శ్రీ కంచి ఋషీంద్రులు
క్రీ|| శ|| 1894 మే 20వ తేదీన దక్షిణఆర్కాటు జిల్లాయందలి విల్లుపురమున హోయసలకన్నడ స్మార్త బ్రాహ్మణకుటుంబమునకు చెందిన సుబ్రహ్మణ్యశాస్త్రికి తనయుడై స్వామినాధను జన్మించెను. వీరి కుటుంబము చాలాకాలము క్రిందటనే తమిళ దేశమునకు వలసపోయి చోళ##దేశమున నివసింప సాగినది. సుబ్రహ్మణ్యశాస్త్రి కుంభకోణమునందలి ప్రభుత్వోన్నత పాఠశాలలో మెట్రికు పరీక్షయందు ప్రథమస్థానమునంది కొంతకాలముపాధ్యాయుడిగా నుండి తర్వాత విద్యాశాఖలో పనిచేసెను. స్వామి నాధను పుట్టుకకు నాయన విల్లుపురమున నుండెను. మహాలక్ష్మి వీరి ధర్మపత్ని. తిరువాయూరు సమీప గ్రామమైన ''ఇచ్చంగుడి'' యామె పుట్టింటివారి నివాసము. ఈ కుటుంబమునకుజెందిన గోవింద దీక్షితులను మహాపురుషుడు 16వ శతాబ్దిలో ప్రథమ నాయకరాజుదగ్గర మంత్రిగా నుండెను. దీక్షితుల ప్రజాహితనామము ''అయ్యన్''. ఈయన చోళ##దేశమున చాలా ప్రజోపయోగకరములైన యభివృద్ధి కార్యక్రమముల నెరపెను. ''అయ్యన్‌కాలువ'', ''అయ్యన్‌కూలము'' అని వీరిపేర కొన్ని ఇప్పటికిని గలవు.
స్వామినాధను రెండవసంతానము. స్వామిమలై నున్న 'స్వామినాధ'ను వీరికుటుంబమున కారాధ్యదైవము. ఆపేరే స్వామినాధనునకు పెట్టబడెను. ''జీవితము నాకిచ్చిన సందేశము'' అను వ్యాస సంపుటిలో నాచార్యస్వామి తమ బాల్యమునజరిగిన రెండు సంఘటనల నుదహరించిరి.
''తమిళమున మరనాయ్ అనబడు నొకానొక మార్జాల మొకదినయొక గదిలో ప్రవేశించి సన్న మూతిగల యొకరాగిపాత్రలో తనతలను దూర్చినది. ఆ పాత్రలో బెల్లమునుంచి యుట్టిపై పెట్టిరి. ఆ పిల్లితలయాపాత్రయందిరుకుకొనుటచే దానిని తీసికొనలేక యాపాత్రతోనే గదియంతటనురాత్రియంతయు దిరుగుచు గోలచేయజొచ్చినది. ఆ యింటివారును చుట్టుపట్టులవారును నాగోలవినిలేచి యెవరో దొంగప్రవేశించి యుండుననుకొనిరి. ఆ గోలయట్లే యెడతెగక యుదయమువరకును సాగినది. దానిని వినిన కొందరు ధైర్యశాలురు కఱ్ఱలు పట్టుకొని మెల్లగా తలుపులు తెరచిచూతురుగదా 'పిల్లి దానియవస్థ కన్నులకు కట్టినవి'. దానికి త్రాడుకట్టి యొకస్తంభమునకు దానిని కట్టివేసిరి.
కొంత అనుభవశాలురు కొంతసేపు పెనుగులాడి దాని తలనుండి యారాగి పాత్రను లాగివేసిరి ఆపిల్లి చావుబ్రతుకులలో సతమతమవుచుండెను. తరువాత దానిని వదలియుందురు. పేరాశ##చేతతాను భయంకర పరిస్థితులలో జిక్కి పరిసరములవారికి నిద్రలేకుండాజేసి రాత్రి నంతయు నాదుర్దాతో గడుచునట్లు చేసినదా మార్జాలము. కాదు దాని లోభము. ఇది నా జీవితమున ప్రప్రధమ సన్నివేశము.
రెండవది: వీధివెంట బోవు నెవడో యొకడొక నాడు మా యింట నేనొక్కడనే యుండగా వచ్చి నా బంగారు మురుగులపై చేయి వేసెను. 'ఇవి వదులుగా నున్నవి. కొక్కెములను గట్టిగా బిగించి చేతులకు సరిపోవునట్లు బాగుచేసి వెంటనే తేవలసినదని గట్టి సాధికారముగా చెప్పితిని. అతడు సవినయముగా నా యాజ్ఞను శిరసావహించినట్లా బంగారమును దక్కించుకొని వెడలిపోయను. ''పొన్నుస్వామి'' యనబడు ముక్కు మొగమెరుగని యొక దారినిపోయే దానయ్యకు నా నగలు బాగుసేయుటకిచ్చితినను సంతసమున నా ఘనకార్యము మావాండ్రకు పోయి చెప్పితిని. వెంటనే వారాదుర్దాతో నా దొంగను పట్టుకొనుటకు బజారున వెదక సాగిరి. వాని పేరు పొన్నుస్వామి కదా, ''నా బంగారు నగలకు కూడా నామ సార్థకముగా నాతడే స్వామియయినాడు.''
ఈ రెండనుభవములను పురస్కరించుకొని స్వామివారు సహజ వినయముననిట్లు భావించిరి; ''లోకమున తీవ్ర స్వార్థమునకు గురికానివారెవ్వరు నుండరు. కాని కాలక్రమమున పైపై నొకభావము కలుగ జొచ్చినది. ఇది నా స్వభావానుగుణమైనది కూడా; ఈ భూమిపై కొందరు నీతి నియమములను నాదర్శములను కలవారున్నారు. వారు నిస్స్వార్థులు. తమసర్వస్వమును పరోపకారమునకే కావలెనని త్యాగము చేయుదురు. వారి భౌతిక సుఖ సంపదలనే కాదు, ఆధ్యాత్మిక సాధనా తపః ఫలమును కూడా లోక కల్యాణమునకును, సాధు భక్త జనాధ్యాత్మిక ప్రగతికిని త్యాగముచేయు త్యాగధనులు కలరు.''
1899లో నొక గణనీయ సంఘటనము జరిగినది. అప్పుడు స్వామినాధను తండ్రి పోర్టొనోవాలో నుపాధ్యాయుడుగా నుండెను. ఆయన కుమారునితో చిదంబరమున ''ఇలమయిక్కనారు'' దేవాలయమున జరుగు కుంభాషేకమును చూడబోయెను ఇలమయిక్కనారు తిరునీలకంఠనాయనారునకు మోక్షమిచ్చెనను కధ కలదు. సెక్కిలారు రచించిన పెరియ పురాణమున గల యరువది ముగ్గురు శైవభక్తులలో నీలకంఠనాయనారొకడు. తండ్రి కొడుకులు చిదంబరమున శ్రీ వెంకటపతిఅయ్యరు నింట నా రాత్రి యుండిరి. అయ్యరుగారు స్కూళ్ళ ఇన్స్పెక్టరు. (పర్యవేక్షణాధికారి) 'కొంతసేపు నిద్రపొమ్ము. స్వామి దర్శనమునకు వూరేగింపునకు నిన్నులేపి తీసికొనిపోగలనని తండ్రి చెప్పగా స్వామినాధను నిద్ర పోయెను. కాని స్వామినాధను లేచి చూచుసరికి తెల్లవారినది. తండ్రి తనను లేపి స్వామి దర్శనము చేయింపలేదని స్వామినాధను బాధపడుచు తండ్రికి తననిస్పృహను వెలిబుచ్చెను. తాను కూడా దేవళమునకారాత్రి పోలేదని తండ్రి చెప్పి కుమారుని నోదార్చెను. ఆ రాత్రి దేవళమున నిప్పంటుకొని లోనివారు చాలమంది మరణించిరనియు తాము దైవకృపచే వెళ్లకుండుటయే మేలైనదనియుతండ్రి చెప్పెను. ఆరాత్రియే పోర్టొనోవాలో నున్న యతని తల్లికి చిదంబరమున నగ్నిజ్వాలలురేగి కొందరు నిహతులైరని కల వచ్చినది. ఆమె తెల్లవారగనే కలవరపాటున లేచి తనవారికేమైనయాపద కల్గెనేమోయని యాత్రపడుచుండగా పనియవ్వ వచ్చి 'చిదంబరం దేవాలయమున కొందరగ్నికాహుతియైరట' యని తెల్పినది. ఆమె యావేగమున రైలు స్టేషనుకు పోయి చిదంబరము నుండి వచ్చు యాత్రికులను తమవారి క్షేమమును గూర్చి యడుగసాగినది. దైవ కటాక్షమున నామె కుమారునితో భర్త కన్పించెను. ఆమె యానందమునకవధిలేదు. దైవకృపను కొనియాడినది. ఆ రాత్రి యామెపడిన మనోవేదనకును, నా విషాద సంఘటనకు గురిగాక వారిరువురును సురక్షితముగా తిరిగి వచ్చుటకును దైవ సంకల్పమే కారణమైయుండునని యామె నమ్మినది.
1900 సంవత్సరమున స్వామినాధను చిదంబరమున నొకటవ తరగతి చదువుచుండెను. శ్రీ యం. సింగారవేలు మొదలియారను నాయన పాఠశాలలపై యువ పరీక్షాధికారి. ఒక రోజున నాయన స్వామినాధను చదువు స్కూలుకుపోయెను స్వామినాధను మహా ప్రతిభాశాలియని గుర్తించెను. పై తరగతులకు నిర్ణయింపబడిన లాంగ్మను ఆంగ్ల వాచకము తెప్పించి చదువుమని స్వామినాధను నాయన అడిగెను. ఆయన యాశ్చర్య జనకముగా చక్కగా చదివెను. తత్ఫలితముగా స్వామినాధను మూడవ తరగతిలో సరాసరి చేర్చబడెను.
తిండివనమునకు సుబ్రహ్మణ్యశాస్త్రి బదిలీయాయెను. అక్కడ 1906లో స్వామినాధనున కుపనయనము జరిగినది. శ్రీ కామకోటి పీఠమున నరువది యారవ యాచార్యవర్యులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు దక్షిణార్కాటు మండలమున పర్యటించు చుండిరి. నూత్న వటువునకు వారాశీస్సులంపిరి. వారే తర్వాత నాయన శ్రీ కామకోటి పీఠమునకు తన తర్వాత నాచార్యునిగా వాకొనిరి. అరువది యారవ పీఠాధిపతియైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారి నామమే స్వామినాధను ''ఆశ్రమ స్వీకారానంతరము'' ధరించెను. ఇది గణనీయము.
స్వామినాధను పదియవ యేట తిండి వనమున గల అమెరికన్ మిషన్ స్కూలులో రెండవఫారమున చేరెను. ఆశ్చర్యజనకుడైన యాయన యక్కడ నద్భుత శ్యాతినందెను. చాలా భాగము బహుమతులాయనవే. చివరకు బైబిలు విజ్ఞాన విషయిక బహుమతి కూడా యాయనదే. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల కాయన గర్వకారణము. విద్యార్థుల కాదర్శము.
1906 లో స్వామినాధను నాల్గవ ఫారము చదువు చుండగా పాఠశాలలో షేక్సిఫియర్ రచించిన కింగు జానున సంభాషణాత్మక సన్నివేశ ప్రదర్శనము నేర్పాటు చేయదలచిరి. యువరాజు ''ఆర్డరు'' పాత్ర నిర్వహణ యోగ్యులెవ్వరాయని విద్యార్థులలో నా వయసు వారికై నిర్వాహకులు వెదక సాగిరి. ఆ నాటకమున నది ముఖ్య పాత్ర. పాఠశాల ప్రధానోపాధ్యాయునికి స్వామినాధను నసాధారణ ప్రజ్ఞా పాటవములు తెలియుటచే నాయనను నిర్ణయించెను. ఆయనకు పండ్రెండేండ్లే యప్పటికి. స్వానినాధను తలి దండ్రుల యాజ్ఞ నంది యా పాత్రను రెండు రోజులు మాత్రమే యభ్యసించినను పరమాద్భుతముగా ప్రేక్షకజన శ్లాఘాపాత్రముగా నిర్వహించి విజయుడయ్యెను. సంభాషణా చాతుర్యమునను, నటనా కౌశలమునను, ఆంగ్లోచ్ఛారణా దక్షత యందునను నాయన నిరుపమాన ప్రతిభ##నే యెల్లరు దర్శించిరి. మిత్రులిచ్చిన యువరాజు రాచ దుస్తులలో స్వామినాధను సాక్షాద్యువరాజుగ దర్శనమిచ్చెను. అద్వితీయమైన యాతని ప్రదర్శనమున తామెంతయో ముగ్ధులమై తన్మయులమైతిమని యుపాధ్యాయ వర్గము మరునాడు సుబ్రహ్మణ్యశాస్త్రిని కలసి తమ కుమారుని యోగ్యతను శ్లాఘించిరి.
శ్రీ కామకోటి పీఠాధి పత్యము
1906వ సంవత్సరమున కంచికామకోటి పీఠాధిపతులలో నరువది యారవ వారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి తిండివన సమీపమున పెరుముక్కల్ గ్రామమున చాతుర్మాస్యవ్రతమును చేయుచుండిరి. స్వామిని దర్శించి యాశీస్సునందుటకై సుబ్రహ్మణ్యశాస్త్రిగారు సకుటుంబముగా నచ్చటకేగిరి. విశ్వరూప యాత్రా సమయమున కొంత దూరమునుండి స్వామిని స్వామినాధను చూచెను.
మరకణము గ్రామమున స్వామివారు నవరాత్ర్యుత్సవములు జరిపిరి. తిండివనము నుండి మథురాంతకము పోవు రైలు మార్గమున గల శరమ్ గ్రామమున స్వామి నవరాత్ర్యుత్సవముల తర్వాత విడిది చేసిరి. తలి దండ్రులకు చెప్పకుండ స్వామినాధను స్నేహితునితో స్వామిని దర్శించెను. స్వామినాధను వారితో నుండవలెనని స్వామివారు పట్టబట్టిరి. మరి పండితులిద్దరు కూడా నట్లే కోరిరి. మఠమునకు వెళ్లుచున్నట్లు తల్లి దండ్రులకు చెప్పలేదనియు, పాఠశాలకు పోవకున్న చదువు నష్టమగుననియు స్వామినాధను చెప్పెను. అప్పుడు స్వామి యాయననింటికి పోనియ్యకొనెను. మఠమునకు చెందిన బండిలో స్వామినాధను తిండివనమునకు పోయెను. ''తన తర్వాత స్వామినాధనును ప్రఖ్యాత కంచిపీఠాచార్య స్థానమునీయవలెనని కోర్కెయున్నదని'' స్వామివారా యిద్దరు పండితులతో చెప్పిరి.
కలవాయిలో నరువది యారవ యాచార్యస్వామి యయిన పరమ గురువు సిద్థినందిరి. స్వామినాధను పెదతల్లి యేకైక పుత్రుడరువది యేడవ పీఠాధిపతిగా ప్రతిష్టింప బడినారు. ఆయనకు బాల్యముననే తండ్రి గతించెను. చిదంబరమున నాయన 1900-1901 సంవత్సరములలో స్వామినాధను నింటనేయుండి వేదాధ్యయనము చేసెను. తర్వాత నాయన తల్లితో మఠముననే యుండెను. ఏకైక పుత్రుడైన యాయన పీఠాధిపతి కానుండెనని తెలిసి స్వామినాధను తల్లి దండ్రులాతని తల్లి నూరార్ప బోదలచిరి. బండిపై కుటుంబ మంతయు కలవాయికి బోదలచెను. కాని తిరుచిలో జరుగనున్న విద్యాశాఖ సమావేశమునకు సుబ్రహ్మణ్యశాస్త్రి పోవలెనని తంతిరాగా, నాయన తాను లేకుండా తన కుటుంబమంత దూరము బండిలో ప్రయాణించుట మంచిది కాదని, ముందు రైలుపై కంచికి పోయి యచ్చట నుండి బండిపై కలవాయికి పోవుట మంచిదని చెప్పెను.
చారిత్రాత్మకమైన యీ కంచి కలవాయిల ప్రయాణమును, దైవనియోగమన్యధాయయి స్వామినాధను బాల్యముననే శ్రీ కామకోటి పీఠాధిపతి యగుటయును విధివిలసితములని ''నాకు జీవితమిచ్చిన సందేశమ'' నువ్యాసమున నాచార్య స్వామి యుదహరించిరి.
1907 ప్రారంభమున నేను తిండివనము క్రైస్తవ మిషనరీ స్కూలులో చదువుచుండ, గత సంవత్సరము మా పట్టణమున మేము దర్శించిన కామకోటి పీఠస్వామి శంకరాచార్యులు కలవాయిలో సిద్ధినందిరని తెలిసినది. కలవాయి యార్కాటునకు పదిమైళ్ళు. కాంచీపురమునకు ఇరువది మైదు మైళ్లు. మా పెదతల్లి కుమారుడు వేద పండితుడు. మఠముననే యుండి స్వామి సేవ చేయునతడు పీఠాధిపతి యయ్యెనని తెలిసినది.
వితంతువై దిక్కులేని మా పెదతల్లికాతడొక్కడే కుమారుడు. ఆతడు సన్యసింపగా నామె నోదార్చు వారా మఠమున లేరు. అప్పటి పరిస్థితులలో తిండి వనము తాలూకాలో పాఠశాలా పర్యవేక్షకులుగా నున్న మా తండ్రి తిండివనము నుండి సుమారరువది మైళ్ళ దూరముననున్న కలవాయికి, తాము పర్యటించు నెడ్లబండి పైననే యేగవలెనని సంకల్పించెను. కాని తిరుచినాపల్లిలో జరుగనున్న విద్యాశాఖ సమావేశ కారణముగా నా సంకల్పము నెరవేరలేదు.
మా పెదతల్లి కుమారుడు సన్యాసాశ్రమ స్వీకారము చేసినందులకు మా పెదతల్లిని మాయమ్మ నోదార్చ దలచినాతొడను మిగిలిన పిల్లల తోడను కలవాయికి బయలుదేరినది. రైలుపై కాంచీపుర మేగితిమి. అక్కడ శంకరాచార్య మ మున నాగితిమి. నేను కుమార కోష్ఠ తీరమున స్నానమాడితిని. ఆచార్య పరమ గురువులు సిద్ధినందిన దశాహ్న మహా పూజాదికమునకు వలయు సంభారములకై పీఠ కార్యకర్తలు బండిలో నక్కడకు చేరిరి. పారంపర్యమున (తరతరములుగా) వచ్చు మఠపు మేస్త్రి యొకరు తనతో నన్ను రమ్మనెను. మా వారికి వేరు బండి యేర్పాటైనది.
మార్గమున మేస్త్రి ''మీరు మరల తిరిగి యింటికి కార పోవచ్చు ననియు జీవిత శేషము మఠముననే గడుపవలసి వచ్చుననియు చెప్పెను. బహుశః మా పెదతల్లి కుమారుడు పీఠాధిపతి యయ్యెను గదా! బాసటగా నన్నుంచుకొనుట కాయన తెమ్మని కోరెనేమోయని నేను మొదట సమాధాన పడితిని. నాకప్పుడు పదమూడేండ్లు మాత్రమే. నేనాయన కెట్లుపకరించగలనాయని మరల నాలోచించితిని.
ప్రయాణము సాగుచున్నది. మెల్లగా మేస్త్రి నాకు విషయముల నవగతము చేయజొచ్చెను. పూర్వాశ్రమమున నా సోదరుడైన యా స్వామికి జ్వరమువచ్చియందు సంధించినది. అందుచేతర్వాత నన్ను కలవాయి తీసికొని పోవుటకు మా కుటుంబము నుండి నన్ను వేరుచేసిరి. ''తిండి వనమునకే తాను పోయిస్వామినాధనును కలియవలసి యున్నదనియు, కానీ కాంచీపురముననే కలియుట తటస్థించినదనియు మేస్త్రి నాకు వివరించెను. అనుకొనని యీ విచిత్ర సంఘటనకునేను స్తబ్ధుడనైతిని. బండిలో మోకాళ్లపై వంగితిని. నాకు తెలిసింది రామనామ మొక్కటే. ఆ రామరామ స్మరణము ప్రయాణము ముగియు వరకు నట్లే చేయసాగితిని.
కొంత సరికి మా అమ్మ పిల్లలతో వచ్చినది. సోదరి నూరార్పవలెనని వచ్చిన యామెయే యోదార్పవలసిన స్థితిలో బడినది.
స్వామినాధను మహోన్నత పవిత్ర కాంచీపీఠాది పత్యమును స్వీకరించుటకు తంతిమూలమున తండ్రి యాజ్ఞ లభించినది. సత్వరమున నా పట్టాభిషేక మహోత్సవమునకు వలయు సంభారములు సమకూర్చబడినవి. 1907 ఫిబ్రవరి 13వ తేదీన స్వామినాధను శ్రీ కంచికామకోటి పీఠాచార్యులైరి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ నామాంకితులై పూజ్యపాదులరువది యెనిమిదవయాచార్య స్థానమలంకరించిరి. శ్రీ స్వామి వారు పూర్వాచార్యుల సిద్ధి స్థలమునకుచని యరువది యారవ యాచార్య మహా పూజ తాము సలిపిరి.
క్రొత్త స్వామి కలవాయి నుండి కుంభకోణమున కేగిరి. మఠమునకు కుంభకోణము ముఖ్యస్థానము. 18వ శతాబ్దమున నరువది రెండవ యాచార్యుల కాలమున తొండమండలమున జరిగిన రాజకీయా శాంతి వలన పీఠముఖ్య స్థానము కంచినుండి కుంభకోణమునకు మార్చబడినది. కాలగతిని పీఠ కార్యక్రమములును, బాధ్యతలును పెరుగ జొచ్చినవి. ఇప్పుటీ సంస్థ మఠమాత్రముననే పరిమితము కాదు. ఆస్తికులవితరణమువలన లభించిన యాస్తిపాస్తులు చూచుకొనవలెను. మతధర్మ కార్యక్రమములు నిర్వహింప వలెను. అట్టి సంస్థకుయధిపతియై నిర్వహించుట సామాన్య విషయము కాదు. కష్టసాధ్యమైనది. ఆధ్యాత్మిక శక్తి సంపన్నత, లౌకిక వ్యవహార దక్షత లేనిదే యీ యాజమాన్యము సుసాధ్యము కాదు. జగద్గురుత్వముతో పాటు వ్యక్తులను, పరిస్థితులను సుసూక్ష్మముగా పరిశీలింపగల నైపుణ్యము కావలెను. 1835 నుండి యేబది వత్సరములకు పైగానీపీఠమును సర్వాధికారిగా స్వామినాధను పితామహుడైన గణపతి శాస్త్రిగారు నిర్వహించిరనునది మనమెరుగవలెను. వీరి పాలనా దక్షతవలనే పీఠమునకు వలయు రాబడికి తగిన యాధారములు సుస్థిరముగా నెలకొల్పబడినవి. నాటి నుండి మఠ బాధ్యతలు పెరిగినవి. కాచుకొని యున్న బాధ్యతాయుత కార్యక్రమముల నిర్వహణకు తగిన శక్తి సామర్థ్యములను క్రొత్తస్వామి యచిరకాలముననే ప్రకటింప జొచ్చిరి. ఇందుకొరకే స్వామి మొట్టమొదట ముఖ్య స్థలమైన కుంభకోణమఱుగవలసి వచ్చినది.
1907 లోనే కలవాయి విడిచి తిండి వనమున కొలదికాలమే యాగి స్వామి కుంభకోణమునకేగెను. తమ మధ్య మొన్నటి వరకును స్వామినాధనుగా తిరిగిన బాలుడు నేడు మహత్తర శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులుగా వచ్చి దర్శన మిచ్చెనన్న తిండివన పౌరుల కెంత గర్వకారణము? ఎంత యానందదాయకము? అనుభ##వైక వేద్యమే యా నాటి వారి భాగ్య విశేషము. ఆ పట్టణ మా నాడు మహోత్సవరూపిణియైనది.
అమెరికను మిషను పాఠశాలాధ్యాపకులును, విద్యార్ధులును, స్వామి దర్శన సంభాషణముల నెంతో గర్వోన్నతులైరి. ఉపాధ్యాయులతో మధురాలాపములు, నితరులతో శుభవాక్యములు నెరిపి స్వామి మూడు దినముల తర్వాత ప్రయాణము సాగించిరి. ప్లవంగ చైత్రమున కుంభకోణమున శ్రీవారి రాకతో మ్రోడులు చిగిర్చినవి.
పీఠాధిపతియన శిష్యకోటి దృష్టిలో నొక యాధ్యాత్మిక సామ్రాట్టు. రాచరిక మర్యాదలు, చిహ్నములన్ని వైభవములుండును. క్రొత్తస్వామి పీఠాధిపత్య పట్టాభిషేక మహోత్సవమును వైభవముగా శిష్యులు చేయదలచిరి. కుంభకోణ మఠమున 1907 మే 9వ తేదీ గురువారమునాడు పట్టాభిషేకము మహా వైభవముగా జరిగినది. తంజావూరు పాలకుడైన శివాజీ రాచకుటుంబమందలి రాణులు జీజాంబాభాయి సాహెబ, రామకుమారాం బాభాయి సాహెబ పట్టాభిషేక సంభారమునన్నియు రాచమర్యాదలతో జరుగునట్లంపిరి. పట్టపుటభిషేకము మల్లెపూలతో జరిగినది. బంగారు కామాక్షి, యభిలాండేశ్వరి దేవాలయ ప్రతినిథులు తొలుతను, తర్వాత తంజావూరు రాచకుటుంబము వారును, అనేక జమీందారులును, సంపన్న కుటుంబముల వారును వరుసగా నభిషేకించిరి. ప్రఖ్యాత విద్వద్వరులీకార్యక్రమమున ప్రముఖ పాత్రవహించిరి. మఠసింహాసన మధిష్టించి స్వామి సమా విష్ఠులైన ప్రజాపతికి ననుగ్రహ వాక్యములుపలికిరి. బంగారపు టంబారీలో నా రాత్రి తంజావూరు పాలకులంపిన రాచనాగముపై నూరేగింపు జరిగినది, కుంభకోణపు ప్రధాన వీధులలో శ్రీ స్వామి యూరేగింపు మహోత్సవమున కేగిరి. జగద్గురువుగా శ్రీ ఆచార్య స్వామి యాధ్యాత్మిక ప్రభుత్వ మారంభ##మైనది.
ప్రధమ విజయ యాత్ర
విజయ యాత్రవలనగా నాచార్యస్వామి దేశము నలుమూలలకు జరుపుయాత్రాలు. పీఠదైవతము లైన చంద్ర మౌళీశ్వర త్రిపుర సుందరీ దేవుల నిత్య పూజాకార్యక్రమము లందు ప్రజలు శక్త్యనుసారము పాల్గొనుటకును, పీఠస్వాముల తీర్థప్రసాదముల నందుకొని తరించుటకును. స్వామి వారి యాదేశములను, వేదాంత ప్రసంగములనువిని యాద్యాత్మిక జ్ఞాన సముపార్జనమును, జీవిత శిక్షణమును పొందుటకు నీయాత్రలుద్దేశింపబడినవి. ఆచార్య స్వామి పర్యటించిన యెల్ల చోట్లను ప్రజానీకము వారి సమక్షమున సంపూర్ణ లాభమునందుదురు. మహోత్సవముగా దానిని చేయుదురు. ఎదను కదిలించి. జీవునినిద్రలేపు స్వామి ప్రసంగములనుతన్మయులై యేకాగ్రముగా విందురు. ఉన్న యునికిన యున్నత స్థితి నందినట్లు భావింతురు.
1908న జంబుకేశ్వరమునకు స్వామివారి మొదటి యాత్ర యారంభ##మైనది. ఇచ్చటనే యఖిలాండేశ్వరీ దేవికి నాదిశంకరులు స్వయముగా తాటంకముల నలంకరించిరి. పునరుద్దరణానంతరము 1908లో నక్కడ కుంభాభిషేకమున కేర్పాట్లు జరిగినవి. దేవాలయ స్థానికులును, నదికారులును, మన స్వామి నక్కడకు విచ్చేయ నర్థించిరి. కుంభాభిషేకము మహా వైభవముగా యధావిధిగా జరిగినది. శృంగేరీ పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ శంకరాచార్య స్వామి కుంభాభిషేకమైన మరునాడు విచ్చేసిరి. శివగంగ పీఠాధిపతులు శ్రీ సుబ్రహ్మణ్య భారతీ స్వామి వారు కొన్ని నెలల తర్వాత నచ్చటకు వెళ్ళిరి.
జంబుకేశ్వరము నుండి మన స్వామి యిలయాత్తంగుడికి పోయిరి. ఇది రామనాధపురము జిల్లాల్లో నున్నది. ఇచ్చటనే కంచికామకోటి యరువదియైదవ యాచార్య స్వామి సిద్ధినందిరి. మార్గమధ్యమున స్వామి పుతుక్కోటలో నాగి యచ్చట కొన్ని దినములుండిరి. ఇలయాత్తంగుడిలో తమకు పూర్వస్వామికి నధిష్ఠాన పూర్వముగా తమ భక్త్యంజలిని సమర్పించిరి. చాతుర్మాస్యకై యచ్చట నుండి స్వామి జంబుకేశ్వరమునకేగిరి. చాతుర్మాస్య వ్రతానంతరము తంజావూరిలో కొలది కాలమునుండి కుంభకోణమున కేగిరి. 1909లో కుంభకోణమున మహామఖము జరుగుచున్నది. పండ్రెండేండ్ల కొకసారి యీ క్రతువు జరుగును. యాత్రికులకు మఠ యాజమాన్యమున భోజనాది సౌకర్యములు కూర్పబడెను. ఉత్సవమునాడు మహామఖ సరోవరమున శ్రీ స్వామివారు క్రత్వంగ స్నానమునకేగుటను దర్శించి కన్నుల పండువయే ఏనుగంబారిపై పూజ్యపాదులు పెద్ద యూరేగింపున నేగిరి.
విద్యా శిక్షణలు
1909 నాటికి మన స్వామివారికి పదునైదుయేండ్లు. కుంభకోణమునందే మఠ పండితులు రెండేండ్లు సంస్కృత కావ్యములను బోధించిరి. మఠ పాలక వర్గము, కుంభకోణముకన్న విశాలమై, ప్రేక్షక సమూహపు రద్గీ తక్కువగా నుండు ప్రదేశము విద్యాభ్యాసమున కనువుగా నుండునని భావించిరి. అఖండ కావేరికి నుత్తర తీరమున నొక పర్ణశాలా నిర్మాణము చేయబడినది. 1911 నుండి 1914 వరకు శ్రీ ఆచార్యస్వామి యచ్చట. విద్యాభ్యాసమును, వలయుశిక్షయును స్వీకరించిరి బోధ్య బోధకులకదియొక విచిత్రానుభవముగల సంబంధము. బోధకులు మఠ శిష్యులు, బోథ్యులు మఠ గురువులు. అయినను స్వామి సంపూర్ణ పరిగణనమునను గౌరవమునను వారి శిక్షణను స్వీకరించిరి. వారుభయులు తమ కదియనన్య గౌరవముగా సంభావించిరి.
సంగీత శాస్త్రజ్ఞులెవ్వరైన తటస్థించినచో వారితోటి సంభాషణచె గానకళా నైపుణ్యమును, విషయాన భవమును పెంపొందించుటకు స్వామి యాయవకాశమును వినియోగించెడివారు. ప్రకృతి సౌందర్య వైభవ పులకితులగుటకు కావేరీ ద్వీపముల కవకాశము కల్గినపుడెల్ల వెళ్ళెడివారు. ఛాయా చిత్రకారులు కూడా నచ్చటి పరిసరముల సౌందర్య చిత్రణముల సేకరించుట కేగుదురు. ఛాయాచిత్ర కళయందు కూడా స్వామి కభి నివేశము కలదు. ఖగోళ శాస్త్రమునందును. గణిత శాస్త్రము నందును వారికి పరిచయము కలదు.
1914లో నాచార్యస్వామి కుంభకోణ మఠమునకు మరలి వచ్చిరి. అప్పటికి వారికిరువదేండ్లు. అప్పటికే వారొక విజ్ఞాన సర్వస్వము. పండితులెవరైన వారికడకు నేగిన వారు వారివారి యభిమాన శాస్త్రములలో లోతైన ప్రశ్నలను వేసి విషయావగాహము చేసెడివారు. కుంభకోణమున విద్యాభ్యాస సమయమున వారు గంగైకొండచోళపురమునకు పోయి యచ్చటి శాసనములను తిలకించుట, దేవాలయ వాస్తుకళాపరిచయము చేసికొనుట, యొక పనిగా పెట్టుకొనిరి. ఇట్లు స్వామి సర్వజ్ఞత్వమునకును, కామకోటి పీఠాధిపత్యమునకును వలసిన శక్తిసామర్థ్యములను బహుముఖముగా సంతరించుకొనిరి.
స్వామికి పీఠ వ్యవహార నిర్వహణ యోగ్య వయస్సు రాకుండుటచే 1911 నుండి 1915 వరకు పీఠము వార్డుల పర్యవేక్షణమున నడుప బడుచుండెను. మే 1915న స్వామికి నిరువది యొక్కయేడు దాటినది. తదాది పీఠ వ్యవహారముల నిర్వహణ మాత్రము నియమితులైన యుద్యోగులును, కార్యకర్తలును చేయుచుందురు. పీఠ నియమితుల కిచ్చు నాజ్ఞా పత్రములపై పీఠముద్ర మాత్రమే యుండును గాని పీఠాధిపతి చేవ్రాలుండదు.
