Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

స్ధితప్రజ్ఞ

స్ధిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ,

స్ధితధీః కిం ప్రభాషేత? మాసీత వ్రజేత కిమ్‌?

అని అడిగిన అర్జునుని ప్రశ్నకు భగవానుడు ఉత్తరమిస్తూ, ఎవడైతే తన కోరికలనూ, రాగద్వేషాలనూ జయించి నిశ్చలమైన మనస్సుతో ఉన్నాడో అతడే స్థితప్రజ్ఞుడు అని అన్నారు. అట్టివ్యక్తి బాహ్యాలోచనలనుండి తన మనస్సును విముఖంచేసి, ఆత్మచింతనకోసం అంతర్ముఖం చేస్తాడు-అని అన్నారు. ఆత్మసర్వగతం. అది అంతటా నిండినవస్తువు. తాబేలు ఏదైనా ఆపద తనకు వచ్చినట్లు పసిపట్టినపుడు తన కరచరణాలను ఏవిధంగా లోనికి లాక్కొంటున్నదొ, అదేవిధంగా స్థితప్రజ్ఞుడున్నూ అనవరతమూ బహిర్గతమయ్యే స్వభావంగల ఇంద్రియాలకు అంతర్ముఖం చేస్తున్నాడు. ఎందుకు? ఆత్మను ధ్యానించడానికి, మనస్సులో ఏదో ఒకవెలితి ఉండటంచేతా ఒక వస్తువు ఆ వెలితిని తొలగిస్తుందన్న భావనచేతా, మనం ఆ వస్తుప్రాప్తికై పరిశ్రమిస్తున్నాము. 'మనం మనం' అని మనము చెప్పుకొంటున్నామే ఈ 'మనము' ఎవరో మనము ఎరిగినట్లేతే, అది సంపూర్ణానందమని తేలుతుంది. మనమే సంపూర్ణానందమైనప్పుడు ఇక మనకు ఆనందమిచ్చే వస్తువు వేరుగా ఎక్కడ ఉంటుంది? ఆ ఆనందే లబ్ధమైనప్పుడు, ఇంద్రియాలమూలంగా మనం అనుభవించే సౌఖ్యం క్షణికమని తెలుసుకొంటాము. అగ్నిని అగ్నితో ఆర్పలేము. పైగా వృద్ధిచేస్తాం. అలాగే విషయాలను అనుభవించినకొద్దీ కోరికలు అనగా విషయాలుఇంకా పెచ్చు పెరుగుతూ ఉంటవి.

అదే సందర్భంలో భగవానులు అర్జునుడికి బోధిస్తూ, (అర్జునుడికే కాదు, మనకున్నూ) ఆత్మనిగ్రహం పూలబాట కాదనీ దానికి నిరంతరసాధన లేక అభ్యాసం అవసరమని సెలవిచ్చినారు. మనం యత్నిస్తూ ఉంటాము. మధ్యమధ్యలో జారిపోతూ ఉంటాము. నిరుత్సాహంతో అంతటితో స్వస్తిచెప్పక, మళ్ళామళ్ళా ప్రయత్నిస్తూజయం కలిగేటంతవరకూ మనం యత్నంచేస్తూనే ఉండాలి. ఉపవాసం మొదలైనవి ఆత్మనిగ్రహానికి తోడ్పడతవి. జ్వరగ్రస్తుడుకానీ, ఉపవాస మున్నవాడుకానీ సంగీతం వినాలని కోరడు. అది అపుడు పెద్దగా రుచించదు. అదేవిధంగా నానావిధ భక్ష్యభోజ్యాల ఆశావానికి ఉండదు. అవి ఆశ పెట్టలేవు. ఐతే, వానిపై కోరికలువాని మనస్సులోనుంచి పూర్తిగా తొలగిపోయినవికాదు అర్థం. ఉపవాసం విరమించిన పిదపకానీ, జ్వరంతొలగి మళ్ళా స్వాస్థ్యం లభించేసరికికానీ మనస్సు మళ్ళా వీనిపైపోతూ ఉంటుంది. అంటే లభించేసరికి కానీ, మనస్సు మళ్ళావీనిపై పోతూవుంటుంది. అంటే ఈకోరికలన్నీ నివురుగప్పిన నిప్పువలె ఉంటున్న వన్నమాట. దీనివల్ల తేలేదేమంటే ఉపవాసాదికాల చేతకానీ, ఇతర విధాలైన తపశ్చర్యల చేతకానీ, ఇంద్రియవిజయమూ, ఆత్మనిగ్రహమూ పరిపూర్తిగా మనకు స్వాధీనంకాదు' అని, ఏదో జయించినట్లే ఉంటుంది. నిగ్రహించినట్లే ఉంటుంది. బలాబలాల పరీక్ష వచ్చేసరికి మనస్సుయొక్క దుర్బలత యిట్లే తెలిసిపోతుంది. అందుచేతనే భగవానులు గీతలో పరమాత్మ స్వరూప సాక్షాత్కారం కావలెనంటే, సద్వస్తుజ్ఞానం కలుగవలెనంటే మనంపూర్తిగా భగవంతుని శరణుజొచ్చితేకాని వీలుకాదని పదేపదే సెలవిస్తున్నారు. తపస్సూ, ఉపవాసమూ ఈ మొదలయినవి ఆత్మ సాక్షాత్కారానికి వలసిన పూర్వరంగాన్ని కల్పించవచ్చు. కాని పరిపూర్ణ నిగ్రహం భగవదనుగ్రహము చేతనే కలగాలి. ''వాసుదేవ స్సర్వమితి'' జ్ఞానం కల్గేంతవరకూ పరిపూర్ణ మనోజయం సిద్ధించదు. సర్వమూ వాసు దేవమయం. ఈ సర్వములో తానూఉన్నాడు. ఎప్పుడైతే మనకు ఈజ్ఞానం కలుగుతుందో, అప్పుడు ఇంద్రియ సౌఖ్యాలపై విముఖత ఏర్పడి, బాహ్యవిషయాలు, మనోవికారం కల్గించడానికి అశక్తాలై పరిపూర్ణ మనోనిగ్రహం సిద్ధించి, ఎంతటి కష్టాలు వచ్చినప్పటికిన్నీ జారిపోని మానసిక నిశ్చలతా మనశ్శాంతీ ఏర్పడుతుంది.

తీరిన కోరికలు క్రోత్తకోరికలను చిగిరిస్తున్నవి. కోరికకు నిరోధం కల్గినప్పుడు క్రోధంకలుగుతుంది. గోడకేసిబంతికొట్టు! అదిమళ్ళా నిన్నేకొటుతుంది. కోపంలో చిక్కికొన్నవానికి కాని, కోరికలతో చిక్కికొన్న వానికి వివేచనాశక్తి అంతరించిపోతుంది. అందుచేత వాడుచేసే ప్రతిపనీ, దుర్మార్గంలోనే నడుస్తూ ఉంటుంది. అట్లుకాక ఇచ్ఛలన్నీ మనస్సుకు లొంగిపోతే, మనస్సు నిశ్చలమైసతతమూ ఆత్మధ్యానం చేస్తుంటుంది. అట్లు ఎడతెగక ఆత్మచింతన చేసే వ్యక్తికి అచిరకాలంలో ఆత్మసాక్షాత్కారమున్నూ కల్గుతుంది.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page