Kathakanchiki    Chapters    Last Page

 

అహింసను పాటించినా, పాటించకపోయినా మనకు స్వాతంత్ర్యం వచ్చేదే.

అమెరికాలోని 'మేడిసన్‌' నగరంలోవున్న విస్కాన్సిస్‌ విశ్వవిద్యాలయంలో సామాజికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్నా డాక్టర్‌ జె. డబ్ల్యు. ఎల్టర్‌కూ, స్వామివారికీ మధ్య 1963 వ సంవత్సరం జులై 23వ రోజు నారాయణపురంలో జరిగిన సంభాషణ ఇది.

స్వామివారు చాలావరకూ తెలుగులోనే మాట్లడారు. మధ్య మధ్య కొన్ని పదాలుమాత్రమే ఇంగ్లీషు. డాక్టర్‌ ఎల్టర్‌ ఇంగ్లీషులోనే మాట్లాడారు శ్రీ జి. వేంకటేశ్వరన్‌ ఉభయులమధ్య ''ద్విభాషి''గా పనిచేశారు.

డాక్టర్‌ ఎల్టర్‌ : గత 15, 20 ఏళ్లలో భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. దేశం స్వతంత్రమై అభివృద్దికార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటీవల చైనా దండయాత్ర చేసింది. ఈ పరిస్ధితుల్లో ప్రజలకు హిందూమతంలోని ఏ ఏ అంశాలను నొక్కిచెప్పాలిసిన అవసరం వుందనుకుంటున్నారు?

స్వామివారు: స్వాతంత్ర్యం రావటానికి ముందు నిజాయితీ లేనివారు భారతదేశంలో నూటికి పదిమంది కూడా వుండేవారు కారు. గ్రామీణుల్లో - అంటే కష్టం చేసి జీవించేవారిలో - ఎక్కువమంది అసలు మాట తప్పేవారు కారు. వారి కోరికలు చాలా సామాన్యంగా వుండేవి. ఇతరదేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో స్వాతంత్ర్యం రాకమునుపు నిజాయితీపరులశాతం ఎక్కువ, స్వాతంత్ర్యం వచ్చాక ఒకవయస్సు వచ్చిన వారందరకీ ఓటు హక్కువచ్చింది. ఓటుహక్కు వచ్చిన జనంలో చాలామంది చదువురానివారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు వారికి లంచాలిచ్చేవారు. లంచాలు పుచ్చుకుని ఓటర్లు మరెవరికో కూడా ఓటు వేసేవారు.

దేశంలో విద్యుద్ధీకరణ జరిగాక ప్రతి రైతుకూ తన మెట్టభూమిని మాగాణిభూమిగా మార్చుకోవాలనే కోరికపుట్టింది. వారు ఎలట్రిక్‌ మోటార్లు కొనుక్కున్నారు. పంపుసెట్లు కొనుక్కున్నారు. క్రమంగా మెట్టభూములు మాగాణి భూములయాయి. మాగాణి భూములకు అవసరమైనంతగా మెట్టభూములకు నీరు అవసరం లేదు. అంతకుమునుపు ప్రజలు మెట్టభూముల్లో పండే జొన్నలూ రాగులూ తింటూవుండేవారు. కాయధాన్యాలూ, పప్పుదినుసులూ పండించేవారు. ఐతే వరిసేద్యం లాభసాటిసేద్యం కావటం వల్ల డబ్బుకోసం మెట్టసేద్యం మాని వరిసేద్యం మొదలెట్టారు కాయధాన్యాల ధరలు కొంత పెరిగినమాట వాస్తవమేకాని వరిలో వచ్చినంత లాభం వాటిలో రాదు.

మాగాణీ నేద్యం వృద్ధి చెందిన కొద్దీ ఉన్న నీటివనరులు మీద ఒత్తిడి ఎక్కువైంది. దీనికితోడు ప్రతివాడూ, వున్నవారిలాగా జీవించటానికి తాపత్రయ పడ్డాడు. అందువల్ల సామాన్యజనంలో చాలామంది అప్పులపాలయ్యారు. నిరుపేదకు కూడా ట్రౌజరు కావలసి వచ్చింది. ఏది ఆడంబరమో, ఏది అవసరమో తెలుసుకునే విచక్షణాజ్ఞానం పోయింది.