ఆ యేడు శంకర జయంత్యుత్సవములు పెద్ద ఎత్తున జరిగినవి. మఠ యాజమాన్యమున ''ఆర్య ధర్మ'' యను సంచిక వెలువడినది. 1916 అక్టోబరులో నవరాత్ర్యుత్సవములు మఠమున దేదీప్యమానముగా నూత్న శోభతో నిర్వహింప బడినవి. సుబ్రహ్మణ్య భారతి యను కవీంద్రుడు శ్లాఘ పూర్వకముగా నొక గణనీయ వ్యాసమును కూడ రచించెను. దుర్గా లక్ష్మి సరస్వతీ రూపిణిగా త్రిమూర్త్యాత్మకమైన జగన్మాతకు నవరాత్ర్యుత్సవము లేటేట చేయబడు పండుగలు. సంగీత విద్వాంసులలో పేరెన్నికగన్న మహామహులు స్వామి సమక్షమున తమ గాన నైపుణిని ప్రదర్శించిరి. విజయదశమినాటి రాత్రి యాచార్య స్వామి పట్టణమంతను పెద్దయూరేగింపున నేగిరి.
ప్రాచీన విద్యాభ్యుద్థరణకును, సాంఘిక సంక్షేమమునకును, శ్రీ స్వామి ప్రారంభించిన తొలి కార్యక్రమములు చాలావరకు ఫలవంతము లైనవి. ''శాస్త్ర రత్నాకర'' మొదలైన బిరుదులతో విఖ్యాత పండితోత్తములు గౌరవింబబడిరి. హిందూధర్మ విషయిక వ్యాస రచనలో పోటీలు కళాశాలా విద్యార్థులకు జరుపబడినవి. విద్యా సంస్థలలోను, కళాశాలలోను గల యోగ్యవిద్యార్థులకు నుచిత వేతనము లేర్పాటు చేయబడినవి. ఉచితాయుర్వేద వైద్యశాల మఠమున నెలకొల్పబడినది. 1914-18లో స్వామివారు కుంభకోణమున నుండగా ప్రతి దినము సాయంకాలమున గాన సభలుగాని, విద్వద్గోష్ఠులు గాని జరుపబడెడివి. ఆచార్యస్వామి యను గ్రహమునకై పండితులును సంగీత విద్వాంసులును నాత్రపడెడివారు. దర్శకత్వమునకును, ప్రోత్సాహమునకును, శాస్త్రవేత్తలు, ఇంజనీరులు, నధికార వర్గమును, కళాశాలా చార్యవర్యులును, స్వామి దర్శనము చేసి కొనుచుండెడివారు. ఇతర మతాను యాయులు, ''వారివారి మతసిద్థాంతములందును, విశ్వాసములందును, స్వామివారికి గట్టిపరిచయము కలదనియు, నేయే స్థాయికి చెందినను, నేయే రకమునకు చెందినను. నాధ్యాత్మిక కృషిని వారు మెచ్చు కొనెడి వారనియు,'' సంతసించెడివారు. స్వామి సాంగత్యముగల యెవ్వరైనను వారిని జగద్గురువుగా గణించి తీరెడివారు.
సంపూర్ణ భారతదేశ యాత్ర
(1919-1939)
మన పవిత్ర భారతమున నాచార్యస్వామి పర్యటన మార్చి 1919లో మొదలిడిరి. సుదీర్ఘకాలికమై ప్రయాస బహుళ##మైన యీ పర్యటనయావద్భారత ప్రజానీకమునకును స్వామి దర్శనమును, నాశీః కటాక్షముల నందునదృష్టముకల్గించుటచే పరమ ప్రయోజనకారి యైనది. స్వామి యథునాతన ప్రయాణ సౌకర్యములనే మాత్రమునుపయోగింపక చాలావరకు పాదయాత్ర చేయుచు, తప్పనిసరియైనపుడు మాత్రమే మేనానువాడిరి. మఠోద్యోగులును, పండితులును, వేదాధ్యయనపరులును, పరిచారకా గణము, గోవులు నేన్గులు మొదలైన జంతువులును స్వామి ననుసరించిరి. పూజ్యపాదులు స్వామి మార్గమున నాగిన స్థలముల నెల్ల భక్తకోటి సాధ్యమైనంత యెక్కువ కాలము స్వామి సన్నిధిని సేవించుకొని వారి యనుగ్రహ పాత్రులయ్యెడివారు. నిత్యానుష్ఠాన పీఠ పూజాదిక విధి నిర్వహణముతో, పాటు భక్తజనాదరణ, యభ్యాగత సమ్మానము, దయతో నెరవేర్చెడివారు. మఠ నిర్వహణాధికారులకును, మత ప్రజాభ్యుదయ సంస్థలకు సలహాలను నిచ్చుట స్వామివారి దినచర్యలలో ముఖ్యమైనవి. రోజు మొత్తమున రెండు మూడు గంటల విశ్రాంతి మాత్రమే తీసికొనెడివారు. ఉపవాసముల మధ్య నప్పుడప్పుడు స్వల్పా హారము తీసికొనెడివారు. రోజురోజు పెరిగెడి పనియొత్తిడిలో విసుగువిరామము లేకుండ స్వామి ప్రసన్నముగా ప్రతి విషయము సావధానముగా సంపూర్ణముగా విచారింపగలుగుట యద్భుతావహమైనది. ఆత్మోన్నతిగల స్వామి స్థితి ప్రజ్ఞులనుట నిర్వివాదాంశము.
కుంభకోణము తంజావూరు జిల్లాలో నున్నది. మార్చి 1919లో స్వామి మొదటిమూడు సంవత్సరములును తంజావూరు మండలమునగల మారుమూల యాత్రాస్థలములకు కూడ నేగిరి. కుంభకోణమునకు తూర్పున నైదుమైళ్ళ దూరముగల వెప్పత్తూరు గ్రామమున 1919లో చాతుర్మాస్య వ్రతము జరిపిరి. ఈ వ్రతము వర్షకాలమున జరుపబడును. వర్షకాలమున భూమిపై సంచరించు క్రిమికీటకాదులకుగాని మఱియే యితర ప్రాణికిగాని జీవహింస జరుగునను భయమున సన్యాసులు పాదచలనము చేయరు. ఈ వ్రతోద్దేశ్యమిది. ఆషాడ పూర్ణిమ వ్యాసపూర్ణిమ. నాటినుండి రెండుమాసములు సన్యాసులొక ప్రదేశమున నుండవలెను. వ్యాసభగవానుడు బ్రహ్మ సూత్రకర్త స్వామివారి బసకు పోయి భక్తులు సవినయముగా ప్రణమిల్లెడివారు.
1920లో మహోదయ శుభావసరమున నాచార్య స్వామి వేదారణ్య సముద్రమున స్నాన మాచరించిరి. ఈ సంవత్సరము వ్యాసపూజ, చాతుర్మాస్య వ్రతము మాయవరమున జరిగినవి. స్వామి యిచ్చట నున్న యొకదినమున నొక మహమ్మదీయవృద్ధు స్వామి దర్శన మర్థించెను. అనుజ్ఞ దొరకగానే యాతని యానందమునకు మేరలేదు. స్వామి యాదేశానుసారము ముసల్మాను ఇస్లాము మత సిద్ధాంతముల నచ్చటి శ్రోతలకు వివరించెను. చివరకు నాతడు సెలవు గైకొని వెళ్లుచు స్వామి సాక్షాత్తు భగవంతుడే యనెను.
1921లో కుంభకోణమున మహామఖోత్సవము జరిగినది. పరిసరముల పర్యటించు స్వామి కుంభకోణమునకేగెను. కాని మఠమునకు పోలేదు. విజయయాత్ర పరిసమాప్తి కాకుండ మఠమున కాలు పెట్టకూడదను నియమము కలదు. కాంగ్రెసు వలంటీరు లనేకులు మహోత్సవము ప్రశాంతముగా క్రమబద్థముగా జరుగునట్లు సాయపడిరి. ఖిలాఫతు వలంటీరుల బృందము కూడ కలదు. వారాచార్య స్వామిని భక్తి ప్రపత్తులతో సేవించుకొనిరి. వారి సేవానిరతికి స్వామి సంతసించి వారినాశీర్వదించిరి. ప్రముఖ జాతి నాయకులలో నొకరైన సుబ్రహ్మణ్యశివ పట్టియవరమున నాచార్య స్వామిని కలిసి మాతృదేవ పరిపాలనా స్వాతంత్రమునకును భారత ప్రజానీకము దైవ భక్తి సంసన్నమగుటకును ననుగ్రహింపుడని యర్థించెను. స్వామి తక్షణమే యాశీర్వదించి యా రెండు మహాశయములును నెరవేరగలరని సెలవిచ్చిరి. 1918లో ఖాదీ యుద్యమము ప్రాముఖ్యము నందినప్పటి నుండి స్వామి ఖద్ధరునే ధరించెడి వారనునది ప్రశంశనీయము.
స్వామి తంజావూరు మండలమున పల్లెపల్లెకు సంచరించు దినములలో నొకనాడు రెండు వందల మంది హరిజనులు స్నానముచేసి శుభ్ర వస్త్రములు ధరించి ఫాలములను విభూతి నలది స్వామి దర్శనార్థము వేచి యుండిరి. స్వామి ప్రసన్నులై వారి యోగ క్షేమములనరసి కొంతసేపు వారితో సంభాషించిరి. వారికి నూత్న వస్త్ర ప్రదానము జేసిరి. స్వామి యాత్రలలోనిట్టివెన్నో తటస్థించినవి. పౌర ప్రజానీకమనిన స్వామి కంతులేని దయ. సంపన్నులెల్లరు దీన సముద్దరణము చేయవలయునుననియు. మఠమీ కార్యనిర్వహణమున నగ్రగామి కావలయుననియు వారెప్పుడును చెప్పెడివారు. స్వామి రామేశ్వరమునకేగి సేతు సైకతమును గొనిరి. దీనిని గంగలో కలుపుట యాచారం. ఇదియా సేతుహిమాచల మాధ్యాత్మిక నమైక్యమందవలెనను యాశయమునకు చిహ్నము.
రామనాధపురము, మధుర, తిరునల్వేలి మండలములలోపర్యటించి స్వామి జంబుకేశ్వరము చేరిరి. అది తాటంక ప్రతిష్ఠాసమయము. 1908లో స్వామి యచ్చటి కేగిన సంగతియు, నాది శంకరులఖిలాండేశ్వరీ దేవికి తాటంక ప్రదానము జేసిన విషయము ముందే తెలిపితిమిగదా. తత్పూర్వము దేవి యుగ్రమూర్తిగా నుండెడి దనియు నాదిశంకరులు శ్రీ చక్రాంకిత తాటంక ప్రదానమున ప్రసన్నను జేసిరనియు గాధ. అప్పుడప్పుడీ తాటంకములకు వలసిన మరమ్మతు జేసి మరల పెట్టుచుందురు. ఈ మహత్తర కార్యక్రమ నిర్వహణ బాధ్యత శ్రీ కంచికామకోటి పీఠాధినేతలది. 1846లో నొకసారి తాటంక పునరలాకరణం జరిగినది. మరలనిప్పుడు 1923లో నీ పవిత్ర మహోత్సవ కార్యక్రమమునకె మన స్వామివారు జంబుకేశ్వరము వెళ్ళిరి. మహా భక్తులెల్లరు సమావిష్ణులై ఈ మహోత్సవమున పాల్గొందురు. ఈ యుత్సవమున ప్రతి విషయము నతిశ్రద్ధాభక్తులతో జాగురూకముగా నిర్వహింపబడును. పునరుద్దరణానంతరము నచ్చటి కామకోటి పీఠమఠము పునః ప్రారంభింప బడినది. మఠముననొక వేద పాఠశాలయు, వేదాధ్యయమున కేంద్రమును నెలకొల్పబడినవి. 1922లో తిరుచ్చిలో జరిగిన యొక సభలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన యుపనయనము జంబుకేశ్వరము నందలి కామకోటి పీఠమఠమందే జరిగినట్లు చెప్పెను.
తాటంక ప్రతిష్ఠానంతరము స్వామివారి యాత్ర ప్రారంభ##మైనది. సదాశివబ్రహ్మేంద్రుల యధిష్ఠానముగల నెరూరునకు స్వామి వారు మొదట వెళ్ళిరి. కుంభకోణమునకు సమీపమునగల ''తిరువిశైనల్లూరున'' పుట్టిన సదాశివబ్రహ్మేంద్రు లతిత్వరలో జీవన్ముక్తులై కావేరీ తీరప్రాంతమందవధూతేంద్రులుగా సంచరించుచు సమకాలిక ప్రజానీకముపై నాయన యాశీఃప్రభావము చూపెడివారు. శ్రీ పరమ శివేంద్ర సరస్వతి యాయన విద్యా గురువు. సదాశివేంద్రులనే కాద్వైత గ్రంథములను భక్తి రసముతో గూడిన కీర్తనలను రచించిరి. నెరూరులో స్వామివారున్నప్పుడు సదా శివబ్రహ్మేంద్రుల యధిష్ఠానముననే దినమున చాలా సేపు నడిపెడివారు. అప్పుడు సదాశివ బ్రహ్మేంద్రుల యాదర్శ జీవితమును నమూల్య సందేశములు నిచ్చిన ఫలితముల గూర్చి స్వామి ప్రశాంతంగా సంభావించెడివారు.
తిరుచ్చి సమీపమునగల కులుమని గ్రామమునకు స్వామి నెరూరునుండి వెళ్ళిరి. క్రైస్తవ మతమును స్వీకరించి యందిరువది సంవత్సరములు జీవితము గడిపిన శ్రీ యఫ్. జి. నటేశ అయ్యరు తిరుచ్చిలోనే యుండెడి ప్రముఖ వ్యక్తి. ఒక దినమాయన కేరళకు చెందిన యొక యువకుడు క్రైస్తవ మత స్వీకారమునకై తిరుచ్చికి రాగా వానిని వెంట నిడుకొని స్వామి కడకుపోయెను. స్వామి యాయువకునితో కొలది దినములు మాట్లాడి హిందూ ధర్మ ప్రధాన సూత్రములను వానికెరుక పరచిరి. ఇతర మతములలో గల యాధ్యాత్మిక మార్గములు హిందూ మతమున లేనివి గావని స్పష్టపరచిరి. మించి హిందూ మతమునకొన్ని ప్రత్యేక ప్రయోజనములు గూడకలవు. కాని హిందూ మతమును వదిలి పర మత స్వీకారము చేయుటకు హేతువేమియుగానరాదనిరి. ఇది విని కేరళనుండి వచ్చిన యువకుడు తాను పుట్టిన హిందూమత మహత్యమునందు విశ్వాస పూర్ణుడై యింటికిపోయెను.
ఒక సంవత్సరము చెట్టినాడు, పుదుక్కోట సంస్థానములలో స్వామి సంచారముచేసిరి. తత్సమయమున ననేక పండితులు, రాజకీయ కార్యకర్తలు, జాతీయ నాయకులు, నాచార్య స్వామిని దర్శించి, వారియనుగ్రహపాత్రులైరి. 1925 లో డా.వి.వి. స్వామినాధ అయ్యరు అను ప్రపంచ ఖ్యాతినందిన తమిళ విద్వద్వరుడు ''దాక్షిణాత్యకళానిధి'' యను బిరుద ప్రదానము నందెను, స్వామి బసకు దగ్గరలో నున్నంత కాలమాయన స్వామి చేయు పీఠ పూజాదికమును శ్రద్ధగా దర్శించెడివారు. తన పూర్వానుభవమును స్మరించుకొని యాయన ఇట్లు చెప్పెను. ''నాకు పదునెనిమిదేండ్ల ప్రాయమున నరువదియవ పీఠాధిపతియైన శ్రీ మహాదేవేంద్ర సరస్వతిస్వామి దర్శనము చేసికొంటిని. నాటి యనుభూతి విశేషమే నాకు నేడు కల్గుచున్నది.'' స్వామి చెట్టి నాటి పర్యటనలో నొక మహా శివభక్తుడు డైన గరము రామనాధము చెట్టియారు కూడనేతాదృశాను భవ విశేషమే స్వామి పూజా దర్శనమున నందెను. చెట్టినాటి ప్రజలు, శడియపత్తిలో నొక పెద్ద యూరేగింపును మహావైభవముగా నేర్పాటు చేసిరి. ఈ యూరేగింపున స్వామి చెట్టియారుకై నిరీక్షించిరి. కాని యాయన కన్పింపలేదు. ఉత్సవానంతరము చెట్టియారు సమాచారమునుగూర్చి స్వామియడిగిరి. జన సమూహమున కావలనిలబడివున్న యున్న చెట్టియారు పలికెను. ఊరేగింపున కనబడలేదేమని స్వామి యడుగగా ''నా రాత్రి పాలకీనిమోయు భాగ్యము కలిగినదని'' చెట్టియారు సమాధానమిచ్చెను. స్వామి యాదరపాత్రుడైన మఱియొక పేరెన్నిక గన్న తమిళ సంస్కృతి పండితవర్యుడు శ్రీ పండితమణి యమ్. కదిరేశన్ చెట్టియారు. వీరును చెట్టినాటి వారే. ఆచార్యస్వామియు, పండితమణియు ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథములను గూర్చియు, తమిళ సంస్కృతాధ్యయనములయభివృద్ధిని గుఱించి తీసికొనవలసిన చర్యలను గూర్చియు సమాలోచన చేసిరి.
అప్పటిలో స్వామి దర్శనము చేసికొనిన రాజకీయ వేత్తలు జాతీయ నాయకులలో ప్రముఖులు శ్రీ సి.ఆర్.దాసు, శ్రీ సత్యమూర్తి, శ్రీ ఎ.రంగస్వామి అయ్యంగారు, శ్రీ జమన్‌లాల్ బజాజ్, శ్రీ సి.రాజగోపాలచారి మొదలైనవారు. చివరివారు స్వామిని 1926 లో జంబుకేశ్వరమున కలిసిరి. శ్రీ సి.రాజగోపాలాచారి జమన్‌లాల్‌బజాజ్‌ను లోనికంపి తాను వెళ్ళలేదు. స్వామి శ్రీ రాజగోపాలాచారి లోనికి రాకుండుటకు కారణమడిగిరి. తానానాడు స్నానము చేయలేదని యాయన సమాధానమిచ్చెను. అప్పుడు స్వామి జాతీయ సంక్షేమ కార్యక్రమనిమగ్నులైన వారికి స్నాన పానాదులకవకాశముండక పోవచ్చుననిరి. శ్రీ రాజగోపాలాచారి జీవితమునే జాతిసేవ కంకితముచేసెను. కాన నెట్టిపరిస్థితులలోనైన నెప్పుడైన నాయన వచ్చుటకభ్యంతరముండదనిరి. స్వామి రాజకీయ వేత్తలకు జాతీయ నాయకులకు నొక విషయము స్పష్టముచేసిరి. తాముసన్యాసుల మగుటచే రాజకీయ పక్షముతో నైక్యభావము నందజాలమనిరి. కాని యొక్క విషయం మాత్రం ప్రజాసేవకుల నెల్లరనుకోరుదుమనిరి. ప్రజాశ్రేయమేధ్యేయంగా తమ కార్యక్రమములు వారు చేయవలననియు, ప్రజాకోటి దైవభక్తి థర్మానురక్తి కలవారలగునట్లు చేయుట దేశ సేవకుల ముఖ్య కర్తవ్యమనియు వారు నచ్చ చెప్పిరి.
1926 జరిగిన యొక సంఘటన స్మరణీయం. స్వామి వరంబక్కుడినుండి పట్టుకోటకు పయనించు చుండిరి. స్వామికి వీడ్కోలునిచ్చు వారిలో కొందరు ముసల్మానులు నుండిరి. గౌరవ సూచకముగా నొక మహ్మదీయుడు స్వామి పాలకీని చేతులతో తాకుచుండెను. మూడు మైళ్లు పోయిన తర్వాత స్వామి వారాపి యా ముసల్మాను క్షేమ సమాచారము లడిగెను. అతడు తన వైయక్తికవిషయముల కొన్నిటిని స్వామి యాదేశమునకై తెలిపి తాను రచించిన పద్దెములు తెచ్చిన ఫలపుష్పములు సమర్పించుకొనెను. స్వామి యాజ్ఞమేరకు నాతడు కవితా గానము చేసి భావవివరణము చేసెను. సెలవునంది వెళ్ళుచునాతడు ''నా కన్నులకు స్వామి యల్లాగా కన్పించుచున్నాడు. ఐహిక బంధ విమోచనమునకు స్వామి దర్శన భాగ్యము చాలునదెను.
1923 జులైలో స్వామియుదయార్పాలయముల కేగెను. కామకోటి పీఠమునకు సన్నిహిత్యముగల యొక జమీందారి యది. కంచి నుండి కుంభకోణమునకు మఠముమార్పబడునప్పుడునప్పటిజమీందారరువది రెండవ యప్పటి పీఠాధి పతులవారికి చాలా సహాయము చేసెను. నాటినుండియు నీ పీఠమునకును జమీందారీకిని సన్నిహిత సంబంధ మేర్పడినది. మన స్వామి 1920 లో నా జమీకి వెళ్ళిన శుభావసరమున నా జమీందారు సకుటుంబముగా సప్రజానీకముగా నాచార్య స్వామికి ఘన స్వాగతమిచ్చెను. తన్మహోత్సవ సూచకముగా పీఠమునకు మూల్య బహుమానా లర్పించెను.
తిరుప్పడిరిప్పురియారున స్వామి బస చేయగా తమిళ విద్యన్మణి. జాతీయ కార్యకర్త్రి యొక వృద్ధ స్వామి దర్శనం చేసికొనినది. ఆమె పేరచ లాంబిక. ఆమె మహాత్ముని జీవిత విశేషములతో నొకయైతిహాసిక కావ్యం రచించినది. పూర్వాశ్రమమున స్వామి పసితన మామె యెరుగును. స్వామి పూర్వాశ్రమ జనకుల కామె శిష్యురాలు. తన గురుపుత్రులు జగద్గురువులుగా భాసించుట విని కనియానంద బాష్పములామె కనుల స్రవించినవి.
కామకోటి పూర్వాచార్యులలో నొకరు సమాధి నందిన వడవంబాళము దక్షిణ పెన్నానది యుక్త తీరమున గలదు. శైధిల్యమునందుచున్న యా సమాధి స్వామి యాజ్ఞానుసారం పునర్నిర్మాణం చేయబడినది. యధావిధి నర్చనలచ్చట జరుగుటకు వలయు నేర్పాటు చేయబడినది.
పుదుచ్చేరియొద్ద స్వామికి పరాసు ప్రభుత్వాధికారులు ప్రజలు రాచమర్యాదలతో స్వాగత మిచ్చిరి. గృహ దహన కారణంగా తిరువారున ప్రఖ్యాతినందిన దేవాలయరథము పాడయినట్లుగా నొక వార్తస్వామి పుదుచ్చేరిలో నున్నప్పుడు వారికి జేరినది. అప్పుడు తంజావూరు మండలపుబాస్తిక ప్రజలందరు నొక్కటిగా కలిసిపోయి సరిక్రొత్త వాహనము నిర్మింపజేయుటకు నిశ్చయించుకొనిరి. స్వామి వారాయత్నమున తమ యాశీస్సుల నందజేసిరి. వారి యాశీః ప్రభావమున రెండు వత్సరములలోనే పాత వాహనమునకు గొప్ప దనమున నేమాత్రము తీసిపోని క్రొత్తది తయారు చేయించబడినది. ఈ ప్రశంసనీయమైన కార్యమందు ఏలూరు సుబ్బరాయ వడయారను నాయన ప్రముఖ పాత్ర వహించినాడు. తరువాత నాయన శ్రీ నారాయణ బ్రహ్మానందయను నామమున సన్యసించెను. సన్యాసాశ్రమమున నున్నను నాయన ప్రాచీన దేవాలయ పునరుద్ధరణ చేయించి కుంభాభిషేకముల నెరవేర్చుటలో చాల కృషిచేసెను.
1927 మార్చిలో స్వామి సేలం మండలమున పర్యటించెను. ఈ రోజున నొక మహమ్మదీయుడు స్వామిపై గొన్ని సంస్కృత శ్లోకముల రచించి సమర్పించుకొనెను. శివలింగాకారము వచ్చునట్లుగా నొక కవిత యందలి యక్షరములు గళ్ళలోవ్రాయబడినవి, ఆకవి వానిని స్వామికి వినిపించి భావమును తెలిపెను. ఆయనను సంస్కృతభాష నెట్లభ్యసించితి వని స్వామి యడుగగా నాతడు తన పూర్వులు సంస్కృత పండితులనియు, తాను సంస్కృతమును తన తండ్రి యొద్ధనే చదువుకొంటినని యాతడు స్వామికి నినేదించుకొనెను. సంస్కృతమున నాతడు చేసిన కృషిని స్వామి మెచ్చుకొని సంస్కృత వ్యాసంగము మానవలదని సలహా నిచ్చెను.
1927 ఏప్రిల్‌లో కోయంబత్తూరు వెళ్ళి మే మొదటి వారం స్వామి పాలఘాటు చేరిరి. ఆదిశంకరుల జన్మస్థలమైన కేరళ స్వామిరాకతో నుత్సాహ పూరితమైనది. ఆది శంకరుల యనంతర పీఠాధి పతులలో ప్రముఖులై, వారియాదేశ నిర్వహణము నందును, జీవితాదర్శము నందును నపర శంకరుడేయని కేరళ ప్రజ వీరిని భావించిరి. అప్చటి శిష్య వర్గమునకు స్వామి మళయాళమున సందేశమిచ్చిరి. వారు స్వామిని మళయాళము వారే యనుకొనిరి. ఈ పాలఘాటు పర్యటనముననే శ్రీ టి. యం. కృష్ణస్వామి అయ్యరు శిష్యవర్గంతో స్వామిని దర్శించి తిరుప్పుగల్ భజనచే సేవించు కొనెను. శ్రీ అయ్యరు మదరాసులో ప్రముఖ న్యాయవాదిగా నుండి తర్వాత తిరువాన్కూరు ముఖ్యన్యాయాధికారి యయ్యెను, వారి భక్తి విశేషమునకు స్వామి సంతసించి యాశీర్వదించి ''తిరుప్పుగళ్ మణి'' యని బిరుదు నిచ్చిరి.
1927వ సంవత్సరం చివరి భాగమున మహాత్మగాంధి దక్షిణ దేశ పర్యటన చేయుచుండెను ఆయన మన స్వామి మాహాత్మ్యమును విని వారిని జూడవలెనని కుతూహలపడెను. పాలఘాటు నందలి నెల్లిచెరిలో వారి సమావేశం జరిగినది. స్వామి బసచేసిన చోటనున్న గొడ్లచావడిలో వారు కలిసిరి. శాంతికి చిహ్నమైన ఖద్దరు కాషాయాంబరాలను ధరించి యాదిశంకరుల తదనంతాచార్య వర్గమున నసలైన పీఠాధిపతీ వీరేయయ్యువట్టినేలపై గూర్చుండిరి. సాధారణ కర్షక జీవితాధర్శమును స్వయంగా స్వీకరించిన జాతీయ నాయకుని గూర్చి తొలుతగా నెరుగు నవకాశం గల్గినందులకు స్వామి చాల సమ్మాదము నందెను. మహాత్ముడు హిందీలోను స్వామి సంస్కృతంలోను సంభాషించిరి. చాలా సౌహర్దమున సంభాషణ జరిగినది. ఈ యధ్వితీయ సమావేశమున బహుప్రయోజన కారియని తర్వాత మహాత్ముడు తృప్తిని వెలిబుచ్చి సెలవు తీసికొనెను. వారి సమాగ సమయమున నొక సంఘటన జరిగినది. మహాత్ముడెంతగా నాకర్షితుడయ్యెనో దీననెరుగవచ్చు. మహాత్ముడు సాయంకాలమారుగంటల తర్వాత భుజింపడు. అప్పటికైదున్నర గంటలైనది, అందుచే శ్రీ సి. రాజగోపాలచారి మహాత్మునితో సాయంకాల భోజనవేళయతిక్రమింవగలదని తెలియజేసెను. దానిపై మహాత్ముడు ''ఆచార్యస్వామితో జరుగు సంభాషణమే తన కానాటి సాయంకాల భోజనమ''ని చెప్పెను.
గురువాయూరు, తిరుచూరు, ఎర్నాకులం, క్విలను త్రివేండ్రములతో సహా చాలా ప్రదేశాలను కేరళలో స్వామి చూచెను. కొచ్చిను, తిరువాన్కూరు సంస్థానాలు స్వామికి భక్తి గౌరవముల ప్రకటించినవి. అలపిరిలోగల చంద్రశేఖరేంద్ర పాఠశాలకు పోయి విద్యార్థి బృందము నాశీర్వదించిరి. కన్యాకుమారికి జని సాగర సంగమమున పవిత్ర స్నానమాచరించిరి. కేరళ యాత్ర ముగించుకొని, యుత్తర దేశగమనోన్ముఖులైరి. జాతీయ శక్తుల కోర్కెల తిరస్కరించుట బ్రిటిషు ప్రభుత్వమునకు తగదని నచ్పుచెప్పుటకై యావద్భారత సర్వరాజకీయ పక్ష సమావేశము విజయవంతంగా జరుగుటకు తాను చేయు యత్న సాపల్యమునకై యాశీర్వదింపుడని సర్. తేజ బహదూర్ సప్రూ స్వామిని మథురలో దర్శించెను. ''శాంతియుత మార్గముల ప్రజాదరము సంపాదించుట మొట్టమొదటి కర్తవ్యమ''ని స్వామి సపూకు తెలిపి, ఆ ఘార్గమును జేయు నే కృషికైనను తమ శుభాకాంక్షలెప్పుడు నుండు ననిరి.
1929 ఫిబ్రవరిలో దక్షిణార్కాటు మండల సంచారముమొదలైనది. ఆవత్సరము చాతుర్మాస్యవ్రతము మనలూర్పట్టమున జరిగినది. ఒక నెల రోజులు స్వామి జ్వర పీడితులయ్యు లెక్కసేయక నిత్య స్నానానంతరం దైనందిన పూజా కార్యము జరిపెడివారు. మెల్లగా జ్వరము తగ్గినది. భక్తుల యాందోళన తగ్గినది.
ఈ పర్యటనలో స్వామి తండలము గ్రామము మీదుగా నుగుచుండిరి. అక్కడ యొక గొల్లవాడు తన యొద్దనున్న కొంచెపు టాస్తినమ్మి వచ్చిన రొక్కము స్వామి కర్పించ దలచెను. స్వామి యక్కర లేదన్నను తన నిర్ణయము నాతడు మార్చుకొనలేదు. తనకున్న కొలది భూమిని నొక ధనవంతునకమ్మి యా రొక్కమును హృదయ పూర్వకముగా స్వామి కర్పణ చేసి తరించెను. అతడట్లు నిరాధారుడగుట స్వామి కిష్టములేక యచ్చటి తహశీల్దారుతో చెప్పి వానికి కొంత పోరంబోకు భూమి నిప్పించు నేర్పాటు చేయించిరి.
1929 డిసెంబరులో తిరువణ్ణామలకు దీప దర్శన మహోత్సవమునకు స్వామి చనిరి. తిరువణ్ణామల యాత్రా స్థలములలో చాలా పవిత్రమైనది. అచ్చటి అరుణాచలమునే శివలింగముగా నర్చింతురు. పరమేశ్వరుడు మహా తేజోలింగముగా నక్కడ నావిర్భవింప తదాద్యంతముల నెరుగయత్నించిన బ్రహ్మ, విష్ణువులకు నవి యంతుపట్టలేదనిపురాణ ప్రసిద్ధి. ఇచ్చటనే పార్వతి శివనామ భాగస్వామినియైనధి. స్వామి యర్థనారీశ్వరుడైనాడు. అరుణగిరినాధ మునీంద్రుడు సుబ్రహ్మణ్యశ్వరు నిటనే దర్శించెను. స్వామిపై భక్తి గీతముల గానము చేసినదిచటనే. అరుణాచలేశ్వర దేవాలయావరణముననే యిడక్కట్ట సిద్దరు సమాధి కలదు. మన కాలముననే రమణ మహర్షికిని తిరువణ్ణామల నివాసమైన. తిరువణ్ణామలలో జ్యోతి రూపుడైన శివునర్చించు చిహ్నముగా సంవత్సరమున కొకసారి కార్తీక పూర్ణిమనాటి సాయం సమయమున నీ కొండ శిఖరమున నఖండ జ్యోతిని వెల్గింతురు. దీనికి దీప మహోత్సవమని పేరు. మన స్వామి ఈ మహోత్సవమునకే 1929లో వెళ్ళిరి. వెళ్ళి యాకొండకు ననేక ప్రదక్షిణములాచరించి యచ్చటి దేవాలయమున నర్చన చేయుచు స్వామి నచ్చట నొక్క మాసముండిరి.
తరువాత నారణి దగ్గరనున్న యాడయపాలెమునకు స్వామి వెళ్ళిరి. ఇక్కడనే నాలుగు శతాబ్దులకు పూర్వము అప్పయ్య దీక్షితులు నివశించెను. దీక్షితు లచ్చమైన యద్వైతియే కాక శైవులు కూడ. అనేక శాస్త్ర గ్రంధములు రచించిన బహు శాస్త్రవేత్త, ఇచ్చటి ప్రజానీకమునకు స్వామి యద్వైత శైవుడైన యీ మహా విద్వాంసుని వార్షికోత్సవములు చేయవలెనని యుద్భోధించిరి. ఆయన గ్రంధములు ప్రజా బాహుళ్యమున ప్రచారమునకు తేవలెనని యుద్ఘాటించిరి.
1930 డిసెంబరులో పక్షి తీర్థమున యావద్భారత సాథుమహా సంషు పక్షమున స్వామికి స్వాగత పత్ర సమర్పణము చేయబడినది. ఆది శంకరుల మహనీయ సంప్రదాయానుసారము హిందూ సంఘ, ధర్మ పోషణకు నాదర్శప్రాయాచరణముల స్వామి మహత్తర కృషి చేయుచుండిరని యందభివర్ణింప బడినది.
