపోయి, ప్రాణశక్తి మందగించి రుజాశోకములతో జీవి కుంగిపోతున్నాడు. గౌతమ! ఇవన్నీ చూచి జాగ్రత్తపడు. విషయాసక్తి మమత నిర్మూలించు. శరత్కాలంలోని నీటివలె, సరస్సులోని వికచ పద్మంవలె స్వచ్ఛంగా, శుభ్రంగా, నిర్మలంగా జీవితాన్ని గడుపు''.

జైనులలోనూ గొప్ప సంస్కృత కవులున్నారు. 14వ శతాబ్దంలో వున్న న్యాయచంద్రుడు, 'నామూలంలిఖ్యతేకించిత్‌' అని చెప్పుకున్న మల్లినాధుడు- (కాళిదాసు గ్రంధముల వ్యాఖ్యాత) జైనులు.

స్వాములవారు అంటారు; ''ఏదో మూట కట్టుకొని ఈ లోకానికి వచ్చాం. ఈ మూటను ఇక్కడే దులుపుకొని, పాప పుణ్యములకు అతీతంగా మనం భక్తితో భగవదారాధన చేస్తూ వెళ్ళిపోవాలి''.

భక్తి మార్గాన్ని విశిష్ఠద్వైతమునకు చేరిన రామానుజులు ఎంతో ప్రచారంచేశారు. ఆయన శ్రీరంగంలో వుండేవారు. దాదాపు 120 ఏళ్ళు కీ.శ 1017 నుంచీ 1137 దాకా జీవించారు. వారి మతం పాంచ రాత్రమును అనుసరించిది. వారు ప్రస్థానత్రయంపై- బ్రహ్మసూత్రములు, గీత, ఉపనిషత్తులు- భాష్యం వ్రాసారు. ముక్తికి మార్గము భక్తి యోగమని వారన్నారు. విష్ణువుపై ఐకాంతిక భక్తి. ఈ భక్తిచేత భక్తుడు తాను భగవదంశమని తెలుసుకొని, ఆయనపైననే ఆధారపడి వుంటాడు. ప్రపత్తిద్వారా భగవదనుగ్రహం మనం పొందుతాము. అన్నీ ఈశ్వరాధీనమని మనం అన్నీ ఆయనకు అప్పగించి ఊరుకోవటమే ప్రపత్తి.

'ప్రియాయ ప్రియతమాయ ప్రాణాయ పరమాత్మనే'- అని స్వాత్మార్పణ చేసుకోవటమే ప్రపత్తి.

శంకరులవారు శివోహం- అనగా రామానుజులు అన్ని కాలములలో కొంచెం భేదం తమకూ భగవంతునికీ మధ్య ఉంచుకొన్నారు. 'జ్ఞానీ త్వాత్మైవమేమతం' అన్న గీతాసూక్తిని వ్యాఖ్యానిస్తూ, మనిషి ఎట్లా దేవిని విడచి బ్రతకలేడో, దేవుడుకూడ మనిషిని విడచి బ్రతకలేడు అని వ్రాసారు. 'జ్ఞాని నేనే' అన్న అభిప్రాయం వారు ఒప్పుకోలేదు. జీవుడు దేవునినుంచి పుట్టి, అతనివద్దకేవెళ్ళి కలసిపోతాడు, కానీ ఈ కలయికలో కొంచెం విశిష్ఠత ఉన్నదని వారి అభిప్రాయం. జీవుడు సాయుజ్యదశలో భగవంతుని ఆనందం సర్వజ్ఞత అన్నిటికీ అధికారి ఔతాడు కాని ఎప్పుడు తన ప్రత్యేకతను ఉంచుకుంటాడు. భగవదంశ కారణంగా జీవుడూ సనాతనుడు,అనంతుడు.తన ప్రత్యేకతను అతడు విస్మరిస్తే, అతని అనంతత్వమేమౌతుంది? అందుచేత జీవుడు భగవదైక్యం చెందినపుడు కూడ కించిదంతర్యం వుంచుకొనేందువల్ల రామానుజలవారి మతం విశిష్టాద్వైతమయినది.

రామానుజులు విశిష్టాద్వైతం బోధించగా మధ్వాచార్యులవారు, 13వ శతాబ్దంలో- ద్వైతాన్ని బోధించారు.

మాధ్వమతములో అఖిలసద్గుణ పూర్ణుడయిన విష్ణవే బ్రహ్మము. ఈతడు సర్వశ్రేష్టుడు. స్వతంత్రుడు. సృష్టి స్థితి లయములకర్త. ముక్తి ప్రదాత. జీవుడు చేతనుడు. జగత్తు అచేతనము. ఈ రెండూ భగవదధీనములు.

జీవుడు అణు స్వరూపుడు. ప్రతి దేహమందును భిన్నుడు. అస్వతంత్రుడు. అతడెపుడు సేవకుడు. భగవంతుడు సేవ్యుడు. రాజు, భృత్యుడు ఎట్లు భిన్నులో జీవేశ్వరులు భిన్నులు. భగవద్గుణోత్కర్షవలన ఇష్టప్రాప్తి. జీవుని జ్ఞానము పరిమితము, భగవంతుడు సర్వజ్ఞుడు.

భక్తి, త్యాగము, ముక్తికి సాధనములు. సేవ ముఖ్య సాధనమైనచో, వేదాధ్యదాన, యమనియమాదులు, అశాభయములు లేకుండుట, ఉదాసీనము, సర్వమునశ్వరమనుభావము, ఆత్మార్పణ, భగవత్ప్రాప్తికి అంగములు.

ముక్తియనగా జీవన్ముక్తి; వైకుంఠప్రాప్తి.

ఒక బ్యాంకిలో పనిచేసే ఆఫీసరు స్వామివద్ద చొరవగా ఉండేవారు. ఆయనతో మాస్వామి అన్నారట;

''నీవు వేదాంతం చదువుతున్నావుకదా! దాన్నే నమ్ముకొని యున్నావు కదా! అది ఎక్కడకు నిన్ను తీసుకొనిపోయి దిగబెట్టుతుందో అక్కడకు వెళ్ళు'' అని.

మాస్వామి అద్వైతులేకాదు; పరమమాధ్వులుకూడ. వారూ ప్రపత్తి బోధిస్తారు.

దక్షిణదేశంలో కృపానంద వారియర్‌ అనే సాధువొకరున్నారు. ఆయన సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు. తమిళములో ఆయన ఆధ్యాత్మికంగా ఎన్నో చిన్న చిన్న పుస్తకాలు వ్రాసి ప్రచురించి ధర్మ ప్రచారం చేస్తారు. ఆయన స్వాములవారిని గురించి ఇలా వ్రాస్తారు;

లోకంలో ఎన్నోమతాలు, పార్టీలు, జాతులు, వర్ణములు, తెగలు వున్నాయి. కాని వీరు అందరూ ఒక్కవిషయంలో ఏకీభవిస్తారు. అది ఆనందాన్వేషణ. ఈ ప్రపంచములో ఇంత వైవిధ్యమున్నా అందరూ సుఖాన్వేషణ చేస్తున్నారు. చదువుతో కానీ, ధనంతోకానీ, పదవులతో కాని వచ్చే సుఖం చిరకాలముండటం లేదు. మరి స్థిరతరమైన ఆనందం ఏది ఇస్తుంది అని ప్రశ్నిస్తే, అది జ్ఞానమే.

కంచిస్వాములవారు జ్ఞాన స్వరూపులు. జ్ఞానం అంటే ఆనందమే.వారి దృష్టి ప్రసారం మాత్రాన మన తాపాలనుపోగొట్టి మనకుసుఖాన్ని ఆయన కలిగిస్తున్నాడు.ఆయనను దయామేఘమనే చెప్పవలె.

ఆయన ఫాలంత్రిపుండ్రాంకితం. ఆయన కంఠం రుద్రాక్షమాలలతో నిండివుంటుంది. వారి వదనం చతుర్ముఖునివలె వేదములు వల్లిస్తవి. ఆయన కృశించిన దేహం వారి తపోగరిమను చెప్పుతుంది. వారి పాఠాలు భక్తుల భవబంధములను పోగొట్టుతాయి.

ఆయనలో వైరాగ్యం, ప్రేమ- ఈ రెండూ సమపాళ్ళలో తూగుతూ ఆశ్రితులను ఆశ్చర్యచకితులను చేస్తుంది.

ఒకపుడు స్వాములు శ్రీశైలంలో వున్నారు.తిరుచిలో రాధాకృష్ణన్‌ అనే తమిళ పండితుడున్నాడు. అతని తండ్రి మఠంలో చాలరోజులుగా పని చేస్తున్నాడు. శంకరమఠకుంబాభిషేకం శ్రీశైలంలో జరుగబోతున్నది. అందరూ అవిరామంగా పని చేస్తున్నారు. కుంభాభిషేకం మూడురోజులుంది. రాధాకృష్ణన్‌ తండ్రిని స్వాములవారు పిలిచి, ఆశీర్వదించి, మఠం మ్యానేజరుతో అతనికి కావలసిన పైకం ఇమ్మనిచెప్పి అతనిని ఇంటికి వెళ్ళమన్నారు. ఆ మనిషికి ఎంతో ఆశాభంగమైంది. తాను కుంభాభిషేక సమయంలో ఉండలేక పోతున్నామే అని. కానీ స్వాములవారితో ఏమీ బదులు చెప్పక అతడు మద్రాసువచ్చి తన కూతురి ఇల్లు చేరాడు. ఆ వచ్చినరోజే అతడు కాలధర్మమయ్యాడు. అతడు శ్రీశైలంలో వుండివుంటే కుంభాభిషేకమే అశౌచ నిమిత్తంగా ఆపవలసి ఉండేది.

ఇట్టి సంఘటనలు ఎన్నోవున్నవి.

ఒకపుడు చంద్రమౌళీశ్వరుని పూజ స్వాములవారు చేస్తున్నారు. అమ్మవారికి మంచి పట్టుపావడ కట్టినారు. ప్రేక్షకులలో ఒక తల్లీ బిఢ్డా వున్నారు. అమ్మవారికి కట్టిన పావడచూచి, ఆ చిన్నపిల్ల ఎంతో ఆశపడింది. అమాయకంగా తనతల్లిని ఆ పావడ తనకుకావాలని రొద చేస్తున్నది. తల్లి ఎంతచెప్పినా, ఆ చిన్నపిల్ల వినటంలేదు.

పూజ పూర్తియైనది. వచ్చిన వారందరికీ స్వాములవారు ప్రసాదమిచ్చారు. ఆ తల్లీ, బిడ్డా వంతురాగానే స్వాములవారు, మాట్లాడకుండా మండపంలో అమ్మవారికి కట్టివున్న పరికిణీని విప్పి ఆ అమ్మాయికి చిరునగవుతో యిచ్చారు. ఎక్కడో మూలకూర్చున్న ఆ అమ్మాయి కోరిక ఆయనకెట్లా తెలిసినదని తల్లి విస్తువోయింది.

ఎక్కడో కూర్గులో పుట్టి తమిళ##దేశాన్ని పావనంచేస్తూ ప్రవహిస్తున్న జీవనది కావేరిలాంటి వారు శ్రీచరణులు. వారెక్కడకుపోయినా అక్కటి జనులు తీర్ధావగాహనులు అయిన వారివలె తరిస్తారు.

