Kathakanchiki
Chapters
Last Page
''వారి అనుగ్రహాన్ని ఈ పేదగుండె భరించలేకపోయింది'' #అది 1966, జూన్ ఒకటి. వారంరోజులపాటు జరిగిన ఏథెన్స్ సమ్మేళనంతో నాలుగోరోజు.
అద్భుతమైన పడమటి సంధ్యారాగ నేపధ్యంలో ఫ్రేముకట్టినట్లున్న ఫిన్క్స్ పర్వతం. దానికెదురుగా తూర్పున అక్రోపొలిస్. దాని శిఖరాన కిరీటంలా సుప్రసిద్ధ పార్ధినన్ దేవాలయం అందులో ఎథీనా.
ఎథినా జ్ఞానదేవత. శాంతిప్రదాత్రి. పూర్వం ఈ కొండమీదే 'ఎక్లీషియా' జరిగేది. ఎక్లీషియా అంటే ఏథెన్స్ నగరవాసుల సభ. ఇక్కడే ఏథెన్స్ పౌరుల నుద్ధేశించి వారి ప్రతినిధులు మాట్లాడేవారు.
ఏథెన్స్ సమ్మేళనానికి ఇంతకన్నా మనోజ్ఞమైన ప్రదేశం 'పార్ధివ జాతీయ సంస్థ'కు దొరకదు.
పార్ధివ జాతీయ సంస్థను స్థాపించినవారు హెల్లెన్పేకు చెందిన 'పాల్' ప్రభువు. ప్రతి రెండేళ్లకొకసారి గ్రీస్‌దేశపు ముఖ్యపట్టణంలో ఒక అంతార్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించటం పార్థివ జాతీయ సంస్థ చేపట్టిన ముఖ్యకార్యాల్లో ఒకటి. ఆ సమ్మేళనానికి 'ఏథెన్స్ సమ్మేళన'మని పేరు.
ఆ సమ్మేళనంలో మానవజాతి యింతవరకు సాధించిన పరిజ్ఞానాన్నీ, పొందిన అనుభవాలనూ దృష్టిలో వుంచుకుని ప్రసిద్ధులైన మేధావులు మానవుల ఆదర్శాలను, ఆకాంక్షలనూ ప్రవచించే అవకాశం కలుగుతుంది.
విచ్చేసిన ప్రతి విద్వాంసుడూ తనకిష్టమైన విషయంమీద ఏదో ఒక సాయంకాలం, ఆ సాంస్కృతికోత్సవాల్లో ఆరుబయట, ఫిన్క్స్‌శిఖరంనుండి ప్రసంగించటం అనవాయితీ.
&ప్రసంగికులైన ఏడుగురు విద్వాంసుల్లో ఆరుగురిని విదేశాలనుండి ఆహ్వానించాలని పాల్ ప్రభువొక నియమం పెట్టిపోయారు. అలా వారు నియయం పెట్టటానికి కారణం ప్రాచీన గ్రీక్ తాత్త్వికుడైన ''ఐసోక్రేట్స్'' మన సంస్కృతిలో పాలుపంచుకునే వారెవరైనా మనవారే. మనహెల్లెన్సే''. అని ఆ తాత్త్వికు డొకప్పుడు ప్రవచించారు.
ఏథెన్స్‌సమ్మేళనం మొట్టమెదట 1964లో జరిగింది. సమ్మేళనం జరగటానికి ముందే పాల్‌చక్రవర్తి పరమపదించారు. వారి పుత్రులు కాన్ట్సెంటిన్ ప్రభువు ఆవారంరోజులూ అంతటా తానేఅయి, అమితాత్సాహంతో ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాలు విజయవంతం కావటం చూచి 1966లో పార్థివజాతీయ సంస్థవారు రెండవ ఏథెన్స్ సమ్మేళనాన్ని నిర్వహించే బాధ్యత తీసుకున్నారు.
ఆక్రోపాలిస్ పర్వతం మీద ఏథీనా దేవాలయంలో మే 29వ నాడు సమ్మేళనాన్ని ప్రభువులవారే స్వయంగా ప్రారంభించారు. ఆ తరువాత ఆరురోజుల సమ్మేళనమూ ఫిన్క్స్ పర్వతం మీద జరిగింది. సమ్మేళనపు నాల్గవనాడు అంటే, జూన్ ఒకటోతేదీన- నావంతు వచ్చింది. ''భారతీయవారసత్వం'' అనేది నా ఉపన్యావవిషయం. నా ఉపన్యాసాన్ని ముగించే ముందు ఈమాట లన్నాను.
