మానవుని విధి
ఎందుకంటే మనం ఏదోపని చేస్తున్నప్పుడు మాత్రమే దుఃఖం లేకుండా వుంటాము. దుఃఖాన్నించి తప్పించుకోవటానికి సుఖాన్ని సంపాదించటానికి యీ పనులన్నీ మనం చేస్తూ వుంటాము. ఏపనీ చేయకుండా నిష్క్రియంగా వుండటంకంటే కష్ఠమైంది ఇంకొకటిలేదు. లోపలినుండి మనల్ని యీ పనులు చేయమని ప్రేరేపించేదొకటి వుంది. మనకి ఆకలి అంటూ ఒకటి ఎవరో పెట్టారు. ఇది ''యీవనిచెయ్యి ఆపనిచెయ్యి'' అని ప్రేరేపిస్తుంది. మనం ఏమీచేయకుండా కూర్చుంటే పొట్టబాధిస్తుంది. యీ ఆకలనేరోగాన్ని శాంతింపచేయటానికి మనం ఔషధాన్ని సంపాదించుకోవాలి. అందుచేత పనిచేయాలి. ఏదోరోగమైతే మందువేస్తే కనీసం కొన్ని రోజులవరకు మళ్ళీ తిరగబెట్టకుండావుంటుంది. కాని యీ ఆకలున్నదే మర్నాటికి మళ్లా వచ్చి కూర్చుంటుంది. తక్కిన రోగాలికీ దీనికీ పెద్ద భేదం వుంది. తక్కిన రోగాలు నయమైతే అసలు రాకపోవచ్చు. వచ్చినా చాలా రోజులైన తరువాత రావచ్చు. మరి యీ ఆకలి రోగానికి రోజూ మందువేయాలి. రోజుకు ఒకమాటు కాదు. పూట పూటా వేయాలి. ఈఆకలిమందు కోసం ప్రతివాడూ పని చేయాలి. పెద్దపులి లేడిని చంపినా అవును చంపినా కుణ్ణివారణ కోసమే కదా! మనిషి కూడా క్షుణ్ణివారణ కోసమే బహువేషాలు వేస్తూవుంటాడు. తెలివితేటలు పోతూ వుంటాడు. ఆకలైతే బియ్యం తెస్తాడు వండుకుంటాడు. తింటాడు. బియ్యం సంపాదించాలిగా అందుచేత పనిచేస్తాడు. శరీరం నిల్పుకోవాలంటే పని చేయవలసిందే. కాబట్టి ఒక్క క్షణమైనా పనిచేయకుండా వుండడం అసంభవం.
ఎవడైనా ఏపని చేయకుండావుంటే వాడి శరీరం నిరూపయోగం అవుతుంది. వాడు భాగ్యవంతుడైనంత మాత్రంచేత వూరికినే కూర్చోవచ్చని, కూర్చుంటాడని అర్థంకాదు. భాగ్యవంతుడైనకొలది ఎక్కువ పనులు చేయవలసివుంటుంది. మనంపెట్టిన పెట్టుబడులు ఏమైపోతాయో అనే చింత అహర్నిశం అతగాడిని వేపుకు తింటూవుంటుంది. అందుచేత అతనికి విశ్రాంతే వుండదు. ముష్టిఎత్తుకుని బ్రతికే బ్రాహ్మడికంటే అంతాతీరుబడే. 10 లక్షల ఆస్తిగల ఆసామికి క్షణం తీరుబడి వుండదు. వాడు చేసేపనులకు అంతు అంటూ వుండదు.
కాబట్టి మనిషిచేసే పనులు రకరకాలుగా వుంటవి. శరీర రక్షణకోసం చేసేపనులు ఒకరకం. స్వజనం కోసం చేసేపనులు ఒకరకం. స్వజనంకోసం చేసేపనులు ఒకరకం. దారా పుత్రులు తల్లి తండ్రులు బంధువులు వీళ్లందర్నీ పోషించాలి. వీళ్ళకోసం చేసేపనులు ఉంటాయిగదా. యింకా వాడికొక ఆవు వుండవచ్చు. ఒక కుక్క వుండవచ్చు ఇంకా పెంచుకుంటే ఒక పిల్లి కూడా వుండవచ్చు. మరివాని పొలం చూచే రైతుంటాడు. పాలేర్లు మొదలైనవాళ్లకోసం చేసే కొన్ని పన్లుంటవి. వున్నయింటిని పరిశుభ్రంగా అట్టేపెట్టుకోవడం ఆ ఇంట్లోవుండేవారి బాధ్యత ఎట్లాగో అట్లాగే ఆ వూరి యొక్క వ్యవహారాలు చక్కపెట్టుకోవటం ఆవూళ్లో వుండేవారి బాధ్యత. కుటుంబంలో మహా వుంటే 10 మంది వుంటారు. వూళ్లో అయితే 1000 మందైనా వుంటారుగదా. ఇప్పుడు మన భాగ్యవంతుడున్నాడే ఇతడు భాగ్యవంతుడు కాబట్టి వూరు వ్యవహారాలు చూడవలసిఉంటుంది. ఈలెక్కని కుటుంబంనుండి మొత్తం దేశంవరకు క్షేమం ఆలోచించి చేయవలసిన పనులెన్నివుంటాయో చూడండి.