ఆకాశంలో ఎన్నో లక్షలమైళ్ళ దూరంలోవున్నా, భూమిలో,సరసులో పుట్టిన పద్మాన్ని సూర్యుడు వికసింప చేసేటట్లు, శ్రీవారు మనలను ఉత్తేజితులను చేయగలరు. పద్మం ఎట్లా పంకంలో పుట్టిందో మనమూ అట్లే ఆశాపంకిలంలో వున్నాం.సూర్యుడు పద్మాన్ని పంకజమని ఈసడించుకోడు. శ్రీవారు అట్లే. హిమాలయం కదలదు. కానీ దానిలోనుంచీ పుట్టే గంగ మనదగ్గరకు వచ్చి మన పుణ్యం పండిస్తుంది. శ్రీవారూ అచలులు. కాని వారి వదన గహ్వరంలో నుంచి వెలువడే వాణీపీయూషం మనలను అమృతమయులుగా చేస్తుంది. కామకోటివారున్న శతాబ్దంలో ఉన్న మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. వారి పాదధూళి పడినచోటు తీర్ధస్థలం. రాబర్ట్‌ వాల్సెర్‌ స్వాములను ఇలయాత్తం గుడిలో చూచాడు. ఆయన అంటారు;

''నేను శ్రీవారిముందు నిలుచున్నపుడు- నిజమైన మహత్త్వమంటే ఇదే అని అనిపించింది. ఏమి ప్రశాంతత! ఏమి నిరాడంబరత! అంతా నిశ్శబ్దంగా వుంది. నా హృదయంలో వారిపై భక్తి అమాంతంగా ఉబికింది. భగవదనుగ్రహంచేత నేను ఇన్నిరోజులు దేనికోసం అన్వేషించానో అది నాముందు ఇపుడు మూర్తీభవించింది, అనిపించింది. స్వాములవారు ఇదివఱకు నన్ను చూచినదిలేదు. కానీ నాగూర్చి అన్నీ తెలిసినవారుగా కనబడుతున్నారు. ''నీవెక్కడనుండీ వచ్చావు. నీవేమి చేస్తావు. ఇండియా కెందుకొచ్చావు-'' అనే ప్రశ్నలేవీ లేవు. నేను చూచినవారంతా ఇట్టి ప్రశ్నలే వేసేవారు పత్రికావిలేఖరులవలె. ఒక్క ప్రశ్నకూడ వేయక నన్ను ఈయన తెరచిన పుస్తకంవలె అమాంతంగా చదివేశారు.

నేను ఏదీ అడుగకుండానే, నా హృదయంలోని ప్రశ్న పరంపరలకు ఆయన బదులిస్తున్నారు. ఒక శాంతి నన్ను ఆవహించింది. ఆ ప్రేమస్వరూపిని చూస్తూ నాహృదయం ఆర్ద్రమైపోయింది. వారి అద్భుత వచనామృతాన్ని మౌనంగా దోసిళ్ళతో త్రాగుతున్నాను.

నేను వారివద్ద సెలవు పుచ్చుకొన్నపుడు, ఆరోజు రాత్రి 8 గంటలకు తన్నుగూర్చి ధ్యానించమన్నారు. ఇండియానుండి వెళ్ళిపోయేముందు ఈ దేశంలో నాకు కలిగిన అనుభవాలను తనకు తెలుపమన్నారు.

తిరుచ్చిలో ఆరోజు రాత్రి నేను తెలుసుకున్నాను. మహాత్ముల ఆశీస్సులంటే ఏమని! స్వాములవారి బింబాన్ని నా హృదయ దర్పణంలో ధారణచేసి ధ్యానించేసరికి అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శక్తిప్రసరణ నాలో మొదలెట్టింది. ఇంతకంటే వేరే నిదర్శనం ఏంకావాలి?

మా పాశ్చాత్య దేశాలలోను ఆశీస్సులున్నాయి.కానీ అర్ధరహితమైన అంగ విన్యాసమేకానీ అందులో చైతన్యం అనేమాటలేదు.నిజమైన మహాత్ముని ఆశీస్సు విద్యుత్పరసారమని నాకు అనుభవం ఐంది.

నేను తర్వాత జగద్గురువులవారిని చూడలేదు. కాని మా ఆధ్యాత్మిక సంబంధం అవిరామంగా సాగుతున్నది. ఒక్కొక్కపుడు ఆయనకు నేను ఉత్తరం వ్రాస్తాను. నా ప్రశ్నలోని అంతర్యం గుర్తించి ఆయన ఇచ్చే బదులు అద్భుతంగా వుంటుంది. మహాత్ములది అంతద్దృష్టి. ఆధ్యాత్మిక సంబంధంలో దూరాల ప్రసక్తిలేదు. చేయవలసినదంతా నిమ్మళంగా కూచుని ధ్యానముద్రలో మునగటమే.

ఆయనను నేను సంధించిన దినం నిజంగా ఎంత సుదినమో!''

తవతత్త్వం నజానామి కీదృశోసి మహేశ్వర

యాదృశోసి మహాదేవ తాదృశాయ నమోనమః

'త్యాగరాజు ఎందరో హమానుభావులు, అందరికీ వందనములు'- అని వాకొన్నారు.

వేమన వారు అంటారు;

బొందెలుగనవేరు భువి ప్రాణమొక్కటే-

అన్నములిలవేరు ఆకలొకటే-

దర్శనములువేరు దైవంబునొక్కటే

విశ్వదాభిరామ వినురవేమ!

విష్ణువును తీసికొందాము. ఆయనకు దశావతారాలున్నాయి. ఇందులో ఏ అవతారం గొప్ప? వామనుడు వటువు. చిన్నవాడు. కానీ వాడే త్రివిక్రముడయ్యాడు!

పోతన భాగవతంలో-

ఇంతింతై వటుడింతయై మరియుతానింతయై నభోవీధిపై

నంతై తోయదమండలాగ్రమున కల్లంతయై ప్రభారాశిపై

నంతై చంద్రున కంతయై ధృవునిపై నంతై మహార్వాటిపై

నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై.

రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై కళాభరణమై సౌవర్ణకేయూరమై

ఛలిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండ మున్నిండుచోన్‌

వామనులను, ఉరు విక్రములుగా పై విధంగా వర్ణించారు.

మాస్వామి కూడ సుస్నాతులై, దండం ధరించి వారికమండులువుతో నెమ్మదిగా నడిచేటపుడు, వారి చిన్నతనంలో వామనమూర్తినే తలపించే వారేమో!

నా ఈ వ్యాసభాగానికి నేను 'మాస్వామి' అని ఎందుకు నామకరణం చేసానో నేను చెప్పవలసివున్నది.

'మాస్వామి' అన్న పేరు- ఒకవిధంగా గ్రంధచౌర్యమని నేను ఒప్పుకోవాలి.

ఈ పేరిట విశ్వనాధ సత్యనారాయణులు- ఒక పుస్తకం వ్రాసారు. నేను ఆపుస్తకం చదవలేదు. కానీ ఆపేరు విన్నంతనే- భావస్థితాని జననాంతర సౌహృరాని- నాలో ఒక స్పందన కల్గి నేనూ పుస్తకంవ్రాసి దానికి 'మాస్వామి' అని నామకరణం చేయాలని దాదాపు 15/16 ఏళ్ళక్రిత్రమే ఒక సంకల్పం నా ఎదలో ఉదయించింది. అది ఈనాటికి నెరవేరినది. మన ఊహలన్నీ ఎప్పుడో ఒకపుడు ఫలించి తీరుతాయి. అందుచేత కోరికలు కోరడంలో మనం అతిజాగ్రత్త వహించాలి.

కానీ విశ్వనాధవారి పుస్తకనామాన్ని నేను గ్రహించి వారికి క్షమాపణ చెప్పుకుంటూ, వారి గుణగానం చేసి వారి పద్యాలు కొన్ని ఉదహరించాలని నాకు తోచినది.

వేలూరివారివలెనే విశ్వనాధులూ ప్రతిభావంతులు. వారి వేయిపడగలు, ఏకవీర, చెలియలికట్ట నవలా సాహిత్యంలో ఒక విశిష్ఠస్థానాన్ని సంతరించుకొంది. రామాయణం కల్పవృక్షం వారి Magnum opus. ఆయన కవి, నవలారచయిత, నాటకకర్త, విమర్శకుడు, వక్త. వారి సాహిత్యవైవిధ్యం, శైలిలోని తరతమాలు విలక్షణమైనవి.

వారి రామాయణ కల్పవృక్షం పూర్తికావడానికి దాదాపు పాతిక శతాబ్దమైనదట. ఆయన శతాధిక గ్రంధకర్త.

ఆయన కల్పవృక్షంలోని శివధనుర్భంగ.

'శ్రీరామచంద్రుడు తత్సభా భవననికషప్రాగ్దిశా సౌధంబుపై

యంతస్తున నంతఃపురస్త్రీల కదలిక గుర్తుపట్టి తలయెత్తిన-'

సీ|| ఇదమిద్ధమని నిర్ణయింపగారానిదే

కోర్కెయో రూపుగైకొన్నయట్లు

జన్మ జన్మాంతరసంగతమైన యా

శాబలం బవధికి సాగినట్లు

ప్రాణముల్‌ బయటికి వచ్చి ముగ్ధాకార

మొనయించి దర్శనమిచ్చినట్లు

తన సృష్టిలోన యుత్తమ భావమానంద

ముగ బొంగి బింబమై పొడిచినట్లు

అలయరుంధతియును నహల్యయును గోస

లాత్మజాతయు మువ్వురి ¸°వనముల

కన్నను బవిత్రమగుచు శృంగారభావ

మొడిసి పట్టిన ముఖచంద్రుడొకడుతోచె.

సీ|| పునరుద్భవద్దంత ముగ్ధమోహనరుచి

ప్రకటరేఖా హాస భావపరిధి

బాల్య¸°వన దశా పరిణాహసంధిత్ర

పా ముగ్ధ నేత్ర శోభా పయోధి

పుష్కలాభివ్యక్తముగ్ధ చిక్కణకపో

లక్షీర కాంతి వేలా సుధాబ్ధి

శతసహస్ర మనోజ చావలస్తకమహా

భావ పుంజీభూత ఫాల వీధి

యై దృగింద్రియ గత పరమార్ధమగుచు

హృదయ దఘ్నమై రక్తఝరీనిలీన

వేగమాధ్యుర్యపరసీమయై గవేషి

తార్ధ సంప్రాప్తియై దర్శనాధ్వమొదిగె.

శ్రీరఘురామ చంద్రునకు జిత్తము జానకిపై గరంబువి

స్ఫారశరాసలస్తకముపై యుగపత్క్రియ జిత్రమయ్యెసం

ధారతి గోటికెక్కిన గుణంబు బిగించుటలాగు టింతయున్‌

నేరడెఱుంగ డొక్కసడి నిండినశబ్దము కల్గునంతకున్‌.

మంజూషలోనె యమర్చికోణంబండు

నొక్కిత్రాటంగొప్పునెక్కు పెట్టె

గాబోలు మంజూషికా వినిర్గమనంబు

వేళ##కే జ్యావల్లి బిగిసియుండె-

దాళప్రమాణమౌ ధనువు జానకి దృష్టి

కడ్డమ్ముగా వచ్చు నంచు నెంచె

గాబోలు, నడ్డంబుగా ధనస్సునుబూని

పిడిబాకువలె ద్రాడువ్రీల లాగె

అతనిదృష్టికి జానకి యాగలేదు

అతని దృష్టికి శివధనుస్సాగలేదు

సీత పూజడ వెన్నుగా శిరసువంచె

జెఱకు గడవోలె నడిమికి విఱిగెధనువు.

