Maa Swami    Chapters   

5.పూర్వీకము

స్వాములవారి పూర్వాశ్రమ నామధేయము స్వామినాధన్‌. తండ్రిపేరు సుబ్రహ్మణ్మశాస్త్రి. హోయసలకర్ణాటక స్మార్త బ్రాహ్మణులు. పూర్వీకులు చోళ మండలములో వలసవచ్చి స్థిరపడ్డారు. తల్లిపేరు మహాలక్ష్మి, సుబ్రహ్మణ్మశాస్త్రి కుంబకోణం గవర్నమెంటు స్కూలులో మెట్రిక్యులేషన్‌ ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులై అధ్యాపక వృత్తిని అవలంబించినారు. స్వామినాధన్‌ పుట్టినపుడు ఆయన విల్లుపురములో ఉన్నారు.

తంజావూరును నాయకరాజులు పరిపాలించే కాలములో పదహారవ శతాబ్దమున రాజాగోవింద దీక్షితులు మంత్రిగా వుండేవారు. మంత్రియేకాదు. పరమ ధార్మికుడు. ఈయనను అందరూ అయ్యర్‌ అని వ్యవహరించేవారు. చోళ##దేశములో ఇష్టాపూర్తములు వీరిచేత విస్తరంగా చేయబడినవి. పట్టేశ్వరమనే క్షేత్రాలయంలో గోవింద మంత్రి దంపతుల శిలావిగ్రహములు స్థాపితములైవున్నవి.

సుబ్రహ్మణ్మశాస్త్రి కులదైవం స్వామిమలలోని స్వామినాధుడు. పిల్లవానికి ఆపేరే పెట్టారు. జననం మే నెల 20వ తారీఖు 1894. అనగా జయనామ సంవత్సర వైశాఖ బహుళ పాడ్యమి ఆదివారం అనూరాధ నక్షత్రంలో సింహలగ్నంలో శ్రీవారి శుభజననం. జన్మకుండలి అను బంధములో చూడవచ్చును.

స్వామివారి మాతామహులపేరు శ్రీ నాగేశ్వరశాస్త్రి. ఈయన సలక్షణ ఋగ్వేదాధ్యేత. పితామహులు శ్రీ గణపతిశాస్త్రి. ఋగ్వేదమును సాంగముగా అధ్యయనము చేసినవారు. షడ్దర్శన పారంగతులు.

క్రీ.శ. 1899లో జరిగిన ఒక విశేషం వ్రాయతగినది. స్వామినాథుని తండ్రి సుబ్రహ్మణ్మశాస్త్రి పోర్టోనోవోలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. అపుడు చిదంబరక్షేత్రంలో ఇలైమైక్కినార్‌ ఆలయంలో కుంభాభిషేకం జరుగుతున్నది. స్వామినాథన్‌తో బాటు సుబ్రహ్మణ్మశాస్త్రి కుంభాభిషేక దర్శనానికి వెళ్ళినారు. వెంకటపతి ఆయ్యరు ఇంట విడిది చేసారు. 'నీవు నిద్రపో. కుంభాభిషేకానికి నిన్ను లేపి పిలుచుకొని వెళ్ళుతానని' ఆయన స్వామినాథన్‌తో చెప్పినారు. కాని స్వామినాథన్‌ లేచేసరికి తెల్లవారిపోయింది. తండ్రి తనను కుంభాభిషేకానికి తీసుకొని వెళ్ళలేదని అతనికి చాల ఆశాభంగమైనది. ఆరోజు అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఎవరూ ఆలయానికి వెళ్లలేదు. ఆలయంలో ఆరాత్రి అగ్నిప్రమాదమేర్పడింది. చాలమంది చనిపోయారుకూడా.

