Kathakanchiki    Chapters    Last Page

 

ప్రవేశిక

''కథ కంచికి

మనం ఇంటికి''

అని కథ ముగించడం వెనుకటితరాలవారి ఆచారం. ఆకాలంలో కథ చెప్పడం ఒకకళ. కథ చెప్పించుకోవటం ఒక వేడుక. పురాతనమైన బృహత్కథ మొదలు ఇటీవలి కాశీమజిలీ కథలవరకూ ఇదే ఆనవాయితీ.



కంచి కామకోటి చంద్రశేఖరేంద్ర శ్రీచరణులను దర్శించి, వారి ఉపదేశం విని తరించాలని ఎందరెందరో వైదేశికులు కంచిని వెతుక్కుంటూ భారతదేశానికి వచ్చారు. వారిలో ధ్యానపరులున్నారు, భక్తులున్నారు, వేదాంతులున్నారు. వారెన్నో ప్రశ్నలు స్వామివారినడిగారు.

అడిగిన ప్రశ్నలన్నింటికీ స్వామివారు సమాధానం చెప్పారు. ధ్యానపరులకు ధ్యానిగా సమాధానం చెప్పారు. భక్తులకు పరమ భాగవతులుగా సమాధానం చెప్పారు. వేదాంతులకు శాంకరాద్వైతులుగా సమాధానం చెప్పారు.

అడిగినవారి అనుమానాలు తీరాయి. సందేహాలు నివృత్తి చెందాయి. కంచి పరామాచార్య శ్రీ పాదులను కలుసుకున్నాక. అనేకానేక జిజ్జాసల కథ ముగిసింది. అందుకే ''కథ కంచికి''.

ఇందులోని సంభాషణలన్నీ కంచిలోనే జరిగినవి కావు. నంబల్‌లో, చెంగల్పట్టులో. మధురలో మచిలీపట్టణంలో, శ్రీకాళహస్తిలో, మద్రాసులో, సుంకువారి సత్రంలో - వారెక్కడ విడిదిచేసివుంటే అక్కడికివెళ్ళి దూరాగతులైన వైదేశికులు వారితో సంభాషించారు. ఈ సంభాషణలు 1931-1969 మధ్యకాలంలో జరిగాయి. ముపై#్ఫయెనిమిదేళ్ళలో స్వామివారి చిత్తస్పందనల్లో, ఆలోచనల్లో, అనుభవాల్లో మనం గుర్తించగలిగినవీ. గుర్తించలేనివీ ఎన్నో మార్పులు వచ్చాయి. కాని వారి పారమార్ధికతలోగానీ, అద్వైత భావనలో గానీ. జన శ్రేయోదృష్టిలోగానీ ఏమార్పూ రాలేదు.

వారిని దర్శించినవారిలో విశ్వవిద్యాలయాచార్యు లున్నారు. కేవల జిజ్జాసువులైన పర్యాటకులున్నారు. సత్యాన్వేషులైన దౌత్యవేత్తలున్నారు.

వారు స్వామివారితో జరిపిన సంభాషణల్లో ఉపాసనా విధానం మొదలు మెట్టసేద్యందాకా, కుమారిలభట్టుమొదలు భంగు సేవించే బైరాగిదాకా, శివాద్వైతం మొదలు కల్తీవ్యాపారందాకా ఎన్నో, ఎన్నెన్నో విషయాలు, అత్యుదాత్తమైనవీ, అతి సామాన్యమైనవీ, అతీంద్రియమైనవీ, అత్యల్పమైనవీ ప్రస్తావించబడ్డాయి. స్వామివారి అమేయ వైదుష్యమూ, బహుముఖీనమైన పరిశీలనమూ, సులభ సుందరమైన విషయ వివరణమూ ఈ చర్చల్లో అభివ్యక్తమయ్యాయి.

