17. రాకపోకలు లేక సత్సంగమహిమ
(జనవరి సంచిక తరువాయి)
వాయువు పుష్పసుగంధమును గ్రహించి పోవునట్లు జీవుడు, మనస్సు ఇంద్రియములను గ్రహించి పోవుచుండును.'' మహర్షి యతనికి బోధపరచుటకు ప్రయత్నించెను.
''గంధహీనమైన వాయువు విషయమున అట్టి గమనము కుదురును పొసగును. కాని మనసేంద్రియ రహితుడైన జీవున కెట్లు పొసగును. '' అతడు 'తనకు తోచదు ఇతరులు చెప్పిన వినడు' శ్రేణికి చెందిన కలియుగ మానవుడు. అది తన జీవితమున మొట్టమొదటి సారి ఇతరుల మాటను చెవిని పెట్టుటకు ప్రయత్నించుట. విషయములవలన ప్రాప్తించిన సుఖమె యతనికి చరమమైన పరమ లక్ష్యము, న్యాయాన్యాయములు, పుణ్యపాపములు, యుక్తాయుక్తములు వీటి విచారణ బలహీనులు బక్కవారు చేయదగినపని. అతని శరీరమున శక్తి కలదు. పిత్రార్జితసంపత్తి అవసరమునకు మించియున్నది. పరివారము బలగము గలదు. ఆరోగ్యమునకు లోటులేదు. అట్టి పరిస్థితిలో అతడేల భోగముల ననుభవించరాదు? పైగా కాస్త బుద్థి బలము. ఏపూర్వపుణ్యవిశేషముననో ప్రాప్తించియున్నది. మామూలు మానవులు చేయు యాస్తికవాదములను పెడసర వాదమున యతడు ఖండించగలడు. రిసెర్చి చేసి సైంటిఫిక్కుగా ఏదైనా కొత్తవిషయమును యెవరైన చెప్పిన యానందించగలడు. నేడతని కొక జటాధారియైన సాధువు తటస్థించెను. ఏలనో అతనియందతనికొక శ్రద్ధాభావ మంకురించెను. ''భారతీయ మానవ సమాజమునకు భారభూతులైన యీసాధువులు పనిపాటులు లేక దేశద్రిమ్మరులైన సోమరులు. ఉత్త పనికిమాలిన వారు. ఈదేశమున నిది యొక తిండిదండుగ దండు '' ఏతజ్జాతీయక వాక్య పరంపర యతని నోటివెంట తరచు పరిచితులు వినుచుందురు. నేడు తారసిల్లిన సాధుపుంగవునకు యేమియు నవసరము లేదట. తిండి పెట్టినను వద్దనునట. మరి అట్టి బైరాగియేమి మాట్లాడునో యని యతని కుతూహలము. అతడు తన సంశయమును యీవిధమున ప్రకటించెను. చెవిటివాడు వినలేడు. గుడ్డివాడు చూడలేదు. మూర్ఖుడు యాలోచన చేయనసమర్ధుడు. మూగవాడు మాట్లాడ నేరడు. చనిపోయిన తరువాత నేమి జరుగును?''
''నీవు శరీరగోళకములనే యింద్రియములని భావించి మాట్లాడుచుంటివి.'' మహర్షి యేమి చేయగలడు? కలియుగమున ఈవిషయలోలుపుడైన మానవునితో యతనికి ప్రసంగించవలసిన గతిపట్టెను. ఇతడు ముక్తుడైనచో ప్రమాద పరంపర యంతరించునని యతడు భావించుచుండెను. సృష్టికర్త కర్మ విధానమున హస్త క్షేపము సర్వదా ప్రమాదము వలననే జరుగుచుండును. కరుణాసముద్రుడైన సర్వేశ్వరుడే జీవి కెట్టివిధానము చేయునో అతనికిది సరిగానే యుండును,
''ఒక్క కీటకజీవి ఇతరుల పుణ్యవిశేషమున స్వర్గభోగములననుభవించి కర్మయోనియందు పుట్టుసరికి విషయలోలుడుగా పరిణమించును. తన పతనమార్గమును పూర్తిగా తెరచియుంచుకొనును, ఈవిషయము మనసాపి యూహించి తెలిసికొనుట కష్టమైన పని. పితృపితామహార్జితమైన సంపత్తి ప్రాయః పుత్రుని వ్యసనాసక్తునిగా జేయునను విషయము నేడు కాస్త బుద్ధియందు స్ఫురించసాగెను. ఇంక ఈపరంపరకు తత్సంబంధముగల జీవి ముక్తుడైన గాని యంతము సంభవించదు, ఋషి శాంతస్వరమున యిట్లు బోధ చేయసాగెను. ఇదిగో నీకెదురుగా యీ విద్యుద్దీపము గలదు. ఈగాజుబుడ్డి బద్దలైన ప్రకాశదానము చేయుశక్తి నశించిపోవునా?
