Kamakoti   Chapters   Last Page

 

7. హనుమజ్జయంతి

శ్రీ యం. శేషగిరిరావు

శ్రీరామజయంతి, శ్రీశంకర జయంతి వసంత కాలములో జరుగు మహోజ్వల ఉత్సవములు. యీవసంత మందే శ్రీరామ సేవా దురంధరుడగు హనుమంతుని జయంతి కూడ వచ్చును. శ్రీ నృసింహ జయంతి కూడా జరుపు నాచారము కూడ ఉన్నది. వీటిలో కన్నిటిలోకి మూలాధారము ఆపుణ్యమూర్తుల జీవితములందు మనకు ఆదర్శవంతముగా మన జీవితములను సరిదిద్దుకొనుటయే ప్రధానమని గ్రహించుట తదనుకూలముగా ఆచరించుకొనుచూ తృప్తి నొందుట ముఖ్యము. మతాదర్శము. మతావశ్యకత మత సమన్వయము యీ మూడు స్థాయిలలో భావించి ఆచరించుటలలో త్రికరణశుద్ధిగా తీర్చిదిద్దుటలోగల విసిష్టతయే హిందూమతములోని శోభ, అట్టి మతమునకు ప్రాతిపదిక దివ్యజీవనము.

దివ్యజీవనమునందు మూర్తీభవించిన పుణ్యపురుషుల కోవలో నున్నవారిని అనుసరించుట నైతిక విలువలకే గాకుండా, అభ్యుదయ జీవిత పరపంరను మిక్కుటముగా అలవరచుకొని నిరతిశయా నందమును బొందుటయే తృప్తి, తక్కుంగల సామర్ధ్య మంతయు నిష్ప్రయోజనము. ఏలనన వేల్పులు కావించిన శ్రీరామ నుతి తిలకించిన వారి భావములు ఎంతగొప్పగా నున్నవో గమనించ వచ్చును.

బ్రహ్మ:

మాయాతీతం మాధవమాద్యం జగదాదిం

మానాతీతం మోహవినాశం మునివన్ద్యమ్‌

యోగిధ్యేయం యోగనిధానం పరాపూర్ణం

వందే రామం రంజితలోలం రమణీయమ్‌.

పరమశివుడు:

నమోస్తు రామాయ సశక్తికాయ

నీలోత్పలశ్యామల కోమలాయ

కిరీటహారాంగద భూషణాయ

సింహాసనస్థాయ మహాప్రభాయ

అహం భవన్నామగుణౖః కృతార్ధో

వసామి కాశ్యామనిశం భవన్యా

ముమూర్షమాణస్య విముక్తయేహం

దిశామి మంత్రం తవ రామనామ.

ఇంద్రుడు:

భ జేహం సదా రామ మిందీవరాభం

భవారణ్యదావానలాభాభిధానమ్‌

భవానీహృదా భావితానందరూనం

భవభావ హేయం భవాదిప్రపన్నమ్‌.

వినాయకుడు:

తావదేవ మద స్తేషాం మహాపాతక దంతినామ్‌

యావన్న శ్రూయతే రామ నామ సంచాననధ్వనిః.

(అర్థము సులభముగానే ఉన్నది. గావున వ్రాయుట విరమించితిని.)

శ్రీరామ వైభవము అట్టిది. శ్రీ శంకరులవారు గొప్ప మేధావి. ఆయనను లోకశంకరులుగా కొనియాడిరి. మన మతమునకు సరియైన రూపము నిచ్చి తృప్తి చెందించిరి. గావున జగద్గురు అనునామము ఆ మహనీయునకు స్థిరముగా నిలచియున్నది.

అరిషడ్వర్గములను జయించుటద్వారా భ్రాంతిజన్యమైన సంసారమను సముద్రమునుండి వెలువడుటకు సాధించే జీవాత్మయే శంకరుల వారి దృష్టిలోగాని, లేక వాల్మీకి దృష్టిలోగాని రామాయణం అని మనం తెలుసుకొనవచ్చును.

