శ్రీకంచి కామకోటిపీఠము - కాంచీపురము
శంకరులకయిదవయేట నుపనయనమయినది. బ్రహ్మచర్యాశ్రమానుసారము వారొక దినమున భిక్షాటనమునకు కొన్ని గృహములకుపోయి యొక యింటిదగ్గరనాగిరి. అదియొక పేదదంపతుల గృహము. గృహిణి ఇంటనున్నది. గేస్తుబయట కేగెను. ఆ బ్రహ్మచారికి భిక్షపెట్టుట కింటనేమియు లేనందున నా యిల్లాలు చాలాబాధపడ జొచ్చినది. చాలాసేపు వెదుకగా నెండిన యుసిరికాయ ఒకటి కన్పించినది. దానినే సభక్తిముగా నామెశంకరుల కర్పించినది. ఆ దంపతుల పేదరికము నవగాహము చేసికొనిశంకరులు 'కనకధారాస్తవము'న శ్రీమహాలక్ష్మిని కీర్తించిరి. తత్ఫలితముగ దేవి ప్రసన్నమై యాయింట కనకామలకవర్షము కురిపించింది.
ఎనిమిదవయేడు వచ్చునప్పటికే శంకరులు వేద శాస్త్రములన్నియు నభ్యసించి వృద్ధయైనతల్లికి పరిచర్య చేయుచుండెను. ఒకనాడు తల్లితో శంకరులు పూర్ణానదికి స్నానమునకేగిరి. నీళ్లలో దిగగనే యొకమొసలి యాయనకాలిని పట్టుకొనినది. ఆక్లిష్ట పరిస్థితిలో నాయన తల్లియనుమతిని పొంది సన్యసించిరి. వెంటనే మొసలిబాధ తప్పినది. శంకరులు నదినుండి పైకివచ్చి తల్లిదగ్గర సెలవుతీసుకొని సన్యాసిగా పర్యటనము సాగించిరి. నర్మదానది యొడ్డున గోవిందభగవత్పాదులు తపస్సుచేసుకొనుచుండిరి. శంకరులు వారిదర్శనము చేసికొని వారి శిష్యులైరి. మహావాక్యతాత్పర్యమును గోవిందభగవత్పాదులు శంకరులకు బోధించి యాశీర్వదించి పంపిరి. నాటినుండియే వారికి ''శ్రీశంకరాచార్యుల''ని ప్రసిద్ధికల్గినది.
తర్వాత గుర్వాజ్ఞానుసారము శంకరాచార్యులు కాశీకి వెళ్లిరి. ఆయన ప్రతిదినము అక్కడ గంగా స్నానము చేసికొని విశ్వేశ్వరాలయమునకేగిస్వామి దర్శనము చేసుకొనెడివారు. వేదవ్యాసవిరచిత బ్రహ్మసూత్రములకును, ఉపనిషత్తులకును, శ్రీమద్భగవద్గీతకును వారు భాష్యముల రచించిరి. వారణాసినుండి బదరికాశ్రమమునకేగిరి. అక్కడ నొక్క దినమున గంగకావలియెడ్డున నున్న శిష్యుని సదానందుని ''రమ్మ''ని పిల్చిరి. సదానందుడు మహా గురుభక్తిసంపన్నుడు. అందుచే సరాసరి గంగా ప్రవాహజలముపై పరువెత్తుచు నీవలియొడ్డున నున్న గురువులను చేరుకొనెను. ఆయననీటిపై వచ్చునప్పుడాయన పాదయుగమునకు వలయునంత పెద్ద తామరపూవొకటి నీటిపై కాళ్లక్రింద నాయన మార్గమంతటను కప్పెనట! అందుచేతనే ఆయనకు 'పద్మపాదుడ'ని నామము కలిగినది.
బదరికాశ్రమమున శంకరాచార్యులు యోగశక్తిచే బదరీనారాయణవిగ్రహమును నారాయణ కుండమున కనుగొని అక్కడనే దేవాలయమున దానిని ప్రతిష్టించెను.
ప్రచ్ఛన్న వేషధారియైన వేదవ్యాసునితో దీర్ఘకాలము వేదాంతవిషయ చర్చను శంకరులు సలిపిరి. అప్పుడు శంకరులు షోడశవర్షప్రాయులు. వేదవ్యాసుడుమెచ్చుకొని మఱిపదునారువత్సరముల యాయుఃప్రమాణము శంకరులకు ప్రసాదించెను.
