Kathakanchiki    Chapters    Last Page

 

భారతీయ శిల్పాలు కేవలం రాతివిగ్రహాలు కావు.

ప్రాచ్యపాశ్చాత్య సాంస్కృతిక మూల్యాలను పరస్పరం అవగాహన చేసుకునే నిమిత్తం ఏర్పడిన యూమెనెస్కో వారి ప్రాచ్య పాశ్చాత్య బృహత్పథకం క్రింద హేన్రీ లేనార్ట్స్‌ అనే బెల్జియన్‌ శిల్పి భారతదేశంలో పర్యటించటానికి వచ్చారు.

వారి అధ్యయన విషయం భారతీయ నాగరికత - హిందూ, బౌద్థమతాలకు ఇదివరలోనూ ఇప్పుడూ భారతీయ సంస్కృతి మీద వున్న ప్రభావం అనేది.

మత సముద్ధరణకేంద్రాలుగా ప్రసిద్ధికెక్కిన సంస్థలను సందర్శిస్తూ 24-1-65 వ తేదీన వారు కంజీవరంలో కామకోటి పీఠాధిపతులను కలుసుకున్నారు. టి.యన్‌. రామచంద్రన్‌ వారిని వెంటబెట్టుకు వచ్చారు.

లేనార్ట్స్‌: ఆధునిక నాగరికత గురించి మీరేమనుకుంటున్నారు? మానవ పురోగమనానికి అది దోహదం చేస్తుందనుకుంటున్నారా?

స్వామివారు: చేయడనే అనుకుంటున్నాను. ఎందువల్ల నంటే దానికి మానవుల మనస్సును కలుషితం చేసే గుణం వుంది. అలా చేయబట్టే ఈనాడు ప్రపంచంలో ఇంత దారుణమైన ఘర్షణ, ఇంతహింస ఆర్తీ చూస్తున్నాము.

లేనార్ట్స్‌: అరణ్యజీవిత, నగరజీవితాల్లో ఏది మంచిది?

స్వామివారు: నిస్సందేహంగా అరణ్య జీవితమే మంచిది. అరణ్యాల్లో సామాన్యంగా, అమాయికంగా కలతకూ, కార్పణ్యాలకూ దూరంగా జీవించవచ్చు. కాని నగరాల్లో అలాకాదు. ఉండటానికి అన్ని సౌకర్యాలూ, ఆధునిక నాగరిత సమకూర్చిపెట్టిన అన్నిసుఖాలు వుంటాయి. కాని చిత్తశాంతి మాత్రం వుండదు.

లెనార్ట్స్‌: నాగరికతకు చైతన్యం వుంది. అది జడంకాదు. అందువల్ల అదేప్పేడూ పురోగమిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయంమేమిటి?

స్వామివారు: విజ్ఞానశాస్త్రపురోగమనం వల్ల సమాజం అభివృద్థి చెందిన మాట వాస్తవమే. కాని దానివల్ల కలిగే అనర్థాలు సామాజికాభివృద్ధిని అందరూ అనుభవించటానికి వీల్లేకుండా చేశాయి. అందరూ సుఖంగా జీవించాలంటే ప్రతివాడికీ సరళ##మైన మనస్సు, అమాయికమైన అంతరంగం వుండాలి. అవి ఏకాంత ప్రశాంతమైన వనజీవనంలోనే సాధ్యపడతాయి. వనజీవనంలోనూ ఆధునికమైన సౌకర్యాలూ, సుఖాలూ అనుభవించవచ్చు. విజ్ఞానశాస్త్రం అందించే వసతు లేర్పరచుకోవచ్చు.

స్వామివారు: మీరు ఉత్తర భారతంలోని దేవాలయాలూ, దక్షిణాది దేవాలయాలూ, ఆ దేవాలయాల్లోని విగ్రహాలూ చూచారు వాటిని చూచినప్పుడు మీకెలాటి భావం కలిగింది?

లేనార్ట్స్‌: భారతదేశంలోని ఆలయశిల్పాలు చూస్తున్నప్పుడు మనస్సులో పవిత్రమైన ప్రశాంతి ఏర్పడుతుంది. పారమార్ధికమైన స్పందన కలుగుతుంది. ఆశిల్పాలు కేవలం రాతి విగ్రహాలుకావు. భారతీయుల ఆధ్యాత్మిక చిత్తవృత్తికి చిహ్నాలు. వారి భక్తిప్రపత్తులకు ప్రతీకలు.

Kathakanchiki    Chapters    Last Page