Maa Swami    Chapters   

7. యస్యప్రసాదాత్‌

'వి శా ఖ'

ఒక్కొక్కపుడు హృదయం ఆనందంతో ఉరకలు వేస్తుంది. 'ఆనందా ద్వేవ ఖల్విమాని భూతాని జాయంతే' అంటూ మరొకపుడు మనస్సు మహాదీనంగా నిలిచిపోతుంది. ఒకప్పుడు అంతులేని ఉత్సాహం, మరొకపుడు ఎక్కడాలేని నిర్వేదం. ఒకపుడు ధనం ధారగా చేతులపై వెళ్ళిపోతుంది. మరొక్కపుడు రేపుతిండి ఎక్కడ అన్న ప్రశ్న. ఒకపుడు ఒంట్లో బాగా బలంగా ఉంటుంది. మరొకపుడు ఏదో వ్యాధి ముంచుకొని వచ్చి, భగవంతుడా ఈ దేహమిచ్చే బాధ ఏంబాధ అని అనిపిస్తుంది. ఇదీ మానవుల జీవనచక్రం.

వానికేమి వాడు అదృష్టవంతుడు అంటాం. వాడు వట్టి దౌర్భాగ్యుడు, ఎప్పుడూ కష్టాలే అని అంటాం. ఈ సమస్యలకు, కారణమేమయినా ఉందా అని తాత్త్వికులు ఆలోచిస్తారు కొందరు-- 'కాలమూలమిదం సర్వం భావాభావే సుఖాసుఖే- కాలఃసృజతి భూతాని కాలస్సంహరతే ప్రజా'- అని సరిబుచ్చుకొంటారు. కాని అందరికీ అంతటి మనోధైర్యం ఉండదు. కష్టాలువస్తే అట్టే క్రుంగిపోతారు. అపుడు దైవం జ్ఞాపకం వస్తాడు. అటుపై యాత్రలు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు లేదా ఎవరైనా మహాత్ముడున్నాడా అని వెదకడానికి ప్రారంభిస్తారు.

కాని కష్టాలు వచ్చినపుడు మహాత్ములని వెదకటం, అది తీరిపోతే మరచిపోవటం లౌకికంగా కూడా గర్జనీయమే. ఎప్పుడు దాహంవేస్తే అప్పుడు చెలమత్రవ్వుకోకుండా, మన శరీరాంతఃకరణాలను సర్వం ఒకరికి అర్పించి అతని ప్రాపుచేరటం బుద్ధిమంతుల లక్షణం. అన్నిటినీ నిశ్చలంగా భరించి, ఏ సందేహాలూ లేకుండా స్వశక్తిపై నిలబడేవానికి గురువు అవసరం లేదేమో. వానికివాడే గురువు. కాని సాధారణ జనానీకానికి ఒక గురువు అవసరం కనిపిస్తుంది. గొప్ప గొప్ప మహాత్ములు కూడ సాధనకు పూర్వం గురువుకోసం తహతహలాడినవారే. ఒక గురువును పరీక్షించి ఎన్నుకొనిన పిదప- స్వయంవరం కనుక- అతనిని వదలరాదు. ఒకపుడు రామకృష్ణపరమహంస శిష్యులలో, పరమహంస నిర్యాణం పిదప, మనం సరి అయిన గురువును ఎన్నుకొన్నామా లేదాయని వారికి సందేహం కలిగిందట. అది విన్న వివేకానందులు- మీరు కావలిస్తే ఏ గురువునైనా ఎన్నుకోండి. నావరకు, ఈజన్మకు దక్షిణశ్వరంలోని ఆ చదువురాని బ్రాహ్మణుడే గురువు అని నిస్సందేహంగా ఉద్ఘాటించారట.

స్వాములవారు అన్నట్టు ప్రజలు భగవత్సాన్నిధ్యం అన్వేషిస్తారు గురువులో. అందుచేత గురువులో విశిష్టత లేకపోతే శిష్యునికి గురికుదరటం కష్టం. 'కుపుత్రో జాయేత'- ఎంతోమంది కుపుత్రులున్నారు. కాని ప్రేమలేని తల్లి అరుదు. అట్లే కుశిష్యులున్నారు. గురువుమాత్రం ఎపుడూ విశిష్టుడే. అట్టి శ్రేష్ఠుడైన గురువును సంపాదించి-- 'మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం' అంటూ నిశ్చలంగా ఉండిపోవాలి మనం.

ఐతే గురువు మనలను ఎన్నుకొంటాడా? మనం గురువును ఎన్నుకొంటామా? ఇదీ ఒక కార్యాకారణచక్రమే చెప్పటం కష్టం. ఏకలవ్యుడు, గురువుని ఎన్నుకొన్నాడు. గురువు ఏకలవ్యుని ఎన్నుకోలేదు. రామకృష్ణ పరమహంస తన శిష్యులను తానుగ ఎన్నుకొన్నారు. 'వత్సలారా! రండు మీరెక్కడున్నారు' అని ఆయన ఆవేదన పడ్డారు. అంతటితో ఆయన శిష్యవర్గం క్రమక్రమంగా ఏర్పడింది.