తరువాత శంకరులు కేదారనాథము పోయిరి. బౌతికకాయమునచ్చట నుంచి దివ్యశరీరులై వారు కైలాసమునకుచని పరమేశ్వరుని దర్శించి పంచ స్ఫటికలింగములను, సౌందర్యలహరిని నచ్చటి నుండితెచ్చిరి. కేదారనాథముననున్న తనశరీరమున ప్రవేశించి యచ్చటినుండి యనేక దివ్య స్థలముల దర్శింపనేగిరి. దర్శించిన బహుప్రదేశములలో దేవాలయముల ప్రతిష్ఠింపజేసిరి. చాలా పవిత్రదేవాలయములలో దేవతాస్తుతులను విరచించిరి.
ప్రయాగలోని కుమారిలభట్టునుకలిసి యాయన యాదేశానుసారము మండనమిశ్రునితో శాస్త్రచర్చ జరిపి వాగ్వాదమున వారిని శంకరాచార్యులు జయించిరి. మండనమిశ్రుని యిల్లాలు సరసవాణిని వాగ్వాదమున గెలిచి యామెను శారదాదేవిగా రూపొందింపజేసి తుంగభద్రానదియొడ్టున నున్న శృంగేరిలో నామెను ప్రతిష్ఠింపజేసిరి. ఆమెకు నిత్యార్చన జరుగుటకై శారదాపీఠమును స్థాపించిరి.
శృంగేరినివదలి ద్వాదశజ్యోతిర్లింగములదర్శించిరి. పవిత్రక్షేత్రమైన బదరీనాధమున జ్యోతిర్మఠమును, పూరీజగన్నాథములందు రెండుపీఠములను శంకరులు స్థాపించిరి. తరువాత నేపాళమునకేగి పశుపతినాధునిదర్శించి యచ్చట దక్షిణాచార విధానమున పూజాధికము జరుగునట్లేర్పాటుచేసిరి. బదరీనాధమునగూడ దక్షిణాచారవిధానమే నెలకొల్పబడినది. ఇప్పటికికూడ నిక్కడ కేరళవాసులైననంబూద్రి బ్రాహ్మణులే యర్చకులు.
శంకరులు దక్షిణభారతమున తిరుచిరాపల్లిదగ్గర నున్న జంబుకేశ్వరమునకుజని యక్కడనున్న యఖిలాండేశ్వరిని శ్రీ చక్రాంకితములైన తాటంకములచే నలంకరింపజేసిరి.
చివరకు కంచికేగిరి. కంచి మోక్షదములైనసప్తపురములలో నొకటి. అచ్చటనాయన వరదరాజ స్వామిని, యేకామ్రేశ్వరుని, శ్రీకామాక్షిని దర్శించిరి. శ్రీ కామాక్షీదేవాలయ సముద్ధరణానంతరము అచ్చట కుంభాభిషేకము చేసిరి. అవైదికమత నిర్మూలనముచేసి యచ్చటి పండితప్రకాండులతో శాస్త్రచర్చజరిపి వారినోడించి ''సర్వజ్ఞ'' పీఠము నధిష్ఠించిరి.
బహుపురాతనమైన కంచికామకోటి పీఠమునలంకరించి కైలాసమునుండి తానుతెచ్చిన పంచస్ఫటిక లింగములలో నొక్కటియగు యోగలింగమునకు అర్చనాధిక మచ్చట చేసిరి.
శంకరాచార్యులు కొంతకాలమునకు శరీర త్యాగము చేయదలచి కంచికామాక్షీదేవ్యాలయము వెనుక సిద్ధాసనస్థులై పంచేంద్రియములను మనస్సున, మనస్సును బుద్ధియందును, బుద్ధి నాత్మయందును లయింపజేసి విదేహముక్తినొందిరి.
కంచి కామకోటిపీఠము నలంకరించిన మహాత్ముల పరంపర యాధ్యాత్మిక వైభవమును సంపూర్ణముగా వెలయించుచు వచ్చినది.
శ్రీశ్రీశ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారరువదియెనిమిదవ యాచార్యస్వామి. జగద్గురువులుగా ప్రపంచ ప్రఖ్యాతినందినవీరు మహాతపోమూర్తులు.
నడయాడుదైవమైన యీ మహాత్ముని జీవిత సంగ్రహమును తిలకింతము.