Jagadguru divyacharithra   Chapters   Last Page

 

13. శ్రీ చరణానుగ్రహం

శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః |
ఆచార్య శ్శంకరాచార్యః సంతుమే జన్మ జన్మని ||


అది ఉషస్సు. తమస్సును పటాపంచలుచేసే కమల బాంధవుని అరుణరేఖలకై ప్రాణికోటి అంతా ప్రతీక్షిస్తూ ఉండే పవిత్ర సమయమిది.

శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి పూజ్య శ్రీచరణములను దర్శించుకొనే అహమికతో భక్తకోటి వికచోన్ముఖాలైన హృదయారవిందములతో హారతులుపట్టి వేచిఉండే సమయంకూడ అదే.

తూర్పుదిక్కున పొడసూపే అరుణరేఖలతో పాటు కుంకుమా యితములైన శ్రీచరణాలను సైతం నిత్యం భక్తులు దర్శించుకొంటూ ఉంటారు.

కామకోటి పీఠంలో పీఠ ఆస్థానదైవమైన శ్రీచంద్రమౌళీశ్వర శ్రీత్రిపురసుందరీ దేవతా సన్నిధిని ఆసమయంలోనే ప్రభాత సేవనం ఆరంభమౌతుంది.

హస్తినాద ప్రబోధం : - 'హస్తినాద ప్రబోధినీం' ని వేదవాక్యం. అందువల్ల పీఠంలో తెల్లవారుజామున భద్రగజ ఘీంకారాలతోను, మంగళవాద్యాలతోను ప్రభాతసేవ ప్రారంభమౌతుంది. లక్ష్మీ నివాస ప్రదేశాలలో గజకుంభస్థలం, గోపృష్ఠం మిక్కిలి ప్రధానతమములు. అందువల్ల పీఠ దేవతార్చన సన్నిధిలో ప్రాతస్సాయం సమాయాల్లోని ఉభయ సంధ్యలలోను కపిలగోపూజ, గజపూజ నిర్వర్తించుతారు. పూజా సమయంలో శ్రీచరణ దర్శనభాగ్యం కూడ లభిస్తుంది. ఉన్నతశ్రుతిలోని తిమిరివాద్య ఘోష మనల్ని పులకాంకితుల్ని చేస్తుంది. సాయంసంధ్యలోని 'సదంచిత ముదంచిత నికుంచితపదం' అనే నటరాజ స్తోత్రంతో కూడిన డమరుకవాద్యం నటరాజ నృత్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది.

రాజోపచారాలు : పీఠదేవతార్చనమున నిత్యం త్రికాలములలో శ్రీవారే స్వయంగా అర్చనం చేస్తారు. విశ్వశ్రేయస్సు-లోకకల్యాణం, కాంక్షించి సర్వప్రతినిధిగా శ్రీవారే రాజోపచారాలతో దేవపూజ గావించుతారు. తీర్థప్రసాదాలను స్వయంగా అనుగ్రహించుతారు.

అంతర్ముఖ సమాధినుండి కన్నులు తెరచి శ్రీవారు ఉషః కాలంలో మొట్టమొదట భక్తకోటికి దర్శనమిస్తారు. 'ఈ సయమంలోని గజఘీకారంలోని 'శంభో' పదసంబోధనం మనల్ని పులకాంకితుల్ని చేస్తుంది. తరువాత సన్నిధిలో పంచాంగశ్రవణం జరుగుతుంది. శ్రీవారు స్నానాద్యనుష్ఠానాలను నిర్వర్తించుకొంటారు.

ఉదయం అద్వైత వేదాంతశాస్త్రపాఠం జరుగుతుంది. శ్రీవారి మకాంలో అద్వైత వేదాంత గ్రంథకోశం ఎప్పుడు వారివెంట ఉంటోంది.

శ్రీవారు అతిబాల్యంలోనే సుమారు పదమూడవ ఏట పీఠాధిపత్యాన్ని 1907 ఫిబ్రవరి 13వ తేదీన స్వీకరించారు. ఇప్పటికి అరవైరెండు సంవత్సరాలనుండి వారి నిత్య కార్యక్రమం అదొక విలక్షణంగా సాగిపోతూ ఉంటుంది.

అందువల్లనే ఆనాడు పండిత మదనమోహనమాలవ్యా (కాశీ) శ్రీవారిని గూర్చి చెపుతూ 'మరల మనకు ఆదిశంకరుల దర్శనమైన'దని నుడివినాడు. వారివారి సంస్కారానురూపంగా భక్తకోటి శ్రీవారు ''నడయాడే దైవ''మని సేవించుకొంటున్నారు. శ్రీవారు అంటే దైవం మనుష్య రూపంలోభుమితో సంచరించుతున్నట్లు స్పష్ఠంగా గ్రహించగలుగుతాము. అందువల్లనే మానుషరూపంలో ఉన్న శ్రీవారిని దైవంగా మనం సేవించుకొంటున్నాము.

ఆంధ్రప్రాంతీయుల చిరంతన పుణ్యపరిపాక విశేషంచేత శ్రీవారు మరల ఆంధ్రప్రాంత సంచారానికై విజయంచేసి మనల ననుగ్రహించుతున్నారు.

ఆదిశంకరులు యావద్భారతదేశాన్ని పాదచారులై రెండుమూడుమారులు పర్యటించి ధర్మోద్ధరణంచేస్తూ ఎల్లరకు వారి దర్శనభాగ్యం లభింపజేశారు. అదే నేటి శ్రీవారి ఆదర్శంకూడ. కనుకనే పల్లెఅనక, పట్టణమనక నిరంతరం ప్రయాణత్వరతో మారుమూల కుగ్రామాలతోపాటు మహాపట్టణాలతో సహా విజయ యాత్రల నెరపుతున్నారు.

ఇన్ని సంవత్సరాలనుండి శ్రీవారి నిరంత నిర్విరామకార్యక్రమం, వారి ధర్మదీక్ష లోకాన్ని చకితం చేస్తున్నవి. నిత్యం పలుప్రాంతాలనుండి వివిధ భాషల్లోవచ్చే లేఖలను స్వయంగానే ఏదో ఒక సమయంలో అవధరించుతారు. వాటి సమాధానాలనుకూడ స్వయంగా సూచించుతారు. మరొకవైపు తీర్థప్రజగా వచ్చివెళ్ళుతూఉండే భక్తుల ననుగ్రహించుతూ ఉంటారు. ఆజ్ఞకోసం హారతులుపట్టి వేచిఉండే భక్తకోటికి ప్రస్థాన మంగళాన్ని అనుగ్రహించుతూ ఉంటారు. ప్రతిదినం ప్రభాత సమయం మొదలు రాత్రి ఒంటిగంటవరకు నిర్విరామంగా ఉంటూనే ఉంటుంది. అపుడు పైశారీ పఱచుకొని నేలమీదనో, బల్లవంటి దారుపీఠంమీదనో కొంచెం నడుం వాల్చినట్టు కన్నించుతారు. నిజంగా శ్రీవారి ఏకాంతమైన అంతర్ముఖ సమాధిస్థితికి అదే సమయంగా ఉంటుంది. మరల తెల్లవారుజామున యథాపూర్వంగానే కార్యక్రమం ఉపక్రమమౌతుంది. క్రొత్తగా చూచేవారు ప్రాకృతభావంతో శ్రీవారు నిన్నటి కార్యక్రమంతో బడలిపోయారని ఎప్పటికప్పుడే భావించుతారు.

కాని మరల ప్రభాతసమయంలో తూర్పుదిక్కున గోచరించే సంధ్యారుణకాంతులను స్పష్టంగా శ్రీవారిలో చూడగలుగుతాము. కొంతసేపట్లో సౌరమండల మధ్యస్థమైన సాంబమూర్తిగా శ్రీవారిని మనం దర్శించుకో గలుగుతాము. అంతతో మన సర్వసంశయాలు తిరోహితములౌతవి.

మౌనవ్రతం : మౌనం తత్వోపదేశానికి గొప్పసాధనమని ప్రాచీనమైన అర్షసంప్రదాయం. కనుక శ్రీవారు అప్పడప్పుడు కొన్ని రోజులు మౌనవ్రతం అవలంబించుతూ ఉంటారు. అది కొన్ని నెలలు కూడ జరగటం కద్దు. ఈమౌనం మూడు విధాలుగా ఉంటుంది. ఒకపుడు తమ ఎదుటివారికి తెలిసే భాషలో చేతితో వ్రాసి చూపించుతారు. మరోకపుడు నేత్రసంజ్ఞతో మూగసైగలతో మాత్రమే వివరించుతారు. కొన్ని సమయాల్లో ఏసంజ్ఞను చేయరు. మరికొన్ని సమయాల్లో ఇతరులు చెప్పు దానిని విని ఊహించు స్థితిలో కూడ ఉండరు. ముఖవికాసమున ఎట్టి మార్పులు గోచరింపవు. ఈ పద్ధతినే కాష్ఠమౌనం అంటారు.

