Kamakoti   Chapters   Last Page

 

14. సమర్పణము

దూతలూరి జగన్నాథం

----- : 0 : -----

కంచి శ్రీకామకోటి విఖ్యాత చంద్ర

శేఖరేంద్ర సరస్వతీ శ్రేష్టులైన

శంకరాచార్య శ్రీపాద పంకజము

నంకితము జేతు తులసీదళాత్మకంబు||

 

వారి సంకల్పమున గాదె వసుధనేడు

భక్తి ప్రవహించు కవితాస్రవంతు లగుచు

పావనము గాదె సృష్టి శ్రీవారి చూపు

ఎంతవరదాక సోకునంతంత దాక ||



వారు చంద్రమౌళీశ్వరాకారు లనిన

ఆదిశంకర భగవత్పాదులనిన

వర్తమాన జగద్గురు వర్యులనిన

సత్యమౌనని వాగ్దేవి సాక్ష్యమిచ్చు ||



అతని చూపుల సూర్యచంద్రాంశుపూర్ణ

విమల తేజమ్ము గాదన్న వింతగాదు

మందహాసము నందును మాటలందు

కోటిరతనాలు రాలు నొక్కొక్కసారి ||



తనివి తీరదు స్వామి సందర్శనంబు

ఎన్నిసార్లైన ప్రతిసారి యేదొ వింత

దర్శనం దర్శనం పునర్దర్శనంబు

జేయుచుందురు. ఏమి వశీకరంబు ||



స్వామియిచ్చెడి తీర్ధప్రసాదములకు

శరుణు శరణని దీర్ఘపూజలకునోర్చి

సారె సారెకు జేతులు సాపుకొంచు

భక్తులుందురు చాతకపక్షులట్లు ||



వేదవేదాంత సత్కళావిభవములకు

ఆర్షధర్మ సంస్థాపనాద్యయనములకు

సకల తీర్ధ సన్మంగళ స్నానములకు

కామకోటియె నిత్య శ్రీరామ రక్ష||

Kamakoti   Chapters   Last Page