కాబట్టి అనేక విధములైన పనులున్నవి. వీటిల్లో పళ్ళు తోముకోవడం, బట్టలుదుకుకోవడం, స్నానము భోజనము ఇల్లాంటివి శరీర రక్షణ కోసం. గృహ నిర్మాణం దాన్ని అందంగా వుంచడం మొదలైనవి కుటుంబం కోసం. కాలవలు, చెరువులు త్రవ్వించుట ఆసుపత్రి పెట్టించుట యివి వూరు కోసం. దేశం కోసం చేసే పనులు మనందరికి తెలిసినవే.
మనం చేసే పనుల్లో కేవలం మన పొట్ట నింపుకోటానికి చేసేవేకాకుండా ఇతరుల కోసం చేసే పనులు కూడా కొన్ని వున్నవి. శక్తిగలవారు బలహీనుల్ని అవిటివాళ్లని పోషించి తీరాలి. అది లోకరీతి. బలహీనులు వికలాంగులు వారిని పోషించే సామర్థ్యంగలవారికి అప్పగించబడ్డారు. మనిషి సమర్దుడుగానున్నప్పుడు తనబిడ్డను పెంచుకుంటాడు అతడు వృద్ధుడై శక్తివుడికినప్పుడు కొడుకులు ఆదుకుంటారు. లోకానికి యీ మార్పుదల సహజం. కేవలం మనుష్యుల విషయంలోనేకాదు, పక్షులకి ఇతర జంతువులకు కూడా యీ మాట వర్తిస్తుంది. పశుపక్ష్యాదులు వాటి పిల్లలను పోషించుకుంటాయి. అల్ప ప్రాణులు అనగా పురుగులు, పిల్లులు, కుక్కలు కోతులకు కూడా ఇది వర్తిస్తుంది.
లోకంలో చాలా పనులు జరుగుతూ వుంటవి, మనిషి చాలా పనులు చేస్తూ వుంటాడు. చేసే ప్రతి పనితోనూ అతనికి సంబంధం వుంటుంది. డబ్బు సంపాదిస్తాడు. మనుషులను కూడకడతాడు. కాలవలు త్రవ్విస్తాడు. ఆసుపత్రులు కట్టిస్తాడు. ప్రభుత్వ యంత్రాంగంలోకి చొచ్చుకుపోతాడు, ప్రజల కష్టాలు నివారించటానికి మార్గాలు సాధనాలు వెదుకుతాడు. తన సొంత లాభం కొంత వదులుకొని సమిష్ఠి క్షేమం కోసం పాటుబడతారు. సొంత విషయాలను కూడా చూచుకొంటాడు. తనపొలం పనులు చూచుకొంటాడు. యీ విధంగా జీవనోపాయం కోసం చాలా పనులు చేస్తాడు.
మనిషికి కావలసిన పనులు మూడు వర్గాలుగా వుంటాయి. తినడానికి అన్నం, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి ఇల్లు. ఈ మూడు తక్కినవాటి కంటే చాల ప్రధానమైనవి. వీటికి పైన అతడేమి సంపాదించినా పిల్లల్ని పెంచడానికి, వాళ్ళ పెళ్ళిళ్ళు మొదలయినవి చేయడానికి.
వీటిని సంపాదించటానికి చేసే పనులు అలావుంచి యితర పనులకోసంకూడా అతడు కష్ఠపడాలి. ప్రతిరోజు పొట్టనింపుకోవాలి. ఇల్లు శిధిలమైనపుడు బాగుచేసుకోవాలి. బట్టలు చిరిగినప్పుడు కుట్టుకోవాలి. తాను రక్షించాల్సిన బలహీనుల్ని, వికలాంగుల్ని పోషించటానికి ఏర్పాటుచేయాలి. నిత్య వ్యాధి అయిన క్షుత్తు వున్నది గదా. దీన్ని శాంతింపచేయడానికి వారు అన్నం సంపాదిస్తారు. తాను తింటాడు. ఇతరులకు పెడతాడు. ఆకలిని వ్యాధి అని అన్నాన్ని ఔషధమని చెప్పడంలో చాలా ఔచిత్యమున్నది. యీ శ్లోకం చూడండి.