శ్రీవారు సామాన్యంగా ప్రతిమాసంలోని 'మూల' నక్షత్రంనాడు మౌనవ్రతం అవలంబించుతూ ఉంటారు.

శరన్నవరాత్రులు : శ్రీవారు ఈ ఉత్సవాలలో తొమ్మిదిరోజులు ఉపవాసదీక్షతో మౌనవ్రతంతో అతిలోకవైభవంతో పూజాకార్యక్రమాలను నిర్వర్తించారు. ఎక్కువ సమయాన్ని పూజకై వినియోగించుతారు. విజయదశమినాడు పండితగోష్ఠులను నెరపి విద్వత్సభలను జరిపించి యథోచిత సమ్మానాలను పండితుల కనుగ్రహించుతారు.

ప్రతిసంవత్సరం అలాగే ఉగాది మొదలు తొమ్మిదిరోజుల వసంతనవ రాత్ర్యుత్సవాలను నిర్వర్తించుతారు.

కామకోటిపీఠం : కామకోటిపీఠం అంటేనే తన నాశ్రయించినవారికి కల్పతరువని విశధమౌతూ ఉంటుంది. అందుకు అనుగుణంగా శ్రీకామాక్షీదేవి కరుణాకటాక్షం సర్వవాంఛా సిద్ధికి ప్రధానకారణమౌతోంది. ఐతే విశేషమేమంటే అన్ని సంశయాలను పటాపంచలుచేసి సమస్త వాంఛలకు పరిపూర్ణ ఫలస్వరూపమైన పరతత్త్వ సాక్షాత్కారం ఈ పీఠ సేవనంవల్ల లభిస్తుంది.

సర్వజ్ఞపీఠం : ఇది సాక్షాత్తు ఆదిశంకరు లధిష్ఠించిన సర్వజ్ఞపీఠం. ఇప్పటికిని ఈ పీఠాధిష్ఠితులైన సర్వజ్ఞమూర్తులను మనం దర్శింపగలుగుతున్నాము.

శ్రీవారు సాక్షాత్తు సర్వజ్ఞమూర్తులు. 'మహాత్ముల మహిమనీటికొలది తామర'అన్నట్టు ఆయా జీవుల సంస్కార విశేషంచేత శ్రీవారి స్వరూపావగతి ఏర్పడుతుంది. శ్రీవారు ఎచ్చట ఉంటే అచట సర్వతీర్థ మహిమ ప్రత్యక్షమౌతుంది. వారు చెప్పినమాట సర్వవేదసారం వారిని దర్శించిన భక్తులు ఐహికవాంఛల్ని కోరుతారు. ఆముష్మిక ఫలాలను ప్రసాదించమంటారు. అధివ్యాధులను హరింపజెయ్యవలసిందిగా సాగిలబడి మ్రొక్కు తారు. తమతమ మనస్సులనువిప్పి సర్వం చెప్పుకొంటారు. శ్రీవారు అన్నీ ఎంతో అనుగ్రహ పూర్వకంగా ఆలకించుతారు. అందరను అనుగ్రహిస్తారు. ఎలా అనుగ్రహించినా ప్రతివ్యక్తిని ధర్మమార్గానికి అభిముఖుని చేస్తారు. కన్నతల్లి అప్యాయంతో బిడ్డను ఒడిలోనికి తీసికొని అమృతప్రాశనం చేయించినట్టు అందరకు అమృతోపదేశం చేస్తారు. అది క్రమంగా ధర్మపురుషుని ఆదేశమౌతుంది.

అహంకార త్యాగపూర్వకంగా త్రికరణశుద్ధతో శ్రీచరణాశ్రయం చేసి తృప్తుడై అభ్యుదయ పరంపర నందుకొనని జీవిలేడు. ఆ మహాభాగ్య సముద్రంలో తనివితీర ఓలలాడిన అదృష్టం తమిళ ప్రాంతానికి విశేషంగా లభించింది. ఐశ్వర్యం, పాండిత్యం అధికారం లాంటివి మాత్రమే శ్రీచరణ సన్నిధిలో ప్రాముఖ్యాన్ని పొందలేవు. అక్కడ ప్రధానంగా త్రికరణశుద్ధికి ప్రాధమ్యం ఉంటుంది.

జగత్కుటుంబి : శ్రీవారిని నిత్యం ఎంతోమంది భక్తులు దర్శించుకొంటూ ఉంటారు. ఎన్నోగాధల్ని చెప్పుకొంటూ ఉంటారు. కాని ఒక్కమారు దర్శనం చేసికొన్నవారు మరల ఎంతకాలానికి వారిని దర్శించినా ఆ సందర్భాన్ని అనుసరించి వారి కుటుంబ యోగక్షేమాలను తత్పూర్వ వృత్తంతో జోడించి ప్రశ్నిస్తూ ఉంటే కొందరు ముగ్ధులై చకితులౌతూ ఉంటారు. ఎంతో ఆప్తబంధు వివరాలు సైతం అలా స్మృతిపధంలో ఉండటం సామాన్యులకు కష్టసాధ్యం. కాని శ్రీవారికి ఇంతమంది విషయాలను చూస్తూ సుసాధ్యం. అందుకు ఒక్కటే కారణం. శ్రీవారు జగద్గురువు లెలాగో అలాగే జగత్కుటుంబి అనేది మనం గ్రహించాలి. ఎలా సర్వసంగపరిత్యాగులో అలాగే లోకకల్యాణాన్ని కోరుతూ ఉంటారని తెలిసికోవాలి.

ధర్మమూర్తి : కలియుగంలో ధర్మం ఒక్క పాదమే నడుస్తుందని మనకు తెలుసు. కాని ప్రతివ్యక్తిలోను ముప్పాతిక అధర్మం పాతిక ధర్మం మనం కచ్చితంగా చూడటంలేదు. కొందరు ధర్మశూన్యులెలా ఉన్నారో మరికొందరు ధర్మపూర్ణులును ఉంటారని అర్థం. మొత్తం మీద పాతిక ధర్మప్రవర్తిత మౌతూ ఉంటుంది.

శ్రీవారు ధర్మమూర్తులు. కనుకనే 'వారి' అధీతి, బోధ, ఆచరణ, ప్రచారాలు సులభసాధ్యాలుగా ఉన్నవి వారు అడుగుపెట్టినచోట కృతయుగధర్మం ప్రత్యక్షమౌతోంది. వారి సంచారపద్ధతి అంతా విలక్షణంగా ఉంటుంది. నదీస్నానంగాని, తటాకస్నానంగాని వారికి నిత్యం అభిలషణీయంగా ఉంటుంది. వారు విజయం చేసినచోట గాని, పూజా ప్రదేశంలోగాని విద్యుద్దీపకాంతి ఉండదు. స్వచ్ఛములైన గోఘృతదీపకాంతులు వెలుగుతూ ఉంటవి. అంతేకాదు. అవి పీఠాభాస్వత్తులు అణూపమాలునై వాటి శిఖామధ్యంలో పరమాత్మ తేజస్సు ఉట్టిపడుతూ ఉంటుంది.

ఖద్దరు : శ్రీవారు మొదటినుండి ఖద్దరు శారీలనే ధరించటం పరిపాటి. ఒకపుడు రామేశ్వరంలో మఠపరివారంలోని వారు రెండువందలమంది సముద్రస్నానం చేస్తూండగా రెండువందల జతల ఖద్దరు వస్త్రాలను తెప్పించి యిచ్చి వారందరిని ధరింపుడన్నారు. తత్పూర్వం ధరించిన వస్త్రాలను సాగర గర్భంలోనికి విడిచిపెట్టండి అన్నారు. నాటినుండి వారినందరిని ఖద్దరే ధరించేటట్టు నియమం వహించవలసిందిగా చెప్పారు.

అవధానం : ఆంధ్రప్రాంతంలోవలెనే తమిళ ప్రాంతంలోకూడ శతావధానాదులు విశేషంగా జరిగేవి. చాలాకాలం క్రిందట పీఠంలో శ్రీవారి సమక్షంలో ఒక మహాపండితుడు శతావధానం చేస్తూ ఉన్నాడు. ఒక శిష్యుని చేర బిలిచి ఆ ప్రశ్నల కన్నింటికి శ్రీవారుకూడ సమాధానాలు వ్రాయించారు. ఆ పండితుని శతావధానంకంటే శ్రీవారి అవధానం చాలముందుగనే పూర్తిఅయింది. తుద కీ విషయాన్ని తెలిసికొని సభలోని పండితులందరు మహానందాన్ని పొందారు.