ప్రస్తుతం దక్షిణభారతంలో మన మధ్య ఉంటూ, అసంఖ్యాక జనాన్ని ఆకట్టుతున్న మహాత్ములు శ్రీ కామకోటివారు. ఎవరైనాసరే ఒక్కమారు స్వాములవారిని దర్శించిన పిదప, ఆయనను మరల మరల చూడాలని ఉవ్విళ్ళూరుతారు. ఒకపుడు ఇష్టాగోష్టిలో-- నీలంరాజు వెంకట శేషయ్యగారు ఇలా అన్నారు. ''నేను ప్రథమం స్వాములవారిని కలుసుకోడానికి వెళ్ళినపుడు- ఏదో యతి, పీఠాధిపతి, వందనీయుడు అన్న భావం మాత్రం ఉండినది. స్వాములవారు రెండు మూడు గంటలసేపు నాతో సంభాషించారు. నేను బయటకు వచ్చేటప్పుడు నా అహంభావమంతా స్వాములవారి వద్దనే వదలి వచ్చాను.'' ఈ అనుభవం చాలమందికి కలిగింది. శ్రీవారు ఒక్కొక్కరినీ ఒక్కొక్క విధంగా ఆకర్షిస్తారు. కొందరు పాండిత్యప్రకర్షకు వెళ్ళుతారు. కొందరు ఆయన ఆధ్యాత్మిక నిరతికి వెళ్ళుతారు. కొందరు సందేహనివృత్తికి వెళ్ళుతారు. కాని చాలమంది వెళ్ళటం ఆయన ముఖం చూస్తూ, ఆ నవ్వుల పువ్వులలో అట్లే మైమరచి పోవాలని. ఈ సందర్భంలో ఒక సంఘటన గుర్తుకొస్తుంది.

శృంగేరిమఠాధీశ్వరులు, శ్రీచంద్రశేఖర భారతివారు, ఒకపుడు బెంగుళూరులో శంకరమఠపాఠశాలలో శిష్యులను పరీక్షిస్తున్నారట. వారి ముఖ్యశిష్యులలో ఒకరు ఆ సమయంలో ఉన్నారట. ఆయనకు సంస్కృతంలో పరిచయమున్నా, చర్చింపబడుతున్న అంశాలను గ్రహించడానికి చాలకష్టం వేస్తున్నదట. వారితోబాటు ఒక చెట్టియారుకూడా రెండు మూడురోజులు ఈ పరీక్షలు జరిగేటపుడు వరుసగా ఉండేవారట. మఠం ఉద్యోగి ఒకనాడు వీరిరువురినీ చూచి- మీకయినా ఏదైనా అర్ధం కాగలదేమో, అక్కడ జరిగే సంభాషణ, ఈ చెట్టియారుకు ఒక్కముక్క సంస్కృతంరాదే, ఈయన అక్కడ కూర్చుని ఏమి చేస్తున్నారని? అని అడిగారట. అందుకు చెట్టియార్‌ అన్నారట. ''మీరు చెప్పేది చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను అక్కడ స్వాములవారి ముఖంచూస్తూ ఆ ప్రశాంతిలో మునకలువేస్తున్నా. ఆ సంభాషణ అర్ధమైతేఏం? కాకపోతే ఏం? అర్ధమైతే చిక్కు. అపుడు మనస్సు సంభాషణపై పోతుంది. స్వాములవారి ముఖంపై నిలువదు.

మాదృశులకు, కామకోటివారన్నా, శ్రీచంద్రశేఖర భారతులన్నా, అద్వైతభావం. శ్రీకామకోటి స్వాములవారిని గూర్చి కూడా కథలు ఎన్ని అయినా చెప్పుకొని పోవచ్చు. ఒక్కమారు మధుర సమీపంలో నారాయణపురంలో ఏకాదశినాడు, స్వాములవారు పూజకు మధ్యాహ్నం రెండుగంటలకు కూర్చున్నారు. సాయంత్రం 7 గంటలయింది. ఆయన అదే ఆసనంలో ఉన్నారు. ఇలాంటివి ఎన్నో. ఒకపుడు నేను ఏదో చెప్పుకొన్నా. శ్రీవారు అన్నారు-

''నీవు ఏదీ తీవ్రంగా ఆలోచించకు. అట్లా ఆ ఈశ్వర ప్రవాహంలో తేలిపో''-

స్వామివారి మాటలు వినగానే, గీతావాక్యం 'న కించదపి చింతయేత్‌' ఎన్నోమార్లు చదివినా అంటని మహావాక్యం- అలాగే హత్తుకొని పోయింది.

చాలమందికి శ్రీవారు పరదేవతాస్వరూపమే. 'యతో వాచో నివర్తంతే'- ఆస్థితి కామకోటి. ఆ కామకోటి పీఠాధీశ్వరులు, శ్రీవారు. శ్రీవారి అనుగ్రహమే కలిగితే,

యస్య ప్రసాదా దహమేవ విష్ణు

ర్మయ్యేవ సర్వం పరికల్పితం చ,

ఇత్థం విజానామి సదాత్మరూపం

తస్యాంఘ్రియుగ్మం ప్రణతోస్మి నిత్యమ్‌.

Maa Swami    Chapters