క్షుద్వ్యా ధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం
క్షిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం
న తుయా చ్చతాం విధివశాత్ప్రాస్తేనసంతుష్యతాం
శీతోష్ణాది విషహ్యతాం నతువృధా వాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్యమభీప్స్యతాం జన కృపానైష్ఠుర్యమచ్చృజ్యతాం (సాధన పంచకం 4)
శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో వుపదేశిస్తారు. ఏమని? ఆకలి రోగానికి మందు పుచ్చుకోమని. రోగ నివారణకు అవసరమై నంత మందు మాత్రమే రోగి వేసుకుంటాడు. మందు రుచిగా వుండాలని చూడడు. తక్కువ ఖర్చుతో దాన్ని సంపాదించాలని చూస్తాడు. అట్లాగే ఆకలి తీర్చడానికి ఎంత తింటే సరిపోతుందో అంతే తినాలి. ఆ తిండి సాత్వికంగా వుండాలి. యిదీ యీశ్లోకంలో నున్న అభిప్రాయం.
తన కోసం యితరులకోసం మనిషి చాలా పనులు చేయవలసి వుంటుందని మనము గమనించాము. ఇంతే కాకుండా మనిషి కొన్ని అసాధారణమైన పనులు చేస్తూ వుంటాడు. ఏమిటంటే ఒక మనిషి క్రాసు గుర్తుపెట్టి చర్చిని నిర్మాణం చేస్తాడు. ఇందులో అతని ఆకలి తీరడమేమున్నది? ఇంకొకడు రుద్రాక్షమాల తలకు చుట్టుకుంటాడు. ఒంటినిండా బూడిద పులుముకుంటాడు. దీనివల్ల మాత్రం ఆకలి తీరుతుందా? లేక వీటివల్ల అతని వేషానికి ఆధిక్యం వస్తుందా. మరొకరు పంగనామాలు పెడతాడు. ఈ పనులేవీ మనమిందాక అనుకున్న అన్నవస్త్రాది సంపాదనలోకి చేరవు. సోదర పోషణానికి కాని పర పోషణానికి కానీ పనికిరావు. ఇవి అసాధారణమైన పనులు. ఒకడు పంచపాత్ర ఉద్ధారిణి తీసుకుని చప్పుడు చేస్తూ కూర్చుంటాడు. శ్రాద్ధం పెడతాడు. బ్రాహ్మల్ని పిల్చి భోజనం పెడతాడు. యీ పనుల వల్ల అతని ఆకలి తీరుతుందా? అతని భూములలో వానలు కురుస్తాయా? కొండలు పగుల కొట్టి రాళ్లు పట్టుకొచ్చి దేవాలయం కడతాడు. అది అతను తల దాచుకోవడానికి పనికివస్తుందా? వాటికి రాత్రిపూట తాళం వేసికూడా అట్టి పెడతారు. వానావంగుడు వస్తే లోపలికి పోవడానికి వీలు లేకుండా. మఱి వీటి వుపయోగం ఏమిటి?
కొంతమంది మతము పేరిట చాలా పనులు చేస్తూ వుంటారు. మతం పేరిట తగాదాలు పడుతుంటారు. తలకాయలు పగుల కొట్టుకుంటారు. మనిషి జీవించడానికి అవసరమైన పనులలో యివి చేరవుగదా.
విభూతి రుద్రాక్షలు ధరించడం, ఆలయనిర్మాణం, శ్రాద్ధము పెట్టుట, బ్రాహ్మణ సంతర్పణం యివి అన్నీ అవసరానికి మించిన పన్లని మనం చెప్పవచ్చుగదా! వీటి వల్ల లాభ##మేమిటి? పైగా ఇవిచాలనట్లు యీ మదరాసునగరంలో భజన సంఘము లెన్ని లేవు? యివి కొన్ని సంవత్సరాల బట్టి పని చేస్తున్నవి గదా. వీటి కింద శ్రమ యెంత వున్నది. వీరు చేసే యీ భజనలకీ, వీరి ఆఫీసు పనికీ ఏమైనా సంబంధమున్నదా చెప్పండి. యీ భజనలు మనకు నిత్యకృత్యంలో వుపయోగించేది లేకపోయినా నిరంతరం నడుస్తూ వుంటున్నవిగదా. యీ పనులన్నీ మనకేమి వుపయోగపడతాయి.
మఱి నిజంగా ఈ పనులన్నీ నిరుపయోగమే ఐతే, అనవసరమే ఐతే వీటిని మనమెందుకు చేయాలి? ఎందుకు చేస్తున్నట్లు? వీటివల్ల వుపయోగం ఏమన్నా వుందా అని కాస్త ఆలోచిద్దాం.
మనిషి డబ్బు ఎందుకు సంపాదిస్తాడు? ప్రతిరోజు ఆకలి తీర్చుకుంటే సరిపోదా? ఏదో యింటికి పోయి అడుక్కుంటే అన్నం దొరకదా? ఏ సత్రానికో పోయి తినవచ్చు గదా! ఎవడు కూడా అక్కడధర్మసత్రం వేస్తున్నారు. మనకు జీతాలెందుకు అనుకోరు. ''అబ్బాయి నీకు కమ్మని భోజనం కావాలా? పది రూపాయలు కావాలా?'' అంటే భోజనమును అడిగే వాడుంటాడా చెప్పండి. ప్రతివాడూ 10 రూపాయలే అడుగుతాడు. ఎందుకని? భోజనం మాత్రంతో సరిపోకనే కదా! మఱి డబ్బెందుకు? భోజనమైతే తినగా మిగిలింది యింకొక పూటవరకే నిలవ వుంటుంది. డబ్బైతే చాలా తడవలు మన అవసరాలు తీర్చుకోవచ్చు. కాబట్టి ఎక్కువ రోజులు తనకుపయోగించే దాన్ని మనిషి ఎన్నుకుంటాడు. బడికివెళ్ళే పిల్లవాడికి మధ్యాహ్నం తింటానికి తల్లివండిన అన్నం ఇచ్చే పంపిస్తుంది. మనమేదైనా దూరప్రదేశానికి ప్రయాణం చేసేటప్పుడు బియ్యం, పప్పు మొదలైన సామాగ్రి పట్టుకుపోతాం.