''ప్రస్తుతం విజ్ఞానశాస్త్రమూ, టెక్నాలజీ సాధించిన పురోగతిదృష్ట్యా భారతీయ వారసత్వం భవిషత్కాలంలో ఏమౌతుందోననే సందేహం నా దేశంలోని ఆలోచనాపరులనేకాదు, విదేశీయులైన మేధావులనుసైతం కలవరపరుస్తున్నది. భారతదేశాన్ని చూడటంకోసం యుగోస్లోవియానుండి వచ్చిన విద్వాంసులొకరు కంచి కామకోటి పీఠాధిపతులైన శంకరాచార్య స్వామివారి దగ్గర ఈ సందేహం వెలిబుచ్చారు. సనాతన భారతీయ యతి జీవితాన్ని తూచా తప్పకుండా గడుపుతున్న ఆ ఋషి వెంటనే యిలా అన్నారు.
''భారతీయమైన ఆత్మకు చలనం లేదు. ఏమైనాచేస్తే ఆధునిక విజ్ఞానంగానీ, సాంకేతిక పరిజ్ఞానంగానీ అర్థంలేని పాత విశ్వాసాలనూ, గ్రుడ్డినమ్మకాలనూ పోగొట్టగలవేమో. అది మంచిపనే. భారతీయ సంస్కృతి యెన్ని సవాళ్ళనో ఎదురుకొంది. ఎన్ని అఘాతాలనో తట్టుకుంది. అది నేటికీ చెక్కుచెదరలేదు. దానికి చావులేదు''.
శంకరాచార్యుల ప్రవచనంకన్నా దాని అమరత్వానికి మరొక నిదర్శనం అక్కరలేదు. భారతీయ వారసత్వం కేవలం భారతీయులది మాత్రం కాదు. ప్రపంచ జనులందరిదీను.
నేను కంచి శంకరాచార్యులవారిని గురించి ప్రస్తావించిన సభలో గ్రీకు దేశపు రాజ్ఞీ మాత మాన్యశ్రీ ఫ్రెడరికా వారి తనయ మాన్యశ్రీ ప్రిన్స్‌స్ ఐరీన్ ఆసీనులై వున్నారు. వారు కొంత కాలంగా ధ్యానసాధన చేస్తున్నారు. వారికి భగవాన్ రమణమహర్షి బోధల మూలాన అద్వైతవేదాంతంతో పరిచయం కలిగింది. మృతులైన పాల్‌చక్రవర్తితో బాటు వారిరువురూ భారతదేశంలో ఆధికారికంగా పర్యటించారుకూడా. కాని ఆపర్యటనలో భారతీయమైన ఆధ్యాత్మిక స్వరూపాన్ని అవగాహన చేసుకునే అవకాశంగానీ తీరికగానీ వారికి లేకపోయింది.
గ్రీసు మహారాజ్ఞి, వారి పుత్రిక ఈ సారి భారతదేశం వచ్చినప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులను దర్శించాలని కోరికగా వుందని నాతో అన్నారు. వారి కోరిక ప్రకారం 1966, నవంబర్, డిసెంబర్ మాసాల్లో భారతదేశానికి వచ్చి కంచిస్వామివారిని కలుసుకున్నారు. వారి సమావేశం కాళహస్తిలో 1966, డిసెంబర్ నాలుగు, ఐదు తేదీల్లో జరిగింది.
రాజ్ఞి ఫ్రెడరికా, రాకుమారి ఐరీన్ ఇంతటి సుదీర్ఘప్రయాణం చేయటం అలసట అనుకోలేదు. వారిరువురూ సత్యాన్వేషిణులుగా భారతదేశానికి వచ్చారు. వచ్చినందుకు వారి శ్రమ వృధా కాలేదు. వారికీ, శంకరాచార్యులవారికీ జరిగిన సంభాషణ సంగ్రహంగా ఇదీ:
ప్రశ్న: స్వామీ, జాగ్రదవస్థలో నా ధ్యానం చాలావరకు క్రమబద్ధంగా సాగుతుంది. కాని స్వాప్నిక స్థితిలో ధ్యాననిష్ఠ నిలవటంలేదు. ఆస్థితిలోనూ నిలవాలంటే యేం చెయ్యాలి?
