Kathakanchiki
Chapters
Last Page
''తొందరలేదు మీరు కోరింది దొరుకుతుంది'' రహదారి కిరువైపులా బారులు బారులుగా నిలిచిన తాటిచెట్ల మధ్య ప్రయాణించి చెంగల్పట్టు చేరుకున్నాము.
ఆ యింటి గుమ్మం గుండా లోపలికి గదిలోకి ప్రవేశించాము. దూరాన మసక వెలుతురులో నీడన ఓ కురచ వ్యక్తి నిలబడి వున్నారు. వారి దగ్గరకు వెళ్లి చిన్న కాను కొకటి సమర్పించి, వంగి నమస్కరించాను.
అలా వంగి నమస్కరించటంలో వున్న మర్యాద, గౌరవం అలా వుంచి ఆపని చాలా కళాత్మకంగా కనబడుతుందినాకు. అలా నమస్కరించటం నా కెంతో యిష్టం.
శంకరాచార్యులవారు ''పోప్'' లాంటివారు కారని నాకు తెలుసు. హిందూమతంలో ''పోప్'' లుండరు. కాని వారు హిందూమతంలోని ఓ శాఖకు ఆథ్యాత్మిక గురువులు. వారివల్ల అసంఖ్యాకులు ఉత్తేజం పొందుతున్నారు. దక్షిణభారతమంతా వారి పారమార్ధిక సంరక్షణలో వుంది.
సడి చేయకుండా వారి వంకే చూస్తున్నాను. కురచగా వున్న ఆవ్యక్తి యతిలా కాషాయాంబరాలు ధరించి వున్నారు. చేతిలోని సన్న్యాస దండం మీద కొంచెం ఒరిగి వున్నారు. నేను విన్నది, వారికి నలభైయేళ్లకు తక్కువే అని. జుట్టు అప్పుడే నెరసినందు కాశ్చార్య పోయాను.
నా స్మృతి మందిరంలోని కుడ్యాలకు వ్రేలాడే అనేకానేక వర్ణచిత్రాల్లో పలితశ్యామశబలమైన వారి సముదాత్త ముఖచిత్రానికి ఓ ప్రత్యేకమైన గౌరవస్థానం వుంది. ఫ్రెంచివారు ''ఆధ్యాత్మికత'' అని పేర్కొనే ఓ అనిర్వచనీయమైన లక్షణం వారి ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. అందులో ప్రసన్నత వుంది. అమాయికత వుంది. వారి విశాలమైన నేత్రాలు నిశ్చలంగా, అందంగా, ఆకర్షకంగా వున్నాయి. వారి ముక్కు పొట్టిగా, నిటారుగా, కోటేరువేసిన ట్లుంది. గడ్డం చిందరవందరగా పెరిగినా పెదవులు మాత్రం గంభీరంగా వున్నాయి. అలాంటి ముఖ కవళికలు వారి బుద్ధిబలం మినహా- మధ్యయుగాల క్రైస్తవమతాచారుల కుండేవేమో మరి!
లౌకిక దృష్టితో చూచే పాశ్చాత్యులకు వారి నేత్రాలు స్వాప్నిక నేత్రా లనిపించవచ్చు కాని వారి బరువైన కనురెప్పలక్రింద వట్టి స్వప్నాలు మాత్రమే వున్నాయని నా కనిపించలేదు. ఎందు కనిపించలేదో నిర్ధారణగా చెప్పలేను.
మా సంభాషణలో ఉపోద్ఘాతభాగాన్ని చాలా క్లుప్తంగా చెప్పేస్తాను. అది నన్ను గురించి, హైందవమతాచార్యుల విషయమందులో లేదు.
భారత పర్యటనలో వ్యక్తిగతంగా నాకు కలిగిన అనుభవాలను గురించి అడిగారు. ఒక విదేశీయునికి ఇక్కడికి ప్రజలనూ, సంస్ధలనూ గమనించినప్పు డెలా అనిపిస్తుందో తెలుసుకోవాలని వారి కభిలాష. నా అభిప్రాయాలు మాత్రం నిర్మొహమాటంగా, మెప్పుతో విమర్శను జోడించి, చాలా ధారాళంగా చెప్పేశాను.