కొంతమంది ఆధునిక భౌతికశాస్త్రజ్ఞులు, గణిత శాస్త్రజ్ఞులు, తదితర శాస్త్రాలలో ప్రఖ్యాతులు శ్రీవారి దర్శనంచేసి గోష్ఠి జరుపుతూ ఉంటే శ్రీవారు వారితో ఆయా శాస్త్రాలలోని ప్రాచీన ఆధునిక శాస్త్రాంశాలను క్షుణ్ణంగాను, కూలంకషంగాను చర్చిస్తూ ఉండేవారు. అదివిని వారు విశేషభక్తి ప్రపత్తులతో శ్రీవారి ఉపదేశాలను స్వీకరిస్తూ ఉండేవారు. ఒకపుడు ఇలాంటి సంఘటనలనేకం తెలిసికొని విశాఖపట్టణం జిల్లా మహామ్మదుపురం జమీందారు శ్రీ రాజా ఏ.వి. జగ్గారావుగారు శ్రీవారిని దర్శించారు. వారు ఖగోళ పరిశీలనలో చేస్తున్న అనేక పరిశోధనలు ఖండాంతర పర్యటనలో తెలిసికొన్న అంశాలను శ్రీవారికి నివేదించారు. వారు తాము ఇటలీ నుండి 16 వేల రూపాయలు ఖర్చుతో కొనితెచ్చిన దూరదర్శిని యంత్రాన్ని మహానందంతో శ్రీవారికి సమర్పించారు. ఇలాంటి విశేషాలు మఠంలో తరచు జరుగుతూ ఉండటం పరిపాటి.

మైలాపూరులో ఒక పుణ్యశాలి : శ్రీవారు మదరాసులో ఉన్నపుడు అనేకమంది శిష్యకోటి శ్రీవారిని నిత్యం సేవిస్తూ ఉండేవారు. అలాగే ఒక డాక్టరుగారుకూడ నిత్యం వెళ్ళి శ్రీవారిని సేవించేవారు. కాని శ్రీవారు తన ఇంటికి వచ్చి తన పూజల్ని అందుకోవాలని ఆయనకు ప్రగాఢమైన వాంఛ ఉండేది. శ్రీవారితో ఈ విషయాన్ని నివేదించుటకు ఆయన సాహసించలేదు. ఒకరోజున ఎప్పటివలెనే డాక్టరుగారు శ్రీవారి సన్నిధికి వచ్చారు. వెంటనే ఆ డాక్టరుగారిని అచటి జనసమూహంలోనుంచి సూటిగా పిలిచి అరగంటలో మీయింటికి రాబోతున్నామని శ్రీవారు చెప్పారు. అది ఆకస్మికంగా విని ఏమీ సిద్ధం చేసికోలేదే ఎలాగా అని ఆయన విశేషంగా కంగారు పడుతున్నారు. అప్పటికప్పుడే శ్రీవారు 'నీవు కంగారు పడకు. నీకు కావలసిన సంభారాన్ని అంతా మా మఠంవారే సిద్ధం చేస్తారులే'అన్నారు. అలాగే ఎంతో అనుగ్రహంతో వారి కుటుంబ సభ్యులను అందరిని పిలచి ఆప్యాయంతో అనుగ్రహించారు. ఇలాంటి విశేషాలు అనేకం జరుగుతూ ఉంటవి.

సుకృతంగల శునకం : 1917 నుండి శ్రీవారి పరివారంతో ఒక సుకృతంగల శునకం వారిని విడువకుండా వస్తూఉండేది. రాత్రులందు మఠం వస్తువులను కాపలాకాస్తూ ఉండేది. కొంతకాలానికి మఠంలోనివారుదాని చర్యను గుర్తించారు. కొంత ఆహారం పెడుత్తూ ఉండేవారు. దానితోనే అది తృప్తిపొంది మరి దేనినీ ముట్టేదికాదు. మఠంలో ఆహారం దొరకనినాడు అది పస్తుండేది అన్నమాట. శ్రీవారి యాత్రలో పల్లకి క్రిందికి నడిచేది. పల్లకి ఆగినపుడు దూరంగా పోయేది. లేదా ఏనుగు నాలుగు కాళ్ళ మధ్యలో నడుస్తూ ఉండేది. ఒకరోజున ఒక బాలుడు దాన్ని ఒకరాతితో కొట్టాడు. అది మొరిగి అతణ్ణి భయపెట్టింది. కొందరది చూచి దానికి పిచ్చి ఎక్కిందని దాని కళ్లకు గంతలుకట్టి పాతికమైళ్ళ దూరాన విడిచి వచ్చారు. వెళ్ళినవారు తిరిగి వచ్చేలోపల మఠాని కదిసూటిగా వచ్చింది. నాటినుండి శ్రీవారు దానిక్షేమం విచారిస్తూ ఉండేవారు. అప్పటినుంచి శ్రీవారి దర్శనం లభింపనినాడు అది ఆహారం ముట్టేదికాదు. అలా అది జీవితాంతంవరకు మఠపరివార సేవ చేసింది.

వరశుల్కం : వరశుల్కం, కన్యాశుల్కం రెండును శాస్త్రనిషేధములని, వివాహంలో పవిత్రతను పాటించకుండా వ్యాపారదృష్టితో వ్యవహరించటం తగదని శ్రీవారు సెలవిస్తూ ఉంటారు. స్త్రీ సంతతి హెచ్చుకావటానికి పురుషులలో తేజోబలవీర్య సంపత్తి తగ్గిపోవటమే కారణమని, నిత్య కర్మానుష్ఠానం జరుపుకొనే అలవాటువల్ల అనర్థాలు తగ్గి శ్రేయస్సు గలుగుతుందని సెలవిస్తారు. జీవనంకోసం ఏర్పడిన ఉద్యోగాలు దీనికి అడ్డురావనికూడ హెచ్చరించుతారు.

పంచాయతన పూజ : శివ, విష్ణు, గణపతి, సూర్యదేవీ - అనే పంచదైవములను పూజించుతూ ఉండే గృహం నిత్యం సర్వతీర్థమహిమతో పవిత్రంగా ఉంటుందని శ్రీవారు సెలవిచ్చారు. అంతేకాక ఆదిశంకరులు షణ్మతస్థాపనాచార్యులుగా ప్రసిద్ధి నందారని ఆరవ దైవంగా శ్రీ సుబ్రహ్మణ్యశ్వరుని ఆరాధించుట ఉత్తమపద్ధతి అని సెలవిచ్చారు. సత్యజ్ఞాన గురువగు శ్రీ సుబ్రహ్మణ్యశ్వరు నారాధించటంవల్ల ఎల్లభయములు తీరి మోక్షం కూరటం నిశ్చయం అని సెలవిచ్చారు.

దేశాభ్యుదయానికి నాలుగు సూత్రాలు : 1952 లో శ్రీవారు దేశాభ్యుదయానికి నాలుగు సూత్రాలను సెలవిచ్చారు. 1) అందరు కాఫీని అవశ్యం మానాలి. దీనికి బదులు బియ్యపునూకతోగాని, గోధుమనూకతోగాని గంజి కాచికొని మజ్జిగలో కలిపికొని త్రాగవచ్చు. 2) బాలబాలికలు విద్యా సంస్కారానికి అవసరమైన సినీమాలు తప్ప తక్కిన వానిని చూడము అని ఒట్టు పెట్టుకొని మానాలి. దీనివల్ల మన జాత్యభివృద్ధి జరుగుతుంది. 3) పురుషులు, ముఖ్యంగా స్త్రీలు ధరించే వస్త్రాలు కండ్లను మెఱపించే విలువగలవాటిని ధరింపరాదు. ఈ విషయంలో భాగ్యవంతులే ముందు మార్గదర్శకులు కావాలి. 4) బాలబాలికలకు సహవిద్య పనికిరాదు. రజస్వలలైన బాలికలను పాఠశాలలకు పంపకూడదు. ఇంటనే భారతంలోని అనుశాసనిక పర్వమందు భీష్ముడు బోధించిన నైతిక మార్గాలను బోధించాలి. వివాహ పర్యంతం కన్యలను సచ్ఛీలవతులనుగా చెయ్యటంలో తల్లి దండ్రులు విశేష శ్రద్ధ వహించాలి.

