లింగోద్భవమూర్తి
మనము శివాలయాలకు వెళ్ళి చూస్తే సాధారణంగా గర్భగృహానికి పశ్చిమభాగంలో లింగోద్భవమూర్తి స్వరూపాన్ని దర్శించవచ్చు. ప్రదక్షిణంచేస్తూ వెళితే దక్షిణ భాగంలో దక్షిణామూర్తి స్వరూపప్రతిష్ఠ ఉంటుంది. లింగోద్భవమూర్తిపరమేశ్వరస్వరూపం. ఆస్వరూపం దీర్ఘవృత్తంగా అనగా అండాకారంగా మలచబడి పాదశీం్షాల వివరం తెలియకుండా ఇతర విషయాలు లింగానికి అంతర్భావంగా ఉన్నట్టు కనబడుతుంది.
పరమేశ్వరుని అరవైనాలుగు స్వరూపాలలో లింగోద్భవమూర్తి ఒకటి. ఈ అరవైనాల్గు స్వరూపాలలో వృషభారూఢుడు, అర్ధనారీశ్వరుడు, హరిహరుడు, నటరాజు, భైరవమూర్తి, దక్షిణామూర్తి, సోమశేఖరమూర్తి, భిక్షాటనమూర్తి, ఊర్థ్వనటుడు, జలంధరాసుర, సంహారకుడు, కాలసంహారకుడు - అనేవి కొన్ని. లింగోద్భవమూర్తికి ఎగువభాగంలో ఒక హంస, దిగువభాగంలో ఒక వరాహమూర్తీ ఉంటుంది. మనం అనుదినం చేసే రుద్రభిషేకంలోని ధ్యానశ్లోకం ఈ క్రిందిది.
ఆపాతాళ నభఃస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర
జ్జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః,
అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకం జప&
ధ్యాయేదీప్సిత సిద్థయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివమ్.
పాతాళలోకంనుండి ఆకాశపర్యంతము వ్యాపించి ప్రకాశిస్తున్న స్ఫటికలింగాన్ని అభిషేకిస్తున్నాను - అని దీనిభావం. స్ఫటికలింగం నిర్లిప్తమైనది. శుద్ధమైనది. నైసర్గికంగాగాని ఔపాథికంగాకాని అది పరిణామం చెందుతుంటుంది. అది గుణదోషరహితమైనది. జ్ఞానమెట్లు నిరంజనమో, పరిశుద్ధమో స్ఫటికమూ అట్లే పరిశుద్ధమైనది. పచ్చని ఆకును దానిమీద ఉంచితే అది పచ్చగానూ, ఎఱ్ఱ పూవుతో అలంకరిస్తే ఎర్రగాను కనపడుతుంది. స్వతహాగా అది నిర్వికారమైనది. నిర్వికార పరబ్రహ్మము, మన మనోభావాలను అనుసరించి మారుతుంది. అనుటకు స్ఫటికలింగ మొక దృష్టాంతం. అది నిర్గుణ పరమాత్మకు చిహ్నం.
స్ఫటికలింగానికి శిరోభాగంలో ఒక చంద్రకళ, సహస్రార కమలములోని చంద్రకళను జ్యోతిస్వరూపాన్ని ధ్యానించేవారికి చంద్రకళనుండి అమృతం స్రవించి ఆనందమిస్తున్నది. ఈసమస్త ప్రపంచమున్నూ ఆనందజ్యోతి స్వరూపమైన ఒక లింగమే. దానిని చల్లచేసినామంటే లోకమున్నూ చల్లనౌతుంది. రుద్రాభిషేకానికిముందు ఈ శ్లోకం చెప్పి మరీ ధ్యానించాలి.
ఈ బ్రహ్మాండమె ఒక శివలింగమనీ, అభిషేక కాలంలో అట్లు ధ్యానిస్తూ అభిషేకం చేయాలనీ, శ్రీరుద్రం నిర్థేశిస్తున్నది. మంచీ, చెడ్డా అన్నీ భగవత్స్వరూపంగా భావించవలెననే రుద్రం చెప్పుతున్నది. అతి మధురమును, శీతలమునూ అయిన చంద్రమండలాన్ని, నిదానంగా ఉచ్చారణచేస్తూ రుద్రాధ్యయనం చేస్తూ లింగాన్ని అభిషేకించాలి.
లింగానికి ఆద్యంతాలులేవు. మనం ఏరీతిగా స్ఫటికాన్ని చూస్తున్నామో, ఆ రీతిగానే అది మనకు కనబడుతుంది. భగవంతుడున్నూ మనం ఏ విధంగా ప్రార్ధిస్తున్నామో ఆ విధంగానే మనలను అనుగ్రహిస్తున్నాడు. మన మనస్సునకు ఒక ఆకృతి అవలంబంలేక ప్రతీకం ఉంటేనేకాని ఆనందం కలగటంలేదు. మనం ప్రేమించే బంధువర్గం విషయంలోకూడా క్షేమవార్త వినటం ఒకరకం, సమక్షంలో దర్శించటం మరొక రకం. ప్రత్యక్షమైతేనే ఆనందం కలుగుతున్నది. భగవద్విషయంలోకూడా ఒక మూర్తి ద్వారా లభించే అనుగ్రహమే సంతోషదాయకంగా ఉంటున్నది.
కొన్ని ఆలయాలలో లింగోద్భవమూర్తి గర్భగుడికి వెనుక భాగంలో ఉంటున్నది. కొన్నిచోట్ల దానికి బదులు విష్ణుస్వరూపాన్ని ప్రతిష్ఠచేసి వుంటారు. లింగోద్భవమూర్తిలో కూడా విష్ణువు వరాహరూపంలో ఉంటున్నాడు.