మా సంభాషణ సాగిసాగి విశాలమైన పరిధిలోకి వెళ్ళిపోయింది. అప్పుడుగాని నాకు తెలియలేదు. స్వామివారు ప్రతిదినమూ ఇంగ్లీషుపత్రికలు చదువుతారనీ, ప్రపంచంలో ఏమూల ఏం జరుగుతోందోగమనిస్తారనీ. వెస్ట్‌మిన్సర్‌లో ఇటీవల జరిగిన గొడవలన్నీ వారికి తెలుసు. యూరప్‌ఖండంలో బాలారిష్టాలు గడవటానికి ప్రజాస్వామ్యం ఎలా విలవిల్లాడి పోతోందో కూడా వారికి తెలుసు.
శంకరాచార్యస్వాములకు భవిష్యద్దర్శనం వుందని వేంకటరమణి చెప్పటం గుర్తొచ్చింది. ప్రపంచ భవితవ్యాన్ని గురించి స్వామి నడిగాను.
''అంతటా ఆర్ధిక రాజకీయ పరిస్థితులు ఎప్పుడు మెరు గౌతాయని తోస్తుంది మీకు?'' అని ప్రశ్నించాను.
''ఇప్పు డప్పుడే మెరుగుకావడం సాధ్యంకాదు. పరిస్థితులు మారటానికి కొంతకాలం పడుతుంది. దేశాలన్నీ మారణాయుధాల ఉత్పత్తిలో నిమగ్నమై వుంటే ప్రపంచ మెలా బాగుపడుతుంది?'' అన్నారు వారు.
''నిరాయుధీకరణ గురించిన మాట లిటీవల వినబడుతున్నాయి. అది జరుగుతుందటారా?'' అని, అడిగాను.
''యుద్ధనౌకలు రద్దు చేయటంవల్లా, తుపాకులు మూల పడేయటం వల్లా యుద్ధా లాగవు. కర్రలతోనైనా మనుష్యులు కొట్టుకుంటూనే వుంటారు'' అన్నారువారు.
''అయితే మరేం చెయ్యాలి'' అని అడిగాను.
''జాతికీ జాతికీ మధ్య, ఉన్నవారికీ, లేనివారికీ మధ్య, ఆథ్యాత్మికమైన అవగాహన ఏర్పడితేతప్ప, సౌహార్దం, శాంతి, అభ్యుదయం సాధ్యంకావు'' అని సమాధానం చెప్పారు.
''ఇది అయేపనిగా కనబడటం లేదు. కాబట్టి ఆశారేఖ శూన్యమన్న మాట!'' అన్నాను.
తన సన్న్యాసదండం మీద మరింత ఒరిగి ''అయితే భగవంతుడొక డింకా వున్నా'' డన్నారు.
''ఉంటే ఆయన కివేం పట్టినట్లు లేదు. అన్నాను ధైర్యంగా.
''ఆయన కరుణామయుడు, మానవజాతిపట్ల కరుణ తప్ప ఆయనకు మరో భావం లేదు.
ప్రపంచంలో ప్రస్తుతం వున్న అధ్వాన్న పరిస్థితినీ, ప్రజల దీన దారుణ జీవితాన్ని బట్టి చూస్తే భగవంతుడికి మానవుల పట్ల క్రూరమైన నిర్లక్ష్య వైఖరే తప్ప ఉదారమైన కరుణా వైఖరివున్నట్లు నాకు తోచడం లేదు అనేశాను. నా గొంతులో వున్న కరకుదనం, కసి, చేదు, నన్నే ఆశ్చర్యపరిచాయి. వారు నావంక వింతగా చూచారు. నా తొందరపాటుకు నేనే సిగ్గుపడ్డాను.
''ఓర్పు కలవారు లోతుగా ఆలోచిస్తారు. సమయం వచ్చినప్పుడు భగవంతుడే మానవోపకరుణా లుపయోగించి పరిస్ధితులు చక్కదిద్దుతాడు. జాతుల మధ్య యేర్పడ్డ సంక్షోభం చూచి, కొందరిలో కనబడుతున్న భయంకర నైతిక పతనం చూచి, ప్రజలనుభవిస్తున్న దారుణ బాధలు చూచి, యెవరో ఒకరు దైవోత్తేజితులై స్పందిస్తారు. తప్పదు. ఈ లోకాన్ని కాపాడటానికే వారు పుడుతారు. ఈ దృష్టితో చూడండి, ప్రతి శతాబ్దంలోనూ ఒక సంరక్షకుడు కనబడతాడు. ఇది పదార్ధవిజ్ఞానశాస్త్రంలోని సూత్రమంత అనివార్యం. ఆథ్యాత్మిక మౌఢ్యంవల్ల యేర్పడే క్షుద్రత్వం ఎక్కువైన కొలదీ దాన్ని రూపుమాపటానికి మరింత శక్తి మంతుడైన కారణజన్ముడవతరిస్తాడు'' అన్నారు వారు.