శంకరులు బ్రహ్మజ్ఞాని. నారాయణప్రశ్న మందు తరించుటకు ఒక మంత్రము గలదు. అయ్యది నృసింహస్వామిని ఉపాసించుటకు వీలు కలుగజేయుచున్నది. శ్రీ శంకరులు గూడా సంసారమునందు చిక్కి బాధ పొందుతున్న మన బోటి సామాన్యులకు సైతము ఉపయోగపడునటుల శ్రీ లక్ష్మీనృసింహ స్తోత్రమును అందించిరి. శ్రీరాముడు గూడా బ్రహ్మజ్ఞాని గావుననే శ్రీవారు యీ క్రింది విథముగా చెప్పిరి.

తీర్త్వా మోహార్ణవం హత్వా రాగ ద్వేషాని రాక్షసాన్‌

యోగీ శాంత స్సమాయుక్తః ఆత్మారామో విజయతే ||

మన జీవనయాత్రకు కావలసిన సుగుణరాశి అంతయు రామాయణమందు గలదు. ధైర్యము, బ్రహ్మచర్యములకు మూర్తీభవించిన ఆంజనేయుడు శ్రీరామునకు నమ్మినబంటు, మహాభక్తుడు, రామనామమును సదా సేవించిన పుణ్యమూర్తి. తారకమంత్రమైన రామనామమును త్రికరణశుద్ధిగా అనుష్ఠించి ఆయన దివ్యత్వమును పొందగలిగినాడు. అట్టి ఆంజనేయుని జయంతి 19-5-71 దేశవ్యాప్తముగా జరుపుట మన అదృష్టము.

వేదములలో చెప్పిన సత్యతత్త్వాన్ని తెలుసుకొనుటకు యీ జయంత్యుత్సవములు ఒక విధముగా మరుపును తొలగించి, మంచి పంథాను తెలుసుకొనుటకును, పెద్దలు ఆచరించిన దోవనే వెళ్లుటకు వీలు కలుగజేయును.

ఆంజనేయులు పవనసుత, వీరహనుమాన్‌, సామీర్‌,హనుమాన్‌, కపిశ్రేష్ఠుడు, నవవ్యాకరణ పండితుడు యిత్యాది హనుమంతునకు నామములు గలవు. శ్రీరామునికిని ఆంజనేయునికి గల మైత్రి గాఢమైనదని రామాయణమందు విశదముగా గలదు. సుగ్రీవునితో చెలిమి జేయుట, హనుమంతుని సాహసకృత్యముల కొఱకే నన్నట్లు రామాయణగాధలో వ్యక్తమగును. హనుమంతుని భక్తి అద్వితీయము. గావుననే ఆయన సేవ గణత నొందినది. హనుమత్సమేత రామచంద్రాయ నమః అని చెప్పుకొనుటకు గూడా వీలున్నది. సుందర కాండమందు ఆయన పాత్ర జగద్విఖ్యాతము. మహాభారతమందు హనుమంతుని ప్రస్తావన గలదు. భీముని శక్తి సామర్ధ్యములు సౌగంధిక పుష్పగ్రహణమందు హనుమంతునివలన తెలియగలదు. పార్థుని ధ్వజపతాగ్రమందుండి కంటికి రెప్పవోలె ఆయన స్వామిని సదా సేవించుట మనము జ్ఞప్తియందుంచుకొనుట ముఖ్య కర్తవ్యము.

ఇట్టి పరమభాగవతోత్తముని సేవించుట యుగయుగాంతరములలోను గురుతుకు రాగలదు. మన కందరకు వర్తమానమున ఉపాస్యదైవముగా కూడా ఏర్పడియున్నాడు. పిల్లలను ప్రేమించిన తండ్రికి సంతోషమెట్లో, అట్లే శ్రీరామునిభక్తుని సేవించిన శ్రీరాముని కరుణకు పాత్రులగుదుము. ఆంధ్రలో మిక్కిలిగా ప్రఖ్యాతిగొన్న రామభక్తుడు హనుమంతుడు. కేసరీ అంజనీదేవికి గలిగిన పుత్రుడు హనుమంతుడు. తన సాహసకృత్యఫలితము వలన హనుమంతుడని పేరు కలిగినటుల స్వయముగా తానే సీతమ్మవారికి జెప్పుకొన్నట్లు రామాయణమందు గలదు.

హనుమంతుడు రుద్రాంశసంభూతుడనిగూడా చరిత్ర తెల్పుచున్నది. శ్రీ వాల్మీకి రామాయణమందు గూడా ధృవపరుపబడినది. రావణుడు యీ మహాభాగుడు నందీశ్వరుడా అని ఆలోచించి చకితుడైనట్లు వాల్మీకి పేర్కొనినాడు. రుద్రుని భూతగణాధిపతి గావుననే యీ మూర్తీభవించిన హనుమంతునకు రుద్రాభిషేకమంత్రములతో అభిషేకము జరుపుట ఆచారము.

