Upanyasamulu    Chapters   

ఆత్మ సంస్కారము.

ఈ యూర పండితపరిషత్తొకటి యేర్పడుట సంతోషావహము. దీనికి పండితాభిమానులును లౌకికులును అగువారధ్యక్షులగుటయు, విద్యభిమానముగలఇతరులును సహాయపడుటయు కొనియాడతగియున్నది. మన సంఘమునకు పండితులు హృదయమువంటివారు తక్కిన అంగములు దుర్బలములైనను హృదయ స్థానమొకటిపదిలముగనుడెనేని రుగ్ణునికి ప్రాణభయములేదని వైద్యులు చెప్పుదురు. తక్కిన అవయవములన్నియు బాగుండినను హృదయము చెడినచో నంతయు చెడినట్లే యగును. కావున పండినపరిషత్తును కాపాడుట ఎల్లరకును కర్తవ్యము.

'యద్యదాచరతిశ్రేష్ఠః తత్త దేవేతరో జనః

సయత్ర్పమాణంకురుతే లోక స్తదనువర్తతే'

అని భగవదుక్తికలదు.

శ్రేష్ఠుడనగానెవడు?

ఏ విషయమున నొకనికంటె, నొకడధికుడగునో, నలుగురకంటె నధికుడగునో, వాడు శ్రేష్ఠుడగుచున్నాడు. ఒక విషయమున ఒకడు శ్రేష్ఠతను గడించినపిదప అట్టివానిని లోకులన్నింట ననుసరింతురు. ఇయ్యది లోకధర్మము. ఇప్పుడు లోకముచే శ్రేష్ఠులుగా పరిగణింపబడువారందరును మనదేశమందలి దారిద్ర్యమును నిర్మూలించుటకును. జనులందఱకును అన్నవస్త్రముల లభింపజేయుటకును పాటుబడుచుండువారే. దీనికొఱకు వారు చేసిన స్వార్థత్యాగమెంతయేనికలదు. కావున లోకులు వారి మాటను శిరసావహించుటయందు వింతలేదు. కాని వీరిదృష్టి ఉదరపోషణముతో మాత్రము పర్యాప్తమైనది. ఇట్టిస్థితి పశుపక్షి క్రిమికీటక సామాన్యమైనది. అదియునుంగాక ఐశ్వర్య సమృద్ధికలిగిన పాశ్చాత్య దేశములందుకూడ దుఃఖము బహుళ ముగానుండుట, శాంతి బొత్తుగాలేకుండుట మనము చూచుచున్నాము. వీనినిబట్టి ధనమాత్ర సంపాదనచేత సుఖము పూర్తి కాలేదనుట ఋజువగుచున్నది.

మనుష్యులను పశువులనుండి వేఱుపఱచు విశేషమిచ్చటనేకలదు. వానికిమేతయున్నచాలును. మనకావశ్యకమగు ఆశనమునకుతోడు చిత్తనైర్మల్య హేతువగు కొండొకయంశముండినగాని మానవత్వము పరిపూర్ణతనొందదు. దీనికి మార్గదర్శకులు కావలసినవారు పండితులుతప్ప వేరొకరుకాజాలరు.

'శక్నోతీహైవయస్సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్‌

కామక్రోధోద్భవంవేగం సంయుక్త స్ససుఖీ నరః'

అని గీతలో భగవంతుడర్జునకు వాక్రుచ్చియున్నారు. ఎన్నియున్నను కామక్రోధముల నణగద్రొక్కక ఎవరికిని సుఖము లభించుటకల్ల. ఇయ్యది తెలియనివారలే పెక్కురుకలరు. దీని నెఱిగినపండితుడు స్వాచరణమునకు దెచ్చుకొనుట ప్రధమ కర్తవ్యముగానున్నది.

పండితులు సనాతనధర్మమున కేమి చేసిరి?

శ్రేష్ఠత రావలయునన్న పెక్కండ్రు మనకనుయాయులు కావలయునన్న తదనుగుణమగు అర్హతను మనము పొందియుండవలెను. స్వరాజ్యసిద్ధికై ప్రయత్నముచేసిన నాయకులెందరెందరో నిర్బంధ వాసాదులకుపాల్పడి తమ దృఢదీక్షను ప్రకటించుకొనియున్నారు.

సనాతనులలేమిచేసిరి?

శారదాచట్టము వచ్చినప్పుడు వదలని ఘోషించుటతప్ప తత్పూర్వము కూలిపోవుచున్న సనాతనధర్మము నుద్ధరించుటకు జతనముచేయరైరి. ఇప్పుడైనను మనము స్వార్థత్యాగము చూపినయెడల మనజాడలలో బెక్కండ్రు నడతురనుటకు సందేహము లేదు.

పరమార్థములేని సోషలిజమువద్దు.

