Kathakanchiki
Chapters
Last Page
''మీరేంచేసినా ప్రేమతో చెయ్యండి''
వారి సమావేశం ఆనాటి రాత్రి తొమ్మిది గంటల కేర్పాటయింది. మద్రాసులోని త్యాగరాయ నగర్‌లో వున్న స్వామి వారి విడిదికి సర్ పాల్ డ్యూక్స్ రాత్రి ఎనిమిదిన్నరకే వచ్చేశారు. ఆరు బయలు వరుసగావున్న తాటిచెట్ల క్రింద ఏర్పాటైన సమావేశస్థలానికి సర్ పాల్ డ్యూక్స్ నెవరో తీసుకువచ్చారు. దగ్గరొక గడ్డవామి వుంది. స్వామివారు కూర్చోటానికి మధ్య ఒక పీట వేశారు. ఆ పరిసరాలు డ్యూక్సును బాగా కదిలించాయి. తానెదురు చూస్తున్న సమావేశానికి ఇంతకన్నా కాల్పని కమైన వాతావరణాన్ని ఊహించలే నన్నారు వారు.
అప్పుడే ఫ్రాన్స్ దేశస్థుడైన ఫిలిప్ లేవెస్టిన్ కూడా కొందరు భారతీయమిత్రులతో కలసి అక్కడికి వచ్చారు. ఒక గొప్ప విద్వాంసుడూ యోగీ అయిన మహానీయుణ్ణి కలుసుకోబోతున్నా మన్న సంభ్రమం వారిలో స్పష్టంగా కనిపించింది.
తొమ్మిది గంటలు దాటి కొంత నేవయింది. ఉన్నట్లుండి టార్చిలైట్ వెలుతురు కనబడితే అందరం అటువైపు చూచి లేచినిలబడ్డాము. స్వామివారు మెల్లగా నడిచి వస్తున్నారు. నడకలో తాను నడుస్తున్నాననే స్పృహేలేదు. ఆ వింతనడక వారిదే వెంటనే వస్తున్న అయిదారుగురు శిష్యులూ ఆగిపోయారు. స్వామివారు పీటమీద కూర్చుని అంతవరకూ లేచినిలబడ్డవారిని కూర్చోండని సంజ్ఞ చేశారు. వచ్చిన అతిధు లిద్దరూ స్వామివారికి సమీపంలో కూర్చున్నారు, సంభాషణకు రంగం సిద్ధమైంది.
ముందుగా సర్ పాల్ డ్యూక్స్ పరిచయం జరిగింది. వారు ''ది అనెండింగ్ క్వెస్ట్'' ''యోగాఫర్ ది వెస్టణ్ వరల్డ్'' అనే గ్రంధాలు రెండు వ్రాశారని పరిచయం చేసినవా రున్నారు. ''అంతంలేని అన్వేషణ'' అని ఆ గ్రంథానికి పేరు పెట్టటంలో మీ ఉద్దేశ మేమి'' టని స్వామివారు డ్యూక్స్ నడిగారు. ''నా విషయమే చూడండి, నా అన్వేషణ యింకా పూర్తికాలేదు. ఒక సామాన్య పాశ్చాత్యుడు చేసే అన్వేషణ ఏదో ఒక క్రైస్తవశాఖను వరించటంతో ముగుస్తుంది. కాని అది నిజమైన అన్వేషణ కాదు'' అని వారు సమాధానం చెప్పారు.
స్వామివారు ''మనం చేసే అన్వేషణ బాహ్యమైనదైతే దానికి అంతం వుండదు. దిగంతాన్ని అందుకోటానికి తీసే పరుగులాంటి దది. అదివట్టి భ్రాంతి అంతే ! కాని మన అన్వేషణ అంతరమైనదైతే అది ఆత్మసాక్షాత్కారంతో ముగుస్తుంది. ఒకవిధంగా అంతర్ముఖత్వానికి కూడా ముగింపు అనేది లేదేమో, దాని పరమార్ధం అనంతం కాబట్టి'' అన్నారు.
తరువాత ఫ్రెంచిమేన్ పరిచయం జరిగింది. వారు రాచరికపు వ్యవస్ధను గురించి ప్రస్తుతం పరిశోధన సాగిస్తున్నారు. ఆ పరిశోధనలో భాగంగా మన దేవాలయాలూ, పురాణాలూ అధ్యయనం చేయటానికి ఈ దేశం వచ్చారు. లేవెస్టిన్ తనకున్న ముఖ్య సమస్య యేమిటో తానే చెప్పారు. ''పూర్వకాలంలో రాచరికవ్యవస్ధ ఆది భౌతికానికీ, ఆధ్యాత్మికానికీ ప్రతీకగా వుండేది. అందులో లౌకికానికీ భేదం లేదు. రెండూ కలిసే వుండేవి. ఇటీవల ఈరెండూ విడిపోయాయి. అలా విడిపోయాకనే మనకష్టాలు మొదలయ్యాయేమో! దక్షిణభారతదేశంలోని దేవాలయాల అధ్యయనం వల్ల లౌకిక భావనకూ పరమార్ధభావనకూ వున్న అవినాభావం మరింత రుజువౌతుందేమో అని ఆశ'' అన్నారు.