మాతృసేవ, గోసేవ, మాతృదేశ##సేవలు - ముగ్గురమ్మల మూల పుటమ్మయైన పరదేవతాసేవనం అని శ్రీవారు సెలవిస్తూ ఉంటారు.

ఆదిశంకరులు : ఆదిశంకరులను గూర్చి శ్రీవారు అనేకాంశాలను సెలవిస్తూ ఉంటారు. ''శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోక హితం చరంతః'' ఈ శ్లోక తాత్పర్యం ఆచార్యుల వారి పట్ల అక్షరశః అన్వయించుతుందని, అంతసూటిగా మరొక రెవ్వరికిని అన్వయించదని శ్రీవారు సెలవిస్తారు. కాని అందు 'నివసంతి'కి బదులు 'విచరంతి' అంటే ఇంకా చక్కగా చరితార్థమౌతుందని అంటారు. అందుకు కారణం - ఆదిశంకరులు ఒకచోటనే కూర్చొని ఉండలేదు. అల్పజీవితంలోనే దేశం నలుమూలల తిరిగి మానవాళిని సముద్ధరించిన పరమకరుణామూర్తులు ఆదిశంకరులు. మరణాసన్నమైన మానవాళిని, సనాతన వైదిక ధర్మానికి వసంత ఋతువులాగ కొంగ్రొత్త జీవంపోసి చిరస్థాయిగా నిలబెట్టిన లోక శంకరులు వారు. వారి అనుగ్రహం వల్లనే నేడు మన మతం, ధర్మం, నిలిచి ఉన్నాయి. భగవత్పాదుల పేరే ధర్మసంస్థాపనాని కీనాడు పర్యాయంగా నిలిచిపోయింది.

కనుక శంకర జయంతి పర్వాన్ని, దసరా, దీపావళి పండుగల వలె మహావైభవంతో జరుపుకోవాలని శ్రీవారి ఉపదేశం.

శివరహస్యం : శ్రీవారి పూర్ణయాత్రలో కలకత్తా సమీపంలోని నవద్వీపానికి విజయం చేసినపుడు అచట విద్వత్సభ జరిగింది. మహామహోపాధ్యాయ లెల్లరు ఆ సభలో పాల్గొన్నారు. అపుడు చిరకాలం నుండి శ్రీ కాశీమహారాజు గ్రంథాలయంలో భద్రపరుపబడిన 'శివరహస్యం' అనే అపూర్వ తాళపత్ర గ్రంధస్థ విశేషాలు అచటి సదస్సులో వివరింపబడినవి. అందు ఆదిశంకరులు నాల్గు దిక్కులలో నాల్గు పీఠాలను స్థాపించి తాము కంచిలోని సర్వజ్ఞ పీఠాధిరోహణం చేసి అచటనే విదేహముక్తి నందారని ఉన్నది.

మిడ్నపూరు : ఇచట బ్రిటిష్‌ వ్యతిరేక విప్లవోద్యమంలో కారాగారవాస క్లేశాన్ని అనుభవించుతున్న - భారతమాత కన్నబిడ్డలకు శ్రీవారచటకు విచ్చేసిన సంగతి తెలిసింది. వారు శ్రీవారిని దర్శించాలనుకొన్నారు. జైలు అధికారులు కూడ వారినందుల కనుమతించారు. అధికారుల ఆదేశానుసారం వారందరు సాయంకాలం 6 గం||ల లోపుగా జైలుకు తిరిగిరావలసి ఉన్నది. రాత్రివేళ కర్‌ఫ్యూ అమలులోఉన్నది. ఆ సమయం తప్పితే తుపాకి గుండ్లకి గురికావాలి.

శ్రీవారు పూజ ముగించుకొని విశ్రాంతి తీసికొన్నారు. అంతలో ఈ దేశభక్తులు వచ్చారు. శ్రీవారివద్దకు వెళ్ళి వీరి విషయం చెప్పటానికి మఠంలోనివారు సందేహించారు. వారు వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైనది. ఏమైనాసరే శ్రీవారి దర్శనం చేసివెళ్ళాలని వారు కృతనిశ్చయులై ఉన్నారు. సమయం మించిపోతోందని నిరాశులై కొంచెందూరం వెళ్ళారు. ఇంతలో శ్రీవారు మఠంలోవారిని పిలచి దర్శనం కోసం ఎవరైనా వచ్చారా ? అని ప్రశ్నించారు. అపుడు వీరి సంగతిని చెప్పాను.

వెంటనే వారిని పిలిపించి వారి ఆవేదనను విన్నారు. అందరను ఆప్యాయంతో అనుగ్రహించారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించవలసిందిగా వారు కోరారు. దైవానుగ్రహంవల్ల అది తప్పక లభిస్తుందని శ్రీవారు సెలవిచ్చారు.

అనంతకృష్ణశర్మ కాశీయాత్ర : అనంతకృష్ణశర్మ అనే ఇరవై యేండ్ల వయస్సుగల యువకుడు శ్రీవారు విధించిన కఠిన నియమాలతో కాశీయాత్ర చేసివచ్చాడు. అందులో నియమాలివి.

1) కాలినడకతో కాశీవెళ్ళాలి 2) స్వయంపాకం చేసికొని భోజనం చెయ్యాలి 3) కాఫీ, టీలు - త్రాగరాదు 4) కట్టుబట్టలు, వంటసామగ్రి తప్ప వెంట మరేమీ ఉండకూడదు. 5) మార్గంలో బియ్యం, గోధుమపిండి మొదలైన వాటిని ఉత్తమ కుటుంబీకుల్ని యాచించి తీసికోవచ్చును. 6) త్రోవలో ఎచ్చటను ఎవరిని ఏమాత్రం డబ్బు యాచించి తీసికొనరాదు. 7) అనారోగ్య కారణంతో తప్ప ఒక్కగ్రామంలో ఒక్క రోజుకంటే ఉండకూడదు. 8) శ్రీవారి ఆజ్ఞతో తా నీ యాత్ర చేస్తున్నట్లు చెప్పికొనవచ్చును. అందులకు చిహ్నంగా వా రేదీ ఇతని కివ్వలేదు. 9) ప్రయాణం చేసిన మార్గస్థ విశేషాలను, ఆయా వ్యక్తుల్ని గూర్చి సంగ్రహంగా మఠానికి తెలుపుతూ ఉండాలి.

ఇన్ని నియమాలను పాటించుతూ ఆ యువకుడు ఎంతో ఉల్లాసంతో కాశీయాత్రను పూర్తిచేసికొన్నాడు. ఒకపుడు మార్గమధ్యంలో సూర్యాస్తమయం కాగా రోడ్డు చదునుచేసే రాతిబండలో దాగి శివనామం చేస్తూ రాత్రి గడుపుతూ ఉండగా రెండు పులులు అర్థరాత్రివేళ గోండ్రించుతూ ఆ దారినే వెళ్లాయి. అతడి నవి పసికట్టలేదు. ఈ విషయాన్ని ఒక లేఖలో అతడు మఠానికి తెలియజేసికొన్నాడు. సద్గురు కటాక్షంతో కాశీయాత్రను పూర్తిచేసికొని కుంభకోణం చేరుకొన్నాడు. మఠం కార్యనిర్వాహకులుగా నియమించబడ్డారు. ఇలాంటి కృతయుగ ధర్మపాలకులైన శిష్యులుకూడ శ్రీచరణాశ్రయులలో ఉన్నారు.

శ్రీవారి మాతృమూర్తి : 1932 లో శ్రీవారు చిత్తూరుజిల్లా నగరిలో విజయంచేసి ఒకనాడు విద్వద్గోష్ఠిలో ఉన్నారు. మఠం ఉద్యోగి ఒకరు దూరంగా నిలిచి ఉన్నారు. అది చూచి శ్రీవారు కుంభకోణం నుండి 'టెలిగ్రాం' వచ్చిందా? అన్నారు. 'ఔను' అన్నారా ఉద్యోగి. శ్రీవారు పూర్తిగా మౌనముద్రాధారులైనారు. సభ అంతా నిశ్శబ్దంగా ఉన్నది. వెంటనే శ్రీవారు 'మాతృ నిర్యాణం విన్న సన్న్యాసి ఏం చెయ్యాలి?' అని అచటి పండితులను ప్రశ్నించారు. వారందరు నిరుత్తరులుగా కూర్చున్నారు. వెంటనే శ్రీవారు లేని అచటికి రెండుమైళ్ళదూరంలో ఉన్న జలపాతానికి వెళ్ళి అచట స్నానం చేశారు. ఎల్లరు ఈశ్వర నామోచ్చారణంతో శ్రీవారి ననుగమించారు. శ్రీవారు ధనాదికాన్ని దానం చేశారు. జగద్గురువులను కన్నతల్లి ఆ జగన్మాత ధన్యురాలు.

