Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

జగద్గురు బోధలు
మనవి - మాటలు

సర్వశ్రుతి శిరోరత్న సముద్భాసితమూర్తయే,

వేదాంతాంభోజ సూర్యాయ తసై#్మ శ్రీ గురవేనమః||

సర్వతో ముఖవిజ్ఞానవిలసితమై, విశ్వరచనారహస్యాలను పరిశీలించి పైకి కానవచ్చే భిన్నత్వంలో ఏకత్వాన్ని చూచి నిరూపించిన సమన్వయదృష్టి మనవారిది. ఈవిధమైన అంతర్దృష్టిసమన్వయ దృక్ఫలితమే అద్వైతం. ఈ అద్వైత సిద్ధాంత నిరూపణ ఉపనిషత్తులలో పరాకాష్ఠ నందుకొన్నది. ఇదే భారతీయ వేదాంతం. భారతీయ జీవనవిధానానికి, సాంఘిక వ్యవస్థకు జీవగఱ్ఱ అయిన ఈ వేదాంతానికి రూపుదిద్దిన మహనీయులు శ్రీ భగవత్పాదులు ఆదిశంకరాచార్యులవారు. పరమాత్మకూ, జీవాత్మకూ భేదం లేదు. ఈ రెండూ ఒకటే. పరమాత్మ నిర్గుణం అని బోధిస్తుంది. అద్వైతం 'ఏకమేవా ద్వితీయం బ్రహ్మ' 'ఏకం సద్విప్రా బహుధా వదంతి' 'సర్వం ఖల్విదం బ్రహ్మ' 'జీవో బ్రహ్మైవ నాపరః' 'తత్త్వమసి' వంటి వాక్యాలన్నీ అద్వైతసిద్ధిని చెపుతాయి. జీవాత్మ పరమాత్మరూపమే. అయితే మాయాసంబంధముచేత జీవాత్మ ఈ సత్యాన్ని గ్రహించడంలేదు. జ్ఞానంద్వారా ఈ సత్యాన్ని గ్రహించగల్గుతుంది. ఈ జ్ఞానంపొందిన జీవాత్మ మోక్షం పొందగలుగుతుంది. అంటే పరమాత్మయై ఊరకుంటుంది. ఇదే సిద్ధాంతాన్ని భగవద్గీత కూడా ప్రతిపాదించింది.

ఇలాంటి జ్ఞానంపొందడం ప్రపంచంలో అందరికీ సాధ్యంకాదు. అందుచే పరమాత్మకు రూపం కల్పించుకొని ఇష్ట దేవతగా భావించుకొని ఆ దేవత నారాధించడంద్వారా సంసారులు క్రమశః జ్ఞానంపొంది మోక్షసిద్ధికి ప్రయత్నించవచ్చు.

జగద్గురువుల అవతరణకు పూర్వం మన దేశంలోని హిందువులలో తొంభై ఆరు విభిన్నమతా లుండేవి. వాటిని ఆచార్యస్వామి ఆరింటిగా వర్గీకరించారు. (1) శైవులు, (2) వైష్ణవులు, (3) సౌరులు, (4) శాక్తేయులు, (5) గానాపత్యులు, (6) కాపాలికులు. అందుకే ఆయనను ''షణ్మత స్థాపకః'' అని కూడా అంటారు. శ్రీ శంకరులకు పూర్వమే అద్వైతమతానికి పునాదివేసినవారు గోవిందభగవత్పాదులు. వీరి గురువు గౌడ పాదులు. వీరి పరమగురువు బాదరాయణులు, ఈబాదరాయణులే వ్యాసభగవానులు. మాండూక్య ఉపనిషత్తుకు వ్రాసిన కారికలలోనే అద్వైతసిద్ధాంతానికి బీజావాపిన జరిగింది. కాని దీనిని ఒక సిద్ధాంతంగా రూపొందించి జగత్తంతా ప్రచారం చేసినవారు - 'జగమంతా మాయ, పరమాత్మ లీల' అని ఉపనిషత్తులలో మాయ మాయగాఉన్న మాయా సిద్ధాంతాన్ని విపులపరచి, అద్వైతంలో ఒక అంతర్భాగంగా రూపొందించి ఒక మతంగా బోధించిన మహనీయులు - శంకరులే.