నిష్ఠా వర్షదమోఘ మేఘపటలీనిర్గచ్ఛదుద్యోతిత

స్పేష్ఠేరమ్మద మాలికా యుగపదు జ్జృంభన్మహా ఘోరబం

హిష్ఠ స్ఫూర్జదుషండ మండిత రవా హీనక్రియాప్రౌఢిద్రా

ఘిష్ఠంబై నొకావమంతట నెసంగెన్‌ ఛిన్నచాపంబునన్‌

హేరం బోన్నత శూర్పకర్ణ వివర హ్రీంకారియై షణ్ముఖ

స్థార ద్వాదశ##నేత్రగోళ వివృతి ప్రాకారమై, శైలక

న్యారాజ న్నవఫాలమండల విభుగ్నక్రీడయై, యాశ్చల

ద్గీరుశ్రీ ప్రమధాంబుగా ధనువుమ్రోగెన్‌ శైవలోకంబులన్‌

నృత్యన్మంజుల తారహాకబరీ నిష్యందముక్తామణి

ప్రత్యగ్రప్రసవాక్షి సంకలన దీవ్యత్కంధరా భేదసా

హిత్య ప్రౌఢ నవాప్సరోనటన సాహిత్య ప్రశస్తాచ్ఛదృ

గ్గీత్యాకార మనోజ్ఞమై ధనువు మ్రోగెన్‌ స్వర్గలోకంబులన్‌

దర్పస్వీకృత హాసవిశ్లధ నరుంధ ద్దుష్ట వాగ్ధోరణ

సర్పద్వీరచమూపధశ్లధనమై స్రంసత్కటే శాటికా

కూర్పాస ప్రకటోగ్ర సాధ్వసవధూ గుర్విణ్యభద్రాద్వమై

దర్పాడంబరమై ధనుస్సు మెఱసెన్‌ దైతేయలోకంబులన్‌

స్పీతాష్టాపదవిద్యుదుజ్జ్వల పయః పీయూషధారాధునీ

నీతా స్వాద్యతర ప్రగల్భ వచన స్నిగ్ధాననాంభోజసం

ధా తీర్థంకర మాగదోల్బణము, నానా మేదినీరాట్సుభా

గీతి స్వాదుమనోజ్ఞమై ధనువుమ్రోగెన్‌ రాజలోకంబులన్‌.

ఈ పద్యాలు అయః పిండములుగా లేవూ? శబ్దవిన్యాసం ఏదో మేఘాలు గర్జించినట్లు లేవూ?

ధనుర్భంగమునకై రాముడు సభాప్రవేశం చేస్తాడు. తల ఎత్తి చూస్తే సీత కనపడింది. ఆ సీత ఎట్లున్నది?

ఆమె తెలియనికోరికవలె వుందట. జన్మాంతర సంబంధం ఒక హద్ధుకువస్తే ఎట్లావుంటుంది? తన ప్రాణాలే బయటకువచ్చి ఒక మోహనస్త్రీ రూపందాల్చితే ఎట్లావుంటుంది? హృదయంలోని ఆనందము, ఉత్తమభావాలు, రూపెత్తినిలిస్తే ఎట్లావుంటుంది? అరుంధతి, అహల్య, కౌసల్య వీరి ముఖములలోని పవిత్రత, శృంగార భావమనే సరస్సులోమజ్జనం చేస్తే ఎట్లావుంటుంది? సీత అట్లావుంది.

రాముని చూపు జానకి అనే నారిపై , శివధనుస్సుయొక్క, నారిపై- ఒక్కమారు వాలింది. విల్లు ఎత్తడం, వింటిని విరచడం, విరిగిన శబ్దం విన్నంతవరకు రాముడెరుగడు. సీతశక్తి చాలనం అలాంటిది!

శ్రీరాములవారి దృష్టి సీత భరించలేక సిగ్గుతో శిరస్సు వంచినది. ధనుస్సు ఆయన కృషికి (లాగటం) సహించలేక బద్దలైంది.

శివధనుర్భంలో కలిగిన శబ్దం కవి వర్ణిస్తాడు.

కైలాసంలో ఉన్న గణపతి కర్ణకుహరాలలో అది హ్రీంకారమైనదట. హ్రీంకారం భవనేశ్వరీ బీజం. 'శక్తిస్తు భువనేశ్వరీ' మిధిలలో భువనమోహనుడు భువనేశ్వరీ నిమిత్తంగా విల్లులాగటం, ఆ విల్లు విరగటం, ఆశబ్దం హ్రీంకారంగా, అందరికీ పెళ్ళిచేసిపెడుతూ, తాను బ్రహ్మచారిగా వుంటూ, అన్నిటికీ ప్రధముడైన గణపతి చెవులలో పడటం- ఎంత చక్కగా వుంది!

అంతేకాదు. ఆరు ముగములూ పండ్రెండు కళ్ళుకల కార్తికేయుని ద్వాదశ నేత్రములూ ఆ శబ్దమునకు విప్పారినవట! కైలాసంలో శివుని అర్ధదేహం అపహరించి, ఆనందంలోవున్న మంచుకొండ ఆడబిడ్డకు బొమముడిపాటు ఆ హ్రీంకారం కలిగించిందట. ఆ శబ్దం, శైవలోకం, స్వర్గలోకం, దైత్యలోకం, రాజలోకం- అంతటా పర్వినది.

విశ్వనాధవారి కలం బలం ఆలాంటిది!

జయంతి తే సుకృతినో రస సిద్ధాకవీశ్వరా

నాస్తితేషాం యశఃకాయే జరామరణజం భయం.

ప్రపంచానికి వలసిన మతమేమి?

మాస్వామి 1931లో ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో వారు ఇట్లు అన్నారు.

''ప్రపంచంలో ఎన్నొ మతాలున్నవి. ఒక్కొక్కదానికీ ఒక్కొక్క పేరు. ఏ ఏ ప్రవక్త, (ఆదిపురుషుడు) తన మతం స్థాపించాడో ఆ పేరును ఆ మతం వహిస్తుంది'' బుద్ధుడు బౌద్ధాన్ని, జినుడు జైనమతాన్నీ, మహామ్మదు మహ్మదీయాన్నీ, క్రైస్తు క్రైస్తవాన్నీ నెలకొల్పారు. పార్సీమతం జొరాష్టరు స్థాపించిన జొరాష్ట్రయానిజం. చైనాలో కన్ఫ్యూనియన్‌ కన్ఫ్యూనిసం మొదలెట్టినారు. వీళ్ళందరూ మహానుభావులే. లేకపోతే ఇంతమందిని తమ తమ మతానుసారులుగ ఎట్లు చేయగలిగారు?

మన మతంతప్ప తక్కిన మతాలకీ ఒక నాధుడు, ప్రవక్త ఉన్నాడు. వానికొక పేరూ ఉంది. పేరులేని మతం మనది.

మనలో ఎవరైనా ఒక చిన్న పిల్లవాడిని పిలిచి నీ మతమేమని అడిగితే, వాడు కొంచెం ఇంగ్లీషు చదువుకున్నవాడైతే, వెంటనే 'నామతం హిందూమతము' అని అటాడు. అట్లాకాక నిక్షరాస్యుడైన ఒక కృషీవలుడిని చూచి మనం ఇదే ప్రశ్నవేస్తే అతడు ఒక పేరు చెప్పడానికి తికమకలు పడతాడు. అదే ప్రశ్నను దస్తావేజు పత్రాలు వ్రాసే ఒక లేఖకుణ్ణి అడిగితే- అందులోను అతడు దక్షిణ దేశంలోని వాడైతే- శైవము, వైష్ణవము అని కొన్ని పేర్లు చెప్పుతాడు. ఇవన్నీ మతంలోని శాఖోపశాఖలే కానీ, దానిని ప్రధానమతమని చెప్పడానికి వీలులేదు. ఇవికూడ ఆ శాఖలను ప్రారంభించిన చారిత్రిక వ్యక్తిగత నామములుకావు. ఆ మతమునందలి ప్రధన అర్చామూర్తినీ, దైవాన్నీ ఈ పేర్లు సూచిస్తుంది. అంతే.

హిందూమతమే మన మతమైదే మన పూర్వీకులు తమ్ము హిందువులని వ్యవహరించుకొనియుండేవారు. కొన్ని శతాబ్దముల పూర్వము- హిందూమతం ఏనేది ఒక అర్ధరహితమైన, అజ్ఞానమైన నామంగా ఉండే వుంటుంది. మన మతం నిజంగా ఒక పేరులేని మతం.

ఈమధ్య మనం ఒక పేరు ప్రబలంగా వింటూవున్నాం. అది సనాతనధర్మం. ఇదికూడ అనూచానంగా వస్తున్న పేరు అని చెప్పలేము. ఎందుకంటే ఈ పేరు చెప్పితే ఒక వ్యవసాయదారునికో, నిరక్షరాస్యుడైన బీద ముదసలికో ఇతర మతస్థులవలె తెలియవలెనుకదా! అట్లా వాళ్ళకు తెలియటంలేదు.

హిందూమతమన్న పేరు మనకు ఇతరులు ఇచ్చిన ప్రసాదం. మన తాత ముత్తాతలు సింధునదీ ప్రాంతంలో వుండేవారు. విదేశీయులు దానిని ఇండస్‌ అనేవారు. ఆ పేరునుంచి వాళ్ళు మనలను- ఇందు దేశీయులనీ, మనదేశాన్ని ఇండియాయని-వ్యవహరింపసాగారు. అటుపిమ్మట వారానామాన్ని భారతవర్షానికే అన్వయించారు. భారతదేశంలో సింధునదీప్రాంతం చాలచిన్నది అయినా కూడ.

'హెడ్‌పార్కు అవతల అంతా ఎడారి' అన్నట్లు!

ఒక్కొక్క మతానికీ వానిని గుర్తించేందుకు అవసరములైన కొన్ని చిహ్నములుంటవి. క్రైస్తవులకు 'క్రాస్‌' ఉన్నది. మనకు సామాన్యమైన అట్టి మత చిహ్నములు ఏవీలేవు. మనమతం ఎట్లు అనామకమో, అట్లే మత చిహ్నముల విషయంలోనూ ఒకలోపం వుంది. కొందరు మనలో విభూతి ధరిస్తారు. కొందరు నామాలు వేసుకొంటారు. కొందరు తమ్ము వీరవైష్ణవులనీ, వీరశైవులనీ, లింగాయత్తులనీ చెప్పుకుంటారు. వీళ్ళదరికీ ఒక్క మతానికి చెందినవాళ్ళం మనమన్న భావం మాత్రం ఉన్నది.

అనామకంగా ఉండటమే మన మతంయొక్క మహత్త్వం. అనేక వస్తువులుంటే ఒకదానికొకటి ప్రత్యేకించడానికోసం, పేరు అవసరమవుతుంది. ఉన్నదే ఒక వస్తువు అయినపుడు దానికేమని పేరు పెట్టుతారు? ఒక గ్రామంలో నలుగురు రామస్వాములుంటే, ఒక రామస్వామిని మరొక రామస్వామి నుండి వేరుచేయడానికి, నల్ల, తెల్ల, పొడుగు, పొట్టి అని చెప్పవలసి వుంటుంది.