ఇది ఆడంబరాలనీ, ఇవి అవసరాలనీ ధర్మశాస్త్రాలు స్పష్టంగా నిర్దేశించాయి. కాఫీగానీ, టీగానీ త్రాగకపోయినా మనిషి బ్రతకగలడు. అతడికి వుంటానికి ఇల్లూ, కట్టటానికి బట్టా, తినటానికి తిండీ వుంటేచాలు.

స్వాతంత్ర్యం రాకముందు సామాన్యుని జీవనస్థాయిలో ఎలా వుండేదో స్వాతంత్యం వచ్చాక కూడా అలాగే నిలిచివుంటే చాలు. ఏది ఆడంబరమో ఏది అవసరమో సామాన్యులు గ్రహించేవరకూ జీవనస్థాయిలో మార్పు అవసరంలేదు. స్వయం సమృద్ధి సాధించాక ఆడంబరాలు వదులుకుని అవసరాలు మాత్రమే సమకూర్చుకునే విజ్ఞత సామాన్య జనానికి కలిగిన తరువాత అమెరికా, రష్యాల్లాగా మిగులుసంపదను పేదదేశాలకు సరఫరా చేసివుండే వారమే.

వర్తకులు విదేశాలకు సరుకులు పంపించేటప్పుడు దగా చేస్తూవుంటారు. ముందు మేలిసరుకుచూపి తరువాత నాసిసరుకు పంపిస్తున్నారు. ఒక్కోక్కప్పుడు సరుకులు కల్తీచేసి పంపించటం కూడాకద్దు. అందువల్ల సత్యసంధత నిజాయితీ, అవసరాల నుండి ఆడంబరాలను వేరు చేయగల విచక్షణ, ఇతరులను దగాచేయరాదనే న్యాయబుద్ధీ అనేవి ప్రస్తుతం ప్రజలకు పదే పదే నొక్కిచెప్పాల్సిన ధర్మాలు.

డాక్టర్‌ ఎల్టర్‌ : ఇటీవల మధుర మీనాక్షి దేవాలయానికి కుంభాభిషేకం జరిగింది. దాని కెందరో, ఎన్నాళ్లో శ్రమపడ్డారు. ఇరవై లక్షలకుపైగా వ్యయమయింది. ఈ కుంభాభిషేకాలను గురించి, వాటికయేఖర్చుల గురించీ మీ అభిప్రాయం ఏమిటి?

స్వామివారు:- ప్రతిమతానికీ దాని ప్రత్యేక నిర్మాణాలున్నాయి. మహమ్మదీయులకు మసీదు లున్నాయి. క్రైస్తవులకు చర్చిలున్నాయి. హిందువులకు దేవాలయాలున్నాయి. దేవాలయాలకు ఎత్తైన గోపురా లున్నాయి. ఆగోపుర శిఖరాలు చూచినప్పుడు తాత్కాలికంగానైనా భగవంతుడూ, భగవంతుని సమున్నతత్వమూ గుర్తొస్తుంది. శాస్త్రాలకన్నా లేదా తాళపత్రగ్రంథాలకన్నా గాలిగోపురాలకే భగవంతుణ్ణి గుర్తు చేసేశక్తి యెక్కువ. ఈ గోపురాలను స్థూలలింగాలలని శాస్త్రాలు పేర్కొన్నాయి. చివరి క్షణాల వరకూ మనిషి వెంటవచ్చే పుణ్యమేదైనా వుంటే అది భగవంతుని స్మరించినక్షణంలో సంపాదించుకున్న పుణ్యమే. ఈ గోపురాలు శిధిలావస్థలో వున్నప్పుడు వాటిని బాగుచేసి పదిలపరచుకోవాలి. పునర్నిర్మింపబడిన గోపురాలకు అభిషేకాలు జరగాలనీ, ఆ అభిషేకాలకు కొన్ని నియమాలున్నాయనీ శాస్త్రాలూ, మతధర్మాలు నిర్దేశిస్తున్నాయి. ఇలా అభిషేకంచేసే ఉత్సవాన్ని 'కుంభాభిషేకం' అంటారు. బంధువులందరూ కలసి ఒక వివాహం జరిపినట్లు ప్రజలందరూ కలసి కుంభాభిషేకం జరుపుతారు.