''రాజా ధర్మస్య కారణమ్'' (రాజే ధర్మానికి బాధ్యుడు) అనే స్తూకి విన్నారా?'' అని స్వామివారు లేవెస్టిన్‌ని అడిగారు. స్వామివారు ఆ సూక్తికి చేసిన వ్యాఖ్యానం నముజ్జ్వలమైంది. వారు దాన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు అతిధు లిద్దరూ స్వామివారికి మరింత దగ్గరగా జరిగి, చెపులప్పగించి విన్నారు. స్వామి తమిళంలో మాట్లాడుతూ ఎన్నో ఆంగ్లపదాలు ద్విభాషి సౌకర్యం కోసమూ, అతిధుల అవగాహన కోసము ప్రయోగించారు.
క్రింద కూర్చోటం అలవాటు లేక పాశ్చాత్యులిద్దరూ నానాఅవస్థలూ పడ్డారు. మాటిమాటికీ కాళ్లు మార్చుకోటం చూచి 'కాళ్ళు కదిలించకండి' అన్నట్లు వారి మోకాళ్ళు ద్విభాషి మెల్లగా తాకారు. అలా తాకటం స్వామివారు గమనించనే గమనించారు. 'వారి నిష్టం వచ్చినట్లు కూర్చోనివ్వండి' అని ద్విభాషితో అన్నారు. ''సామాన్య పాశ్చాత్యుడికి క్రింద కూర్చోటం అందులో ఒకే పద్ధతిలో కూర్చోటం - చాలాకష్టం. వారెలా కూర్చున్నారనేది కాదు ముఖ్యం. ఈ విషయంలో వారు పిల్లలు, వారికి ఆంక్ష లెందుకు?'' అని కూడా అన్నారు.
ఆ సంస్కృతసూక్తిని వివరిస్తూ స్వామివారు ''మానవుడు ఆకలిదప్పులు తీర్చుకోవలసిందే. ఉండటానికి ఒక ఆశ్రయం ఏర్పరుచుకోవలసిందే. కాని, మనిషికి తనపట్ల, తన సమాజంపట్ల, తన జాతిపట్ల నెరవేర్చాలిసిన విధులు కొన్ని వున్నాయి. సాధారణంగా ఈ విధులన్నీ భౌతికావసరాలకు సంబంధించినవి. వాటిని నెరవేర్చటంలో ఓ పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం నెరవేరిస్తే దానివల్ల మనిషికి ఆధ్యాత్మికమైన ఉన్నతి కలుగుతుంది. అదే ధర్మమంటే. ప్రతిపౌరుడికీ ఆధ్యాత్మికౌన్నత్యమూ అభ్యుదయమూ పెంపొందే అవకాశాలు కల్పంచటమే ప్రభువుగానీ ప్రభుత్వంగానీ చేయవలసిన పని. అదే 'రాజా ధర్మస్య కారణమ్' అనే సూక్తి కర్థం.
తనకు సంస్కృతం నేర్చుకోవాలని వుందనీ, పుస్తకాలవలన కాకుండా గురుముఖంగా నేర్చుకోవాలని కోరికనీ లేవెస్టిన్ అన్నారు. వారి కోరికను మెచ్చుకుంటూ స్వామివారు ''భారతదేశంలో కూడా గురుముఖంగా అధ్యయనం చేసే సంప్రదాయం దాదాపు అంతరించింది. ''వైదుష్యం వేరు, చదవటానికీ వ్రాయటానికీ అవసరమయ్యే శక్తి వేరు. పూర్వకాలంలో ఈ రెంటికీవున్న భేదం తెలిసేది, మహావిద్వాంసులైన చాలామందికి చక్కగా చదవటంగానీ వ్రాయటంగానీ రాదు'' అన్నారు.