మతం విషయంలోనూ అంతే. మతం అంటే ఏమి? మతం అంటే పుణ్యపాపాలే; దుఃఖాశ్రయమైన ఈజన్మ పరంపర నుంచి బయటపడే మార్గమే మతం. ఒక్కొక్క మతం దాని స్థాపనాచార్యునిపేర వెలిసే విషయం ఇదివఱకే చెప్పాం. ఈ మహాత్ములకు పూర్వం ఈ మతాలు లేవన్నమాట. ఫలానాకాలం అని అన్ని మతములకు నిర్ణయమైవున్నది. ఈ మతాలకన్నిటికీ పూర్వం మనమతం వుండినదని వేరే చెప్పనక్కరలేదు. అందుచేత మనమతం,ప్రపంచంలో వేరే ఏ మతాలూ లేనప్పటినుంచీ వుందనాలి. అందుకే దానికొక పేరు లేదు. నిజానికి మనది మతం కాదం, ఒక ధర్మం మాత్రమే.

ఈ ధర్మానికి వేదం ప్రమాణం. అందుచేతనే మన ప్రసంగాలలో 'వాడు చెప్పేది వేదమా' అన్నమాట వచ్చింది. వేదమంటే ప్రమాణం.

ఈజిప్టులో ఒక పురాతన శాసనం బయటపడింది. అది క్రీ.పూ 1280 నాటిది.అందులో రామ్సెస్‌ II, హిట్టీటీన్‌ మధ్య ఒడంబడికను గూర్చిన విషయాలున్నాయి. దానిలో సాక్ష్యానికి మైత్రావరుణిని పేరు పేర్కొన్నారు! (హెచ్‌. ఆర్‌. హోల్స్‌ ఎన్సియంటు హిస్టరీ ఆఫ్‌ ది మిడిల్‌ ఈస్టు పే.364 నుంచీ చూడండి) ఈ రామ్సెస్‌ శబ్దం రామశబ్దమే.

దక్షిణ ఆఫ్రికా తూర్పతీరంలోవున్న మెడగాస్కర్‌ ద్వీపంలో- నూటికి 75 పాళ్ళు సంస్కృతపు పేర్లే వున్నాయి. ఇవన్నీ రామశబ్దానికి అనుకృతులే. అన్ని ఎడారులూ ఒకపుడు సముద్రములుగా వుండినవని ఒక ప్రతిపత్తివున్నది. సహార అన్న శబ్దం సాగర పదానికి వికృతైయుండవలె. సహారా ఎడారి సముద్రంగా వున్నపుడు దాని తీరములో చాల జనసమ్మర్ధంగా వుండేదనీ, వాళ్ళ పేర్లు ముఖ్యంగా సంస్కృతమనీ, అవన్నీ రామనామ సంబంధము కలిగినవనీ చెప్పుతున్నారు (ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా- వాల్యూమ్‌ 23- సహారా శీర్షిక చూడండి)

మెక్సికోలో మనకు నవరాత్రిళ్ళు వచ్చేటపుడు అదేసమయంలో వాళ్ళు ఒక ఉత్సవం చేసుకుంటారు. దానిపేరు 'రామసీత'. ఆ దేశంలో తవ్వితీసిన శిల్పములలో వినాయకుని విగ్రహములున్నవని బేరన్‌ హాం బోల్ట్‌ వ్రాసాడు. వేద ప్రామాణ్యమును పూర్వకాలంలో వీరు, అంగీకరించినందువల్ల వీరిని ఆస్తికులన్నారు ఇపుడు వారినే అజెట్‌క్స్‌ (Aztecs) అని అంటున్నారు!

పెరూ దేశంలో సూర్యోపాసన వుండేది. వాళ్ళను 'ఇన్కాస్‌' అనేవారు సూర్యునికి ఇనుడన్న పేరు ఉండటం మనమెరిగినదే.

ఇదేవిధంగా కాలిఫోర్నియాను మనం కపిల అరణ్యమనీ, అక్కడ దగ్గరగావున్న ద్వీపాలను (హార్స్‌ ఐలెండ్‌, ఆష్‌ ఆలెండు) నగర చక్రవర్తి గుర్రమును కట్టివేసినచోటు,సగరతనయులు కపిలుని క్రోధాగ్ని చేత భస్మమయిన ప్రదేశముగాను ఊహించుటకు వీలున్నది. సగర తనయులు వెళ్ళిన పాతాళలోకం ఈ ప్రదేశ##మై ఉండవచ్చని.

జావా బోర్నియాలలో మన మతముయొక్క అవశిష్ఠములు ఇప్పటికీ వున్నాయి. యజ్ఞయాగాదులు కోయొటీ బోర్నియాకు చేరిన మూలవర్మ చేసినట్లు శిలాశాసనములు అచట కనిపించినవి.

మన మతము ఒకపుడు సర్వవ్యాప్తమై ఉండినదనుటకు ఇవన్నీ సాక్ష్యములుగా వున్నవి.

ఆదిశంకరులవారు 'సప్త ద్వీపాచ మేదినీ'- అన్నారు.ఒక్కొక్క ద్వీపములోను ఎన్నో వర్షములు, వానిలో ఖండములు- వున్నవి. మనదేశానికి భరత ఖండమని పేరు. 'భరతవర్షే భరతఖండే' ఇది జంబూద్వీపానికి చేరినది. ఆ ఏడు ద్వీపములకు ఉత్తరదిశలో మేరుపర్వతమున్నది. సూర్యచంద్రులు మేరు చుట్టు తిరుగుచున్నారని అంటారు.

భూమి గుండ్రంగా వున్నదన్న జ్ఞానం మనకు పాశ్చాత్యులునేర్పిన పాఠమని మనం అనుకొంటాం. సంస్కృతంలో మనం 'భూగోళం' అని అంటాం. గోళమంటే వర్తులాకారంగా వున్నది. ఖగోళ, భూగోళ శబ్దములు ప్రాచీన గణితశాస్త్రములలో మనం చూడవచ్చు. అండమంటే గుడ్డు. బ్రహ్మండమంటే బ్రహ్మ గుడ్డు- ఈ భూమి తదాకారంగా వుందని అర్ధం. కాబట్టి భూమి గుండ్రంగా వుందన్న విషయం మన పెద్దవాళ్ళు ఎరిగిన విషయమే.

మనభూమి నిమ్మపండువలె గుండ్రంగా వుందనుకొందాం.కాని ఉత్తరధృవం మేరు. ''సర్వేషామపి వర్షానాం మేరు రుత్తరతఃస్థితః''. మిగత వర్షములన్నీ దక్షిణదిశలో వున్నవి. మానవదృష్టికి- ఈ ధృవంలో వున్నపుడు సూర్యచంద్రులు మేరువును చుట్టుతున్నట్లు అనిసిస్తుంది. అదే సూర్యచంద్రులు మేరువును ప్రదక్షిణ చేయడం, అని అనడం.

మన శాస్త్రాలలో చెప్పినవి నవీన భూగోళశాస్త్ర తీర్మానములకు విరుద్ధముగా వున్నవని అనుకోడానికి వీలులేదు. మనం క్రొత్తగా ఏవేవి కనిపెట్టామని అనుకొంటున్నామో అవన్నీ మన ఋషులు విజ్ఞాన పరిధిలోనివే. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, అప్పయ్య దీక్షితుల గ్రంధాలలో వీనికి ప్రమాణాలు మనము చూడవచ్చును.

అందుచేత మన మతం, ఇతర మతాలు పుట్టనికాలంనుంచీ వస్తున్న సనాతనధర్మం. గర్వం, అభిమానం విడిచి, ప్రేమతో, కరుణతో పై విషయాలు మనం ఇతరులకు నచ్చ చెప్పవలె.

భరణీధరన్‌ అనే ఆయన తమిళంలో 'శ్రీశైలత్తిక శంకరర్‌' అనే పుస్తకాన్నివ్రాసారు. అందులో ఉదాహృతమైన ఒక ఘట్టం.

స్వామి కాళహస్తిలో వున్నపుడు భరణీధరన్‌ అతని స్నేహితుడు కణ్ణాన్‌తోబాటు దర్శనార్ధం వెళ్ళాడు. ఆరోజు శ్రీ జయంతి. స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఆగమశిల్పసరస్సుకై ఇతర రాష్ట్రములనుడి వచ్చినవారు వారిలో అనేకులు....

మైసూరు నుంచీ, గణపతి సత్యానందస్వామి అనే వారు తమ ఆశ్రమంనుండి కాళహస్తికి వచ్చి వుండినారు. వారిని వారి సహచరులను తమ సమీపమున కూర్చొనమని స్వామి కుశలప్రశ్నలు వేశారు. పిదప మౌళీశ్వర సన్నిధిలో వున్న విద్వాన్‌ పశుపతిని పిలిచి, 'ఈరోజు శ్రీజయంతి కదా! కృష్ణునిమీద ఏదైనా పాడు-' అని శ్రీవారు అతనితో అన్నారు.

పశుపతి పాటపాడగా స్వాములవారు కండ్లు మూసుకుని ధ్యానముద్రలో ఉండిపోయారు. సభికులూ ఆ గానలహరిలో మునిగి తన్మయులయ్యారు.

పాట కచ్చేరి ముగియగానే సత్యానంద స్వామి తన విడిదికి వెళ్ళిపోయారు. నేను, నా మిత్రుడు ఆయనను చూడటానికి వెళ్ళాం. పరిచయాదికాలు కాగానే వారు మనస్సువిప్పి కన్నడంలో తన పూర్వికమును, ప్రస్తుతము తన జీవితములోని మార్పును గూర్చి మాట్లాడారు.

సత్యానందస్వామి 1944లో మైసూరు రాష్ట్రంలో కనకపురం తాలూకాలో జన్మించారు. పండ్రెడవ ఏడురాగానే ఆంధ్రప్రదేశములోని ప్రొద్దుటూరుకు పోయారు. చిన్న వయసులోనే ఆయనకు కొన్ని సిద్ధులు లభించినవి. మన్ను విభూతికావటం, రాయి కలకండగా మారటం మొదలగునవి. పదహారవ ఏడురాగానే మరికొన్ని సిద్ధులు ఆయనను ఆశ్రయించినవి. కుదరని రోగాలను ఆయన కుదిరించేవారు. కొంతకాలానికి పురాణ పఠనలు, గీతాధ్యాయనం ఆయనకు అలవాటైంది. పోస్టల్‌ డిపార్టుమెంటులో ఉద్యోగంచేస్తున్న మనిషి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆధ్యాత్మికంలో పడ్డారు. జాగ్రత్స్వప్నస్థితులలో ఆయనకు కొన్ని అనుభూతులు కలిగినవి. తనలో ఒక మాయాశక్తి వృద్ధి అవుతున్నట్లు ఆయనకు అనిపించింది. ఆయన కనులలో ఒక తేజస్సు జనులు చూడసాగారు. మాటలలో మార్ధవమేర్పడింది. ఆయన ఏది చెప్పినా ఫలించసాగింది. ఆశ్రితుల సంఖ్య రోజురోజుకూ వృద్ధి కాసాగినది. కానీ వారికేమో మనశ్శాంతి లేదు. ఆయనకు ఈ సిద్ధులవలన జీవితంలో ఒక అలజడి లేచింది. ఎవరిని ఆశ్రయిస్తే తనకు కలిగిన ఈ ఇబ్బందులు తొలుగగలవో ఆయనకు తెలియలేదు. ఒకరోజు ఆయనకు స్వప్నంలో ఒక మహాత్ముడు కనపడి, ''నీవు కామకోటి శంకరాచార్యులను దర్శించు. నీకున్న సమస్యలన్నీ తానుగ తొలగిపోతాయి'' అని ఆదేశించాడు. అంతే. స్వాములవారు ఎక్కడ వున్నారో తెలిసికొని కొందరు అనుచరులతో కాళహస్తివచ్చి చేరారు.

