Nadayadu Daivamu  Chapters  

 

ప్రస్తావన

చల్లాశేషాచలశర్మ

శ్రీవారికిది ఎనుబది ఎనిమిదవ జయంతి. గడచిన జయంతి సందర్భమున మేము నిర్వహించిన ఉత్సవ కార్యక్రమములందు పౌరులు చూపిన ఉత్సాహాతిశయమును పురస్కరించుకొని ఈ సంవత్సరము కూడా శ్రీవారి జయంత్యుత్సవములు విశేషముగా జరుపుటకు నిర్ణయించు కొంటిమి. ఈ యుత్సవములు నిర్వహించుటకు, శ్రీ మాగంటి సూర్యనారాయణగారు, శ్రీ పురాణం రామకృష్ణ శాస్త్రిగారు మొదలగు పెద్దలతో ఒక నిర్వాహక సంఘము నేర్పాటు చేసితిమి. ఈ సంఘము వారు ఈ యుత్సవము మూడు రోజులపాటు నిర్వహించుటకు నిశ్చయించిరి. గత సంవత్సర మొకదినముననే ఈ కార్యకలాప మంతయూ నడిచినది. గత జయంతి సంచిక ఎనుబది పుటలు-ఈ జయంతి సంచిక నూరుకు పైన పుటలతో సర్వాంగ సుందరమైనట్టిది. ఇది ఈ సంవత్సరము ఈ యుత్సవము లందుమేము సాధించినయభివృద్ధి-ఇదియంతయూ శ్రీవార యనుగ్రహ విశేషమే తప్ప మరియొకటి కాదు. ఈ యుపాధితో నడయాడు మహాదేవునిపరిపూర్ణ యనుగ్రహము మమ్ము నడిపించు చున్నదనుటకు ఇది యొక నిదర్శనము.

ప్రస్తుత కాలమునప్రపంచము నావరించియున్న ఇంత అశాంతిలో శ్రీ చరణుల శ్రీచరణములే శాంతి నిలయములుగ సాధక కోటికి నుపాదేయములై కన్పించు చున్నవి. చుట్టును చీకటి-ఎక్కడ చూచినను అలజడులు-ఆక్రోశములు-యుద్ధమేఘములు నిరంతరము పెరుగుచున్న ధరలు-జీవితమే దుర్భరమైన పరిస్థితి-బయట చూచినచో నింతే-ఇంతయీ అవ్యవస్థిత సమాకుల పరిస్థితులకు శ్రీవారి ఆ చరణ పద్మములే మనకు నోదార్పు కల్గించు నట్టివి. శ్రీవారు భూమిపై నడయాడు చున్నది మన కట్టి యోదార్పు ప్రసాదించుటకే కదా! అట్టి చరణ పద్మముల కెత్తిన నీరాజనమే ఈ జయంతి సంచిక. శ్రీవారు నడయాడు చున్న దైవము కావున ఆ పేరే దీని కుంచితిమి.

ఈ సంచిక యందు ముఖ్యముగా శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వాముల ఆదేశాను సారము T.M.P. మహాదేవన్‌ M.A.P.H.D. గారిచే వ్రాయబడి, తిరుచినాపల్లి భక్తజన సంఘముచే ముద్రింపబడిన 'The sage of Kanchi' యను శ్రీవారి దివ్యచరిత్రము, శ్రీవారి ముఖతః లభ్యమైన మూడు దివ్య సందేశములును, శ్రీ యడవల్లి ఆదినారాయణ గారు, శ్రీ ధూళిపాళ శ్రీరామమూర్తి గారలచే నాంధ్రీకరింపబడి ప్రకటింపబడినవి - మరియు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రులవారు మొదలుగాగల మహా పురుషుల పద్యోపహారములు వ్యాసములును ఇందుకలవు-

ఈ సంచిక మన వైదిక మతమును గురించి ఇటీవల కాలములలో ప్రబలిన కొన్ని దురభిప్రాయములను తొలగించి వాని స్థానమున సదభిప్రాయములు చదువరులకు కలిగింప చేయుటతో బాటు సంప్రదాయమునందు భక్తి ప్రపత్తుల నభివృద్ధి చేయగలదని మా దృఢ విశ్వాసము. శ్రీ చరణులు దయా సముద్రులు-వారి దయ మనందరి పైన ప్రసరింప వలయునని, అవతార మూర్తులయిన స్వామిని ప్రార్థించుచున్నాను.

Nadayadu Daivamu  Chapters