చెంగల్పట్టు ప్రజానీక మెంతకాలంగనో నిరీక్షించు స్వామి సమ్మాన దర్శన భాగ్యమైన మహావకాశము 1931 జనవరిలో లభించినది.
స్వామి చెంగల్పట్టున నున్న యల్ప కాలమున మిష్టర్ పాల్‌బ్రంటను, బ్రిటిషు పత్రికారచయిత, యాధ్యాత్మిక మార్గగవేషియైన యాతడు స్వామిని దర్శించెను. ఇది చెప్పదగిన విషయము. ఈయన భారత దేశమున తాంత్రికులును, యోగులును, నాధ్యాత్మిక శక్తి సంపన్నులునైన ప్రముఖులు నైన వారి సాంగత్యమునకై పర్యటించుచుండెను. ఈ భారతీయ గుప్తశక్త్యన్వేషణమునకే యాయన సుదూరమైన యింగ్లండు నుండి యిచ్చటకు వచ్చెను. మదరాసులో శ్రీ కె. యస్. వెంకట రమణియ్యను సమర్థుడైన రచయితను కలసెను. ఈయన గ్రాహీణ జీవితమును చిత్రించు వ్యాసములు నవలలు నాంగ్లమున రచించెను. ఈయనయే బ్రంటనును స్వామి దర్శనమునకు గొనిపోయెను. ఆచార్య స్వామితో స్వయముగా నాయన విన్నవించినది ''ఆంగ్లదేశాభ్యాగతునికి వాంఛితమైన స్వామి సమావేశము లభించినది.'' అని. ''శంకరమైన యా ముఖతేజస్సు, లోకాల వెలిగించు భాస్కరములైన యా కన్నులు, గల యా మహర్షి, దేనినో యాశించి వెదుకుచూ వచ్చిన యయ్యాగతునకు ప్రధమదర్శనముననే యొక మహత్త్యానుభూతిని కల్గించిరి. శ్రీ బ్రంటను నిస్తంద్రముగా స్వామిని తదేక దృష్టితో చూచెను. దృక్కులక్కడ నుండి కదలలేదు. ఈ మర రాని సన్నివేశమును గూర్చి తరువాత తాను రచించిన గ్రంథములో నిట్లుదహరించెను. ''విభూతినలదిన యా స్వామి చామనచాయ ముఖమునా సువిశాల చిత్త చిత్రపట వీధిలో పూజనీయమైన యున్నత స్థానమున నిల్పబడినది. పరాసుభాషలో spiritual అను పదమునకుగల దుర్గ్రాహ్యత్వమను భావము వారిముఖమున నెలకొని కన్పట్టినది, వారు మర్యాదగా మెల్లగా మాట్లాడుదురు. ఆ నల్లని విశాల నేత్రములు నిశ్చల మనోహరములు. చిన్నగా సూటిగా నున్న ముక్కు, కొలదిగా పెరిగిన గడ్డము. ఆకర్షణీయమైన నోరు చూడ నాకర్షణీయముగా నుండెను, ఇట్టి ముఖకవళికలు మధ్య యుగమున క్రైస్తవ ప్రార్థనా మందిరము నలంకరించిన మొక యోగికి నున్నవను కొందును. కాని యాయన కీ మేధాశక్తిలేదు. క్రియాను భవ ప్రధానులమైన పాశ్చాత్యులమైన మేమా స్వామి స్వాప్నికనేత్రములు కలవారేమో యని భావింతుము. అర్థనిమీలితములైన యాకను రెప్పల మాటున స్వప్నానుభూతికాదు. సత్యాను భూతియే యుండియుంపనని యా యనిర్వచనీయాను భవమును నేనందితిని.
నిరాయుధీకరణ, ప్రపంచము, ఆర్థిక రాజకీయ పరిస్థితుల మెరుగుపాటు, మొదలైన విషయములను గూర్చి బ్రంటను స్వామినడిగెను. స్వామి వారు వారి ప్రత్యేకసహజ సరళిలో నా ప్రశ్నల లోతులోనికి చూచి ''లోక సుస్థితి కావలెనన్న ముందు మానవుని యాంతర ప్రవృత్తిలో మార్పు రావలె'' ననిరి.
''యుద్థ నౌకలను తీసివేసినను, ఫిరంగులను వాడకున్నను, యుద్ధమాగదు. ప్రజలు కర్రలతో నయినను యుద్ధము చేయుదురు.
''వివిధ దేశముల మధ్యను, పేద ధనిక వర్గముల మధ్యను నాధ్యాత్మిక సమన్వయము కుదురనిదే, సౌహార్థముపెంపొంది శాంతి సౌఖ్యములు చేకూరవు.''
''జీవితమునెడను. ప్రాపంచిక విషయములందును, భారతీయులు నిరాశా వాదులని విమర్శకులందురు.'' బ్రంటను వేసిన ప్రశ్నకు సమాధానముగా స్వామి పైయూహ తప్పని గట్టిగా ఖండించిరి,
బ్రంటను! ''మానవులు దిగజారిపోయిరని తమ యభిప్రాయమా ?
స్వామి : కాదు. నేనట్లు భావింపను. మానవునిలో నంతరాత్మ యున్నది. పర్యవసానముననది వానిని దైవమును చేర్చును. వారు జన్మించిన పరిస్థితులనే గాని ప్రజలనంతగా గర్హింప వలదు. పరిస్థితులు, పరిసరములు బలీయములై వారి నంతగానధోగతిపాలు కావించుచున్నవి కాని వాస్తవమున వారట్టివారు కారు. ప్రాక్పశ్చిమముల రెంటను నిదియింతే. ఉత్తమ సాంగత్యమున సంఘమున్నతి నందవలె. సర్వజనీనము, మహోదారమునైన స్వామి దృక్పధమును బ్రంటను గుర్తింపక పోలేదు. ''శ్రీ శంకరులు ప్రాగున్నతిని చూపుటకు పశ్చిమమును కించపరుపలేదు. పూర్వార్థమున నొక విధమైన మంచియున్న పశ్చిమార్థమున మరియొక విధమున మంచిగలదు. ఇదొక రకమైన చెడు కలిగిన నందు వేరొక రకమున గలదు. గుణదోష పరిగణనమున రెండును సమానమునవే. వివేకవంతులైన భావి తరముల వారు ప్రాకృశ్చిమ సంస్కృతి నాగరికత లందలి యుత్త మాదర్శములను జోడించి నిగ్రహ సంపన్నమై యున్నత తరమైన సంషువ్యవస్ధ రూపింపగలరని స్వామి యాశించిరి.'' అని బ్రంటను రచించెను.
భారత దేశమునకు తనయాగమనోద్దేశ పురస్సరముగా బ్రంటను ''తనకు తాత్త్విక గురువుగా నెవరినైన ప్రసాదింతురా? లేకస్వయముగా స్వామియే మార్గదర్శకులుగా నుండుట కవకాశమున్నదా!'' యని స్వామి నర్థించెను. ''నేనొక ప్రజా సంస్ధను నడుపుచుంటిని గదా! యిప్పటికే తీరిక క్షణమైన లేదు. నా కార్యక్రమములకే కాలము నాకు చాలుట లేదు. చాల సంవత్సరములు రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రించితిని. స్వయముగా శిష్య శిక్షణ చేయగలనా. శిష్యులకై సమయము వినియోగింపగల యధ్యాపకుని మీరే చూచుకొనవలె''నని స్వామి స్పష్టీకరించిరి.
స్వామి యాదేశానుసారము బ్రంటను తిరువణ్ణామలైకు పోయి తానాసించిన గురు లక్షణములు గల శ్రీ రమణ మహర్షిని మార్గ దర్శకునిగా స్వీకరించెను. అరుణగిరి మహర్షిని గురించి ముందే మదరాసులో నొక భక్తుడు బ్రంటనుకు చెప్పెను. అతడప్పుడు దానిని పట్టించుకొనలేదు. అప్పటికీ దేశమున తాను కలసిన కొందరు యోగుల వంటి వారే రమణ మహర్షి కావచ్చుననుకొనెను. కాని పోయి చూడ తాననుకొనిన దానికిని వాస్తవమునకును సంబంధము లేదు. మహర్షి దర్శనము చేయకుండ దక్షిణ భారత దేశమును వీడి పోవలదని స్వామి బ్రంటనుకు చెప్పిరి.
చెంగల్పట్టున స్వామితోడి సమావేశానంతరము బ్రంటను మదరాసున తన బసకు వెళ్ళెను. ఆరాత్రి స్వామిని నిద్రలో దర్శించెను. వెంటనే మెలకువ వచ్చినది. గదియంతయును చీకటి మయము. కాని యాతనికేదో యొక వెలుగు కన్పించినది. తక్షణమే లేచి సూటిగా నాతడు దానిని చూచెను. అప్పుడు తన యనుభవమును బ్రంటనిట్లు వ్రాసెను.
''ఆశ్చర్య భరితమైన నా చూపు పూజ్యశ్రీ ఆచార్య శంకరమూర్తినే దర్శించినది. ఆముఖము ఆ రూపము స్పష్టముగా, నిర్దుష్టముగా నాయనయే కన్పించినారు. దేవతా రూపమున కాదు. భూత రూపమున గాదు. అచ్చముగా మనుష్య రూపముననే. కాని యా మూర్తిచుట్టును నద్భుతమైన కాంతి మండలము కలదు. అది చుట్టునున్న చీకటిలో స్వామి మూర్తిని భాసింప జేయుచున్నది.
నిజముగా నిదియొక యసాధ్యదృశ్యము. స్వామిని నేను చెంగల్వ పట్టణమున వీడి రాలేదా. నిజమెరుంగ గోరి పరీక్షకై కనులు గట్టిగా మూసి కొంటిని. మార్పులేదు. స్పష్టముగా నదీ మూర్తి. యింకను కనుల యెదుట నున్నది. సుప్రసన్నము, నను కంపామృదాలము, స్నేహవాత్సల్య మథురమైన దానినే ప్రత్యక్షమునందితిని. చాలును. కనులు తెరచితిని. వదలుగా కట్టిన కాషాయాంబరములనున్న యా దయామయుని మూర్తిని దర్శించితిని.
చిరునగవున నిట్లు చెప్పినట్లయినది. వినయ వంతుడవుకమ్ము. నీయన్వేషణము ఫలించును.
ఆదృశ్యమెట్లు దర్శనమిచ్చినదో యట్లెచిత్రముగా నదృశ్యమైనది. అతి సామాన్య స్వభావము గల యా దృశ్యము నాలో నాత్మౌన్నత్యమును శాంతి సౌఖ్యములను కల్గించినది. అది కలయని త్రోసిపుచ్చనా! దానికేమి నష్టము!''
చెంగల్పట్టున నుండి స్వామి కంచికేగిరి. ఇచ్చటనే కామకోటి పీఠమున్నది. పీఠాధిపతియైన తర్వాత నచ్చటికేగుట కిదియే ప్రధమం. 1931 జనవరి 25వ తేదీ యాదివారమునాడు స్వామి విథ్యుక్తముగా నా పట్టణమున బ్రవేశించిరి. పట్టణము కన్నుల పండువుగ నలంకృతమైనది. పౌరులు మహోత్సాముతోసభక్తికముగా స్వాగత మిచ్చిరి. పరమ రమణీయములైన దేవళములతో నొప్పారు నది కంచి. ఆది శంకరులు శ్రీచక్రమునీదేవళమున స్వయముగా ప్రతిష్ఠించిరి. లోపలి ప్రాకారమున గుడిలో మనుష్యునియెత్తు శంకరుల విగ్రహమున్నది. శంకరులు సర్వజ్ఞ పీఠమునధిష్ఠించి కంచిలో సిద్ధినందిరని తరతరములుగా వినబడును. ఏకామ్రేశ్వర వరదరాజ దేవాలయముల యందును, మరి చాలనితర దేవాలయములందును శంకరుల చెక్కడపు మూర్తులు గలవు. కడచిన చాలా శతాబ్దులుగా శ్రీ కామాక్షి దేవాలయపు యాజమాన్యము కామకోటి పీఠమునదే. 1840లో పీఠాధిపతులలో నరువది నాల్గవ వారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారు కుంభాభిషేకము చేసిరి. మరు సంవత్సరమే కామాక్షీ దేవాలయ నిర్వహణ బాధ్యత కామకోటి పీఠమునకు సమర్పించు నేర్పాట్లు బ్రిటీషు ప్రభుత్వముచే చేయబడినవి. 1931లో స్వామి కంచిలో నున్నప్పుడు, దేవాలయ పునరుద్ధరణకును, నిత్యార్చనమునకు నేర్పాట్లు చేయించిరి.
1931 ఏప్రిల్ చివరి భాగమున స్వామి కంచి నుండి యుత్తరమెరూరునకు జనిరి. ఇక్కడ పురాతన ప్రజా పరిపాలన సంస్థల గురించిన చారిత్రక ప్రాధాన్యము గల శాసనములు గలవు. చెంగల్పట్టు జిల్లాలో ప్రాముఖ్యము గల పెరుంబుదూరునకు కూడ స్వామి వెళ్ళిరి. ఇది శ్రీ రామానుజ స్వామి జన్మస్థలము. అక్కడ నున్న యాదికేశవ పెరుమాళ్ళు దేవాలయమున మాట్లాడుచు స్వామి పుష్పదంతుని మహిమ్న స్తోత్రమున గల యొక శ్లోకము నుదహరించి ''వివిధములైన మత సిద్ధాంతములు ననేక నదులవంటివనియు నదులన్నియు సాగరుని చేరినట్లే, సర్వ మతములును పరమేశ్వరుని జేరవలసినవే, యనియు రుచి వైవిధ్యముచే దార్శనిక వైవిథ్యము కలిగినదనియు'' నందున్న విషయమును వివరించిరి.
1931 సంవత్సరపు చాతుర్మాస్య వ్రతము చిత్తూరున జరిగినది. వ్రతానంతరము పర్యటన కొనసాగినది. స్వామి యారణిలో నుండ సుమారు రెండు వందల మంది కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు స్వామిని దర్శింపగోరిరి. స్వాతంత్ర్య సమరము తీవ్రముగా నున్న సమయమది. స్వచ్ఛంద సేవకుల కెవ్వరైన దయా దాక్షిణ్యములు చూపిన వారిపై ప్రభుత్వము విరుచుకొని పడెడి రోజులవి. అందుచేత మఠోద్యోగులు వారి యభ్యర్థనను మన్నించుటకు జంకుచుండిరి. ఇది స్వామికి తెలిసినది. స్వామివారు వారిని తక్షణమే ప్రవేశ పెట్టవలసినదనియు, వారికి వలయునేర్పాట్లు చేయవలసినదనియు పీఠోద్యోగుల నాదేశించిరి. వారిలో పేరుపేరున ప్రతి వ్యక్తిని పరామర్శించి విభూతిని వారికి ప్రసాదించి యాశీర్వదించి పంపిరి.
1932 మార్చిలో స్వామి కాళహస్తికి నేగిరి. అప్పుడు మహా శివరాత్రి. సుమారు ముప్పదిమైళ్ళ దూరము అడవిలోని కాలిబాట వెంట స్వామి కైలాసగిరికి ప్రదక్షిణించిరి. ఇక్కడ నుండి తిరుపతికిని, తిరుమలకును వెళ్ళిరి. ప్రతి దినము స్వామి కమ్మని తెనుగున గంభీరోపన్యాసము లిచ్చెడివారు. వేల కొలది జనులు కర్ణపర్వంగా విని తరించెడివారు. చిత్తూరు జిల్లాలో నగరి, వెంకటగిరి పట్టణములను జూచిరి. ఒక దినము స్వామి, పండితుల వేదాంత చర్చకు నధ్యక్షులుగా నుండిరి. 1932 జూన్ 14వ తేదీన స్వామి వారి మాతృ మూర్తి కుంభకోణమున దివంగతురాలైరని తంతి వచ్చినట్లుగా మఠాధికారి స్వామికి చెప్పబోగా స్వామి ముందుగానే ''కుంభకోణమునుండివార్త వచ్చినదా'' యనియడిగిరి. మఠాధికారి 'యవు' ననెను. ఇంక నేమియు ననక స్వామి దాని నటుంచుమనిరి. కొంతసేపు మౌనంగా నుండి తర్వాత పండితులతో ''మాతృ మరణవార్తవిన్న సన్యాసి యేమి చేయవలె'' నని యడిగిరి. పండితులు విషయము నెఱిగి చాల దుఃఖపడి యేమియు పలుకలేదు. స్వామిలేచి రెండు మైళ్ళ దూరముననున్న జలపాతమునకు వెళ్ళిరి. వారితో భక్త జనులు దైవ సంకీర్తన చెయుచు ననుగమించిరి. వారు స్నానం చేసిరి అనుయాయులును స్నానం చేసిరి. జగద్గురు మాతృ వియోగము నెవ్వరికివారుతమదిగనేభావించి విచారపడిరి.
నగరి దగ్గర బుగ్గయను సహజ సందరమైన యొక ప్రదేశము కలదు. ఇక్కడ నొక దేవళమున కాశీవిశ్వనాథుడును, ప్రయాగమాధవుడును కలిసి యుండిరి. ఈ దేవాలయము ప్రక్కగా నొక జీవనది ప్రవహించు చుండును. దేవాలయము క్రింది నుండి వచ్చు ప్రవాహ పంచకమీ నదీ పరీవాహ పరిపోషకము. 1932 జులై 17 నుండి యా మనోహర ప్రదేశమున స్వామి చాతుర్మాస్య వ్రతము సాగించిరి. వారున్న యా కాలమున నాదేవళము బాగుచేత జరిగినది. స్వామి కుంభాభిషేకమును పెద్ద యెత్తున జేసిరి. బహు సంఖ్యాకులు చెన్న పట్టణ పౌరులు భక్తజనులు బుగ్గకుజని స్వామిని రాష్ట్ర కేంద్ర మైన చెన్న నగరమునకు విచ్చేయుడని యాహ్వానించిరి. మదరాసునకేగు దారిలో తిరుత్తనిలో శ్రీ సుబ్రహ్మణ్యశ్వరుని దర్శించిరి.
మదరాసు చేరులోపల మన మొక విచిత్ర విషయమును తిలకింతము. నమ్మిన బాటై భక్తి ప్రపత్తులతో నేవించు నొక కుక్కగాధయది.
1927వ సంవత్సరము నుండి యొక కుక్క మఠ పరిజనముననుసరించి వారెచ్చటికి పోయిన నచ్చటికేగుచెండెడిది. ఆ కుక్క చాల విచిత్రమైనది. తెలివిగలది. ఏ మాత్రమున పరిశుభ్రంగా నుండదు. యాత్రలలో రాత్రులు మఠమును కాపలా కాయుచుండెడిది. మఠమునుండి లభించిన ప్రసాదమునే భుజించెడిది. అందుచే స్వామి ప్రతిదినమును సాయం సమయమున దాని యాహార విషయం పరామర్శించు చుండెడివారు. మఠమొక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమున కేగునప్పుడు కుక్క వారితో పాలకి క్రిందుగా నడిచేడిది. మధ్య మార్గమున గ్రామస్థులు పీఠ సేవ చేసికొను వీలు కల్గించుటకై ప్రయాణ మాగినపుడు వెంటనే కుక్క దూరము పోయి మరల ప్రయాణం సాగువేళ##కై నిరీక్షించు చుండెడిది. ఒక రోజున నొక చిన్న పిల్లవాడు దానిని కొట్టినాడు. అది వానిని కరువ బోయినది. మఠోద్యోగు లాందోళన జెంది దానికి గంతలు కట్టి యిరుపది యైదు మైళ్ల దూరాన గల యొక గ్రామమున విడిచిరి. కాని చిత్రముగా నా కుక్క తనను విడిచిన వ్యక్తి స్వామిని చేరక పూర్వమే, తాను స్వామి సన్నిధినుండెను. నాటి నుండి స్వామి దర్శనము కానిదే యా కుక్క యాహారత ముట్టెడిది కాదు. దేహపతనం వరకది యా మఠము ననే యున్నది.
1932 సెప్టెంబరు 28న స్వామి దర్శన భాత్యము మదరాసు పౌరులకు కల్గినది. స్వామి యచ్చటనున్న నాల్గు మాసములలో నచ్చటి పౌరులు వారి జీవితమున స్పష్టమైన శుభ పరివర్తనము కలిగినదని భావించిరి. తొలుత మదరాసు సంస్కృత కళాశాలావరణమునను, తదుపరి నగరమునందలి యితర ప్రదేశమునందునను, స్వామి దర్శన గంగాజల పాన తృప్తులై పవిత్రులైన ప్రజలాత్మతన్మయత్వ కరములైన వారి యుపదేశ వాహినుల మున్కలిడి వెళ్లు చుండెడివారు. మొదట రాత్రి యొక పెద్ద యూరేగింపుతో స్వామి సంస్కృత కళాశాల జేరిరి. చక్కగా నలంకరింపబడిన పాలకిలో నుపవిష్టులై స్వామి ప్రజలపై నాశీస్సుల జల్లుల కురిసిరి. న్యాయ మూర్తివి. కృష్ణస్వామి అయ్యరు సంస్కృత కళాశాలస్థాపకుడు. వీరి కుమారులు బాల సుబ్రహ్మణ్య అయ్యరు. వీరు, తదితర భక్తశిఖామణులు కలిసి సంస్కృత కళాశాలలో స్వామి వారి నివాసమునకు తగిన యన్ని సాకర్యములును కడు జాగురూకతతో నేర్పాటు చేసిరి. శంకర భాష్య ప్రవచనమునకై యొక యుపర్యాసయోగ్య భవనము విజయదశమినాడు నిర్మితమైనది. దానికి స్వామిస్వయముగా ''భాష్యవిజయ మండప'' మని నామకరణము చేసిరి.
పౌర సన్మానము చేయవలెనని మదరాసు నగర పాలక సంస్థ చాల కుతూహలపడినది. శ్రీ టి.యస్. రామస్వామి అయ్యరు నగర పాలక సంఘాధ్యక్షుడు. తీర్మాన ప్రతిపాదకుడగు శ్రీ ఎ. రామస్వామి ముదలియారు మాట్లాడుచు ''నీ నగర పాలక సంస్థ యొక మఠాధిపతికి పౌర సన్మానము చేయుట కిదియే ప్రధమము. ఆయినను శ్రీ స్వామివారు సర్వమతముల వారును వారిని భక్తిగౌరవములతో సమ్మానింతురనియు కాన నా తీర్మానమేక గ్రీవముగా నామోదింపబడగలదనియు తానాసించు చున్నానని తీర్మాన ప్రతిపాదన చేసెను. అట్లే యా తీర్మాన మందరి మెప్పుదలతో నొప్పుకొన బడినది. నగర పరిపాలక సంస్థా భవనమునను కార్యక్రమమున తాను పాల్గొనుట తనకుచితము కాదని స్వామివారు వారంపిన యాహ్వానమును మర్యాదగా తిరస్కరించిరి.
1932లో నవరాత్రోత్సవములు సంస్కృత కళాశాలలో జరుప బడినవి. దేవీ వరివస్యా కాలమైన శరన్నవరాత్రులలో స్వామి నిరాహారులై ముత్తైదువలను స్వామివారు మాతృమూర్తులుగా భావించి వారికి కాన్కల నిత్తురు. రెండు సంవత్సరప్రాయపు పసిపాపలతో మొదటి రోజు ప్రారంభించి నవమినాడు పదియేండ్ల బాలికలకు విధ్యుక్తమైన పూజ చేయుదురు. దీనికి కన్యా పూజ యనిపేరు. వేద పఠనము, దేవీ భాగవత పారాయణము, రామాయణ గీతాది గ్రంధ పారాయణముతో పాటు చండీహోమము, శ్రీ విద్యాహోమము లీయుత్సవ దినములలో చేయబడెడివి. వేలకొలది ప్రజలుసంస్కృత కళాశాలకు పోయి తీర్థ ప్రసాదములను స్వామి యనుగ్రహమును స్వీకరించి యానందించెడివారు.
నవరాత్రముల యనంతరం స్వామి ప్రతి దినము సాయం సమయమున పూజాంతమున నుపన్యాస సందేశముల నిచ్చెడివారు. వేనకు వేలు ప్రజలు ప్రశాంతంగా విని తరించిరి. సింహాసనస్తులై స్వామి కొంతసేపు మౌన ముద్రలోనుండి మెల్లగా మాట్లాడ నుపక్రమించెడివారు. అదియుపన్యాసమా; కాదు. హృదంతరము నుండి వచ్చు సందేశ వాహిని. ఎన్నో నిదర్శనములతో హృదయాంశముగ స్వామి సభ్యులతో ''మీరు నిర్దుష్టమై నిరాడంబరమైన నిస్యార్థమైన దివ్య జీవనము నవలంబింపుడని నచ్చచెప్పెడివారు. ప్రధాన హిందూ ధర్మములు, నిత్య కార్మానుష్ఠానము, పరమ కర్తవ్యమైన దైవ భక్తి, హిందూమత వివిధ శాఖల సమన్వయము, హిందువుల పండుగలు-వాని ప్రాముఖ్యము. మత సంస్థలు వాని ప్రాముఖ్యము, గుణావలంబనము-అద్వైత మహత్త్యము-మొదలయినవి వారు ప్రపచించిన విషయములలో గొన్ని ప్రధానమైనవి. వీనిని వినునదృష్టము లేని వారు ''హిందూ'' ''స్వదేశ మిత్ర'' మొదలయిన దిన పత్రికలలో దైనం దినముగా ప్రకటింపబడు సమాచారముల జదివి తెలుసుగొనెడివారు. ఆచార్య స్వామి యుపదేశములు విన్న శ్రోతలకును, పత్రికా పాఠకులకును నాత్మౌన్నత్యము నందుటకు తగిన యనుభవము కల్గినది.
ఇక్కడ నుండగా స్వామి రామకృష్ణ మఠ విద్యార్థి గృహము, పి. యస్. హిందూ దివ్యజ్ఞానోన్నత పాఠశాలల వంటి విద్యా సంస్ధలకును వెళ్ళిరి. ఉపాధ్యాయులకును, విద్యార్థులకును వారు పవిత్రమైన విద్యా పఠన పాఠన కార్యక్రమమును శ్రద్ధాభక్తులతో నెరవేర్పుడని యుద్భోధించిరి. నగరమువీడులోపల స్వామి ప్రఖ్యాత పండితులను, దేశభక్తి పూర్ణులైన నాయకులను బిరుదప్రధానముల సత్కరించిరి. మహామహోపాధ్యాయ శ్రీ యస్. కుప్పుస్వామి శాస్త్రికి ''దర్శన కళానిధి'' యనియు, శ్రీ కే. బాలసుబ్రహ్మణ్యం అయ్యరుకు ''ధర్మరక్షామణి'' యనియు, శ్రీ కె. కృష్ణస్వామి అయ్యరుకు 'పరోపకార చింతామణి' యనియు బిరుదులు లభించినవి.
మదరాసు సమీపమున గల తిరువారియూరు ప్రముఖ పవిత్ర స్థలము. శతాబ్దులుగా నిది మహాత్ముల నివాసమైనది. త్రిపుర సుందరి త్యాగేశుల దేవాలయమతిపురాతనమైనది. ఆది శంకరులిందు శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసిరి. నేటికిని త్రిపుర సుందరీ దేవ్యర్చకులు నంబూద్రి బ్రాహ్మణులే. ఈ దేవళము లోపలి ప్రాకారమున శ్రీ శంకరుల ప్రతిమ కలదు. కనీసం కొంత కాలమైనను కంచికామకోటి పీఠాధిపతులు తిరువారియూరున నుండకోరుదురు. అక్కడ నున్న శంకరమఠమున కామకోటి పీఠాధిపతు లిద్దరి సమాధులు కన్పట్టును. మన స్వామి పవిత్రమైన తిరువారియూరున కేగి దానిని పవిత్ర తరముగా జేసిరి.
1933 మార్చిలో కుంభకోణమున జరుగు మహామఖ మహోత్సవమున పాల్గొనుటకై స్వామి మదరాసు నుండి దక్షిణమునకు మరలనేగిరి. ఇంకను విజయ యాత్ర కొనసాగు చుండుటచే వారు కుంభకోణ మఠమున కాలిడలేదు. తిరువిడై మరులో బస చేసిరి. ఉత్సవమునాడక్కడ నుండి కుంభకోణమేగి పుష్కరిణిలో స్నానము చేసిరి. పండ్రెండు వత్సరముల కొకసారివచ్చు నా మహోత్సవమున పాల్గొనుటకు సుమారు లక్ష మంది కుంభకోణమునకు జేరిరి. మహామఖానంతరము స్వామి తిరువిడై మరుదూరు నందలి శంకర మఠమున కొన్ని నెలలుండిరి. సంప్రదాయాను సారము ఆది శంకరులచ్చటకు వెళ్ళి మహాలింగ స్వామిని దర్శింపగా లింగము నుండి శివమూర్తి యావిర్భవించి దక్షిణ హస్తము నెత్తి ''అద్వైత మొక్కటే సత్యము'' అని ముమ్మారు పలికి యంతర్థానమైరని యను శ్రుతముగా వచ్చుగాధ. 1933లో మన స్వామి యిచ్చట శంకర జయంతి చేసిరి.
చాలా కాలముగా స్వామి చిదంబరము వెళ్ళవలెనని సంకల్పము, కాని రెండు శతాబ్దులకుపైగా పూర్వ పీఠాధిపతులెవ్వరు నక్కడకు పోలేదు. అక్కడి దీక్షితారులు శంకరమఠాచార్యులను గూడ స్వయముగా నటరాజ దేవాలయ మందలి విభూతిని స్వీకరింపనీయరు. ఇతర దేవాలయముల యందెల్ల పీఠాధిపతులు స్వయంగా విభూతిని స్వీకరింపవచ్చు. అర్చకులు తామై యీయనక్కరలేదు. ఇతరులకు నర్చకులే యిత్తురు. ఇది పీఠములకీయబడిన గౌరవమర్యాదలకు చిహ్నం. చాలమంది భక్తులాచార్యస్వామిని చిదంబరం విచ్చేయుడని యర్థించిరి. స్వామికి కూడ వెళ్ళవలెననియు నటరాజస్వామి దర్శనం చేసికొన వలెననియు వాంఛకలదు. భక్తుల యాహ్వానం అంగీకరించి స్వామి 1933 మే 18 న చిదంబరం చేరిరి. దీక్షితారులతో కలిసి చిదంబర పౌరులు స్వామికి స్వాగతమిచ్చిరి. స్వామి నటరాజ దేవాలయమునకేగి విభూతినిగైకొను నప్పుడేమి జరుగునో యని భక్తులాందోళన జెందుచుండిరి. స్వామి మాత్రమేమియు పట్టించుకొనలేదు. వారికి కావలసినది సాధ్యమైనంత త్వరలో నటరాజ దర్శనము. ఉదయం పెందలకడనే లేచి స్వామి దేవాలయమునకేగ నిశ్చయించిరి. పరిచారకు నొకనిని తటాకము నొద్దనుండ నియోగించిరి. తెల్ల వారుఝామున నాలుగు గంటకే వారు లేచీ తటాకమునకేగి, స్నానానుష్ఠానముల ముగించుకొని, దేవాలయ ద్వారము తెరువగనే నటరాజ స్వామి యెదుట నిలిచి ధ్యానమగ్నులైరి. స్వామి నక్కడ చూడగనే ప్రాతరర్చనకై చనిన దీక్షితారు నిర్ఘాంశపోయి, వెంటనే తక్కిన దీక్షితారుల రప్పించెను. తక్షణమే వారందరువచ్చి సవినయముగా మోకరిల్లి ''తాము గౌరవపురస్సరముగా స్వామి నాహ్వానింపదలచితి'' మనియు నాలోననే స్వాగతాదులు లేకుండ స్వామి ముందుగనే నటరాజు దర్శనము చేసిరనియు, నీ సంఘటనకు తాము చాల బాధపడుచుంటి మనియు వారి యాందోళన వెలిబుచ్చిరి. తామట్లు చేయుటకు కారణము ''ప్రాతఃకాల ప్రథమ దర్శనమును విశ్వరూప దర్శనమందురనియు, తామదియభిలషించి యట్లు చేసితిమనియు స్వామి చెప్పి వారి కూరట కల్గించిరి. చిదంబరమున తామున్నన్నినాళ్లు దైవదర్శనమునకు వత్తుమనిరి. దీక్షితారులు స్వామికి నితర దేవళములందు వలెనే సమ్మానము చేసిరి. దీక్షితారుల హృదయ పూర్వకాభ్యర్థన నంగీకరించి స్వామి నటరాజ దేవాలయముననే కొన్ని నాళ్ళుండి శ్రీచంద్రమౌళీశ్వరునిపూజసహస్ర స్తంభమండపమున చేసిరి. ఆది శంకరులుకై లాసం నుండి తెచ్చిన ఐదు స్పటికలింగములో రెండు స్పటికలింగములకుననగా చిదంబర మోక్షలింగమునకును, కంచియోగ లింగము నకును నొకేమండపమున నొకేచోట నొకేసమయముననర్చన జరుగగా చూచునసదృశ్యమైన యదృష్టం భక్తులకు లభించినది.
