ఆత్మదర్శన సాధన విచారము
అనేకజన్మలలో సుకృత పరిపాకవిశేషముచే మనుష్యజన్మమునందిన ప్రతిజీవియు అవశ్యము ఆత్మదర్శనము చేయవలసియున్నదని ''ఆత్మావా అరేద్రష్టవ్యః'' అనుశృతి బోధించుచున్నది. ఆత్మ దర్శనములేకుండ జనన మరణ ప్రవాహరూపమగు సంసారముయొక్క నివృత్తిరూపమగు మోక్షము చేకూరదుగదా! మోక్షము పరమపురుషార్ధము. ఆత్మ దర్శనమునకు సాధనములుగ ''శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసి తవ్యః'' అని ఉపనిషత్తు శ్రవణ మనన నిది ధ్యాసములను బోధించుచున్నది. 1. నిత్యానిత్య వస్తువివేకము 2. ఇహాముత్రఫలభోగవిరాగము 3. శమదమాది సాధనసంపద 4. ముముక్షుత్వము అను సాధన చతుష్టయముకూడ ఆత్మజ్ఞానమునకు అంతరంగ సాధనములే. శంకరాచార్యకృత వివే చూడామణియందు
''సాధనాన్యత్ర చత్వారి కధితాని మనీషభిః
యేషు సత్స్వేవ సన్నిష్ఠా, యదభావేనసిద్ధ్యతి'' అని ఏతత్సాధన చతుష్టయావశ్యకత అన్యయ వ్యతిరేకములతో నిరూపింపబడినది. ''అధాతో బ్రహ్మజిజ్ఞాసా'' అను వ్యాసరచిత బ్రహ్మసూత్ర శంకర భాష్యమునందు అధశబ్దార్ధవిచారణచేయుచు దేనియనంతరము బ్రహ్మజిజ్ఞాస ఉపదేశింపబడుచున్నదని శంకించి, నిత్యానిత్యవస్తు వివేకాది సాధనచతుష్టయసంపద యున్నప్పుడే ధర్మజిజ్ఞాసకు పూర్వమందున్న పరమందునుగూడ బ్రహ్మ విచారించుటకు, తెలిసికొనుటకును వీలగునుగాని సాధనసంపదలేనిచో నవకాశములేదు. కావున అధశబ్దముచే పూర్వోక్త సాధన చతుష్టయ సంపత్త్యానంతర్యమే చెప్పబడుచున్నదనికూడ చెప్పబడియున్నది. అయినను నిత్యానిత్యవస్తువివేకాది సాధనచతుష్టయము, శ్రవణమనన నిధిధ్యాసరూప సాధనత్రయమున్ను ఆత్మ జ్ఞానమునుగూర్చి అంతరంగ సాధనములైనను, శ్రవణాది సాధనత్రయము ఆత్మదర్శనము గురించి సాక్షాత్సాధనములగుటచే నీ త్రితయమే ''శ్రోతవ్యో మంతవ్యో విదిధ్యాసితవ్యః'' అని శ్రుతిచే ఆత్మదర్శన సాధనములుగ బోధింపబడుచున్నవి.
ఈ విషయమై కొంచెము మతభేదము కలదు. ఇట్లనగా-వ్యవహిత కామినీసాక్షాత్కారము నందువలెనే ఆత్మసాక్షాత్కారమునందుకూడ ధ్యానమే సాధనమని కొందరు, ''మనసైవానుద్రష్టవ్యః'' అను శ్రుతినిబట్టి మనస్సే సాధనమని మరికొందరు, బ్రహ్మ ఉపనిషద్వాక్యసమధిగమ్యుడగుటవలన, అదియు శ్రవణసాధ్యమగుటవలన, శ్రవణమనునది శబ్దరూప ప్రమాణమగుటవలన శ్రవణమే ముఖ్యసాధనమని శాంకరమతము. శ్రమణాదులచే సంస్కృతమైన మనస్సు కారణమని వృత్తికారుని అభిప్రాయము. ధ్యానమనునది ప్రమాణములలో చేరదు. మనస్సు సర్వసాధారణమగుటచే కరణము కాదు. ''సాధనతమంకరణం'' అని పాణిని స్మృతిలో క్రియాసిద్ధియందు ప్రకృష్టోపకారమగుదానిని కరణమని చెప్పినారు గదా!