''అయితే మనకాలంలోనే అలాంటివారొకరు సముద్భవిస్తారా? అని అడిగాను.
''తప్పకుండా! మనకాలంలోనే కాకపోవచ్చు. ఈ శతాబ్దంలో ఉద్భవిస్తారు. అలా ఉద్భవించాలిసిన అవసరం ఎంతో వుంది. చుట్టూక్రమ్ముకున్న పారమార్ధికమైన అంధకారం అంతదట్టంగా వుంది ప్రస్తుతం!'' అన్నారువారు.
''మరి మనుష్యులు భ్రష్టులైపోతున్నారనా మీ అభిప్రాయం? అని మళ్లీ అడిగాను.
''కాదు, నా కలా అనిపించదు. ప్రతివారిలో భగవదంశ వుంటుంది. అది ప్రతివారినీ చివరకు భగవంతుని చెంతకు చేరుస్తుంది అని సమాధానం చెప్పారు.
''మా పాశ్చాత్య నగరాల్లో కొందరు దుర్మార్గులున్నారు. వారి ప్రవర్తన చూస్తే వారిలో భగవంతు డున్నట్లనిపించదు. రాక్షసులున్నారనిపిస్తుంది'' అన్నాను. అక్కడ యిప్పుడున్న దొంగల్ని దృష్టిలో పెట్టుకుని.
''వారు పెరిగిన వాతావరణాన్ని తిట్టండి. కాని వారిని తిట్టకండి. పరిస్ధితులూ, పరిసరాలు వారిని దిగజార్చాయి. పాశ్చాత్యదేశాల్లోనే కాదు, ప్రాచ్యదేశాల్లోనూ అలాటి వారున్నారు.
సమాజాన్ని ఇంతకన్నా పై స్థాయికి తీసుకు పోవాలి. భౌతికవాదానికీ ఆదర్శవాదానికీ సామరస్యం కలిగించాలి. సమాజరుగ్మత నయం చెయ్యటానికి ఇది తప్ప మరొక మందు లేదు.
దేశాలు, ఎక్కడ చూచినా, కష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. వాటి వేదనే ఏపరిస్ధితుల్లో మార్పు తెస్తుంది. తెచ్చి తీరుతుంది వైఫల్యనునేది విజయ పథానికి సూచికాచిహ్న మని సామెత'' అన్నారువారు.
''అయితే, ప్రాంపంచిక విషయాలకు పారమార్ధిక సూత్రాలన్వయించ మంటారా? అని అడిగాను.
''అవును, అలా అన్వయించటం కుదరదనకండి. కుదురుతుంది. అందరూ ఆమోదించే ఫలితాలు చివరికి దానివల్లనే కలుగుతాయి. ఎందుకంటే ఆ ఫలితాలు మాసిపోక చిరకాలం నిలుస్తాయి కాబట్టి.
ఆధ్యాత్మికమైన తేజోదర్శనం కలిగిన వా రెక్కువైన కొలదీ ఈ భావం ఇంకా తొందరగా లోకంగా వ్యాపిస్తుంది. భారతదేశంలో పరమార్ధ జీవనులకు గౌరవం వుంది. మును పింకా యెక్కువగా వుండేది. ప్రపంచంలోని అన్ని దేశాలూ భారతదేశం లాగా వారి వారి ఆథ్యాత్మిక పురుషుల మాటలు అనుసరించి నడుచుకునే పక్షంలో ప్రపంచబాధలన్నీ తొలగిపోతాయి. శాంతి నెలకొంటుంది. జనం అభ్యుదయ పథంలో సాగిపోతారు'' అన్నారు వారు.
మా సంభాషణ అలాగే సాగిపోతోంది. ప్రాచ్య సంస్కృతిని అభినందించటానికి పాశ్చాత్యసంస్కృతిని విమర్శించే గుణం స్వామివారిలో లేదని గమనించాను. ఆగుణం ఇక్కడ చాలామందిలో వుంది.