ఈ సంభాషణ జరుగుతూవుండగా వాన మొదలైంది. అందరూ వీధిచివర స్వామివారి విడిదిలోకి చరచరా నడిచివెళ్ళారు.

డాక్టర్‌ ఎల్టర్‌:- దక్షిణాదిని అనేక పట్టణాల్లో కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుంభాభిషేకాలు జరిగాయి. ఈ ఆలయ పునర్నిర్మాణ, పునరుద్ధరణ కార్యక్రమాలు హిందూమత పునరుజ్జీవనానికి చిహ్నాలుగా మీరు భావిస్తున్నారా?

స్వామివారు:- కొన్ని దశాబ్దాల కొకసారి ప్రతిదేవాలయానికి కుంభాభిషేకం జరుగుతూనే వుంటుంది. ఆవిధంగా కొన్ని దశాబ్దాలుగా ఎన్నో దేవాలయాలకు ఎన్నో కుంభాభిషేకాలు జరిగాయి. దక్షిణాదిని ముఖ్యమైన దేవాలయాలకు కుంభాభిషేకాలు జరగటం మూలాన జీర్ణాలయ పునరుద్దరణ కార్యక్రమం ఇటీవల ముమ్మురంగా జరుగుతున్న ట్లనిపిస్తుంది. కాని ఇది శతాబ్దాలుగా జరుగుతున్న ఆచారకాండే అయితే 1947కు పూర్వం దేశ ప్రజలందరూ బ్రిటిష్‌ పాలనను తుదముట్టించే యత్నంలో నిమగ్నులై వుండేవారు ఆపని పూర్తి అయ్యాక వారి దృష్టి శిధిలదేవాలయాల మీదికి మళ్ళింది.

స్వాతంత్య్రం వచ్చాక నాస్తికవాదం బాగా ప్రబలింది. ద్రవిడకజగం ద్రవిడమున్నే ట్రకజగం, కమ్యూనిజం మొదలైన భగవద్‌ వ్యతిరేకధోరణులూ, ఉద్యమాలూ సామాన్య జనాన్ని ఆకట్టుకున్నాయి. బహుశ ఆ ఉద్యమాలు కొంతకాలంగా విఫలమైనందువల్ల ప్రజలు భగవంతుని వైపు ఆకర్షింపబడుతున్నారు.

ద్రవ్యోల్బణం పెరిగి ఇదివరలో రూపాయి అమ్మేవస్తువు పదిరూపాయలకు అమ్ముడుపోతోంది అందువల్ల ఆలయ పునరుద్ధరణకు ఇదివరక్కన్నా పదింతలు ఖర్చౌతోంది. ఐనా ప్రజలు ధారాళంగా విరాళాలిస్తూనే వున్నారు.

డాక్టర్‌ ఎల్టర్‌:- హిందూమత సిద్ధాంతాల్లో అహింస ఒకటి. ఇటీవల జరిగిన చైనాదండయాత్ర దృష్ట్యా ప్రస్తుతం దాన్ని ఎలా ఏమేరకు ఆచరించవలసింది?

స్వామి: మీరంటున్నది గాంధీగారి అహింసను గురించి అనుకుంటాను. గాంధీగారి అహింసకు మూలం బుద్దుని అహింసా సిద్ధాంతం.

