Kamakoti   Chapters   Last Page

 

8. ఆచార్యాన్వేషణము

శ్రీ ముదిగొండ జ్వాలాపతిలింగశాస్త్రి అయ్యవారు

ప్రతిమానవుడును, ఆచార్యుని వెదకి ఆశ్రయించ వలయును. ఎందువలననగా ఉపనయనమున తండ్రి కుమారుని మేధాప్రజ్ఞాజనన సిథ్యర్థమును వేదాభ్యాస, వేదోక్త కర్మాచరణకొరకును, ఈ నాకుమారుని ఈశ్వరప్రీత్యర్ధం ఉపనేష్యే అనగా ఈశ్వరునికి ప్రీతి కలిగించుటకొఱకు అనగా ఈశ్వరా రాధన మొనరించుట కొఱకు, ఆ ఈశ్వరుని సమీపమును పొందింపగలను అనిసంకల్పించి (నారుద్రో రుద్ర మర్చ యేత్‌) అను విధి వాక్యముచే రుద్రత్వము లేని వాడు రుద్రునారాధింపరాదు. కనుక రుద్రత్వ సిద్ధిని ఉపనయన సంస్కారములైన భస్మ పంచశిఖా, కౌపీన, యజ్ఞోపవీత, దండాదులచేతను గాయత్రీ బ్రహ్మోపదేశముల చేతను రుద్రత్వమును చేకూర్చి ఈ క్రింది విధముగా ఆజ్ఞాపించు చున్నాడు. బ్రహ్మ చార్యసి అని ప్రారంభించి ఆచార్యాధీనో భవ, అని శాసించుచున్నాడు. అనగా ఆచార్యునకు అధీనుడవు కమ్మని అర్ధము. వటువు బాఢం భవామి గట్టిగా అగుచున్నాను. అని ప్రమాణముచేయును. అందువలన ఆచార్యునకు అధీనుడై యుండవలయును. బాలునియొక్క యోగక్షేమములుకోరిన తండ్రి అట్లు ఎందుకు విధించెననిన.

ఆచార్యవాన్‌ పురుషో వేదఅనగా ఆచార్యుడు కలపురుషుడే ధర్మాధర్మములను ఈశ్వరుని తెలిసికొను చున్నాడని శ్రుతి చెప్పినది గాన, శ్రుతి ఆచార్యుని విషయమున నింకెట్లు చెప్పెనో ఎట్లు ప్రబోధించెనో చూతము. శృతి ఆచార్యఃపూర్వరూపం అంతేవాస్యుత్తరరూపం విద్యాసంధిః ప్రవచనగుంసంథానం అనగా విద్య నార్జించుటకు గురువు పూర్వరూపమును శిష్యుడు ఉత్తరూపమును అయి ఉన్నాడు. కనుకనుగురుశిష్యులు కారణ కార్యరూపులై యున్నారు. ఉపనయన ముహూర్తమునందు గల దోషము ఆచార్యుని యందు గూడా ప్రాప్తించుచున్నది. అందువలన పూర్వజన్మ సంస్కార సిద్ధరూపమున ఆచార్యశిష్యత్వము ఏర్పడుచున్నది. అందువల్లనే వేద మసూచ్యాచార్యోంతే వాసిన మనుశాస్తి. అనగా వేదమునంతను చెప్పి తర్వాత గురువు శిష్యుని ఈ క్రిందివిధముగా శాసించుచున్నాను. సత్యమును చెప్పుము, ధర్మమును ఆచరించుము. వేదాధ్యయనాథ్యాపనముల యందు ఎప్పుడును అప్రమత్తుడవై యుండకుము. అని చెప్పి ఆచార్యుని కొరకు ఇష్టమైనధనము నిచ్చి సంతోషింపజేసి, వివాహమును జేసికొని, వంశవృద్ధి చేయుము. అని ఆచార్యుడు ఆజ్ఞాపించి సమస్తమైన సత్ప్రవర్తన మార్గమును ప్రవర్తింపజేయు ధర్మములను చెప్పిభవిషదభివృద్ధికి తోడ్పడు వాడు కనుక ఆచార్యుడు కావలెనని వేదము చెప్పినది. ఆచార్యుడనగా ఎటువంటి వాడు.