''స్వాములవారితో మీరేమి సంభాషించారు? మీరు ఉద్దేశించి వచ్చిన కార్యం ముగిసినదా?'' యని నేను వారినడిగాను.

''లేదు. నా భవిష్యత్తు వారి చేతులలోనే వుంది. నన్ను వెంటాడిన సిద్ధులు, ఇతర ఆధ్యాత్మిక శక్తులు స్వామికి అర్పించి వెళ్ళవలెననే నేను వచ్చాను. ఇవన్నీ వారు గ్రహించి నాకు మనశ్శాంతి కలుగచేస్తారని పరిపూర్ణ విశ్వాసంతో వున్నాను. నేను వారితో ఏకాంతంగా మాట్లాడాలి.వారిని మరొకమారు చూడకుండా ఇక్కడనుంచీ పోవలెననే ఉద్దేశంలేదు. ఆ సమావేశానికి మీరు సాయపడగలరా?'' అని వారు మమ్ములను అడిగారు.

నేను కణ్ణన్‌వంక చూచాను. సత్యానందస్వామి అభిప్రాయం స్వాములవారికి తెలియపరచెదనని కణ్ణన్‌ చెప్పిన పిదప, ఆ స్వామి కొంచెం కుదుటబడినారు.

తర్వాత మా సంభాషణ స్వకీయ విషయములపై మరలింది.

తనకు కొన్ని రోజులుగా, సరిగా జీర్ణంకావటం లేదనీ, కడుపునొప్పి కలదనీ, ఆహారము సహించుట లేదనీ కణ్ణన్‌ చెప్పి- 'ఇదో ఈయనకూ అదే సమస్య' అని నన్ను చూపాడు.

'అట్లనా?' అని ఆ స్వామీజీ ప్రక్కనున్న వెండి చెంబునుంచి విభూతినెత్తి, ఆ విభూతిని నాకు, కణ్ణన్‌కు ఇచ్చి 'దీనిని నీటిలో కలిపి త్రాగండి. అన్నీ గుణమైతుంది' అని అన్నారు. ఇట్లు హఠాత్తుగా ఆకాశంనుండి వచ్చే విభూతిని గ్రహించే అలవాటు లేనందున మేము కొంచెం తటపటాయించాం. పిదప మర్యాదకు ఆ విభూతిని కాగితములలో మడచిపెట్టుకొన్నాం.

మేము బయలుదేరుదామని అనుకొంటూ వున్నపుడు ఆ స్వామీజీ మరల, అక్షయ పాత్రలాంటి ఆ వెండిచెంబులో మళ్ళా చేయివేసారు. చేయి బయటకి తీసారో లేదో, ఆయన చేతిలో ఒక విగ్రహమున్నది. దానిని కణ్ణన్‌ కిచ్చారు. విగ్రహం తీసుకోవడమా వద్దా అని రెండుక్షణాలు యోచించి, 'వచ్చినది రానీ' అని దానిని తీసుకొన్నాడు. కణ్ణన్‌ అసలు పేరు గణపతి. గణపతికి గణపతి విగ్రహం రావటం పొందికగానే వుంది, అని నేను చెప్పగా స్వామీజీ నవ్వుకొన్నారు.

ఆరోజు రాత్రి మదరాసుకు పోయేముందు ప్రసాదం తీసుకొందామని కంచి స్వాములవారి వద్దకు వెళ్ళాం. వారు సదస్సు మండపంలో వున్నారు. మేము వందనం చేసాం. కణ్ణన్‌ మైసూరుస్వామి యొక్క విన్నపం స్వాములవారి చెవిని వేసాడు. స్వాములవారు తలపంకించారు.

పిదప వెనుకాడుతూ, మైసూరుస్వాములు తనకు విభూతీ, విగ్రహమూ ఇచ్చిన విషయము వారితో చెప్పి, ఆ విగ్రహాన్ని స్వాములవారి ముందు ఉంచాడు. ఆ గణపతి విగ్రహాన్ని కొన్ని క్షణాలు తదేకంగా స్వాములవారు చూసారు. తమ చిబుకమును వ్రేళ్ళతో నొక్కుతూ, మంతస్మిత వదనార విందులయ్యారు.

వారివద్దనుండి నీవెందుకు దీనిని పుచ్చుకొన్నావు? అని కణ్ణన్‌ ను అడిగారు.

కణ్ణన్‌కు ఆ ప్రశ్నతో నాడులు నిలిచిపోయినవి. అపచారంచేసిన వానివలె నిరుత్తరుడయి నిలుచున్నాడు.

'ఆయన ఇస్తుంటే నేను వద్దనలేక పోయాను' అని అన్నాడు నీళ్ళు నములుతూ.

'పోనీ. ఈ విగ్రహం వారివద్దనే వదిలేయ్‌. రాత్రి ఆయన నావద్దకు వచ్చినపుడు దీనిని నాకు ఇమ్మని చెప్పు' అని స్వాములవారు అన్నారు.

పెద్ద భారం తీరినట్లు మేము ప్రసాదాలను గ్రహించి మా ఊళ్ళకు బయలుదేరాం. ఆ మైసూరుస్వాములకు శ్రీహరి ఆదేశం అందించాం; ఆ విగ్రహాన్నీ వారికే ఇచ్చివేసాం.

తరువాతి కథ మాకు తెలియదు.

ఈశ్వరోగురురాత్మేతా మూర్తిత్రయో విభాగినే

వ్యోమవత్‌ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయేనమః

మీమాంసకులు వేదాంతులు అంటారు. ఒక వ్యక్తి ఒక మతాన్ని స్థాపిస్తే, అతని వ్యక్తిత్వం ఆమతంలో ప్రతిభాసిస్తుంది. అని. ఒకవేళ ఆ వ్యక్తిలో ఏవైనా లోపాలువుంటే ఆ లోపాలు కూడ అతడు వ్యాప్తిచేసే మతంలో సంతరించుకొంటాయి. అందుచేత వ్యక్తిగతమైన మతాన్ని వారు ఒప్పుకోరు. స్వచ్ఛమైన మతం ఏదన్నావుంటే అది వ్యక్తి ప్రసక్తి లేక వచ్చిన మతమే అని భావించారు. బౌద్ధక్రైస్తవాలు ప్రబలమైన పిదప వాటి ప్రాముఖ్యం ఆ ప్రవక్తల వ్యక్తిత్వంపై, అనునేయులకు వారిపట్ల ఉన్న గౌరవంపై ఆధారపడింది.

వీరిని అనుసరించి వ్యక్తులపై ఒక అభినివేశముంచి, ఉత్తముడైన ఆచార్యుడంటే వానిని అనుసరించే దానికి మనమూ ప్రారంభించాం. అయితే ఆచార అనుష్ఠానాలు ఉన్నంతమాత్రాన ఒకవ్యక్తి మహాత్ముడైపోడు. అతనిలో ఒక దైవచైతన్యం దర్శిస్తేకానీ మన ఆత్మలు ఉపశమించటంలేదు. ఆ వ్యక్తికి అనుగ్రహశక్తికూడ వుండాలి.

ఇట్టి భగవచ్చైతన్యం, వైదుష్యం, కరుణ, తపస్సు, శిశుసారళ్యం, భక్త సులభత కంచి స్వామిలో చాలమందికి కనిపిస్తుంది. ఈ కారణంగా వారిని చూచినవారూ చూడనివారూ, వారి గుణగానం చేస్తారు.

ఆయన గంటలకొద్దీ పూర్వం పూజ చేసేవారు. గంటలకొలది అవిరామంగా దర్శనమిచ్చి ఆశ్రితులను అనుగ్రహించేవారు. అనర్గళంగా ఉపన్యసించేవారు. గంటలకొలది ధ్యాన నిమగ్నులయ్యేవారు. ఇవి చాలవన్నట్లు వివిధ గ్రంధాధ్యయనం, శాస్త్రాన్వేషణ వారికి ఒక అనివార్య వ్యసనం. ఈ కార్యక్రమానికి కాలమూ, శక్తీ ఎక్కడనుంచి సంపాదించేవారో దేవునికే తెలియాలి.

ఊరు ఊరు తిరుగుతూ ఎనభైఏళ్ళగా జ్ఞానప్రబోధం చేస్తున్న మాస్వామి వాగ్దేవతాస్వరూపులు. వాగ్దేవి మొట్టమొదట పరమవ్యోమంలో పరబ్రహ్మలో అంతర్గతంగా వున్న గౌరి, ఏకపది. పిదప సలిల సదృశములైన వర్ణపదవాక్యములను ఆమె సృష్టించింది. ప్రణవాత్మకంగా ఏకపది. వ్యాహృతి రూపంలో సావిత్రిగ ద్విపది. (భూర్భువస్సువఃతేవ్యాహృతులు). తర్వాత వేదచతుష్టయ రూపంలో చతుష్పది అయినది. అటుపిదప, వేదాంగములు, స్మృతి పురాణ ధర్మశాస్త్రములలో అష్టాపది; మీమాంసాన్యాయ సాంఖ్య, యోగ పాంచరాత్ర పశుపత, ఆయుర్వేద ధనుర్వేద, గాంధర్వ వేదవిద్యా రూపిణియై నవపది, తదనంతరము అనంతవాక్యరూపమున వాగ్దేవి ప్రపంచమంతా ప్రతిభాసిస్తున్నది.

''గౌరీమిమాయ సలిలాని తక్షత్యేక పదీ ద్విపదీ సాచతుష్పది,

అష్టాపదీ, నవపదీ బభూవుషీ, సహస్రాక్షరా పరమేవ్యోమన్‌''

ఇదీ వాగ్దేవతారూపము.

మిత్రదేవతారూపుడైన మాస్వామి ప్రమాదమనే మృత్యువునుండే మనలను రక్షిస్తున్నాడు. మరణంనుంచి రక్షించేవాడే మిత్రుడు.

''సర్వస్యమరణత్రాయకత్వేన సర్వజనమిత్రత్వాత్‌ మిత్ర ఇతి ఉచ్యతే''.

మన గ్రంధులనన్నీ విప్పగల రక్షుడాయనే. అజ్ఞానమనే పాశంతో మూడుముళ్ళు వేసుకొని మనం కూచున్నాం.- అవే బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులు. ఆ గ్రంధులే స్థూలసూక్ష్మ కారణ శరీరములు.

''నీవు ఇవి ఏవీకావు. నీవు నిత్యసత్య చైతన్య ఆనందస్వరూపివి. ఈలోకం మాయ. అద్వైతమే నీకు పరమాశ్రయం'' అని ముక్తకంఠంతో ఎప్పుడూ బోధించే మాస్వామి, జ్ఞాన భాస్కరుడైన మిత్రుడు.

శంనో మిత్రః శంవరుణః

మనం మూడుపురములను స్థిరంగా కట్టుకొని కూచున్నాం. 'పురత్రయే క్రీడతి యశ్చజీవః' ఆ మూడుపురములే స్థూలసూక్ష్మ కారణ దేహములు.

మన స్థూలదేహము పంచభూతాత్మకం. దీనికి ఆరు వికారములున్నవి. పుట్టేది, ఉండేది, పెరిగేది, విరిగేది, తగ్గేది, చెడేది- అనే ఆరు వికారములు.

సుఖదుఃఖములకు సాధనమై, జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, పంచ వాయువులు- మనస్సు బుద్ధి- అనే 17 సామగ్రులతో నిర్మింపబడిన సూక్ష్మశరీరం.