పూర్వకాలంలో యీ రైళ్లు లేవు. ఈ ప్రయాణ సౌకర్యములు లేవు. వీటివల్ల మనకు కష్ఠాలు మాత్రమే పెరుగుతాయి. రైలు ఛార్జీలు, బస్సు ఛార్జీలు, హోటలు ఛార్జీలు మొదలైనవి ధనవ్యయంతోకూడిన పని. కొత్తచోటికి వెళ్ళినప్పుడు కొత్త వస్తువులు కన్పించకుండామానవు. అవికొంటూ వుంటాము. యీ రోజుల్లో యీ ధన వ్యయంతప్పదు. పూర్వకాలంలో ప్రయాణీకులకు తిండి ఖర్చులేదు. రైళ్లు, బస్సులు ఖర్చులేదు. నడవటంవల్ల కాళ్ళకు బలం పెరిగింది.
చాలాకాలం కిందట యీ విధంగా ఖర్చులేకుండా జీవితం వెళ్ళబుచ్చిన ఒక మనిషి నాకు ఇప్పటికి గుర్తు. పాలఘాటు దగ్గర చిత్తూరు అనే ఒకటి వుంది. ఆ వూళ్లో కృష్ణయ్యరనే ఒకాయన ఒక బాంకు పెట్టాడు. దానివల్ల సంపాదించిన డబ్బులో కొంత పెట్టి ఒక వేద పాఠశాల పెట్టాడు. అందులో 70 మంది విద్యార్ధులు అధ్యయనం చేసేవారు. అక్కడ అధ్యయనం పూర్తి చేసిన వాళ్ళు ఇక్కడకు వచ్చి ఇక్కడ వి. కృష్ణస్వామి అయ్యరు పెట్టిన సంస్కృత కళాశాలలో చదువుకునేవారు. యీ విధంగా పాఠశాలలు పెట్టినవారిలో ముత్తుగణపతిగారు ఒకరు. ఆయన తిరువయ్యారులో వుండేవారు. ఆయన 100, 120 విద్యార్ధులు వేదం చదువుకోటానికి సదుపాయాలు కల్పించాడు. వాళ్ళ తిండి తీర్ధాలు కూడా ఆయనే చూచేవాడు. ఆయన ఏం చేసేవాడంటే ఆయన కింద పనిచేసేవాళ్ళు తప్పుచేసి నప్పుడు వాళ్ళదగ్గర జుల్మానా వసూలు చేసేవాడు. అది అంతా జమ చేసి బ్యాంకులో పెట్టి దానిమీద వచ్చే వడ్డీతో యీ పాఠశాల నడిపేవాడు. ఒక రోజున ఒక పెద్ద ఆఫీసరు ఆ స్కూలును చూడటానికి వచ్చినాడు. ఆ పిల్లలను చూస్తూనే అన్నాడు. ''ఏం దండగపని? ఈ పిల్లలనందరినీ ఎందుకూ పనికి రాకుండా చేస్తున్నారు. 10 సంవత్సరాలు వాళ్ళని గొఱ్రల్లాగా మందలేసి ఇల్లాచితక్కొడితే లాభ##మేమిటి? వీళ్ళకు బ్రతుకుతెరువు ఏమన్నా నేర్పుతున్నారా? వీళ్ళకు ఇంగ్లీషు నేర్పుతేలాభపడతారు'' అని. ఆయన ప్రక్కనే మరొకాయన వున్నాడు. ఆయనన్నాడు గదా. ''వీళ్ళని యింగ్లీషుబడికి పంపించనందువల్ల సగం ఖర్చులు తగ్గినాయి. యింగ్లీషే చెప్పిస్తే ఖరీదైన దుస్తుల కోసం, క్రాపుచేయించుకొనటానికి, బైసికిళ్ళు కొంటానికి ఎంతో ఖర్చు పెట్టవలసివచ్చేది. ఆ ఖర్చంతా ఇప్పుడు తప్పింది. వాళ్ళు ఇంగ్లీషు నేర్చుకొని సంపాదించటం మొదలు పెడితే వాళ్ళ జీతంలో సగం యీ అనవసరపు ఖర్చు క్రిందే పోయేది. ఇప్పుడది తప్పింది. ఆ మిగిలిన సగం జీతం సంపాదించుకోవటానికి మేమిక్కడ మార్గం చూపుతూనే వున్నాం. ఒకవేళ వీళ్ళకు ఈ విద్య అబ్బనే లేదనుకోండి. ఆ సందర్భంలో కూడా వాళ్ళకు లాభ##మే కలుగుతుంది. ఆ ఇంగ్లీషు వంకకి వాళ్ళ చూపు పడనందువల్ల కావలసినంత లాభం కలుగుతుంది కదా.'' ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఆ కాలంలో నిరాడంబరంగా జీవించి గొప్పపనులు చేసిన మహానుభావులు వుండేవారని చెప్పటానికి.