అమృతలహరి : ఈ పేరుగల పత్రికలో శ్రీవారి శైవవైష్ణవాభేదమైన సనాతన వైదిక ధర్మోద్ధరణ కార్యక్రమం విశేషాలను బహుథా ప్రస్తుతిస్తూ సుప్రసిద్ధ విశిష్ఠాద్వైత పండితులు శ్రీమాన్‌ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య ప్రభృతులు వ్రాసిన వ్యాసాలు ప్రచురింపబడినవి.

స్తుతికావ్యాలు : శ్రీవారిని జగద్గురువులుగా, పరమశివస్వరూపులుగాను భావించి అనేకమంది మహాపండితులు శ్రీవారిని ప్రస్తుతించుతూ 'స్తుతికావ్యాల'ను వ్రాశారు. సుప్రసిద్ధ మహాపండితులు (తూర్పుగోదావరి జిల్లా - ముంగొండ అగ్రహారం) బ్రహ్మశ్రీ పుల్య ఉమామహేశ్వరశాస్త్రి మహోదయులు 'శ్రీ చంద్రశేఖర విజయ మహారత్నహారం' అనే పేరుతో శ్రీవారిని స్తుతించుతూ సంస్కృత కావ్యాన్ని వ్రాశారు. ఈ కావ్యసౌందర్యాన్ని సుప్రసిద్ధ కాశ్మీర పండితులు 'విద్యావారిధి' శివనాథ శాస్త్రి ప్రభృతులు బహుథా ప్రశంసించారు. ఇది నాగరిలిపిలో ప్రచురింపబడినది.

విద్వాన్‌ బ్రహ్మశ్రీ కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారు (పండితులు- ఓరియంటల్‌ కాలేజి-భీమవరం-ప.గో. జిల్లా) 'గురుకృపాలహరి' అనే పేరుతో 300 శ్లోకాలుగల సంస్కృత కావ్యాన్ని శ్రీవారిని స్తుతిస్తూ వ్రాశారు. దీనికి 'విహారం' అనే సంస్కృత వ్యాఖ్యనే కాక తెలుగు తాత్పర్యాన్ని కూడ గ్రంథకర్తయే వ్రాశారు. ఇది తెలుగు లిపిలో ప్రచురింపబడినది.

'ఆర్షవిద్యా భూషణ' బ్రహ్మశ్రీ జటావల్లభుల పురుషోత్తం, ఎం.ఏ (రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌-ఓరియంటల్‌ కాలేజి-కొవ్వూరు - పశ్చిమగోదావరి జిల్లా) గారు 'జగద్గురు ప్రశస్తి' అనే పేరుగల సంస్కృత కావ్యాన్ని శ్రీవారిని ప్రశంసించుతూ వ్రాశారు. ఇదికూడ తెలుగు తాత్పర్యంతో ప్రచురింపబడినది.

జగద్గురు బోధలు : శ్రీవారు వివిధాంశాలపై చేసిన ధర్మోపన్యాసాలను 'జగద్గురు బోధలు' అనే పేరుతో (ఆంధ్రప్రభలో వారం వారం ప్రచురింపబడినవి.) ఇప్పటికి ఐదారు సంపుటాలుగా తెనాలిలోని సాధనగ్రంథమండలివారు ప్రచురించారు.

దేశ##క్షేమం : రెండవ ప్రపంచ సంగ్రామ సమయంలోను, ఇటీవల మనకు పొరుగుదేశాలవల్ల ఏర్పడిన యుద్ధ ప్రమాద సమాయాల్లోను శ్రీవారు దేశ##క్షేమానికై విశేష దైవధ్యాన కార్యక్రమాలను నిర్వహింపజేశారు.



పీఠాధిరోహణ షష్ఠిపూర్తి వజ్రోత్సవ విశేషములు

శ్రీవారు కామకోటి సర్వజ్ఞ పీఠాధిరోహణం చేసి 1967 ఫిబ్రవరికి అరవై సంవత్సరాలు నిండినవి. అప్పటినుండి 1968 ఫిబ్రవరి వరకు యావద్భారతంలో ఈ ఉత్సవాలు వారి శిష్యకోటి విశేషవైభంతో నిర్వహించుకొన్నది. కొన్ని పత్రికలు విశేష వ్యాసావళిని, సంచికలను ప్రచురించినవి.

ఆంధ్రప్రాంతంలోని భక్తులు శ్రీవారికి ఈ ఉత్సవ సందర్భంగానే వజ్రఖచిత సువర్ణ కిరీటాన్ని సమర్పించుకోవటం జరిగింది. ఈ సందర్భంలోనే ఆంధ్రప్రాంతీయులు ఒక్కొక్క రూపాయి చొప్పున 'ఫండు'ను వసూలు చేసి అరవై వేల 'నిధి'ని శ్రీచరణ సన్నిధిని సమర్పించుకొన్నారు.

శ్రీవారు కురుక్షేత్రం దగ్గర జ్యోతిసర్‌ అనే ప్రదేశంలో ఆదిశంకరులు తమ శిష్యచతుష్ఠయమునకు గీతాభాష్యోపదేశం చేస్తున్న రూపంలో పాలరాతి విగ్రహాలను, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని రథసారథియై అతనికి గీతోపదేశాన్ని చేస్తున్న రూపంలో పాలరాతి విగ్రహాలను ప్రతిష్టింప జేయటానికి అచట ఆలయాది నిర్మాణానికి ఈ 60 వేల రూప్యముల నిధిని వెంటనే వినియోగింపజేశారు.

*1907 ఫిబ్రవరి 13 వ తేదీన ఉత్తర ఆర్కాటు జిల్లాలోని కలవాయి అనే గ్రామంలో కామకోటి పీఠాధిరోహణం చేశారు.

పుదుక్కోట సంస్థానం సరిహద్దులో ఉన్న 'మంజువాడై' పట్టణంలో సమస్త రాజలాంఛనాలతో శ్రీవారికి స్వాగతం

___________________________________________

* మదరాసు యూనివర్సిటీలోని, సెంటర్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ, ఇన్‌ ఫిలాసఫీ - డైరెక్టరుగారైన శ్రీ టి.యమ్‌.పి మహదేవన్‌, ఎం.ఏ; పి.హెచ్‌.డి. గారు రచించిన 'ది సేజ్‌ ఆప్‌ కంచి' అనే ఆంగ్ల గ్రంథం లోని విషయం ఆధారంగా కొన్ని ముఖ్యాంశా లిచట పేర్కొనబడుచున్నవి.

ఇవ్వబడినది. అందు శ్రీ రఘునాథ తొండైమాన్‌, రీజంట్‌ - కౌన్సిలర్‌ - దివాన్‌ వెంకట రామదాసునాయుడు, తదితర అధికారులేకాక, గణితశాస్త్ర ప్రతిభా సంపన్నులు శ్రీ రాధాకృష్ణ ప్రభృతు లిందు పాల్గొన్నారు.

1908 : శ్రీవారు తమ పరమేష్ఠి గురుసమాధి గల ఇలయాత్తంగుడి గ్రామానికి వెళ్ళి పరమేష్ఠి గురుజయంతినాడు పరమేష్ఠి గురుపూజలను శ్రీవారు నిర్వర్తించారు.

1908 : శ్రీవారు 'తిరువానైక్కా' లోని అఖిలాండేశ్వరి దేవళమునకు కుంభాభిషేకాన్ని నిర్వర్తించటానికి బయలుదేరారు. మార్గంలో తిరువయ్యూరు క్షేత్రంలో శ్రీ ముత్తు గణపతి పండితులు తమ 50 మంది పైగా శిష్యులతో కలిసి శ్రీవారికి స్వాగత సత్కారాల నందజేశారు. ఈ పండితులు అప్పటికే 80 సంవత్సరాల వృద్ధులు. వీరు అసంఖ్యాకమైన శిష్యకోటికి అన్న వస్త్రములనిచ్చి విద్యాదానం చేసిన మహనీయులు.

1908 : 'తిరువానైక్కా' లో అఖిలాండేశ్వరీ దేవ్యాలయానికి కుంభాభిషేకం చేశారు. అమ్మవారికి తాటంకాల నలంకరించారు.