స్థూల సూక్ష్మ దేహములకు కాణమైన కారణశరీరం- పై మూడు శరీరములకు మూడుదశలు- అవే జాగ్రత్స్వప్న సుషుప్తులు. ఈ మూడుదశలలో వున్న జీవులకు పేర్లు విశ్వతైజసప్రాజ్ఞులు. మయుడనే మాయావి ఈ పురములను నిర్మించాడు. ఈ మాయతత్త్వ జ్ఞానంచేతగానీ పోదు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడే మాస్వామి.

వాచందేవా ఉపజీవంతి విశ్వే

వాచం గంధర్వాః పశవోమనుష్యాః

వాచమా విశ్వా భువానాన్యర్పితా,

సానోహవం జుషతాం ఇంద్రపత్నీ-

అన్ని ప్రాణులు గంధర్వులూ, పశువులూ, మనుష్యులూ, సర్వమూ వాక్కును ఆశ్రయించే ప్రవర్తిస్తున్నవి. ఆ వాగ్దేవతా స్వరూపంలో మనం కామకోటి ఇంద్రసరస్వతిని ధ్యానించ కలిగితే ఆ ప్రసాదభావనలో, భావనామాత్ర సంతుష్టహృదయయైన పరమేశ్వరియొక్క అనుగ్రహం పొందవచ్చును. ఆమె అనుగ్రహం లేకపోతే మనం ఈ స్వప్నంలోనుంచీ మేల్కోలేము.

జగద్దీర్ఘ మహాస్వప్నః సోయమంతం సముత్థితః

స్వప్నాత్స్వప్నాంతరం యాన్తి కాశ్చి ద్భూత పరంపరాః

ఆ జగత్తే ఒక దీర్ఘ స్వప్నం. ఈ స్వప్నంలో ఉన్న మనకు ఇంకొక స్వప్నంవస్తుంది. ఇక ఈ పరంపరలకు అంతమేలేదు. జాగ్రత్తుకూ స్వప్నమునకు తేడా ఏమి? ఒకటి స్థిరము, రెండవది అస్థిరము. కానీ రెండూ సమానమే. భగవత్పాదులవారు- స్వప్నే దృష్టే సకలంహిమృషా- అన్నారు.

అతస్త్వం జాగ్రదేవేదం స్వప్నంవిద్ధి మహమతే

స్వప్నంచవిద్ధి జాగ్రత్త్వమేక మేతదజం ద్వయమ్‌.

'జాగ్రత్తును స్వప్నంగానూ, స్వప్నమును జాగ్రత్తుగాను తెలుసుకో. రెండూ బ్రహ్మ స్వరూపములే'. మెలకువలోనే మనం నిద్రపోవడానికి నేర్చుకోవాలి. అపుడే ప్రశాంత భూమికను మనం అవరోహించగలము.

ఆ ప్రశాంత భూమికవలభియే మాస్వామి!

శృంగేరి స్వాములలో 34వ ఆచార్యులు చంద్రశేఖర భారతీ స్వాములవారు మహాతపస్సంపన్నులు. అంతర్ముఖులు, ధర్మావతారమూర్తులు. మహోదరులు. శాస్త్రనిష్ణాతులు. అతీంద్రియ జ్ఞాననిధులు. వారెపుడూ ధ్యానమగ్నులై యుండేవారు. వారు భగవచ్చైతన్య ఘనమువలె ప్రకాశించేవారు.

ఒకపుడు అగ్రిహోత్రం రామానుజతాతాచారియన్‌ వారిని సంధించారు. వారు అత్యాదరంతో కామకోటి స్వాముల వ్యాసపూజ ఎక్కడ చేశారని తాతాచార్యులను అడుగగా మధ్యార్జునంలో అని బదులుచెప్పారు. హిందూమత పునరుద్ధరణ విషయంలో కామకోటివారు చేస్తున్న ప్రయత్నములు చాల అభినందనీయములనీ, తాము వారికి సర్వదా కృతజ్ఞులనియూ, సనాతనధర్మము ఈ మాత్రము ఉండుటకు కంచిస్వాములవారు కారకులనియూ హృదయపూర్వకముగా శ్లాఘించారు. అంతేకాక సంగమేశ్వరశాస్త్రి వారిని తాతాచార్యులకు కావలసిన సహకారమునకు ఆయన నియమించారు.

'విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం''.

అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్రసూర్యౌ

దిశంశ్రోతే వాగ్వివృతాశ్చ వేదాః

వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య

పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా.

బ్రహ్మజ్ఞానం కలగాలంటే అందరికీ ఎట్లా వీలు ఔతుంది? 'భగవంతుడంటాడు, నాహం ప్రకాశః సర్వస్య'. బ్రహ్మజ్ఞానము మనకు ప్రసాదించే గురువు, శ్రోత్రియుడూ, బ్రహ్మనిష్టుడై యుండవలె. మనం ప్రశాంతచిత్తులము శమాన్వితులముగనూ ఉండవలె. అపుడే ఆ బోధచేత మనం ప్రబోధితులమై ఈశ్వరుని దర్శనం చేయగలం.

ఈశ్వరునికి తల అగ్ని. సూర్యచంద్రులు కళ్ళు. దిక్కులే వాని చెవులు. వేదములే వాని వాక్కు. వాయువే వాని ప్రాణం. ఈ విశ్వమే వాని హృదయం. ఈ పృథివియే వాని పాదాలు. ఆ ఈశ్వరుడు సర్వభూతములలోను అంతరాత్మగా వున్నాడు. ఇటువంటి ఉత్తమభావాలు కలిగినవి వేదములు. ఒక్క వేదాలలోనే వున్నాయా ఇలాంటి విషయాలు అని కొందరు అడగవచ్చు.

ధ్యానముద్రలో మునిగి తన్మయస్థితిలో చెప్పిన ఏ కవి మహా వాక్యలైనా, ఏ భాష ఐనా, ప్రతిభావంతంగా వుంటుంది.

జిడ్డు కృష్ణమూర్తి వ్రాతలలో ఈ చైతన్యం ఉంది. ఆయనగారు వాదమును ఒప్పుకోరు. తాను ఒకరికి శిష్యుడు కాడు. తాను ఒకరికి గురువుకాడు. ''మనం స్వయంగా గ్రహించాలి. స్వయంగా నేర్చుకోవాలి. మధ్య గురువెందుకు?'' ఆయనతత్త్వంలో, అంగవైకల్యం వున్నవారు నడవడానికి ఉపయోగించే ఊత కొయ్యలలాంటి వాడు గురవు!

వారి పుస్తకాలలోంచి కొన్ని వాక్యాలు ఉదహరిస్తాను.

Life is both pleasure and pain; darkness and light. Oneday there are alone; another day the sunis shining. Then there is winter and spring. They are part

of our life, our existence.

Don't cling to pleasure; or escape pain. Donot either be attached or detached. Just look at the facts. Then there is neither pleasure or pain.

You learn when there is attention and silence. Be still- in that stillness attend- If you listen attentively- in that silence you will see that the outside

sound and inside sound are the same.

Without affection, life is like a flower that has no scent. Love can flower when there is no hate, no euvy, no ambition. Without love life is like a barren

earth, arid, hard and brutal. But the moment there is affection, it is like earth which blossom with water, with rain and beauty.

When one is not concerned with oneself then one is really a free human being. Then one can look at the skies, the mountains, the hills, the waters, the

trees, the flowers, with a fresh mind with a great sense of affection.

సుఖం దుఃఖం రెండూ జీవితమే. జీవితం అంటే చీకటి వెలుగులు. ఒకరోజు ఆకాశం మేఘావృతంగావుంటుంది. ఇంకోరోజు సూర్యుడు ఉజ్వలంగా ప్రకాశిస్తూవుంటాడు. తరువాత హేమంతం, వసంతం వస్తుంది. ఇవన్నీ మన జీవితంలోనిభాగాలే. అవి మన ఉనికి. నీకు రాగమూవద్దు. విరాగమూవద్దు. సుఖాన్ని అంటిపెట్టుకోవద్దు; బాధనుంచి తప్పించుకోనూవద్దు. ఎపుడు నిశ్శబ్దంలో ధారణచేస్తావో అపుడే నీవు నేర్చుకుంటావు. ఊరక కూర్చో. నిశ్చలంగా ధారణచేయి. నీవు జాగ్రత్తగా విన్నావంటే- ఆ నిశ్శబ్దంలో బయట వినపడే శబ్దం, లోపల వినిపించే శబ్దం రెండూ ఒక్కటే అని గ్రహిస్తావు.

ప్రీతిలేని జీవితం ఒక నిర్గంధకుసుమం. ఎపుడు ద్వేషము, ఈర్ష్య, దురాశ లేకుండాపోతుందో అపుడే మన హృదయంలో ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమలేని జీవితం బీడుపడిన భూమి. అది శుష్కం, కఠినం, రాక్షసం. కాని మన హృదయంలో ఎపుడు ప్రేమ మొలకెత్తుతుందో, అపుడు అది వర్షంలో ఆర్ద్రమై, సస్యశ్యామలమైన శాద్వలంవలె తయారౌతుంది.

స్వార్ధాన్ని విస్మరిస్తేనే మనం స్వతంత్రంకల మనుష్యులమౌతాం. ఆ స్వాతంత్ర్యం వుంటేనే మనం చెట్లనూ, చేపలను, లతాగుల్మాదులనూ, కొండలనూ, లోయలనూ, నీటినీ, నింగినీ, నవవికసిత కుసుమములనూ ప్రేమార్ద్ర నయనాలతో చూడగలం!

ఆయన అంటారు; ''ధ్యానమగ్నమైన మనస్సు సులభంగా మౌనంలో స్థిరమౌతుంది. నిన్ను నీవు ద్రష్టగా చూడటమే ధ్యానం. నీవు ఎట్లా నడుస్తావో, ఎట్లా మాట్లాడుతావో, ఏమికబుర్లు చెబుతావో, దీనిని నిదానంగా చూడటమే ధ్యానం. మనస్సులో అలజడి అశాంతీ వుంటే ధ్యానం కుదరదు. మనోవృత్తులను గమనిస్తూ రావాలి. సంఘర్షణ వున్నచోట సందడి వుంటుంది. ఎపుడు ఈ అలజడులూ, సంఘర్షణా శాంతిస్తుందో, అపుడు మౌనం తానుగ సిద్ధిస్తుంది. ఆ మౌనం విశ్వవ్యాప్తం, అనంతం. ధ్యానమన్నా, మౌనమన్నా, ప్రేమ అన్నా, శాంతి అన్నా అంతా ఒక్కటే. నీవు ఎక్కడవున్నావో, ఏం చేస్తున్నావో తెలియని స్థితియే ధ్యానం. ధ్యానం అంటే దృశ్యానికి ఆవలి పరిధికి వెళ్ళిపోవటం. ధ్యానంలో కాలప్రసక్తి, దేశప్రసక్తీ లేదు. నీవెపుడు లేకపోతావో అపుడే ధ్యానం నీకు కుదిరిందని అర్ధం''.