నా దృష్టిలో బుద్ధుడూ గాంధీ యిద్దరూ అహింసా విషయంలో విఫలులయ్యారు. నెహ్రూ 1947 లో కాశ్మీరుకు భారత సైన్యాలను గాంధీతో సంప్రదించాకే, వారు ఆదేశించాకే, పంపారు. ఆ విషయం వారే చెప్పారు. అహింసా సూత్రాన్ని ఆచరణలో పెట్టటంలో గాంధీ కృతకృత్యులు కాలేకపోయారు. బుద్ధుడు సూకరమాంసం తిని దానిమూలంగా చనిపోయారని కొందరంటారు, మలయా, చైనా, సిలోన్‌, బర్మాల్లో వున్న బౌద్దపరివ్రాజకుల్లో దాదాపు అందరూ మాంసాహారులే. అందువల్ల బుద్ధుని అహింసా ధర్మం కూడా విఫలమైనట్లే! నా ఉద్దేశంలో అహింసా వ్రతాన్ని పాటించ గలవా డొక్కడే. సర్వసంగ పరిత్యాగి అయిన బ్రహ్మణ సన్న్యాసి. సర్వ సంగాలూ పరిత్యజించిన వాడు చెట్టునున్న అకును కూడా త్రుంచడు.

తన్నెవరైనా కొడితే సంతోషంగా దెబ్బలు తింటాడే తప్ప సౌమ్యంగానైనా ప్రతిఘటించడు. ఒకరు మరొకరిని కొట్టినప్పుడు కూడ కొట్టిన వాడిని చూచి జాలిపడతాడు. వాణ్ణి క్షమించమని దేవుణ్ణి వేడుకుంటాడు. అంతేకాని వాడిమీద చెయ్యిచేసుకోడు.

అహింసా సిద్దాంతాన్ని జాతులకుగానీ జాతినేతలకుగానీ, అన్వయించటం తప్పు. భారతదేశానికి స్వాతంత్ర్యం అహింసవల్లనే వచ్చిందని కొంద రను కుంటారు. కాదు భారతదేశాన్ని వదలి పోవాలని ఆంగ్లేయులు నిశ్చయించుకున్నారు. వదలిపోయారు అలావదలి పోవటానికి వారి కారణాలు వారి కున్నాయి. వారు వదలి పోవటం మూలాన్నే మనకు స్వాతంత్ర్యం వచ్చంది అహింసను పాటించినా పాటించకపోయినా మనకు స్వాతత్ర్యం వచ్చేదే.

పరిపాలనకుగానీ, పరిపాలకులకుగానీ అహింసా సూత్రం అన్వయించదని శాస్త్రాలు చెబుతున్నాయి. తన రాజ్యాన్ని రక్షించనిరాజు ధర్మభ్రష్టుడని శాస్త్రం.

తన్నుతాను రక్షించుకోవాలనే నియమం ఒక్క చైనాకు మాత్రమే అన్వయించదు. అన్నిజాతులకూ అన్వయిస్తుంది. ఒకదేశం మీద మరొకదేశం దండెత్తటం తప్పు. అలాగే ఒకరు దండెత్తివస్తే దేశాన్ని రక్షించుకోక పోవటం కూడా తప్పు.

ఒకరు మరొకడి మీద దాడి చేస్తే, దెబ్బతిన్నవాణ్ణి ఆదుకోవటం ప్రభుత్వ ధర్మమనీ, తన ధర్మాన్ని నిర్వర్తించటంలో దాడి చేసిన వాడికి ఉరిశిక్ష విధించవలసివచ్చినా ప్రభువు వెనుకాడరాదనీ శాస్త్రం నిర్దేశిస్తున్నది. అంతేకాదు. ఏ మేరకు అహింసా ధర్మాన్ని పాటించదగునో కూడా రాజనీతి శాస్త్రం స్పష్టంగా విధించింది.

* అగర్వాల్‌:- ఇందాక మీరు అహింసా వ్రతాన్ని పాటించగలవాడు బ్రాహ్మణ సన్యాసి ఒక్కడే అన్నారు. అంటే సన్యాసి అయ్యే యోగ్యత పుట్టుకవల్లనే సంక్రమిస్తుందని మీ భావమా, లేక ఏ కులంలో పుట్టినా యోగ్యతవల్ల బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని మీ అభిప్రాయమా?

* ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు అక్కడున్నవారు.

