Maa Swami    Chapters   

16. ప్రేమ - అహింస

ప్రేమ చాల దొడ్డది. అదే లేకపోతే మనబ్రతుకు వృధా. ఆకాశము, భూమి, నక్ష్రతాలు, పశువులు, పక్షులు, తరులతాగుల్మాదులు- ఇట్లు సృష్టి విచిత్రంగా వివిధంగా ఉంటున్నది. వీటినన్నిటినీ పరికిస్తున్నపుడు మన హృదయం ఒక ప్రేమ స్రవంతిలా పొంగిపోవాలి. మన హృదయాలు ఇట్లా అఖండంగా ప్రేమభరితమైపోతే మన మనస్సులలో ఈ విశ్వప్రేమ చెరగిపోని ముద్రగా నిలిచిపోగల్గితే దుఃఖం అనేది మనకు అంటదు. మనకు చాల దవ్వులో ఉంటుంది. పసిపాపలను గమనించండి. వారి హృదయాలు ఎప్పుడూ ఏదో అనిర్వాచ్యమైన ప్రేమతో తొణికిసలాడుతూ ఉండవి. కాని వాళ్ళు పెరిగేకొద్ది ఈ ప్రేమ తగ్గుతూ వస్తుంది. అంటే లౌక్యంలోనికి తమ హృదయాలను తరిఫీదు చేస్తున్నారన్నమాట. మాతృప్రేమ-ప్రేమ పరాకాష్ఠ. దానిసాటి అదే. అందుచేతనే ఆచార్యులవారు జగదంబను సంబోధిస్తూ 'కుపుత్రో, జాయేత, క్వచిదపి కుమాతా న భవతి' అని సెలవిచ్చారు. తల్లి తన సంతానాన్ని నిర్వ్యాజంగా ఎట్లు ప్రేమిస్తుందో, అట్లే మనమూ ఈ విశ్వాన్నంతా మన ప్రేమలో ముంచివేస్తూ, ఇతరుల కష్టసుఖాలలో మనకూ భాగస్వామ్యమున్నదనీ భావిస్తూ చేతనైనంత సహాయం చేస్తూవుండాలి.

'జాతస్య హి ధ్రువో మృత్యుః' పుట్టినది గిట్టుతున్నది. ఇదొక తిరుగులేని చట్టం. ప్రేమ విషయమూ అంతే. ఈ ప్రేమ ఏనాడో అంతరించవలసినదే. అందుచేత ప్రేమలో దుఃఖాంశం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. మన బంధుమిత్రులను ఎంతో ప్రేమాధిక్యంతో చూచుకొంటూ ఉంటాం.

కాలంచెల్లి ఎవరయినా వీరిలో గతిస్తే ఎంతో విచారం వేస్తుంది. హృదయం పగిలిపోయేటట్లు దుఃఖం కల్గుతుంది. అందుకోసం మనం ప్రేమించకుండా ఉండగలమా? కానీ ఇవన్ని ఒకరోజు అంతమైపోయే ప్రేమలు. ఇదికాక అవినాశ##మైన అనంతమైన ప్రేమ ఒకటివున్నది. అది దైవమందు మనం ఉంచే ప్రేమ. భగవంతుడు అనంతుడు. అవినాశి. దేశకాల అపరిచ్ఛిత్నుడు. సృష్టి ప్రళయాలకు అతీతంగా అవికారంగా ఉండేవాడు. సమస్త వస్తుజాలమూ, చరాచర ప్రపంచమూ ఆయనలో పుట్టి ఆయనలోనే లయిస్తున్నది. చిచ్ఛక్తుల సమ్మేళనమే ఈ జగత్తు. 'ఈశావాస్య మిదం సర్వం' అన్న శ్రుతివాక్యాన్ని గుర్తుంచుకొని, అన్నిటిని మనం ఈశ్వర మయంగా, ఈశ్వర స్వరూపంగా భావించాలి. లోకంలో చీకటి ఎంత ఆవరించి ఉన్నా, ఆకాశంలో అరుణరేఖలు నెలకొనగానే ఎంతచీకటి అయినా విరిసిపోతుంది. లోకములోని సమస్త వస్తువులూ వానివాని కాంతినీ, శక్తినీ, అందాన్నీ, ఆకారాన్నీ ఆ సర్వేశ్వరుని మూలంగానే పొందుతున్నవి. అందుచేత మనం ఈ జగత్తును చిన్మయంగా, భగవన్మయంగా చూడగల్గినవాడు, ఒకవస్తువు పోయినదే అనికాని, ఒకమనిషి చనిపోయాడే అని కానీ దుఃఖించం. దుఃఖం తీరవలెనంటే భగవత్రపేమ వృద్ధికావాలి.