ఆద్యందరహితంగా పరమేశ్వరమూర్తి జ్యోతి స్వరూపంలో అరుణాచల క్షేత్రంలో ఆవిర్భవించాడు. దీనికి చిహ్నంగా ఈనాటికిన్నీ ఆ క్షేత్రలో అరుణాచల దీపంఏర్పడి వున్నది.
జ్యోతిర్లింగంగా అవతరించిన ఆపరమేశ్వరమూర్తి యొక్క ఆద్యంతాలను కనుక్కొందామని బ్రహ్మ విష్ణువులు బయలు దేరారు. బ్రహ్మ హంసరూపంతో ఆకాశంలోరి ఎగిరిపోయాడు. విష్ణుమూర్తి వరాహరూపం ధరించి ముట్టెతో భూమిని తొలుచుకుంటూ పాతాళంవరకూ పయనించాడు. వారు దేన్ని అన్వేషిస్తూ వెళ్లారో, అది గోచరం కాలేదు. వృధాశ్రమతో తిరిగి వచ్చి వేశారు. కాని బ్రహ్మ తాను జ్యోతి స్వరూపం యొక్క శిరస్సును చూచానని కల్లలాడాడు. ఆయన చెప్పిన అబద్ధానికి మొగలిపువ్వు సాక్ష్య మిచ్చింది.
అందుచేత బ్రహ్మను పరివారంలోచేర్చి పూజిస్తారు. కాని ఆయనకు ఎక్కడా ప్రత్యేక పూజలేదు. అట్లే మొగలిపూవుకుగూడా పరమశివుని పూజాద్రవ్యాలలో స్థానం లేకుండా పోయింది. విష్ణువుకున్నూ, బ్రహ్మకున్నూ ఆద్యంతాలు తెలియకపోవడంవల్ల- పరమేశ్వరమూర్తి ఆద్యంతరహితమయింది.
దాదాపు మూడువందల యేండ్లకుముందు ఒక మహనీయుడు తంజావూరురాజ్యం స్థాపించాడు. జ్యోతిషం చూచి 'నీవు రాజవవుతావు' అని ఒకనికి చెప్పి అతనికి తాను స్థాపించిన రాజ్యపు అధికారం ఇచ్చాడు. గరుడప్యూహంగా ఒకకోట కట్టాడు. పేరుకుమాత్రమే ఒకడు రాజుగాని అన్నిటినీ ఆ మహనీయుడే గమనించేవాడు. ఎన్నో ఆలయాలను కట్టించి కాలువయు త్రవ్వించి వ్యవసాయ సదుపాయాలు కల్గించాడు. అప్పుడు అరుణాచలక్షేత్రమున్నూ ఈ రాజ్యానికి చేరినదే. ఆ మహనీయునిపేరు 'అయ్య&. అరుణాచల క్షేత్రములో 'అయ్య& కోళం' (అయ్య& త్రవ్వించిన కొలను) అని ఒక కొలను, అయ్య& గోపురము అను గోపురమూ ఈయన నిర్మంచినవే ! రాజవంశానికి చేరినవారు, రాజుకట్టించినాడనీ, రాజు త్రవ్వించినాడనీ చెప్పేవారు. లోకమంతా అయ్య& నిర్మించినట్లే చెప్పేది. ఆ అయ్య& కుమారుడుకూడా రాజు ఒక గోపురంకట్టించి ఒక చెరువు త్రవ్వించాడని చెప్పాడు.
సరోగభీరం పురిగోపురం చయః
సమున్నతం శోణగిరీశితు ర్వ్యథాత్,
అశర్నయో రంఘ్రి శిరో విలోకితుం
మహాపధౌ మాధవ వేధసోరివ.
- సాహిత్యరత్నాకరం
శోణగిరీశునికోసం గంభీరమైన, సరస్సున్నూ సమున్నతమైన గోపురమున్నూ నిర్మింపబడ్డవి. మాధవవేధసులు అనగా విష్ణువు, బ్రహ్మ, శోణగిరీశుని ఆద్యంతాలు అనగా అడుగులు, తల వెతుక్కుంటూ బయలుదేరినారుగదా, వారి మార్గంలో ఈగోపురమూ, తటాకమూ కొంతసహాయంగా ఉందనీ అని కట్టబడినట్లున్నదని ఈ శ్లోకం ఉత్ప్రేక్షించింది.
గోపురం నిచ్చెనవలె ఉన్నది. హంసయొక్క అన్వేషణలో ఈనిచ్చెన కొంత శ్రమపరిహారకంగా ఉంటుంది. ఈతటాకం అతిగంభీరంగా వెళ్లితే భూమిని త్రవ్వవలసిన అవసరం కొంతవరకు ఉండదు.
అరుణాచలక్షేత్రలో అరుణజ్యోతిస్సుకు చిహ్నంగా పర్వతమూ, జ్యోతిస్సకు చిహ్నంగా దీపమూఉన్నవి. అందుచే ఆ పరమాత్మను ఆద్యంతరహితుడుగా జ్యోతిస్స్వరూపిగా మనం ధ్యానించాలి. ఆ జ్యోతిః స్వరూపాన్ని మనకు తెలుపుటకే కార్తికదీపం ఏర్పడి ఉన్నది.
అపాతాళ నభస్ధలాంత భువన బ్రహ్మాండంగా వ్యాపించియున్న ఆ జ్యోతి స్వరూపాన్ని చంద్రమౌళీశ్వరుని స్ఫాటికలింగ రూపంగా మనం ధ్యానిస్తే వారి అనుగ్రహంకల్గి మనకు ఆనందం కల్గుతుంది.
|