ఎన్ని కారణములున్నను కార్యసిద్ధికి ప్రతిబంధన రాహిత్యము ముఖ్యమని చెప్పవలెను. ఆత్మ సాక్షాత్కారరూప కార్యసిద్ధికి 1. ప్రమాణాసంభావన 2. ప్రమేయాసంభావన 3. విపరీతభావన అను మూడు ప్రతిబంధకములు కలవు. శ్రవణ మనన విదిధ్యాసనములు పై ప్రతిబంధకనివారకములగుట జేసి ఆ మూడున్ను ఆత్మదర్శనమునందు అనగా ఆత్మసాక్షాత్కారమునందు సాధనములుగ ''శ్రోతవ్యోమంతవ్యో నిదిథ్యాసితవ్వః అను శ్రుతిచే చెప్పబడుచున్నవి. అందుకూడ యధావిధిగా జేసిన శ్రవణమే శ్రవణపదముచే చెప్పబడుచున్నది. అట్టి శ్రవణము చేయుటకు వెనుకచెప్పబడిననిత్యానత్యవస్తువివేకాది రూప సాధనచతుష్టయసంపన్నుడే అధికారి. అట్లు సాధనచతుష్టయసంపదగల అధికారి ''తద్విజ్ఞానార్ధం సగురుమెవాభిగచ్చేత్, సమిత్పాణి శ్శ్రోత్రియా బ్రహ్మనిష్ఠం'' అని ముండకోవనిషత్తులో చెప్పిన విధముగ-గురుమేవఆచార్యం శమదమదయాదినా సంపన్నం అధిగచ్ఛేత్- అనగా అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహ దయాదిగుణసంపన్నుడగు ఆచార్యునే సేవించవలయునుగాని శాస్త్రజ్ఞుడైనను స్వతంత్రించి బ్రహ్మజ్ఞానాన్వేషణము చేయరాదు అని ''గురుమేవ'' అని అవధారణవలన లభ్యమగుచున్నదని శాంకరభాష్యమునందు చెప్పబడినది. ''ఆచార్యవాన్ పురుషోవేద'' అనుశ్రుతివలన ఆచార్యుడు లేనిదే వాక్యార్థజ్ఞానము సంభవించదు అని ఆనందగిరిటీకయందు గలదు. పరిపక్వమైన బుద్ధిగలవానికి శ్రుతివాక్కు సకృత్ శ్రవణమాత్రముననే ఆత్మజ్ఞానమును కలిగించును అని విద్యారణ్యకృత శంకంవిజయమునందు'' పరిపక్వమతే సకృచ్ఛృతం జనయే దాత్మధియం శ్రుతేర్వచః'' అని చెప్పబడినది.
జ్ఞానవాశిష్ఠమునందు- నిర్వాణప్రకరణమునందు ''గురూపదేవ శాస్త్రార్ధయిర్వినా నాత్మావబోధ్యతే| ఏతత్సంయోగసత్తైవ స్వాత్మజ్ఞాన ప్రకాశినీ'' అని సద్గురువునుండియే శ్రవణము చేయవలయునని బాగుగ వివరింపబడినది. మరియు- ''తంత్వౌప నిషదంప్పచ్ఛామి'' అనుశ్రుతినిబట్టి శ్రోతవ్యమగు బ్రహ్మ వేదాన్తైక వేద్యుడగుటచే వేదాంతవాక్యముల చేతనే శ్రవణము చేయవలసియున్నది.
''తత్త్వమస్యాది వాక్యోత్థం జీవాత్మ పరమాత్మనోః|
తాదాత్మ్య విషయంజ్ఞానం తదిదంముక్తిసాధనమ్''
అని వాక్యవృత్తి యందు - తత్త్వమస్యాది వేదాంతవాక్యవిచారజన్యమగు జీవాత్మపరమాత్మల అభేదజ్ఞానమే ముక్తిసాధనమని చెప్పబడినది. ఆధ్యాత్మ రామాయణమునందుకూడ ''గురోస్సకాశాదపి వేదవాక్యతః| సంజాతవిద్వానుభవో నిరీక్ష్యతం స్వాత్మానమాత్మస్థ ముపాధివర్జితం త్యజే దశేషం జడమాత్మగోచరమ్||'' అని పూర్వోక్తవిషయమే చక్కగ వివరింపబడినది.