సమాధానం: వచ్చే స్వప్నాలెలాటివైనాసరే, ఆందోళన పడకండి. మేలుకున్న వేళల్లో ధ్యానమగ్నులై వున్నవారు నిద్రపోయాక కూడా ధ్యానమగ్నతలోనే వుండటం సాధ్యం కాకపోవచ్చు. నిద్రావస్థలో వచ్చే స్వప్నాలు ప్రాపంచికమైనవికూడా కావచ్చు. అంతమాత్రంచేత అన్వేషకులు నిరుత్సాహ పడరాదు. అలా నిరుత్సాహ పడటం తమ అన్వేషణకు అంతరాయం అని గ్రహించాలి.
అన్వేషకులు జాగరూకత వహించవలసింది జాగ్రదవస్ధను గురించిమాత్రమే. ఆధ్యాత్మికమైన అన్వేషణకు జాగ్రదవస్థలోనే వీలయినంత ఎక్కువకాలం వినియోగించండి. అలా వినియోగిస్తే క్రమంగా స్వప్నావస్థలో కూడా ఆ అన్వేషణ కొనసాగుతుంది.
జాగ్రదవస్థను స్వప్నాలు మలినపరచలేవు. కాని స్వాప్నిక స్థితిని జాగ్రదవస్థ మలినపరచగలదు.
తెల్లవాడికి వచ్చే కలల్లో అతడు తెల్లవాడుగానే వుంటాడు. అలాగే నల్లవాడికి వచ్చే కలల్లో అతడు నల్లవాడుగానే వుంటాడు. జాగ్రదవస్థలో కలిగే అనుభవాలే కొంతవింతగా, అబ్బురంగా స్వప్నావస్థలోనూ కలుగుతాయి. అన్వేషకులు జాగ్రదవస్థలో ఆత్మ విచారం చేస్తూవుంటే స్వప్నావస్థలోనూ ఆచింతనమే కొంతవరకు ప్రతిబింబిస్తుంది. మేలుకునివున్నప్పుడు తీవ్రమైన ఉద్రేకాలకు లోనుగాకుండా మనస్సును అదుపులో వుంచుకుంటే నిద్రలోకూడా మనస్సు నిశ్చలంగా వుంటుంది.
ప్రశ్న: మనస్సును ఏకాగ్రంగా వుంచుకోవటానికీ స్థితిప్రజ్ఞంగా నిలుపుకోటానికీ ఉపకరించే ప్రక్రియ ఏదైనా వుంటే స్వామివారు సెలవివ్వాలి.
సమాధానం: సాధారణంగా ప్రతివారూ తమ ముకుపుటాల్లో ఒకదానితోనే ఉచ్ఛ్వాసనిశ్వాసాలు జరుపుతారు. ఒక వైపు జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు రెండోవైపుకు మార్చటం కొంచెం శ్రమ. గాలిపీల్చివదలటం కుడివైపున్న ముకురంధ్రంద్వారా జరుగుతున్న దనుకోండి. దాన్ని ఎడమవైపుకు మార్చాలంటే కుడివైపు ఒత్తిడి తేవాలి. అంటే కుడిచేతి మీద ఒరిగి కూర్చోవాలి. కుడివైపునుండి ఎడమ వైపుకు మార్చాలన్నా ఎడమవైపు ఒరిగి కూర్చోవాలి. ఈ మార్పు జరిగేటప్పుడు ఓ రెండు క్షణాలు రెండు రంధ్రాలూ పనిచేస్తాయి. ఆ రెండు క్షణాల్లో ''సమంగా'' ఊపిరీ పీల్చి వదులుతాము. సాధన చేసిన కొలదీ ఈసమోచ్చ్వాస నిశ్శ్వాస స్థితి పెరుగుతుంది. అది పెరిగి పెరిగి మన స్వభావాన్నే మారుస్తుంది. క్రమంగా ఏకాగ్రత అలవడుతుంది, స్థితిప్రజ్ఞత సిద్ధిస్తుంది.