హనుమంతుని పూజించుటకు అన్ని మూర్తులను పూజించు పద్ధతి ప్రకారము ఆచారము గలదు. ధ్యానము, అంగ కరన్యాస విధులు మూలమంత్రముజపము యిత్యాది (అనగా నామావళి, దండకము, స్తోత్రములు) ద్వాదశాక్షరి లేక దశాక్షరి గల మంత్రములు హనుమత్‌ కల్పము తెలుపుచున్నది. బీజాక్షరము హ అనియు, ప్రాధాన్యత గలదిగాను శ్రీహరి అర్జునునకు తెలిసినట్లు మంత్ర శాస్త్రములో గలదు. సుందరకాండ పారాయణ సమయమందు చాల ధ్యానశ్లోకములు గలవు. ''నచ కర్మను సీదంతి మహత్సు అమితౌజసః'' అను వాల్మీకి వాక్యమును బట్టి హనుమంతుని సాహసకృత్యములు ఎన్నియో గలవైనప్పటికి, విస్మయముగాని, అభిమానముగాని నిస్పృహగాని హనుమంతుడు చెందలేదని వాల్మీకి తెలిపినాడు. సాగరలంఘనము ఆయన శక్తికి నిదర్శనము. అట్లే సీతను ఓదార్చుట, సీతకు నమ్మకము కలుగుటకు పలుకు వాక్యములు ఆయన నిపుణతకు తార్కాణము. సీత కొఱకు లంకలో జరిపిన అన్వేషణ ఆయనకున్న స్థిరసంకల్పమునకు అప్రమత్తతకు ప్రబల నిదర్శనము.

అంగుళీయక ప్రదాన సందర్భములో ఆంజనేయుడు పలికిన పలుకులు ఎంతయు సముచితము.

వానరోహం మహాభాగే

దూతో రామస్య ధీమతః

రామానామాంకితం చేదం

పశ్య దేవ్యంగుళీయకమ్‌.

యీమాటల తో ఆమెకు శాంతిని సమకూర్చి రామముద్రికను అందించెను. ఆ ఓదార్పు మాటల ప్రభావము మనమే వూహించుకోవలెను, లంకలో తానాచరించిన సాహసకృత్యములు గూడా రాబోవు రావణసంహారమునకు నాంది అనునటుల తోచును, శ్రీరామునికి జయలక్ష్మీ వరించుటకు దూతగా వచ్చిన ఆంజనేయుని ప్రతిజ్ఞాపాలన భేరి మ్రోగి లంకలో నున్న రాక్షసులను కలవరపెట్టునట్లుండెను. గావుననే శ్రీ శంకర భగవత్పాదులు హనుమంతుని ప్రతిభను యీ క్రింది శ్లోకములో నిరూపించినారు. అట్టి భావముతో హనుమంతుని ధ్యానించుట గూడా అవసరము.

దూరీకృత సీతార్తి:

ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తిః

దారిత దశముఖ కీర్తిః

పురతో మమ భాతు హనుమతో మూర్తిః

పైశ్లోకములోని అర్ధము ఒక్క శ్లోకములో సుందరకాండ వృత్తాంతమంతయు శ్రీఆచార్యులవారు తెలుపుటలో ఆచార్యుల వారి సమర్ధతను చాటుచున్నది. పదము, భావము అన్యోన్య సంబంధమ గలదని నిరూపణకు యీదృశ్యము సుందరకాండకు ఎంతైనా శోభ నిచ్చును.

హనుమంతుడు చిరంజీవి. రాబోవు బ్రహ్మ. బ్రహ్మచర్యవ్రతము గలవాడు, శ్రీరామునికి నమ్మకమునకు తగినటుల మెలగిన నమ్మినబంటు శ్రీరామ చరిత్ర మనకెంత కాలముండునో రాబోవువారికి గూడా అంతకాలము హనుమంతుని కీర్తి ఆయన సేవ, భక్తి నిరతి, ఆదర్శప్రాయమై మానవాభ్యుదాయమునకు తోడ్పడు గాక.

ఓం తత్సత్‌

Kamakoti   Chapters   Last Page