ఆ శ్రవణమనునది అనేకపర్యాయములు చేయవలెను. ఛాందోగ్యోపనిషత్తునందు ఆరుణిపుత్రుడు తనపుత్రుడగు శ్వేతకేతువునకు ''తత్త్వమసి'' అను వాక్యమును తొమ్మిదిపర్యాయములుపదేశించినట్లు చెప్పబడియున్నది.
వేదాన్త శ్రవణవిధి, అపూర్వవిధికాదు. నియమ విధియుగాదు. పరిసంఖ్యావిధియుగాదు. ఇంకేమనగా-కర్మకాండవిచారమువలె బ్రహ్మకాండ విచారముకూడ ''షడంగో వేదో೭ధ్యేతవ్యః'' అను అధ్యయనవిధి మూలకమని వాచస్పతి మిశ్రులు.
దృష్టషలకమైనను శ్రవణమునకు అదృష్టోత్పాదన సామర్థ్యముకూడ గలదు.
''దినేదినేచ వేదాన్త శ్రవణాద్భక్తిసంయుతాత్
గురు శుశ్రూషయాలబ్ధాత్ కృచ్ఛ్రాశీతి ఫలంలభేత్
అని వేదాన్త శ్రవణమువలన నెనుబది కృచ్ఛవ్రతములఫలము లభించునని అదృష్టఫలమును కూడ అభియుక్తులు చెప్పుచున్నారు. అగ్నిసంస్కారార్ధమగు ఆధానమునకు పురుషసంస్కారములలో పరిగణితమగుటచే పురుషసంస్కారార్థత్వము కూడ చెప్పబడినవిధముగా వచనబలమును బట్టి ఉభయార్ధత్వము ఉపపన్నమగును. కావున ప్రతిదినముచేయు శ్రవణమువలన కలిగిన అదృషమహిమ చేతనే శ్రవణమననాదులు ఆముష్మిక విద్యోపయోగులు కాగలవని తోచుచున్నది.
మననము
సద్గురుసన్నధిలో వేదాన్తవాక్యములతో విన్న దానిని యుక్తులచే విచారించుట మననమనబడును యుక్తులనగా శుష్క తర్కరూపములగునవి పనికిరావు. శ్రుతిసమ్మతములు, శ్రుత్సనుగృహీతములునగు యుక్తులనే గ్రహింపవలయును. కనుకనే శ్రీ శంకరభగవత్పాదులు ఉపదేశ పంచకశ్లోకములలో దుస్తర్కాత్సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోను సంధీయతాం'' అని పైభావమును ప్రకటించిరి.
అపరోక్షాత్మజ్ఞాన ప్రతిబంధకమగు అసంభావనా జ్ఞాననివృత్తికొరకై మనన మవశ్యకర్తవ్యము, మహావాక్యార్ధముగా వినిన అఖండైకరసము అద్వితీయమునగు బ్రహ్మపదార్ధము అలౌకికము (లోక వ్యవహారగోచరము కాకపోయినది) అగుటచే ట్టి వస్తువు అసంభావితము అనికలిగిన అసంభావితా జ్ఞానము మననముచే తొలగిపోవును.
బృహదారణ్యకోపనిషత్తునందు - ''ఆత్మావా೭రేద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యః'' మైత్రేయి! ఆత్మనో అరే దర్శనేన శ్రవణన మల్యా, విజ్ఞానేన ఇదగ్‌ం సర్వవిదితం'' అను స్థలమునందు శంకరభగవత్పాదులు- శ్రోతవ్యః పూర్వమాచార్య తః, ఆగమతస్య, పశ్చాన్మంతవ్య, తర్కతః, తతోనిదిధ్యాసితవ్యః, ఏవంహ్యసౌ దృష్టోభవతి శ్రవణమననిదిధ్యాసన సాధనైర్నిర్వర్తితైః, యదా ఏకత్వమేతాని ఉపగతాని,'' తథా సమ్యగ్దర్శనం బ్రహ్మైకత్వ విషయం ప్రసీదతి; నాన్యధా శ్రవణ'' అనిచెప్పిరి. ముందు ఆచార్యునివలన శాస్త్రవాక్యములతో వినవలెను. తరువాత యుక్తులతో మననముచేయవలెను. తరువాత నిదిధ్యాస చేయవలెను. చక్కగ నెరవేర్చిన శ్రవణమనన నిదిధ్యాసలచే ఆత్మదర్శనమగును. శ్రవణమనన నిదిధ్యాసలు ఏకత్వమునుపొందినపుడు బ్రహ్మైకత్వ విషయమగు సమ్యగ్దర్శనమేర్పడును. ఇది శ్రవణమాత్రముచేత నేర్పడదు అని శంకరులు. ఆనందగిరిటీకలో నీ విషయమింకను బాగుగ వివరింపబడినది. శ్రవణమువలె మననముకూడ ననేకపర్యాయములు చేయవలెను.