స్వామివారు ఒక హైందవమత శాఖకు అధిష్ఠానదేవతా పదవిలో ఉన్నారు. నియమనిష్ఠలు పాటిస్తూ- వ్రతోపవాసాలుచేస్తూ సామాన్యుల ఆహారం తీసుకుంటూ నిరాడంబరంగా జీవిస్తున్నారు. వారికి రోజూ మూడు గంటలే నిద్ర. అదీ వ్యవధి దొరికినప్పుడు కొసరికొసరి కళ్ళుమూసుకు తెచ్చెకున్న నిద్ర.

సహజమైన అలౌకిక ప్రశాంతి వారిచుట్టూ ఎప్పుడూ ఆవరించుకుని వుంటుంది. దానికున్న వ్యాపనగుణానికి మితిలేదు. ఎదుట కూర్చున్న వారందరూ అందులో ఓలలాడుతారు. అందుకే వారిని దర్శించుటమూ, వారితో కొంచెంసేపైనా సంభాషించటమూ ఒక మహనీయానుభవంగా పెక్కుమంది అభివర్ణించారు.

గ్రీసుదేశపు మహరాజ్ఞి ఫ్రెడరికా స్వామివారి సన్నిధిలో తమకు కలిగిన ఉద్వేగ వివశతను తామే ఈక్రింది మాటల్లో వ్యక్తంచేశారు.

''సంతతధారాపాతంగా కన్నీరుకారింది. అది సామాన్య కన్నీరు కాదు. తీరినకోరికల కన్నీరు తృప్తి! ఆనందం కార్చినకన్నీరు! మనస్సు, కడిగి శుభ్రపరచిన కన్నీరు! మనస్సును కరిగించిన కన్నీరు! వారు ప్రతీకగా నిలిచి పరమసత్యంతో మనస్సును ఏకంచేసిన కన్నీరు!''

కళ్ళార్పకుండా వారిముఖంలోకి చూచిచూచి 'పాల్‌బ్రంటన్‌' అనే ఆంగ్లేయుడు ''నాస్మృతిమందిరంలోని కుడ్యాలకు వ్రేలాడే అనేకానేక వర్ణచిత్రాలలో పలిత శ్యామశబలమైన వారి సముదాత్త ముఖచిత్రానికి ఒక ప్రత్యేకమైన గౌరవస్థానముంది. ఫ్రెంచివారు 'అధ్యాత్మికత'అని పేర్కొనే అనిర్వచనీయమైన లక్షణం వారిముఖంలో స్పష్టంగా కనపడుతుంది అందులో ప్రసన్నత ఉంది. ఆమాయికత ఉంది. వారి విశాలమైన నేత్రాలు నిశ్చలంగా అందంగా ఆకర్షకంగా ఉన్నాయి. వారిముక్కు పొట్టిగా, నిటారుగా కోటేరు వేసినట్లుంది. గడ్డం చిందరవందరగా పెరిగినా పెదవులు మాత్రం గంభీరంగా తీర్చినట్లున్నాయి. అలాంటి ముఖకవళికలు వారి బుద్ధిబలాన్ని మినహాయిస్తే, మధ్యయుగాల క్రైస్తవ మతాచార్యులకుండేవేమో మరి!'' అని తన ''అజ్జాత భారతదేశంలో అన్వేషణ'' అనే గ్రంథంలో వ్రాశారు.

ఆగ్రంథంలోనే మరొకచోట ''మా సంభాషణ సాగిసాగి విశాలమైన పరిధిలోకి వెళ్ళిపోయింది. అప్పుడుగాని నాకుతెలియలేదు. స్వామివారు ప్రతిదినమూ ఇంగ్లీషు పత్రికలు చదువుతారనీ, ప్రపంచంలో ఏమూల ఏం జరుగుతున్నదో గమనిస్తూనేవుంటారనీ 'వెస్ట్‌మిస్ట్స్‌ర్‌'లో ఇటీవల జరిగిన గొడవలన్నీ వారికితెలుసు యూరప్‌ఖండంలో ప్రజాస్వామ్యం బాలారిష్టాలు గడవటానికి ఎలా విలవిల్లాడిపోతున్నదోకూడా వారికితెలుసు'' అని స్వామి వారి వివిధ విషయ పరిజ్ఞానానికి బ్రంటన్‌ అబ్బురపడ్డాడు.