''పాశ్చాత్యదేశాల్లో అభినందింపదగిన గుణాలెన్నో వున్నాయి. విమర్శింపదగిన దోషాలు వున్నాయి ప్రాచ్యదేశాల్లోనూ అంతే. కొన్ని సుగుణాలూ కొన్ని దుర్గుణాలూ, గుణదోషవిషయంలో రెండు ఖండాలూ సమానమే'' అని వారి అభిప్రాయం.
ముందు ముందు మనకన్నా విజ్ఞత గలవారు ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతులలోని మేలిగుణాలు గ్రహించి సమన్వయ పరిచి, యింతకన్నా సమున్నతమైన సామాజిక వ్యవస్థను రూపొందిస్తారని స్వామి వారి ఆశ.
ఆ చర్చ అంతటితో ముగించి వ్యక్తిగతమైన ప్రశ్నలడగటానికి అనుమతి తీసుకున్నాను,
''మీ రీ పదవిని అధిష్ఠించి ఎంతకాలమైంది?''
''1907 లో, అప్పుడు నాకు పన్నెండేళ్లు. నన్ను నియోగించిన నాలుగేళ్లకు కావేరీ తీరంలోని ఓ కుగ్రామానికి వెళ్లాను. మూడేళ్లపాటు అక్కడే ధ్యానసాధన చేశాను. నా అధ్యయనం కొనసాగించాను. అప్పుడు గాని నేను పీఠానికి నిజమైన ఆధిపత్యం వహించలేదు'' అని సమాధానం చెప్పారు.
''యోగ సాధన చేసిన సిద్ధ పురుషుల నొకరిని కలుసుకోవాలనుంది. అయితే వారు చేసిన సాధన ఏమాత్రమో నాకు చూపాలి. యోగిబ్రువులను చాలామందిని భారతదేశంలో చూచాను. కాని వారు చేసిన సాధనకు రుజువుగా యోగాన్ని గురించి మరో ఉపన్యాస మిచ్చారేగాని యెవరూ వారి యోగశక్తిని ప్రదర్శించి చూపలేదు. నా కోరిక గొంతెమ్మ కోరికా?'' అని అడిగాను.
వారు నిశ్చలంగా నా కళ్ళల్లోకి చూచారు.
ఓ నిమిషంసేపు మౌనం.
స్వామివారు గడ్డాన్ని తడుముకుంటూ ''ఉన్నతమైన యోగమార్గంలో ప్రవేశించాలనే మీకుంటే, మీకోరిక గొంతెమ్మ కోరిక కాదు. మీ శ్రద్ధే మీకు సాయపడుతుంది. మీ పట్టుదల కున్న బలం ఎంతటిదో నాకు తెలుసు. చైతన్య రూపంతో మీలో ఓ వెలుగు మేలుకుంటున్నది. అదే మిమ్ములను గయ్యంవైపు నడిపిస్తుంది. నిజం'' అని సెలవిచ్చారు వారు.
వారిని సరిగ్గా అర్థం చేసుకున్నానో, లేదో, నా కనుమానమే.
''ఇంతవరకూ నాకు నేనే మార్గదర్శని, బయటెక్కడో దేవుడు లేడనీ, మనలోనే వున్నాడనీ మీ సనాతన బుషులు కూడా ప్రవచించారు. అని ధైర్యంగానే అన్నాను.
వెంటనే సమాధానం వచ్చింది. భగవంతుడంతటా వ్యాపించివున్నాడు. ఏ ఒక్కరిలో మాత్రమే లేడు. సమస్త విశ్వానికీ ఆయన సంరక్షకుడు''
లోతు తెలియని నీళ్లలో దిగుతున్నానేమో అనిపించి వెంటనే విషయం మార్చాను.
''అయితే, ఇప్పుడు నన్నేం చేయమంటారు?
''చేస్తున్న ప్రయాణాలు కొనసాగించండి. ప్రయాణాలన్నీ ముగిశాక మీరు కలుసుకున్న యోగులనూ, సాధుపుంగవులనూ మళ్లా ఒకసారి గుర్తు చేసుకోండి. ఆలోచించి అందులో మీకు నచ్చినవారి నొకరిని ఎంపిక చేసుకోండి. వారి దగ్గరకు వెళ్ళి అర్ధించండి. వారు తప్పక మిమ్ము యోగమార్గంలో ప్రవేశ##పెడతారు''
వారి ముఖంలోని నిర్మమకారమైన అనుగ్రహన్ని గమనిస్తూ వుండిపోయాను.