1909 : తంజావూరులోని సరస్వతీమహల్‌లోను తంజావూరు రాజభవనంలోను శ్రీవారికి రాజలాంఛనాలతో స్వాగత సత్కారాలు. ఇందు మహావిద్వాంసులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో రాణి రామాంబాబాయి సాహెబా, జిజాంబాబాయి సాహెబా పాల్గొన్నారు. రాజస్థానభద్ర గజంపై బంగారు అంబారీలో శ్రీవారిని ఆసీనుల గావించి ప్రధాన రాజవీధులలో ఊరేగింపుటుత్సవం జరుపబడింది.

1909 : తంజావూరు యువరాజు ప్రతాపసింహ, మహారాజ శివాజీలు శ్రీవారిని భద్రగజాసీనుల గావించి కుంభకోణం పట్టణానికి తీసికొని వెళ్ళారు. శ్రీవారు అచటి మహామాఖం సరస్సులో పవిత్రస్నానం చేశారు.

1911 : తిరుచి జిల్లాలోని లాల్గుడి గ్రామంలో శ్రీవారు ఆదిశంకర భగవత్పాదుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ ఉత్సవానికి మైసూరు రాష్ట్రంలోని 'పండితరత్న' సుందరరామశాస్త్రి, 'మహామహోపాధ్యాయ' హరిహరశాస్త్రి, చిదంబరం, 'మహా మహోపాధ్యాయ, మీమాంసాచార్య' వెంకటసుబ్బశాస్త్రి, మైలాపూరు మున్నగు మహావిద్వాంసులు విచ్చేశారు.

1911-13 ; తిరుచిజిల్లాలోని అఖండ కావేరీతీరాన మహేంద్ర మంగళంలో శాస్త్రవిచార చర్చలు శ్రీవారు జరిపారు.

1916 : కుంభకోణంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో మఠంలో లక్షదీపారాధనం జరిగింది. శ్రీదుర్గా, లక్ష్మీ, సరస్వతులకు ప్రత్యేక పీఠముల నేర్పరచి ప్రత్యేకంగా లక్షార్చనలు జరిగాయి. ఆ అర్చనలు జరిపినవారిలో తిరునల్వేలి జిల్లాలోని కురుంగలం కృష్ణశాస్త్రి ప్రభృతు లున్నారు.

మహావిద్వాంసులతో గొప్ప అద్వైత సదస్సు జరుపబడినది. అందులో 'మహామహోపాధ్యాయ' శ్రీ యజ్ఞస్వామిశాస్త్రి (మన్నారు గుడి రాజశాస్త్రిగారి పౌత్రులు) 'మహామహోపాధ్యాయ' దండపాణి దీక్షితర్‌, చిదంబరం ప్రభృతులు పాల్గొన్నారు.

సంగీత విద్వత్సదస్సుకూడ జరిగింది. అందులో రామనాథపురం పూచి అయ్యంగార్‌, కుంభకోణం పంచాపగేశశాస్త్రి, వల్లడం సంజీవరావు, మదురై పుష్పవనం ప్రభృతి సంగీత విద్వాంసుల ఆనాడు పాల్గొన్నారు.

లక్షలాది ప్రజాసందోహంతో శ్రీవారి గజారోహణోత్సవం జరిగింది. తిరుప్పనదాల్‌ కాశీ మఠాధిపతులు శ్రీవారికి స్వయంగా ఐదువేల రూప్యముల నానాడు సమర్పించారు.

1921 : వేదారణ్యంలో మహోదయస్నానం చేశారు. శ్రీ గోవింద దీక్షితులవారి భవనంలో మకాంచేసి, మహామాఖ సరస్సులో పవిత్ర స్నానార్థం కుంభకోణానికి ప్రయాణం.

1922 : ధనుష్కోటిలో శరన్నవరాత్రి పూజలు నిర్వర్తించారు. వెంటనే పూర్ణిమనాడు ధనుష్కోటిలో పవిత్ర సైకతాన్ని గ్రహించి రామేశ్వరానికి విజయం చేశారు. సేతుమాధవుని సన్నిధిలో పూజాదికాన్ని నిర్వర్తించి సైకతాన్ని సంప్రదాయ సిద్ధమైన క్రమంలో భద్రపఱచారు.

1923 : 'తిరువనైక్కా' లో కుంభాభిషేకం. జీర్ణోద్ధారం చేసిన రత్న తాటంకాలను అఖిలాండేశ్వరీదేవికి అలంకరించారు. ఈ జీర్ణోద్ధారానికి, శ్రీ సదాశివ తావక్కార్‌, తావక్కార్‌ అండ్‌ సన్సు వారు విలువైన రత్నాలను సమర్పించు కొన్నారు. శ్రీ తెప్పెరు మానల్లూర్‌, శ్రీ అన్నదాన శివన్‌ అనువారు వేలాదిమందికి అన్నే దానం చేశారు.

1924 : కావేరీనదికి విశేషమైన వరదలు వచ్చినాయి. కోలేరున్‌నది కావేరి ఏకమయ్యే ప్రమాదం ఏర్పడింది. అపుడు శ్రీవారు కావేరీ తీరాన తిరువయ్యూరులోని పుష్యమండపమునందు చాతుర్మాస్యప్రతాన్ని అనుష్ఠిస్తున్నారు. స్థానికులైన ప్రజల సహకారంతోను శ్రీవారి ఆశీర్బలంతోను ఆ ప్రదేశంఅంతా వరదలనుండి రక్షింపబడినది.

1927 : దక్షిణ ఆర్కాటు జిల్లాలో దక్షిణ పెన్నారు తీరాన వడవాంబలం గ్రామంలో శ్రీవారు తమ పూర్వాచార్యుల అధిష్టాన నిర్మాణం చేయించారు.

1927 : అక్టోబరు 15 : పాలఘాటులోని నల్లిచేరి గ్రామంలో మహాత్మాగాంధీ శ్రీవారిని దర్శించుకొన్నారు.

1928 : గురువాయూరులోని శ్రీ గురువాయూరప్పన్‌ అనే దేవుని శ్రీవారు దర్శించుకొన్నారు. కాలికట్‌ జామొరిన్‌ ద్వారా శ్రీ గురువాయూరు దేవస్థానంవారు శ్రీవారికి భిక్షావందనం ఆచరించారు.

1931 : జననం 25 : శ్రీవారు కంచిలోని శ్రీ కామాక్షీదేవిని దర్శించు కొన్నారు. కామాక్షి దేవ్యాలయ పునరుద్ధరణకు సంకల్పించారు.

19323 : మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీవారు దర్శించుకొని స్వామికి సహస్రకలశాభిషేకం చేశారు. తిరుపతి దేవస్థానంవారు అచటిమహంతుద్వారా శ్రీవారికి భిక్షావందనం చేశారు. 16 గజాల (32 క్యూబిట్స్‌) పొడవుగల శేషవస్త్రం, ఛత్రం మొదలైన ఆలయ మర్యాదలతో శ్రీవారికి స్వాగత సత్కారాలు చేశారు.

1932 : చిత్తూరు జిల్లాలోని బుగ్గగ్రామంలో చాతుర్మాస్య వ్రతం-అచటి దేవాలయ పునరుద్ధరణం కుంభాభిషేకం చేశారు. ఆదిశంకర భగవత్పాదుల విగ్రహాన్ని ప్రతిష్టించారు.

1932 : మదరాసులోని సంస్కృత కళాశాలలో నవరాత్రి మహోత్సవాలను జరిపారు. అచట 'భాష్యవిజయ మంటపా'న్ని నిర్మింపజేశారు. విజయదశమినాడు శ్రీవారు ఆ మండపంలో భాష్యప్రవచనం చేశారు. శ్రీ రాజేంద్రప్రసాద్‌ శ్రీవారిని దర్శించుకొన్నారు.

1933 : ''మధ్యార్జునం'' అదే ప్రసిద్ధిగల తిరువిడైమరుదూర్‌లో విజయం చేసి ఉన్నారు. కుంభకోణంలోని మహాఘాఖ సరస్సులో స్నానం చేశారు.

1933 : తంజావూరులోని ముకాసా భవనంలో చాతుర్మాస్యవ్రతం. విశ్వరూపయాత్రా పర్వంరోజున ఏనుగు అంబారీమీద పెద్ద ఊరేగింపు జరిగింది. ఆ నవరాత్రి మహోత్సవంకూడ తంజావూరులోనే జరిపారు. ''శ్రీరామజయం'' ''శివనామం'' ''మురుగనామం'' మొదలైనవాని వ్రాతకు అంకురార్పణం చేశారు. శ్రీవారు కాశీయాత్రకై ఉత్తరప్రాంత ప్రయాణం ఆరంభించారు. శ్రీశైలంలో స్వామిని దర్శించుకొన్నారు.