సరే ఆ రోజుల్లో కూడా 50 మైళ్లు పోవాలన్నా కావలసినన్ని బియ్యం వ్యంజనాలు పట్టుకుపోయేవాళ్లు. దూరం పెరిగినకొద్దీ తీసుకువెళ్లవలసిన సంభారాలు కూడా పెరిగేవి. ''ఈ రోజుకు తింటే చాలు, రేపటి మాటకేమిలే'' అని ఎవడూ అనుకోడు. ఈ రోజుల్లో కూడా రేపటికి మనం జాగ్రత్తపడతాం. రేపు మనకి శక్తి వుడిగితే యాతన కాదూ అని. రేపటిని గూర్చి మనకు ఆలోచన లేకపోతే మనకు డబ్బుతో అవసరమేమిటి? ఈ మఠంలో మొదట పనిచేసే వాళ్లందరికి ఆహార రూపంలో దిన బత్తెం యిచ్చేవారు. కానీ వారికి తృప్తి లేక పోయింది. వారు బియ్యమిస్తే బాగుంటుందని అనుకొన్నారు. అప్పుడు వాళ్లు ఆ బియ్యం కావలసినవి వాడుకొని తక్కినవి అమ్ముకోటానికీ వీలు. సరే ఇప్పుడు అలాగే ఇస్తున్నామనుకోండి. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే కొద్ది రోజులకు సరిపోయేది సంపాదించి తృప్తిపడేవాడు తెలివి తక్కువవాడు. తెలివిగలవాడైతే చాలా దినముల సరిపడే పదార్ధం సంపాదించి పెట్టుకుంటాడు అని చెప్పటానికి.
భవిష్యదుపయోగం కోసం మనం నిలవ చేసుకొంటాం. అప్పుడు ఆ భవిష్యత్తు 1 రోజా? 1 నెలా? 1 సంవత్సరమా? మనం ఎంతనిలవ చేయాలి? ఒక వేయి చాలుతుందా. పది వేలు కావాలా అని మనం లెక్క వేస్తాం. ఎంత ఎక్కువ మనం నిలవచేస్తే అంత మనం మంచిగా జీవించటానికిమంచిది గదా. మన మెంతకాలం బ్రతుకుతామో మనకు తెలీదనుకోండి. ఆ చివరిరోజు ఈశ్వరుడునిర్ణయించి పెడతాడు. అయితేనేం. మనం మటుకు నిరంతరం సుఖంగా వుండాలనే కోరుతాం.
మన ఆయుర్దాయంతీరిపోయింతరువాత మనం సంపాదించిన యీ ధనంగాని యీ వస్తుసామాగ్రిగాని మనం సుఖంగా వుండటానికి ఎలా వుపకరిస్తుంది. మన ప్రస్తుత శరీరం వున్నంత వరకే యివి వుపకరిస్తవి. ఇది పోతే వీటి వుపయోగం మనకు వుపకరించే పనులు మనం చేయవలె. బ్రతికినా చచ్చినా మనకు ఎల్లప్పుడూసుఖం సంపాదించి పెట్టే పనులు మనం చేయవలె. అయితే యిప్పుడు యీ డబ్బు సంపాదించటం, వస్తుసేకరణం మానివేయండి అని నా తాత్పర్యం కాదు. వీటికి తోడు నిరంతరం మనలను దుఃఖానికి దూరంగా వుంచే పనులు మనం చేయవలె. మనకు మరణమంటూ లేదు. పోయేది శరీరం మటుకే. కాబట్టి యిప్పుడు కూడా మనం నిత్య సుఖంకోసమే పాటుపడాలి. చచ్చిన తరువాత శాంతి సంపాదించటానికి మార్గమంటూ లేదు. భవిష్యత్తుకోసం మనం భీమా చేసినట్లు నిత్య శాంతి కోసం మనం పాటుపడాలి.