''ఒకవేళ వారిలో ఎవరూ నాకు నచ్చలేదనుకోండి, అప్పు డేం చేయమంటారు?''
''అప్పుడు మీదారి మీదే, భగవంతుడే సాయపడి మీ కోదారి ఏర్పరుస్తాడు. రోజూ ధ్యానంలో కూర్చోండి ఉన్నతమైన విషయాలమీద మనస్సును కేంద్రీకరించండి. మీ మనస్సులో అనురాగం తప్ప మరేదీ వుండరాదు. తరచు ఆత్మవిచారణ చేస్తూ వుండండి. అలా కొంతకాలం చేస్తే ఆత్మస్వరూపం మీకు గోచరిస్తుంది. సాధనచెయ్యటానికి ఉత్తమమైన వేళ ప్రాతఃకాలం. ఆ తరువాత సాయంకాలం ఆ సమయాల్లో లోకం ప్రశాంతంగా వుంటుంది. మీ ఏకాగ్రతను భంగపరిచే అంతరాయాలు ఆ వేళల్లోతక్కువ .''
స్వామివారు నావంక దయగా చూచారు. వారి ముఖంలోని ప్రశాంతినీ నైర్మల్యాన్ని చూచి అసూయ వేసింది. జీవితంలో నాకు కలిగినన్ని దారుణమైన అనుభవాలు వారికి కలిగివుండవు.
''ఎవరూ నాకు నచ్చని పక్షంలో మిమ్ములను ఆశ్రయించవచ్చా? ఆలోచించకుండా ఆ క్షణంలో అడిగేశాను.
స్వామివారు సౌమ్యంగా తల అడ్డంగా తిప్పారు.
''నేనొక పీఠానికి అధిపతిని నా కాలం నాదికాదు. నా బాధ్యతలు నిర్వహించటానికే దాదాపు రోజంతా పడుతుంది. కొన్నేళ్లుగా రోజుకి మూడుగంటలే నానిద్ర. వ్యక్తిగతంగా మీ కోసం కొంతకాలం వెచ్చించగల గురువును చేరండి'' అన్నారు.
''నిజమైన గురువులు అరుదనీ, వారు పాశ్చాత్యులను దగ్గరకు తీయరనీ విన్నారు'' అన్నాను.
అంగీకరించినట్లు తల ఆడించి, వెంటనే ''సత్యం వుంది. దాన్ని కనుక్కోవచ్చు'' నన్నారు.
''అయితే, సమున్నతమైన యోగమార్గాన్ని చూపగల గురువని మీరెరిగినవారి దగ్గరకు నన్ను పంపండి'' అని వేడుకున్నాను.
స్వామివారు చలించలేదు. నిశ్చలంగా మౌనంగా వుండిపోయారు. చాలానే పయాకగాని'' అలాగే పంపుతాను. భారతదేశంలోని యోగసిద్ధుల్లో ఇద్దరినే నే నెరుగుదును. వారిలో యెవరైనా మీ కోరిక తీర్చగలరు. వారిలో ఒకరు వారణాసిలో వున్నారు. విశాలమైన మైదానంలోని విశాలమైన యింట్లో ఎక్కడో దాగినట్లుంటారు. వారిని కలుసుకోటం చాలా కష్టం. ఏ కొందరికో అనుమతి దొరుకుతుంది ఏ పాశ్చాత్యుడూ ఇంతవరకూ వారి సమక్షంలోకి వెళ్లలేకపోయా డనేది మాత్రం నిజం. మిమ్ము వారి దగ్గరకు పంపవచ్చు. కాని, వారు పాశ్చాత్యునికి దర్శన మివ్వరేమో అని నా భయం'' అన్నారు.
''రెండోవారు?'' రెట్టింపు కుతూహలంతో అడిగాను.
''దక్షిణాదిన దూరానెక్కడో వున్నారు. వారు ఉత్తమ గురువులని నేనెరుగుదును. వారిదగ్గరకు వెళ్ళండి'' అన్నారు.
''వారిని 'మహర్షి' అంటారు. అరుణాచలంలో వారి నివాసం. అరుణాచల మంటే పొడుపుమల అని అర్థం. ఉత్తరార్కాటుజిల్లాలో వుంది. వారిని కలుసుకోటానికి కావలసిన వివరాలన్నీ యిచ్చేదా''? అని అడిగారు,
నా మనోనేత్రాల ముందు ఒకమూర్తి ఆకస్మికంగా కదిలింది.