స్వామినాథన్‌ తల్లికి పోర్టోనోవోలో చిదంబరంలో అగ్నిప్రమాదమేర్పడినట్లు అదేరాత్రి ఒక స్వప్నం వచ్చింది. చిదంబరంనుంచి వచ్చేవారిని విచారిద్దామని ఆమె వెంటనే రైలు స్టేషన్‌కు పయనమైనది. రైలుస్టేషన్‌లో సురక్షితంగా వస్తున్న తండ్రీకొడుకులను చూడగా ఆమెకు కలిగిన ఆనందానికి అవధులులేవు. చిదంబరంలో జరిగిన ప్రమాదం, ఈమెకు వచ్చిన స్వప్నం- ఈ రెంటికీ ఏదో ఒక ఊహాతీతమైన సంబంధం ఉండివుండాలి.

1900లో స్వామినాథన్‌ ఒకటవ తరగతిలో చదువుతున్నాడు. అసిస్టెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌- సింగారవేలు మొదలియార్‌ స్కూళ్ళ తనిఖీకై వచ్చారు. ఇంగ్లీషువాచకమును స్వామినాథన్‌కిచ్చి చదవమన్నాడు. అది పై తరగతి పుస్తకం. స్వామినాథన్‌ అదరూ బెదురూ లేక చక్కగా చదవగా ఆయన శ్లాఘించి, వెంటనే ఆ బాలుణ్ణి మూడవతరగతికి పంపాడు.

1905లో తిండివనమునకు తండ్రికి ఉద్యోగరీత్యా మార్పుఐనది. బాలునికి ఉపనయనమూ ఆ సంవత్సరమే జరిగినది. కామకోటి 66వ మఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అప్పుడు ఆర్కాటులో పర్యటిస్తున్నారు. ఆయన ఉపనయనమునకు తన ఆశీస్సుల నందచేశారు. మఠమునకు ఈ బాలుని నియమించాలన్న సంకల్పమూ చేశారు. శ్రీవారి ఆశ్రమనామమూ చంద్రశేఖరేంద్ర సరస్వతియే. ఇదొక విశేషం.

పది సంవత్పరముల ప్రాయంలో స్వామినాథన్‌ తిండివనంలోని ఆర్కాట్‌మిషన్‌ స్కూలులో రెండవఫారం చదువుతున్నాడు. ఎన్నో బహుమతులూ వచ్చినవి.ఉపాధ్యాయులు అతని చురుకుదనం చూచి మెచ్చుకొనేవారు. బైబిలు పాఠాలలోనూ స్వామినాథనుదే పైచేయి. ఇతనిని ఆదర్శ విద్యార్ధిగా ఉపాధ్యాయులు అందరికీ చూపేవారు.

1906లో స్వామినాథన్‌ నాలుగవఫారం చదువుతున్నపుడు షేక్స్పియర్‌ వ్రాసిన 'కింగ్‌ జాన్‌' నాటకం పాఠశాలలో ప్రదర్శించాలని అనుకొన్నారు. అందులో ముఖ్యపాత్ర ప్రిన్స్‌ ఆర్డరు. ఆ పాత్రకు సరియైన విద్యార్ధులు నిర్ణయించిన వయస్సులో లభించకపోగా ప్రధానోపాధ్యాయుడు స్వామినాథన్‌కు ఆపాత్ర నప్పగించాడు. ఆయనకు స్వామినాథన్‌ ప్రతిభలో అంత నమ్మకమున్నది. తలితండ్రుల అనుమతిపై స్వామినాథన్‌ రెండురోజులలో పాత్రకు నిర్ణయమైన నాటక భాగాన్ని క్షుణ్ణంగా అభ్యసించి, ఆ పాత్రను జయప్రదంగా నిర్వహించి అందరి మన్ననలనూ పొందాడు. ఉపాధ్యాయులందరూ స్వామినాథన్‌ పాత్ర నిర్వహణను సుబ్రహ్మణ్మశాస్త్రితో శ్లాఘించి పలికారు.

Maa Swami    Chapters