చిన్నతనంలోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి విద్యాభ్యాసం పూర్తికాగానే వేదాంతబోధకు పూనుకొని దేశమంతటా సంచారంచేసి, థిగ్గజాలవంటి పండితప్రకాండులను వాదనలో ఓడించి, అన్ని ప్రాంతాలలోను అద్వైతపీఠాలను సంస్థాపించారు. వీటినే శంకరమఠాలనికూడా అంటారు. వీటిలో, ముఖ్యంగా చెప్పుకోదగినవి కంచి, శృంగేరి, కాశీ, పూరీ, బదరీనారాయణ, పుష్పగిరిలలో ఉన్నాయి. ఆదిశంకరులు రచించిన గ్రంథాలలో ఉపనిషద్భాష్యాలు, వేదాంతసూత్రభాష్యం, భగవద్గీతాభాష్యం, సర్వసిద్ధాంతసంగ్రహం, వివేకచూడామణి, శివానందాదిలహరులు ముఖ్యమైనవి.

ఈ విధంగా శ్రీ శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైతజ్ఞానాన్ని పరంపఠాగతంగా ప్రచారం చేస్తున్న సంస్థలలో ప్రధానమైన దీనాడు కంచి కామకోటి పీఠం. నిజాని కిది దేశంలోఉన్న శంకరమఠాలన్నిటిలోకి అతి ప్రాచీనమైంది. దీని ప్రస్తుత అధిపతి జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ శంకరాచార్యులవారు. శ్రీ స్వామివారు హిందూధర్మ పునరుద్ధరణకు నిరహంకారంగా, నిష్పక్షపాతంగా, నిర్విరామంగా కొనసాగిస్తున్న సేవ అద్వితీయమైంది. సర్వసంగపరిత్యాగి అయ్యు పరమహంసపరివ్రాజకులయ్యు కర్మపరిత్యాగం చేసిన జీవన్ముక్తులయ్యు సంసారులకు మార్గదర్శికంగా ఉండేనిమిత్తం సమస్తకర్మలను నిష్కామంగా ఆచరిస్తూ రూపెత్తిన హిందూధర్మంవలె నిరంతర అవిరళ పదయాత్రలద్వారా జీవయాత్రను లోకహితకరంగా సాగిస్తున్న ధర్మావతారు లాయన. ఆయనలోని శిశుసారళ్యం, ఆనంద పారవశ్యం, పరిపక్వ పరిజ్ఞానం చూపరులను ఇట్టే సమ్మోహితులను చేస్తాయి. శిశువుల సారళ్యాన్ని పుణికిపుచ్చుకొన్న అయన మధుర మందహాసం - 'ఆక్థర్‌ కోయిస్లర్‌, పాల్‌ బ్రంటన్‌, వంటి పాశ్చాత్య మేధావుల మనస్సులపై చెరగని ముద్రగా నిలిచిపోయింది. జ్జాన వయోవృద్ధులైన స్వామివారి ప్రశాంత వదనసీమలో మనకు గౌరీశంకరశిఖరంపై ప్రాభాతవేళ కానవచ్చే ఉషారాగం, హరిద్వారంలో ఉన్న స్వచ్ఛ సుందరమైన భాగీరథీప్రవాహం, మందమలయానిల సుఖస్పర్శ, పాదోధిమధ్యంలోని ప్రశాంతత కానవస్తాయి. శ్రీ స్వామివారు అత్యన్నత ఆధ్యాత్మిక శిఖరాగ్రస్థితు లయినప్పటికి సర్వులకూ సులభదర్శనులు. మాటల వేదాంతి కాదు. మరి చేతల వేదాంతి. అనుక్షణ నిష్కామ కర్మయోగి అయిన స్వామివారి ఉనికిప్రభావం దక్షిణదేశమంతటా సర్వత్రా కానవస్తోంది. సందర్శన కుతూహలులయిన శిష్యగణం తెల్లవారకుండగనే వేలాదిగా గుమిగూడి తమ భక్తిప్రపత్తులను మౌనంగావెల్లడించుకుంటూఉంటారు. మందహాస మధుర మంజులమైన ఆయన మౌనవ్యాఖ్య - బహువిధ శోకసంకులమైన శిష్యకోటికి అభయదానంగా, శ్రీరామరక్షగా భాసిస్తోంది. నిజానికి దుఃఖోద్విగ్నమైన నేటి ప్రపంచానికి ఆయన అందించిన ఆశా సందేశం సృష్టిరహస్యాన్ని విడమర్చి చెప్పే సత్యవ్యాఖ్యానం. పాపాలకు, దుఃఖాలకు నివృత్తి కరమైన ఆత్మసాక్షాత్కారానికి స్వామివారి ఉపదేశాలు రాజమార్గం.