అచినోతిహి శాస్త్రాణి ఆచారే స్థపయత్యపి

స్వయమాచర తేయస్తు తమాచార్యం విదుర్బుధాః

అనగా సమస్త శాస్త్రములను విమర్శనా పూర్వకముగా చదువుకొని లోకమున ఉపదేశించుచు, ఆదేశించుచు స్వయముగా ఆచరించువాడు ఆచార్యుడు. అట్టి ఆచార్యుని జేరవలయునని ముండకోపనిషత్‌ ఇట్లు చెప్పనది. పరీక్ష్య లోకాన్‌ కర్మచితాన్‌ బ్రహ్మణో నిర్వేద మాయాత్‌, నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్ఛేత్‌ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం. బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానమును తెలిసికొన కోరినవాడు. కర్మవశ##మైన లోకమును జూచి దుఃఖపడి కర్మచేత కర్మ నశింపదాని తెలిసి బ్రహ్మవిజ్ఞానమును తెలిసికొనుటకై సమిధలను చేతిలో పట్టుకొని సత్కర్మానుష్ఠానపరుడును, బ్రహ్మనిష్ఠుడునైన గురువును చేరవలయును.

ఉక్తసాధన సంపన్న స్తత్వజిజ్ఞాసురాత్మనః

ఉపశీదేద్గురుం ప్రాజ్ఞఃయస్మాత్‌ బంధవిమోక్షణం.

చెప్పబడిన సాధనసంపత్తి కలవాడును ఆత్మ తత్వమును తెలిసికొన దలచినవాడును అగు ప్రాజ్ఞుడు ఎవ్వరివలన సంసారబంధమోక్షము కలుగునో అట్టి గురువును చేరవలయును. ఆగురువుఎటువంటివాడనగా శ్రోత్రియో వృజినో కామహతో బ్రహ్మణ్యుపరత శ్శాతః నిరింధిన ఇవానలః అనగా వేదవేదాంగపారంగతుడును పాపరహితుడును, కామాది అరిషడ్వర్గముచే కొట్టబడనివాడును, బ్రహ్మజ్ఞానమును తెలిసికొనిన వారలలో శ్రేష్ఠుడును బ్రహ్మయందు ఉపరతి కలవాడును శాంతుడును, కట్టెలు లేని నిప్పువలె ప్రకాశించువాడును అగు గురువును చేరవలయును. ఒక సామెత - తెలిసి కలియరాదు కలిసి తెలియరాదు అను జనశ్రుతి కలదు. అందువలన గురువును చేరకపూర్వమే గురువిషయమంతయును తెలిసికొనవలయును. చేరిన తర్వాత తెలిసికొనకూడదు. ఎందువలననిన శిష్యుని పరీక్షించుటకు గాను నిగ్రహానుగ్రహసమర్ధుడైన గురువు ఏదైన నొక యధర్మమును చేయవచ్చును. అంతమాత్రమున శిష్యుడాయనను అయోగ్యునిగా భావించి విడిచిపెట్టి పోయిన భ్రమడగును. అందువలన ముందుగనే గురువును విచారించుకొని మనస్ఫూర్తిగా చేరవలయును. అట్టి గురువు దేశమున విఖ్యాతి గాంచిన పీఠాధిపతులగు నీలకంఠాచార్య శంకరాచార్య, రామానుజాచార్య మధ్వాచార్య పరంపరగురువులు అనేక మార్గములుగ ఉపదేశమును చేయుచు భారతదేశస్థులను తత్వమార్గనిష్ఠులుగా చేయుచున్నారు. వారి వారి గురుపరంపర స్తోత్రములనుపట్టి చూచిన అందరికిని ఉన్న గురువులలో కొందరు ఒక్కరైయున్నవారును గలరు. అది యెట్లో చూతము.