హంగేరీ దేశంలోపుట్టి బ్రిటన్‌కు వలసపోయిన 'ఆర్ధర్‌ కోస్లర్‌' అనే రచయిత స్వామివారి ముఖంమీద లీలగా కదలాడిన చిరునవ్వును చూచి ముగ్ధుడై ''ఓ హాసరేఖ చటుక్కున వారిముఖాన్ని పసిబిడ్డ ముఖంగా మార్చింది. ఆ హాసరేఖలో నిండిన భావంతో పోల్చదగిన భావాన్ని నేనెన్నడూ చూడలేదు. ఆ చిరునవ్వులో అసాధారణమైన మనోజ్ఞత వుంది. మాధుర్యముంది. విడిదికి తిరిగివస్తూ- పాశ్చాత్యుల వర్ణచిత్రాల్లో కనబడే సాధుపురుషుల ముఖాలమీద వారు పారవశ్యంతో వున్నప్పుడుగానీ, వారికి ధన్యత సిద్ధించినప్పుడుగానీ, వారు తమ మతంకోసం ప్రాణాలు బలిచేసినప్పుడుగానీ అలాంటి ముగ్ధమోహనమైన చిరునవ్వును ఎందుకు చిత్రించలేదా అని ఆశ్చర్యపడ్డాను. యోగులందరూ తమ అనుభవాలు, మాటలకందవనిచెప్పినట్లు వారిభావాలుకూడా ఉలికీ! కుంచెకూ అందవేమో!'' అని వ్రాశారు.

స్వామివారు సాధారణంగా అతిధులను సహజ ప్రశాంతమైన నిర్మల వాతావరణంలోనే కలుసుకునేవారు. విదేశీయులకు ఆ వాతావరణం అపూర్వమనిపించేది, ఒక వైదేశీకుడు దాన్నిలా అభివర్ణించాడుకూడా.

''చుట్టూ ప్రశాంతమైన ప్రకృతి. సమ్మోహకరమైన దాక్షిణాత్యనిశీథి. పలచబడిన చలివేళ. వేసవి అడుగిడుతున్న తొలివేళ. చుట్టూ కొబ్బరిచెట్లు, నిశ్శబ్దంగా ఆటూయిటూ పరిగెడుతున్న చీకురాళ్ళు. తెరలు తెరలుగా వీస్తున్న చల్లనిగాలి. కురుస్తున్న పండువెన్నెల. అప్పుడప్పుడూ గుడ్లగూబలు కీచుమన్న సవ్వడి దూరానా ఎక్కడో ఓకుక్కో నక్కో అరుపు మరుపురాని రాత్రి''

అతిధులడిగిన ప్రశ్నలకు ఆ అతిథులనే అబ్బురపరచేంత ఆధునికమైన, వాదసహమైన సమాధానాలిచ్చారు.

''మంచికో చెడ్డకో నామార్గం స్వతంత్రమైన ఆలోచనామార్గం. నమ్మకాన్ని నేను నమ్మను. నాస్వభావంలో కేవలం విశ్వాసానికి చోటులేదు.'' అని ఆర్ధర్‌ ఐసెన్‌బెర్గ్‌ అన్నప్పుడు వెంటనే స్వామివారు--

''ఆలోచనామార్గం ఉత్తమైనమార్గం కావటమేకాదు. ఏకైకమార్గం కూడా, భక్తిగానీ, విశ్వాసంగానీ ఆలోచనకు- అంటే జ్ఞానానికి ప్రాతిపదికలూ, సాధనలూ, అంతర్ధశలుమాత్రమే జ్ఞానంగా పర్యవసిస్తే తప్ప వాటికి విలువలేదు'' అని అందరితోబాటు ఐసెన్‌బెర్గ్‌ను కూడా ఆశ్చర్యంలో ముంచారు.