కాషాయవస్త్రాలు కట్టిన సన్యాసి ఒకడు తన గురువు దగ్గరకు రమ్మని వృథాగా నాకు నచ్చచెప్పబోవటమూ, ఆ కొండ పేరు ఆరుణాచల మనటమూ గుర్తొచ్చాయి.
''మీ కెంతో కృతజ్ఞుణ్ణి. నన్నక్కడకు తీసుకువెళ్లే వారున్నారు. వారిది ఆ ఆశ్రమమే'' అన్నాను.
''అయితే మీ రక్కడికి వెళతారా'' అని స్వామి వారడిగారు.
నేను అజ్జాయించాను. ''నేను దక్షిణ భారతంనుండి వెళ్ళిపోవటానికి ప్రయాణసన్నాహాలన్నీ పూర్తిచేసుకు కూర్చున్నా''నని మాత్రం అన్నాను. ఏం చెప్పటానికీ పాలుపోక.
''అయితే, నాకొక మాటివ్వండి'' అన్నారు వారు.
''తప్పకుండా'' అనేశాను భరోసాగా.
''మహర్షుల వారిని సందర్శించకుండా దక్షిణాన్ని వదలి వెళ్ళనని మాటివ్వండి'' అన్నారు.
ఎలాగైనా ఆధ్యాత్మిక మార్గంలో నాకు సాయపడాలనే కృతనిశ్చయం వారి కళ్లల్లో కనబడింది.
అలాగే వాగ్దానం చేశాను.
దయార్ధ్రమైన హాసరేఖ వారి ముఖంలో తారాడింది.
''తొందరలేదు. మీరు కోరింది దొరుకుతుంది'' అభయకంఠంతో అన్నారు.
ఏదో, వీధిలో సందడి వినబడింది.
''విలువైన మీ కాలం చాలాసేపు వాడుకున్నాను. మన్నించండి'' అన్నాను.
గంభీరమైన వారి పెదవులు విచ్చుకున్నాయి. వెనుకగదిలోకి నాతోబాటు వచ్చి, నా సహచరుడికేదో రహస్యంగా చెప్పారు. అందులో నా పేరు వినబడింది.
తలుపుదగ్గర వారికి వీడ్కొలుగా నమస్కరించి వెనుదిరిగాను. స్వామి వారు పిలిచి-
''నన్నెప్పుడూ గుర్తుంచుకోండి, మిమ్మూ నేను గుర్తుంచుకుంటాను'' అన్నారు.
గూఢమైన యీ మాట లెంతో దిగ్భ్రాంతి కలిగించాయి నాకు. పసితనంనుండి జీవితాన్ని భగవంతునకే అంకితం చేసిన ఆ వింతవ్యక్తిని అయిష్టంగానే వదలి బయటికి వచ్చాను.
వారు పరమాచార్యులు. ప్రాపంచిక మైన
అధికారాలు లక్ష్యపెట్టనివారు. అన్నీ రోశారు.
అన్నీ వదిలేశారు. మనం ఏ వస్తువు లిచ్చానా
వాటిని అవసరమున్న వారికి తక్షణం ఇచ్చేస్తారు.
వారి సౌమ్యసుందరమైన మూర్తిని నేను మరచిపోను,
మరచిపోను.
నేను విడిదికి వచ్చేసరికి దాదాపు అర్ధరాత్రయింది. తలైత్తి పైకి చూచాను, లెక్కలేనన్ని నక్షత్రాలు- వినువీధిలో క్రిక్కిరిసి కనిపించాయి. యూరప్‌లో ఎక్కడా యిన్ని నక్షత్రాలు కనిపించవు, చరచరా మెట్లెక్కి వెళ్ళాను. చేతిలో టార్చి వెలుగుతోంది, ఎవరో, ఆ చీకట్లో ఓమూర్తి నన్ను చూచి నమస్కరించింది. ''సుబ్రహ్మణ్యా'' అని ఆశ్చర్యపడి పిలిచాను. కాషాయాంబరధారియైన ఆ యోగి చిరునవ్వు నవ్వారు.
''నేను మళ్లా వస్తానని చెప్పానుగా అని మందలింపుగా గుర్తుచేశారు. నిజమే.
పెద్దగదిలోకి వచ్చాక అడిగాను, ''మీగురువుగారిని 'మహర్షి' అంటారా'' అని!