1933లో చాతుర్మాస్యవ్రతము, నవరాత్రోత్సవములు తంజావూరిలో జరిగినవి. తంజావూరి యువరాజయిన ప్రతాపసింహరాజుగారును, శ్రీ టి. ఆర్. జోషిగారు నుదారముగా జేసినదాతృత్వము ఫలముగా తంజావూరులో శంకరమఠమునిర్మితమైనది. శ్రీ అనంత కృష్ణశర్మ యను యువకుని స్వామి ''కాశికి కాలినడకను పోయి. తమ యుత్తరదేశ యాత్ర కనువగు మార్గము నెన్న వలసినదిగా'' కొన్ని సంవత్సరముల క్రిందట నంపిరి. అతడు హిందీ భాషను నేర్వవలెను. తిరుగు ప్రయాణము రైలుపై జేయవచ్చు. స్వామియాజ్ఞ నక్షరశః శ్రీ కృష్ణశర్మ శిరసావహించి నిర్వహించెను, కాశికేగుట కాతని కారుమాసములు పట్టినది. వయోవృద్ధ స్వాములైన బ్రహ్మానంద సరస్వతీ స్వాములవారు. గౌరవనీయులైన పండిత ప్రకాండులు, మహా మహోపాధ్యాయ శ్రీ ఆనందశరణులు శ్రీ శృంగేరీ మఠము ప్రతినిధి శ్రీ ప్రతాపసీతారామ శాస్త్రిగారును వారణాసి పౌరులపక్షమున శ్రీ ఆచార్య స్వామిని వారణాసికాహ్వానించుచు పత్రమునంపిరి. స్వామి చిదంబరముననుండగా వారణాసి హిందూ విశ్వవిద్యాలయమున మీమాంసా శాస్త్రాచార్యులుగా నున్న మహా మహోపాధ్యాయ చిన్నస్వామి శాస్త్రి చిదంబరమునకు వచ్చి కాశీపౌరుల యాహ్వాన పత్రమును చదివి వినిపించిరి.
కాశీ మహారాజాగారి యధ్యక్షతను, పండిత మదనమోహనమాలవ్యా, మహా మహోపాధ్యాయ వర్గము, ప్రముఖ పండిత సంఘము, నితరప్రఖ్యాత వ్యక్తులు సభ్యులుగా నొక ప్రతినిధి వర్గ సంఘమేర్పడినది. భారతదేశమున కాధ్యాత్మిక కేంద్రమైన వారణాసిలోని పౌరులు కాశీయాత్రకు సంకల్పించిన శ్రీ స్వామిరాకకై కడునాత్రమున నెదురు తెన్నులు చూచుచుండిరి.
పూర్వ ప్రభుత్వాచరణానుసారము మదరాసు ప్రభుత్వము స్వదేశ సంస్థానములకును, వివిధరాష్ట్ర ప్రభుత్వములకును నొక ప్రకటన చేసినది. స్వామి కాశీ యాత్రామార్గమున వారికిని, వారి యనుచర వర్గమునకును గౌరవపురస్సరముగా వలయుసౌకర్యముల నేర్పాటు చేయింప వలసినదని యీ ప్రకటన సారాంశము.
1933 సెప్టెంబరు రెండవ వారమున యాత్రారంభ మైనది. రోజుకు నిరువది మైళ్ళ చొప్పున స్వామి యుత్తర దేశయాత్ర సాగించుచుండిరి. దక్షిణ కైలాసమని ప్రఖ్యాతి నందిన శ్రీశైలమునకు కర్నూలునుండి వెళ్ళిరి. ఇచ్చటి శివుడు మల్లికార్జునుడు. పార్వతిభ్రమరాంబిక. దేశమునందలి ద్వాదశ జ్యోతిర్లింగములలో నిదియొకటి. అష్టాదశ శక్తిపీఠములలో నీపవిత్ర స్థలమొకటి. ఇచ్చటి స్థల వృక్ష మర్జున వృక్షము. (అర్జున వృక్షము స్థల వృక్షముగా మఱి రెండు పవిత్ర స్థలములు గలవు. ఒకటి తంజావూరు జిల్లాలోని మధ్వార్జునమను పేరు గల తిరువిడై మరుదూరు. రెండవది పుటార్జున నామకమగు తిరుప్పుడై మరుదూరు. ఇది తిరునల్వేవి మండలమునగలదు.) తిరుమలలో నాకాశ గంగ కలదు. శ్రీశైలమున పాతాళగంగ కలదు. ఇది పవిత్ర తీర్ధము. శ్రీ ఆది శంకరాచార్యస్వామి తన శివానందలహరి మల్లికార్జునస్తవము చేసిరి. మనస్వామి యీస్తవముపఠించుటకానందపడుదురు. అందుననే శ్లోకమన్న మక్కువయెక్కువ. ఈశ్వరుని పరముగను నర్జున వృక్ష పరముగను శ్లేషాత్మ కవర్ణనయిందు కలదు.
సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిర
స్థానాంతరాధిష్ఠితం.
సప్రేమ భ్రమరాభిరామ
మస కృత్సద్వాసనా శోభితం
భోగీంద్రాభరణం సమస్త సుమనః
పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీ గిరిమల్లికార్జున మహాలింగం
శివా లింగితమ్.
ప్రదోషాద్భుతనృత్యపరు (ప్రదోషవికసిత కుసుమ భరితము) వేదాంత ప్రతిపాదిత మహస్సు (శ్రవశ్శిరోలంకృత పుష్ప జనము) మనోహర భ్రమరాంబాలంకృతవామ పార్శు (మధుర ఝుం కారలోలమథుప విలసితము) పావన జనధ్యానధారా విభాసితు (నిరంతర సౌంగధ్య విలసితము) భోగి భూషణ (సుఖపదము) సర్వదేవతారాధనీయు (సర్వ పుష్పవృక్ష ప్రముఖం) ఉత్తమ గుణవిశిష్టు (గుణ విశిష్టము) శ్రీశైల మల్లికార్జున మహాలింగ రూపుబ్రస్తుతింతు, (ఈ సుందర నగరమున మల్లె తీగెలతో పెనవేనుకొనబడిన యర్జున వృక్షమునభి వర్ణింతు).
కొలది మంది యనుచరులతో ''పెద్ద చెరువు'' వరకు స్వామి పడవమీదజని యచ్చటనుండి పదునొకండు మైళ్లుకొండనెక్కిరి, 1934 జనవరి 29న శ్రీశైలము చేరి దేవాలయమునకేగిరి. శివానందలహరి, సౌందర్యలహరి శ్లోకపఠనం చేయుచు స్వామి యిచ్చట దేవతామూర్తుల యెదుట చాల కాలం నిలబడి ధ్యానంచేసిరి. శ్రీశైలమునకొన్నినాళ్ళుండి కర్నూలుకు మరలి వచ్చిరి. శ్రీశైల యాత్రలో హారణ్య మధ్యమున నాటవిక జాతి చెంచులు యాత్రికులకు సర్వసహాయ సంరక్షణలతో యాత్రను కొనసాగింపజేసిరి. స్వామి వారు తమ మధ్యదర్శన మిచ్చుట మహా భాగ్యముగా వారు పరిగణించిరి.
కర్నూలు నొద్ద తుంగభద్ర దాటి హైద్రాబాదు సంస్థానము చేరిరి. 1934 ఫిభ్రవరి 12న ప్రధాన నగరము ప్రవేశించిరి. ముఖ్యమంత్రి ప్రభుత్వోద్యోగులతో కూడి జగద్గురువులను సభక్తికముగా సేవించిరి. ఒకనాటి భిక్షకు పరికరములు, నిజాం ప్రభువు నాజ్ఞ మేరకు సంస్థానమంపినది, పీఠదైనందిన పూజాకార్యక్రమములకు సౌకర్యాలన్నియు జేయబడినవి. స్వామి హైద్రాబాదున నుండి నొక సనాతన ధర్మ మహాసభ జరిగినది. అనేక ప్రముఖ విద్వాంసులు సభకు విచ్చేసిరి. స్వామి సభాప్రారంభోపన్యాసమున స్వధర్మరక్షణావశ్యకతను, ప్రతి హిందువుని కర్తవ్యమును బోధించిరి. పండితా దరణమును, ధర్మసూత్రాచరణమును కర్తవ్యమని ప్రజలకు స్వామి యుపదేశించిరి.
హైద్రాబాదునుండి యుత్తరదేశయాత్ర మహారణ్యమధ్యమునను, నిర్జన ప్రదేశాలను సాగవలసి కష్ట తరమగుటచే యాత్రికులలో చాలమంది, బండ్లు, పశువులు, సహచరులు మొదలైన వారు వెనుక నాపబడిరి. ఈ వర్గం స్వామిని నాల్గు సంవత్సరముల తర్వాత నాంధ్ర ప్రదేశంన కలిసినది. 1934 ఏప్రిలు 24న సికింద్రాబాదు వదలి గోదావరి యొడ్డున నున్న సొన్నాకు చేరి స్వామి మే 5 న పావన గౌతమీ స్నానం చేసిరి.
అప్పుడు మధ్య రాష్ట్రమని పిలువబడు దేశమున స్వామి సంచారము చేయవలసి యున్నది. మేలో శంకర జయంతి గోదావరీ తీరమున గల బండెల్వాడలో జరిగినది. జూన్‌లో నాగపూరున కొన్ని దినములుండి వింధ్యపర్వతప్రాంత దేశ భాగమున పయనించిరి. నిర్జల భూముల ముండుటెండలో ప్రయాణము కడు కష్ట భరితమైనది. స్వామి సంకల్ప ప్రకారము కాశీ చేరుట ప్రధాన లక్షణచేముగా ననుయాయులు ధైర్యోత్సాహములతో కష్టనష్టములను, నవ్వుచునే యధిగమించిరి. వింధ్యముల దాటి 1934 జులై 3 న స్వామి జబల్పురము చేరి పవిత్ర నర్మదానదిలో స్నానమాచరించిరి. అక్కడనుండి సత్వరమున పయనించి ప్రయాగను 1934 జులై 23 న చేరిరి. ఆ పుణ్యనగరోప్రాంతమున మహామహోపాధ్యాయ గంగానాధఝూ నాయకత్వమున ప్రఖ్యాత నాయకులు స్వామికి విద్యుక్తముగా స్వాగతమిచ్చిరి. ''గురు మహారాజునకు జయ''మను జయజయ ధ్వానములతో బారులు తీరిన వేలకొలది ప్రజలూరేగింపు జరిపిరి.
స్వామి రామేశ్వరమునుండి తెచ్చిన ఇసుకను ప్రయాగలో 1934 జులై 25 న త్రివేణి సంగమమున గలిపిరి. గంగా యమున సరస్వతుల కూడలి యిచ్చట కలదు. దీనీకే ''త్రివేణీ సంగమ''మని పేరు. ఇక్కడ గంగా జలము పాత్రలలో సేకరించి దక్షీణ దేశ పుణ్యస్థలములకు పంపిరి. ఈ విద్యుక్త వైదిక కర్మాచరణమున మతాచార ధర్మమువాధ్యాత్మిక భౌగోళిక సమైక్యమున కెంతయవసరమో ప్రజలకు స్వామి యాచరణ మూలమున విదితము చేసిరి. జులై 6 న ప్రయాగలో చాతుర్మాస్యవ్రత మారంభ##మైనది. దేశము నలుమూలలనుండి మహాభక్తులు వ్యాసపూజ నాటికి ప్రయాగ చేరుకొనిరి. స్వామి సన్ని ధానముననే చాతుర్మాస్యకాలమున విద్వత్సభ జరిగినది. జౌత్తరాహ విద్వద్వరేణ్యులు చాలమంది పాల్గొని వారి వారి మహోపన్యాసములతో నభనలంకరించి స్వామి యాశీస్సుల నందిరి.
ప్రయాగ నుండి వారణాసికి నెనుబదిమైళ్ళు కాలినడకనే స్వామి పయనించిరి. 1934 అక్టోబరు 6న పుణ్యస్థలమైన కాశీ పట్టణమును స్వామి చేరుకొనిరి. కాశీ మహారాజు, పండిత మదనమోహన మాలవ్య మొదలైన పురప్రముఖులు వేలకొలది ప్రజానీకము స్వాగతమీయ నందుకొనిరి. ''జగద్గురు మహారాజునకు జయ'' మంచునినదించు లక్షకుపై మహాజనవాహిని స్వామిని పురవీథుల ననుసరించినది. చరిత్రలోనే యపూర్వమైన యనంత జనప్రవాహ మభ్యాతులైన యాచార్య స్వామికి భక్త్యంజలి సమర్పింప ననుగమించినది. 1934 అక్టోబరు 8వ తేదీ ''పండిత'' నామక హిందీ వార్తా పత్రికలో నీ మహోజ్ఞ్యల వృత్తాంత ప్రకటన జరిగినది. ఆ మహాయోగిపుంగవు ముఖ తేజోదర్శనమున ప్రజానందమనవధికమైనది. అనంత ప్రజా వాహిని, యయ్యఖండ సన్మాన మహా సభా వైభవము కాశీపట్టణము కని విని యెరుగదు.
కాశీ మహా నగరము శ్రీ విశాలాక్షి, విశ్వనాథుల నిలయము, ముక్తి ప్రదములైన సప్త నగరములలో ప్రముఖమైనది. పావన గంగా స్రవంతి యుత్తర వాహినిగా నిచ్చట వ్రవహించును. యోగులకు దిజ్ఞులకు నిది వట్టుకొమ్మ. ''వరుణ-అసి''యను రెండుప నదుల మధ్య ప్రదేశమగుటచే నీ నగరమునకు ''వారణాసి'' యను నామాంతరము కలదు. ఇచ్చటి మణికర్ణికాఘట్టముననే యాది శంకరులు భాష్య రచన చేసిరి. స్వామి జగద్గురువని వేనోళ్ళ చాటినది కాశీయే, ఇచ్చట నుండియే స్వామి దిగ్విజయ యాత్ర ప్రారంభ##మైనది. కాన మన స్వామి కాశీ యాత్ర పరమ ప్రయోజన ప్రాముఖ్యము కలది. కాశీలో కాలు పెట్టగనే స్వామి యన్నపూర్ణా విశ్వేశ్వరుల దర్శనము చేసికొనిరి. అక్టోబరు 7న గంగా స్నానానంతరము స్వామి చంద్రమౌళీశ్వరార్చన విశ్వనాధ దేవాలయముననే చేసిరి. అక్టోబరు 9 నుండి శరన్నవరాత్రులు గంగకవ్వలియొడ్డునగల దక్షిణామూర్తి మఠమునకు స్వామి విజయదశమి నాడేగిరి. 1935 ఫిబ్రవరి 9న పండిత మదనమోహన మాలవ్యా కోర్కిపై హిందూ విశ్వవిద్యాలయమున కేగిరి. స్వాగత పంచరత్నములు సంస్కృతమున మాలవ్యా చదివెను. ఆది శంకర స్థాపితమైన కంచి కామకోటి పీఠమును స్వామి యలంకరించి జ్ఞాన సంపద, పావిత్ర్యము, కృపౌదార్యముల ఫలముగా నాసేతుహిమాచల పరివ్యాప్తమైన యఖండ కీర్తి ప్రతిష్ఠల నీ పవిత్ర భారతమున స్వామి విలసిల్లిరనియు, సమావిష్టులైన విశ్వ విద్యాలయ వర్గము నాశీర్వదించి తమ యమూల్య సందేశము నీయ వలెననియు పండిత మాలవ్యా, స్వామి నర్థించిరి. సులభ సంస్కృతమున నుపాధ్యాయులను విద్యార్థుల నుద్దేశించి స్వామి ''విద్యాభ్యాస ఫల మనశ్శాంతి నందుట జ్ఞాన సముపార్జనముననే యమృతత్వ ప్రాప్తి సాధ్యమని'' యుద్భోధించిరి. పండిత మాలవ్యా శ్లాఘనీయ కృషినుగ్గడించుచు ''విద్యాప్రణాళికాది విశ్వవిద్యాలయ కార్యక్రమముల రూపొందించు నప్పుడు ''ఆస్తికత'' యాదర్శముగా నుండవలె''ననియు, ''విశ్వ విద్యాలయముల శిక్షణ నందిన విద్యార్థులు, భావనానుష్ఠానములయందాదర్శ జీవనమున ప్రజలకు మార్గదర్శకులుగా నుండవలెననిరి. సభాంతమున పండిత మాలవ్యా మాట్లాడుచు ''ఆది శంకరులు కాశికి వచ్చి భాష్య రచన చేసిరని'' పూర్వ గాధల మూలమున తెలిసికొంటిమి. కాని ఇప్పుడు ప్రత్యక్షముగా నాది శంకరావతారమే మన కన్నుల యెదుట నాచార్య స్వామిగా దర్శనమిచ్చినట్లను భవ పూర్వకముగా తెలిసికొంటి''మనెను.
1935 మార్చి 9 న స్వామికి గౌరవ పూర్వక సమ్మానము చేయుటకు ''టౌనుహాలు''న కాశీ నగర వాసులు సమావేశమొకటి యేర్పాటు చేసిరి. వివిధ భాషలలో ప్రశంసా పత్రములు సమర్పింప బడినవి. కాశికి స్వామి రాకను విద్వాంసులు చాలా మంది కొనియాడిరి. స్వామి సమాధానమున ''తామాది శంకరుల మార్గమునే యవలంబించి పర్యటన సాగించితి మనియు మేరలేని ప్రజోత్సాహమును జూచి చాలా సంతసించితి మనియు, నన్న పూర్ణా విశాలాక్షీ విశ్వనాధులు కృపాదృష్టులతో లోక కళ్యాణము కావించి, ప్రజానీకము ధర్మమార్గాను రక్తులగునట్లనుగ్రహింప తాము ప్రార్థించు చుంటిమనిరి.
1935 మార్చి 9న కాశీ నగర ప్రఖ్యాత విద్వాంసులు, దండి సన్యాసులు సమావేశము జరిపిరి. ఇట్టి సభ##యే కలకత్తాలో జరిగినది. మహా మహోపాధ్యాయ కమలనయనతర్కరత్న యాధ్వర్యర్యమున వంగదేశ పండితుల సమావేశము జరిగినది. నూట ముప్పది మందికి పైగా విద్వాంసులు సమావేశమున పాల్గొనిరి. శ్రీ మహా మహోపాధ్యాయ దుర్గాశరణుడు వారణాసి ప్రతినిధిగా కలకత్తా నుండి వచ్చి స్వామిని కలకత్తా కాహ్వానించెను. మహోన్నతమైన మహత్త్వ విశిష్టమైనది కామకోటి పీఠమని తమ విశ్వాసమని యా ప్రతినిధి విన్నవించెను.
1935 మార్చి 18న కాశివీడి ఏప్రిల్ 24న స్వామి పాట్నా చేరిరి. "The search for light" అను నాంగ్ల దిన పత్రిక ఏప్రిలు 28న వెలువడిన దానిలో ''కంచి కామకోటిపీఠాధిపతులైన జగద్గురు స్వామి శంకరాచార్యులకు బీహారు బహుమాన పురస్సరముగా హృదయపూర్వక స్వాగత మిచ్చుచున్నది. పవిత్ర మహా సంప్రదాయ వారసత్వ యోగ్యమైనదికంచిపీఠము. శ్రీఆచార్యస్వామిమహారాజ ఖండ భారత హిందూ జన పూజనీయులు. వారి సన్నిధి మాకనన్య సాధ్య పుణ్య ఫలప్రదము. వారి సందేశము శ్రోతల కెల్లరకు నవశ్యాచరణీయము. వారు తపో నిరతులు. అధ్యయన తత్పరులు. ఇది నిస్సందేహము. స్వామి పాట్నాలో శంకర జయంతి సలిపి ప్రజల ననుగ్రహించిరి. పురజనులు పీఠ పూజాదికమునను, సమావేశము లందును పాల్గొని తృప్తినందిరి.''
తరువాతి యాత్రా స్థలము గయ. 1935 మే 20న గయ చేరి ఫల్గునిలో స్నానమాడి విష్ణు పాదము దర్శించిరి. మే 25న బుద్ధ గయలో బోధివృక్షమును, బుద్ధుని దేవళమును చూచి బుద్ధుని ముందున్న చిన్న శివలింగమును దర్శించిరి. బుద్ధునిది పెద్ద విగ్రహము. ఎత్తున నున్నది. శివలింగము పల్లమున చాలా చిన్నదిగా నున్నది. దీనిని శంకర భగవత్పాదులు ప్రతిష్ఠించిరనివాడుక. బీహారులోని గొప్ప యాత్రాస్థలము ''దియోగరు'' ఇది వైద్యనాధ క్షేత్రము. జూన్ 21న ఆచార్య స్వామి యచ్చటికి వెళ్ళిరి. శ్రీ గిరిజా దేవిని స్వయం భూలింగమును దర్శించి చాలాసేపు ధ్యాన నిష్ఠులయిరి.
మధ్యేమార్గమునక్కడక్కడ మజిలీలుచేయుచు స్వామి 1935 జులై 13న కలకత్తా చేరిరి. ఆ మహా పట్టణము స్వామి కుత్సహపూరిత స్వాగతమిచ్చినది. కాళీ ఘట్టమున స్వామిజులై 17 నుండి చాతుర్మాస్యవ్రతమారంభించిరి. కాళీ దేవాలయ సంఘ పక్షమున ''దర్శన సాగర'' శ్రీగురుపాదశర్మస్వామికి ప్రశంసా పత్రము నర్పించెను. ''దేశము నలుమూలల నాది శంకరులు పీఠముల స్థాపించుచు కంచిలో కూడ నొక పీఠమును నెలకొల్పిరి. ఇప్పుడు మనము సభక్తికముగా సన్మానించు నీ స్వామి యా పీఠమున కధిపతి. వీరాదిశంకరులు వేసిన బాటనే పద యాత్రను దేశసంచారము చేయుచున్నారు. మహాకాళి పరమేశ్వరులు వీరి యాత్రను విజయవంతము చేయగలరు. దేశమున పుణ్య ధర్మములు సుస్థిరముగా వ్రేళ్ళు పాదుకొన నీ యాత్ర దోహదము చేయుగావుత!'' మని యాయన యాశించుచూ ప్రశంసించిరి. ఆది శంకరుల ప్రతినిధిగా తాము వారి భక్తి గౌరవముల స్వీకరించుచు సమావిష్టుల కనుగ్రహ వచనములు పలికిరి. సెప్టెంబరు 23న వంగదేశ బ్రాహ్మణసభ పక్షమున స్వామికి గీర్వాణ భాషలో నొక ప్రశంసా పత్రమర్పింప బడినది. పండితాగ్రేసరుడు, పండిత పంచానన తర్కరత్నచే నాప్రశంసవచింపబడినది. ఆచార్య స్వామి తమ మహత్త్యమున ప్రజలను ధర్మ మార్గమున నడుపుచుండిరి. కృపామూర్తి యగువారిరాకచే కలకత్తా పునీతమైనది. కంచికామకోటి పీఠాధిపతులకు ''నింద్ర సరస్వతి'' యను బిరుదము కలదు. వారి ప్రాముఖ్య మీ స్వామి దర్శన ప్రభావమున విదితము. ఆదిశంకరులాదర్శముగా శ్రీ స్వామి విజయ యాత్రను పాదచారియై సాగించుట ప్రశంసనీయము.
వంగదేశమున నవరాత్ర్యుత్సవములకు పూజ పండుగయని పేరు. ఇది వంగీయులకు చాల ముఖ్యమైన పండుగ. కలకత్తాలో స్వామి సెప్టెంబరు- అక్టోబరులలో వేల భక్తుల కానంద ప్రదముగ నవరాత్రుల పూజసేసిరి. అక్టోబరు మూడవ వారమున మరల నఖండ భారత పదయాత్ర సాగింప బడినది. ఆది గంగకుపనదులైన దామోదర, రూపనారాయణులపై స్వామి తమ పరివారముతో పొగయోడపై పయనించిరి. 1935 సెప్టెంబరు 27న మిడ్నపూరు వాస్తవ్యుల విజ్ఞాపనపై స్వామి యచ్చటి కేగిరి. అప్పుడు మిడ్నపూరు జాతీయ విప్లవోద్యమ కేంద్రముగా నుడికి పోవుచున్నది. చాలా మంది యువకులు, మిక్కిలిగా కళాశాలా విద్యార్థులు రాజద్రోహులుగా చెరబెట్ట బడిరి. పట్టణము నిషేధాజ్ఞలలో నున్నది. అపూర్వమైన స్వామిరాకచే ప్రభుత్వము నిషేధాజ్ఞలు కొంత మేరకు సడలించి యాచార్యస్వామి నాహ్వానించుటకును, మత సమావేశ కార్యక్రమములు నిర్వహించుటకును ప్రజలకు వీలు కల్గించినది. స్వామి మిడ్నపూరు వచ్చిరని తెలిసి చాలా మందిచెరనున్న రాజకీయాందోళన పరులు స్వామి దర్శనము చేయగోరిరి. ఆ రోజు సాయంకాల మారుగంటలలోపున తిరిగి చెరసాలకు వచ్చు నిష్కర్షపైవారి కోర్కెను చెరసాలాధికారి మన్నించి, పోననుజ్ఞ నిచ్చెను. వారు స్వామి బసకు చేరు సరికి సాయంకాలము ప్రొద్దుపోయినది. అందుచే స్వామి పూజానంతరము విశ్రాంతికై లోనికేగిరి. విప్లవ కారులు కొంత తడవు వేచి నిరుత్సాహులై చెరసాలకు మరలి పోనుద్యుక్తులైరి. కాని యింతలో స్వామి బయటకు వచ్చిరి, విషయము తెలిసినది వారికై స్వామి కబురుపంపిరి. వారుమరలివచ్చిరి. సాష్టాంగ పడిరి. దేశ స్వాతంత్ర్య సముపార్జనకును, ప్రజా సంక్షేమ సౌఖ్యలభ్ధికిని స్వామి యాశీస్సులను వారు సవినయముగా నర్థించిరి.
మిడ్నపూరునుండి స్వామి ఖరగ్‌పూరు వెళ్ళిరి. అక్కడ నుండి తాతానగరు పోయిరి. ఖరగపూరులో రైలు మార్గముల కర్మాగారములుకలవు. తాతానగర ముక్కు పరిశ్రమ కేంద్రము. తర్వాత బీహారులోని నాలుగు సంస్థానములు సంచారము చేసిరి. కెయోజరుషుర్‌న నున్నప్పుడు ధరణీ దేవాలయము దర్శించి, గోవింద భంజరి దేవుడను నాయన కంచినుండి యీ విగ్రహమును తెచ్చెనని సంస్థాన పత్రములందు గలదు. మయూర భంజు సంస్థాన ముఖ్య పట్టణమగు బరిపాదమునగల వారణశ్వరీ దేవాలయమున మహాలింగ దర్శనము చేసికొనిరి. రాజ నీలగిరి సంస్థానమున నుబ్జనాగఢ్‌న చండీ దేవ్యాలయము కలదు. మామూలుగా సింహ వాహనమునకు బదులుగా నిచ్చట నెలుగు కలదు. స్వామి యచ్చట నాలుగురోజులుండిరి.
ఒరిస్సాలోని కటకు జిల్లాప్రవేశించి 1936 ఏప్రిల్ 4న జయపుర సంస్థానమునకు స్వామి చనిరి. ఇది కడు పురాతనమైనది. పరమ పవిత్ర మైనది. మహాభారతమున దీనికి విరాజ పీఠమని పేరుగలదు. అష్టాదశశక్తి పీఠములలో నిది యొకటి. ఇచ్చట వైతరణి యుత్తర వాహినిగా ప్రవహించును. ఇక్కడ పండ్రెండు పెద్ద దేవాలయములున్నవి. చిన్నవి చాల గలవు. అన్నియు పురాతన దేవాలయ నిర్మాణ కౌశలమున నచ్చెరువు కలిగించు సుందరతర శిల్పఖనులు. రెండు శతాబ్దులకు పూర్వమిచ్చట సోమయాజిశతములచే జయపురమను బిరుదనామ మీ ప్రదేశమునకు కలిగినది. యాజిపురమే జయపురమైనది. ఇందు దిన పంచకముండి జిల్లాకేంద్రమైన కటకుకు స్వామిచేరిరి. శంకర జయంతి యిచ్చట జరిగినది. 1936 మే 3న సాక్షి గోపాలమునకు స్వామివెళ్ళిరి. ఒరిస్సాలో దీనిని గూర్చి యొకగాధకలదు. ఇద్దరు బ్రాహ్మణులు కంచి నుండి కాశీకిపోయిరి. ఒకడు ముదుసలి. రెండవ యతడు యువకుడు. యాత్రనుండి కంచికి తిరిగి రాగానే తనకూతురు నాయువకునికిచ్చి పెండ్లిచేతునని వృద్ధుడు వాగ్దానముచేసెను. మథురలో గోపాలుని గుడిలో నీ వాగ్దానమీయబడినది. చివరకు ముదుసలి తనవాగ్దానము పాటింపలేదు. యువకుడు రాజు నాస్థానమున నభియోగము తెచ్చెను. సాక్షులెవ్వరని రాజడుగగా యువకుడు గోపాలదేవుడనెను. మథురపోయి దేవుని వెంటతెచ్చినాడు, దారిలో గోపాలునికై యువకుడువెనుతిరిగి చూడరాదు. కంచిసివారులలో నీ నియమోల్లంఘనము యువకుడుచేసినాడు. తక్షణమేతత్ప్రదేశమున గోపాలదేవుడు విగ్రహముగా మారి నిలిచినాడు. తర్వాత పూరీప్రభు వొకడా విగ్రహము నక్కడనుండి సాక్షిగోపాలమునకు తెచ్చెను.
సాక్షిగోపాలమునుండి పూరీజగన్నాధమునకు స్వామి పయనించిరి. పెద్దయూరేగింపుననంతరము గోవర్ధనమఠమున స్వామికి విద్యుక్తముగ నాతిధ్య మీయబడినది. గోవర్ధనమఠముతోబాటు ఇతరాద్వైతమఠములైన శంకరానందమఠము, శివతీర్థమఠము, గోపాలతీర్థమఠములు కూడ నీయుత్సవమున పాల్గొనినవి. స్వామికిని పరివారమునకును వలయు సౌకర్యములు నాల్గుమఠములును చేసినవి. జగన్నాధస్వామి దర్శనము చేసికొని ముఖమండప సభావిద్వాంసులకోర్కెపై స్వామి ముఖమండపము నలంకరించి పరిషత్తున కాశీశ్శులొసగిరి. స్వామి గీర్వాణఖాషలో నుపన్యసించుచు ''ఆదిశంకరభగవత్పాదుల పాదపద్మముల నెల్లరు పూజించిరి. వారు దేశమున తప్పుడుసిద్ధాంతములనున్మూలించి సత్య ప్రతిష్ఠాపనచేసిన మహానుభావులు. జగద్గురువులు. వారివానిగా మాకు మీరీగౌరవము నిచ్చిరని భావింతుము. 1936 మే 6న వైశాఖపూర్ణిమ. పూరీసమీపమున మహోదధీస్నానము స్వామి చేసిరి. 9వ తేదీన నొక పండిత పరిషత్ప్రారంభోత్సవమును స్వామి చేసిరి. వయోవృద్ధులు చాలామంది యిప్పటిస్వామి దర్శన మేబదివత్సరములక్రిందట నరువదియైదవ పీఠాచార్యులు మహాదేవేంద్ర సరస్వతీస్వామివారి సాన్నిధ్యమునే తలపింప జేయుచున్నదనిరి. మరల నరువదియెనిమిదవ యాచార్యసన్నిధి సేవాభాగ్యము గలవారువీరగుట యసదృశ పుణ్యవిశేష ఫలమనిరి.
చిలక సరః ప్రాంత సంచారము చాల కష్టతరమైనది, ఎత్తైన పర్వతములు, దట్టమైన యడవులు, నిసుక తిప్పల యూసర క్షేత్రములు దాటవలెను. దినమునకు నిరువదియైదు మైళ్ళ చొప్పున నడచి యాచార్య స్వామి పరివారముతో 1936 మే 17న ఛత్రపురము చేరుకొనిరి. ఇది సముద్ర తీరమున సరస్సునకు దక్షిణ భాగమునకు చివరగలదు. ఆదిశంకరుల దేవళమిందు కలదు. జులై 4న నారంభ##మైన చాతుర్మాస్య వ్రతము బర్హంపురమున జరిగినది. అక్టోబరులో విజయనగరమున నవరాత్ర్యుత్సవములు నిర్వహింప బడినవి. అక్టోబరు 31న నొక మహాసభలో స్వామి యద్వైతమును గూర్చి ప్రపంచించిరి. హరిహరభేదము లేదనియు, సమర్థ రామదాసుని వంటి మహా యోగులు హరిహరాద్వైత మార్గావలంబనమున తరించి రనియు వివరించిరి, జ్ఞాన మార్గ గాములు జీవ బ్రహ్మద్వైత ప్రాప్తి నందుదురు. జ్ఞానోపాసనా మార్గముల రెండిటికిని లక్ష్య మొకటేయని స్వామి స్పష్టీకరించిరి.
ఆంధ్రలో సింహాచల క్షేత్రముపురాతనయాత్రా కేంద్రము. మనోహరమైన సింహాద్రిపై వరాహ నరసింహస్వామి నెలకొని యున్నారు. 1936 నవంబరు 4న దైవ దర్శనము చేసికొని స్వామి గంగాధారా జలపాత సమీపమున కొంతసేపు ధ్యానమున గడిపిరి. మూడు రోజుల తర్వాత విశాఖపట్టణము చేరిరి. ఇది రేవుపట్టణము. ఈ ప్రాంత సంచారానంతరము గోదావరీ ప్రాంతం పర్యటించిరి. 1937 చాతుర్మాస్య వ్రతము పాలకొల్లున జరిగినది. అక్కడ నుండి రాజమహేంద్రవరము చేరిరి. ఇది గౌతమీ తీరమున గలదు. 1938 జనవరి 31 మహోదయ మహాపర్వము ఆచార్యస్వామి కాకినాడ సంద్రమున పర్వస్నానమాచరించిరి. తర్వాత కృష్ణా గుంటూరు నెల్లూరు మండలముల పర్యటన జరిగినది. విజయ వాటికలో కృష్ణా స్నానము చేసిరి. 1938 చాతుర్మాస్యవ్రతము గుంటూరున జరుపబడినది. ఈ సమయమున ప్రఖ్యాత వ్యాకరణ పండితుడు శ్రీ పుల్య ఉమామహేశ్వరశాస్త్రిగారు నూట డెబ్బదియైదుశ్లోకములు గల శ్రీ చంద్రశేఖర విజయ మహారత్నహార సంస్కృత కావ్యమును స్వామి కంకితమిచ్చిరి.