''నేను యింకొక బల్బు తగిలింతును. విద్యుచ్ఛక్తి నశించక యట్లె యుండును. '' దృష్టాంతము చూపి చెప్పిన విషయము కాస్త బుద్ధికి వచ్చినట్లగపడుచుండెను. కాని యీ ముక్కు, కన్ను, చెవి మొదలగునవి బల్బుస్థానీయములైన వాటికి శక్తి యెచ్చటనుండి వచ్చుచున్నది ? ఈసంశయము మనసున పొడసూపెను,
''నీవు స్వప్నమున కనుట, తినుట, వినుట-మూర్కొనుట, ముట్టుకొనుట, (తాకుట) ఇత్యాది చేయుచున్నావుకదా '' అతని సంశయము విడదీయుటకు ఋషిపలికెను. ఆసమయమున యింద్రియములు బహిర్గోళములతో సంబంధితములుకావు-కనుకనే బహిర్విషయముల జ్ఞానము-వాటి యుపభోగము జరుగదు. వాటికి మానసిక జ్ఞానము కలుగును.
''పుట్టుగుడ్డివాడుకూడ ఏదోరూపమును మానసమున కల్పించుకొనునేమో- చెవిటివాడు ఏదో శబ్దము నూహించు కొనునేమో? అతడు మననము చేయ నారంభించెను.
''జాగ్రదవస్ధలో నీవుజ్వరముతో బాథపడుచుండినను స్వప్నమందు రోగరహితుడవై సంచరింతువు'' ఋషి తన ప్రతిపాదన స్పష్టముగానే చేసెను-కాని యా దేహాభిమాని అపార్ధము చేసికొనెను. అతడు సాధువులను పరోక్షమున హేళన చేసినను వారిని చూచినపుడు మాత్రము మానసికముగ భయపడుచుండును. అతడాతురతతో నిట్లు పలికెను. మీరు నాకు జ్వరము రావలెనని శాపము పెట్టుచున్నారా ?
''పిచ్చివాడా! నీమానసిక రోగము కూడ దూరము కావలెనని మేమభిలషింతుము'' లోకా స్సమస్తాస్సుఖిలో భవంతు - మాకశ్చిత్ దుఃఖ మాప్నుయాత్'' మహర్షి యతని హృదయమున ధైర్యము, చొప్పించెను. ''ఈశరీరమున గల సుఖ దుఃఖములు స్వప్నమందెట్లు గోచరించుటలేదో అటులనే మరణానంతరము శరీరసంబంధములయిన లోటుపాట్లు గ్రుడ్డితనము,మూగతనము ఇత్యాది జీవునితో గమనము చేయవు, శరీరముతో నశించునవియె.
''నాకు చచ్చి పోవలెనని యిచ్ఛపుట్టనే పుట్టదు. ఋషీశ్వరుడు శపించు నను భయము లేక పోయినను తనమనస్సులోని మాట స్పష్టముగా చెప్పివేయుటలో నతనికి ఔచిత్యము గోచరించెను. సాధువెందుచేతనో అత్యంత సూక్మపరీక్షలోనికి దిగెను. ''ఇంద్రియమనముల కతీతమైన వస్తువొకటికలదని తెలిసికొనుటకు మధ్య మరణవిచారణ యవసరమా ? మృత్యుదశను విడిచి అది తెలిసికొనుటకు మార్గమేమియులేదా ?