అహింస ఈ విశ్వప్రేమకు బాహ్యచిహ్నం. అది మనోవాక్కాయకర్మలా ఉండాలి. కాని అహింస ఎంత ఆచరణీయమైనా పూర్ణ అహింసానుష్ఠానం ఆచరణంలో పెట్టగలమా అంటే పెట్టజాలమనే చెప్పాల్సివస్తుంది. అన్ని జాతులవారు, అన్ని తరగతులవారూ సర్వకాల సర్వావస్థలలో అహింసను ఆచరించడం అనేది కానిపని. ఒక ఆవుదూడ చికిత్పకు లొంగని వ్యాధితో మరణబాధ పడుతున్నదని, దాని బలవన్మరణానికే సంపూర్ణ అహింసావాదులైన మహాత్మాగాంధీగారే అంగీకరించినారట. ఈ హింసాకార్యంలో జీవకారుణ్యం పెనవేసుకొని ఉన్నది. కాశ్మీరంలో దేశరక్షణకోసం సైనికులను నియమించవలసినదే యని అన్నారట. 'ఎవడైనా చెంపపై కొట్టితే, మరొక్క చెంపనుకూడా అతనికి చూపు' అన్న జీససుక్రీస్తు అనుయాయులే పాశ్చాత్యదేశాలలో రెండు ప్రపంచ యుద్ధాలను తెచ్చిపెట్టి అవి చాలవన్నట్లు క్రొత్త క్రొత్త మారణాయుధాలు సృష్టించడంలో మహౌత్సుక్యం చూపుతున్నారు. వైదిక యజ్ఞాలలోని పశుహింసను అధిక్షేపించిన బుద్ధుడు, భిక్షాపాత్రంలో వేసిన సూకరమాంసం తిని, అతిసారవ్యాధితో మరణించినట్లు చెపుతారు- బౌద్ధాన్ని పాటించే ఇతర దేశాలలో. తాము చంపక పోయినా ఇతరులందించే మాంసాహారం నిరాపేక్షంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఇవన్నీచూస్తే అహింస ఒక ఉన్నత లక్ష్యమైనా ఆచరణలోకి వచ్చేసరికి కొంత కుంటుపడుతుందని మనం గ్రహించవలసి వస్తుంది.

ఇక ఈ విషయంలో హిందువులమాట చూద్దాం. ఆచారబద్ధంగా హైందవాన్ని పాటించేవారిలో చాలమంది శాకాహారులే. చేపలు తినడంలో పాటింపులేని వంగీయులలో సహ వితంతువులు చేపలుతినడం మానడమేకాక ఏకాదశినాడు నిర్జలోపవాసం ఉంటారట. దక్షిణాదిలో శైవం పాటించే వారిలో చాలమంది శాకాహారులు. బ్రాహ్మణతరులలో మాంసాహారులున్నా, కొన్ని తిథులలో, ముఖ్య దినాలలో మాంసం ముట్టుకోరు- జీవహింస కలుగుతుందని మాంసాహర నిషేధానికి కారణం చెప్పుతుంటారు. ఆ విధంగా చూస్తే కాయగూరలలోనూ జీవమున్నది. వానిని తరిగేటప్పుడు జీవహింస కలుగుతున్నది. వంటలో బీజగర్భానికి విచ్ఛతి కలుగుతూనే యున్నది. అదీ హింసే. జీవహింస అనే పట్టింపు కలవారు బాగుగావండిన ఫలాలనూ- జీర్ణ పర్ణాశినః క్వచిత్‌- పండి రాలిపోయిన ఆకులనూ భక్షణ చేయవలసినదని శాస్త్రం నిర్దేశిస్తున్నది. పూర్వం ఋషులు ఆ విధంగా పర్ణభక్షణా, ఫలభక్షణా చేసేవారట. లేగ త్రాగగా పాలను స్వీకరించేవారట. ఈ విధంగా బతకగలిగితే కామం మనలను బాధించదు. కామ విజయం ఈ మార్గాలవల్ల సిద్ధించవలసినదే కాని, ప్రస్తుతం ప్రభుత్వం చెప్పే కుటుంబనియంత్రణ మార్గములవల్ల సిద్ధించదు.

అయితే పై చెప్పిన ఫలహారమూ, పర్ణభక్షణమూ అందరూ పాటించగలరా అంటే అది కాని మాట. అందుచేత మనం ఎంత తక్కువ హింసతో ఆహారం కూర్చుకొనగలమా అన్నదే ప్రశ్న. దానికోసమే పాటుపడాలి. కాని అహింస అందరికి ఆచరణీయమైన లక్ష్యంగా ఉండాలి. పరిపూర్ణ అహింస ఏ ఉత్తమాధికారులో ఆచరించవలసినది. బుధుడూ, మహాత్మాగాంధి ఈ అధికారభేదాన్ని గమనించక అహింస అందరినీ ఆచరించమన్నారు. కాని హిందూమతం ఇష్టానిష్టాలనూ, శక్తిసామర్ధ్యాలనూ లెక్కలోనికి తీసుకొని అధికారభేదాన్ని నిర్ణయించింది.

సన్యాసికి సంసారబంధం కాని, ప్రాపంచిక బంధంకాని లేదు. అందువల్లనే అతనికి సంపూర్ణ అహింసావ్రతం విధి. అతడు ఆకులను గిల్లరాదు. ఆహారం వండుకోరాదు. హిందూమాతానికి ఆశ్రమాలు, వర్ణాలే మూలస్తంభాలు. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. గృహస్థుని ధర్మాలు వేరు. సన్యాసి ధర్మాలు వేరు. అందుచేతనే కృష్ణపరమాత్మ కురుక్షేత్రంలో యుద్ధంచేయమనీ, మరో సందర్భంలో అహింసను పాటించమనీ అర్జునుడికి బోధించినది. న్యాయాధికారి శిక్ష విధిస్తాడు. అదీ హింసే. మనం ప్రేమగా చూచేవారికి పిచ్చియెత్తినప్పుడు నిర్బంధంలో ఉంచుతాము. అది వాళ్ళకు కష్టమే కలిగించవచ్చు. అధికారభేదం గుర్తించినందువల్లనే హిందూ మతంలో ఈ మాత్రమైనా అహింస నిలిచి ఉన్నది. దీనిని గమనించి ధర్మాన్ని మనం ఆచరిస్తే తప్పులు దొరలవు. అట్లు దొరలినా తక్కువగా ఉంటవి.

Maa Swami    Chapters