లోకములో ప్రసిద్ధిజెందిన దుర్భా శర్మగారు వివేకానంద ప్రభృతులచే అమెరికాది పాశాత్యదేశములందు సైతము శంకర సిద్ధాన్తము వ్యాపించి మనమతము నానాటికి శోణోల్లీఢమగు రత్నమువలె ప్రకాశించుచున్నదని చెప్పినారు. అయ్యది వాస్తవమేకాని ఒకతట్టు రష్యానుండి నాస్తికత్వముకూడ దిగుమతియగు చున్నది. రష్యాలో కొంత కాలముగ నాస్తికత్వము ప్రబలి దేవాలయముల నశింపజేసినారు. అట్టి సిద్ధాన్తము మనదేశమున కావశ్యకమైనదని నాయకులుకొందరు తీవ్రయత్నములొనర్చుచున్నారు. ఆరష్యాసిద్ధాన్తమే సోషలిజమని వ్యవహరింపబడుతున్నది. ఆదేశవాసులు సైతము నాస్తికత్వమువలన కలిగిన నష్టముల గుర్తించి మరల ఆస్తికత్వమునకు బూనుచున్నారు. అట్టి సమయమున మనము నాస్తికత్వ మభిలషణీయమని ప్రచారమొనర్చుచున్నాము. 20, లేక 30 సంవత్సములకు స్త్రీలు వివాహమాడు పాశాత్య దేశములందు ఇప్పుడిప్పుడు బాల్యవివాహములు శ్రేష్ఠములని తలంబపడుచున్నవి. సంయుక్త రాష్ట్రములలో బాలికలకు 12 వ సంవత్సరమునకు పూర్వమే వివాహముకావలయునని శాసనము గావింపబడినది. పాశ్చాత్యులు మన ప్రాచీనాచార గౌరవముల గుర్తించి మనవంకకు మరలుచుండ మనము బాల్యవివాహములమాని 14 సంవత్సరములకుపైన బాలికలకు వివాహమొనర్పవలెను, ఇత్యాదికములగు శాసన నిర్మాణమునకు గడంగితిమి. ఇయ్యది మిగుల శోచనీయము. ఇండ్లయందు రత్నములవలె రహస్యముగనుండదగిన స్త్రీలేనాడు బయటికి వచ్చిరో నాడే భారతదేశమనుగృహమునకు ముప్పువాటిల్ల నారంభించినది. దీనిని మహాకవియై

' కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా'

అని ప్రసిద్ధిజెందిన కాళిదారు

'స్త్రీపుంవచ్చ ప్రభవతి యదా తద్ధిగేహం వినష్టమ్‌'

(స్త్రీ పురుషునివలె ఏనాడు సంచరించునో ఆనాడు గృహము నాశనమే) అని వచించినాడు.

మనదేశమున కే సోషలిజమో, లేక ఏ కమ్యూనిజమో, ఏఫేసిజమో వచ్చినను దేశము సుఖపడజాలదు. కడుపునిండినంతమాత్రమున సుఖములేదు. ఆత్మతృప్తినందవలెను. అప్పుడే ప్రాణికి నిజమగు సుఖముకలుగును. మనమందరమును దానికై తీవ్రప్రయత్నమొనర్పవలెను. దానికుపాయముగ మధ్యనుండు ఈ సోషలిజమును, స్వరాజ్యమును మనము పొందవలసినదేగాని ప్రధానలక్ష్యమును మనము మరువరాదు. అదే ముఖ్యము. ఆలక్ష్యము అనగా అగోలు మనకాదర్శముకాకపోయినచో ఈ సోషలిజముకాని, ఈ రాజ్యస్వాతంత్ర్యములు కాని మన కక్కర లేదు. అది మన కభిలషణీయముకాదు.

మన కర్తవ్యమేమి?

మనమతము పరులను తనలో కలుపుకోవలయునని యెన్నడును కోరలేదు. వారువారు వారివారి కర్మల నాచరించుచునే భగవంతుని నారాధింపవచ్చును. మఱియు ఇతరమత నిరాసనమునకు ప్రయత్నించిన శ్రీశంకరులవారు విమతులగుపం డితులతోడనే తలపడువారని వారిచరిత్ర చాటుచున్నది.

ఈ పరిషత్సభ్యులు పక్షమున కొకమారో మాసమున కొకమారో, సమావేశ##మై విజగీషుత్వమును తలపెట్టక, ఈ పక్షమున, లేక ఈ మాసమున మీరెంతమాత్రము కామక్రోధముల తగ్గించుకుంటిరి. ఎంతమాత్రము భక్తిని సాధింపగలిగితిరి అని పరీక్షించుకొనవలెను. ప్రతిదినమొక డైరీవ్రాసుకొని మనమీ దినము ఎట్టి మంచి కార్యమొనర్చితిమి? ఎంతమాత్రము కామక్రోధముల తగ్గించుకుంటిమి? ఎంతమాత్రము భగవంతునిపై ప్రేమ సంపాదించితిమి. అని మనలను పరీక్షించుకొనవలెను. ఆనాడు మనము ఇతరులకు మార్గదర్శకులము కాగలము. అప్పుడు మనల నందరును అనుసరింతురు. అప్పుడు దేశమునకు నిజమగు స్వాతంత్ర్యము, మోక్షము, శాంతి కలదు.

కాబట్టి ఈ పరిషత్సభ్యులు ముందు తమ్ము తాము సంస్కరించుకొని పరులకు మార్గదర్శకులై దేశమునుద్ధరించుట కర్తవ్యముగా భావించి దానికి బూనుకొనినయెడల మరల భారత దేశము పూర్వపుటౌన్నత్యమునందగలదు. మీరందరునుస్వకర్మా చరణబద్ధులు కావలెను. ఈ పండిత పరిషత్తు దినదినము అభివృద్ది చెంది ఈ మండలమునకేగాక దేశమునకంతయు మార్గదర్శక మగుగాక!

----

Upanyasamulu    Chapters