స్వామివారు:- శాస్త్రాలు హిందువులను అనేక కులాలుగా విభజించి ప్రతి కులానికీ కొన్ని కొన్ని విధులు నిర్దేశించాయి. బ్రాహ్మణునకు నిర్దేంశించిన విధి అవిరళంగా జ్ఞానాన్ని సముపార్జించటం. అన్ని కులాలవారికీ ఉపయోగపడే జ్ఞానాన్ని సముపార్జిస్తూ వుంటాడు బ్రాహ్మణుడు. అతణ్ణి పోషిస్తూ కనుపెట్టి వుండటమే యితర కులాల వారికి విధి. అందువల్లే గోదాన భూదానాది దానాలన్నీ బ్రాహ్మణుడే స్వీకరిస్తాడు నిరంతరం జ్ఞాన సముపార్జన చేసే బ్రాహ్మణుణ్ణి కాపాడుకోవటం ఇతరకులాల కర్తవ్యం. తాను ఆర్జించిన జ్ఞానం పరిపూర్ణ మయాక బ్రాహ్మణుడు సన్న్యాసాశ్రమం స్వీకరిస్తాడు. అప్పుడతడికి ఏ సంబంధాలూ ఉండవు. ఎవరినీ సంరక్షించ నక్కర లేదు. ఆధ్యాత్మికంగా నమున్నతుడౌతాడు కేవలం ఉదర పోషణ కోసమే భిక్షాటనం చేస్తాడు.

ఒకవేళ బ్రాహ్మణుడు తన ధర్మాన్ని నెరవేర్చడనుకోండి. అతనికి 'వెలి' తప్పదు. ఏ కులం వారూ అతణ్ణి తమలో చేర్చుకోరు. ఏ కులంవాడైనా జీవితాన్ని తన ధర్మానికే అంకితంచేస్తే అతడూ పరమగమ్యం చేరుకుని జ్ఞాని అవుతాడు. బ్రాహ్మణులతో సహా అన్ని కులాలవారూ అతడి జ్ఞానం వల్ల లాభపడతారు. బ్రాహ్మణులతణ్ణి ఆరాధిస్తారు. ఈ విధంగా బ్రాహ్మణ సన్న్యాసి లాగానే ఇతరకులాల్లోని జ్ఞాని కూడా ఉత్తమజ్ఞానాన్ని సంపాదించు కుంటాడు.

రామూడు, కృష్ణుడూ క్షత్రియులిగా పుట్టారు. వారిని బ్రాహ్మణులతో సహా అందరూ ఆరాధిస్తారు. తమ కులధర్మాన్ని ఆచరించి వారు మహాపురుషులయ్యారు. సన్నాసి లాగానే జ్ఞాని అయిన ప్రతివాడూ ప్రతిప్రాణిలోనూ అభివ్యక్తమయ్యే ఆత్మను దర్శించి అత్యున్నతా లైన అహింసా ధర్మాలు పాటిస్తాడు.

డాక్టర్‌ ఎల్టర్‌:- నాయకులైనవారు శాస్త్రనియమాలు పాటించాలని తమరు సెలవిచ్చారు. రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవాలని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతున్నది. ఇప్పటి నాయకులు కూడా యీ నియమం పాటించవచ్చునా? లేక ఏ శాస్త్రంలో ఏ విధిని ఏ మేరకు పాటించవచ్చునో తెలిపే మార్గదర్శక సూత్రాలే వైనా వున్నాయా?

స్వామివారు:- మెకెవిల్లీ ఒకటి చెబుతే క్రీస్తు మరోకటి చెప్పినట్లు శాస్త్రా నియమాల్లో కూడా పరస్పర వైరుధ్యాలున్నాయి. అర్థశాస్త్రం విధించిన ధర్మంతో నేనేకీభవించను. ఆధర్మం ధర్మశాస్త్రాల్లోని ధర్మాలకు విరుద్ధంగా వుంది.

