Kathakanchiki    Chapters    Last Page

 

వారి చూపుల్లో పరిహాస కుశలత కూడా వుంది.

నాకెదురుగా కూర్చున్న వ్యక్తికి అరవైఅయిదేళ్లు. సన్నగావున్నారు. ప్రమాణమైన మనిషికన్నా కొంచెం పొట్టి.

బట్టతలో, వపనం చేయించుకున్నారో తెలియదు. ముఖానికి క్రింద భాగమంతా తెల్లని కురచగడ్డం.

&#నెరసిన మీసాలూ, కనుబొమలూ, కాషాయాంబరాలు ధరించిన సన్యాసిలా వున్నారు.

ఇవేవీ నిజానికి ముఖ్యంకాదు. ముఖ్యమైనది వారి ముఖం- మరీ వారికళ్లు.

&#ఆ కళ్లు నావంకే నిశ్చలంగా చూస్తున్నాయి.

&#ఆ చూపుల్లో దయవుంది, జాలివుంది, ఆలోచనవుంది. వీటితోపాటు పరిహాస కుశలతకూడా వుంది.

వారి ఎదుట కూర్చున్నప్పుడు ప్రశాంతచిత్తులైన ఒక మహర్షి సన్నిధిలో వున్నాననే భావం కలిగింది నాకు. వారితో సంభాషించిన మూడున్నర గంటలూ ఈ భావం మనస్సులో పెరిగి స్థిరపడి ఒక నిశ్చయానుభవంగా మారింది.

ఆ సంభాషణ జరిగింది 1959 ఏప్రిల్‌ 20 రాత్రి.

ఆ మహర్షి కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ చంద్రశేఖర సరస్వతీ శ్రీపాదులవారు. సమస్తలోకానికి పరమార్థ దేశికులైన శ్రీ శంకరాచార్య యతీంద్రులు.

చుట్టూ ప్రశాంతమైన ప్రకృతి, సమ్మోహకరమైన దాక్షిణాత్యనిశీధి. పలచబడిన చలివేళ. వేసవి అడుగిడుతున్న తొలివేళ. పండువెన్నెల. చుట్టూ కొబ్బరిచెట్లు. నిశ్శబ్ధంగా అటూయిటూ పరుగెడుతున్న చీకురాళ్ళు. తెరలుతెరలుగా వీస్తున్న చల్లనిగాలి. అప్పుడప్పుడు గుడ్లగూబలు కీచుమన్న సవ్వడి. దురాన ఎక్కడో ఓకుక్కోనక్కో అరుపు. మరపురాని రాత్రి.

మద్రాసుకు ఆరుమైళ్ళ దూరంలోవున్న నంబాల్‌ అనే వూరిలోని ఓతోపులో స్వామివారూ, నేను బాసికపట్టువేసుకు ఎదురెదురుగా కూర్చున్నాము. మాతోపాటు మరిద్దరున్నారు. ఒకరు అనంతానందేంద్ర సరస్వతీ స్వామివారు. పూర్వాశ్రమంలో మద్రాసు హైకోర్టులో ఉద్యోగులు. స్వామి వారిచ్చిన దీక్షగ్రహించి, వారిని అనుక్షణమూ సేవిస్తున్న ధన్యజీవులు. మేము మాట్లడుతున్నంతసేపూ వారు తాపస దండంమీద ఒరిగి నిలబడే వున్నారు. మధ్యలో నోరుమెదపలేదు.

&#రెండోవారు నాప్రక్కనే కూర్చున్నారు. భారతీయ చరిత్రలో సంస్కృతిలో, తత్త్వవిద్యలో నిష్ణాతులు సంస్కృత భాషాకోవిదులు, విశ్వవిఖ్యాతులైన విద్వాంసులు. నాకు మిత్రులు, డాక్టర్‌ వి. రాఘవన్‌ వారే యీ సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు. మా మధ్య వ్యాఖ్యాతగా వ్యవహరించినవారు.

&#మాటవరుసగా స్వామివారుముందరే అన్నారు. ''నేను ఇంగ్లీషు ధారాళంగా చదవగలను. కాని మాట్లాడగలననే నమ్మకం లేదు. మాట్లాడే ఇంగ్లీషును అర్థంచేసుకోగలననే నమ్మకం కూడాలేదు.'' అని వారు తమిళంలో మాట్లాడారు. అయితే మధ్య మధ్య ఆంగ్లపదాలూ, పదబంధాలూ ధారాళంగా వాడారు. వారి యింగ్లీషు పదాల ఉచ్చారణ నిర్దుష్టంగా వుంది.

సంభాషణ మొదటినుండీ స్వామివారికున్న ఓ అలవాటు నన్నెంతో ఆకట్టుకుంది. ప్రశ్న అడిగేటప్పుడు వారెప్పుడూ అడ్డు తగలరు. అదే విశేషమనుకుంటే, సమాధానం చెప్పేముందు ఒకటిరెండు నిమిషాలు ఆగటం మరీ విశేష మనిషించింది. వారు చెప్పిన సమాధానం క్లుప్తంగా సూటిగా వుంటుంది.