నిదిధ్యాస
ధ్యాతుమిచ్ఛా = దిధ్యాసాధ్యానముచేయనిచ్ఛ నితరాం దిధ్యాసాం మిక్కిలిధ్యానేచ్ఛ అని తేలుచున్నది. కాని నిదిధ్యాస కర్తవ్యముగ చెప్పబడి యుండుటచే-ఇచ్ఛ యెప్పుడును కర్తవ్యమైనది కానిదగుటచే అజహల్లక్షణచే నిదిధ్యాన శబ్దార్ధము ధ్యానేచ్ఛలో విషయభూతమగు ధ్యానమనియే నిశ్చయింపవలసియున్నది. ''అధ్యా೭తో బ్రహ్మ జిజ్ఞాసా'' అనుసూత్రమునందు జిజ్ఞాసాపదార్ధము జ్ఞానేచ్ఛ అనికాకుండ తత్కార్యమగు విచారపరముగ నిర్ణయింపబడినవిధముగ నిచటకూడ నిదిధ్యాన అనగా ధ్యానమని చెప్పవలెను.
శ్రవణ మననములు చేసినవానికి అపరోక్షాత్మ జ్ఞాన ప్రతిబంధకాభావావరణరూప విపరీతభావన తొలగుటకై నిదిధ్యాస ఆవశ్యకర్తవ్యము.
కఠోపనిషత్తునందు -
''ఏషు సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశ##తే|
దృశ్యతే త్వగ్య్రయాబుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః||
అనుమంత్రమునకు శంకరులువ్యాఖ్యానించుచు అసంస్కృత బుద్ధిగలవానికి అవిద్యాచ్ఛన్నుడగు ఆత్మ గోచరింపడు. సంస్కృతమై ఏకాగ్రతమైనదియు సూక్ష్మవస్తు నిరూపణపరమైనదియునగు దృష్టిచే సూక్ష్మదర్శనవస్తుశీలురగు పండితులకు గోచరించును. అని వివరించిరి.
నిదిధ్యాసనము కూడ అనేపర్యాయములు చేయదగినది. ''వ్రీహీనవహన్తి'' అని బోధించిన అవఘాతాదులు తండుల రూపకార్యనివృత్తి పర్యంతమెట్లు అనేకపర్యాయములు చేయదగినవో; అట్లే ఆత్మదర్శన రూపఫలములగు శ్రవణ మనన నిదిధ్యాసములు ఆసకృత్తుగా (అనేకపర్యాయములుగా) చేయబడినవై దృష్టార్థములగును.
పై విచారణవలన తేలినదేమనగా-నిత్యానిత్యస్తువివేకాది సాధనచతుష్టయసంపన్నుడు బ్రహ్మవిచారమునందు అధికారియగును. అట్టి అధికారి గురూపదేశ పూర్వక వేదాన్తవాక్య విచారరూప శ్రవణమును, శ్రుతిమతములగు యుక్తులచే ననుచింతనరూప మననమును, ధ్యానరూప నిదిధ్యాసమును పదేపదే చేయుచున్న యెడల ఆత్మసాక్షాత్కార సమర్థుడగును. అట్టి ఆత్మసాక్షాత్కారము వలన అనగా శుద్ధ బుద్ధ ముక్తస్వభావ బ్రహ్మైకత్వ విజ్ఞానమువలన జననమరణ సంసారనాశము, బ్రహ్మరూపముతోనుండుట రూపమగు మోక్షము సిద్దించును.