Nadayadu Daivamu  Chapters  

 

సద్గురుస్తుతి

''కవిశేఖర'' శ్రీ గురజాడ రాఘవశర్మ

కం|| శ్రీ మత్కాంచీ సత్పుర

కామాక్షీదేవి పాదుకావిలసత్‌, హృ

ద్ధామ! గురుచంద్రశేఖర

స్వామి! భవచ్చరణములకు, సాష్టాంగముల్‌||

కం|| ఇదినగర, మిది యరణ్యం

బిది స్త్రీ, పరికింప పురుషుcడితడను, భేదం

బెదలేక పరబ్రహ్మగ

కదలెడి ''అవధూత!'' ఇతcడెగా! కనుమయ్యా!

శా|| ఏన్నో జన్మములెత్తినాము, మరియేయే జన్మలన్‌ జేయనౌ

పున్నెమ్ముల్‌ ఫలియించె, నేcడిచట, సంపూర్ణంబౌ పరబ్రహ్మ, సా

క్షా న్నేత్రోత్సవమై, యతీంద్ర పురుషాకారమ్మునన్‌, సత్కృపా

సాన్నిధ్యంబిడె, చంద్రశేఖర యతీంద్రస్వామి! కన్గొంటివే!

మ|| జటియై లోకమునుద్ధరింప జనుసాక్షాద్దైవ మాతండటే!

ఎటనో యొండుగ, పాదచారియయి యెందేమౌనియైకొండలం

దటవిన్‌ ద్రిమ్మఱు యోగివర్యుcడటె! లభ్యంబౌనె, తద్దర్శనం

బెటులౌనంచు దిగుల్‌ భయమ్ము వలదెంతే సత్కృపాపూర్ణు డెం

తటి సౌలభ్యమొ! చంద్రశేఖర యతీంద్రస్వామి! దర్శింపుమా!

మ|| సమ దృష్టిన్‌ బయనించు కాననగు నీ సర్వమ్ము నాత్మ స్వరూ

పముగాదోచు, నరణ్యముల్‌, పురములున్‌ పల్లెల్‌, మనమ్ముల్‌, నగా

గ్రములున్‌ క్రొత్తcదనమ్ము లేకయె పరబ్రహ్మముగానెంచు ధీ

రమతుల్‌, సద్గురు చంద్రశేఖర యతీంద్రస్వామి! సర్వజ్ఞులౌన్‌||

మ|| పరమబ్రహ్మము ఆదిశంకరగురుస్వాముల్‌, కృపన్‌, లోకము

ద్ధరణన్‌ సేయ జనించి యెల్లెడల సంస్థాపించిర ద్వైత, మి

ద్ధర ధర్మమ్ముగ, నట్టులన్‌ మరల సంస్థాపించి నారల్‌ జగ

ద్గురులౌ శ్రీ కరచంద్రశేఖర యతీంద్రుల్‌ దేశమందెల్లడన్‌

మ|| తము, దామేసృజియించుకొన్నయను బంధం బిద్దిసంసార బం

ధమటే! దీని విముక్తి జేయ దృటిలోనన్‌, ధీరవైరాగ్య ఖ

డ్గమటే! సద్గురు సత్కృపామహిమ సంకల్పమ్మునన్‌ ముక్తిసా

ధ్యమటే! నీదయ! చంద్రశేఖరయతీంద్రా! ఎట్లుపాలింతువో!

మ|| శ్రుతి ధర్మమ్ములనాచరించి, మనమారూఢస్థితిన్‌, ధర్మప

ద్ధతి, సంస్కారము పొంది సార్ధకమునొందన్‌, ద్వన్మహాధర్మజీ

వితమున్‌ లెస్సగ్రహింత్రుగాత! జనముర్విన్‌మీకృపన్‌ సౌఖ్యసం

తతులన్‌దేలుత! చంద్రశేఖరయతీంద్రా೭೭చంద్రతారార్కమున్‌

గీ|| జయము, జయమష్టాశీతి జన్మవాస

రోత్సవస్వామికి బుధసేవ్యునకు, చంద్ర

శేఖరేంద్ర సరస్వతీ, శ్రీ పదమ్ము

లకు, జయమ్ము శ్రీ జయేంద్ర సరస్వతీయ

తీంద్రునకును, శ్రీ కామాక్షిదేవికెపుడు||

గీ|| జయము జయమగు మాగురుస్వామిచంద్ర

శేఖరేంద్ర సరస్వతీ శ్రీ యతీంద్ర

పూజ్యపాదుల కిల; సంపూర్ణశాంతి

భద్రములు: ప్రజలకెల్ల లభ్యమగుగాత!

శ్రీ చరణుల అవతరణ - జ్యోతి (ష) స్వరూపము

స్వస్తిశ్రీ జయనామ సం||ర వైశాఖ బ|| భానువారము, అనురాధా నక్షత్రయుక్త సింహల్నము-జననము, అనూరాధ 4వ చరణము

20-5-1894 at 1-00

మ|| కరుణామూర్తులు, యోగివర్యులు, జయాఖ్య శ్రీవిరాజిల్లువ

త్సల వైశాఖము నందునన్‌, వృషభమాసంబందు, మైత్రిన్‌ప్రభా

కర రాశిన, ప్రభావమ్ముcజెందిరి, జగత్కల్యాణమూర్తుల్‌, జగ

ద్గురులౌ, శ్రీకర చంద్రశేఖర యతీంద్రుల్‌, ధర్మసంస్థాపకుల్‌

మ|| రవి, సౌమ్యుండు, గురుండునున్‌, దశమకేంద్రబందుభాసిల్ల, భా

ర్గవుడున్‌ రాహువుతోడ, అష్టమమున్‌ రాజిల్లగా, సౌరి, కే

తువు, రెండింటను జేర, సప్తమమునందున్‌గూడ భౌముండు, నా

ల్గవ యింటన్‌ శశి, భాసిలంగ, మృగరాట్‌లగ్నమ్మునన్‌దాత్రి ను

ద్భవమున్‌ జెందిరి చంద్రశేఖర యతీంద్రస్వామి తేజోనిథుల్‌

Nadayadu Daivamu  Chapters