1934 : శ్రీవారు ప్రయాగకు విచ్చేశారు. శ్రీవారు రామేశ్వరంనుండి తెచ్చిన సైకతానికి (ఇసుక) ప్రయాగమాధవ సన్నిధిలో పూజలు నెరపారు. సరస్వతీనది అంతర్వాహినిగాగల గంగా, యమునా నదుల సంగమ స్థానంలోని పవిత్రజలాలలో ఆ సైకతాన్ని సమర్పించారు. రామేశ్వరంలోని రామనాథస్వామికి, దక్షిణానగల ఇతర ఆలయాల్లోని దేవతలకు అభిషేకంకోసం అచటి పవిత్ర జలాలను కుంభముల్లోకి తీసుకొని భద్రపరచుకొన్నారు.

1934 : ప్రయాగనుండి దీక్షతో పాదచారులై కాశీకి విజయంచేసి నవరాత్రి మహోత్సవాలను నిర్వర్తించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో పండిత మదనమోహన మాలవ్యా శ్రీవారికి స్వాగత పత్రాన్ని సమర్పించారు. అనేకమంది 'మహామహోపాధ్యాయులైన మహావిద్వాంసులు శ్రీవారికి ''ప్రణతి పత్రాన్ని'' సమర్పించారు.

1935 : కాశీలోని టౌన్‌హాలులో జరిగిన మహాసభకు శ్రీవారు విచ్చేశారు. అందులో అనేకమంది యతీశ్వరులు, మహామహోపాధ్యాయులైన పండితులు పాల్గొన్నారు. రాజస్థాన్‌ ప్రాంతంలోని జైపూరు వాసియైన మహామహోపాధ్యాయ గిరిధరశర్మ 'ప్రణతిపత్రాన్ని' శ్రీవారికి సమర్పించారు.

శిష్యచతుష్టయ సహితమైన ఆదిశంకరుల నిలువెత్తు తైల వర్ణ చిత్రపటాన్ని కాశీలోని మహావిద్వాంసులందరు స్వయంగానే కాశీనగర వీధులలో ఊరేగించుతూ తీసికొని వెళ్ళి కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రతిష్ఠించారు. ఆ ఉత్సవంలో శ్రీవారు పాదచారులై పాల్గొని ఆ ఉత్సవానికి విశేషశోభను సంతరించారు.

పాలరాతితో నిర్మించిన ఆదిశంకరుల విగ్రహాన్ని కాశీ విశ్వేశ్వరాలయ ప్రాకారకుడ్యంలో ప్రతిష్టించారు.

1935 : ఫిబ్రవరి 16 : కాశీలోని సాంగవేద విద్యాలయంలో సమావిష్ణులైన వేదవిద్వాంసుల సదస్సులో శ్రీ కాశీమహారాజు శ్రీవారికి 'రాజపత్రాన్ని' సమర్పించుకొన్నారు.

1935 : గయలోని ముండప్రిష్టశిలకు దండస్పర్శ గావించారు.

1935 : కలకత్తాలోని ఆదిగంగాతీరంలో చాతుర్మాస్యాన్ని, నవరాత్రి ఉత్సవాలను నిర్వర్తించారు. బెంగాల్‌ బ్రాహ్మణ మహాసభ, కాశీఘాట్‌ నిర్వాహ సభలవారు శ్రీవారికి స్వాగతపత్రాన్ని సమర్పించారు. కలకత్తాలోని మహామహోపాధ్యాయులైన విద్వాంసులు వ్యవస్థాపత్రాన్ని సమర్పించారు.

1936 : మే 5, పూరీ క్షేత్రానికి విజయం చేశారు. అచట పూరీ శంకరాచార్యస్వామివారి శ్రీమఠంలో శ్రీవారు విడిదిచేశారు. అచట సముద్రంలో పుణ్యస్నానంచేసి జగన్నాథస్వామిని దర్శించుకొన్నారు. పూరీ మహారాజా ప్రార్థన నంగీకరించి శ్రీవారు ఆలయంలోని ఉత్తమ పీఠాధిష్ఠితులైనారు. దేవస్థానంవారి విద్యాలయ సభవారు సమర్పించిన స్వాగతపత్రాన్ని స్వీకరించారు.

తూర్పుగోదావరిజిల్లా (ఆంధ్ర)లోని ముక్కామల గ్రామంలో శంకర జయంతి-బ్రహ్మసప్తాహ మహోత్సవాలను నిర్వర్తించారు.

1939 : ప్రయాగలో స్వీకరించిన పవిత్రగంగాతో యమునలతో రామేశ్వరంలోని రామనాథస్వామిని అభిషేకించారు.

1939 : జూన్‌ 30 : శ్రీవారి పూర్ణయా యాత్రను పూర్తిచేసికొని కుంభకోణంలోనే శ్రీమఠానికి విజయం చేశారు. వ్యాసపూజ, నవరాత్రి పూజ, శతచండీహోమం మఠంలో నిర్వహింపబడినవి.

1941 : జూన్‌ 4 : తంజావూరులోని శ్రీ బంగారు కామాక్షీ దేవ్యాలయానికి కుంభాభిషేకం చేశారు.

1942 : మన్నారుగుడి సమీపంలోని పూవనూరు గ్రామంలో 'అతిరుద్ర' హోమం జరిపించారు. నట్టం గ్రామంలో వ్యాసపూజ, అతిరుద్ర హోమం శతచండీహోమం జరిగాయి.

తిరువనైక్కాలో వ్యాసపూజ, నవరాత్రి ఉత్సవాలు జరిపారు. పంచముఖేశ్వరాలయానికి కుంభాభిషేకం చేశారు. చుతర్వేదపారాయణం జరిపించారు. ఇందులో అధర్వేణ పారాయణం కోసం కాశీనుండి ప్రత్యేకంగా అధర్వణవేద విద్వాంసుల నాహ్వానింపజేసి రప్పించారు. నాల్వర్‌ తమిళ తిరుమురై పనాఛందంలో చక్కగా పారాయణం చేయబడినది.

1944 : కంచిలోని కామాక్షీ దేవ్యాలయ పునరుద్ధరణ కార్యక్రమం పూర్తఐంది ఆలయ కుంభాభిషేకం శ్రీవారు చేశారు. ఈ కుంభాభిషేకం పవిత్ర స్మృతిచిహ్నంగా కామకోటి కోశస్థానం పక్షాన శ్రీముఖంతో సహా 'మూకపంచశతి' గ్రంథం ప్రచురింప బడినది.

1945 : కుంభకోణంలో జరిగిన 'మహామఖ' పవిత్ర సమయంలో ''వేదశాస్త్ర పరిపాలనాసభ'' ప్రారంభోత్సవం జరిగింది. ఆ సమయంలోనే ''అద్వైతసభ'' స్వర్ణోత్సవం కూడ జరిగింది. ఈ స్వర్ణోత్సవ స్మృతిచిహ్నంగా ''అద్వైతాక్షర మాలిక' (సంస్కృతం) ''పొన్విలామరర్‌'' (తమిళం) ఆంగ్లంలో ''గోల్డెన్‌ జూబిలీ పబ్లికేషన్‌'' అనే మూడు గ్రంథాలు ప్రచురింపబడినవి. అనేక మంది భక్తుల విరాళాలతో గురు-పరమగురు అధిష్ఠానముల గౌరవ స్మృతికై ''కలవై బృందావనం పరమగురు స్వామిగళ్‌ ట్రస్టు'' ఏర్పాటు చేయబడినది.

1947 : శ్రీ కామాక్షీదేవి రజితరథ నిర్మాణం పూర్తిఐంది. రథోత్సవం జరుపబడింది.

1949 : తిరువిడైమరుదూరులో ''అతిరుద్రం'' ''వ్యాసపూజ'' జరుపబడినవి.

1951 : వేదభాష్యం విద్వత్సన్మానాన్ని ఆరంభించారు.

1954 : మార్చి 22 : శ్రీవారు శ్రీమఠాధిపత్యానికై శిష్యస్వీకారం చేశారు.

శ్రీవారి షష్ఠిపూర్తి. అనేకమంది భక్తుల విరాళాలతో ఆ పవిత్ర సమయంలో 'భూదాన ట్రస్టు' ఏర్పరుపబడినది.