ప్రశ్న: పరిసరాలు అనుకూలించనప్పుడు, మనజీవన విధానాన్ని ద్వేషించే వారే చుట్టూ చేరినప్పుడు ఎటుచూచినా దుర్మార్గం, దౌర్జన్యం మాత్రమే కనబడుతున్నప్పుడు మనిషిగా ఏం చెయ్యాలి?
సమాధానం: ద్రోహబుద్ధి కలవారూ, దుష్టులూ, దుర్మార్గులూ చుట్టూ వున్నంతమాత్రాన మనం సహనాన్ని కోల్పోరాదు. వారిని ద్వేషించరాదు. పైగా వారిని సానుభూతితో, దయతోచూడాలి. ఎవరూ పుట్టుకతో దుర్మార్గులుకారు. పరిస్ధితులవల్లా, పెంపకంవల్లా దుర్మార్గులుగా మారుతారు. అలా మారినవారిని ద్వేషించటం న్యాయమా చెప్పండి. అందువల్ల సాధకుడెవరినీ ద్వేషించరాదు. తనలోతాను ఇలా వితర్కరించుకోవాలి.
''పుట్టుకతో దుర్మార్గులెవరూ లేరు. పరిస్థితులవల్ల వారు దుర్మార్గులుగా మారారు. వారిని చూచి జాలిపడాలేగాని ద్వేషించడం తప్పు. నాకు ప్రియమైనవాడే, నాకొడుకే దుర్మార్గుడుగా మారితే నేనేంచేస్తాను? వాణ్ణి ద్వేషిస్తానా? వదులుకుంటానా? దగ్గరకుతీసి అనురాగంతో ముంచెత్తి వాణ్ణి క్రమంగా దారికి తెచ్చుకుంటాను. మంచివాణ్ణిగా మార్చుకుంటాను.
పరాయివాణ్ణౖనా అంతే. సత్వాన్వేషకుని నిజానికి పరాయివారంటూ లేరు. అందరూ ఒకేరక్తం పంచుకు పుట్టినవారే. పరిస్థితులవల్లా పెంపకంవల్లా నేనే దుర్మార్గుడుగా మారితే నాగతేమిటి? అందువల్ల ప్రతి దుర్మార్గుడిలో నన్నే చూచుకుంటాను. నా ఆత్మనే దర్శిస్తాను. అతణ్ణి ఎప్పుడూ ద్వేషించను''.
ప్రశ్న: సవికల్ప సమాధి స్థితికీ, నిర్వికల్ప సమాధిస్థితికీ వున్న భేదం ఏమిటి? సహజ సమాధి అంటారే, అదెలావుంటుంది?
సమాధానం: ధ్యానమార్గంలో, ఏకాగ్రపథంలో సవికల్పమూ, నిర్వికల్పమూ అనేవి రెండుదశలు. సవికల్ప సమాధిలో మనస్సు నిశ్చలంగా వుంటుంది. చెదరదు ఒక విషయం మీద ఏకాగ్రమై నిలుస్తుంది. అందులో లీనమౌతుంది?
నిర్వికల్పసమాధిలో మనస్సు పనిచేయటం మానుతుంది. అదృశ్యమైపోతుంది. అప్పుడు ఆత్మ ఒక్కటే ప్రకాశిస్తుంది. యోగానికి లక్ష్యం నిర్వికల్ప సమాధే.
అధ్వైతంలోకూడా ధ్యానానికి అవసరముంది. కాని ధ్యానానికి గమ్యమైంది అద్వైతంలో అభేదబ్రహ్మం.
ఇక సహజసమాధి అనేది బ్రహ్మ విచారం వల్ల కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారపు సహజస్థితి. క్షణక్షణం మారే అద్భుతాల కతీతమైన యోగదశ.
ప్రశ్న: సంప్రదాయాల విషయంలోనూ, ఆచార విషయంలోనూ నాయకుడైన వాడేంచేయాలి? అవి తనకు ఉపయోగపడవని తెలిసికూడా వాటినే పాటించక తప్పదా?
సమాధానం: ఒకవర్గానికో, ఒక సమాజానికో, ఒక ప్రభుత్వానికో నాయకత్వం వహించేవాడు సాంప్రదాయికంగా వచ్చే మతాచారాలనూ, కర్మకాండనూ నిరాదరించకూడదు, అని తన కవసరం కాదని తెలిసినా, వాటిని పాటించితీరాలి. ఉదాహరణకు చర్చిలో జరిగే ఆచారకాండ తన ఆధ్యాత్మిక పురోగతికి అనావశ్యకమని యెరిగికూడా మతాచార్యుడు దాన్ని అనుసరించాలి.