''నిద్రావస్దయందు యేమియు తెలియలేదని నీవు స్వయముగా నొప్పుకొందువుకదా ! మృత్యుదశయందు మనస్సు యింద్రియములు లేవనుసందేహమును పరిహరించవలపసియున్నది. '' మృత్యుదశయొక మహానిద్రయను కొనవచ్చును - కాని నిద్రయందు శరీరము శ్రాంతమయి యుండునుగాన ఇంద్రియమనములు నిద్రజెంది యుండును. మృత్యుదశయందు శరీరము శ్రాంతి చెందియుండదు. కానయీ యింద్రియమనములు మెలకువతో నుండును. నిద్రయందు మనసు ఇంద్రియములు నిద్రించిన శ్వాశరూప ప్రాణమాత్రము మెలకువతో నుండి జీవుని సజీవునిగా నుంచును. ఈప్రాణము మృత్యుదశయందు కూడ నుండును (సప్తదశావయవములు కల సూక్ష్మ శరీరము నశించదు. అందు ప్రాణపంచకము కూడ నుండును.)
''తమరు చెప్పిన మాట యుక్తికి సరిగా కిట్టుచున్నది '' అతడాలోచనిమగ్నుడయ్యెను. ''వాయువెచ్చటికి పోయినను గంధమును గ్రహించిపోవుచుండును. జీవుడు కూడ మనసును ఇంద్రియములను కూడగట్టుకొని యెచ్చటకు పోయినను అచ్చటి ప్రాకృతిక పరిస్థితులననుసరించి వర్తించుచుండును,''
''నీవు నీ స్వరూపమును వాయువువలె జడమైన దానినిగా భావించజాలవు, ''మహర్షి కొంత ప్రసన్నతతో పలికెను, ''సామాన్య (అపాత) దృష్టికి పురుషుడు. లేక జీవుడు - మానవుడు. అభ్యస్తములైనప్రాచీన సంస్కారములకు వశుడై వర్తించునట్లుగోచరించుటలో సందేహములేదు కాని వాటి నతడు విడిచి యుండగలడు. తన కర్మలవిషయమున - తన యూర్ధ్వాధోగతుల విషయములన - తన యభ్యున్నతి విషయమున మానవుడు స్వతంత్రత గలిగియున్నాడు. నీవు నీ కర్మగతిని మార్చుకొనుటకు స్వతంత్రుడవు. నిన్ను యెవ్వరుదాసత్వమునందే నిలుపజాలరు.''
వాస్తవమున యతడు సర్వదాస్వతంత్రాభిలాషి. ఇతరుల వశమందుండుట యతనికి కిట్టదు. యెవరైన బలాత్కరముగ నతనిని సేవకావృత్తిలో నుంచిన యతడు తటపటాయించును, యెవరైన యతనిని యణగద్రొక్కుటకు ప్రయత్నించిన లేక తన యాజ్ఞానుసారమతనిని నడిపించు అధికారము చెలాయించిన 'నరాధీన జీవిత' మనిన యతడు సహించగలడా! అతడాశ్చర్యచకితుడై చూచెను. అతని యెదుట నిలచి మాట్లాడు సాధుపురుషుడు హఠాత్తుగ సదృశ్యుడయ్యెను, అతని శరీరమున రోమాంచము మొలకలెత్తెను. తాను తన కుర్చీపైగలనో లేదో యని చూచుకొనెను. స్వప్నము కాదు. జాగ్రదావస్థయే యని పోల్చుకొనెను. అతనికి ఆకసమున దూరమునుండి యీ మాటలు విననయ్యెను. ''నీవు మనసుకు దాసుడవు కాజాలవు. మనస్సు నిన్ను పరతంత్రుని చేసి యాటలాడించిన నీకు శోభావహము కాదు. మనోపారతంత్ర్యముకన్న స్వతంత్రతవేరు.''