Jagadguru divyacharithra Chapters Last Page
16. కామ కోటి పీఠం
కొన్ని ధర్మపరిపాలనాంశములు'స్వధర్మే నిధనం శ్రేయః'
శ్రీకంచికామకోటిపీఠ యాజమాన్యాన శ్రీవారు అనేక ధర్మ కార్యాలకు సంబంధించిన ప్రణాళికల నేర్పరచి వేదవేదాంగాలను, వేదభాష్యాలను, ప్రయోగ, ధర్మశాస్త్రాలను సంరక్షించుతున్నారు. ఆయా విశేషములు క్లుప్తంగా ఇచట సూచింపబడుతున్నవి.
1. వేదధర్మశాస్త్ర పరిపాలనాసభ (రిజి) : 1942లో స్థాపింపబడినది. అన్ని వేదాలలోను నియమపూర్వకాధ్యేతలను పరీక్షించి తగిన పారితోషికా లిస్తారు. దీని యాజమాన్యాన సుమారు 300 సమ్మేళనాలు నిర్వహింపబడినవి. సుమారుగా వార్షికవ్యయం 29 వేల రూపాయలు.
2. కలవై బృందావనం ట్రస్టు (రిజి) : 1945లో స్థాపింపబడినది. వేదాంగాలు, గృహ్వసూత్రాలు, ధర్మశాస్త్రాలు అధ్యయం చేసేవారికి పరీక్ష లేర్పాటుచేసి తగు పారితోషికాలిచ్చి సమ్మానిస్తారు. వారి జీవితకాలం పారితోషికాలనేర్పాటు చేస్తారు. ఏ విధములైన బిరుదాల నిచ్చి ఇప్పటికి 63 మందిని సమ్మానించారు. దీని వార్షికవ్యయం పదివేల రూపాయలు.
3. లక్షణవేత్తల సమ్మానం : 1951 లో స్థాపింపబడినది. వేదమంత్రశక్తిని పరిరక్షించటంకోసం సలక్షణాధ్యేతలను సమ్మానించుతారు. విద్వాంసులకు బంగారు కంకణములు బహూకరింపబడినవి. 31 మంది ఇప్పటికి సమ్మానింపబడినారు. దీని వార్షిక వ్యయం 15 వేల రూపాయలు.
4. షష్ట్యబ్ధపూర్తి ట్రస్టు (రిజి) : 1954 లో స్థాపింపబడినది. వేదార్థపరిజ్ఞానంకోసం వేద భాషాధ్యయనం చేసేవారికి సుమారు ఏడెనిమిదేండ్లు అధ్యయన సమయంలో ఆర్థిక సహాయం చేస్తారు. విలువగల గ్రంథాలను ఉచితంగా ఇస్తారు. 7 వేల రూపాలయవరకు బహూకరిస్తారు. ఇప్పటికి 27 మంది ఇందులో ఉత్తీర్ణులైనారు. దీని వార్షిక వ్యయం 50 వేల రూపాయలు.
5. వేదరక్షణనిధి ట్రస్టు (రిజి) : 1959 లో స్థాపింపబడినది. విద్యార్థుల నాకర్షించి వేదాధ్యయనాన్ని గురుకుల పద్ధతిలో నిర్వహించటం దీని ఆశయం. అధ్యయనం పూర్తిచేసిన విద్యార్థులకు ఐదునుండి పదివేలరూపాయలవరకును బహూమానంగా ఇస్తారు. ప్రతిసంవత్సరం అధ్యాపకులను కూడ ప్రత్యేకంగా సమ్మానిస్తారు. దీని వార్షిక వ్యయం 50 వేల రూపాయలు.
6. నక్షత్రస్కీము : 1960 లో స్థాపితము. శ్రీవారి ధర్మపరిపాలననిధికి విరాళాల నిచ్చేవారికి, వారివారి జన్మ నక్షత్రం రోజున ప్రతిమాసంలో శ్రీవారు కుంకుమ, భస్మం, మంత్రాక్షతలను ప్రసాదించుతారు.
7. నియమాధ్యయన స్కీము : 1966 లో స్థాపితం. తండ్రి నుండి కుమారుడు గురుకుల పద్ధతిలో వేదాధ్యయనం చేస్తే 10 సంవత్సరాల అధ్యయనం పూర్తియైన తరువాత 10 వేల రూపాయలను ఆ విద్యార్థికి బహూకరించుతారు. ఇందులో 11 మంది విద్యార్థుల కవకాశం కల్పింపబడినది. దీని వ్యయం ఒక లక్ష పదివేల రూపాయలు.
8. వేదశాస్త్ర సదస్సు : 1966 ల స్థాపితం. వేదాంగాల లోను, లక్షణంలోను పరీక్షలు నిర్వహించి ఒక్కొక్కరికి రు. 500 లు, శాలువను బహూకరించుతారు. దీని వార్షికవ్యయం 30 వేల రూపాయలు. శ్రీవారి సూచన ననుసరించి ఈ స్కీమును శ్రీ తిరుపతి దేవస్థానంవారు చేపట్టారు.
