మండలి మాట
నమామి కాంచీపుర కామకోటి
పీఠాధిపాన్ మత్కుల దేశి కేన్ద్రాన్,
ఆసేతు శీతాచలవాసి సర్వ
వినేయ హృత్పద్మవికాస భానూన్.
జగద్గురువులు శ్రీ కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేన్ద్ర సరస్వతీ స్వామివారు సర్వ దేవతా స్వరూపులు. స్వామి నేలమీద నడయాడుచున్న దైవము. ఇది కలికాలము, అగుగాక! శ్రీచరణుల ఉనికిచే ఇది 'కృతా దప్యతిరిచ్యతే' కృతయుగముకంటెను మేలైనదనుట నిర్వివాదము. శ్రీ చరణులు భక్తిజ్ఞాన వైరాగ్యముల అవతారము. ఆ స్వామి యొక్క దర్శనము సర్వదేవతా సందర్శనము.
బ్ర. శ్రీ ఉట్రవడియం కృష్ణశాస్త్రిగా రని మహా పండితులు, మహాకవులు. వేదాంత శాస్త్రంతోబాటు బహు శాస్త్రావళిని లెస్సగా అభ్యసించిన అంతర్ముఖులు. ఆయన జగద్గురువులైన స్వామివారి అనుగ్రహం వల్ల శ్రీకృష్ణ సాక్షాత్కార మహాభాగ్యాన్ని అనుభవించగలిగేరు. శ్రీకృష్ణ సాక్షాత్కృతిచే గలిగిన ఆనందాతిరేకాన్ని తనలో ఇముడ్చుకొనజాలక 'భగవదను ధావనం' అనే చంపూగ్రంధాన్ని జగద్గురువులకు అంకితంగా సంస్కృతంలో రచించారు. ఆ శ్రీకృష్ణశాస్త్రిగారు 'కాంచీ మండల కామకోటి యతి రాజస్థాన విద్వత్కవి.' భగవదనుధావనం లో ఆ మహాభాగ్యశాలి స్వామివారినిగూర్చి -
సమాగతో నా భవదీక్షణక్షణ
ప్రక్షీణ సర్వాక్షమలో7మలా న్తరః |
నిక్షిప్త చిత్తో భగవత్యధోక్షజే
మముక్షువర్యో భవతి క్షణన వై ||
స్వామీ ! నీ కడగంటి చూపులు ప్రసరించిన చాలు, ఎవనికైనా సరే ఇంద్రియ చాంచల్యం నశిస్తుంది. మనస్సు శుద్ధం అవుతుంది. అంతఃకరణం భగవత్పాద సంలగ్నమౌతుంది. ఇదంతా నీ కడగంటి చూపులు ప్రసరించిన క్షణకాలంలోనే జరుగుతుంది అన్నారు. వారి ఈ మాట ప్రత్యక్షర సత్యం.
కంచిలోనున్న కామాక్షీ మహాదేవియే స్వామిరూపంలో మనమధ్య నడయాడుతోంది. 'కథ కంచికి వెళ్ళినది' అన్నమాట యీనాటిదికాదు. ఇది కథాకథన పరిసమాప్తియందు పలికేమాట. 'కథ కంచికి వెళ్ళింది' అంటే ఇక కథ లేదని అర్థం. ఈ మాట వెనుక గొప్ప వెలుతురు ఉంది. ఒక్కసారి కంచి వెళ్ళి జంగమ స్థావరాకృతులతో నున్న కామాక్షీ మహాదేవి దర్శనం చేస్తే ఇక కథ లేదు. పుట్టడం పెరగడం గిట్టడం 'పునరపిజననం పునరపిమరణం పునరపిజననీ జఠరే శయనం' ఇలాసాగే ఈ అంతం లేని కథ కాచీమండల కామకోటి యతిరాజ సందర్శనంతో అంతం అవుతుంది- అని దీని భావం అన్నారొక పండితులు.