1938 నవంబరు నుండి 1939 జనవరి వరకు స్వామి నెల్లూరున విడిది చేసిరి. వెంకటగిరిని, కాళహస్తిని, దర్శించి తిరుపతికి మరల స్వామి చేరిరి. 1939 ఏప్రిలులో శ్రీ శంకర జయంతి ''బుగ్గ''లో జరిగినది. తిరుత్తని కొండపై శ్రీ సుబ్రహ్మణ్యశ్వరు దర్శించుకొని 1939 మే 2న స్వామి కంచిచేరుకొనిరి.
కంచి నుండి చిదంబరము మీదుగా రామేశ్వరమునకేగి యచ్చట రామనాధస్వామికి త్రివేణీ సంగమము నుండి తెచ్చిన గంగతో నభిషేకము చేయవలె. రామేశ్వరమున 1922 సెప్టెంబరులో తీసికొనిస యిసుకను త్రివేణీ సంగమముస 25-7-1934 తేదీన కలిపిన సంగతి పఠితలకు తెలియును గదా. అచ్చటి గంగను రామేశ్వరమునకు గొంపోయి వినియోగించుట విధి. 1939 జూన్ 10న నగ్ని తీర్థమున స్నానమాడి స్వామి దేవాలయమున కేగి యభిషేకము చేసిరి. దీనితో స్వామి వారి గంగా యాత్ర, సంపూర్ణమైనది. మఱునాటి నుండి యారుమాసములు స్వామి మౌనము పాటించిరి. అయినను యాత్రా కార్యక్రమమమాగలేదు. మఠ విధులు నిర్వహింపబడుచునేయున్నవి. రామనాధపురము, పుదుక్కోట, తిరుచ్చి, తంజావూరు మండలములందుచాలప్రదేశములుపునస్సంచారముచేసి యిరువదియెక్క సంవత్సరముగాకొనసాగుచున్న విజయ యాత్రను ముగించుకొని యాచార్య స్వామి కుంభకోణమున ప్రవేశించిరి. ఇచ్చటి నుండియే విజయ యాత్ర ప్రారంభ##మైనది. 1939 జూన్ 29 యాపట్టణ వాసులకు చిరస్మరణీయమైన శుభదినము. స్వామి సన్నిధి తమకు లభించినందులకు వారి యానందాని కంతులేదు.
మన ప్రాచీన ధర్మ సంస్థాపన-పురోగతి
యావద్భారలైక వింశతివత్సరయాత్ర, మనప్రాచీన ధర్మ సంస్థాపనా ప్రగతులకు వలసిన నిర్మాణాత్మక చర్యలకు సుగమ మార్గము నేర్పరచినది. తరువాత కాలగతిని హిందువులలోని విభిన్న వర్గములూరి సమైక్యమునను, వైదిక, వేదాంతాధ్యయనాను ష్ఠానములకును, విథ్యుక్త మతకర్మాచరణమునకును, శాస్త్రదృష్టి సిద్థాంతాచార ప్రచారములకును, ప్రజా జీవనమున నాధ్యాత్మికౌన్నత్యమునకును, దీన జన సంసేవనముసకును, లోక కళ్యాణమునకును, యోగ్యములైన యనేక మార్గములకు స్వామి యంకురార్పణము చేసిరి.
స్వామి 1939లో ముద్రాధికరావర్గ సమితినేర్పాటు చేసిరి. దీన ప్రజాసేవ పెద్దయెత్తున చేయనగునని తలంపు. పలుదావులనున్న మఠ ప్రతినిథులను ముద్రాధికారు లందురు. ఈ సమితి కార్య విథులు దేవాలయముల బాగుసేతకు ప్రజా సహకారము సేకరించుట, దేవాలయములందు నిత్యార్చనాదులు నుత్సవాదులను యధావిధిగా జరుగునట్లుచూచుట, ఏకాదశివంటి పర్వదినముల నుత్సవముల పురాణ ప్రవచనము జరిపించుట. ఉత్సవములందు బండ్లు రధములు లాగుట, నూతులు చెరువులు త్రవ్వుట వంటి సహకార కార్యక్రమములలో నన్ని వర్గముల ప్రజల నొక్కచో చేర్చుట, మొదలైన ప్రజాహిత కార్యముల ప్రగతికి తన్మూలమున సత్ఫలితా వాప్తికిని నాచార్యస్వామి తంజావూరు మండల గ్రామములకును, నితర ప్రదేశములకును పర్యటించి, ముద్రాధికారుల సమావేశములను నియమిత కాలముల నేర్పాటు చేసి వారికి స్వయముగా విధి నిర్వహణ విధానము నుద్భోధించిరి.
స్వామి దర్శకత్వముననెన్నో జీర్ణ దేవాలయముల పునరుద్ధరణమును, కుంభాభిషేకోత్సవములును నిర్వర్తింప బడినవి. పునరుద్ధరణానంతరము బంగారు కామాక్షి కుంభాభిషేకము 1941 జూన్‌లో జరిగినది. జంబుకేశ్వరమున పంచముఖేశ్వరాల యముజీర్ణస్థితిలో నున్నది. 1943లో స్వామిదర్శించి యక్కడ పెరిగిన చెట్టు చెదారమును తీయించి, యా దేవాలయ నిరుమాన సౌందర్యమున కబ్బురపడి, దాని పునర్నిర్మాణమునకు నేర్పాట్లు చేయించిరి. ఆ వత్సరము జూన్‌లో కుంభాభిషేకము చేయించిరి. వీరచోళ నది యొడ్డుననున్నతిరువిడై మరుదూరున శివాలయము కలదు. అది సంపూర్ణ శిధిలావస్థలో నున్నది. దీని బాగుచేత చేయించి కుంభాభిషేకమును 1943లో స్వామి చేయించిరి. చాలా యేండ్లుగా కంచికామాక్షి దేవాలయ పునరుద్ధరణము ప్రగతిలో నున్నది. బాగుసేత పూర్తికాగానే 1944 ఫిబ్రవరి 7వ తేదీన మహావైభవముగా కుంభాభిషేకము జరిగినది. సుమారేబదివేల భక్తజనులు దేవాలయ ప్రాంగణమున జేరి కుంభాభిషేక మహోత్సవము దర్శించి తరించిరి. తన్నిదర్శనముగా కామకోటి కోశస్థానము ''మూకపంచ శతి'' యను దేవీక్తవము ముద్రించినది.
రెండవ ప్రపంచ యుద్ధ దుష్పలితములు ప్రజానీకమునకు కష్టనష్టములు కలిగించి భయాందోళనలు కలిగింప కుండ నన్నిదేవాలయములందును రుద్రాభిషేక రుద్రసహస్ర విష్ణు సహస్రనామపారాయణలును, విద్యుక్తార్చనలును జరుపవలెనని 1942లో ధర్మాదాయశాభా యాజమాన్యమునకును, దేవాలయాధికారులకును స్వామిసూచించిరి. తదనుసారముగా చాల దేవాలయములలో నట్లు చేయబడినది. 1942 ఏప్రిలులో మన్నారు గుడి సమీపపు పూవనూరులో సర్వ ప్రజా సంక్షేమార్థము స్వామి సన్నిధానమున అతి రుద్రయాగము చేయబడినది. సెప్టెంబరులో తిరుచి మండల మందలి ''నట్టము''న నీయాగమే చేయబడినది. ఈ వత్సరపు చాతుర్మాస్యవ్రత మిచ్చటనే స్వామి జరిపిరి. తిరుచి పట్టణమునకు పశ్చిమమున ముప్పది మైళ్ళ దూరమున నున్న ''శంకరమలై''ను స్వామి యీ మండల సంచారమున చూచిరి. కాశ్మీరముననున్న శంకారచార్య పర్వతముపై నున్నట్లే యిచ్చట కూడ మహాలింగము కలథు. 1943 మార్చి 2న స్వామి ఈ కొండనెక్కినప్పుడు రెండింటికిని గల సాదృశ్యము గమనింపుడని ప్రజలను హెచ్చరించిరి. తిరువిడై మరుదూరున తరువాత అతి రుద్రమక్షమము 1949 ఫిబ్రవరిలో చేయబడినది. పూర్వమున వలెనే జనులు వేల సంఖ్యను వచ్చి పాల్గొని స్వామి ప్రసాదము నందుకొనిరి. దేవీ నవరాత్రులు కూడ నిచ్చటనే జరిగినవి. తర్వాత 1949 అక్టోబరు-నవంబరు మధ్య కాలమున స్వామికుత్తాళమున నుండిరి. తులా స్నానమునకు ప్రతిదినమును మాయూరమునకు వెళ్లెడివారు.
హిందువులకు వేదము మూల గ్రంథము, చారిత్రకముగా నొడుథుడుకులు కలిగినను వేద రక్షణ వలననే హిందూ సంస్కృతి పరిరక్షింప బడినది. ఆధునిక విధానము వలనను నితర ప్రభావము వలనను నీ మధ్య కాలమున వేదాధ్యయన పఠన శిక్షణా కౌశలము సన్నగిల్లినది. ఈ క్షీణతకు కారణమైన దుష్టశక్తుల వైదొలగజేయుటకు స్వామి ''వైదిక ధర్మ పరిపాలనా సభ''ను స్థాపించిరి. 1944లో నారంభ##మైన యీ సభాధ్వర్యమున, దేశమున వివిధ భాగములలో వేద పండితులకు వార్షిక సమావేశము లేర్పరుప బడినవి. వైదిక సారస్వతమున పరీక్షలు జరిపి యుత్తీర్ణులకు బహుమతి ప్రధానము చేయబడినది. ఎన్నిక గన్న వేద విద్వాంసులకు జీవన వేతన మీయబడినది. వేదపాఠశాల నేర్పరుప బడినది. వైదిక సంస్కృతి పరిరక్షణకు వలయు సాధ్యమైనంత సాయ మన్ని విధముల చేయబడినది. 1955 జనవరిలో కంచిలో స్వామి యున్నప్పుడు ప్రముఖ వేద పండిత సమ్మేళనము గావించిరి. ప్రముఖ వేద పండితులు యావద్భారతము నుండి ఋగ్యజుస్సామవేదములలో నెన్నిక గన్న 17 మంది బహుమతులతో సన్మానింప బడిరి. భాష్యముల మూలమున, ననేక వేదాంత రచనల ద్వారమున, నాదర్మానుష్ఠానముల నుపదేశమున- నుపదేష్టగా, జగద్గురువుగా, నాదర్శముగానంది శంకరులు మానవకోటికి ప్రసాదించిన మహాపరమద్వైత సిద్ధాంతము. శంకరభగవత్పాదులు నెలకొల్పిన యే మతసంస్థ ప్రధానాశయమైన నద్వైతజ్ఞాన ప్రచారమే. అద్వైత వ్యాప్తికి కంచికామకోటి పీఠ జగద్గురువర్యులు బహుముఖకృషి నగణితముగా జేసిరి. అద్వైతాధయనాభి వృద్ధికి నొక ముఖ్య విధానము 1894లో మన స్వామి పరమ గురువులు కుంభకోణాద్వైత సభను ప్రారంభించినప్పుడు రూపొందింపబడినది. అద్వైత పండితుల వార్షిక సమావేశములు, నద్వైతాధ్యయన పరుల కుపకార వేతన ప్రధానమును, నద్వైతాధ్యయనమునకు సముచిత పాఠ్య ప్రణాళికా నిర్ణయమును ''బ్రహ్మ విద్య'' యను సంచికా ప్రచురణమును దానితోబాటు చేయవలసిన ముఖ్య కార్యక్రమములు పూజ్యపాదు లరువది యారవ పీఠాధిపతుల సమక్షమున ప్రధమ సమావేశము 1895 లో జరిగినది. మహా మహోపాధ్యాయ శ్రీ రాజుశాస్త్రి యగ్రేసరులుగా కొందరు ప్రఖ్యాత ద్వైత విద్వాంసులు గంభీరోపన్యాసములిచ్చిరి. శాస్త్రార్ధ చర్చలు, వాక్యార్థ వివరణము గీర్వాణమునను, తమిళమున జనాదర పాత్రములైన యుపన్యాసములును నీ సమావేశముల కొన్ని ముఖ్య కార్యక్రమములు అద్వైత శాస్త్ర పరీక్షలలో నుత్తీర్ణులైన వారికి బహుమతులీయబడినవి. ఏటేట వారు వార్షిక సభలకు వెళ్ళినచో వారికి బహుమతులీయ బడెడివి. 1945 లో మన స్వామివారిసమక్షమున నీ సభ స్వర్ణోత్సవము కుంభకోణమున మహా వైభవముగా జరిగినది. స్వామి యా సభ కృషి నభినందించి యద్వైత వేదాంతప్రాశస్త్యము నుగ్గడించిరి. ఆత్మ యొక్కటే నిత్యము తక్కినవి మిధ్య యనునదే యద్వైతమూలసూత్రమని స్వామి నిరూపించిరి. మిధ్యమాయా శబ్ధముల యంతరార్థము సరిగా నవగతముచేసికొనక విమర్శకు లద్వైతమునదోసము నెంతురు. పర్యవసానమున ననేకత్వమున ప్రపంచమున సత్యములేకపోయినను నది నిష్రయోజన కరముకాదు. జ్ఞానోదయము వరకు మాయాప్రపంచముపయోగపడును. అందుచేదానిని వ్యావహారిక సత్యముగా పరిగణించిరి. ఈ జగముననుండియే సజీవముగనే, మనము ముక్తికై యత్నింపవలెను ఈ జీవితముననే జ్ఞానోదయమున మాయావరణ భంగమై స్వుస్వరూపాను సంధానము నందుట యసలైన మోక్షము. వివిధమతానుయాయులు వారివారి ప్రత్యేకారాధనా విధానమే యసలైనదని తలంతురు. కాని యద్వైతులమైన మనమే మతమార్గము వలన నైనపొందబడునది యొకేదైవ మనినమ్ముదుము. అద్వైతమతసత్యత్వమునుగుర్తించుటకు దైవభక్తి ప్రధానము, అద్వైత మతబోధకులు దేశ వివిధభాగములందెప్పటికప్పుడు పొడ చూపి యద్వైత ప్రదర్శకముగా శాశ్వతరచనలు చేసిరి. ఆ గ్రంథములను చదివి యందలి సారభూతమైన జ్ఞాన సంపాదన చేసికొనుట మనవిధి. స్వర్ణోత్సవ చిహ్నముగా ననేక విద్వాంసులచే సంస్కృతమున విరచింప బడిన యేబది యొక్క వ్యాసములుగల యద్వైత ప్రభోద సంచిక ప్రచురితమైనది. దీనితోబాటు తమిళమున నాంగ్లమున నద్వైత విషయిక వ్యాస గ్రంథములు రెండు ప్రచురింప బడినవి.
పదియేండ్ల తర్వాత 1956 మార్చిలో నీ యద్వైత సభా వజ్రోత్సవము కంచి సమీపమున నున్న శివస్థానమున జరుపబడినది. స్వామియప్పుడు కంచిలోనే యుండిరి.
ఉపనిషత్ప్రదర్శితమైన యాత్మతత్త్వమును ప్రచారము చేయుట, యద్వైత మతావలంబకులు తమయందు నిభిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగవలయుట, యను దినము దీనజనసేవనేదో యొక విధమున నాచరించుట, వివిధ మతముల భేద పరిష్కారము చేసి సామరస్యము కల్గింప యత్నించుట యద్వైత ప్రధాన లక్ష్యములుగా స్వామి సభాస్తారుల కుద్భోధించిరి.
అద్వైత మతమూలమునచే మత విభేదములు తొలగ గలవు. పరస్పరావగాహము సానుభూతి కల్గినచో నొకేదైవము వివిధ నామ రూపములతో నారాధింప బడుచున్నాడని గుర్తించుట దుష్కరము కాదు. తలకొక విధమున దైవారాధనమున్నదను విషయము ప్రపంచ మత చరిత్రకు హిందూ మతము ప్రసాదించిన విశేషాంశమనునది వాస్తవము, అయినను నపోహలు సంకుచితత్వముల ఫలముగా హిందూమతమున గల విభిన్న సిద్ధాంతముల వారప్పుడప్పుడు తగవులాడుకొనుచుండిరి. దక్షిణ భారతమున శైవవైష్ణవములలో నీ తగవు లెక్కువయైనవి. ఆళ్వారులు నాయనారులు సర్వ సమానత్వదృక్పధము కలవారేయైనను వారి యనుచరులు చంకుచిత భేదములను, మూర్ఖములైన పాక్షిక వైశిష్ట్యములను లేవదీసిరి. తమిళనాడుననున్న శైవ వైష్ణవ సమైక్యసామరస్యముల సాధించు సమన్వయపద్ధతికి నుద్యమము రూపొందింప స్వామి కోరిరి. తదనుగుణముగా 1950లో తిరుప్పావై తిరువెంబవై షడంగ సమావేశము జరిగినది. ధనుర్మాసమున శివాలయముల మణిక్కవాచకారుల తిరువెంబవై - విష్ణ్యాలయముల నాండాళ్ళ తిరుప్పావై గానము చేయబడినవి. 1950 డిసెంబరులో తిరువిడై మరుదూరులోని శైవవైష్ణవ పండితుల సమావేశ పరచి స్వామి యుభయుల నొకే వేదికపై మాట్లాడించిరి. ఇది యపూర్వ సన్నివేశము. ''నదీనాం సాగరోగతిః'' వలెసర్వమతములను సర్వేశ్వరు నొక్కనినేచేరును. అని స్వామి యా సమావేశముల చివర దినమున స్పష్టపరచిరి. ''ఏకో దేవః కేశవో వాశివోవా'' ''ఏకమే వాద్వితీయం బ్రహ్మః'' సర్వ రక్షక సత్యమొక్కటే. ఆ దైవమును చేరుట కనేక మార్గములు. విభిన్న మార్గ గమనమున దారితప్పి గమ్యమొక్కటే దైవమనునది మరువరాదు - భిన్నత్వమున చిక్కుకొనినచో సుఖములేదు. నాట్యభంగిమ నున్న నటరాజస్వామి, నిశ్చింతగానున్న విష్ణువు వీరి విగ్రహములు సంపూర్ణ సౌఖ్యమునకును, నిరృయత్వమునకును చిహ్నములనునది ప్రత్యక్షానుభవము నందిన నాడే యీ తిరుప్పావై - తిరువెంబవై గానము పరామార్థ దాయకమును, పరమానందప్రదమునునగును'' అని స్వామి ప్రకటించిరి.
మఱియొక సభలోనిదే విషయమున మాట్లాడుచు స్వామి చెప్పినది ''ఒకే పరదైవమును భిన్న దృక్పధముల నారాధించుటచే ప్రజలు పరస్పరము తగవులాడు నగత్యములేదు, శివ పురాణము శివుని, విష్ణు పురాణము విష్ణుని స్తుతింపవచ్చును. కాని సముచితావగాహమున దురభిప్రాయము తొలగిపోవును. పురాణములందొక దేవతాస్తుతి చేయబడిన నది తావన్మాత్రమే గాని పరమము కాదనిగ్రహింపవలెను. వాస్తవికముగా రెండు లేనప్పుడు, ఒకే దైవము భిన్న నామరూపముల భాసించు నపుడు, హెచ్చు తగ్గులుగాని, ఉత్తమాధమములుగాని యెట్లుండగలవు. శివకేశవాభేదమును హరిహరాద్వైతమును చాటు గ్రంథములున్నవని మనము విస్మరింపరాదు. శివద్వేషులు విష్ణుదోషులే యనియు విష్ణుద్వేషులు శివద్వేషులే యనియు సుస్పష్టముగా ప్రకటింపబడినది. మనలో నెవరికిష్టమైన రూపమున వారు దేవతారాధన చేయవచ్చు. ఇది ''యిష్టదేవతారాధన పద్థతి'' నిర్గుణ కేవల పరమాత్మ నందుటకు ముందు సగుణ రూపమున దేవతారాధన మారంభింప వలెను. నీ యిష్టమైన యా మూర్తియే నీ యిష్ట దేవత. ఎవరికిష్టమైన దేవతామూర్తిని వారారాధింప ననుపుగా నుండును. భ##క్త్యేకాగ్రతలు కొనసాగు చున్నకొలది వారు భేదరహితమైన కేవల పరబ్రహ్మము నందగలరు. మహర్షులు మహా యోగులు పొందిన యనుభవమిది. అందుచే నిజమైన శివభక్తులు నిజమైన విష్ణుభక్తులతో పోరాడరాదు.''
''ఈ సందర్భమున రెండు భక్తి కీర్తనలను, సూక్తులను మనము స్మరించుట మంచిది, అవి ఆండాళ్లు రచించిన తిరుప్పావై - మణిక్కవాచకరుని తిరువెంబవై. భిన్నమార్గగతులైన భక్తులు కీర్తించు విష్ణుస్తుతి పరమొకటి - శివస్తుతి పరమొకటి. రెండును నిద్రాలసులైన భక్తులకు మేలు కొలుపులు. ఈ రెండు కీర్తనల భాషా రచనమునను వస్తు వర్ణనమునను సామ్యము స్పష్టముగా గోచరించును. భక్త దృక్పధమునను, భక్తియందును, శివకేశవభేదదృష్టి యుండనక్కరలేదని మనం తప్పక తుది నిర్ణయం చేయవలసి వచ్చును. ఒక దేవతా భక్తుడన్ని దేవతలకారాధకుడే. భక్తి సామరస్యమునకునిది యొక్కటే మార్గము. మన మతమునందలి యాస్తిక సంస్థలన్నియు వేద మత జన్యములే వేదము ''ఏకంసత్‌విప్రాః బహుధావదన్ని'' యని ప్రకటించు చున్నది. ''ఉన్నదొక్కటే, యెన్ని రూపులనైన నెన్నవచ్చు'' ''పేరుపేరునం బిలువవచ్చు''.
ఆరంభం నుండియే యీ సమైక్యోద్యమము క్రమక్రమంగా ప్రజాభిమానమును చూరగొనుచున్నది. బాలబాలికలు పై రెండు కవితలను గానం చేయుట కుత్సాహపడు చుండిరి. ధనుర్మాసమున నీ రెండు కీర్తనలు దేవాలయములలో, వాయు ప్రసారం చేయబడినవి, హృదయంగమములైన నీ రెండు కవితాగానముల నాకాశవాణి మూలమున ప్రసారము చేయించుటకు నీ సంస్థ సహకరించుచున్నది. తమిళనాడున వివిధ ప్రాంతములలో నీ రెండుకీర్తనల ప్రచారప్రపంచములకై నెలయంతటను సభ##లేర్పాటు చేయబడుచున్నవి. 1952 డిసెంబరు 8న మాయూరమున దక్షిణామూర్తి దేవళమున జరిగిన యొకసభలో దూరదేశ##మైన ధాయిలాండులో తిరుప్పావై తిరువెంబవై పండుగ యిప్పటికినిజరుగుచున్నదనియు, దీని ప్రాముఖ్యము మన ప్రజల కెరుకలేదనియు నిది పరిశోధనల వలన క్రొత్తగా తెలిసినదనియు స్వామి నిర్దేశించిరి. ఈ యుత్సవము శివకేశవ సమ్మోదమునకై చేయబడును. ఆర్ద్ర దర్శనమున నక్కడ నీయుత్సవము జరుగును. ఇక్కడ వలెనే యక్కడ కూడ తోడుగా ''డోలా మహోత్సవము'' కూడ చేయబడును. తమిళనాడున ''ఆర్ద్రను'' తిరుప్పావై-తిరువెంబవై ''నామ మున మనము పిలువము. ధాయిలెండు వ్రజలట్లు పిలుతురు. ''త్రివెంబవై-త్రిపావై''యని కొలది మార్పుతో నీ నామ మచ్చట పలుక బడును. మన దగ్గర నేర్చుకొన్నను తాయి ప్రజలీపండుగను చేయుచున్నారు. ఈ విషయము గుర్తించి మనముకూడ నీపండుగను పునరాచరణలో పెట్టవలెననియు, మన యాచారములను, ప్రజలలో ప్రచారము చేయవలెననియ, ధాయి ప్రజల పండుగ మనకు నేర్పుచున్న పాఠమని శ్రీ ఆచార్యస్వామి ప్రజల దృష్టికి తెచ్చిరి.
''హిందూ సంస్కృతికి మతమాధారము. ఆధ్యాత్మికత దానికి వెన్నెముక. ఇతరత్ర తాకిక కళలనబడు శిల్ప నృత్యాది కళలు మనకు పవిత్రమైనవి. హిందూ సంస్కృతి సర్వాంగీణముగా గతమున ప్రపంచ పరివ్యాప్తమైనది. దాని ప్రభావ మంతట కలదనుటకు సాక్ష్యములు పశ్చిమమున నీజిప్టు నుండి తూర్పున జావా, బలి వరకు గలవు. సర్వవ్యాపకమైన హిందూ సంస్కృతిని గూర్చి యుపన్యసించు సందర్భమున 1947 జనవరిలో కుంభకోణ మఠమున సభలో స్వామి జాతీయములయిన కళలు వృత్తుల నుద్ధరింప వలసిన యవసరమునుద్ఘాటించుచు వీనినుద్ధరించి ప్రజాదరము నందునట్లు చేయ వలెను. ఇవియన్నియు దైవ విశ్వాసమును, నాధ్యాత్మిక ప్రయోజనములందు దృఢమైన నమ్మకమును సమకూర్చునవేయని మన మనసుననుంచుకొనవలెను. పురాతనములై నకళలకును వృత్తులకును దేవాలయములు కేంద్రములు. వాస్తు శిల్పకళ, ప్రతిమా శిల్పముదేవాలయనిర్మాణమునందును, విగ్రహ రూపకల్పనము నందును కావలసినవి. ఈ కళల సిద్ధాంతములు, గమనికలు శైవ, శాక్త, ఖానస. పాంచరాత్రాగమముల నుండి నేర్చుకొన వలయును. ఈ యాగమములే విధ్యుక్త దేవదార్చనకు, దేవాలయ విధి నిర్వహణకు నవసరమయిన శాస్త్ర విషయములకు, నర్చకుల కాధారములు. ఉత్సవములందును, పర్వములందును దేవాలయములందే పురాణతిహాసముల ప్రవచనము జరిగెడిది. జానపద గేయములు, నృత్యములు, పురాణతిహాసములందలి మత గాధలే కథా వస్తువు గాగలవి. దేవాలయ నిర్మాణాత్మక ప్రాచీన శిల్ప కళా పునరుద్ధరణకును, పరిపోషణకును, కృషి చేయు నొక సంస్థను రూపొందింపవలెనని స్వామి వాంఛించిరి. 1962 లో ప్రప్రథమముగా నొక సదస్సేర్పాటు చేయబడినది. ఇది చాతుర్మాస్యకాలమున ''ఇల యాత్తం'' గుడిలో జరిగినది. ఇది ''అఖిలవ్యాస భరతాగమ శిల్ప సదస్సు''. అభిమాన శాస్త్ర ప్రవీణులు, విద్వాంసులు, నీ సదస్సును దారాశయముల మేరకు వార్షిక సమావేశమున వారివారి యభిమాన విషయముల పత్ర సమర్పణకును, విషయోద్ఘాటన ప్రసంగములకు నాహూతులైరి. సంప్రదాయజ్ఞులైన యాగమ పండితులతో బాటు, శిల్పప్రముఖులు, విదేశ విద్వాంసులు కూడ సదస్సులో పాల్గొనిరి. అర్చకులు, కర్మకాండలు, దేవతార్చనాదులను గూర్చి చర్చచేసి సందిగ్థ విషయ సమన్వయము చేయవలెను. తోలుబొమ్మలు, బొమ్మలాట, అట్ట తులాలు యక్షగానము, బుఱ్ఱకధ, విల్లుపట్టు-కధక-మొదలైన సాంస్కృతిక కార్యక్రమము లేర్పాటు చేయబడినవి. ఇప్పటికినీ సదస్సు శాశ్వతమైన వార్షిక కార్యక్రమమైనది. 1963లో నారాయణ పురమున (మథుర) 1964లో కంచిలో 1965లో మదరాసున 1966 లో కాళహస్తిలోనీ వార్షికసభలు జరిగినవి. కాళహస్తిలో యరువదవ చాతుర్మాస్యవ్రతము స్వామి జరిపిరి.
హిందూమత సంస్థలను నాచారవ్యవహారములను సంరక్షించుటకును, పురోగమింపజేయుటకును, వలసిన సమష్టివిధానములను రూపొందింపజేసి యనుష్ఠింపజేయుటకు, దక్షిణభారతమునందలి ధర్మ పీఠముల యధ్యక్షుల నప్పుడప్పుడు సమావేశముల సమీకరించుటకై కడచిన కొలది వత్సరములలో జరిగిన కృషి గణనియమైనది. ఇది స్వామివారి నేతృత్వముననే సాధ్యమైనది. ఈ ప్రయత్నమున హిందూ దేవాలయసంస్థ హృదయపూర్వక సంపూర్ణ సహకారము నిచ్చుచున్నది. ధర్మపీఠాధిపతుల సమావేశముల యుద్దేశములివి.
ఆస్తికబుద్ధి ప్రజలలో పెంపొందింపజేయుశక్తుల పటిష్ఠముచేయుట తన్మూలమున నసలైన హిందూ ధర్మస్వరూపము ప్రజల కన్నులకు కట్టునట్టు చేయుట, హిందూ సంఘసంస్థాపనకు కృషిచేయుట. హిందువులు సదాచారసంపన్నులగునట్లు చేయుట స్వల్పములైన భేదములుతప్ప-వివిధ హిందూమత సంస్థలలో సామ్యమే యెక్కువయున్నది. ఒక మంచి విషయమేమన-వివిధ సంప్రదాయములకు మూల ధర్మమొకటే యనియు ప్రథాన బాధ్యతలొకటే యనియు, మోక్ష రూపగమ్యమొకటే యనియు నుద్ఘాటింప సాగిరి.
బియ్యపు దాన కార్యక్రమము స్వామి రూపొందించిన దీనజన సహాయ కార్యక్రమములలో నొకటి, ఇది చాలా తావుల ననుష్ఠింప బడుచున్నది. దీని ననుసరించి ప్రతి ఇంటను ప్రతి దినము వంటకు ముందు గుప్పెడు బియ్యము నొక్క పైసను దీని కుద్దేశించిన యొక పాత్రలో నుంపవలెను. వానిని వారమున కొకసారి యేవాడకావాడ కెన్నికయైన సంఘమువారు సేకరింపవలెను. వాడలోగాని దగ్గరలోగాని యున్న దేవాలయమున దానిని పండించి దేవతా నివేదన కుపయోగింప వలెను. ఈ నివేదితాన్నమును పొట్లములుగా కట్టి పొట్లము పదిపైసల వంతున పేదల కమ్మవలెను. ఈ వచ్చిన ధనమును, పాత్రలలోని పైసలను కట్టెలు మొదలైన వంటచెరకునకును, సామగ్రికిని, వంటవానికినివెచ్చింపవలెను. ఈ విధానము ధాతృప్రతి గృహీతలకుభయులకు ప్రయోజనకరమే. ప్రతి దినము తాము దేవతారాధనకు తమ యోపినంత వినియోగించు కొనుచున్నామని దాతలు, దైవ ప్రసాదము భుజించుచుంటిమని ప్రతి గృహీతలు తృప్తినందుదురు. దీనసద్భావము పెంపొందును. ఆకలితీరును. ఇట్లు ప్రతి గృహీతలకు లాభము.
దిక్కులేని హిందూశవములను పురపాలక సంస్థలును, నగర పాలక సంస్థలును పార వేయు ఘోరపద్ధతి దుర్భరమైనది. జీవించినంతకాలమే కాక మరణించినప్పుడుకూడ దురదృష్టవంతులైన దీనుల యెడ కలవారు దయతో తమ బాధ్యతను నిర్వర్తింప వలెననిస్వామి పదేపదే యుద్భోధించుచునేయుండిరి. ఈ దిక్కులేని శవముల కంత్యక్రియలు చేయుట చాల ముఖ్యము. దీని ఫల మశ్వమేధఫలమంతటిది. (అనాధ ప్రేత సంస్కారా దశ్వమేధఫలం లభేత్) స్వామి ప్రోద్బలమున నేర్పరుప బడిన ''హిందూమత జీవాత్మ కైంకర్య సంఘ'' కర్తవ్యములలో నిదిమొదటిది. వీథులలో, చెరసాలలో వైద్యశాలలో మరణించిన దీనుల కంత్యక్రియలు జరుపుటయు సంఘ సభ్యల విధి.
ఈ సంఘ కార్యక్రమములు :
వైద్య శాలలకు వారవారము వెళ్ళుట, స్వామి వారి ప్రసాదము విభూతి, కుంకుమ లిచ్చి బాధా నిర్మూలనము చేసి సుఖమిచ్చు దైవధ్యానము చేయించుట, మరణాసన్నులైన వారికి తులసి, గంగా తీర్ధముల నిచ్చుట, వారి ప్రక్కనే యుండి రామనామ స్మరణ చేయుట, వారమున కొకసారి గ్రామములకుపోయి యచ్చటి ప్రజలకు హిందూ ధర్మమూల సూత్రములు వివరించుట, చెరలో నున్నవారికి నైతికాధ్యాత్మిక శిక్షణ సూత్రములపై తరచు సంభాషణల నేర్పాటు చేయుట.
ఇటీవల స్వామి వారిచే నారంభింప బడినయితర కార్యక్రమములు-సంస్థలు.