శ్రీ స్వామివారు బహుభాషావేత్తలు. లక్షలాదిశిష్యుల మనోభావాలను తృటిలో గ్రహించి వారివారి మాతృభాషలలోనే వారందరికి సుబోధకము, సుగ్రహము, సులభసుందరమైన సరళభాషలో అల్పాక్షరముల అనల్పార్థమును ఇమిడించి హిత మితవచనాలతో తనియించిపంపించే శిష్యవత్సలుడీయన.

''హిందూమతం అని చెలామణి అవుతూన్న మతంలో అనేక లోపాలున్నవని అంటూవుంటారు. అయితే దానికిగల మూల నిత్య సత్య సుగుణాలు అసంఖ్యాకాలు. కనుక మనం ఈ మంచిని గ్రహించి ఆదర్శమానవులుగా మన ఉనికిని సార్థకం చేసికోవడం ఉభయతారకంకదా'' అని స్వామివారెప్పుడూ ఉద్భోధిస్తూంటారు.

జ్ఞానంతోనే మనుష్యజన్మకు శోభ. ''భూషలు కావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్‌'' మానవునకు జ్ఞానమేమహాభూషణం. జ్ఞానహీనుడుద్విపాదపశువు. రూపాన్ని బట్టి వెదురుకర్రకు, రసాన్ని బట్టి చెరకుగడకు. విలువకలిగినట్లే మనిషికి విలువ తాను సంపాదించిన జ్ఞానాన్నిబట్టే. జ్ఞానం వికసించేకొలది మానవజన్మ శ్రేష్ఠత హెచ్చుతుంది. నిజానికి జ్ఞానంవంటి పవిత్రవస్తువు లేదు. అజ్ఞానంవంటి అపవిత్రవస్తువు లేదు, అన్నిక్షేత్రములలోను ఒకేక్షేత్రజ్ఞుణ్ణి చూడడం జ్ఞానం. అనగా భిన్నభిన్నమైన క్షేత్రాలలో ఉపాధులలో అభిన్నమైన క్షేత్రజ్ఞపురుషుణ్ణి, ఆత్మ దేవుణ్ణి చూడడణు జ్ఞానం కనుక అభిన్న దృష్టి జ్ఞానం శివదృష్టి జ్ఞానం, శవదృష్టి అజ్ఞానం. ఒకజ్ఞానం జ్ఞానం. అనేకజ్ఞానం అజ్ఞానం. అపరోక్ష సాక్షాత్కారజ్ఞానంచే శోక మోహ రూపమైన సంసారసాగరాన్ని తరించడం సులభం. ఆత్మ తానేనని ఎరగడం జ్ఞానం ఆత్మే పరమాత్మయని తెలియని విజ్ఞానం, ఈ జ్ఞానవిజ్ఞానసిద్ధికొరకు అవశ్యానుసరణీయమైంది. సాధనమార్గం. సాధనా సౌలభ్యం కోసం శ్రీ కంచి కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామివారి బోధనరూపమైన ''జగద్గురు బోధలనే'' ఈ ఉద్గ్రంథాన్ని జిజ్ఞాసువులు, ముముక్షువులు అయిన ఆంధ్రమహాజనుల కరకమలములకు సాధన గ్రంథమండలి అందిస్తున్నది.