శైవాచార్యస్తుతి

సదా శివం శివాం స్కందం కేశవం పద్మసంభవం

నందీశ్వరం కుంభయోనిం భరద్వాజాత్రిగౌతమాన్‌

దధీచి ముపమనుష్యం చ మార్కండేయం పరాశరం

వ్యాసం శ్వేతం చ, తచ్ఛిష్యం నీలకంఠసమాహ్వయం

తస్య శిష్యాన్‌ హరదత్తభవ దేవముఖాన్‌ త్వధ

ప్రణమామి బ్రహ్మవిద్యా సాంప్రదాయ ప్రవర్తకాన్‌

అద్వైత గురు స్తుతి

ఆదౌ స్వరాజం గురు మద్వితీయ మఖండ చిద్రూప ఘనం మహేశం నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మహం ప్రపద్యే.

సదాశివ సమారంభాం శ్రీ కంఠారాధ్య మధ్యమామ్‌ అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. (సదాశివ సమారంభాం) నారాయణ సమారంభాం శంకరాచార్య మథ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్‌.

ఈ రెండు స్తుతులలో కొందరు కలసియే యున్నారు కదా.

శ్రీ లక్ష్మీవల్లభారంభాం యామునాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరామ్‌. శ్రీ లక్ష్మీవల్లభారంభాం శ్రీరామానుజమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్‌. శ్రీలక్ష్మివల్లభారంభాం విఖనోముని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరామ్‌. శ్రీలక్ష్మీవల్లభారంభాం శ్రీమాధ్యాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్‌.

శ్లో|| ఆదౌ శ్రీపురుషోత్తమం పురహరం శ్రీనారదాఖ్యం మునిం

కృష్ణం వ్యాసగురుం-శుకం తదను విష్ణుస్వామినాం ద్రావిడం

తచ్ఛిష్యం కిల బిల్వమంగళమహం వందే మహాయోగినం

శ్రీమద్వల్లభనామథా మచ, భ##జేస్మత్సాంప్రదాయాధిపం.

ఈ ప్రకారముగా పైన జెప్పిన సాంప్రదాయకులందరును గురుస్తవము చేయుచున్నారు కదా. అందరకును శ్రీమహావిష్ణువు గురుసాంప్రదాయములో జేరియున్నాడు. వ్యాసుడుఅట్లే అందరకును గురుసాంప్రదాయములలోనే యున్నాడు. అందువలన గురుసాంప్రదాయము భేదాభేదముగ కలసియే యున్నది.

యోగదర్శనమున తపస్స్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః | ఈశ్వరప్రణిధానాద్వా | క్లేశకర్మవిపాకాయై రపరామృష్ఠ పురుషవిశేష ఈశ్వరః | తస్య వాచకః ప్రణవః స పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్‌ అని గుర్వవచ్ఛిన్నపరంపరయందు ఈశ్వరుడు మెదటివాడుగ చెప్పబడియున్నది. సూతసంహితయందు శ్లో|| యశ్శివ స్సర్వభూతానాం ఈశ్వర స్స్వూతయేవ తు ఈశాన సర్వవిద్యానాం స ఏవాది గురు ర్బుధాః తస్య శిష్యౌ మహావిష్ణుః సర్వజ్ఞానమహోదధిః తస్మా దార్తపరిజ్ఞానః బ్రహ్మాస్సర్వజగత్ప్రభుః సనత్‌కుమారా త్సర్వజ్ఞో కృష్ణద్వైపాయనో మునిః | సంప్రాప్తసర్వవిజ్ఞానః తస్మాదే తచ్ఛ్రుతం మయా | అని ఈశ్వరుడు మొదటి గురువుగా చెప్పబడెను. అందుచే గురు నాశ్రయింపక తత్క్రుపగాంచక జేయు అనుష్ఠానమును గూర్చి యిట్లు చెప్పబడినది.

ఆచార్యముఖతః ప్రాజ్ఞః సిధ్యతే వాచి రేణ తు

ఆచార్యరహితో మంత్రః పుంసోనర్ధస్య కారణం ||

ఆచార్యునివలన తెలిసికొనినవాడు సిద్ధిని పొందును. ఆచార్యరహితమైన మంత్రనుష్ఠానము పురుషులకు అనర్ధకారణమగుచున్నది అని చెప్పబడినది.

