Kamakoti   Chapters   Last Page

 

20. ధర్మప్రచారసంఘములు

వాని కార్యకలాపములు

(ఆంధ్రదేశంలో ఆర్షధర్మప్రచారం చేస్తున్న సంస్థలు ఎన్నో కలవు. అవిగాక శ్రీవారు ఆంధ్రదేశపర్యటన సందర్భంలో శ్రీవారి ఆశీర్వచనంతో శ్రీవారి సమక్షంలోనూ పరోక్షంలోనూ ప్రారంభింపబడిన భజన సమాజములు మొదలైన ధార్మికసంస్థలు మరెన్నో ఉన్నాయి. కాని వాని కార్యకలాపాలను గూర్చిన వివరాలు ఎవరికీ తెలియటం లేదు. ఏమైనా ప్రచారం ఉంటే గాని ఉత్తేజం కలుగదు. కనుక, అటువంటి ధర్మసంస్థలు, శ్రీవారిచే ప్రారంభింపబడినా మరెవరిచేత ప్రారంభింపబడినా సరే వాని పూర్తి వివరములు అనగా సంస్థ పేరు, స్థాపించబడిన తేదీ, స్థాపకుల పేరు, ప్రస్తుత పాలకవర్గసభ్యులు వాని కార్యకలాపాలు ఎప్పటి కప్పుడు తెలియబరుస్తుండాలి. అలా చేస్తే మన కామకోటి పత్రిక ద్వారా ప్రచారము చేయటానికి వీలుంటుంది. గాన దయచేసి మీ ప్రాంతాలలో ఉన్న ఆర్ష ధర్మ ప్రచార సంఘాల వివరాలను మన పత్రికా కార్యాలయానికి ప్రతి నెలా 15 వ తేదీ లోపల అందేట్లు చూడవలసినదిగా కోరుచున్నాము.)

సనాతనధర్మ ప్రచారసమితి

అరవపల్లి,

నందలూరు, కడపజిల్లా.

పై గ్రామములో 10-10-70 వ తేదీన సనాతనధర్మ ప్రచార సమితి అను పేరుతో ఈ క్రింది కార్యవర్గముతో నొక సంఘమేర్పడినది. ఆర్కాటు శ్రీపతిరావు గారు అధ్యక్షులు, శ్రీ కె.సంజీవయ్య ఉపాధ్యక్షులు, శ్రీ కె.యస్‌. నారాయణస్వామి, డి. సుందరేశయ్యరు గార్లు కార్యదర్శులు, చివుకుల రామచంద్రయ్య, పి. సుబ్బారావు, డా|| సి.రాధాకృష్ణమూర్తి తదితరులు కార్యవర్గ సభ్యులు.

ప్రతి ఏకాదశి దినమున విష్ణుసహస్రనామ, దేవీఖడ్గమాల, శ్రీరామ, శ్రీకృష్ణ, లక్ష్మీ, అష్టోత్తరములు, శ్రీ సూక్త, పురుషసూక్త మంత్రములతో పూజలు చేసి భజనలు చేయుచున్నారు. అప్పుడప్పుడు వచ్చు పర్వము లందు అనగా శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, శంకరజయంతిలలో యధాశక్తిగా పూజలొనర్చి భజనలు చేయుట, శ్రీ జగద్గురువుల ఆశీర్వచనములతో ప్రారంభింపబడిన ఈ సమాజమునకు ఒక మృదంగము. శృతిపెట్టె నాలుగు జతల తాళములు శ్రీవారిచే ప్రసాదింపబడినవి.

కామకోటి తెలుగు మాసపత్రిక, కామకోటి వాణి ఆంగ్లమాసపత్రిక, కామకోటి ప్రదీపము అరవమాసపత్రిక వంటి ఆధ్యాత్మిక గ్రంథములు, విష్ణుసహస్రనామ స్తోత్రములు, భజగోవింద శ్లోకములు, ఆదిత్యహృదయమువంటి స్తోత్రములు సభ్యుల యుపయోగార్ధము తెప్పించబడుచున్నవి.

Kamakoti   Chapters   Last Page