మనం కొండ ఎక్కటానికి మొదలు పెట్టాం. మన దగ్గర 1000 రూపాయలు వున్నాయి. కరెన్నీ నోట్లు కాదు. రూపాయి నాణములు కాదు. అన్నీ పైస నాణములు. దొంగలబెడద. యీ కొండ దాటామంటే భయంలేదు. ఇటువంటి సందర్భంలో ఎవరో ఒక మనిషివచ్చి 1000 రూ. నోటుకు చిల్లర యివ్వమన్నాడనుకోండి. మనమేమి చేస్తాం. వెంటనే ఆ మూట వానికిచ్చి ఆ నోటు తీసుకుని తేలిగ్గా కొండ దాటి అమ్మయ్యా అనుకుంటాం. కావలసిందల్లా ఏమిటంటే కొండ దాటిం తరువాత ఆ ప్రాంతంలో ఆ నోటు చెలామణిలో ఉండాలి. మన కథ యిట్టాంటిది. మనకిప్పుడున్న శక్తి సామర్ద్యాలు తరువాత కాలంలో వుపయోగించేటట్లు వినియోగించగల్గితే మనకు కష్టాలంటూ వుండవు.
ఎవరైనా అడగవచ్చు. ''చచ్చిన తరువాత మనముంటామని నమ్మకమేముంది? బ్రదికుండగానే సుఖపడాలి'' అని. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఒక వేళ వుంటే మనం కష్టపడవలసిందేనా అని.
''నాస్తిచేన్నాస్తినో హానిః అస్తి చేన్నాస్తికో హతః''
యీ శ్లోక పాదంలో చెప్పిందేమిటంటే, మనం చచ్చిన తరువాత కూడా వుంటాము నాయనా, అందుచేత మనం సత్కార్యాలు చేయాలి సుమా అని. చచ్చిన తరువాత మనముంటామన్న గ్యారంటీ ఏమిటి అంటాడు నాస్తికుడు. యిప్పుడు మనం మంచి పనులు చేస్తే మనం చచ్చిన తరువాత వుంటే వాటివల్ల సుఖపడతాము. లేదూ. వుండమనుకో, దానివల్ల నష్టమేమిటి? ఎట్లాగైనా వున్నా లేకపోయినా ఆస్తికుడికి కష్టాలు లేవు. చచ్చినతరువాత వున్నాయే అనుకో, అప్పుడు నాస్తికుడికి ఎంత కష్టమో ఆలోచించండి. అందుచేత మంచి పనులు చేయడం ఎప్పుడూ మంచిదే. మనం ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు ఆ పోయినచోట మనకు సుఖంగా వుంటుందనే భావన మనకు వుండాలి. యీ శరీరం వదిలి పెట్టినతరువాత మనని సుఖంగా వుంచే పనులు మనం చేయకపోతే అప్పుడు మనం కష్టపడవలసినదే గదా! పరంలో యీ దుఃఖం మనకు తప్పించే పనులు ఇక్కడ మనం వివేకం వల్ల తెలుసుకోవాలి. అల్లాంటి పనులు ప్రస్తుతంలో మనకి ఏ ఫలితాన్ని కలిగించకపోయినా తరువాత కలిగించి తీరుతాయి. న్యూటను చెప్పిన సిద్ధాంతం జీవుడికి సంబంధించినంతవరకు మనవాళ్లుఎప్పుడో చెప్పారు. ప్రతి పనికి ఫలితం ఒకటి తప్పకుండా వుంటుందని మన శాస్త్రాల్లో వుంది.
క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. కానీ వాళ్ళకు తెలియకుండానే వాళ్లు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నట్లు వారు చెప్పే కొన్ని విషయాలు నిర్ధారణ చేస్తాయి. వాళ్లంటారుగదా ప్రస్తుత శరీరాన్ని వదిలి పెట్టిన తరువాత జీవుడు తీర్పు దినం వరకు వేచి వుండి ఆ తీర్పు ప్రకారం అతడు చేసిన కర్మానుసారం స్వర్గానికో నరకానికో పోతాడు. సుఖదుఃఖానుభవములకు ఆధారమైన యీ భౌతిక శరీరం శవపేటికలో చచ్చి పడి వున్నప్పటికీ ఆ జీవుడు మాత్రం ఇంకో శరీరం ధరించి స్వర్గంలోనో నరకంలోనో సుఖదుఃఖాలు అనుభవిస్తాడు అని. దీన్నే మనం పునర్జన్మ అంటాము. మరొక శరీరంతో సుఖదుఃఖాలు అనుభవించటానికి కారణమైన పనులు చేయటానికి ప్రస్తుత శరీరం ఆధారమని ఒప్పుకుంటున్నావుగాదా! అట్లాగే ప్రస్తుతానికీ దాంతో అనుభవించే సుఖదుంఖాలకీ కారణభూతంగా పూర్వజన్మ వుండి తీరాలి గదా!
