Maa Swami    Chapters   

3.స్వాములవారి సన్యాసకథనం

స్వాములవారు ఎప్పుడు ఎట్లు సన్యాసం తీసుకొన్నారు?

'యదహరేవ విరజేత్‌ తదహరేవ ప్రవ్రజేత్‌'

'ఏ రోజు నీకు విరక్తి పుట్టిందో ఆరోజే సన్యసించు' అని శాస్త్రము చెబుతున్నది.

దుర్వార సంసార దవాగ్నితప్తం

దోధూయమానం దురదృష్టపాతైః

భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో

శ్శరణ్యమన్యం యదహంనజానే-

కథంతరేయం భవసింధుమేతం

కావాగతిర్మే కతమో z స్త్యు పాయః

జానే నకించిత్కృపయావమాం ప్రభో

సంసార దుఃఖక్షితి మాతనుష్య.

నేను సంసారమనే కాఱుచిచ్చులో చిక్కుకొని తపిస్తున్నాను. దురదృష్టములనే ప్రతికూల వాయువులు నన్ను పీడిస్తున్నవి. నీవు తప్ప నాకు వేరుగతి లేదు- ఈ సంసార సముద్రమును నేను ఎట్లు దాటగలను? నాకేమైనా గతీ, ఉపాయమూ ఉన్నదా? అని స్వాములవారు ఏమైన గురువు నాశ్రయించారా?

స్వాములవారు సన్యాసం తీసుకొన్నపుడు వారికి పదమూడేళ్ళు. బహుశా సంసారమనే పదానికి అర్ధంకూడ తెలియని ప్రాయం అది. వారు విరక్తితోనో, జ్ఞానలబ్ధికోసమో సన్యసించలేదు. ఈ విషయం గూర్చీ, తన చిన్నతనపు కొన్ని అనుభవాలనూ- జీవితం నేర్పిన పాఠాలు- అన్న శీర్షికతో ఈ విధంగా ఒకపుడు వారు వివరించారు.

Maa Swami    Chapters