అలా అనుసరించకపోతే ఈ ఆచారకాండవల్ల లాభపడేవారుకూడా దాన్ననుసరించరు. అది అనుసరించతగని ఒరవడిలాంటిది.
''కర్మపరతంత్రులైన ఆజ్ఞానుల మనస్సులను జ్ఞానులైనవారు కర్మమార్గంనుండి తొలగనివ్వరు. తామూ ఆ కర్మలనే కుశలబుద్ధితోచేస్తూ వారికీ మార్గదర్శకంగా వుంటారు'' అని భగవద్గీతలోవుంది. నాయకులూ, ఉన్నతులూ అయినవారు ప్రజ లేస్థితిలో వుంటే ఆస్ధితినుండే వారిని ముందుకు నడిపించాలి. అంతేగాని సంప్రదాయంగా వస్తున్న పూజా విధానాలను మానకూడదు.
స్వామివారు తమకు దర్శన మనుగ్రహించటం ఒక భాగ్యంగా భావించి వారితో జరిపిన సంభాషణ తమ హృదయం మీద ఎంతటి చెరగని ముద్ర వేసిందో ఉగ్గడిస్తూ మహారాణి యిలా అన్నారు:
''స్వామి చరణసన్నిధిలో గడిపిన యీరెండు రోజులూ మరిచిపోలేము ఈ రెండురోజులూ స్వచ్చమైన ఆధ్యాత్మి కత్వంలో జీవించాము. ఏ అదృశ్యశక్తో మమ్ము ''వారి చెంతకు చేర్చింది''
ఈ అనుభవాలే విపులీకరిస్తూ, ఆమహానీయునితో తమ సమావేశాన్ని నెమరు వేసుకుంటూ మహారాణివా రింకా యిలా అన్నారు.
''కొంతకాలంగా అడగటానికి వివరణలేతప్ప కొత్త ప్రశ్నలేవీ లేని స్ధితికి చేరుకున్నాను. అయినా నాకు ఆత్మాను సంధానం అస్థిరంగానే వుంది. సాధన చేసేకొలదీ అది స్థిర పడవచ్చు. అప్పుడు ఏ సమస్యా వుండదు. దేనికైనా కాలం రావాలి. అప్పుడు అదృష్టం కూడా కలసివస్తుంది. అదృష్టం కాకపోతే అంతటి సర్వోత్తముని సందర్శించే భాగ్యం మాకెలా కలుగుతుంది చెప్పండి! విచలించి పోకుండా వారి అనుగ్రహాన్ని మనస్సులోనే యిమిడించుకోవటం సాధ్యం కాకుండా వుంది.
ఆధ్యాత్మికాన్వేషకులు అంతరంగం లోపొందే అతిలోకమైన అనుభవాన్నే వ్యోమగాములు బహిరంగంగా పోందుతారని స్వామివారన్నారు. వారి సాన్నిధ్యంలో మాకు అతిలోకమైన బహిరంతరానుభూతి కలిగింది. మేము ధన్యులం. ఆదిభౌతికానికీ ఆధ్యాత్మికానికీ వారు విస్పష్టమైన అనుబంధం. అన్వేషకులకు ఆధి భౌతికమూ, ఆధ్యాత్మికమూ వేరు కావు. వేరుకా వనటానికి స్వామివారే రుజువు. దుర్బలమైన శరీరంలో వారు అతిధి, బక్కచిక్కిన వారి శరీరంకంటికి కనబడుతూనే వుంది. ఏ బ్రహ్మపదార్థంతో ఆ అతిథికి అభేదం ఉందో బ్రహ్మపదార్ధమూ ఆ దేహంగా దృశ్యమాన మవుతున్నది. దీనివల్ల భౌతికమూ, ఆధ్యాత్మికమూ వేరు కావని స్వామివారే నిరూపించటం లేదా! ఆ తేజస్సులోని అందం మన గ్రుడ్డికళ్ళ కెలాతెలుస్తుంది!