ఏ మహాశక్తి - కుంటివాడిచేత మహోన్నత పర్వతాన్ని దాటింపచేస్తుందో, మూగవాణ్ణి మహావక్తగా మార్చుతుందో, అల్ప వానరాలను మహావీరులుగా మార్చి ధర్మ విజయానికి తోడ్పడేటట్టు చేసిందో, కిరాతుడైన వాల్మీకిచేత ఆదికావ్యమైన రామాయణాన్ని రచింపచేసిందో - ఆ దివ్యశ##క్తే జగద్గురువుల అనుగ్రహరూపంలో మాచేత ఈ జగద్థిత గంభీర్యాన్ని చేయించింది. ఆంధ్రప్రభలో ప్రచురించిన వ్యాసములను మా సాధన గ్రంథమండలిలో గ్రంథరూపంగా రూపొందించుటకు తమ ఆమోద అంగీకారములను వెలిబుచ్చి, శ్రీవారి చిత్రములను గూడ అనుగ్రహించి సహకరించిన ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ నీలంరాజు వేంకటశేషయ్య గారికి మా ధన్యవాదములు. సహృదయులు, ఆప్తమిత్రులు, శ్రీవారి బోధలు ఆంధ్రమున అనువదించినవారు అగు ''విశాఖ'' గారికి మా కృతజ్ఞతలు. ఆంధ్రప్రభలో ప్రచురించిన వ్యాసములను పరిశోధించియు, వ్యాసములలో శ్లోకములకు అర్థములు వ్రాసియు ఇచ్చిన శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. ఇక విజయ ఆర్టు ప్రెస్‌ వారి తోడ్పాటుచే ఈ గ్రంథము ఇంత త్వరగా సర్వాంగ సుందరముగా వెలువరించగలిగినందుకు మేము సర్వదా వారికి కృతజ్ఞులము.

ఈ గ్రంథ ప్రచురణమునకు గౌరవ పురస్సరమైన సహకారము నందించిన-

శ్రీ చల్లా శేషాచల శర్మగారు - గురజాడ

శ్రీ డా ః.ా.ు.ఇ. కోటేశ్వరరావుగారు హనుమాన్‌ జంక్షన్‌

శ్రీ ఆ. రాజగోపాల కృష్ణప్రసాద్గారు హనుమాన్‌ జంక్షన్‌

శ్రీ రాయవరపు రామచంద్రరావుగారు తెనాలి

ఈ వదాన్యు లందరకు నా హృదయ పూర్వక ధన్యవాదములు.

చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం.

నాదబిందు కళాతీతం తసై#్మ శ్రీ గురవే నమః||

శ్రీమత్పరం బ్రహ్మగురుం వదామి.

శ్రీమత్పరం బ్రహ్మగురుం భజామి.

శ్రీమత్పరం బ్రహ్మగురుం స్మరామి.

శ్రీమత్పరం బ్రహ్మగురుం నమామి.

శోభకృత్‌                                                                బులుసు సూర్యప్రకాశశాస్త్రి

విజయదశమి                                                        వ్యవస్థాపకుడు: సాధన గ్రంథ మండలి.



శ్రీవారి దైనందిన జీవనమే వేదాంతసత్యముల కొక సూత్రభాష్యము. వారికొక్క నిముసము విరామ ముండదు. గంటలకొలది పూజలు. ఉపవాసమునకు నిర్ణయమైనదినములు కొన్ని. మౌనమునకు నిర్ణీతమైన వేళలు కొన్ని. విధివిరామము లేక దర్శనార్థము వచ్చెడి భక్తకోటి. వారెంత వైదిక ధర్మ పరాయణులైనను, స్వమత పరమత భేదముకాని, స్వ పరదేశ భేదముకాని వారికిలేదు. సద్గురునిమిత్తము అన్వేషిస్తూ 1930 లో భారతదేశమునకు వచ్చిన పాల్బ్రంటను అను ఆంగ్ల దేశస్థుడైన యూదుజాతీయుని భగవాన్‌ రమణమహం్షుల వద్దకు పంపినది స్వామివారే. వెస్టుమినిష్టరు రాజకీయాలను గూర్చి స్వామి తడవగా, స్వామివారి రాజకీయపరిజ్ఞతకు బ్రంటను వివ్వెరపోయెనట. ప్రాచీన శాస్త్రములందేకాక నవీనములపై సయితము స్వామికి మక్కువయే. సార్వభౌమత్వమున్నూ కద్దు.