అశ్చర్యపడి ఒక్కడుగు వెనక్కి వేశారు వారు.
''మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అన్నారు.
''ఎవరోలెండి. రేపు మనిద్దరం వారి దగ్గరకు వెళుతున్నాం. నాప్రయాణం మారింది'' ఆన్నాను.
''ఎంత మంచిమాట చెప్పారు! అన్నారు.
''ఎక్కువరోజు లుండనక్కడ, బహూశా కొన్నాళ్లు'' అంటూనే ప్రశ్నలు గుప్పించాను, ఓ అరగంట దాకా, అలసిపోయి పడుకున్నాను.
సుబ్రహ్మణ్యం ఓ కొబ్బరాకుచాప మీద క్రిందే పడుకున్నారు. ఓ పలచటిగుడ్డ పరుచుకుని దాన్నే కప్పుకున్నారు. పక్కబట్ట లిస్తానంటే ఒప్పుకోలేదు.
తరువాత నాకు తెలిసిందల్లా ఎవరో తట్టితే, ఉలిక్కిపడి లేచి కూర్చోటం. చుట్టూ కటిక చీకటి. నరాలు హఠాత్తుగా బిగుసుకున్నట్లు గాలిలో విద్యుత్తు నిండినట్లూ అనిపించి దిండు క్రిందున్న 'వాచ్' తీసిచూచాను. దానిది రేడియం డయల్. రెండూ నలభై అయిదయింది.
ఇంతలో కాళ్లవైపున ఓ మనిషి! మనిషిని చుట్టుకుని వెలుగు, మళ్ళీ ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాను. ఎదురుగా శంకరాచార్యస్వామివారు. నిశ్చయంగా స్పష్టంగా స్వామివారే! వారు అలౌకికమైన అతీంద్రియ మూర్తిగా లేరు. పాంచభౌతికమైన స్థూలదేహంతోనే వున్నారు. చుట్టూ దురవగాహమైన వెలుగు. ఆ రూపాన్ని చీకటినుండి వేరుచేస్తున్న వెలుగు.
ఆదృశ్యం నిజంగా అసాధ్యమైన దృశ్యం. అసంభావ్యమైన నదృశ్యం అయినా కళ్ల యెదట నిజంగా కనబడుతున్న దృశ్యం. అయితే, మరి, వారిని చెంగల్పట్టులో వదిలిరాలేదా!
కళ్లు గట్టిగా, మరీ గట్టిగా మూసుకున్నాను. అయినా ఆరూపం స్పష్టంగా ఎదట కనబడుతూనే వుంది. మార్పు లేదు.
సౌహార్ధంతో, కారుణ్యంతో నన్ను కనుపెట్టి వుండే అండ ఒకటి దొరికిందని తృప్తిపడ్డాను. కళ్లు తెరిచాను. కాషాయాంబరధారి కనబడ్డాడు.
ముఖంలో మార్పుంది. పెదవులమీద చిరునవ్వు. నన్ను చూచి ''అణకువగా వుండు. అలా వున్నావా, నీవు కోరింది దొరుకుతుంది'' అన్న ట్లని పించింది.
ఓవ్యక్తి, సజీవంగా వున్నవ్యక్తి! నాతో అన్నారని యెందు కనుకోవాలి? కనీసం, ఓదయ్యమో, భూతమో నా కలా చెప్పిందని యెందు కనుకోకూడదు?
ఆ దర్శనం ఎలా కలిగిందో అలాగే రెప్పపాటులో పోయింది. నాకు మాత్రం, ఓ అనిర్వచనీయమైన ఔన్నత్యం ఆనందం. తృప్తి మిగిలాయి. ఆ సంఘటనకు సంబంధించిన అలౌకికత్వాన్ని పట్టించుకోలేదు. కల అని కొట్టేసినా ఒరిగే దేముంది? జరిగింది జరిగిపోయింది.
ఆరాత్రి మరి నిద్రపోలేదు. పగలు జరిగింది తలపోస్తూ, మేలుకునే వున్నాను. ఆ సమావేశం ఆ సంభాషణ దక్షిణభారతంలోని సామాన్యజనం దేవుడి వారసుడుగా కొలిచే ఆ నిరాడంబరవ్యక్తి, కళ్లల్లో కదులుతూనే వున్నారు.
-
పాల్ బ్రంటన్