తెనాలికి సమీపంలోని చందోలులో బ్ర. శ్రీ రాఘవనారాయణశాస్త్రిగారని మహాతపస్సంపన్నులున్నారు. ఆయన మహాపండితులు. దత్తదేవుని అపరావతారమే ఆయన. ఆయనను సమీపించి ఒకసారి నేను- స్వామివారిని గూర్చి ఏదైనా చెప్పండి- అనినాను. ఆయన 'బాబూ ! అది నడయాడుచున్న బ్రహ్మపదార్థము. వారిని గూర్చి పలుకుట ఎలాసాధ్యం. 'యతో వాచో నివర్తన్తే' - అన్నారు.
ఇట్టి మహాస్వామి లోకానుగ్రహబుద్ధితో జేసిన ప్రవచనములే జగద్గురుబోధలు. వానిలో ఇది పదవ సంపుటం. ఈ పది సంపుటాలు స్వామి ఆశీస్సులతో 'విశాఖ' సౌజన్యంతో మా మండలిలో అచ్చున వేయగలిగేము. ఇది స్వామి అనుగ్రహం, 'విశాఖ' యొక్క సౌహార్థం. స్వామీ గజముఖానుజః' - స్వామి అనగా కుమారస్వామి అని అర్థం. 'విశాఖః శిఖివాహనః' విశాఖ అన్నా కుమారస్వామి అనియే అర్థం. కాగా స్వామి తేజమే విశాఖయం దనుప్రవిష్టమై లోకకల్యాణకరములైన యీ గ్రంథములను ఆంధ్రలోకానికి మండలి ద్వారమున అందజేయుచున్నది.
శ్రీ శంకర భగవత్పాదులవారు ఎన్నో గ్రంథాలు రచించేరు, వానిని మూలానువాదాలతో 'శంకర గ్రంథ రత్నావళి' అను పేరుతో మండలిలో ప్రకటిస్తున్నాం. ఆ శంకరవాజ్మయసారమేఈ బోధలు. శంకరవాజ్మయం పండితులకు మాత్రమే తలుపులు తెఱచేదిగా ఉంటే 'జగద్గురు బోధలు' సర్వజనసమాదరణీయములై ఉన్నాయి, ఈ పది సంపుటాలలో స్వామి యేమి చెప్పేరో దానిని గ్రహించి వారి ఉపదేశప్రకారం నడచుకొంటేచాలు- ఆంధ్రావని తన ఆనందాన్ని ప్రపంచానికంతకూ పంచిపెట్టినా వెలితిని కానదు.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవావ శిష్యతే |
మండలికి ఈ విధమైన మహాభాగ్యాన్ని అనుగ్రహించిన స్వామివారికి నమస్సుమాంజ లర్పిస్తూ, ఇంతకూ ప్రత్యక్ష కారణులైన 'విశాఖ'ను ప్రస్తుతిస్తూ ఈ జగద్గురుబోధలయం దాదృతి చూసి ఆనందించు పాఠకలోకాన్ని మండలి అభినందిస్తూ ఉన్నది.
ఆధ్యాత్మిక గ్రంథములను వెలుగులోనికితెచ్చి, ఆధ్యాత్మికభావ ప్రచారమునకు కంకణము కట్టుకొనిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానమువారు ప్రధాన కార్య నిర్వహణాధికారియగు శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ ఒ.ఆ.ా గారును ఉదారముగా ద్రవ్యసహాయము చేసిరి. వారికి మా హార్దిక ధన్యవాదములు.
ఉదారులు, శ్రీస్వామివారి భక్తులు అగు శ్రీ సుంకు సుబ్బలక్ష్మయ్యగారు, తాడిపత్రి, శ్రీ కొల్లూరు మధుసూదనరావుగారు, సికింద్రాబాదు. వీరును ఈ గ్రంథ ముద్రణకు యధోచితముగా సహాయము చేసిరి. భగవంతుడు వీరికి ఆయురారోగ్య ఐశ్వర్యములు, ధర్మబుద్ధియు నిచ్చుగాక.
|