స్వామి అద్వైతులు కనుక సర్వమతసహనము వారికి సహజగుణము. వారు నిందాస్తుతుల కతీతులు. ఇతరులెంత ప్రకోపించినను, తమ ప్రసాదగుణమును మాత్రము వదలరు. సాధారణ జనానీక మెరిగినది స్వామివారి ఆకం్షణ. ఒకమారు చూచిన మరల మరల వారి దర్శనము చేయవలెననే అభిలాష. సాంసారిక కష్టములను చెప్పుకొన్న కడుశ్రద్ధతో సాదరముగా వారు విని తమకుదోచిన సలహాలనిచ్చి, మనోనుకూలముగా మాటలాడి దీవించి ప్రసాదమునిచ్చి ప్రసాద చిత్తులనుచేసి పంపుదురు.

ఆచార్యుల మానస హంసిక ధ్యానమగ్నమై అద్వైత వీథుల విహరణచేయగా వారి కరాబ్జములు సగుణబ్రహ్మమును ఆరాధించును. ఈశ్వరారాధనకు దేశ కాల వర్తమానాదుల వారికి అడ్డులేదు. శ్రద్ధాభక్తులతో ఆయన స్ఫటిక లింగమును క్షీరధారలచే అభిషేకించి పుష్పాదులతో అలంకరించి 'లోకా స్సమస్తా స్సుఖినో భవంతు' అన్న ప్రార్థన చేయుదురు.

స్వామివారి తపశ్చర్య అసమానము. ఆ తపోబలిమి వారి అనుగ్రహశక్తిలో లీనమై వారి దీవెనలలో ప్రతిఫలించును. ఆయన కామకోటి పీఠాధిపతి. తదధిష్ఠానదేవత శ్రీ కామాక్షి. జగన్మాత శ్రీ కామాక్షీ కరుణాకటాక్ష నిర్ఘరి ఆచార్యుల అనుగ్రహరూపమున, శోక దుఃఖ విమోహితులమైన మన జీవనమరుభూములను సుశ్యామల మొనర్చి భక్తివైరాగ్యము లనే పంటలను పండించుచున్నది.

స్వామివారు తఱచు బోధించునది శివవిష్ణువులభేదత. హైందవములో అర్చామూర్తి బాహుళ్యమున్ననూ, అవి పరమేశ్వరుని విభూతియొక్క విభిన్నాంశములేయని జగద్గురువుల బోధ. విహిత కర్మాచరణము ప్రధానము. అది అతీంద్రియ రహస్యాలను అవగతము చేసుకొనుటలో సాయపడును. 'మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు' అన్న గీతావాక్యాన్ని స్మరిస్తూ స్వామివారి పాదములను నమ్ము కొన్నవారి యోగక్షేమాలను స్వామివారే చూచుకొంటారు. సత్కర్మలను సర్వకాలాలలోను మనం చేస్తుంటే ఆ కర్మయే అకర్మణ్యతకు సాధనమవుతుంది.

కర్తవ్యము, జగద్గురు ప్రబోధముల నాలకించి యథాశక్తి ఆచరణలోకి తేవడమే. వ్యక్తిగతంగా మనవర్తన చక్కబడితే సమాజమూ చక్కబడుతుందనీ, మోక్షమంటే పారలౌకికం కాదనీ, చిత్తశాంతియే మోక్షమనీ స్వామివారు సెలవిస్తారు. వేదాంత దేశికులును, గురుపాదులును అగు శ్రీ కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతుల ప్రబోధమనే జ్ఞానగంగలో మనమందరమూ సుస్నాతులమై అమృతపుత్రులము కావలెననుటయే నా వాంఛ. ఆ వాంఛాపూర్తికి స్వామివారి అనుగ్రహము ఉండనే ఉన్నది.

పారమార్థిక చింత శైశవమునందే కలుగవలెననీ ఈశ్వరార్పణబుద్ధితో చేసే కర్మలు చిత్తశుద్ధిని కలిగించే జ్ఞానదాయకములవుతవనీ స్వామివారు సెలవిస్తారు.

ఇత్యేషా వాజ్మయీ పూజా, శ్రీమచ్ఛంకర పాదయోః,

అర్పితా తేన మే దేవః, ప్రీయతాం చ సదాశివః.

జయ జయ జగదంబ శివే

జయ జయ కామాక్షి జయ జయాద్రి సుతే,

జయ జయ మహేశ దయితే

జయ జయ చిద్గగన కౌముదీ ధారే,

'శివశంకర దేశిక మే శరణం'

బొంబాయి

శోభకృత్‌ - విజయదశమి                                 - ' విశాఖ '


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page