1. వారభజనలు : ఒక్కొక్క ప్రదేశమువారు సామూహికముగా వారమున కొక్కసారి సమీప దేవాలయమున కేగి భజనచేయుట.
2. అమర భారతీ పరీక్షా సమితి నెలకొల్పి, దాని యాధ్వర్యమున ప్రారంభకులకు సంస్కృత బోధ చేయించుట, నియమితకాలమున పరీక్షలు నడపి యోగ్యతా పత్రములు బహుమతుల నిచ్చుట.
3. సంస్కృత భాషాధ్యయనము నభివృద్ధి నొందించుటకు మదరాసు సమీపమునగల నజరత్‌పేటలో మదరాసు సంస్కృత విద్యా సంఘస్థాపన చేయుట.
4. అద్వైత గ్రంధకోశ ప్రచురణ : దీనిని కంచి యుషనిద్బ్రహ్మేంద్ర మఠ యతీంద్రులు దీని సంకలన కర్త. వీరు స్వామి వారు రూపొందించిన కార్యక్రమములలో చాల సంవత్సరములుగా తోడ్పడు చున్నారు.
5. ముఖ్య యాత్రా స్థలములందు నాదిశంకర స్మారక మండప నిర్మాణములు-వీని విషయము ముందు ముందు ప్రస్తావింప బడును.
మన సాంస్కృతిక పతనమునకు ప్రథాన కారణములలో విదేశముల ప్రాబల్యమొకటి. 1947 అగస్టు 15న మహాత్మాగాంధి నాయకత్వమున భారత దేశ స్వాతంత్ర్య ప్రాప్తితో నిది తొలగినది. కాని రాజకీయ విముక్తి మాత్రమున గమ్యము సాధింప బడలేదు. అది భారతీయ చైతన్య నవోన్మేషమునకు దారితీయవలెను. స్వాతంత్ర్యదినోత్సవమున స్వామి యిచ్చిన సందేశ మిది. ''ఈ భారతదేశము స్వాతంత్ర్యము నందిన యీ శుభావసరమున ప్రజలెల్లరు నైక్యభావనతో హృదయ పూర్వకముగా దైవ ప్రార్థన చేయవలెను. అధ్యాత్మిక ప్రగతికి, మనోదార్ఢ్యమునకు భగవంతుడు శక్తిని ప్రసాదింప వలెనని మనము ప్రార్థింపవలెను. భగవంతుని దయవలననే మనకు లభించిన స్వాతంత్ర్యమును పరిరక్షించు కొనగలము. ప్రపంచ జీవులలెల్లరును నిజమైనసౌఖ్యసంపదలను పొందుటలో సహాయపడగలము. చాలకాలము మనదేశము స్వాతంత్ర్యమునకై పోరాడి, దైవ కటాక్షమునను, ఋషుల యనుగ్రహమునను నసమానమైన ప్రజా త్యాగమూలమునను, దానిని సాధించితిమి. కరువు కాటకముల నధిగమించి మనదేశము నుసంపన్న మగునట్లుగను, మత కల్లోలవిరహితులై ప్రజ లెల్లరు సమైక్య భావమున జీవించుటకును, సర్వాంతర్యామి యగు భగవంతుని కృపామృత వర్షము కురియగాతమని మనము భగవంతుని వేడుదము.'' ఇంద్రియతాల్యమును, తీవ్ర వాంఛలను వదలి ప్రజలు ముఖ్యసద్గుణములను పెంపొందించు కొనవలెననియు, మనోనిగ్రహమున తత్త్వజ్ఞాన సంపన్నులై మోక్షగాములు కావలెననియు స్వామి ప్రజల నుద్భోధించిరి.
కంచిలో
ప్రజలలో మత చైతన్యముకలిగించు కార్యక్రమ నిర్వహణను కొనసాగించు సందర్భమున స్వామి దక్షిణమండలమున ముఖ్యముగా తంజావూరునపల్లె పల్లెకు పర్యటించిన యనంతరము 1953 జూన్ 22న స్వామి కంచికేగి మూడు సంవత్సరములుండిరి.
కంచికామకోటి పీఠాధిపత్యమునకు వారసునన్వేషించి వారికి పీఠభాధ్యతా నిర్వహణమునకు వలసిన విద్యాశిక్షణల నీయవలెనని స్వామివాంఛించిరి. తిరుచిలో దక్షిణరైల్వేయుద్యోగిగానున్న శ్రీమహదేవఅయ్యరుగారి కుమారుడు సుబ్రహ్మణ్య నామధేయుని శిష్యునిగా నెన్నుకొనుట జరిగినది. ఆ బాల్యము మఠముననే వేదాధ్యయనము నాయన చేయుచుండెను. 1954 న నీయనకు పంధొమ్మిదేండ్లు, 1954 మార్చి 19 నుండి 22 వరకు నాయన తురీయాశ్రమ స్వీకారమును, మహోవాక్యోపదేశము మొదలైన వైదిక కర్మకాండ జరిగినది. మహావాక్యోపదేశము స్వామియే చేసిరి. మార్చి 22 న వేలప్రజలు పట్టణమున నామహోత్సవ దర్శనోత్సాహులై వచ్చిరి. బాలశిష్యుడు సర్వతీర్థ పుష్కరిణిలో నడుములోతు నిలబడి, స్వామిరాగానే యజ్ఞోపవీతమును పూర్వాశ్రమ వస్త్రమును విసర్జించెను. అప్పుడు కాషాయవస్త్రములు ధరించి విశ్వేశ్వరుని గుడికేగెను. అచ్చటవారికి స్వామి వాక్యోపదేశము చేసిరి. వారికి జయేంద్ర సరస్వతియను యోగపట్ట మీయబడినది. నాటినుండి యాయన స్వామి ప్రప్రధమశిష్యులుగా వారితోడనేయుండి పీఠవిధి నిర్వహణ కవసరమైన యాదేశములను గొనుచుండిరి.
1954 మే 18న స్వామి షష్టబ్ధపూర్తి మహోత్సవము యావద్భారతమున జరుపబడినది. స్వామి శిష్యవర్గమునకు సందేశమిచ్చును. ''శక్తివంచన లేకుండ వేదవిజ్ఞాన సంరక్షణము చేయవలెననియు, ప్రజలలో భక్తితత్వము బహుళవ్యాప్తి నందజేయవలెననియు, ధర్మకార్యములకై భూదానాదులుచేయవలెననియు కోరిరి. కామకోటి కోశస్థానమీ మహోత్సవ చిహ్నముగా బ్రహ్మసూత్ర భాష్యము వివరణముతో బ్రచురించినది. 1957 మార్చి 17న స్వామి వారిపీఠాధిపత్యమునకు స్వర్ణోత్సవము కలవాయిలో జరిగినది. ఇచ్చటనే 1907 లో వీరాచార్యపీఠము నధిష్టించిరి.
స్వామి సందేశమున ''నిప్పటి కర్ధశతాబ్దముకడచినట్లు మనకు తెలియును. కడచిన యేబదివత్సరములలో మనమేమి చేసినది సింహావలోకనముచేసి ప్రయోజనము లేదు. దైవదత్తమైన జీవితశేషమునకు కర్తవ్యమేమి? యని యాలోచించుట యుచితము. సర్వకర్మల నుండి స్వాతంత్ర్యము సంపాదించుట మనము చేయవలసిన కార్యము. విద్యుక్తకర్మాచరణము పరిత్యజించుట కర్మ స్వాతంత్ర్యమని భగవత్ గీతలో భగవంతుడు చెప్పలేదు. కర్మానుష్ఠానమువలననే నైష్కర్మ్యము సిద్ధించును. ఎట్టికర్మలనుద్ధృతముగా చేసిననైష్కర్మ్యము సిద్థించును? ఈప్రశ్నకుభగవద్గీతలోభగవానుని యాజ్ఞను స్మరించుదము. ''కర్మానుష్ఠానము లెస్సగా జరుగవలసినదే దాన భగవధారా ధన జరుగనిండు, మనవిద్యుక్తకర్మలను మనము చేయుదము. విద్యుక్తకర్మాచరణకు దైవసేవ, భగవదారాధనము, దాననే దైవకృపనందవచ్చును. కాన విధినిర్వహణమునను, తన్మూలమున దైవకైంకర్యమునను మనము పరమపురుషార్ధము నందగలము'' అని యాదేశించిరి.
1957 నుండి
మదరాసు చరిత్రలో 1957-59 మధ్యకాలము చిరస్మరణీయమైనది. ఇరువదియైదుసంవత్సరముల యనంతరము స్వామి యీ రెండేండ్లిందుంటయు. చంద్రమౌళీశ్వర త్రిపురసుందరీ దైవతముల పూజానంతరము, తత్త్వోపదేశములచేత నగరప్రజలు పునీతులై స్వామి సన్నిధానమునను, ననుగ్రహ ప్రభావమునను పుణ్యశీలులైరి. ప్రధాన శిష్యాగ్రణితో స్వామికి నుత్సాహపూరితమై గౌరవనీయమైన స్వాగతసమర్పణ జరిగినది. 1957 సెప్టెంబరు 53 న వీరు నగరమున ప్రవేశించిరి. మదరాసు హిందూ పత్రికా ప్రధానవిలేఖరి శ్రీ వి. రామకృష్ణఅయ్యరీ విధ్యుక్తస్వాగతమహోత్సవ సమాచారసేకరణకై నియోగింపబడెను. శోభాసముజ్జ్వలమైన నాటిరాత్రి కార్యక్రమముల తమ వ్యక్తిగతానుభవమునిట్లుగడించిరి.
''ఇతః పూర్వము పూజ్యపాదుల దర్శనభాగ్యము నాకు లేమిని నేను పత్రికావిలేఖరిగా విధినిర్వహణ భారమున వెళ్ళితిని. అసన్యాదృశ##మైన భాగ్యము నన్నెదురుకొనుచున్నదని నేనెఱుగనైతిని. స్వామివారి ప్రథమదర్శనముననే నాయొడలు జల్లన్నది, అనిర్వాచ్యమైన మనస్సంచలనము సాగినది, తేజః పూర్ణములైన యా కటాక్షవీక్షణములును, నభయ ప్రదమైన యా హస్తముద్రయు, శాంతితరంగమై యొక్కమైయావరించి లోగొనినది. నేను నిర్భయముగా స్వామికి శరణాగతుడనైతిని. శ్రీ కస్తూరి శ్రీనివాసను కుటుంబసభ్యులు, నాహ్వానసంషుసభ్యులైన నగరప్రముఖులు, ''వ్యవసాయభవనమున'' (Farme House) స్వామికిచ్చిన స్వాగతమహోత్సవ వార్తలను పంపుటతో నా యుద్యోగవిధినిర్వహణమైనది. ఊరేగింపుటత్సవమున స్వామి సముచితాలంకరశోభితమైనపాలకిలో పూజ్యపాదులు శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి, సంస్కృతకళాశాలకు కొంపోబడిరి.'' అని నా సమాచారలేఖను ముగించిన నా యుద్యోగధర్మము పూర్తియైనట్లే. కాని యా పూజ్యపాద సన్నిధినుండి కదలలేకపోయితిని. అప్రయత్న పూర్వకముగా నేనునూరేగింపువెంటనంటితిని రాత్రి ప్రొద్దుపోయినతర్వాత స్వామివిశ్రాంతికేగగా నెట్లో నేనింటిమొగము పట్టితిని.
స్వామి పూజానంతరోపన్యాసములకు లేలకువేలు భక్తులు వచ్చెడి వారు. రోజుకు రోజౌన్నత్యము నౌదార్యము పెరుగుచున్నట్లు నూత్నానుభవము కలుగుచున్నది. స్వామి పూజసేయు నప్పుడు దర్శించు దివ్యానుభవమే దైవారాధన చేసినంత ఫలప్రదము. సాయం పూజానంతరము స్వామి వేదికపైకి వచ్చి కొంతసేపు మౌనముగా నుపవిష్టులగుదురు. శ్రీ దక్షిణా మూర్తి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వులని విందుము. మన స్వామి మౌనమున పూర్వరంగము సమకూర్చి తరువాత సందేశాత్మకమైన యుపన్యాసము నిత్తురు. మనము వారి మౌన గంభీరార్థము నెఱుగలేని వారముగదా. అందుచే నప్రయత్నముగా, సహజ మనోహర గంభీరార్థ ప్రబోధకముగా వారి వాగ్ఘరి సాగును. ప్రాచీన విజ్ఞానము, వివిధ నైతిక మార్గము నథునాతన పరిశోధనా ఫలితాంశములు నహమహమికతో సమాగమించి వారియుప దేశవాహినిలో నురక విడును. అన్నింటిని మించి ప్రామాణికమైన వారి యాత్మానుభవమే వారి ప్రతి వాక్కునకు బలము నిచ్చుచుండును. వారువచించు వాక్కునకు బలము నిచ్చుచుండును. వారువచించు ప్రతి శబ్దమును, స్వరమును, నూతను, విశేషమును నిశ్చలురై ప్రజలు త్రాగివేయుచుండిరో యునునట్లుండును. ఈ సమావేశములకు స్వయముగా వచ్చి వినలేనివారు ''హిందూ'' ''స్వదేశ మిత్ర'' వంటి వార్తాపత్రికలలోని సమాచారములను చదివి యానందించెడివారు.
స్వామి యుపదేశ వైశిష్ట్య సారములను క్లుప్తముగా నిందు పొందుపరుచుచున్నాను.
''జగద్గురు నామ సార్థక్యముగా స్వామి వారి యుపదేశములు మానవజాతి కంతకు నుద్దేశింప బడినవి. వారి యుపదేశములు హిందువులనుద్దేశించి చెప్పినను నితర మతానుయాయులకు కూడ వర్తించును. అద్వైత మాది శంకరుల జీవిత ప్రచారక సిద్ధాంతమైనను నితర మతములతోగాని యాధ్యాత్మిక సిద్ధాంతములతోగాని దానికి విరోధములేదు. ఏదియు దానికతీతము కాదు. సత్య సంపూర్ణానుభవమనగా నద్వైతమే. ఇది యందరకు గమ్యము. ఈ మహత్తర సమగ్ర దృక్పధము పారంపర్యముగా నందుట వలన విభిన్న దృక్పధముల సమన్వయమునను, వాని నద్వైత స్థాయికి నందించుట యందును స్వామి కేమాత్రమును కష్టము లేకపోయినది.
అద్వైతము వివిధమతములలో తానొకమతము కాదు. విభిన్న మతములకును, సంప్రదాయములకును చెందిన మహర్షు లెందరో యీ యద్వైతాను భవముకలిగి యుండిరి. వారియనుభవము నితరుల యనుభవము సంతరించి చూచుకొనిరి. తత్త్వరాయస్వామి మథ్వుడు మస్తాన్ సాహెబు ముస్లిము, అద్వైతమును కాదనిన యీ భావుకులు దాని కుపస్కారకులే యయిరి. వారందరు నద్వైతమే మాట్లాడుదురు. విశాల హృదయులైన జగద్గురు శ్రీ శంకరభగవత్పాదులు సత్యపదార్థగాములైన యన్ని సిద్ధాంతములనునద్వైతాంతర్గతములుగా సమన్వయింతురు. ఇతర సిద్ధాంతము అద్వైతముతో విరోధించినను నద్వైతము మాత్రము వానితో విరోధింపదు.
అద్వైత ప్రబోధముననే స్వామివారి వివిధోప దేశముల యవసరము కల్గినది. సర్వసంక్షేమ కర కృషికిని, నిరాడంబరమైన నిర్దుష్టమై దైవము నారాధించుటకును, ధ్యాన సమాథుల నిరంతరానుష్ఠానమునకును, వేదాంతాధ్యయనమునకును, నిత్యసత్యమైన యాత్మాను భవమునకును, స్వామివారు ప్రబోధము చేసిరి, ఇవన్నియు నద్వైతాను భవదాయకములైన మార్గములేయని యెరుగవలెను.
''నిరాధారమైన యొక విమర్శకలదు, 'అద్వైతమున భగవంతుడేలేడని' నిజమునకు దైవానుగ్రహముననే యద్వైతసిద్ధికలుగును. కావున దైవారాధనమేనిత్యకార్యక్రమములలో ప్రధానమని స్వామివారాదర్శమునను, ననుష్ఠానమునను, ప్రభోధముల మూలమునను'' నిరూపించిరనుటలో నాశ్చర్యమేమియులేదు.
''దైవకటాక్షమునకై యత్నింపని జీవితక్షణములుగాని కార్యములుగాని వ్యర్థములు.
జ్ఞానసాధనకు నెవరికి గాని వారి యిష్ట దేవతారాధన తప్పదు. తప్పటడుగులు వేయునప్పుడు త్రోపుడు బండి శిశువులకువలె ప్రారంభదశలో నిది భక్తులకుపకరించును. వైయక్తికైహిక వాంఛా పరిపూర్తికై భగవానుని ప్రార్థింప వచ్చును, కాని సర్వేజనా స్సుఖినోభవన్తు'' అను లోక కళ్యాణాత్మక మైనదే యుత్తమ ప్రార్థన, భగవద్బక్తుడు సర్వమానవుల నొక్కటిగా చూచును.
ఆచార్యస్వామి యుపదేశములలో తరుచుగా వినబడునది. ''మతపరస్పరావగాహము''. వివిధ మతావలంబకుల వైరుద్ధ్యమున కర్థములేదు. రైలుస్టేషనులలో ప్రయాణీకులను తీసికొని పోవు వివిధ వాహన బోధకులవలె, మతాంతరీకరణము చేయు వారి యత్నము కన్పట్టును. వాహనబోదకుల కృషి కర్థమున్నది. కాని వివిధ మత ప్రచారకుల మతాంతరీకరణ యత్నమునకర్థములేదు. అన్ని మతముల దైవ మొక్కడేయయినప్పుడు స్వమతమును వీడి యన్యము స్వీకరించుట కవసరములేదు. అన్ని మతములు నొకే తీరుగనున్నవని దీనికర్ధముకాదు. ఏకరూపత ముఖ్యముకాదు, సమైక్యము ప్రధానము. మనమతములన్నియు పరదైవతమొక్కటేయని యేకకంఠముగా ప్రతిపాదించుచున్నవి. మతములన్నియు వంతెనయందలి స్తంభాంతరద్వారములవంటి వంటివి. ఒకద్వారము క్రిందనున్న వానికి తానున్న ద్వారము పెద్దదిగను తక్కినవి చిన్నవిగను కన్పట్టును. వాస్తవమున ద్వారము లన్నియు నొకేకొలతలతో నొకేవిధముగ నున్నవి. దైవము వేరుకానప్పుడేమతమునైన కించపరుచవలసిన యవసరములేదు. మానవుల యభిరుచిబేధమునుబట్టి యనేకమతములువచ్చినవి. ఇది మతదురభిమానమునకును, విద్వేషములకును దారితీయరాదు.
హిందూమతమహత్వమేమనగా నది తెలిసి మతసమైక్యమును గుర్తించుచున్నది ''వివిధమతములుపరస్పర వైరుధ్యము కలిగాని, శత్రుత్వముకలవిగాని కావు. మఱమనిన నొకే నిత్యసత్యమతమునకు దృక్పధభేదమే.'' యనునది యొక్క హిందువుల యూహామాత్ర కల్పితసూత్రముకాదు. ఇది స్వానుభవ పూర్వక విశ్వాసము. కానహిందువులలో హిందువులే తగవులాడుట విషాదకరమైనది. హిందూమతములో ప్రముఖమైనవిభేదము శైవ వైష్ణవమతములది. శాస్త్రప్రమాణమువలనగాని., మహాత్ములైన మతగురువుల యనుభవాత్మక ప్రబోధమువలనగాని శివకేశవులొక్కటే. అనేక మార్గములలోమనపూర్వులు దైవమొక్కడే యని మనకుబోధించిరి. నటరాజన్నను రంగరాజన్నను రూపాంతరములే! బ్రహ్మ విష్ణు శివులొక్క దేవునిమూర్త్యంతరములే! స్త్రీ పురుష దేవతావిభేదముగాని మాతా పితృదేవతా రూపముల విభేదమునగాని రూపాంతర్వమే గమనింపవలెను. హరిహరార్దనారీశ్వర సమిష్టిరూప దేవతామూర్తులు. చాలా ప్రత్యేకప్రాముఖ్యము కలవి. ఇవి పరతత్త్వమున కతిసన్నిహితముగా మనలను చేకొని పోగలవు.
పునర్నవమై పటిష్టమైన హిందూమతము హిందువులకు మోక్షమిచ్చుటకేగాక యావత్ప్రపంచ శుభోదయమునకు అవసరము. హిందూమతారాధనమైన వేదము సాక్షికగ్రంథముకాదు. ఏమహామతప్రవక్త దర్శించినసత్యమైనను వేదముననుండును. వైదిక ధర్మును గంగానదియొడ్డుననున్న పుణ్యస్నాన ఘట్టములే వివిధమతములు. అతిపురాతనకాలమున వైదికమతమే ప్రపంచ మంతటను వ్యాపించి యుండెను. కాలక్రమున నితరమతదృక్పధములు ప్రపంచమున నితర ప్రాంతముల పొడచూపినవి. ఏదోయొక వైదికమతాంశమునే యవి యుద్ఘాటించుచు ప్రత్యేకమతములై వర్ధిల్లినవి. భరతఖండము భాగ్యవశమున పరమపవిత్రమై సమగ్రమైన యచ్చపు హిందూధర్మమును పరిరక్షించుకొనుచు వచ్చినది.
వేదమున సదాచార సంపన్నమై, ధర్మబద్ధమైన జీవిత ప్రబోధమే కలదు. విధ్యుక్త కర్మానుష్ఠానము సద్గుణసంపన్నమైన సౌశీల్యము, దేవతోపాసన, జ్ఞాన సముపార్జన మనునవి వేదమత ప్రధానసూత్రములు జాంతవికమైన యాహారనిద్రాదులు ప్రధానముగా జీవించుట, దుర్లభ##మై యమూల్యమైన మానవజన్మమును భ్రష్టముచేయుటయే. ఈ జాంతవిక విషయ వాంఛలనరికట్టి మనఃపావిత్ర్యము నందవలెను. ధర్మకర్మాచరణమున భౌతికకార్యములు పుణ్యప్రదములు కాగలవు. ఈ పుణ్యమే భావిజీవిత ప్రపంచమున నదృష్టరూపమున భాగ్యప్రదమగును. ధనార్జనాసంవర్ధనములు జీవితలక్ష్యములు కారాదు. బ్రదుకు తెరువే లక్ష్యముగాగలది విద్యకారాదు. యువక హృదయములలో ముఖ్యముగా ధర్మమునెడ భక్తి నెలకొల్పబడవలెను. జీవనప్రమాణ మభివృద్ధినొందింపుడని ప్రజల నాశించుటలో నర్ధములేదు. జీవన విధానమున నౌన్నత్యము లక్ష్యముకావలెను. అల్పుడైన మర్త్యుడు స్వయంకృషితో, జీవితమునువృద్ధి పరుచుకొనలేడు. దైవధ్యానానుష్ఠానముల వలన దైవకృప నర్ధింపవలెను. తపస్సను పవిత్రావాహినిలో మున్కలిడినగాని మనోమాలిన్యము ప్రక్షాళితముకాదు. అట్టిపరిశుద్ధాంతఃకరమే వివేకసంపన్నమగును. నిత్యానిత్యవస్తువివేచనాశక్తి దానికే కలుగును. ఈశక్తియేజ్ఞానోదయ మార్గప్రదము.
జ్ఞానము జీవితమృక్షఫలము. వివేకవంతుడు, యోగియయిన వాడాదర్శమానవుడు. ఆతనికి రాగ ద్వేషములుండవు. దూషణభూషణములు సమానము. కష్టభారమున క్రుంగడు. నీటిలో బరువైనదూలము తేలును. జ్ఞానవాహినిలోకష్టభారము క్రుంగునిండు. అప్పుడది బాధాకరముకాదు. జ్ఞానికి పరమాత్మ యొక్కడే ఏకైకసత్యము. దసరాపండుగలందలి బొమ్మలకొలువున బొమ్మలన్నియు మృద్వికారములే యైనట్లు నామరూపజగత్తంతయునంతే. జ్ఞానికి పరమాత్మయొక్కడే వాస్తవము. జ్ఞానిబంధవిముక్తుడు. జ్ఞాని మరల సంసారపధమున పడదు. మోక్షము మరణానంతరము స్థితికాదు. అదియాత్మకు నిత్య స్వభావస్ధితి. జ్ఞానికిది నిత్యానుభూతి. అందుచేనతనికి బాధయనునదిలేదు. ''ఉద్వారుక మివబంధనాత్'' ముగ్గిన దోసపండు తొడిమ నుండి విడివడినట్లు జ్ఞాని బంధముక్తుడగునని మృత్యుంజయ మంత్రమున గలదు. ఈ పండు తొడిమ నుండి రాలదు. విడివడును మాత్రమే. కాదు, పండుకెరుక లేకుండ తొడిమయే వీడిపోవును. ''ఈ దోస పండు ముక్తియే యెల్లరి లక్ష్యమును. దీనియనుభూతి నందిన వారు జ్ఞానులు''.
అట్టి జ్ఞాను లెల్లప్పుడు నెల్ల యెడల పొడచూపుచునే యుందురు. ప్రపంచమున వారి యునికి యదృష్టమే యనవలె. ఒక మహా పురుష సాంగత్యమున వేల ప్రజలు వారికి తెలియకుండగనే లాభము నందుదురు. జ్ఞానులకు వైరుద్ధ్యముగాని విభేదముగాని లేదు. ''జ్ఞానా దేవహికై వల్యమ్'' జ్ఞానము వలననే ముక్తి యనునది వారు ప్రచారము చేసిన సందేశము. భౌతిక దేహబంధముల నుండి విమోచనమునకై జ్ఞానాత్మక శాంతి మార్గము నవలంబింతురుగాత.
ప్రపంచ పరివ్యాప్తముగా మానవ జాతికి సర్వసంపూర్ణము జీవ సంరక్షకమైన యాదిశంకరుల సందేశము నందించుటలో విశ్వకళ్యాణ ప్రదకృషికి శ్రీ ఆచార్యస్వామి జీవితమనుక్షణము వినియోగించుచునే యున్నారు. ఆది శంకరులు వారి యద్వైత మత ప్రచారమును ప్రజలు విస్మరింపకుండుటకై ముఖ్య యాత్రా స్థలములలో శంకర భగవత్పాదులు స్మారక మండప నిర్మాణమునకై స్వామి యీ మధ్య చాలా సంవత్సరములుగా తీవ్ర కృషిచేయుచున్నారు. అట్లు నిర్మింపదలచిన వానిలో మొట్టమొదటిది రామేశ్వరమున రూపొందవలెను. 1963 ఏఫ్రిల్ 7వ తేదీన శ్రీ బంగారు కామాక్షికుంభాభిషేకము తంజావూరున జరిపించి స్వామి రామేశ్వరమున గోపుర ప్రతిష్ఠ కేగిరి. 1963 ఏప్రియల్ 28న శంకరజయంతి శుభదినమున గోపుర ప్రతిష్ఠా కార్యక్రమము జరిగినది. నాటి ప్రభాతమున స్వామి శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారితో రామనాథుని దేవాలయమున కేగి దేవుని పూజ స్వామియే స్వయముగా జేసిరి. పూజానంతరము కుంభాభిషేకమునకై కలశమున నభిషేక జలమునుగొని విధ్యుక్తముగా భక్తులు వెంటరా స్వామి స్వయముగా నూత్న చామరములతో కలశముల వీచుచు నూత్న మండపమునకు జనిరి. శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు గోపుర శిఖరాగ్ర కుంభపంచకాభిషేకము చేసిరి. స్వామి మంటపముకేగి హనుమకుద్వాదశన జ్యోతిర్లింగములకు, దక్షిణామూర్తి యంత్రమునకు, నాదిశంకరులకు, వారి శిష్యులు నల్వురికి అర్చన చేసిరి. మండపము వెనుక ప్రధాన దేవాలయము ప్రక్కనున్న మందిరమున శ్రీ సరస్వతీ విగ్రహ ప్రతిష్ఠను శ్రీ స్వామి చేసిరి. యోగిపుంగవులతో భారతదేశ సాంస్కృతిక వైభవమంతయు నొక్కసారి స్మరణకు తెచ్చు జగద్గురువులతో నా స్మారక మండప నిర్మాణ మంతయు మహోజ్జ్వల దృశ్యమైనది. అగ్ని తీర్థమున పవిత్ర స్నానమాడి తలయెత్తగనే, యీ స్మారక మండప మనోహర దర్శనమే మొదటజరుగును. అందలి ప్రత్యంశమును ప్రేక్షకులకు భావౌన్నత్యము కలిగించు భారతీయ సంప్రదాయ పారంపర్యమున సర్వోత్కృష్టము మహోదారమునైన దృశ్యముగా నాది శంకరులు-వారి శిష్య చతుష్ఠయముతో యాత్రికులకు కన్నుల పండువుగా హృదయాకర్షకముగా మహోజ్జ్వలముగా నడిపింతురు.
కుంభాభిషేక సందర్భమున నారాత్రి యొక సదస్సేర్పాటైనది. ఆది శంకర ప్రతిష్ఠా ప్రాముఖ్యము గూర్చి సదస్సున శ్రీ స్వామి సభ్యులకు వివరించిరి. మందహాసమున స్వామి యుల్లాసముగా ''నొకచోటు నుండి మఱియొకచోటునకు తరచుగా వేగముగా సంచారము చేయు స్వామి శ్రీ ఆదిశంకరులు. ఈ పవిత్రభారతమునంతను వారు పర్యటించిరి. నేటికి శంకరులు దక్షిణామ్నాయ క్షేత్రమయిన రామేశ్వరమున సుస్ధిరస్థానమునందినారు. భారతవర్షధామములలో దక్షిణపుకొసనున్న ధామమిది. భారతవర్షము నలుమూలలకు తన సందేశము నాయన స్వయముగ కొనిపోయిరి. కాని నేటి నుండి యావద్భారతప్రజానీకము రామేశ్వరమునకు వచ్చి మండపమందున్న జగద్గురుపాదుకలకు మ్రొక్కి వారివారి సందేశోత్సాహముల గొనిపోదురు. ఆదిశంకరప్రతిష్టకు రామేశ్వరమే ప్రథమ స్ధానముగా నేలయెన్ను కొనబడినదో స్వామి స్పష్టీకరించిరి. మండపమునెదుట నాంజనేయస్వామి దేవాలయము కలదు. ఆంజనేయదర్శనము చేసుకొని భక్తులు ద్వాదశ జ్యోతిర్లింగముల సేవించు కొందురు. ఈ లింగములను స్వామి వానివానిస్థలములలో స్వయముగా పూజించిరి. రామేశ్వరము వానిలో చివరిధామము. ద్వాదశలింగములలో రామనాధసేతులింగము ప్రధమమైనది. నలుగురు శిష్యులతోనున్న యాదిశంకరులను పైనున్న గుడిలో దర్శించి తరింతురు. శంకరులున్నతపీఠముననుంపబడిరి. అగ్నితీర్థమున స్నానమాడినవారు వెనుదిరిగి తీరమువంక చూడగనే శంకరుల విగ్రహమును చూడగలరు. ఆచార్యస్వామి దర్శనమున నెవరైన పాపరహితులై సంపూర్ణానందము నందగలర''ని మనస్వామివారు సెలవిచ్చిరి.
''తిరువిడై మరుదూరు'' నకు మధ్యార్జున మను నామాంతరము కలదు. ఇది శంకర దిగ్విజయ యాత్రా స్థలములలో నొకటి. అందుచే నిది మనకు ముఖ్య యాత్రాస్థలము. శంకరులిచ్చటికి విచ్చేసి నప్పడచ్చటి దేవళము నందలి మహా లింగమునే ''యద్వైతమే సత్యమైన''దని నిరూపించ వలెనని కోరిరి. అయినచో కొందరి మనస్సులలోగల సందేహము నిరుత్తరముగా నివృత్తి కాగలదు. శంకరుల ప్రార్థనాను సారము శివుడు మహాలింగము నుండి వెలువడి కుడిచేతినెత్తి ''సత్యమద్వైతమ్'' ''సత్యమద్వైతమ్'' యని ముమ్మారుప్రకటించెను. ప్రజలీ సంఘటన సులువుగా సంస్మరింప గలుగునంత సంకుచితముగా వీరి గృహ శిల్ప ముండవలెనని స్వామి యాశించిరి. ఇచ్చటి శంకరమఠ ద్వారముపైన నొక విమానము నిర్మింపబడినది. ఇక్కడి మహాలింగము నుండి యెత్తబడిన దక్షిణ హస్తమును-నెదుట చేతులు జోడించు శంకరులు విగ్రహ రూపమున ప్రతిష్టింప బడిరి. మఠావరణము మధ్యనొక మండపమున శంకరుల పాదుకలుప్రతిష్ఠింప బడినవి. 1963 డిసెంబరు 5వ తేదీ స్వామివారు శ్రీ జయేంద్ర సరస్వతీస్వామి వారితొ కలిసి యా నూత్న స్మారకచిహ్నమున కుంభాభిషేకమున పాల్గొనిరి. ఇందలి విశేషమేమనగా నూటెనిమిది చక్కని నగిషీవనిగల శాలువలతో నీ పుదుకలర్చింప బడినవి. ఆ శాలువలనే పండిత సత్కారమునకు వినియోగించిరి.
కంచిలో శ్రీ మఠమున షోడశస్తంభ సంభృతమైన యొక మండపమున నాది శంకరులు వారి శిష్యులు నల్వురు, గురుపాదుకలు ప్రతిష్ఠింప బడినవి. 1964 ఫిబ్రవరి 20న దక్షిణ మండల సంచారాంతమున స్వామి కంచి చేరిరి. ఆ మరునాడే ప్రతిష్ఠ జరిగినది. దేశ దక్షిణాగ్రమున గల కన్యకుమారిలో జగజ్జనని కన్యకుమారీదేవి యున్నచోట శంకరుల స్మారక మండప మొకటి నిర్మితమైనది. 1946 మార్చి 31న నిచ్చట కుంభాభిషేకము జరిగినది.