ఇనుపతెర వెనుకనుంచి వచ్చిన రష్యాదేశ విద్వాంసులు డాక్టర్‌ తులయేవ్‌ వారికి మతం మానవులకవసరం అనిగానీ, మతంవల్ల మానవులు బాగుపడతారనిగానీ, బొత్తిగా నమ్మకంలేదు. స్వామివారిని దర్శించినప్పుడు ఆ ప్రశ్నే అడిగారు వారు, ''ఒక మనిషికి మతంమీద నమ్మకం లేదనుకోండి. చర్చికిగానీ, దేవాలయానికిగానీ వెళ్ళడనుకోండి. ఏ ఆచారకాండనూ పాటించడనుకోండి! ఏ విధమైన మతసిద్ధాంతాలనూ లక్ష్యపెట్టడనుకోండి! అయినా జీవితమంతా మంచినిగురించే ఆలోచిస్తూ, మంచిపనులే చేస్తూపోతే అతడికి ముక్తికలుగుతుందా''? అని.

అప్పుడు స్వామివారు కొన్నినిముషాలు కళ్లుమూసుకొని ధ్యానస్థితిలో వుండిపోయారు. వారు ధ్యానంలో వున్నంతసేపూ పరిసరాలు అతిలోకమైన ప్రశాంతిలో మునిగిపోయాయి. స్వామివారు మెల్లగా దృఢంగా ''కలుగుతుంది''! అన్నారు.

ఈమాటను చరిత్రలో ఎంతమంది మతాచార్యులు అన్నారో వెదకి చూడండి! ప్రపంచంలోని ఎంతమంది మతాచార్యులు అనగలరో కూడా ఆలోచించి చూడండి! అన్నిమతాలకూ మౌలికమైన ఈమాట, అన్ని మతాలకూ అతీతమైన ఈమాట, అన్ని మతాలనూ కౌగిలించుకోగల ఈమాట, ఎంత మానవీయమో అనుభవంలోకి తెచ్చుకుచూడండి!

మౌలికంగా మానవత్వాన్ని మించిన మతం లేదని వారికితెలుసు. అందుకే వారి అస్తిత్వం పరమ కరుణాపూర్ణం అయిపోయింది. ఒక ఆంగ్లేయుడు వారితో ''మా పాశ్చాత్య నగరాల్లో కొందరు దుర్మార్గులున్నారు, వారి ప్రవర్తనచూస్తే వారిలో భగవంతుడున్నట్లనిపించదు, రాక్షసులున్నా రనిపిస్తుంది.'' అన్నప్పుడు. స్వామివారు-

''వారు పెరిగిన వాతావరణాన్ని తిట్టండికాని, వారిని తిట్టకండి. పరిస్థితులూ, పరిసరాలు వారిని దిగజార్చాయి. పాశ్చాత్యదేశాల్లోనేకాదు. ప్రాచ్యదేశాల్లోనూ అలాంటివారున్నారు'' అన్నారు. మానవులందరూ తనవారే అనుకోగలవారే, మానవులందరినీ తన హృదయానికి హత్తుకోగల వారే, మానవులందరితోనూ తాదాత్మ్యం అనుభవించగలవారే, అంతటి దయామయులే, కారుణ్యమూర్తులే, మానవోత్తములే ఆమాటలనగలరు.

ఇది వారి శతవార్షిక జయంత్యుత్సవ శుభ##వేళ. ఈ శుభ##వేళలో ఈ గ్రంథం ప్రచురించే భాగ్యం కలిగినందుకెంతో ఆనందంగా వుంది. ఆంగ్లమాతృకను తెలుగుచేసిన ''అంగీరస''గారినీ, వారితో సహకరించిన మిత్రులు పేరయ్యశాస్త్రినీ ఈసందర్భంలో అభినందిస్తున్నాము.

ముఖపత్ర శిల్పి బాలిగారికీ, ముద్రణ బాధ్యత చేపట్టిన కె. ఆర్‌. ప్రింటర్స్‌, నెల్లూరువారికి ధన్యవాదాలు.

కావలి, సంచాలకులు,

5-10-1993. - మానస ప్రచురణలు.

Kathakanchiki    Chapters    Last Page