శ్రీమతి కనకమ్మ రమణ భక్తురాలు. ఆమె తిరువణ్ణామలెలో నివసిస్తున్నది. 1958 సంవత్సరం ఒకరోజు సాయంత్రం ఆమె స్వాములవారి దర్శనార్ధం వెళ్ళింది. వారు అపుడు పడమట మాంబలంలో వున్నారు. ఆమె వెళ్ళినపుడు స్వాములవారి వద్దవున్న పరిచారకులు తప్ప వేరెవరూ లేరు. శాంతంగానూ, నిదానంగానూ. ఏకాంతంగానూ స్వాములవారిని చూడటానికి ఇటువంటి అవకాశం లభించినందులకు ఆమె ఎంతో సంతోషించింది. సాంజలియై ఆయన మ్రోల నిలుచుంది. స్వాములవారు మందస్మితంతో ఆదరంగా ఆమెను అడిగారు; ''ఈ రోజుల్లో నీవు మద్రాసులో వుంటున్నావా? అని''

కనకమ్మ ఔనని జవాబిచ్చింది. తర్వాత శ్రీవారు ఆమె తల్లినిగూర్చి, ఇతర బంధువులనుగూర్చి కుశలాదికములు అడిగారు.

''నీవు తిరువణ్ణామలె రమణాశ్రమంలో ఇంకా వుండటంలేదా?'' అని అడిగారు.

'నేను అక్కడకు పోయినప్పటినుంచి నా నివాసమక్కడనే' అని బదులిచ్చింది.

తర్వాత - ఆయన ;

'ఏకాంత వాసమా?' అన్నారు.

నోరుపెగలక, ఔనని తల ఆడించింది.

'స్వయంపాకమా?' అని శ్రీవారు తర్వాత అడిగారు.

నీవంటను నీవే వండుకొంటున్నావా అన్న ప్రశ్నకూ ఆమె ఔనని బదులిచ్చింది.

స్వాములవారి ప్రశ్నలు వట్టి ప్రశ్నలేకావు. ఆ ప్రశ్నలలోనే ఉత్తరములున్నవి. ఈ ప్రశ్నలు ఆమెకు ఎంతో సంతోషం కలిగించింది. ఈ ప్రశ్నత్రయము, ఆమెకు ఆదేశత్రయమని అనిపించింది. పిదప స్వాములవారు తన చేతినెత్తి ఆమెను ఆశీర్వదించారు.

ఆమె రమణాశ్రమం దాపున ఒక చిన్న ఇంటిలో ముందువలెనే ఏకాంతవాసము, వేదాంతశ్రవణమూ, స్వయంపాకమూ చేసుకొంటూ తన సాధన చేసుకొంటున్నది. మురుగనార్‌ అనే రమణభక్తులు ఆమెకు రమణగ్రంధావళిని బోధించేవారు. కామకోటి స్వాములవారు ఇట్లు మూడు ప్రశ్నారూపక ప్రబోధములతో ఆమెను ఆశీర్వదించి ఆమె నడుస్తున్నమార్గం ఆమెను సుస్థిరగా చేశారు.

నేను ఒకపుడు కంచిలో స్వామివారిని దర్శించటం తటస్థించింది. వారు అపుడు శాంతీశ్వరాలయానికి వెళ్ళివున్నారు. సమయం సుమారు 12గంటలు. మధ్యాహ్నం. ఆ ఆలయానికి సమీపంలో ఒక శిధిలమైన కోనేరున్నది. ఆ కోనేటినుంచి ఆ మండుటెండలో, మండుతున్న ఇసుకలలో, స్వాములవారు నిదానంగా వెన్నెలలో విహరించే వారిలా నడుస్తున్నారు. ఆలయానికివెళ్ళి ప్రదక్షణచేసి, కొబ్బరికాయనుకొట్టి ఆలయంముందున్న ఒక చిన్న మండపంలో స్వాములవారు కూచున్నారు. ఆ ఆలయంలోని మూర్తి వ్యాసభగవానులకు శాపవిమోచనచేసి శాంతినిచ్చిన శ్రాంతాశ్రయేశ్వరుడు. స్వాములవారు ఎక్కడకు వెళ్ళితే అక్కడకు వెళ్ళే జనం సుమారు ముపై#్పమంది ప్రోగైనారు. స్వామివారు మమ్మల్ని అందరనీ కూచోమని చెప్పి ఈక్రింది శ్లోకం చదివారు.

ఆకాశశ్చికురాయతే దశదిశా భోగోదుకూలాయతే

శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే-

వేదాంతో నిలయాయతే సువినయో యస్యస్వభావయతే-

తస్మిన్‌ మేహృదయం సుఖేనరమతాం సాంబే పరబ్రహ్మణి.

ఈ శ్లోకం ఎక్కడిదో తెలుసా? అని అడిగారు. ఒకరు శంకరులవారి దశశ్లోకిలోనిది అని చెప్పగా శ్రీవారు వెంటనే మరొక శ్లోకం చదివారు;

గోవిందా దధికం నదైవతమితి ప్రోచ్చార్య హస్తావుభా

ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతోవ్యాసో మునీనాం పురః

యస్యస్తంభిత పాణి రానతి కృతా నందీశ్వరేణాభవ

త్తస్మిన్‌ మే హృదయం సుఖేనరమతాం సాంభే పరబ్రహ్మణి.

పూర్వం కృష్ణద్వైపాయన వ్యాసమహర్షులవారు కలి ఆగమనానికి భీతిచెంది కాశీవాసం చేస్తున్నారట. వారిని మునులుచూచి భగవంతుని విషయంలో వేదవేదాంత నిర్ణయమేమి అని అడిగారట. అన్ని శాస్త్రములు చక్కగా మరల ఆలోచనచేసిన పిమ్మట, తేలినదేమిటంటే నారాయణుడొక్కడే శ్రేష్ఠుడు. అతనికి మించిన దైవం వేరేలేదని, విశ్వేశ్వరుని ముందు తన రెండు భుజములను ఎత్తి ఇట్లు వ్యాసులు ఘోషించారట.

''సత్యం సత్యం పునస్సత్యయుద్ధృత్య భుజముచ్యతే-

వేదాచ్ఛాస్త్రం పరంనాస్తి, నదైవం కేశవాత్పరం''.

అని మోహంతోనూ, మతిభ్రమంతోను ఈశ్వరుని ముందు ప్రపాదించారట.

దీనిని వినగానే శివుడేమో నిశ్చలంగా కూర్చున్నాడు. కాని నందీశ్వరులకు చాల కోపం వచ్చింది. వ్యాసులవారి రెండు భుజాలూ, ఊర్ధ్వంగా ఉన్నవి అట్లే స్థంభించిపోవాలని ఆయన శాపమిచ్చాడు. వెంటనే వ్యాసులవారి ఎత్తినచేతులు ఎత్తినట్లే; అచలమై, ఉపలసన్నిభ##మై స్థబ్ధమై పోయింది.

'అయ్యో ఈ ఇక్కట్టులోనుంచి ఎట్లా బయటపడేదని' ఆయన, కృష్ణవపుర్ధరుడయిన విష్ణువును ధ్యానించారు.

అపుడు వ్యాసులవారి ముందు విష్ణువు క్రోధాక్షులతో ఆవిర్భావించాడు.

ఓ మునీ! ఎప్పుడూ వేదాలను వల్లెవేసే నీకు ఇట్టి మోహం ఎట్లా దాపురించింది? మహావాక్యములచే సునిశ్చితముగా తీర్మానింపబడిన విషయం నీ వెరుగవా? శుభుడు సర్వులకును ధ్యేయుడు సర్వేశ్వరుడని నీకు తెలియదా?

సర్వమన్యత్పరితజ్య శివఏవశివంకరః- ధ్యేయ- అనే ఆగమార్ధం నీవెట్లా మరచిపోయావు? ఎందుకిట్లు మూఢుడైపోయావు?

యజ్ఞకర్తాచ దేవేంద్రో వేదకర్తాచ వాక్పతిః

అహం సర్వజగత్కర్తా మమకర్తా మహేశ్వరః

తస్య దేవాధిదేవస్య కర్తాకోపి నవిద్యతే-

స ఏవ సర్వజగతాం ప్రవర్తక నివర్తకః-

తస్యలింగం మయారాధ్య చారుచిత్రంమయాసహ

ఇదం విష్ణు పదంప్రాప్తం బ్రాహ్మంచ బ్రహ్మణాపురా

సర్వేషామపి దేవానాం పదప్రాప్తి స్తధైవనః

తమేవశరణం గచ్ఛ మోహం త్యజమునే Z ధునా.

యజ్ఞకర్త దేవేంద్రుడు. వేదకర్త బ్రహ్మ. నేను సర్వ జగత్కర్త. నన్ను సృష్టించినవాడు మహేశ్వరుడు. అతడే దేవాధిదేవుడు. అతనిని ఎవరు సృష్టించారో ఎవరికీ తెలియదు. సర్వజగత్తుల ప్రవర్తన నివర్తకుడు ఆయనే. ఆయన లింగాన్ని పూజించి నేను విష్ణుపదం పొందాను. బ్రహ్మ పదవిని బ్రహ్మ పొందారు. అన్ని దేవతలకూ వారి వారి స్థానాలు ఆయన యిచ్చిన భిక్షనే. అందుచేత నీమోహాన్ని వదలి ఆయననే శరణు కోరుకో- అని విష్ణువు వ్యాసులవారిని తీవ్రంగా మందలించారు.

వ్యాసులవారికి తమ తప్పు తెలిసింది. ఆయన ఏం చేస్తాడు? శివాపచారం చేశాడు. అన్నిటినీ సృజించి గ్రసి చేవానియెడ, మృత్యువునే ఊరగాయవలె నంచుకునే శివునియెడ చేసిన అపరాధానికి నిష్కృతి అంత సులభమా? ఆయన యోచించి కంచికి వచ్చాడు. అక్కడ శివలింగం స్థాపించి పూజించాడట. ఆ వ్యాస ప్రతిష్ఠయే వ్యాస శ్శ్రాంతాశ్రయేశ్వరుడు. ఆ ఆలయ ప్రాంగణంలో అపరవ్యాసులవలె స్వామి ఈ కథ చెప్పినపుడు, వారి హావభావాలు, కథనధోరణి నాకు ఇంకా కనులలో మెదలుతూవుంది.

ఇంతకూ స్వామివారు చెప్పవచ్చినది శివవైష్ణవ భేదములను గూర్చి శైవులు శివుని ఆధిక్యం ప్రశంసిస్తే, వైష్ణవులు విష్ణువే విశ్వాధికుడని అంటారు. లింగాయతులు పైకెత్తబడిన వ్యాసమహర్షి చేతులనే తమ బిరుదుగా గ్రహించారు. వైష్ణవులు శైవాన్ని నిరసించటం తెలిసినదే. విష్ణుసహస్రనామంలో

సర్వశ్శర్వ శ్శివ స్థాణు ర్భూతాదిర్నిధి రవ్యయః

సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః

అన్న నామావళి పూర్ణంగా శివ చిహ్నంగా వున్నది. వైషమ్యాలు వదలి విశ్వేశ్వరునిలో విశ్వరూపదర్శనం చేయటమే స్వాములవారు బోధించేది. ఒక్కొక్క ఉపన్యాసంలోనూ ఈశ్వరప్రణిధానం ఎంత ప్రధానమో స్వామివారు చర్వితచర్వణంగా చెప్పివున్నారు.

కంచిలో ఈ వ్యాసశ్రాంతాశ్రయేశ్వరాలయం నేటికీ వున్నది. వ్యాసులు శివుని ఈ విధంగా ప్రార్ధించారు-

ధర్మార్ధీలభ##తే ధర్మ మర్ధార్ధీ చార్ధ మాప్నుయాత్‌

కామానవా ప్నుయాత్కామీ మోక్షర్ధీ నిర్వృతింపరామ్‌

యంయం ప్రార్ధయతేZ భీష్టం తంతంసంప్రాస్యముచ్యతామ్‌

విషువాయనకాలేషు పుణ్యచ సమయాంతరే

త్వామాశ్రిత్య భ##వే న్ముక్తోవ్యాసశాంతాభిధేశ్వరమ్‌

యోనా కోవాతిధౌ యస్యాంకస్యాం వాపి సకృన్నరః

శ్రాంతాశ్రయం త్వామారాధ్య మర్త్యయోనిం నసంవిశేత్‌

మయా సంస్థాపితే లింగే వ్యాసశ్రాంతాశ్రయేశ్వరీ-

ఆర్తిహంతయైన శివుడు ఈ విధంగా పరాశరసుతుడు ప్రార్ధిస్తే ఏమంటాడు?

