Kathakanchiki
Chapters
Last Page
ప్రస్తావన
చికాగోలో జరిగిన ప్రపంచసర్వమతమహాసభ నుద్దేశించి ప్రసంగించడానికి లేచిన తాను ప్రపంచంలోని అత్యంతసనాతనమైన యతిసంప్రదాయం పక్షాన ప్రసంగిస్తున్నానని స్వామి వివేకానందులు చెప్పారు.
రెండు వేల సంవత్సరాలకు పైగా భారతదేశంలో ఆర్షసంప్రదాయం కొనసాగుతున్నది. ప్రభువులతోనూ, తాత్వికులతోనూ, పాశ్చాత్యపండితులతోనూ అతిప్రాచీనకాలమునుండీ ఋషులు చర్చలు జరుపుతున్నారు.
అలెగ్జాండ రనే గ్రీకుసార్వభౌముణ్ణి కలుసుకుని ఒక భారతీయతత్త్వవేత్త సంపదల మీద వ్యామోహం అనుభవించినకొద్దీ పెరుగుతుందే కాని తరగదని బోధించారు. తాను మానవవ్యవహారాల వాస్తవతత్త్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నా నని సోక్రటిస్ మహాశయుడు కొందరు భారతీయతత్త్వవేత్తలతో అన్నప్పుడు వారు ఆధ్యాత్మికమూ పారమార్ధీకమూ అయిన సత్యాన్ని గ్రహించనిదే లౌకిక విషయాలమీద అవగాహన ఎలా కలుగుతుందని యెదురుప్రశ్నవేశారు. ఆర్ఫియన్ చెప్పిన దురవగాహవేదాంతవిషయాలమీద, పైథాగరస్ ప్రతిపాదించిన తాత్త్వికగణిత శాస్త్రీయ భావాలమీద, 'రిపబ్లిక్' అనే గ్రంథంలో ప్లేటో ప్రవచించిన ఆదర్శ రాజ్యంగ భావనమీద, క్రీస్తుకు పూర్వం ఆరవ శతాబ్దంలో 'ఈలియా' అనే గ్రీకు నగరపు తత్త్వవేత్తలు స్ధాపించిన నూతన 'ప్లెటోనిక్' సిద్ధాంతాలమీద భారతీయ గ్రీక్‌తాత్త్వికచర్చల ముద్ర సృష్టంగా కనబడుతుంది. దురవబోధమైన వేదాంత వాచారం ఈనాడు సార్వజనీనమైన ప్రపంచవారసత్వమైంది.
ఈ వారసత్వంలోని మౌలికమైన పారమార్ధిక సంస్కృతిని పాశ్చాత్యదేశాల్లో మేధవులూ, విద్యాంసులూ, తాత్త్వికులూ, మతవేత్తలూ ఇతోధికంగా గ్రహిస్తున్నారు. నన్ను చూడటానికి వచ్చిన ఒక అమెరికన్ మతాచార్యుడు వీరిని క్రిస్టియన్ వేదాంతు లని అభివర్ణించారు. వేదాంతలోకపరిధి మరింత విశాలమవుతున్న దనటానికి ఈ గ్రంధమే ప్రబలసాక్ష్యం.
ప్రాచీనకాలంలో కంచి దక్షిణభారతంలోని ముఖ్యనగరా లన్నిటికీ ముఖ్యనగరంగా వుండేది. అప్పుడు కంచిలో ఎక్కడ చూచినా ఎక్కడ విన్నా సాహిత్యమతతాత్త్వికగోష్ఠులే. జైనం, బౌద్ధం వంటి అవైదికమతాలకది ఆనాడు పట్టుకొమ్మ. ఆదిశంకరులవారు తన మేథాబలంతో అవైదికమతాలను పూర్వపక్షం చేసి అద్వైతసిద్ధాంతాన్ని మొదటగా యిక్కడే స్థాపించారు. అద్భుతమైన వారి మేథాబలం సాధించిన విజయానికి ప్రతీకగా ఇక్కడే వారు మొదటి అద్వైతపీఠాన్ని నెలకొల్పారు.
ఈనాడు దేశమంతటా-ముఖ్యంగా దక్షిణభారత మంతటా-ప్రబలుతున్న సిద్ధాంత సంఘర్షణలూ, నాస్తికవాదధోరణులూ, వీటి మూలంగా ఉత్పన్నమైన అయోమయపరిస్ధితులూ, గమనిస్తే ఆదిశంకరుల కాలానికి నేటికాలానికీ చాలా పోలిక లున్నట్లనిపిస్తుంది. చరిత్ర పునరావృత్త మవుతుందని సామెత. ఈనాడు మళ్ళీ కంచిలో శంకరాచార్యస్వాములుగా, కామకోటిపీఠాధిపతులుగా అద్వైతబ్రహ్మనిష్ఠులుగా శ్రీచంద్రశేఖరయతీంద్రసరస్వతులవారు ప్రజల హృదయాలలో ఆధ్యాత్మిక భావననూ మతధర్మానురక్తినీ ప్రబోధిస్తున్నారు. ఐదు దశాబ్దులుగా వారీ అవిరళ కృషిలో నిమగ్నులై వున్నారు.