ఆంధ్రప్రదేశమున గల శ్రీశైల మహా పర్వతమొక శివక్షేత్రము. విజయ యాత్రా సందర్భముననేకాక ఆదిశంకరులు దర్శించిన స్థలమని కూడా 1934లో మన స్వామి వారు దీనిని దర్శించినట్లు ముందే తెల్పితిమి. అక్కడ కూడ యోగ్యమైన యొక మండపము కట్టబడినది. దీని ప్రతిష్ఠా కార్యక్రమమునకు మనస్వామివారు 1967 మార్చిలో వెళ్ళిరి. చేరగనే స్వామివారు, శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు పావన పాతాళ గంగలో స్నానమాచరించిరి. శ్రీ మల్లికాంబా మల్లికార్జునుల దర్శించిరి. మార్చి 9 శివరాత్రినాడు ''ఏకాదశరుద్రమక్షమక్రతువు'' జరిగినది. 1967 మార్చి 22న శంకర మండప కుంభాభిషేకము జరిగినది.
గంగావతరణము జరిగిన లక్షణఝూలాయను చోట హృషీకేశ సమీపమున నున్నది. ఇచ్చట శంకరుల దేవాలయము నిర్మితమైనది. దాని ప్రతిష్ట 1967 మే 14న శంకర జయంతినాడు జరిగినది.
కురుక్షేత్రమున శంకర విగ్రహము, గీతోపదేశ విగ్రహములును ప్రతిష్ఠించ బడినవి. శంకరస్మారక మండప నిర్మాణము లింకత్ర్యంబకమునను ప్రయాగ యందును, బదరి యందును జరుగనున్నవి. త్ర్యంబకము గోదావరియుత్పత్తిస్థలము. ప్రయాగ గంగా యమునా సరస్వతుల కూడలి. దీనినే త్రివేణీ సంగమ మందురు. బదరిలో లోక కళ్యాణమునకై నరనారాయణులు శాశ్వతసంస్థిణి నందిరి. శంకరులు, వారి యాదేశములచే, తీవ్రకృషిచే భరత ఖండమేకాక యావత్ర్పపంచము పొందగల మహోత్కృష్టఫలము, పరమ ప్రయోజనములను గూర్చి స్వామి వారిట్లనిరి. ''ఆచార్య శంకరభగవత్పాదులను మించిన యవతారమే లేదు. ఆ బాల్యము శంకరు లాసేతుశీతాచలము, యావద్భారతము పర్యటించి షణ్మత స్థాపనాచార్యులైరి. సత్యజ్ఞానము కావలెనన్న యాచార్యస్వామి రచనల నధ్యయనము చేయవలెను. భగవత్పాదుల భాష్యముల నెఱుగని దేశములేదు. వారి మహత్యము నెన్నసాధ్యమా? శిలా శాసనములు కూడ వారి యశస్తావకములు. అతి ప్రాచీ దేశప్రాంతములలో ననేక శిలా శాసనములు పురావస్తు పరిశోధన శాఖ వారు త్రవ్వితీసిరి. వానిలో శంకర భగవత్పాదుల ప్రస్తావన కలదు. ఈ క్రింది శ్లోకమా శాసనములలో నొక్కదానిలోనిది.
''నిశ్మేష సూరి మూర్థాళిమాలా-
వీఢాంఘ్రిపంకజాత్''
భావమేమన యావత్ప్రపంచ తాత్త్విక మండలి శంకరుల మ్రోల తలవంప వలసినదే. వాలినమిత శిరస్సులు స్వామి పాదపద్మమును నీడలేని భ్రమరములవలె నగుచున్నవి. ప్రపంచజ్ఞానఖనుల యొక్క యునాత్మానుభూతి నందినజీవుల యొక్కయు శిరస్సులకు వారిపావన పదయుగళి విశ్రాంతి స్థలముగానైనది.
కంచిలో స్వామివారున్న 1953-57, 1957-59, వత్సరములలోను తర్వాతను నెంతమంది యోవై దేశికులైన విద్వాంసులు విజ్ఞులు, తత్త్వాన్వేషకులు, మతబోధకులు, కళాకారులు, రాజకీయవేత్తలు కూడా స్వామినిదర్శించిరి. అనశ్వరమైన భారతీయ తాత్త్విక సంప్రదాయమును గూర్చి సమ్యగ్ఞానము వారు పొందగలిగిరి. చికాగో విశ్వవిద్యాలయాచార్యుడైన మిల్టను సింగరు 1955లో ఆచార్యస్వామిని దర్శించిన తర్వాత మహాత్ములైన స్వామివారిని దర్శించి పోయిన విదేశీయు లందలి యనుభవ విశేషమును సరిగా నిట్లు విశదీకరించిరి. ''నేను హిందూ దేశమునకు పోక పూర్వమే యచ్చటి మహాత్ములను మహర్షులను గూర్చి చాలా వింటిని, చదివితిని. కాని యది యంతయునేదో పురాతన కాల విషయమని భావించితిని. కాని నేను స్వామి వారిని దర్శించిన యనంతరమే చదివి విన్న ప్రాచీన భారతీయ తాత్త్విక మహాశక్తి యింకను హిందూ మతమున చైతన్య వంతముగా నున్నదని యనుభవ పూర్వకముగా విశ్వసింప గల్గితిని. 1959లో నాచార్య స్వామి సన్నిధినందిన 'TheLotus and the Robot' అను గ్రంథము రచించిన శ్రీ ఆర్థరు కోస్లరు మహాశయుడు తన యనుభవమునిట్లు వ్రాసెను. స్వామి మందహాసమున పసిపాపవలె కన్పించును. ఇట్టిమందహాసము గాని తదనుభూతిని గాని నేనెన్నడు నెక్కడ జూడలేదు. అతీంద్రియమైన హృదయంగమత్వ మందు కలదు. ''అమెరికా సంయుక్త రాష్ట్రములకు చెందిన శ్రీ ఆర్థరు ఐసెన్‌బర్గు కంచి స్వామివారి నొక సాయం సమయము దర్శించిన తన భాగ్య విశేషమును సంస్మరించి యిట్లనెను. ''వారు నన్ను చూచిరి. ఆ చూపులలో మేధా, కరుణ, సానుభూతి కలిసి చిత్ర మనోజ్ఞముగా భాసించి ప్రసన్న చమత్కార బంధురముగా నొప్పినవి. ఒక మహా శాంతమూర్తియైన ఋషి సన్నిధానమున నేనుంటినను స్పష్టానుభవము కల్గినది.'' 1959 ఏప్రిలు 20 రాత్రి మూడున్నర గంటల సంభాషణలోని భావము దృఢవిశ్వాసముగా వర్థిల్లినది. వారి సంభాషణమున కొట్టవచ్చినటు కన్పట్టు నొక గణనీయమైన యలవాటుకలదు. అది వారి యాచరణలో నున్నది. పృచ్ఛకున చెప్పుడును వారంతరాయము కల్గింపరు. తర్వాత ప్రశ్నకు సమాధాన మిచ్చు ముందొకటి రెండు నిమేషములు తప్పక వారాగి ప్రతివచన మిత్తురు. వారి ప్రత్యుత్తరము సూత్రప్రాయముగా సూటిగా నుండును. అది యాలోచనా పూర్వకమని సుస్పష్టముగును.'' అర్జెంటినాలో బ్యూనస్‌యైర్సుకుచెందిన కుమారి యూఘినా బోర్గిని (Miss Enghina Borgina) 1962లో ఇలయాత్తంగుడిలో జరిగిన ప్రథమాగమ శిల్ప సదస్సునకు వచ్చినవారిలో నొకతె. ఆమె స్వామిని గూర్చి ''నేను ప్రప్రధమముగా స్వామి దర్శనము చేసిన రోజు నా పుణ్య విశేషముగా భావింతును. జీససు మరల ప్రపంచమున కవతరించెననుకొంటిని. వారు ప్రేమమూర్తి వారి దర్శన క్షణము నుండి వారికరుణావలోకనము, నాధ్యాత్మిక జీవనము, మత బోధలు, వీని యంశముల కొన్నిటి నవగతము చేసికొనగల నందితిని. పూజ్యపాదులు జీససు వలెనే యిల్లు వాకిలి లేక సర్వసంగ పరిత్యాగియై జీవింతురు, వారు తపస్సు, ధ్యానము, దైవారాధన, ప్రబోధములు విశ్వశ్రేయమునకే వినియోగింతురు. వారి పాదముల మ్రొక్కుదును. ఎల్లప్పుడు కీర్తింతును. డా. ఆల్బర్టు బి. ఫ్రాంక్లెను మదరాసులో సంయుక్త రాష్ట్ర ప్రధాన సలహాదారు. (U.S. consul general) 1963లో మథురమీనాక్షి దేవాలయమున కుంభాభిషేక సమయమున మొదటిసారి స్వామిని దర్శించెను. వారి మనస్సునకు హత్తిన విషయము నిట్లు రచింప బడినవి.
''దేవాలయ ప్రాంగణము మధ్యప్రదేశమున స్వర్ణమయ విమానము నెదుటనొక సంచలనము సాగినది. ఆ బంగరు విమానము క్రిందనే మీనాక్షీదేవి యుండును. అది మమ్మాకర్షించినది. ఆ ప్రాంతమున ప్రముఖులు పొడవైన గడ్డముతో చేత దండముతో వచ్చు నొకవృద్థునికై దారినిచ్చు చుండిరి. విమానమున కానించిన నిచ్చెననాయన సమీపించెను. ఆయనయే శంకరాచార్యులు. ఆగుచు నడుచుచు, నటునిటు ప్రక్కలచూచుచు నాయన ముందుకు సాగిరి. ఆయన యెవరు? ఆయనకు పేరున్నది. నివాసస్థలమున్నది. వయస్సున్నది. నిజమునకందరునాయనయే. మానవచింతన యెప్పుడు పుట్టినదో యాయన యప్పుడు పుట్టినారు. తనసర్వస్వము త్యజించి దృఢవిశ్వాసమూర్తి. సర్వమత హృదయాంతర్గతమైన సన్యాసమున కాయన చిహ్నము. నన్ను రక్షించుకొనుటకు నేనేమి చేయవలెనని సంపన్న సన్యాసమే. కాన నిక్కడ నీ క్షణమున నీ దేవళమున నాయన యచ్చటి మహాసంపన్నులైన ప్రముఖ జనుల మించిన మహా పురుషుడుగా సర్వోత్కృష్టుడుగా వెలుగుచున్నాడు, అంతటి వృద్థున కెంతటి మహాశక్తి. ఆశ్చర్యము. వట్టి యెముకలు మాత్రమున్నవి. ఆ చేతి వ్రేళ్ళతో నిచ్చెన కఱ్ఱలను పట్టుకొని గబగబ యేడెనిమిది మెట్లెక్కి దండముతో విమానము చేరెనే! ఆ క్రతువగు వరకు నాయనయే ముఖ్యవ్యక్తి.''
ఆంగ్లేయ రచయిత యొక పరాసు విజ్ఞానవేత్త మదరాసులో 1958 ఫిబ్రవరి 26న స్వామితో సమావేశము నందినప్పటి సమాచారము నీ క్రిందపొందు పరచుచున్నాము. విచిత్ర సమావేశముల కిది నిదర్శనము.
వారి సమావేశమునకు నిర్ణీత కాలము రాత్రి 9 గంటలకు. సర్‌పాల్ర్బూక్సు త్యాగరాజనగరున స్వామి వారి బసకు 8-30 గంటలకు చేరెను. తాళవృక్షముల బారుల క్రింత నొక బహిరంగ స్థలమున కాయన కొంపోబడెను. అదియంతయు గడ్డితో నిండి యుండెను. మధ్య నొకపీట. స్వామి యాసీనులగుటకై యేర్పరుప బడియుండెను. పాలునకది యసాధారణ పరిస్థితి. నిర్ఘాంతపోయి. తానెదురు చూచుచున్న నూత్నానుభవమునకిది ''సుందర సన్నివేశము'' అని చమత్కరించెను. అంతలో పరాసు ప్రతినిధి యం. పిలిప్పిలావస్టిను, కొలది మంది భారతీయ మిత్రులతో వచ్చెను. ఒక మహర్షితో సమావేశ భాగ్యమని యాయన యువ్విళ్ళూరుచున్నట్లు స్పష్టముగా కన్పట్టెను.
''అప్పటికి తొమ్మిదిదాటికొలదిసేపైనది. గ్రుడ్డిగా నున్న యొక దీపపు వెల్గువచ్చు మార్గమువైపు మా దృక్కులాకర్షింప బడినవి. పూజ్యపాదులు మెల్లగా నప్రయత్నముగా నడుచుచు వచ్చుచుండిరి. ఆ యడుగులు వారివే. వారిననుసరించి వచ్చు నైదార్గురు శిష్యులు వెనుకకు తగ్గిరి. స్వామి వారు పీఠమున నాశీనులైరి. తమ రాకకై నిరీక్షించు వారి నెల్లర కూర్చుండుడని హస్తసంజ్ఞ చేసిరి. ఆ యిద్దరు వైదేశికులైన దర్శనార్థులు కొద్ది దూరమున కూర్చుండిరి, మధ్య ననువాదకుడుప విష్టుడయ్యెను. వారి సమావేశమున కంతయు సంసిద్ధమైనది.
''అనంతాన్వేషణ'' (unending quest) పాశ్చాత్యులకుయోగము (yoga for the western world) అను రెండు గ్రంథములు రచించిన సర్‌పాల్ డ్యూక్సుతో మొదటి సమావేశము. ''అంతులేని యన్వేషణ'' యనగా ''దేనిని గూర్చి యని మీ యభిప్రాయమని'' డ్యూక్సును స్వామి యడిగిరి. అయ్యాంగ్లేయుడు తన విషయమున నా యన్వేషణ పూర్తికాలేదని చెప్పెను. పాశ్చాత్య సామాన్యునకు నొక మత స్వీకారమును గూర్చిన సంకల్పముతో నాతని యన్వేషణ పరి సమాప్తి నందును. ఇతని యభిప్రాయమున నది యంతేకాదు. స్వామి వివరించుచు ''అన్వేషణ బహిరంగమైనచో దానికంతే యుండదు. అది దిక్చక్రము వెనుకవెదుకుట మంచిది. ఇది భ్రమ. ఈ యన్వేషణ యాంతరమైనచో నది యాత్మాన్వేషణతో ముగియును. ఒక విధమున నిదియు ననంతాన్వేషణమే ఎట్లన నన్వేషణమనంతము కొరకుగాన.
తర్వాత పరాసుప్రతినిధి సమావేశము. ఆయన రాచరికపు సంస్థలపై పరిశోధన చేయు సందర్భమున దేవాలయములు - పురాణములను విషయాధ్యయనమున కూడ నతడభినివేశముగలవాడు. యమ్. లావస్టినుస్వయముగాతన సమస్యను వివరించెను. పూర్వకాలముననైహికాముష్మికములు రెండును రాచసంస్థలలోనే కలిసి యుండెడివి. ఐహికాముష్మికములు రెండుగా విభాగములేదు. బహుశః ఆధునిక ప్రపంచమున గల దోషములు చాలావరకు నీ విభాగము వలననే నావిర్భవించుచున్నట్లాధారములు కన్పించుచున్నవి. దక్షిణ దేశ దేవాలయ చరిత్రాధ్యయనమున నైహికాముష్మికముల రెండిటికిని గల సంబంధము కొంత దొరక గలదని యాశించుచున్నానని యాపరాసు వ్యక్తి తెలిపెను.
పూజ్యపాదులు యమ్. లావస్టిన్‌తో ''రాజాధర్మస్య కారణమ్ అనునదివింటివా'' యని యడిగిరి. స్వామి ఈ విషయ వివరణము చేయుచుండగా నా వైదేశికులిర్వురు స్వామివారిసమీపమునకు సావధానచిత్తులై జరుగుచు వారి ప్రతియక్షరమును శ్రద్ధగావినుచున్నట్లు కన్పించిరి. స్వామితమిళమున మాట్లాడుచున్నను నాంగ్లశబ్ధములు తరుచుగా ననువాదకుని సౌలభ్యమునకై వాడుచుండిరి. అభ్యాగతులకు స్వామినవగాహమును చేసికొనుట యందు సౌకర్యము కూడ నిందుకలదు. కాళ్ళుముడుచుకొని కూర్చుండు నలవాటులేని యా వైదేశికులు మధ్య మధ్య కాళ్ళు చాపసాగిరి. అనువాదకుడు పరాసు వ్యక్తికెరుక చేయుటకై మోకాళ్ళను తాకెను. అతడు కాళ్ళుముడుచు కొనలేదు. స్వామియాయను వాదకునితో నట్టినియమమేదియు నక్కరలేదనిరి. ''పాశ్చాత్యదేశ సామాన్యునకు ముడుచు కొని కూర్చుండుట నక్కరలేదు. వారెట్లు కూర్చుండినను పట్టించుకొన నక్కరలేదు. ఈ విషయమున వారు బాలుర వంటివారు. వారికీ నియమములేన''నని స్వామి ¸°దార్యమున పలికిరి. వారు మహాత్ములు. వందనీయులు.
ఒక సంస్కృత సూక్తిని వివరించుచు స్వామి ''తిండి, నీరు, బట్ట, యిల్లు ప్రతివ్యక్తికి నవసరము. ఈ స్వవిషయములకై యాతడు పాటుపడవచ్చు. తనకును, తన సంఘమునకును, తన జాతికిని తాను చేయవలసిన కర్తవ్యములు కొన్నికలవు. సాధారణముగా నీ విధి నిర్వహణము స్వవిషయము వరకే జరుగును. ఈ జాంతవికవాంఛాపరితృప్తిచాలదు. ఈ విథుల నాధ్యాత్మికముగా చేయు మార్గమొకటి కలదు. ఇది వ్యక్తి కౌన్నత్యము కలిగించు కర్మాచరణ మార్గము. ఇదియే ధర్మాచరణ మార్గము. ప్రజలాధ్యాత్మి కౌన్నత్యమును ప్రగతిని పొందుట కవసరమైన సౌకర్యములన్నియు సమకూర్చుట ప్రభుత్వము విధి. ''రాజాధర్మస్య కారణమ''ను దాని తాత్పర్య మిది.
ఆ ఫ్రెంచి వ్యక్తి స్వబోధినుల ద్వారమునగాక గురు శుశ్రూషచే సంప్రదాయ మార్గమున సంస్కృతాధ్యయనము చేయవలెనని కోర్కియున్నదని తెలిపెను. ఆతని కోర్కికి స్వామి హర్షించి యిట్లనిరి. ''హిందూదేశమునగూడ నా సంప్రదాయము చాలా వరకు సన్నగిల్లినది. ప్రాచీనమార్గము చదువుట, వ్రాయుటలు పాండిత్యముచేచిరాకునందునట్లు చేయుటకుకాదు. మహాపండితులుకూడ చదువను వ్రాయను నెరుగరు. ఇచ్చటనున్న యఖ్యాగతులలో నొక్కడు'' ''శ్రీ రామకృష్ణునివంగభాషలో సరిగా తనచే వ్రాలును కూడ చేయరాదని'' తెల్పిరి. నేను లౌకిక పండితుల నుద్దేశించు చున్నాను. కనక్కారులని పిలువబడు కొలది వర్గపు ప్రజల ప్రత్యేక కౌశలము వ్రాత. వారు మంచివ్రాయసగాండ్రు. తక్కిన వారు చాలా వరకు నక్షరజ్ఞాన శూన్యులే. ప్రముఖులైన గణిత శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు విద్వాంసులు, వైద్యులు, వేదపండితులు, వీరెల్లరు చదువను వ్రాయను చేతకాని వారే. విద్య వాచికముగా కంఠస్థము చేయుట, సంతలు చెప్పుట, చింతన చేయు ద్వారమున పూర్వము విద్యాభ్యాసము జరిగెడిది. ఈ విధానమున ప్రత్యేక మహత్త్వము కలదు. కొంత మేరకు దీనిని పునరవలంబించి ప్రయోజనము నంద వచ్చును.
సర్‌పాల్ డ్యూక్సు స్వామి వారితో ''పురాతన విషయము లన్నియు పునర్వ్యవస్థీకరించుట పూజ్యపాదుల కంగీకారమా?'' యని యడిగెను. ''మంచిది, ప్రయోజనకరమైనదేదైనను పునరుద్దరింప వచ్చును. దానికి పరచరమవసరము లేదు. ఇది యామార్గమున జేయబడ తగదు. కొందరైన యోగ్యులు దీని నవలంబించి యాచరణమున నుంచిన చాలును. అదే వ్యాపించును. పాశ్చాత్యులు కూడ దీనికై స్పర్థపడు కాలము రాకపోదు. భారతీయులు కన్ను తెరచి తమ పురాతన వైభవము నొక్కపరి తిలకించుశుభ ముహూర్తమురావచ్చును.
అప్పుడు సర్‌పాలు విన్నవించుకొనెను. ''ఒక్క తుది యభ్యర్థనము స్వామీ! పూజ్యపాదులుపశ్చిమ వాసులకిచ్చు సందేశ##మేమో సెలవిత్తురా!'' కొంతసేపు స్వామి మౌనము వహించి, స్వామి యంతర్ముఖులైరి. కన్నులరమోడ్పు వడినవి. ధ్యానమగ్నులైరి. తదనంతరము మెల్లగా తూచి మాట్లాడసాగిరి. ''మీరేది చేసినను. ప్రేమభావముతో చేయుడు. ఏ కార్యమైన నితరుని దృష్టి యందుంచుకొని చేయవలెను. ఒక పనిలో కర్తభోక్త సమ భాగులే, అందుచే కార్యమెప్పుడును ప్రేమ పురస్సరముగా నుండవలె. ఇందునేను గాంధేయాహింసా సిద్ధాంతమును పురస్కరించుకొని మాట్లాడుటలేదు. తీవ్రకాండకు కూడ నవసర పరిస్థితిరావచ్చు, శిక్ష యవసరము కావచ్చు. యుద్ధములు కూడా చేయవలసిరావచ్చు, కర్మ స్యరూపవే దేవనునది చేయునతడు ప్రేమతోనే దానిని నిర్వర్తింపవలె. దాగద్వేషములు, క్రోధమాత్సర్యములు, సంపూర్ణముగా నిర్మూలింపబడవలెను. ప్రేమ ప్రధాన సూత్రమైనచో ప్రపంచమున చాలా భాగము చెడు నశించును. దీనిని భరతఖండమహర్షులు యోగులునిచ్చు సందేశముగా మీరు కొనిపోవచ్చు''నని స్వామి సెలవిచ్చిరి.
భారతీయాధ్యాత్మిక సంస్కృతి యందలి పరమౌదార్యమూర్తితో చిరస్మరణీయమైన పరిచయ సమావేశము ముగిసినది. సాదుత్వ మర్యాదా గుణ విశేష సౌరభ తన్మయులై, తనియించు వారి సత్యవాక్కుల వినుచు నెవ్వరైనను సమ్మోహనకరములైన స్వామి కనుల భాసించు జ్ఞాన జ్యోతిః ప్రకాశమును చూడగలరు. 1966 డిసెంబరు 5న నాచార్యస్వామి వారి గణనీయ పరిచయ సమావేశములను కాళహస్తిలో గ్రీసుదేశము నుండి వచ్చిన గ్రీసురాణీమాత, రాణీ ఫ్రెడరికా (Her Majesty queen Mother of Greece) యువరాణి వరీను (Her Royal Highness Princess Irene) అను వారు పొందిరి. సత్యాన్వేషణకై పూజ్యపాదులు ఆచార్య స్వామి దర్శనము వీరు చేసికొనిరి. సుదూరమైన యీ వారి ప్రయాణము పరమ ప్రయోజన కారికాగలదని వారు భావించిరి. సఫలులైరి. స్వామి సంపూర్ణాను గ్రహమును వారు పొందిరి. వారడిగిన ప్రశ్నలును స్వామివారి సమాధానములు నీ క్రింద చూడ గలరు.
1. ప్రశ్న :- స్వామీ! జాగ్రదవస్థలో నేను కొంతవరకు ధ్యానము చేయగలుగు చున్నాను. కాని యా ధ్యానానుభవము స్వప్నమున గూడ నిలుపవలెనన్న నేమి చేయవలెనో సెలవిండు.
సమా:- స్వాప్నిక విషయముల గూర్చియంతగా నెవ్వరును బాధపడనక్కరలేదు. జాగ్రత్తున నొందిన ధ్యానానుభవము స్వప్నమున నొందక పోవచ్చు. స్వప్నము లాధ్యాత్మిక విషయ పరిధిలోనివికావు. ఆధ్యాత్మిక తత్త్వాన్వేషకులు వీనిని గూర్చి వ్యాకుల మందనక్కరలేదు. అట్టి స్వప్నములు తమ యాధ్యాత్మిక జీవితమున కవరోధములని యెవ్వరును భావింపరాదు. అట్లు భావించుటయు, మానసికాందోళన జెందుటయు, నవరోధములు. జాగ్రదవస్థను గూర్చియే తత్త్వాన్వేషకులు జాగురూకత వహింపవలెను. జాగ్రజ్జీవితకార్యక్రమ కృషి యాత్మాన్ముఖ మైనప్పుడు, క్రమముగా స్వప్నములందును నాధ్యాత్మికానుభవములే ప్రతి ఫలించును.
స్వప్నముల వలన జాగ్రజ్జీవితము మార్పునందదు. స్వప్నములనేజాగ్రజ్జీవితమును మార్చును. బంగారు చాయమేనివాడు జాగ్రత్తున వలెనే స్వప్నమున గూడ బంగారు చాయవాడుగనే ఖావించును. నల్లనివాడు నల్లని వాడుగనే కలగనును. అట్లే జాగ్రదనుభవములు స్వప్నముల ప్రతిబింబించును. కొలది మార్పులుండవచ్చును. చిత్రరూపముల కన్పింప వచ్చును. కానీ నీప్సితార్ధి జాగ్రదవస్థలో జాగరూకుడై మెలగి, యాత్మావబోధమునకై నిరంతర కృషి చేసినచే స్వప్నావస్థయందుగూడనదే దృక్పధమునననుభవము ప్రతిఫలించును తీవ్ర విషయకాల్యమును, తీవ్రవాంఛలను జాగ్రత్తున నరికట్టిన వానికి కాలక్రమమున స్వప్నములు శాంతియుతములును, దివ్వములునగును.
2. ప్రశ్న :- సమచిత్తత యేకాగ్రత కలుగుటకు స్వామివారు దయచేసి యేదైన విధానమును సెలవీయగలరా?
సమా:- సాధారణముగా నెవ్వరైన రెండు ముక్కు పుటములలో నేదోమొక దానిలో నూపిరి తీయదురు. కుడియెడమలలో నొకదాని నుండి మఱియొక దాని ద్వారమున నూపిరితీయుట మార్చవచ్చును. కుడినాసారంధ్రము నుండి గాలి తీసి యెడమ దాని నుండి గాలి విడువ వలెనన్న శరీరపు కుడి భాగముపై వొత్తిడి కల్గును. అప్పుడు కుడి చేతిని నేలపై నానాచి దేహమావైపు వాలునట్లు చేయబడును. ఇట్లే యెడమ నుండి కుడికి మార్చునప్పుడీయొత్తిడి యెడమ భాగముపై బడును. సరిగా నీ మార్పు జరుగులోపల నొకటి రెండు సెకనుల కాలమూపిరి రెండు ముకుపుటములనుండి తీసికొనబడును. దీనికి ప్రాణాయామమనిపేరు. ఈ ప్రాణాయామము నభ్యసింప నారంభించినచో నుచ్ఛ్వాస నిశ్వాసముల మధ్యకాల వ్యవధానము పెరుగును. ఈ ప్రాణాయామము వలన మనోనిశ్చలత కలుగును. ఈ యభ్యాసము చేసినకొలది సమచిత్తత కలిగి నైశ్చల్యము నందు దార్ఢ్యము పెంపొందును.
3. ప్రశ్న :- పరిసరములనుకూలము కానప్పుడు నొకరి జీవనవిధానము కిట్టకప్రజలు శత్రులైవ్యవహరించునప్పుడును, నెల్లయెడలక్రూరపాపాచరణమే యెదురగునప్పుడు నా వ్యక్తియేమి చేయవలెను?
సమా :- క్రూరులు పాపులు నైనదుష్టులమధ్యనుండవచ్చు నయినను వానిపై ద్వైషముచూరాదు. వానిని విసుగుకొనరాదు. మంచియు, వారిపైజాలియు కరుణము కల్గియుండవలెను. స్వభావసిద్ధముగా నెవ్వరును క్రూరులుకారు. వారిపెంపకము, పరిస్థితులు వారినట్లుచేసినవి. అందుచేవారట్లుచేయబడినందులకు వారిని ద్వేషించుటలో నర్థములేదు. పురోగతిని వాంఛించువాడు ద్వేషము నెవరి యెడచూపరాదు. ''ఒకడు తన పరిస్థితి ప్రభావమునను, పెంపకమునను దుష్టుడైనాడు. కావున వానిని మనము ద్వేషింపరాదు. జాలిపడవలెను. నాకు ప్రియమైనవాడు. కుమారుడే యొకప్పుడు దుర్మర్గగామియైన నేనేమి చేయుదును. ప్రేమతో చూచి వానిని మార్గమునకు మరలింపయత్నింతును గదా! అట్లే పరునికూడ చూతునా? సత్యాన్వేషికి పరుడెవ్వడులేడు. స్వపరభేధముండదు. అందరును నాతని బంథువులే. నేనేయట్టి చెడుపరిస్థితులలో పుట్టిపెరిగిన నాగతి యేమయ్యెడిది. నేనుకూడ దుర్మార్గముననే ప్రవర్తించెడి వాడను గదా. కావున దుష్టులందు కూడ నాయాత్మ పదార్థమునే దర్శింతును గాక! నేను వానిని ద్వేషింపకుండుగాక.'' అని చింతింపవలెనని స్వామి సమాధానమిచ్చిరి.
4. ప్రశ్న :- సవికల్ప, నిర్వికల్ప సమాధులననేమి సహజ సమాధియేది?
సమా :- సవికల్ప నిర్వికల్ప సమాథులు ధ్యానైకాగ్ర్యమునందలిస్థితులు. సవికల్పసమాధిలో మనస్సు నిశ్చలమై, ధ్యానవిషయమున తన్మయమైయుండును. నిర్వికల్ప సమాధి యోగమార్గ గమ్యము. మనోవ్యాపారముండదు. స్యస్వరూపాను సంధానమున నాత్మై భాసమున, శాశ్వతముగా నదినిష్క్రమించును. అద్వైతమున గూడధ్యానమార్గ మామోదింపబడినది. కాని యందలి ధ్యానగమ్యము నిర్గుణ నిరాకారపరబ్రహ్మము. సహజ సమాధియన బడునది సవిమర్శపధమున ననుభూతమగును. ఇది సహజాత్మానుభవస్థితి. అవాంతరాను భవములతో సంబంధము లేనిది.
5. ప్ర :- ఆచార వ్యవహారాది విషయముల నాయకుడేమి చేయవలెను. అవి నిష్ప్రయోజనకరములని తెలిసినప్పుడు తానాచరింపవలెనా?
సమా :- వర్గమునకుగాని, సంఘమునకుగాని, రాష్ట్రమునకుగాని నాయుకులైనవారు సుస్థితములైన మతాచార వ్యవహారములను విసర్జింపరాదు. వారి స్వవిషయమున ప్రార్థనామందిరములలోనివిద్యుక్త కర్మలతో పని యుండకపోవచ్చు. నాయకులైనవారు వానిని వదలనారంభించినచో ప్రజలు నష్టపడుదురు. ప్రజలకీ కర్మకాండలవసరము. వారు కూడ వానిని విసర్జింపసాగుదురు. ఇది నష్టదాయికమైన యాదర్శముగానగును. భగవద్గీతలో కర్మాసక్తులై నయజ్ఞుల మనములను వివేకవంతులు కళవల పెట్టరాదు. మించివివేకులు సముఛిత కర్మాచరణమునను విజ్ఞతచేతను, నజ్ఞుల విథ్యుక్తాచరణ పరులగునట్లు చేయవలెను. అందుచేదేనికినాయకులైనను వారివారి నాయకత్వమునందలి ప్రజల కాదర్శప్రాయులై పూర్వాచారములను దైవప్రార్ధననువారుచేయునట్లు చేయుటవారివిధి, కాని వారిని పాడుచేయుటకాదు.
స్వామి దర్శన సమావేశ సందేశముల వలన నందిన యపూర్వ సుస్థిరానుభవమును గూర్చి వ్రాయు నా మహారాణి యిట్లు వివరించినది. ''వారి సాన్నిధ్యమున మేము గడిపినరెండురోజులు మా జీవితముల మరపురానివి. అది సంపూర్ణాధ్యాత్మికానుభవము. ఏ యదృష్ట విశేషమో మమ్ములను వారి సాన్నిహిత్యమునకు తెచ్చినది.
అదే యనుభూతినిపురస్కరించుకొని పూర్ణపురుష దర్శనమైనదని సముచితముగా సంఖాషించుచు నామహారాణీ యిట్ల భివర్ణించినది.
ఇప్పుడు కొంతసేపటి నుండి నిస్సందేహ స్థితినందితిని. (వివరములడుగుట తప్ప). అయినను నాత్మైక్యము నందుట లేదు. అయినను నిరంతరాభ్యాసానుష్ఠానములు దానికి స్థయిర్యముకలిగింప గలవు. తత్ఫలితముగా సమస్యయే యసలుండదు. కాల పరిపక్వతలో నదృష్టమన్నిటిని సమకూర్పగలదని నా విశ్వాసము. అదృష్టమహాఫలముగా లభించినదే యీ పూర్ణ పురుష దర్శన సమావేశములు. ఈ మహాత్ముని యాశీస్సులకంటె హృదయ స్పందన సుఖానుభూతి నందిన నేనభిలషించునది లేదు.