1956 : కాంచీపుర సమీపానగల శివాస్థానం అనే ప్రసిద్ధిగల ప్రదేశంలో 'అద్వైతసభ' వజ్రోత్సవం (స్థాపించిన 60 సంవత్సరాలకు చిహ్నంగా) జరుపబడినది. ఇచ్చట పేర్కొనదగిన విశేషమేమంటే ఇచట ఆలయంలో శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సోమాస్కంద స్వామికి దండవందనాన్ని అర్పించుతున్నారు. ఈ వజ్రోత్సవ సందర్భంలోనే అంతకుముందు ప్రచురింపబడని ఆదిశంకరుల గ్రంథావళి ప్రచురింపబడినవి.

1958 : మదరాసులోని పాతమాంబళంలో శ్రీమత నిర్మాణం. అందులో శ్రీ ఆదిశంకర భగవత్పాదుల 'పాదుకాప్రతిష్ఠ' జరిగింది.

కాళిదాసుని 'అభిజ్ఞాన శాకుంతల' గ్రంథాన్ని తమిళంలోకి అనువదించటానికై నగదును శ్రీవారు బహుకరించారు.

1960 : 'మద్రాసు సంస్కృత ఎడ్యుకేషన్‌ సొసైటీ'కి ప్రారంభోత్సవం చేశారు. ఆ సమయంలోనే 'ఆరణి'కి సమీపంలోని 'అడయాప్పాలెం'లోని ఆలయ కుంభాభిషేకానికై అచటికి విజయం చేశారు.

1960 : లోనే 'అడయపాలెం'లో శ్రీమ దప్పయదీక్షితులవారు నిర్మించిన శివాలయానికి కుంభాభిషేకం చేశారు.

1960 : లోనే 'తిరుమనైక్కా'లోని శ్రీ అఖిలాండేశ్వరీ దేవ్యాలయానికి 'కుంభాభిషేకం' చేశారు.

1961 : జూన్‌ 3 : కొచ్చిన్‌ రాజాస్థాన విద్వాంసులు, అధికారులు న్యాయ, వేదాంతశాస్త్రాల్లో ఉన్నతములైన బ్రహ్మానందీయ-భావప్రకాశ, గ్రంథాలను శ్రీవారికి బహూకరించారు. ఈ గ్రంథాలను కొచ్చిన్‌ మహారాజా శ్రీరామవర్మ పరీక్షిత్‌ తంపురాన్‌ - స్వయంగా పరిష్కర్తలుగా ఉండి ప్రచురింపజేశారు.

1962 : 'ఇలయాత్తంగుడి'లో 'అఖిల - వ్యాస - భారత - ఆగమ - శిల్పసదస్సు'నకు ప్రారంభోత్సవం చేశారు.

1962 : శ్రీ జ్ఞాననంబంధస్వామివారి 'కోలారు పటిగం' ప్రచురణ.

1962 : జూలై 4 : ఇలయాత్తంగుడిలో తిరువాన్కూరు మహారాజావారు శ్రీవారిని దర్శించుకొన్నారు.

1963 : ఏప్రిల్‌ 7 : తంజావూరులోని బంగారుకామాక్షీ దేవ్యాలయ కుంభాభిషేకం.

1963 : ఏప్రిల్‌ 28 : రామేశ్వరంలోని అగ్నితీర్థంవద్ద ప్రత్యేకంగా 'విమానాన్ని' నిర్మింపజేసి అందులో శిష్య చతుష్టయ సహిత శ్రీ ఆదిశంకరుల ప్రతిమలను ప్రతిష్ఠించారు.

1963 : జూన్‌ 23 : మధురై మీనాక్షీ దేవ్యాలయ కుంభాభిషేకం.

1963 : నారాయణవరంలో ఆగమశిల్ప సదస్సు.

1963 : డిసెంబరు 5 : తిరువిడైమరుదూత్‌ (మధ్యార్జునం) లోని శ్రీమఠంలో మహాలింగమూర్తి - శ్రీ ఆదిశంకర భగవత్పాదుల మూర్తుల ప్రతిష్ఠ. ఇది మహాలింగమూర్తి అశరీరవాక్కుతో ఆదిశంకరులకు-వారి అద్వైత సిద్ధాంతాన్ని ఉద్దేశించి 'సత్యం అద్వైతం'అని పలికినట్లు ప్రసిద్ధమైన సంప్రదాయాంశానికి సాక్షాత్కార చిహ్నంగా ఉంటోంది.

1964 : మే 31 : శ్రీవారి ఉపదేశానుసారం కన్యాకుమారిలో సముద్రం-అమ్మవారి ఆలయం, వీనిమధ్యలో శిష్య చతుష్ఠయ సహిత శ్రీ ఆదిశంకరుల భగవత్పాదుల విగ్రహముల ప్రతిష్ఠ జరిగింది. ఇందుకోసం శ్రీమఠంనుండి వేదవిద్వాంసులు ప్రత్యేకం పంపబడ్డారు. ఇందుకై ప్రత్యేకం విమాన మంటపంకూడ నిర్మింపబడినది.

1966 : ఫిబ్రవరి : మదరాసు అడయారులోని శ్రీ శంకర రామఅయ్యర్‌ గారి ఇంటిలో మైసూరు మహారాజా శ్రీజయ చామరాజవడయార్‌ శ్రీవారిని దర్శించుకొన్నారు.

శ్రీవారి ఉపదేశానుసారం శ్రీమఠంలో వేద విద్వాంసులు కురుక్షేత్రంలో శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు భగవద్గీతను ఉపదేశించిన ప్రదేశంలో - నాలుగు గుఱ్ఱాలుగల రథం-దానిపైన కపిరాజపతాకం, ఆ రథంలోపల ఆసీనుడైన అర్జునుడు. ఆ రథచోదకుడుగా ముందు కూర్చున్న శ్రీకృష్ణపరమాత్మగల మనోహరమైన పాలరాతి శిల్పంగల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

అచటనే ఆదిశంకరులు తమ శిష్యచతుష్టయమునకు గీతా భాష్య ప్రవచనం చేస్తున్న విగ్రహాలుకూడ ప్రతిష్ఠింపబడినవి.

1966 : డిసెంబరు 4-5 గ్రీసుదేశపురాణి ఫ్రెడరిక్‌, గ్రీసుదేశపు రాణి మాత-వారి రాకుమారి ఇరనె-శ్రీ డా|| టి.యమ్‌.పి. మహాదేవన్‌తో కలిసి కాళహస్తి (ఆంధ్ర) క్షేత్రానికివెళ్ళి శ్రీవారితో చిరస్మరణీయమైన సంభాషణాన్ని చేసివెళ్ళారు.

1967 మార్చి : అహోబిలక్షేత్రం (ఆంధ్ర)లో శ్రీవారు స్వామిని దర్శించుకొన్నారు. మహానంది మున్నగు ప్రదేశాలకు వెళ్లారు. శ్రీశైల క్షేత్రంలో 'ఆదిశంకర విమాన మంటపం'లో శిష్య చతుష్ఠయసహిత శ్రీఆదిశంకర భగవత్పాదుల విగ్రహాలను, ఆదిశంకరుల పాదుకలను, నర్తన వినాయక విగ్రహాన్ని, ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి కుంభాభిషేకాన్ని చేశారు.

1967 మే : శ్రీవారి ఉపదేశానుసారం 'లక్ష్మణఝాలా' అనే ప్రశస్తి పొందిన ప్రదేశంలో గంగానదిపై గల వంతెనకు సమీపంలో 'విమానమంటపం' నిర్మింపబడినది. ఆదిశంకరులు బదరీక్షేత్ర దర్శనం చేసినపుడు వెళ్ళిన పవిత్రమార్గ మీ ప్రదేశం.

1968 : ప్రస్తుతం ప్రయాగలో పావనత్రివేణీ సంగమంవద్ద శంకర మండప నిర్మాణానికి శ్రీవారు సంకల్పించారు. శ్రీవారి ఉపదేశానుసారం, ఇందులో శిష్యచుతష్టయ సహిత శంకర భగవత్పాదుల విగ్రహములు, ద్వాదశజ్యోతిర్లింగములు, ఆదిశంకరుల పవిత్రపాదుకలు, శ్రీదక్షిణామూర్తీ, శ్రీవ్యాసభగవానుడు, శ్రీజైమిని, శ్రీకుమారిలభట్టు, శ్రీమండనమిశ్రుడు, దత్తాత్రేయమూర్తి మున్నగు ప్రతిమల ప్రతిష్ఠ జరుగుతుంది. నిర్మాణానికి శంఖుస్థాపనం జరిగింది.

1969 జనవరి 10 వ తేదీన పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు పట్టణంలో రుద్రాక్షమణిమయమైన సువర్ణకిరీటం శ్రీవారికి సమర్పింపబడినది.



Jagadguru divyacharithra   Chapters   Last Page