దేశామంతటా పర్యటిస్తూ పండిత పామరుల నాకర్షిస్తూ, హిందువుల్లోని అనేక సిద్ధాంతాల వారినే గాక అన్యమతస్ధులనూ అన్యదేశస్ధులనూ తన అమేయప్రతిభా పాటవంతో ప్రభావితుల్ని చేస్తున్నారు వారు. పిఠాధిపతిగా తమవిధులను గాని సన్న్యాసిగా తమ ఆశ్రమధర్మాలను గానీ పాటించటంలో వారికున్న నిష్ఠ పరమకఠినమైంది. కాని ఆధ్యాత్మిక విషయప్రభోదంలో సిద్ధాంతాల కతీతమైన వారి దృష్టి ఎంత ఉదారమైందో చెప్పలేము! అది యెంత ఉదారమైందో, ఈదేశపుటెల్లెలుకూడా ఎలా ఎంతగా దాటిపోయిందో ఈగ్రంథం చదవండి, మీకే తెలుస్తుంది.
క్రిందటి సంవత్సరం స్వామివారి డెబ్భైఒకటో జన్మదినోత్సవం సందర్భంగా అప్పుడప్పుడూ వారి సంచార కార్యక్రమాల్లో అందిన సంస్కృత తమిళ పద్యగద్యాత్మక పురస్కారపత్రా లన్నిటినీ గ్రంథరూపంగా భక్తులచ్చు వేయించారు. ఈ సంవత్సరం, వారి డెబ్బైరెండో జన్మదినోత్సవం సందర్భంగా, వారి వారసులూ భవిష్యత్కామకోటి కంచిపీఠాధిపతులూ అయిన జయేంద్రసరస్వతీస్వామివారి కొక ఆలోచన కలిగింది. శ్రీచంద్రశేఖరులతో యూరప్, ఆమెరికా, జపాన్ దేశాల పండితులూ, జిజ్ఞాసువులూ, ప్రముఖవ్యక్తులూ అప్పుడప్పుడూ జరుపుతూ వచ్చిన సంభాషణలన్నీ సంపాదించి గ్రంథరూపంగా స్వామివారికి సమర్పించాలనీ, అనేక వ్యక్తులు స్వామివారితో చర్చలు జరిపినప్పుడు నేనక్కడ వుండే భాగ్యం కలగటం మూలాన ఆపని నేనే చేయాలనీ, వారికోరిక. అది వారి దయ. నా అదృష్టం.
1931 నుండి 1964 వరకూ జరిగిన సంభాషణ లన్నీ యిందులో వున్నాయి. ఈకాలంలో స్వామివారిని దర్శించినవారిలో ప్రముఖులైన రచయితలున్నారు. విద్వాంసులైన ఆచార్యులున్నారు, ఆధ్యాత్మపరులైన జిజ్ఞాసువు లున్నారు. వా రడిగిన ప్రశ్నలు పరిశోధనకు సంబంధించినవీ, సామాజికమానవపరిణామ శాస్త్రానికి సంబంధించినవీ, వలసపోయిన సంస్కృతులకు సంబంధించినవీ, ఎన్నెన్నో! వా రిచ్చిన సమాధానాలు వారికున్న మనోవైపుల్యానికి కచ్చితమైన బహువిషయపరిజ్ఞానానికీ, నిదర్శనాలు, మతవిషయాల్లో, మతానికీ మధ్యవుండే విషయాల్లో, ఆధ్యాత్మికవిషయాల్లో వారిఅభిప్రాయాలు పరిశీలించండి. ఒకవైపు వారి తీవ్రబుద్ధీ నిర్మలమైన ఆధ్యాత్మికాన్వేషణమూ, చరిత్రతోపాటు వచ్చిన జీవనవేగం వల్ల పాశ్చాత్యులు ఏం పోగొట్టుకున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమూ కనబడతాయి. మరొకవైపు-వారికి వేదాంత సంప్రదాయంలో వున్న లోతైన అవగాహన, ఆధ్యాత్మిక మూల్యాలకు వా రిచ్చే పారమ్యమూ, అన్నిటినీ మించి, వారు మహోన్నతులై వుండికూడా తమ సాన్నిధ్యంలో మనకు కలిగించే నిర్భయమైన చనవూ కనబడతాయి. ఒకవేళ తనప్రశ్నకు ఆశించిన సమాధానం రాకపోయినా ఎదటివాడు ఏమీ అనలేడు. స్వామివారి ఎనలేని చిరునవ్వు మధురమైన ఆకర్షణ అటువంటివి. వారి చూపుల్లో కనబడే నైశిత్యం, దయ, నెనరు, అంతటివి.
ఈ సంభాషణలు సేకరించి ముద్రింపించటం నాకొక అపూర్వమైన అనుభూతిని కలిగించింది. వచ్చినవారు ప్రశ్నలడిగినప్పుడు మళ్ళీ నేను స్వామిసన్నిధిలోనే వున్నట్లూ, వారి సమాధానాల్లో వుండే ప్రసన్నమైన విరామాలనూ మౌనమైన ఆలోచనలనూ మళ్ళీ గమనిస్తూ అనిపించింది.
వా రాసమయాల్లో జలపూర్ణమై నిశ్చలంగా వుండే మేఘంలా కనబడేవారు. నిశ్శబ్దవక్త అయిన భగవంతునిలా తోచే వారు. మౌనవ్యాఖ్యానంలా వుండేవారు. కేవలం దక్షిణామూర్తిలా దర్శన మిచ్చేవారు.
ఈగ్రంథంలోని కొన్ని సంభాషణలు సంభాషించినవారి దగ్గరనుండి సేకరించటం జరిగింది. వాటిని పదిలపరచినందుకూ, పంపినందుకూ వారిని స్వామివారు ఆశీర్వదిస్తారు.
1966, మద్రాసు.
డా|| వి. రాఘవన్