భగవద్గీతయందు --------

మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా త్తరిష్యసి

అధచేత్త్వ మహంకారా న్నశ్రోష్యసి వినశ్యసి

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ

అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచః ||

శివగీత

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి రాఘవ అను గురువు అనుగ్రహము వల్ల ఎటువంటి కష్టములనైనను తరింపగలడని, గురువు కోపగించిన నష్టపడునని తెలియజేసి, సర్వధర్మములను వదలి వేసి గురువు నాశ్రయించిన గురువు మోక్షమును పొందింపగలడని తెలియబడుచున్నది. అట్టి ఆచార్యుని గూర్చి ఈ విధముగా చెప్పబడుచున్నది.

శ్లో|| అప్రత్యక్షో మహాదేవః సర్వేషామాత్మమాయయా |

ప్రత్యక్షో గురురూపేణ వర్తతే భక్తి పిద్ధయే ||

శ్లో || యధా దేవే గురౌ యస్య భక్తి ర్భవతి శాశ్వతీ |

తం హంతుం నహి శక్తాశ్చ రుష్ఠావై సర్వదేవతాః ||

శ్లో|| వందే గురుపదద్వంద్వం అవాఙ్మానస గోచరం |

రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహత్‌ ||

అని ఈ ప్రకారముగా గురుమహత్వము చెప్పబడియున్నది.

ఆచార్యుడనగా అమరం మంత్రవ్యాఖ్యా కృదాచార్యః ఆచారం గ్రాహయతీ త్యాచార్యః | ఆచారమునుగ్రహింప జేయువాడు. మంత్రమనగా కల్పసూత్రాదిసహితమైన వేదము. దానిని అథ్యయనము చేయించి తద్వాఖ్యానము చేయువాడు.

శ్లో|| ఉపనీయతు యః పూర్వం వేద మధ్యాపయ ద్విజః |

సాంగం చ సరహస్యం చ తమాచార్యం విదు ర్బుధాః ||

అప్పయదీక్షితులవారు ఆచార్యాదవధార్య అని ప్రారంభించి బ్రహ్మాస్మి - నాక్షాదహం అనగా ఆచార్యుని వలన వేదవేదాంగములను పురాణములను పూర్వోత్తరమీమాంసలను న్యాయవైశేషికములను తెలిసికొని వాటి యొక్క అర్ధమును మహాప్రయత్నముతో తెలిసికొని వాని యెక్క సారమును అనుభవించినవాడనై బ్రహ్మానందవిలాసపూర్ణ హృదయుడనై బ్రహ్మనగుచున్నానని చెప్పెను.

అందువలన ఆచార్యునివలన సమస్తమును తెలిసికొని దానిసారమును మననము చేసి పరబ్రహ్మోపాసనము చేసి బ్రహత్వమును పొందవలయునని తెలియుచున్నది. అనుబంధముగ ఆపరంపరలోని వారేగదా! అందువలన గురుపరంపర అందరికిని కలసినదియే యగును. ఎవరెవరిని పూజించినను ఆ గురువు లాశిష్యులయందు అనుగ్రహము కలవారై తమకు అనుభవములోనున్న విషయమును వారికి ప్రబోధించి వారిని కృతార్ధులను చేయకపోరు. అందువలన ప్రతివారును తమతమ మతసంప్రదాయ గురుపరంపరాస్వగురువులను స్థాన దేహ భావాంతరంగ శుశ్రూషలచే సంతుష్ఠులను చేసి వారి అనుగ్రహముచే ముక్తులు కాగలందులకు ప్రయత్నించవలయును. జగద్గురువులైన నీలకంఠశంకరాచార్యుల వంటి మహామహులకే గురువులున్నట్లు వారి వారి చరిత్రములచే తెలియబడుచున్నది. అందువలన మనము గూడ వారి మార్గమునే అనుసరించవలయును. అందుచేతనే ఆచార్యులవారు తమ స్వానుభవము లోకమునకు తెలియజేయుటకై అల్పజ్ఞుల అవివేకమును పోగొట్టుటకై శ్లో|| అకృత్వా వృత్తివిచ్ఛేద మజ్ఞాత్వా బ్రహ్మ కేవలం, అహం బ్రహ్మేతి యో బ్రూయాత్‌, తస్య జిహ్వాం వికర్తయేత్‌, అజ్ఞస్య చా ప్రబుద్ధస్య సర్వం బ్రహ్మేతి యో బ్రవీత్‌ మహానిరయజా తేషు తేనైవ వినిపాతితః || అని చెప్పి అందరును ఈశ్వరార్చన సలిపి మోక్షమును పొందవలసిన దనుటగా తమపీఠమున చంద్రమౌళీశ్వరస్వామిని ప్రతిష్ఠించి తాము అర్చించి భక్తులను మీరర్చించి కృతార్ధులు కండని బోధించెను. కాన మనము ఆచార్యుని అనుగ్రహము లేనిదే మోక్షమును జేరుమార్గమును తెలిసికొనలేము. కాన ఆచార్యాన్వేషణము అవసరమైనది. సూతసంహితయందు సూతమహర్షి-----