కాని ఏ దేశంలోనైనా ప్రజలు నిరంకుశత్వానికీ, దుర్బరదారిద్ర్యానికీ దారుణనైచ్యానికీ గురై బాధామయమైన జీవితాలు గడుపుతున్నప్పుడు, ఆ రాజునుదించి , ప్రజలకు శాంతినీ, సుఖాన్నీ, అభ్యుదయాన్నీ ప్రసాదించటం పొరుగు దేశాన్నేలే రాజు నిర్వహించాలిసిన బాధ్యత, ఆచరించాలిసిన కర్తవ్యం!

అలాటి పరిస్ధితులలో మాత్రమే రాజ్యం విశాలం కావచ్చు. అలాంటి పరిస్ధితులలో మాత్రమే రాజు తనరాజ్యాన్ని విస్తరించుకోవచ్చు అలా విస్తరించుకోవటం పొరుగుదేశంలోని ప్రజలను ఆదుకోవటం కోసమే.

ప్రజల అవసరాలను ప్రభువు గుర్తించాలి. శాస్త్రవిహితంగా వారిని పరిపాలించాలి.

డాక్టర్‌ ఎల్టర్‌:- అంటే, భారతదేశంలోని ప్రస్తుతనాయకులందరూ ధర్మశాస్త్రాల ననుసరించి పరిపాలన సాగించాలనా మీరనేది?

స్వామివారు:- భారతదేశం మతాతీతమైన రాజ్యం. ధర్మశాస్త్రాల ననుసరించి పరిపాలన సాగించటం ఈనాడు సాధ్యం కాదు. అందువల్ల మత సంస్థలు పూనుకుని ధర్మశాస్త్రాల్లోని విషయాలు ప్రజల దృష్టికి తెచ్చి, ప్రజలకు మనోవికాసం కలిగిస్తే, వారు ఎన్నుకునే నాయకులు నడిపే ప్రభుత్వాలు కూడా ధర్మం తప్పక శాస్త్రాను గుణంగానే నడుస్తాయి. నాయకులు ధార్మిక విషయాలు పట్టించుకోరు కాబట్టి నైతికంగా సమాజాన్ని సముద్ధరించే బాధ్యత మత సంస్థల మీద, మతాభిమానుల మీద వుంది.

డాక్టర్‌ ఎల్టర్‌: అయితే, భారతదేశంలోని నాయకులందరూ శాస్త్రాలననుసరించాలి. శాస్త్రాల్లో వైరుధ్యాలు కనబడితే ధర్మశాస్త్రాలననుసరించాలి. ధర్మశాస్త్రాలకూ రాజ్యాంగానికీ వైరుధ్యం కలిగినప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించాలి. అప్పుడు రాజ్యంగమే నాయకులకు తుది శాస్త్రమవుతుందన్న మాట!

స్వామివారు:- (నవ్వుతూ) నిజమే, నాయకులనుసరించవలసిన వర్తమానశాస్త్రం భారతరాజ్యాంగమే అనిపిస్తున్నది.

డాక్టర్‌ ఎల్టర్‌:- నాకోసం చాలా కాలం వెచ్చించారు. మిమ్ములనిలా కలుసుకునే అవకాశం కలిగించినందు కెంతో కృతజ్ఞుణ్ణి. నే నడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పి అనుగ్రహించారు. మీకు నా ధన్యవాదాలు.

స్వామివారు:- అమెరికన్లు, ఇంగ్లండునుండి అమెరికాకు వలసపోయిన మాట వాస్తవం. అమెరికాలో స్థిరపడ్డాక వారెన్నో కష్టాలు పడ్డారు. బాధలనుభవించారు. బ్రిటిషువారితో యుద్ధం చేశారు చివరికి శాంతి, అభ్యుదయం సాధించారు. సహజంగా కష్టజీవనం అంటే యేమిటో తెలిసిన ఒక అమెరికన్‌ ఈదేశానికి వచ్చి యీదేశ ప్రజల కష్టాలూ బాధలూ అర్ధంచేసుకోటానికి ప్రయత్నిస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుంది.



మీ అందరికీ భగవానుని

అనుగ్రహం కలగాలని నా ఆకాంక్ష.

Kathakanchiki    Chapters    Last Page