'తధాస్తు' అని అన్నాడు.

ఆనందవికటన్‌- తమిళపత్రికకు చేరిన భరణీధరన్‌ ఇలా వ్రాస్తారు;

విలియంకూపర్‌ అనే ఆంగ్లకవి- అలెగ్జాండర్‌ సెల్కిర్క్‌ యొక్క ఏకాంతము (The Solitude of Alexander Selkirk) అన్న పద్యమాలిక వ్రాసాడు.

దానిని జ్ఞాపకము తెచ్చుకున్న స్వామి తన మృదు మధుర స్వరముతో చక్కని ఆంగ్లోచ్ఛారణతో ఈ క్రింది పద్యం చదివారు.

O solitude! where are the charms

That Sages here seen in thy face?

Better dwell in the midst of alarms

Than reign in this horrible place.

స్వాములవారు కనకమ్మను ఏకాంతవాసమా అని అడిగారు.ఏకాంతవాసమంటే ఏమిటి? ఏకంలో అంతంకావడమే ఏకాంతం. ఆచార్యులవారు,

'ఏకాంతేసుఖ మాస్యతాం-పరతరే చేతం సమాధీయతాం' అని సాధనపంచకంలో బోధించారు. ''ఏకాంత ప్రదేశంలో సుఖంగా కూర్చొనుము. పరబ్రహ్మములో నీ చిత్తాన్ని సమాధానం చేయుము'' అని వారన్నారు. సాధకునకు కాలక్రమేణ జనసంపర్కములమీద అయిష్టం ఏర్పడుతుంది. నానావిధములైన మనుష్యులతో మనం సంసర్గం పెట్టుకొంటే మనస్సు అట్లే విక్షేపమౌతుంది. ఐతే ఏకాంతం జనసందోహంనుంచి వెళ్ళిపోయి నిర్జనస్థానవాసం చేసినంతమాత్రాన లభించదు. ఏకాంతం ఒక అంతరంగిక మానసిక సాధన. కోరికలతో నిండిన మనస్సుకు హిమాలయాలకువెళ్ళినా ఏకాంతస్థితిని పొందటం కష్టం. విరక్తుడు ఏ దేశంలోవున్నా ఏకాంతుడే. ఏకాంతమంటే వైరాగ్యమే.

వాస్తవమే. అభ్యాసకాలంలో జనసమూహంనుంచి వెళ్ళిపోవడం ఒక సాధనాంగమే; కానీ ఆ సాధకుడు మళ్ళా జనసందోహంలోనికి వచ్చినపుడు అతని ఏకాంతతకు భంగం కలిగిందంటే, అతని విజనవాసం ఫలవంతమయినదని ఎట్లా చెప్పగలం?

ఈశ్వరునిలో మనస్సు లగ్నంకావటమే ఏకాంతం. అన్నీ ఈశావాస్యమైనపుడు, అంతా ఈశ్వరుడైనపుడు, మనకు ప్రత్యేకంగా ఏకాంతం ఎక్కడనుంచీ వస్తుంది? ఏకాంతాన్ని మనం సరిగా అర్ధం చేసుకోవాలి.

ఒకవిధంగాచూస్తే మనం ఏకాంతాన్ని అపేక్షించేది ఒక భయంచేతనేకదా! జనసందోహంచేత మన ఏకాంతం భంగమైపోతే ఆ ఏకాంతపు విలువ అంతేకదా! మనో వృత్తినియమనంకోసమే కదా మనం ఏకాంతం అపేక్షిస్తున్నాం. ఆ చిత్తవృత్తులు ఏ దేశంలో నిరోధమవుతున్నవో ఆదేశ##మే ఏకాంతప్రదేశం. అక్కడ వేలమంది జనం వుండవచ్చు. కానీ నీవరకు నీవు ఏకాంతుడవే.

స్వాములవారు చెప్పిన ఇంగ్లీషు పద్యం అదే చెబుతున్నది. ఓ ఏకాంతమా నీ ముఖములో సత్పురుషులు చూచిన సొగసులెక్కడ?

ఈ ఘోరమైన విజనప్రదేశంలో రాచరికం చేయడానికి బదులు, అపాయకరమైన జనవాసమే మేలు అని నాకు అనిపిస్తుంది, అని కవి అంటాడు.

మనస్సు ఒక సినిమాతెరవంటిది. ఆ తెరపై ఎన్నోదృశ్యాలు చూస్తాం. కష్టాలూ, సుఖాలు, పోరాటాలూ, దోపిడులూ, హత్యలూ, పెళ్ళిళ్ళు, చావులూ, నవరసభరితములైన నానారకములైన సన్నివేశాలను చూస్తాం. ద్రష్టకు గానీ, ఆ తెరకుకానీ,ఈ సన్నివేశాలతో సంబంధమేమి? అగ్నిప్రమాదం ఏర్పడినప్పుడూ ఆ తెర, దహింపబడటంలేదు. సముద్రం పెల్లగిల్లినా, ఆ తెర తడికారటంలేదు. తెర తెరగానే వుంది. దృశ్యాలనుచేసే దర్పణంలాంటిదా తెర. మనస్సుఊ అంతే. ఆ మనస్సనే పలకసై విషాద గీతికలూ, ప్రేమ గీతికలూ, లెక్కలూ, వ్యాకరణమూ, వేదాంతము దేనినైనా వ్రాయవచ్చును. అన్నీ తుడిచివేయనూ వచ్చు. పలక పలకలాగే వుంటుంది.

మాస్వామి మహాసుసారి. ఆయన చీమలా పనిచేస్తుంటారు. అవిరామ కర్మప్రవాహంలో ఆయన ఈదుతున్నా, ఆయన ఏమో ఏకాంతియే?

చిదు పత్వాన్నమే జాడ్యం, సత్య త్వాన్నానృతుమమ

ఆనంద త్వాన్నమే దుఃఖం అజ్ఞానాత్‌ భాతిహిత్రయమ్‌.

(స్మాత్మ ప్రకాశివ)

నేను చిద్రూపడనైనందున నాకు జడత్వంలేదు. సత్యస్వరూపడనైనందున నాకు అనృతం-వినాశం లేదు. ఆనందస్వరూపడనైనందున నాకు దుఃఖంలేదు. జాడ్యం, అసత్యం, దుఃఖం అన్నీ అజ్ఞానంచేత కలుగుతుంది. జ్ఞానస్వరూపుడనైన నన్ను ఇవేంచేస్తుంది? నేను ఎపుడూ ఏకాంతంలోనే వున్నాను. నేను బ్రహ్మను- అన్నట్లు స్వాములవారు విహరిస్తుంటారు!

మనసు సంతోషంగా వుండవలెనంటే- మనం ఈ 'నేను' నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అనామక బ్రహ్మమైపోవాలి. మనచుట్టూ జరుగుతున్న సంభవాలతో మనం ఎలాంటి సబంధమూ వుంచుకోరాదు. ఇతరుల హావభావములతో కానీ, వారి ప్రవర్తనతోకాని మనకు ఏవిధమైన ప్రసక్తి వుండరాదు. జీవితంలో జరిగినా, జరుగుతున్నా, జరుగబోయే సంభవాలన్నీ ఈశ్నరేచ్ఛపై నడుస్తున్నదని విశ్వసించాలి.

'కష్టసుఖాలు కావడికుండలు' అనే సామెత మనమెరిగినదే.చక్రనేమి పైకి పోయినది క్రిందికెట్లా వస్తుందో, క్రింద పోయినది పైకి ఎట్లా వస్తుందో, అట్లే పునరావృతములౌతుంటాయి.

అన్నింటికంటే ప్రధానమైనది మన హృదయంలో దైవసాన్నిధ్యం. మనకాసాన్నిధ్యం వుందని ఎట్లా తెలుసుకోవడం? 'మనకొక రక్షకుడున్నాడు. మన యోగక్షేమాలు అతడు చూచుకొంటాడు. మనకు కావలసిన ఆదేశం అతడు సకాలంలో అందజేస్తాడు. మన శ్రేయస్సు, ప్రేయస్సు వాని చేతిలోనివే'' అన్న అచంచల విశ్వాసమే ఆ సాన్నిధ్యం. ఆ సాన్నిధ్యం మనకు అవగతమైతే ఒక అఖండానురాగం, ప్రేమ, సంతోషం, ప్రశాంతత, మనవ్యక్తిత్వంలో ప్రతిఫలిస్తుంది.

మనం దుఃఖంలో వున్నపుడు, నిర్వేదం చెందినపుడు మనకు గురురూపంలో ఈశ్వర చైతన్యం సాక్షాత్కరిస్తుంది.మన గురువు దూరంగావుంటే, ఏ ఇతర మహాత్మునిరూనంలోనో ఆయన మనకు వలసిన సదుపాయం కలుగుచేస్తాడు. సద్గురువును ఆశ్రయించిన వారికి ఉపాధుల విషయంలో ఏ విధమైన తికిమకలూ ఉండవు; సర్వోపాధులూ గురుస్వరూపమే.

స్వామీబ్రహ్మానందులవారిని యతీశ్వరానంద ఒకపుడు ఏదైన ఆదేశమివ్వండి అని అన్నాడట; ఆయన-

Struggle, Struggle, Struggle- అని ముమ్మారు అన్నారట.

Struggle అంటే సమరం. జీవితం అంటే దైవాసురశక్తులమధ్య ముమ్మరంగా జరిగే యుద్ధమేకదా! అందులకే కదా గీతాచార్యులు 'యుద్ధస్వవిగతజ్వర' అని అన్నారు.

నిజమైన గురువు మన నిజస్వరూపమేమిటో మనకు విశదంచేస్తాడు. దైవమే గురురూపంలో మనకు ప్రత్యక్షమై మనకు చిత్తశుద్ధికలిగించి మనలను అంతర్ముఖులనుచేసి ఆత్మాన్వేషణా మార్గంలో మనలను నడిపించి గమ్యం చేరేటట్లు చేస్తాడు. ''తస్యనిశ్చింతనంధ్యానం'' గురు ధ్యాన అంటే కదలక మెదలక కూచోవటమే. మన గురువువెపుడూ మనతోనే వుంటాడు. మన అంతర్యామియే గురువు. గురువే శివుడు, శివుడే గురువు.

శివప్రసాదేన గురుప్రసాద శ్శివప్రసాదేన చశంభుభక్తితః

విశుద్ధవిజ్ఞాన దివాకర స్త్యయంప్రదగ్ధ పాపస్యతయోవినాశకృత్‌

స్వస్వరూపతయా సర్వం వేద స్వానుభ##వేనయః

సధీర స్సతు సర్వజ్ఞ స్సశివ స్సతుదుర్లభః

అతో జ్ఞానప్రసాదార్ధం శివస్సాంబ స్సనాతనః

ఉపాసితవ్యో మంతవ్యోశ్రోతవ్యశ్చ ముముక్షుభిః

ఓం తత్సత్‌.

Maa Swami    Chapters