''వారి అనుగ్రహాన్ని ఈ పేదగుండె భరించలేక పోయింది. సంతతధారాపాతంగా కన్నీరు కారింది. అది సామాన్యమైన కన్నీరు కాదు. తీరిన కోరికల కన్నీరు. తృప్తి, ఆనందం కార్చిన కన్నీరు. మనస్సు కడిగి శుభ్రపరిచిన కన్నీరు. మనస్సును కరిగించిన కన్నీరు. వారు ప్రతీకగానిలచిన పరమసత్యంతో మనస్సును ఏకం చేసిన కన్నీరు.''
సరిగ్గా రెండేళ్లకు రాణి, రాకుమారి మళ్ళీ స్వామివారిని దర్శించటం కోసం భారతదేశం వచ్చారు. ఈ సారి మేనకోడలు డోరోథీ, మేనల్లుడు కార్ల్ కూడా వారి వెంట వున్నారు. స్వామివారు మచిలీపట్నంలో వుండగా 1968, డిసెంబరు 6, 7, 8 తేదీల్లో వారితో సమావేశాలు జరిగాయి అతిథులు మొత్తం ఎనిమిది గంటలకు పైగానే స్వామివారితో సంభాషించారు. సంభాషించినంతసేపూ స్వామివారి వివేకంలో, అనుభూతిలో ఓలలాడారు. స్వామివారి ఆధ్యాత్మిక దీప్తిలో మునిగితేలారు.
మూడవతేదీన వారు మద్రాసులో కాలుమోపినప్పటినుండి, మచిలీపట్నంలో మూడు రోజులు గడిపి పదకొండవతేదీ మద్రాసునుండి బాంబే మీదుగా యూరప్ చేరేవరకూ వారి మనస్సులో ఒకే ఒక ఆలోచన స్వామివారిని గురించి.
స్వామివారిని సందర్శించటం జీవితంలో తమకు భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరం అనుకున్నారు. వారి వారికి స్వామి అనుగ్రహం కోకొల్లలుగా లభించిన మాట కూడా వాస్తవమే!
వారుస్వామివారితో వేరువేరుగానూ సంభాషించారు. అందరూ కలసీ సంభాషించారు. వారడిగిన ప్రశ్నల్లో వారికున్న గాఢమైన చిత్తశుద్దీ నిశితమైన పారమార్థికాన్వేషణా కనబడేవి. ఇక స్వామివారి సమాధానాల్లో ఎంతో విస్పష్టమైన ఆదేశం వుండేది. ఎంతో సులభమనోజ్ఞమైన వివరణం వుండేది. ఆంతరమైన అన్వేషణ సుగమం కావటానికి స్వామివారి మాటలు ఎంతగానో తోడ్పడతాయి. అసలు ఆ సంభాషణలు వినటమే ఓ అద్భుతమైన అనుభవం అనిపించింది నాకు.
వారి సంభాషణల్లో బయటి ప్రపంచపు ఊసేలేదు. అతిథుల ఆసక్తి అంతా అంతరలోకాన్ని గురించే, సందేహాలు తీర్చి, జ్ఞానోదయం కలిగించి, ఋతమార్గంలో నడపగల అధికారం కలవారిని చేరామనే ధన్యతాభావం వారి ముఖాల్లో, వ్యక్తమయ్యేది.
ఇటీవలె ధ్యానసాధనలో ప్రవేశించిన అతిధులకు ఏ సాంకేతికపద్థతి అనుసరించాలో స్వామివారు విపులంగా సెలవిచ్చారు.
''ధ్యానకాలాన్ని ఉరామరికగా రెండు సగాలు చేసుకొని మొదటిసగంలో ఊపిరిని అదుపులో పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. అంటే పూర్తిగా ఊపిరి పీల్చి ఆశ్రమంగా దాన్ని సాధ్యమైనంతసేపు నిలుపుకోటానికి ప్రయత్నించాలి. ఒకరు 100 సెకండ్లు ఊపిరి బిగబట్టగలరనుకోండి. 50 సెకండ్ల సేపే బిగబట్టి గాలి మెల మెల్లగా వదలాలి. ధ్యానంలో మొదటి సగభాగాన్నీ ఈ సాధనకు ఉపయోగించుకోవాలి. ఊపిరి బిగబట్టాక కొన్ని క్షణాలసేపు భగవంతుని మీద అంటే ఈ సృష్టికీ, అందులో భాగమైన మనకూ కారణమైన శక్తిమీద మనస్సు కేంద్రీకరించాలి''
ధ్యానకాలాన్ని రోజూ కొంచెం పెంచుకుంటు వెళ్ళాలని కూడా స్వామివారు సూచించారు. ఒకరు ఉదయం అరగంట, సాయంకాలం అరగంట ధ్యానంలో కూర్చుంటారనుకోండి. వాటితో పాటు మధ్యాహ్నం ఓ పదిహేను నిమిషాలు కూడా ధ్యానంలో కూర్చోవచ్చు.