కాబట్టి ప్రస్తుత జన్మ అంతమైన తరువాత కూడా మనకు వుపకరించే పనులు మనం చేయవలసివున్నది. పూర్వం నేను చెప్పిన అధిక కార్యములు యిల్లాంటివే. అంటే మనం నిరంతరం సుఖంగా వుండటానికి వుపకరించేవే. విభూతి రుద్రాక్షధారణం, శ్రాద్ధము పెట్టడం మొదలైనవి. ఇవియెంత ఎక్కువగా చేస్తే అంతమంచిది. మన సుఖానికి అవి అంతవుపకరిస్తాయి. యీ జన్మలో భౌతిక సుఖాలు పెంచుకోవడంకోసం మనంచేసే కార్యములకు తోడు కోట్లకొలది సంవత్సరాలు యింకా శాశ్వతంగా కూడాను మనకు భద్రతచేకూర్చే కార్యములు మనం చేయాలి. మన నోట్లు రష్యాలో చెలామణి కావు. అన్ని దేశాలకి ఒకడే రాజైతే వాడి ముద్రవున్న కాగితాలు సర్వత్రా చెలామణి అవుతవి గదా. యీ పధ్నాలుగు లోకాలికి ఒకడే సార్వభౌముడున్నాడు. ఆయనయే యీశ్వరుడు. ఆయన రాజ్యంలో ఒకే కరెన్సీ చెలామణిలో వుంటుంది. అది సర్వకాలములలోను సర్వత్రా చెలామణి అవుతుంది. ఏమిటయ్యా ఆ కరెన్సీ అంటే అదే ధర్మం.
శ్రీరాముడు అడవికి వేళ్లేముందు అనుజ్ఞకోసం కౌసల్య దగ్గరకు వెళ్ళాడు. వూరికిపోయే పిల్లవాడికి త్రోవలో తింటానికి తల్లి ఏవైనా తినుబండారాలివ్వడం ఆచారంగదా. పధ్నాల్గేండ్లు తనకు దూరంగా పోయే కొడుకుకి ఏమివ్వాలి. పాపం కౌసల్యకి ఏమి ఇవ్వాలో తెలియలేదు. కాస్సేపు లోతుగా ఆలోచించి ఆమె అన్నది.
యం పాలయసి ధర్మం త్వం
ధృత్యాచ నియమేనచ
సవై రాఘవ శార్ధూల
ధర్మస్త్వామభిరక్షతు
(అయోధ్య 15-3)
రాఘవా! నీ రక్షణకోసం నేను చేయగల్గింది ఏమీ లేదు. ధర్మం ఒక్కటే నిన్ను రక్షించేది. ఏ ధర్మమైతే ధైర్యంగా నియమముగా నీవు నిత్యమూ పాలిస్తూ వచ్చావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నేను నీకిచ్చే ఆశీర్వాదమదే అన్నది. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మన్ని కాపాడుతుంది. ఏమిటి ధర్మం. ఈశ్వరుని ఈ విశ్వసామ్రాజ్యంలో చెల్లుబడి ఔతూవున్న ధర్మం. మఱిన్నీ పిల్లలకోసం, తల్లిదండ్రులకోసం, గ్రామం, రాష్ట్రం, వీటి క్షేమం కోసం మనం చేసే పనులకు తోడు మన జీవుడికి శాశ్వతమైన సుఖం కల్గించే పనులు కూడా మనం చేయాలిగదా! ఆ పనులు ఏమిటో కూడా కొంచెం ఆలోచిద్దాం.
మనము ఏ పని చేసినా దాన్ని యీశ్వరార్పితంగా చేయడం ప్రధానమైనది. ఈశ్వరుడు జ్ఞానమంతటికి అవధి. మనం చేసే పనులు యీశ్వరార్పణం చేస్తే అవి మనకు శాశ్వత సుఖాన్ని ప్రసాదిస్తాయి. ఆ పనులు కొత్తవి కాకుండా మన తాతతండ్రుల నాటినుండి వంశపారంపర్యంగా చేస్తూ వస్తున్న వైతే వాటిని చేయడం మనకు చాలా తేలిక. మనం చేసిన పని చెడ్డదైనా అది మన పొట్టనింపుకోవటానికి కాకుండా యీశ్వరార్పణంగా చేస్తే అది ధర్మం క్రిందకే వస్తుంది.
మనం ఏ ధర్మాన్ని అనుసరించాలి? మన పూర్వీకుల్లో పెద్ద వాళ్ళంతా తరతరాలు చాలాకాలం నుండి అనుసరిస్తూ వచ్చిన ధర్మంలో మనం నాని ఉన్నాము. వారందరు ఈ ధర్మాచరణంవల్ల శాశ్వత సుఖాన్ని సంపాదించినట్లు మన అనుభవాన్నిబట్టి మనం చెప్పగలం. ఆ ధర్మాన్నే మనం అనుసరిస్తే సరిపోతుంది. క్రొత్తదానికోసం మనం ప్రయత్నం చేసినా అది వ్యర్థమే అవుతుంది. పైగా ధర్మం మంచిది అవునో కాదో ఎట్లా తెలుస్తుంది. కాబట్టి ఏ ధర్మం మనకు నియమింపబడివున్నదో, ఏ ధర్మాన్ని వాళ్ళ జీవితాల్లో మన పెద్దవాళ్ళు పరిపాలించారో ఆ ధర్మమే మనకికూడా మంచిది.
