Maa Swami    Chapters   

11. పూజ్యపాదుల ఆదేశము

(దుర్ముఖవత్సర ఫాల్గుణ కృష్ణపక్ష ప్రధమా)

ఈశ్వరానుగ్రహా దేవ పుంసా మద్వైత వాసనా

దుర్లభం త్రయ మే వైతత్‌ దైవానుగ్రహహేతుకమ్‌.

మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః

స్వవర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్‌,

జ్ఞాన ముత్పద్యతేపుంసాం వైరాగ్యాది చతుష్టయమ్‌

తథా వ్యనుగ్రహా దేవ తరుణందు శిఖామణ,

అద్వైతవాసనా పుంసా మావిర్భవతి నాన్యథా

అను నిట్టివి మొదలుగాగల యాచార్యుల వాక్యములును ఆస్తవాక్యములును ఈశ్వరానుగ్రహమే పరమశ్రేయమును చేకూర్చునని బోధించుచున్నవి.మన మందరమును ఈశ్వరానుగ్రహము కొరకే గట్టి ప్రయత్నము చేయవలయును. ఈశ్వరానుగ్రహమువలననే అందరకును మేలు చేకూరును. ఈశ్వరుడు ఏ యే ప్రాణికి ఎంత ఆయువు ననుగ్రహించునో ఆ యాయువెల్ల ఈశ్వరుని ఆనుగ్రహమును నిండార సంపాదించుటకే వ్యవము చేయవలయును. కానియెడల ఆయువెల్ల వ్యర్థమే అయిపోవును.

ఆయువునకు ప్రయోజనము సంపాదింపవలయునేను ఈశ్వరానుగ్రహమునెడలనే చూపెల్లయపుడు సారించునది. ఈశ్వరానుగ్రహమునకు ప్రయత్రముచేయక ఒక క్షణమేని వ్యయింతుమేని మన జన్మ వ్యర్ధమగును. ఈశ్వరానుగ్రహము ప్రాణులన్నిటిపై ప్రసరించునటులును, ప్రాణులందరును ఈశ్వరభక్తి భరితులై యుండునటులును అనుగ్రహింపుమని పరమేశ్వరుని సన్నిధానమున మనము ప్రార్ధింపవలయును. అట్టి జన సమూహములో ప్రతివాడును ఇమిడియున్నాడు కాన ప్రాణులందఱను కలసికట్టుగా పరమేశ్వరభక్తులు కాగలరు.

నేటి కేబదియేండ్లు నిండెనని ఎరుగుదుము. ఈ యేబదియేండ్లలో ఏమి చేసితిమని వెనుదిరిగి చూచుకొనినందువలన అంతగా ప్రయోజనమేమియు లేదు. భగవంతుడనుగ్రహించిన శేషకాలమును ఎట్టి కర్మకు వినియోగించిన ఫలవత్తరమగునో దానినాలోచింపలగ్గు. అట్టి కర్మ యేదయియుండును? నైష్కర్మ్యసాధనమే అట్టిది. ఊరక గూర్చుండుటయే నైష్కర్మ్యముకాదని భగవానుడు గీతలలో మాటిమాటికి గానము చేయుచుండును కావున కర్మచేతనే నైష్కర్మ్యము సంపాదింపజెల్లును.ఈ యెడల భగవత్పాదులే- ''మీ మీ కర్మను లెస్సగా చేయుడు; దాననీశ్వరు నర్చింపుడు'' అని యిచ్చిన ఆజ్ఞను అందరకును మరల మరల గురుతుకుతెచ్చి మేమును గురుతు పెట్టుకిందుము. మనము మన మన పనులను లెస్సగ చేయుదము. స్వకర్మానుష్ఠానమే భగవత్పూజ, భగవదారాధనము. అదియే భగవదనుగ్రహమునకు ద్వారము. కావున మన మన కర్మలలో మనము నెలకొని ఆయా కర్మచేత భగవంతు నర్చించుచు పరశ్రేయమును సంపాదింతము.

నమః పార్వతీపతియే.

Maa Swami    Chapters