9. లోపిస్తున్న వేదశాఖల పునరుద్ధరణ : నాలుగు అఖిల భారత వేదసమ్మేళనములు 1962, 1965, 1966, 1969 లలో నిర్వహింపబడినవి. ఆశయం : వివిధ స్థలాలలో వేదపాఠశాలలను నిర్వహించటం. గుజరాత్లో అధర్వ వేదపాఠశాల, మైత్రాణీయ వేదశాఖను నాసికలోను, శ్రీరంగంలో జైమినీయ సామశాఖ, కలకత్తాలో సామవేద పాఠశాలలను నిర్వహించటం. కలకత్తా వేదభవనంలో శ్రీవారి పీఠాధిరోహణ షష్ఠిపూర్తి వజ్రోత్సవ సందర్భంలో సామవేద పాఠశాల ప్రారంభింపబడినది. ఈ సందర్భంగా అచట స్థానిక దినపత్రిక 'అమృతబజార్' అనేక వివరాలతో ప్రత్యేక సంచికను ప్రచురించింది.
10. సామాన్య వేదపాఠాలు : ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లేవారికి ప్రత్యేకంగా వేదాధ్యయనావకాశాలు కల్పించుతారు. చిన్న పిల్లలకు స్తోత్రపఠనం నేర్పే పాఠశాలలు ఏర్పరుపబడుతవి. కంచి, జంబుకేశ్వరం, విల్లుపురం, కుంభకోణం మొదలైన ప్రదేశాలలో వేదాలు చెప్పే పాఠశాలలు నిర్వహింపబడుతున్నవి. వీటి వార్షిక వ్యయం 75 వేల రూపాయలు.
11. అద్వైత వేదాంత ప్రచారం : అద్వైత వేదాంత సభ. ఇది శ్రీవారి పరమగురువులచే 1896 లో స్థాపింపబడినది. వార్షిక సభలను నిర్వహిస్తారు. పరీక్షలు నిర్వహించి పండితులను సమ్మానించుతారు. ప్రస్థానత్రయ శాంకరభాష్య ప్రచారం దీని ఆశయం. ఈ సభాపక్షాన పండితులకు బంగారు కంకణాలను బహూకరిస్తారు. అద్వైత గ్రంథకోశాన్ని ఏర్పాటుచేసి శాంకర గ్రంథాలను ప్రచురించటం ఆశయం. దీని వార్షిక వ్యయం 10 వేల రూపాయలు. దీని స్వర్ణోత్సవాలలో నూటయెనిమిది స్వర్ణాంగుళీయకములను పండితులకు శ్రీవారు బహూకరించారు.
12. ముద్రాధికారి సంఘం : 1938 లో స్థాపితం. దేవాలయాలను శుభ్రం చెయ్యడం, కూపతటాకాదులను త్రవ్వించటం, చక్కటి వృక్షాలను పెంచటం, గోసంరక్షణ మొదలైన దీని ఆశయాలు.
ఇంకా (1) జైళ్లలోని అపరాధులను, ఆసుపత్రులలోని వ్యాధిపీడితులకు భగవత్ప్రసాదాన్ని ఇచ్చి భక్తి ప్రబోధం చెయ్యటం (2) కన్నికడన ట్రస్టు (3) తిరుప్పావై-తిరువెంబావై సమ్మేళనాలు (4) ఆగమ శిల్ప శాస్త్రప్రాచీన కళలను ఉద్ధరించటానికై సదస్సుల నిర్వహణం (5) ధర్మపీఠ సముదాయ సంఘం (6) విశ్వవిద్యాలయాల్లోను కళాశాలల్లోను విద్య పూర్తిచేసే వెళ్ళే విద్యార్థులకు భగవద్గీత మున్నగు పవిత్ర గ్రంథాలను బహూకరించటం (దేశ విదేశాల్లో) (7) అనాథ ప్రేత సంస్కారాన్ని పవిత్రకార్యంగా భావించిచేసే సంఘాల నేర్పాటు చేయటం (8) వివిధపుణ్య స్థలాలలో శంకరమంటప నిర్మాణం చేయించి శంకర ప్రతిమల ప్రతిష్టా కార్యక్రమం (9) తండుల ముష్ఠిస్కీము (10) భజన సంఘాలు (11) సామాన్య జనసమూహంలో దైవభక్తి ప్రబోధం (12) ధర్మతొండు సభ మొదలైనవి గలవు.
కామకోటిపీఠ మఠంలో సంస్కృతాది భాషలలో ఐదువేల అచ్చు గ్రంథాలు రెండువేల తాటియాకు గ్రంథాలు గల గ్రంథాలయం ఉన్నది. ప్రచురింపబడని గ్రంథాలపరిశోధనకై పండితులు నియమింపబడినారు.
శ్రీవారి ధర్మపరిపాలన కార్యక్రమ వివరములను పూర్తిగా తెలియగోరువారు మానేజరు, జగద్గురు శ్రీ శంకరాచార్య కామకోటిమఠం, కాంచీపురం (Big) P.O;R,S తమిళనాడు. రాష్ట్రానికి వ్రాసి తెప్పించుకొనవచ్చును.
శ్రీవారి ధర్మపరిపాలనా కార్యక్రమాలలో ఆస్తికులెల్లరు యథాశక్తిగా పాల్గొని ధర్మోద్ధరణ చేసికొనుట ఆత్మోద్ధరణంకంటె అతిముఖ్యం.
''ధర్మో రక్షతి రక్షితః''