శ్లో || వ్యాస స్సాక్షాచ్ఛినజ్ఞానీ శివసై#్యన ప్రసాదతః |

తత్ప్రసాదాదహం సాక్షాత్‌ శివజ్ఞానీ నసంశయః అని

అతశ్చ సంక్షేపమిదం శ్రుణుధ్వం జగత్సమస్తం

చిదచిద్వి భిన్నం స్వశక్తిక్లుప్తం శివమాత్రమేవ

న దేవదేవా త్ప్రుథగన్య దస్తి

వేదాన శేషా నవథార్య మర్త్యో

మదుక్త వేదాంతవిచారమార్గం

ఉపైతి పుణ్యన చ శంభుభక్త్యా

శివప్రసాదేన చ నేత రేణ.

మా గురువైన వ్యాసమహర్షి శివానుగ్రహము చేత శివజ్ఞాని. ఆయన అనుగ్రహముచే నేనును శివజ్ఞానిని. అందువలన సంక్షేపముగా మీకు చెప్పుచున్నాను. ఈ కనబడు సమస్తప్రపంచమును శివుని యెక్క చిచ్ఛక్తి యొక్క విభిన్నరూపము. దేవదేవుడైన శివుని కంటే వేరేమియును లేదు. మర్త్యుడు సమస్త వేదములను తెలిసికొని, నాచే చెప్పబడిన వేదాంతమార్గమును పూర్వజన్మపుణ్యము చేతను ఈశ్వరభక్తి చేతను ఈశ్వరానుగ్రహము చేతను పొందుచున్నాడు. ఇతరమైన దేనిచేతను పొందడు అని చెప్పెను. అందువలన మన కాచార్యుడును ఈశ్వరానుగ్రహము వలననే దొరకును. అందువల్లనే ఉపనయనసంస్కారమున రుద్రత్వమును మనకు కలిగించి రుద్రప్రీతికొరకు తత్సమీపమునకు పంపగలుగుచున్నానని తండ్రి మనకు తత్సంస్కారమును చేసి ఆచార్యాధీనుడవు కమ్మని శాసించెను. మనమట్లే చేయుదుమని ప్రమాణమొనరించితిమిగాన ప్రమాణచ్యుతి కాకుండా ఈశ్వరారాధన మొనరించి ఆచార్యుని బడసి ఆయన వలన సమస్త వేదవేదాంగాది విద్యలను బ్రహ్మజ్ఞానమును తెలిసికొనుటకై అన్వేషింపవలయును.

మహాత్ములభావము

చిత్రం వటతరోర్మూలే వృద్ధా శ్శిష్యా గురు ర్యువా

గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చ్ఛిన్నసంశయాః ||

ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతీ

శంభో ర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్యరూపా ||

ధరణిలోపల నారారుతత్వములకు

నవ్వలైయున్న తత్వంబు నెవ్వడెరుగు

శివుడు గురురూపమున వచ్చి చెప్పకున్న

నవ్యతరభోగి శ్రీ సదానందయోగి.

Kamakoti   Chapters   Last Page