స్వామివారూ నేనూ మాట్లాడిన విషయాలు చాలామట్టుకు వ్యక్తిగతమైనవి. కొన్ని సాధారణ విషయాలు చర్చలూ వచ్చాయి.

''భారతదేశాభ్యుదయాన్ని చిత్తశుద్థితో ఆ కాంక్షించే విదేశప్రభుత్వంగానీ, విదేశ సంస్థగానీ యేదైనా సాయం చెయ్యాలనుకున్నదనుకోండి. ఎలాటి సాయం చేస్తే బావుంటుందని మీ ఉద్దేశం?'' అని అడిగాను.

&#అలవాటు ప్రకారం ఓ నిమిషం ఆలోచిస్తూ మౌనంగా వుంది ''సాయం అందించే దెవరికో తెలిస్తేగాని మీ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి వీల్లేదు. భారత ప్రభుత్వాన్నడిగితే బహుశా వ్యవసాయరంగానికో విద్యారంగానికో తక్షణ సాహాయ్య మవసరమని అనవచ్చు. మీరు నన్నడిగారు కాబట్టి నా దృష్టిలో ఉచితమైం దేదో చెబుతాను.

విదేశ ప్రభుత్వానికి గానీ, విదేశీసంస్థకుగానీ మాకు సాయం చెయ్యాలనిపిస్తే సాంస్కృతిక రంగంలో సాయం చెయ్యమనండి. బహుప్రాచీనమైన మా సాంస్కృతిక వారసత్వాన్ని లోతుగా అధ్యయనం చేయటానికీ, అవగాహన చేసుకోటానికీ తోడ్పడమనండి. మాకళల్లో, మా సాహిత్యంలో మా నాట్యశైలుల్లో, మా తత్వశాస్త్రల్లో పరిశోధన చెయ్యటానికీ, పరిశోధన ఫలితాలు ప్రజలకు అందించటానికీ దోహదం చెయ్యమనండి. అదిచేస్తే మా నెత్తిన పాలుపోసినట్లు'' అన్నారు.

సమాజంలో స్త్రీల పాత్రను గురించి స్వామి వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా పురాతనమైనవి. వాటితో నే నేకీభవించను. అయినావారు తమ అభిప్రాయాలకు చూపిన కారణాలను మాత్రం గౌరవిస్తాను.

''స్త్రీలకు తగిన స్థానం గృహమే తనభర్తను కనుపెట్టి వుంటూ బిడ్డలను పోషించుకుంటూ వుండటమే వుండటమే ఆమె కర్తవ్యం. ఇంకా తీరుబాటుంటే యిష్టమైన ఓ కుటీర పరిశ్రమను చేపట్టవచ్చు.

పాఠశాలల్లో విద్యార్థులూ, విద్యార్థినులూ కలిసి చదివే పద్థతి మంచిదికాదు. సాధారణంగా పన్నెండేళ్లు వచ్చేసరికి ఆడపిల్లల చదువు పూర్తికావాలి'' అన్నారు.

వారి అభిప్రాయాలను ఆధునిక భారతదేశం అంగీకరించదని నాకు తెలుసు. స్త్రీకి కలిగే ఆనర్ధాల్లో అదిదారుణమైంది పెండ్లి కాకుండా వుండటమనివారి అభిప్రాయం. ఆలశ్యం అయిన కొద్దీ పెళ్లయే అవకాశాలు తగ్గిపోతాయని వారి భయం. రజస్వల కాగానే చట్టం అంగీకరించిన మేరకు ఎంత త్వరగా ఆడపిల్లకు పెళ్లి చేస్తే అంత మంచిదని వారి నమ్మకం.

మనస్పూర్తిగా తన భర్తకూ కుటుంబానికీ అంకితమై పోయిన స్త్రీ అనుభవించే తృప్తి, ఆనందం, ఉద్యోగంలో చేరి మగవారితో పోటీపడే స్త్రీ అనుభవించదని స్వామివారి నిశ్చయమైన అభిప్రాయం.

&ఈ అభిప్రాయాలు ఎంత చాందసంగావున్నా, వారికున్న చిత్తశుద్దిని గానీ, స్త్రీలపట్ల వారికున్న సానుభూతిని గానీ, స్త్రీ జనసంక్షేమంపట్ల వారికున్న శ్రద్దాసక్తులను గానీ ఏమాత్రం శంకించటానికి వీల్లేదు.

భారతదేశ జాతీయ సమైక్యాన్ని గురించి అడిగాను, వారు ఆచితూచి యెంతో జాగరూకతతో సమాధానం చెప్పారు. ''భారతీయమైన సమైక్యభావం మరింత గాఢమౌతుంది. వృద్ది చెందుతుంది. రాజకీయ నాయకులు గనక విజ్ఞతతో ప్రవర్తించే పక్షంలో'' అన్నారు.

&#మా సమావేశానికి ముందు అడగాలని ఒకే ఒక ప్రశ్నను సిద్ధపరుచుకున్నాను. ఆప్రశ్నకు వారు చమత్కారంగా సమాధాన మిచ్చారు.