మన పొట్ట నింపుకోవటానికి మాత్రమే కాకుండా అందుకు పనికిరాని అధిక కార్యములు మనం చేయవలసి వుంటుందని మనకు స్పష్టమైంది. ఇవి మన పెద్దలనుండి మనకు తరతరాల పారంపర్యంగా సంక్రమించినదై వుండాలి. అది ఈశ్వరార్పణంగా ధైర్యంగా, నియమంగా మనం చేయాలి. అదీ ధర్మమంటే, అది మనకు శాశ్వత సుఖాన్ని ప్రసాదిస్తుంది.
మనో వాక్కాయములు త్రికరణములంటారు. ఈ త్రికరణములతో కూడా మనం ధర్మాన్ని చేయాలి. మన శక్తిసామర్థ్యాలని వ్యర్థంచేయకుండా ఇట్టి ధర్మాన్ని మనం సంపాదించాలి. ఇది ఈశ్వరుని రాజ్యంలో చెలామణి అయ్యేది. అందుకని దీన్నభివృద్ధి చేసుకోవటంలో మన శక్తిని వినియోగించాలి. దీనికి సర్వకాల సర్వావస్థల్లోను, సర్వత్రా చెల్లుబడి వుంటుంది మఱి.
కౌసల్య రామునికి కట్టిన రక్షరేకు అదే. రాముడు ఎన్ని గడ్డు పరిస్థితులు సంభవించినా యీ ధర్మబలం వల్లనే వాటిని అతిక్రమించగలిగాడు.
మనిషి ఎప్పుడూ ఆత్మోద్ధారకములైన పనులనే చేయాలి. జంగమ జంతువులలో మనిషి తప్ప తక్కినవన్నీ అడ్డంగా నడిచేవి. అందుచేతనే వాటిని తిర్యక్కులన్నారు. మనిషి ఒక్కడే నిలువుగా పెరిగేది. వాడి రూపాన్నిబట్టి తక్కిన జంగమజంతువులకంటే వాని ఆధిక్యం నిరూపితమౌతుంది. వాడు కనక ధర్మాన్ని పాలించేవాడైతే తక్కిన జంతువులన్నీ వాడికి సహాయం చేస్తాయి. వాడు అధర్మాన్ని అవలంభిస్తే సోదరులు గూడా విడిచి పెడతారు. రామకథలో మనకు యిదే కనపడుతుంది. యీ శ్లోకం చూడండి. మురారిఅన్న కవి. అనర్ఘ రాఘవంలో యిలా అంటాడు.
యాంతి న్యాయ ప్రవృత్తస్య
తిర్యం చోపి సహాయ తాం
అపంథానంతు గచ్ఛంతం
సోదరో೭పి వి ముంచ్యతి.
రాముడు ధర్మ మార్గాన్ని అనుసరించాడు కాబట్టి అతనికి కోతులు గూడా సహాయపడ్డాయి. రావణుడో, అధర్మ మార్గాన్నడిచాడు కాబట్టి విభీషణుడు అతని చివరి తమ్ముడు తెగతెంపులు చేసుకొనిపోయినాడు. రావణుడుతన రాజ్యంలో తనసైన్యాల్ని చుట్టూరా పెట్టుకున్నప్పటికీ అతనికి భద్రత లేకపోయింది. ధర్మాత్ముడైన వాడికి సర్వత్రా భద్రత ఉంటుంది.
కాబట్టి ధర్మం ఒక్కటే మనిషిని రక్షించేది. మన కోరికలు తీర్చుకోవటానికి, మన కోపం తీర్చుకోవటానికి, మన పొట్ట నింపుకోవటానికి, మన కుటుంబ పోషణకోసం, గ్రామ రాష్ట్ర దేశ సౌభాగ్యం కోసం మనం చేసే పనులకు మించి, అధికంగా మన తాతముత్తాతలనాటి నుండి పారంపర్యంగా మనకు సంక్రమిస్తూవచ్చిన కార్యములు ధర్మమనే మాటతో చెప్పబడతవి. యీ ధర్మాన్ని మనం ధైర్యంతో, ఓపికతో, నియమంగా చెయ్యాలి. ధర్మం మనకు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదిస్తుంది.
____________________________________________
శ్లో. యస్య లక్ష్య మశేషలోక సుఖం చ శోకనివారణం
య స్సదా కరణత్రయేణ పరోపకార పరాయణః|
యో೭నిశం నిఖిలాత్మభావనయా గతత్వమహంభిదః
చంద్రశేఖర సంయమీంద్ర సరస్వతీ గురుమాశ్రయే.
శ్లో. యస్య దృష్టిగతా భవంత్యపి నాస్తికాః పరమాస్తికాః
యస్య దృక్పతితా భవం త్యపి రాగిణశ్చ విరాగిణః
యస్య దృగ్విషయా భవం త్యపి పామరాస్సుధియాంపరాః
చంద్రశేఖర సంయమీంద్ర సరస్వతీ గురు మాశ్రయే.
- వేమూరి సీతారామ శాస్త్రీ.