వింటున్నవారిలో ఒకరు చదవనూ, వ్రాయనూ చేతకాని రామకృష్ణ పరమహంస పేరు నుదహరించి వారికి బెంగాలీలో సరిగా సంతకం చేయటంకూడా రాదన్నారు. అప్పుడు స్వామివారు ''మతాతీతులైన పండితులను గురించికూడా నేను మాట్లాడుతున్నాను. కణక్కారులని కొందరున్నారు. వారు గొప్ప వ్రాయసకాండ్రు. వారిదొక ప్రత్యేకమైన కళ. వారు మినహా మిగిలిన వారందరూ చదువురానివా రనుకోరాదు. సుప్రసిద్ధులైన ఆనాటి గణితశాస్త్రజ్ఞులకూ, ఖగోళశాస్త్రజ్ఞులకూ భౌతికశాస్త్ర పండితులకూ వేద విద్వాంసులకూ పఠన రచనాశక్తి లేదు వారి చదువు మౌఖికమైన చదువు. అంటే గురువు నోటితో అన్నదాన్ని వల్లెవేయడం వల్ల వచ్చిన చదువు. ఆపద్ధతికున్న అద్భుతమైన బలం ఆపద్ధతికుంది. కాదనటానికి వీల్లేదు. కొద్ది పరిమితుల్లో దాన్ని పునరుద్ధరిస్తే లాభం వుంది'' అన్నారు.
అయితే పురాతనమైనది ఎంతవుందో అంతా పునరుద్ధరించాలని స్వామివారి ఆశయమా?'' అని సర్ పాల్‌డ్యూక్స్ ప్రశ్నించారు. ఏది మంచిదో ఏది విలువైనదో దాన్ని మళ్ళీ నిలబెట్టాలిసిందే. ఈపని చెయ్యటానికి ప్రచారం అవసరం లేదు. ఇది ప్రచారంతో జరిగేపని కాదు. కొందరు తాముగా అవలంబిస్తే దానంతట అదే అల్లుకుపోతుంది ముందు ముందు పాశ్చాత్యదేశాలు కూడా ఈ పద్ధతినే అనుసరించవచ్చు. పాశ్చాత్యులు మెచ్చుకున్నాక మావారూ కళ్లుతెరచి గతవైభవాన్ని దర్శించవచ్చు'' అని స్వామివారన్నారు.
''చివరగా నాకో కోరికుంది. పాశ్చాత్య దేశాలకు మీరందించే సందేశం తీసుకువెళ్లాలి'' అని సర్ పాల్ అన్నారు. ఆమాటవిని స్వామివారు అంతర్ముఖులై మౌనంగా వుండిపోయారు. వారి కళ్ళు అర్థనిమీలితాలయ్యాయి. వారు ధ్యానమగ్నులయ్యారు. కొంతసేపటికి మెల్లగా యిలా అన్నారు.
''మీ రేదిచేసినా ప్రేమతోనే చెయ్యండి. ఎంత చేసినా యితరుల కోసమే చెయ్యండి. ఒకపనిలో చేసేవారెంత ముఖ్యమో, దాని ఫలితం అనుభవించేవారు అంత ముఖ్యమే. ప్రతి పని ప్రేమవల్లే జరగాలి. గాంధీగారు చెప్పిన అహింసా ధర్మాన్ని గురించికాదు నేను మాట్లాడుతున్నది! పరిస్థితులు విషమించినప్పుడు హింస అనివార్యం కావచ్చు. శిక్ష అవసరమూ కావచ్చు. యుద్ధాలుకూడా చేయవలసిరావచ్చు. చేసేపని ఏదైనా, ఎంతటిదైనా? దాని మూలం ప్రేమై వుండాలి. రాగధ్వేషాలనూ, అసూయాక్రోధాలనూ పూర్తిగా విసర్జించాలి. చేసేపనిని ఏ ఉద్రేకమూ మలినపరచరాదు. ప్రతి చర్యకూ ప్రేమ అనేదే మూలసూత్రమైతే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలు చాలావరకు మాయమైపోతాయి.
ఈ సందేశాన్ని భారతీయ బుషులూ, యోగులూ, ఇచ్చిన సందేశంగా మీవెంట తీసుకువెళ్ళండి''.
భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతిలో సముదాత్తాలూ, నమున్నత్తాలూ అయిన లక్షణాలు సజీవాకృతి అనదగిన ఒక మహాపురుషునితో జరిగిన చిరస్మరణీయమైన సమావేశం ఆవిధంగా పరిసమాస్త మయింది.
స్వామి వారి ప్రసన్నతాసౌహార్ద సుగంధాన్ని అనుభవిస్తూ, భువన మోహనాలయిన వారి కళ్లల్లో వెలిగే జ్ఞానకాంతుల్ని దర్శిస్తూ అందరూ వారి మాటలు విన్నారు. వారి మాట లెంత సత్యాలో అంతమ నోహరాలు.