తత్త్వాన్వేషకులాధ్యాత్మికముగా దేనిననుభూతి నందుదురో దానిని వియత్తల సంచారులు భౌతికముగా ననుభవించు చుండవలెను. అదియూహకందని దివ్యానుభవము'' అని స్వామి సెలవిచ్చిరి. వారి సన్నిధానమున వారి కరుణ విశేషమున మేము భయా నిర్వాచ్చానుభవము నందితిమి. వారికి మా ప్రణామములు. వారు ''పదార్థము, చైతన్యము'' నీ రెండిటి సంధిగా (నన్వేషకునికి) కన్పట్టిరి. ఆ రెండునుభిన్నము కావనిచూపబడెను. నశ్వరమైన దేహమున నీ మహర్షియొక యతిధి యను నది వీరి దర్శనమున స్పష్టమైనది. రూప జగత్తున్నది. అందీ మహర్షి యున్నారు. ప్రాణభూత చైతన్యమున్నది. దానితో వీరభిన్నులు. చైతన్యము, జగము భిన్నములు కావని ప్రదర్శితమైనది. వారి చూపున జీవునియహంకారబంధములు తొలగినవి. ఆ కన్నులయందలియాత్మచైతన్యమే మాలో భాసించినది. ఈ చర్మ చక్షుస్సులతో నీ యనిర్వచనీయ సౌందర్యము దర్శింప సాధ్యమగునా?
వారి యనుగ్రహ మహత్త్యనుపారము. ఈ శరీరి దాని ప్రభావమునిమిడించు కొనలేకయానంద బాష్పములు నింపక తప్పినది కాదు. ఇష్టావాప్తి నానంద బాష్పధార శరీరిని ప్రక్షాళించి, క్షణకాలము పరమాత్మలో తన్మయీ భవనము నందించినది.
స్వామి వారి పీఠారోహణ వజ్రోత్సవ శుభావసరమున డా. పాల్బ్రంటను మహాశయుడొక సందేశమంపెను. స్వామి వారితో నీయనపరిచయ సమావేశ విశేషములు పూర్వమే వ్రాయడినినవిగదా! ''సుమారు నలుబది సంవత్సరములకు పూర్వము శ్రీ కంచి కామకోటి పీఠస్వామివారి సమక్షమున నేను కూర్చుండి యుంటిని. వారు దయాళురై యిచ్చిన సలహాలోని సముచితత్వము-సమాధానములు-ప్రబోధములు-కీ||శే|| శ్రీరమణ మహర్షి సన్నిధానమునకు నన్ను వారంపినప్పటి దర్శకత్వ వైశిష్ట్యమును తదుపరినాయనుభవమున నిర్థారింప బడినవి. వారితోటి సమావేశమనన్యా దృశ్యమైనదని యొక విశ్వాసము కూడ కల్గినది. గుప్త ఖారతాన్వేషణమును (A search in secret India) అను దానిలో నొక చోట నాటి రాత్రి నాకు కల్గిన దృశ్యము, నా సమయమునకే నందిన ¸°న్నత్యమును గూర్చి రచించితిని. మధ్యకాలమున చాల తరచుగా వారిని స్మరించుకొను చుండెడివాడను. నిస్సందేహముగా వారున్న తోన్నతాధ్యాత్మిక శక్తుల ప్రగతి స్థానమని నా ఖావము. మత ప్రయోజనముల నుద్ధరించిన మహనీయులు వారు. ఆథునిక జీవన ప్రాబల్యమునను, పారిశ్రామికీకరణ ప్రభావమునను, భౌతికవాద ప్రాచుర్యమునను, భరత ఖండము నైతికపువిలువను కోల్పోవుట శోచనీయము.
హిందూ దేశమున శాస్త్రాధ్యాయనము చేసిన యువకులు, వారి మతమునకు నిరుపయోగపరులు. దానిని గర్హింతురు. పశ్చిమ దేశ వాసులమైన మేమిట్టి స్థితినే యనుభవించి యిప్పుడు మరల మత మార్గమునకు మరలితిమి. దీని నుండి భారతీయులు పాఠము నేర్చుకొందురు గాక!
అమెరికా దేశపు కాన్యల్ జనరలు డా|| ఎ.బి.ఫ్రాంక్లిను 1967 ఫిబ్రవరి 20న వజ్రోత్సవ మహాసభల కధ్యక్షత వహించి స్వామి వారిని గూర్చి యిట్లు పలికెను. ప్రపంచ చరిత్రలో ననేక విభిన్న స్థాయిలలో విషయములు జరుగుచున్న యీ కాలమున మనము నివసించు చున్నాము. ఈ పరిధులలో నెందైన మనము చిక్కినచో నసలుపూర్ణము నుండి తప్పిపోదుము. ఈ స్థాయిలలో నొకచోట మా పశ్చిమ ఖండమున్నది. అది నాకు చాల నిష్టమైనది. భారతదేశమున వేల సంవత్సరములకు పూర్వమే వాచ్యముగను వ్యంగ్యముగను ప్రవచింప బడిన తాత్త్విక జ్ఞానమునకై మా పశ్చిమ ఖండము శతాబ్దులుగా మహామేధావుల నిరంతర కృషి ఫలముగా శ్రమించి శ్రమించి కడు భారమున కన్పట్టుచున్నది. విజ్ఞాన శరీరము నందలి జ్ఞాన సర్వస్వము వేదాంతము. మహాద్భుతమైన మానవ శక్తియే యీ రూపమైనది. అరువది సంవత్సరముల క్రిందటనే పూజ్యపాదులితర స్థాయిలలో మానవకోటి యునికిని, స్పర్థను, సత్యాన్వేషణకై యత్నమును మాన్పించిరి.
అరువది సంవత్సరములు పీఠాధి పత్యము జనవంద్యముగా నిర్వహించిన మహోత్సవ సందర్భమున మనము నేడు శ్రీవారిని గౌరవించుటకు సమావిష్టులమైతిమి. కాని యిది వారికొరకు కాదు. ప్రాపంచిక గౌరవ సన్మానములకు, బహుమానములకు వారతీతులు, వారిని దైవముగా మనము గుర్తించుటకు చిహ్నముగా నీ సన్మానము చేసికొనుట మనకవసరము.
పూజ్యపాదులకు కృతజ్ఞతా భక్తి గౌరవ పురస్సరముగా నా యనుభూతిని ప్రకటించుకొనుటకు నాకుసముచిత శబ్దజాలము దొరుకుటలేదు. సజీవమై, మార్పు నొందు మహాశక్తినిగాని మూర్తి మహత్త్యమునుగాని వర్ణించుటకు శబ్దశక్తి చాలదు. ఒక వస్తువుగాగాని, వ్యాపార సాధనముగాగాని శబ్దమును వాడుకొను మనము శబ్దములపై విశ్వాసము చాలని వారమయితిమి, పూర్ణవస్తువర్ణన సాధనముగా శలమును పురాతనులైన మీ పూర్వులు విశ్వసించినట్లు మేము విశ్వసింపలేకున్నాము. నేనీ సమయమున చెప్పగలిగిన చాలా సామాన్య విషయము అతి దైవభక్తికి స్థానమైన క్రైస్తవఅమెరికా నుండి నేను వచ్చితిని, అదియే క్రొత్త ఇంగ్లండు (NEW ENGLAND). ఆ పవిత్ర భూభాగము నుండియే పాశ్చాత్యులలో ప్రప్రధములైన తాత్త్వికులు బయలుదేరిరి. అతి పురాతునులచే ప్రతిపాదింపబడినను వేదాంతమపారానందాను భవప్రదమని యునదిమనకదియ పూర్వమనియుమెచ్చెకొనిన పాశ్చాత్యులుద్భవించిన భాగమది. నేనా మూలభాగము వాడనే. ఎమర్సన్, ధోరోలుకూడనక్కడివారే, ఈ సాయంకాల మిచ్చుట మనలో వారియాత్మశక్తులున్నవి. నేనావరుసవారిలో నొకడను. మా అమెరికాలో మంత్రులు, నుపాధ్యాయులు తీర్చిపోవు బారులకు తీసిపోసిపోనంత దీర్ఘమైనదా తాత్త్వికుల పంక్తి, 17వ శతాబ్దపు చివరి భాగముననీతాత్త్వికుల పంక్తి బయలుదేరునప్పుడు, మంత్రులు, నుపాధ్యాయులును యధాపూర్వపువ్యక్తులే, తన కాలమున ఎమర్సన్‌వలె, మాపూర్వులు కొందరు వారివారి మత విశ్వాసములు కారణముగా వ్యతిరేకతకు గురియైనప్పటికిని, నీసాయంకాలము నేనీ సభనుండుటయందలి ¸°చిత్యము నెవ్వడును ప్రశ్నంపలేదు.'' అనిచెప్పగలుగుచున్నందులకు నేను సంతసించుచున్నాను. ఇప్పడు మన ముత్సవము చేసికొన్న యీ మహాత్ముడు మానవజాతి మహోన్నతాశయలకు పట్టుకొమ్మ.
మన స్వామి వారి యద్వితీయ మహత్త్వాను భూతిని మాటలలో చెప్పుట కష్టసాథ్యము. వారి సన్నిథానమున మన ముండుటయే మహాభాగ్యము. అసంఖ్యాకభక్తజన బృందము వారివాక్సుధను క్రోలినప్పటి తృప్తి యనిర్వాచ్యము. స్వామిని సంభావించినప్పుడు శంకర భగవత్పాదుల ప్రశ్నోత్తర మాలికయందలి
''కోగురుః? అధిశతతత్త్వః
శిష్యహితా యోద్యతః సతతమ్''
''ఎవరు గురువు? తత్త్వాను భవము కలవాడై, ఎల్లప్పుడు శిష్యహిత హితము కొరకు సంసిద్ధమైనవాడు. ఆదిశంకరుల తర్వాత నరువది యెనిమిదవ యాచార్యులుగా కంచికామకోటి పీఠాధిపత్యము నరువది యేండ్లు 1967 నాటికి నిర్వహించిన మహనీయులు మన స్వామి.
ఇటీవల వత్సరములలో నేకాంతత
మఠపాలనా ముఖ్య వ్యవహారములనుండి క్రమముగా విరమించుటకును, సాధ్యమైనంతవరకుత్తమ స్థాయిలోనాది శంకరుల ప్రబోధముకొనసాగుచున్నదను విశ్వాసము కొఱకును, స్వామి తమయనంతర పీఠాధిపతిని నియమించి 1954లో వారికి సన్యాసాశ్రమిచ్చిరి. శ్రీ జయేంద్ర సరస్వతీస్వామి గురుపాదుల నుండియే యవసరమైన శిక్షణ నందిరి. మఠ కార్యక్రమవ్యవహార నిర్వహణ దక్షతవారికి రాగానే స్వామి బహుముఖాభివృద్థి నందిన పరమపావన కాంచీపీఠమున కధిపతిగా శ్రీ జయేంద్ర సరస్వతీస్వామి వారినుంచి పూజ్యపాదులు ''ఏకాంతము''న నుండసాగిరి.
ఆంధ్రప్రదేశమున తిరుపతి సమీపమున గల కార్వేటి నగరమున స్వామి ప్రప్రధమైకాంతవాసము నారంభించిరి. ఇదిచాలా చిన్నపట్టణము. పల్లెవాతావరణమున ప్రశాంతముగా నుండు ప్రదేశమిది. అలంకారప్రాయమై యిక్కడ నొక పెద్ద కోనేరు గలదు. దానియొడ్డున నొకచిన్న పర్ణశాల స్వామి నివాసమునకై నిర్మించబడినది. 1971-72 ఒక సంవత్సరము స్వామి యిచ్చట నుండిరి. జనసంకులమై యలజడి గల ప్రదేశములకు దూరముండవలెనని స్వామి యీ చోటునెన్నిరి. కాని భక్తులెక్కువ కాలము స్వామి దర్శనములేక యుండలేక పోయిరి, అందుచే క్రమక్రమముగానాశ్శీస్సులకును, నాదేశములకును భక్తులు వీలైనంత తరుచుగావారి యొద్థకరుగసాగిరి. అందుచే కార్వేటి నుండి కంచికి నివాసము మార్చిరి.
1972 జనవరిలో, కంచిశివారులలో శివస్థానముననున్న శివాలయము ప్రక్కనేయొక పర్ణశాలలో స్వామి నివసింపసాగిరి. పరిపొలములతో మనోహరముగా నుండు ప్రదేశమది. దేవాలయము దగ్గర నొకపెద్ద చెఱువు కలదు. గజప్రస్థశైలిలోనిర్మితమైన వానిలో నా చెర్వు చక్కని మచ్చుముక్క. ఆ దేవళమునకు దక్షిణ ఖాగమున నొకగూటిలో దక్షిణాభిముఖుడైన శివుడున్నాడు (దక్షిణమూర్తి) గర్భగుడిలో శివలింగము వెనుక గోడపై నాది శంకరుల శిల్ప ప్రతిమ కలదు. స్వామి నివసించు నాశ్రమము దేవాలయమున కాగ్నేయమున నున్నది. స్వామి పర్ణశాల దక్షిణమున నొక చిన్న ప్రాకారముగల దొడ్డియున్నది. దాని మధ్యనొక బావి యున్నది. ఈ బావి బయట నుండి భక్తులు స్వామి దర్శనము చేయగలరు. చాలా రోజులు వారు మాట్లాడరు. ఈ మౌనము సంపూర్ణరూపము దాల్చినప్పుడు వారు సంజ్ఞలు కూడచేయరు. దృష్టి కూడ ప్రశాంతమగును. పగలెప్పుడైన స్వామి దర్శన క్షణమునకై శివస్థానమున భక్తులు వేచి యుందురు. పూర్వమువలెనే వారు స్వామికి మ్రొక్కువారు. అభయ హస్తముననో, శిరఃకంపముననో, వీక్షణముననో వారిని స్వామియను గ్రహించును. స్వామిమాటలలో చెప్పకపోయినను, భక్తులకు వారి దర్శనము చాలును, వారి సంజ్ఞలు మహాప్రసాదమైవారివారి విషయముల కావలసిన సాయము స్పష్టముగా పొందుదురు. పొందినట్లు వారి ముఖములు సంతృప్తి, యుల్లాసములే కాదాత్మౌన్నత్యమునందించు స్వామి దర్శనభాగ్యమచ్చినందులకు గర్వము కూడకలిగినట్లు కన్పట్టును.
శివస్థానమున జరిగినరెండు సంఘటనలనిచ్చట వివరింతును. ఆధ్యాత్మికశాంతి, విశ్వసమైక్యము, సౌఖ్య సమృద్ధి కలుగునట్లు జగద్గురు నాశీస్సులు ప్రపంచకముపై నెట్లుప్రసరించినవో యవి విశదపరుపగలవు.
ఆ వత్సరము చాతుర్మాస్య వ్రతము జులై 4న స్వామి యారంభించిరి. ఇది యరువది యెనిమిదవ చాతుర్మాస్య మొట్టమొదటిది 1907లో జరిగినది. ఆచార్యస్వామి 1974 జులై 4న చేసిన యా పూజను మహాభాగ్యముగా దర్శించిన భక్తజను లెట్టి యానందోత్సాహములందిరో చెప్పనసాధ్యము. తెల్లవారగనే యసంభ్యాక భక్తజన మచ్చటికి చేరుకొని వేచియుండిరి. ఒక సంవత్సరము తర్వాత నిక్కడ స్వామి బయటకు వచ్చి వేదికనలంకరించినదిప్పుడే, వేదిక పడమటి దిక్కున నున్నది. పూజా నిర్వహణమునస్వామికి తోడ్పడగల కొలదిమంది సంప్రదాయజ్ఞులైన విద్వద్వరులుకూడ నా వేదికపై నాశీనులైరి. చాతుర్మాస్య వ్రత ప్రాముఖ్యము నిదివరకే చెప్పియున్నాము. వర్షకాలమునభూమిపై సంచరించు క్రిమికీటకాదులకు నేమైన హింస కలుగకుండుటకై సన్యాసులా నాల్గుమాసములుగాని నాల్గుపక్షములుగాని యొక్కచోటనే నివసింతురు. ఆషాడ పూర్ణిమనాడీ వ్రతము మొదలగును. నాడు వ్యాసమహర్షికి పూజ జరుగును. అందుచే దానికి వ్యాసపూజ యనిపేరు, ఈ యారాధనలో మనస్వామి యాదర్శప్రాయులు. ఆ సంవత్సరము వ్యాసపూజ నాడుదయము 9 గంటల కారాధన కార్యక్రమము మొదలైనది. మధ్యాహ్నము మూడుగంటలకు పరిసమాప్తి నందినది. నాటి పూజనుదర్శించుభాగ్యము గలవారు తన్మయులై కాలగతిని గూడ నెరుగ లేకపోయిరి. కాలాతీతతత్త్వరూపులైన స్వామి, మహర్షులకు, దేవతలకు లోకకల్యాణార్థము పూజ చేయునప్పుడు తత్సన్నిధి నెవ్వరైన ప్రొద్దెరుంగుదురా!
శ్రీ కృష్ణ పరమాత్మ పూజతో నీ పూజారంభ##మైనది. వైష్ణవ సంప్రదాయమున పరమాత్మ నాల్గు వ్యూహములుగా విభజింప బడినది. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నా, అనిరుద్ధులనివాని నామములు. ఈ వ్యూహ వాసుదేవుడే దేవకీ వసుదేవుల పుత్రుడైన యవతారమూర్తి, మిగిలిన మూడు శ్రీ కృష్ణవాసుదేవుని పెద్దన్న, కుమారుడు, మనుమడును. ఈ నాల్గు వ్యూహములు జగత్సృష్టికిని, జీవసృష్టికిని, సంబంధము కలవి. సంకర్షణ సృష్టితో బీజ సృష్టిజరుగును. ప్రద్యుమ్నునితో ప్రకృతిపురుష ద్వైత సృష్టి ప్రారంభమగును, అనిరుద్థ వ్యూహము, జీవ శరీర సృష్టి-వృద్ధి-మోక్షమునకు సంకర్షణుడై కాంతికమార్గమును, అనిరుద్థుడు క్రియాఫలమైన మోక్షమును ప్రసాదింతురు. శ్రీకృష్ణ భగవానుని పూజానంతరము పైలవైశంపాయన, జైమిని సుమంతుల అర్చన యగును. తర్వాతనాది శంకరులకును తర్వాత గురు పరంపరలో శుక, నారద, ద్రవిడాచార్య, గౌడపాద, గోవిందపాదుల పూజలు, తర్వాత బ్రహ్మమానస పుత్రులు సనకసనందన, సనత్కుమార, సనత్సుజాతులకు, సర్వజ్ఞాత్మునకు (వీరు బ్రాహ్మణులు- శంకరభాష్యమునకు సంక్షేప శారీరకమను పేర వ్యాఖ్యానము వ్రాసిరి) ప్రకాశాత్మకు, (పంచపాదికా వివరణ కర్త) తర్వాత గురుపరమగు, పరమేష్టిగురు, పరాపరు గురువులకు తర్వాత గురు పరంపర (బ్రహ్మవిద్యా వేదాంత) సంప్రదాయ ప్రబోధ ప్రచారము చేసినవారికి, చివరి క్రతువు వినాయకాది దేవతా శరీరమునకు చివరకు పరమాత్మ శుద్థ చైతన్యమునకు జరుగును. నాడువివస్థానమున సమావిష్టులైన భక్తకోటికి చిరస్మరణీయమైన యద్భుతానుభమిది. వేదాంత సంప్రదాయము నాయక మణులైన తత్త్వదర్శకులకు ననంత కల్యాణ గుణ రూపులైన దేవతా మూర్తులకు. నద్వైత పరతత్త్వమైన పరమాత్మ పరబ్రహ్మమునకు జరిగిన యారాధనా విశేషమున హృదయ పూర్వక భక్త్యంజలిని సమర్పించుకొని పాల్గొను నదృష్టము కల్గుట పుణ్యవిశేషముకదా !
1974 జులై 14 ఆదివారము సాయం సంధ్యా నుష్ఠానానంతరము పెరటిలో నున్న బావి వెనుక నున్న బల్లపై స్వామి విశ్రాంతి నందుచుండిరి. కొలది మంది భక్తులు బావి కవ్వల నిలబడి యుండిరి. స్వామి యేదో తీవ్రముగా నాలోచించుచుండిరి. ఇతర విషయము లప్పుడు శ్రవణ గోచరమైనను వారు సమాధానమీయలేదు. మౌనానంతరము కొంతసేపటికి స్వామి యచ్చట నున్న వారిని ప్రపంచమున నెచ్చటెచ్చట హిందువులు నివసించుచుండిరో తెలియునా యని యడిగిరి. కొన్ని దేశముల నామములు పేర్కొనబడినవి-ఇండోనేషియా, ఫిజి, పశ్చిమ హిందూ ద్వీపములు, దక్షిణాఫ్రికా మొదలుగునవి. చెప్పబడని కొన్నింటిని స్వామి పేర్కొనిరి. ఇటీవల విశ్వహిందూ పరిషత్కార్య దర్శి ఈ ప్రాంతములను పర్యటించెను. తిరిగి వచ్చిన తర్వాతనచ్చటి ప్రజలు నిత్యప్రార్థనము చేసికొనుటకుపయుక్తములైన కొన్ని శ్లోకముల నేరి వానిని ప్రపంచము నందలి వివిధ ప్రాంతముల హిందువులకు తెలుపవలెనని యాయన కోర్కి వెలిబుచ్చిరి. ఏ శ్లోకములు వారికి తగినవి? అని స్వామి యనిరి. దీనిని బట్టి స్వామి యీ విషయము యా సాయంకాలమున నాలోచించుచునట్లు స్పష్టమగును. వారు జగద్గురువులు. వారెప్పుడును లోక సంగ్రహ దీక్షా పరాయణులు. అచ్చటనున్న వారు స్వామి వారి ప్రశ్నకు తగిన శ్లోకములను వారికి తోచిన వానిని చెప్ప మెదలిడిరి. ఆకస్మికముగా నచ్చట నున్న సంస్కృతపండితునితో ''యశ్శివో''తో నారంభమగు శ్లోకము లేదా యనిరి. ఆ పండితుడున్నదనెను. కాని యదియే పురాణాంతర్గతమో యప్పటి కాయనకు స్ఫురణలో లేదు. క్షణ మాలోచించి స్వామి ''యశ్శివో'' యను దానిని విదేశస్థులైన హిందువులుచ్చరించుట కష్టమేమో, ''కాన నా రెండు పదములను ముందు వెనుకలకు మార్చి ''శివోయో'' చేసిన బాగుండునని సూచించిరి. అప్పుడు మొదటి చరణ మిట్లు చదువబడెను.
''శివోయో నామ రూపాభ్యాం'' అని.
ఈ క్రమమున కనువర్తనముగా రెండవ చరణము కూడ ''యాదేవీ''కి బదులు ''దేవియా సర్వమంగళా''గా మార్చిన బాగుండును. నాల్గవ చరణమున ''సర్వతో'' యనునది ''సర్వదిక్''గా మార్చవలెను. సర్వ దిక్కనగా ప్రపంచమున నన్ని భాగములని యర్థమగును కదా. అప్పుడెల్ల భాగముల ప్రజలు వత్తురు.
ఇది మార్చ బడిన శ్లోకము.
శివోయో నామరూపాభ్యాం దేవీయా, సర్వమంగళా
తయోస్సంస్మరణాత్పుం సాంసర్వ దిగ్జయమంగళమ్
''నామరూపముల రెండింట నెవడు శివుడో (మంగళ ప్రదుడో), తేజోమూర్తి యగు నెవతె సర్వ మంగళయో'' ఈ యిరువురినిధ్యానించు వారికి వారికి సర్వదిక్కుల (భూమిపై నే భాగముననైన) నున్న ప్రజలకు జయము మంగళము కలుగుగాక, ఈ పార్వతీ శివస్తుతికి జతగా మరియొక శ్లోకమును స్వామి సూచించిరి. ఇది రామాయణము నందలిది.
మంగళమ్ కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళమ్
మహా గుణవంతునికి, కోసల రాజ్యాధినేతకు శుభమగు గాత| చక్రవర్తి కుమారునికి సార్వభౌమునికి మంగళము.
రామాయణమునందలి యీ శ్లోకము మంగళారంభము-మంగళాంతముకూడనని స్వామి స్పష్టీకరించిరి. సంస్కృత విద్వాంసునితో స్వామి ''రత్నత్రయము నెరుగుదురా.'' యనియనిరి. ఆయన తెలియును. మనకు రెండు శ్లోకములే యున్నవి కదా| మూడు కావలెనన్న మఱియొక శ్లోకము కావలెనని యనెను. స్వామి సమాధానమున ''రత్నత్రయమనునది శ్లోక సంఖ్యను బట్టి కాదు. పై శ్లోకము లందలి, దేవతా మూర్తుల సంఖ్యను బట్టి శివ, దేవి, రాముడు 'వీరు రత్నత్రయ'మనిరి.
1957లో మదరాసులో నిచ్చిన యుపన్యాసమున స్వామి రత్నత్రయమనువిషయమే మాట్లాడిరి. హిందూమత దృక్పధమున పరదైవమద్వైతమూర్తి రూపములెన్నియైన నుండవచ్చును. సత్యపదార్థ మొక్కటే, అనుభవమును బట్టి స్త్రీ పురుషాత్మకముగా నీ భేదములేదు. అది మాతాపితృసమష్టి రూపమున నుండును. జగత్పితరులైన శివపార్వతుల రూపమేయది. అది స్త్రీ సగము, పురుషుడు సగము, అది యర్ధ నారీశ్వరము, కుడి శివుడు, ఎడమ పార్వతి, అట్లే శివశిష్ణువులకు భేదము లేదు. సగము శివుడు, సగము విష్ణువు కాగల హారిహార రూప విగ్రహములు కూడ గలవు. శివుడు, దేవి విష్ణువులు ముగ్గురి సమైక్య రూపమే లోక కల్యాణార్థమున్నది. ఇదియే రత్నత్రయము-ఈ రత్నత్రయము వేదాంతర్గతము. మూల తత్త్వము భేదరహితమైనను, మూడు రూపముల భాసించుచున్నది. రత్నమొకటే వివిధ రీతుల భాసించును గదా. ఏ నామరూపముల దైవారాధన చేసినను నది యొకే మూర్తికి చేరును. ఒకే ఫలమిచ్చును. ఈ యద్వైత పరమార్థ తత్త్వమే హిందూ మత ప్రబోధము.
ఆది శంకరులు ప్రబోధించిన వేదాంత మూల సూత్రము సమైక్యము-సామరస్యము. అద్వైతముల సమ్మేళనమే-ఈ ప్రబోధమే కంచి కామకోటి ఋషీంద్రుల యనుభవమున సందేశమున ప్రత్యంశమునను స్పష్టముగా భాసింపజేయబడినది.
పునః పాదయాత్ర
1978 ఏప్రిల్ 14న పూజ్యపాదులుతేనంపాక్కము నొద్ద శివస్థానమువదిలి వాయవ్యదిక్కుగా పాదయాత్ర ప్రారంభించిరి. రోజునకిరువది- యిరువది యైదు కిలోమీటర్ల చొప్పున మహాగ్రీష్మమునస్వామి పదయాత్ర సాగించిరి. ఆ సంవత్సరము చాతుర్మాస్యవ్రతము (అఘహరీ) హగరీనది యొడ్డున నున్నహగరీ కంచికి నారువందల కిలోమీటర్లదూరమున నున్నది. 1978 జూన్ 25న చాతుర్మాస్యవ్రతాంతమున స్వామి పదయాత్ర మరల సాగినది. కాలడికి వెళ్ళితిరిగి వచ్చిన తర్వాత శ్రీ జయేంద్రసరస్వతీస్వామి వారి గురువులను సంగేశ్వరమనుచోట దర్శించిరి. అప్పటికి వారి చాతుర్మాస్యవ్రతము హైద్రాబాదులో కాలేదు. మరల బొంబాయికిపోవు మార్గమున స్వామివారిని వారు దర్శించిరి. బళ్లారి, హోస్పేట, చందూరులను చూచి స్వామి పదయాత్రను హంపికి చేరిరి. శిధిలావస్థలో నున్న విజయనగర సామ్రాజ్యమునకు హంపి ముఖ్యపట్టణము, అక్కడ కొన్ని నాళ్ళుండి బెల్గాము చేరిరి. బెల్గాముననుండగా నొకభక్తుడు మదరాసు నుండి దికృక్షాగతుడై స్వామిని జేరెను. స్వామిక్షమించి త్వరలో కంచికి చేరునట్లును గ్రహింపవలెనని యతడు వేడుకొనెను, సహజా నుకంపామృదులమైన వాక్కున నతనికి తక్షణమే శాంతికలుగునట్లుగా పలికిరి. ''నే నెచ్చట నున్నను నా హృదయము కంచి యందే యుండును.'' భగవత్పాదుల బ్రహ్మ సూత్ర భాష్యమునకు వివరాణాత్మక భాష్యమన్నది మీకు తెలియునా?
''వింటిని - భామతియే గదా! ''
''భామతికి వ్యాఖ్యానమున్నది. దానిపేరు తెలియునా!''
''అదికల్ప తరువు''
కల్పతరు వ్యాఖ్యాతది ఈ ప్రాంతము. ప్రఖ్యాత విద్యారణ్యులిక్కడివారు. ఆయన యద్వైత వ్యాప్తికి, మన సంస్కృతి సంస్ఠాపనమునకును మహత్తరకృషి చేసెను. వారిక్కడివారు. ఈ ప్రాంతమున నెందరో యద్వైత ప్రబోధకు లుండెడివారు. నేనీ ప్రాంత సంచారమున నా మహనీయులు మానవజాతికి చేసిన మహోత్తమ సేవను స్మరించుచున్నాను.'' ఆ భక్తుడు నిరుత్తరుడైనాడు. ఒక ప్రఖ్యాతమైన సూక్తియీయనకు గుర్తు చేయబడినవి.
''ఉదార చరితా నాంతు వసుధైవ కుటుంబకమ్''
ఉదారచరిత్రులకు ప్రపంచమే కుటుంబము.
స్వామి మహారాష్ట్రమున పదయాత్రను సాగించుటలో వచ్చు మజిలీ యేదో యెవ్వరికిని తెలియదు. వారెచ్చట కాలిడినను నచ్చటి ప్రజానీక మతి భక్తిగౌరవములతో స్వామికి స్వాగత మిచ్చి సేవచేసిరి. జనపదములందును, నగరము లందును నిరక్షరాస్యులైన పల్లెప్రజల నుండి పరమ నాగరికులై, భాగ్యభోగములుగల ప్రముఖులవరకు నాబాలగోపాలము విభేదముల విస్మరించి యాజ్ఞాన భాస్కరు సాన్నిధ్యమున దట్టమైన తమః పటలి తూలింప జేసికొనిరి.
స్వామి యెచ్చటికేగినను ప్రజాకోటి వారిని తమ స్వామిగనే భావించెడివారు. నడయాడు దైవమును దర్శింపగల మహాభాగ్యము తమ కబ్బెనని సంతృప్తులైరి.
- భక్త్యంజలి -
ఋషి జీవిత కధయనగా జన సామాన్యము జీవిత కధ వంటిది కాదు. అది సంఘటనల పరంపరగాని వృత్తాంతముల యానుపూర్విగాని కాదు. సంఘటనల పరంపర సామాన్యుని జీవితవృత్తమున గూడ వాస్తవకథనము చేయదు. భౌతిక జీవితమును బట్టి, యొక మహాత్మునిగాని, యవతారపురుషునిగాని, వారి జీవిత మహత్త్యమును గాని యర్థముచేసికొనుట సాధ్యముకాదు. భావనలుగాని యనుభూతులుగాని, యాచరణలు గాని వైయక్తికముగ మహాత్ములకు సంబంధింపవు. సువిశాలమైన వాని పరిధి లోనవి విశ్వము నే యావరింపగలవు. కాన జగద్గురు జీవితమనగా సర్వప్రపంచ చైతన్యమునే మార్పు చేయగలది. అంతరమైన యీ మార్పుచే గమ్యము సంపూర్ణతనందును. మానవజాతిని వవిత్రీకృతము చేయు పావనజ్ఞాన గంగా తరంగిణి యా జీవితమహాస్రవంతి, మానవజాతికి శాశ్వతమైన కల్యాణము ప్రసాదించును. ఆదిశంకరులు ప్రపంచమును పుణ్యఫలములతో నింపిరి. వానిలో నత్యుమమైనది శ్రీ కామకోటి పీఠాచార్య పరంపర. పద మూడవయేట పీఠాధి పత్యమునందిన మనస్వామి చివరి దశాబ్దములలో నైరంతర కృషితోమానవ జీవితమును విజ్ఞత పావనత్వములకూర్ప యత్నింతురు. అద్వైత మహాత్త్యమును ప్రజాఆత్మబాహుళ్యమున కవగతమగునట్లు ప్రవచింతురు. సంస్కృతిని బలవర్థకముచేసి పరిరక్షించుట ప్రతి భారతీయుని కర్తవ్యమని ప్రజలు సంభావించునట్లు ప్రబోధింతురు. పూజ్యపాదులుజగద్గురు శ్రీశ్రీశ్రీ స్వామి వారి యీ జీవితచరిత్రాధ్యయన మాధ్యాత్మిక ధ్యాన ప్రబోధముల మహత్త్య ప్రయోజనముల కల్గించుగాక! ఇది జగద్గురు శ్రీ ఆచార్య స్వామి వారికి భక్త్యంజలి యగుగాత!-
* * *