ఆధ్యాత్మిక జీవితంలో ఎంత పురోగతి సాధించావని స్వామివారు ఐరీన్ రాజకుమారి నడిగారు. ''సంగీతం నేర్చుకుంటున్నాను. సంగీతంద్వారా సాధనద్వారా భగవదను సంధానం పొందటానికి ప్రయత్నిస్తున్నాను. నన్నీ మార్గంలో పయనించమంటారా?'' అని ఆమె స్వామివారి నడిగారు. నాదబ్రహ్మపాసన ద్వారా అంతరచైతన్య దర్శనం ఎలా కలుగుతుందో స్వామి నిర్దేశించారు. సంగీత సాధన చేస్తూనే ధ్యానసాధన చేయవచ్చుననీ అవి పరస్పర దోహదకారులనీ వారన్నారు.
ఫ్రెడరికా మనోరాజ్ఞి ధ్యానమార్గంలో అభివ్యక్తమయ్యే అసామాన్య దృశ్యాలను గురించి అడిగారు. వాటికి అట్టే ప్రాధాన్య మీయరాదనీ ధ్వానానికి లక్ష్యం ఆత్మజ్ఞానమనీ దాన్నెప్పుడూ మరువరాదనీ స్వామివారు సెలవిచ్చారు.
చివరిక్షణాల్లో మనిషి ఆత్మజ్ఞానాన్ని కోల్పోకుండా వుండాలంటే యేంచేయ్యాలనే ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా స్వామివారు జీవితంలో చివరివరకూ పంచేద్రియాలూ స్వాధీనంలో వుండి ప్రశాంతంగా కన్నుమూసినవారి ఉదంతాలు కొన్ని చెప్పి ''నిజానికి ఎలామరణించాడన్నది అంత ముఖ్యం కాదు. ఎలా జీవించాడన్నదే ముఖ్యం సాధ్యమైనంతవరకూ పరమార్ధాన్ని దృష్టిలో వుంచుకునే మనిషి జీవించాలి. చివరి గడియలెలా గడుస్తాయా అని ఆందోళన పడకూడదు. జీవితంలో నిత్యమూ కొంతసేపు ధ్యానసాధన చేస్తున్నవారు అంత్యదశలో ఇంద్రియశక్తులన్నీ అలాగే నిలుపుకోవాలనుకుంటే ప్రాణాయామాన్నో మరే యోగమార్గాన్నో అనుసరించక తప్పదు. నిజానికి చివరిదశనుగురించి యెవరూ అంతగా పట్టించుకోనక్కరలేదు. ఈ యోగమార్గాలేవీ పారమార్ధిక జీవితానికి అంతగా ఉపయోగపడవు.
''శాకాహారులుగా మారిన మాలాంటి కొందరిని ఎందుకలా మారా రని మిత్రు లడుగుతూ వుంటారు. ''బాధ కలిగించటం ఇష్టం లేక'' అని సమాధానం చెప్పామా, మొక్కలకు మాత్రం బాధ వుండదా అని అడుగుతారు. వారికేం సమాధానం చెప్పాలో తెలియదు'' అని ఫ్రెడరికా అన్నారు.
''రాలిన పండ్లో, ఆకులో తిని జీవించటమే నిజమైన ఆదర్శం. కేవల కరుణాపూర్ణమైన మనస్సులున్నవారు ఆదర్శ జీవితం గడుపుతారు. అది అందరికీ సాధ్యంకాదు. కాని ఆదర్శజీవితం గడపటం కోసమే అందరూ ప్రయత్నించాలి.