&#''సరైన ప్రశ్నకు వేయటమే మనిషిలోని వివేకం వికసించటానికి మొదలు'' అని ఒకసామెత వుంది. నేను వివేకవంతు ణ్ణుకోండి. మిమ్ము ఏ ప్రశ్న వేయాలి? అని అడిగాను.

నేను ప్రశ్న వేస్తున్నప్పుడే స్వామి వారు మందహాసం చేశారు. నా ప్రశ్నను జాగ్రత్తగా విన్నారు. డాక్టర్‌. రాఘవన్‌ అనువాదాన్ని ఆలకించారు. ప్రశ్నను మళ్ళీ ఒకసారి వారిచేత చెప్పించుకున్నారు. ఓ నిమిషం మౌనంగా వున్నారు. చివరికి ''మీకు వివేకమే వుంటే ఏ ప్రశ్నా ఆడగరు'' అన్నారు. అందరం నవ్వుకున్నాము.

నవ్వుతూనే ''మీరుచెప్పింది నిజమే కాని అప్పుడు అన్వేషణ ప్రారంభించిన అర్భకుణ్ణనుకోండి. అప్పుడు మిమ్మల్ని ఏం అడగాలి'' అనడిగాను నేనిప్పుడేం చెయ్యాలి. అని అడుగుతారు అన్నారువారు.

''ఆ ప్రశ్నే వేశాననుకోండి. ఏం సమాధానం చెబుతారు?'' అని అడిగాను.

''మీరు మొదలుపెట్టిన పని కొనసాగించం డంటాను'' అన్నారు.

''మంచికో, చెడ్డకో నా మార్గం స్వతంత్రమైన ఆలోచనామార్గం. నమ్మకాన్నీ నేను నమ్మను. నాస్వభావంలో కేవలం విశ్వాసానికి చోటులేదు'' అన్నాను.

''ఆలోచనామార్గం ఉత్తమమైన మార్గం కావటమే కాదు, ఏకైక మార్గం కూడా, భక్తిగానీ, విశ్వాసంగానీ, ఆలోచనకు - అంటే జ్ఞానానికి - ప్రాతిపదికలూ, సాధనలూ, అంతర్దశలూ మాత్రమే, జ్ఞానంగా పర్యవసిస్తే తప్ప వాటికి విలువలేదు'' అనిస్వామి వా రన్నారు.

''అయితే ఆలోచనలో ఇంచుక గర్వం, కొంచెం అహంకారం లేవంటారా?'' అని అడిగాను.

''ఉన్నాయి, ఉంటాయి. కాని మీరీ ప్రశ్న ఎలా అడగగలిగారు? ఆలోచనవల్ల కాదా? అందువల్ల ఆలోచనే తన్ను తాను గమనిస్తుంది. విమర్శించుకుంటుంది, కాపాడుకుంటుంది'' అన్నారు.

''సాధనలో తాను ముందుకు పోతున్నాడో, అగిపోయాడో, దిగజారుతున్నాడో సాధకుడు తెలుసుకునే మార్గమేమి''టని అడిగాను.

''నిన్ను అగ్రహపరిచే విషయాలు- ప్రలోభ##పెట్టే విషయాలూ ఏటేటా తగ్గుతూపోతే నీవు ముందుకు సాగిపోతున్నట్లు. తగ్గకపోతే నీవు ఆగిపోయినట్లు. పెరిగాయా నీవు దిగజారినట్లు'' అని సమాధానం చెప్పారు.

''స్వాంత్వనం, సంతోషం, సౌఖ్యం అనేవి పొందటం నిజంగా సాధ్యమేనా'' అని అడిగాను.

''సాంత్వనంకోసం, సంతోషంకోసం, సౌఖ్యంకోసం అన్వేషించటంలోనే సాంత్వనముంది, సంతోషముంది, సుఖముంది అన్నారువారు. మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ ''ఇవేవీ చరమగంమ్యాలు కావు, చరమగమ్యం బ్రహ్మానుసంధానమే'' అన్నారు.

మేము చాలావిషయాలు చర్చించాము. ప్రత్యేకించి బౌతికశాస్త్రం మీద స్వామివారెంతో ఆశక్తిచూపారు. భౌతికశాస్త్ర సిద్ధాంతాలకూ, అద్వైత వేదాంతానికీ వైరుధ్యం కనబడదు. ఆధునిక విజ్ఞానశాస్త్రాలన్నీ అద్వైతంలో పర్యవసిస్తాయని స్వామివారెన్నో సార్లు చెప్పారు, వ్రాశారు.

మళ్లీ ఒకసారి శంకరాచార్య స్వామిని కలుసుకునే భాగ్యం కలగాలని వుంది. ఆభాగ్యం కలిగేవరకూ ఆ సమావేశమూ, ప్రశాంతమైన ఆ పరిసరాలూ స్వామివారి మహానుభావమూ మనస్సు నుండి చెరిగిపోవు.



- ఆర్థర్‌ ఐసెన్‌బర్గ్‌.

Kathakanchiki    Chapters    Last Page