ప్రాణులను తక్కువగా హింసించి బ్రతకటం సాధ్యమైనప్పుడు, బ్రతకటంకోసం ప్రాణులను ఎక్కువ హింసించటం దేనికి, అనేది మౌలికమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రతివారూ మాంసాహారాన్ని వదలి శాకాహారులు కావాలి.
కాయలు కోసినప్పుడు మొక్క చనిపోదు. కాని జంతువును చంపందే మాంసం దొరకదు.
మొక్కల్లో కన్నా జంతువుల్లో బాధపడే గుణం ఎక్కువ. వాటి ఇంద్రియవికాసం మొక్కల్లోకన్నా ఎక్కువ కాబట్టి ఈ విషయంలో జంతువులకూ మనుష్యులకూ పెద్ద తేడా లేదు. బాధపడే గుణమూ దాని తీవ్రతా రెంటిలోనూ దాదాపు సమానమే. మొక్కల్లో ఇంద్రియాలు వికసించక బాధపడే గుణం కూడా మందంగానే వుంటుంది. కాయలు కోయటం కొంతవరకు జుట్టు కత్తిరించటమో, గోళ్ళు తీయటమో లాంటిది. లేకుంటే గిల్లటమో మొట్టటమో లాంటిది.
జంతువధకూ, నరవధకూ మౌలికమైన భేదంలేదు. నరవధ తపై#్పతే జంతువధ కూడా తప్పే. నాగరికులైనవారు జంతుమాంసం తిని నరమాంసం తినకపోవటానికి కారణం కేవలం హార్థికమే. వేరే యేం లేదు. కాయగూరలు తినటంలో కన్నా జంతుమాంసం తినటంలో హింసించటం ఎక్కువ అనేది నిజం. హింసను వీలయినంతమట్టుకు తగ్గించటం మానవులుగా మనకు కర్తవ్యం'' అని స్వామివారు ఫ్రెడరికాతో అన్నారు.
రాజు కుటంబంవారిలో ఎవరో, స్వామివారి నడిగారు. ''ద్వితీయ ప్రపంచ సంగ్రామం ముగిశాక, ఆధ్యాత్మిక మూల్యాల వైపు మళ్ళే అవకాశాన్ని మానవజాతి కోల్పోలేదా'' అని.
అప్పుడు స్వామి ''మానవజాతికి అంతటికీ అన్వయించే అలాటి అభిప్రాయాన్ని ప్రకటించటం మంచిదికాదు. కావలసింది, ప్రతివ్యక్తీ అంతరంగికంగా పురోగమించటం అలా ప్రతివ్యక్తీ కోరుకోవలసింది తాను గొప్పవాడు కావాలని కాదు. తాను మంచివాడు కావాలని మంచివాడైతేచాలు గొప్పతనం దానంతట అదే వస్తుంది'' అన్నారు.
మచిలీపట్నం వదలి వెళ్ళే ముందు గ్రీస్‌రాజ కుటుంబసభ్యులు 1968, డిసెంబరు, 8న స్వామి దివ్యసన్నిధిని ఓ గంటసేపు గడిపి సెలవు తీసుకున్నారు. అంత సేపూ అందరూ మౌనమే. మాటల్లేవు. తమ సహజ ధోరణిలో స్వామివారు వారి నాశీర్వదించారు. వారు వెళ్ళలేక వెళ్ళలేక బలవంతాన వెళ్ళారు.
వారు కూర్చున్న రైల్ కోచ్‌లోకి వెళ్ళి మచిలీపట్టణ పురపాలక సంఘాధ్యక్షుడు తాము చేయదలచిన పౌరసమ్మానాన్ని అంగీకరించవలసిందిగా ప్రాధేయ పూర్వకమైన అభ్యర్థన చేసినప్పుడు ''మీ కెంతో కృతజ్ఞులం. మేము యూరప్ నుండి యింతదూరం వచ్చింది గ్రీస్ రాజవంశపు సభ్యులంగా కాదు. స్వామివారి అనుగ్రహాన్నీ, ఆధ్యాత్మిక మార్గదర్శనాన్నీ కోరిన వినమ్ర భక్తులంగా'' అన్నారు. ఆమాటల్లో వారి నమ్రత, సమున్నతమైన విలువలకోసం జరిపే తీవ్రాన్వేషణ ప్రతిబింబించాయి.
- టి.యం.పి. మహాదేవన్